కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

యెహోవాసాక్షుల ప్రచురణల్లో అపొస్తలుడైన పౌలుకు బట్టతల ఉన్నట్టు ఎందుకు చూపిస్తారు?

నిజం చెప్పాలంటే, పౌలు ఖచ్చితంగా ఎలా ఉండేవాడో నేడు ఎవ్వరూ చెప్పలేరు. మన ప్రచురణల్లో ఉండే చిత్రాలు, పెయింటింగ్‌లు ఊహాజనితమైనవి, అంతేగానీ పురావస్తు శాఖ నిర్ధారించినవాటి మీద ఆధారపడినవి కావు.

కానీ పౌలు రూపం గురించిన కొన్ని వివరాలు ఉన్నాయి. ఉదాహరణకు 1902, మార్చి 1 జాయన్స్‌ వాచ్‌ టవర్‌ పత్రిక అలాంటి ఒక విషయాన్ని ప్రస్తావించింది. అక్కడిలా ఉంది, “పౌలు రూపం విషయానికొస్తే: . . . దాదాపు క్రీ.శ. 150⁠లో రాసిన ‘యాక్ట్స్‌ ఆఫ్‌ పౌల్‌ అండ్‌ తెక్లా,’ అనే పుస్తకంలో పౌలు రూపం గురించి కాస్త ఖచ్చితమైన, వాస్తవమైన వివరాలు ఉన్నాయి. ‘ఆయన పొట్టిగా, బట్టతలతో, దొడ్డికాళ్లతో, మంచి శరీర దారుఢ్యంతో ఉండేవాడని, ఆయన కనుబొమ్మలు కలిసిపోయి ఉండేవని, ఆయనకు పొడవాటి ముక్కు ఉండేదని’ అందులో వర్ణించారు.”

ఆ ప్రాచీన పుస్తకం గురించి ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ ఆఫ్‌ ద క్రిస్టియన్‌ చర్చ్‌ (1997వ సంపుటి) ఇలా చెప్పింది: “‘యాక్ట్స్‌ ఆఫ్‌ పౌల్‌ అండ్‌ తెక్లా’ పుస్తకంలో దొరికిన సమాచారం చాలావరకు చారిత్రాత్మకంగా ఖచ్చితంగా ఉంది.” ది యాక్ట్స్‌ ఆఫ్‌ పౌల్‌ అండ్‌ తెక్లా పుస్తకంలోని విషయాలు ఖచ్చితమైనవని తొలి శతాబ్దాల్లో నమ్మేవాళ్లు. అందుకే, ఆ పుస్తకపు 80 గ్రీకు రాతప్రతులు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి, పైగా దాన్ని వేరే భాషల్లోకి కూడా అనువదించారు. కాబట్టి, పౌలు రూపం గురించి మన ప్రచురణల్లో వచ్చే చిత్రాలు అలాంటి ప్రాచీన రాతప్రతులకు అనుగుణంగా ఉన్నాయి.

అయితే, పౌలు రూపం కన్నా ముఖ్యమైన విషయాలు వేరే ఉన్నాయని గుర్తుంచుకోండి. పౌలు పరిచర్య చేస్తున్నప్పుడు, కొంతమంది ఆయన రూపం గురించి ప్రస్తావిస్తూ, “అతను మన ముందు ఉన్నప్పుడు మామూలుగా కనిపిస్తాడు, అతని మాటల్లో వినడానికి ఏమీ ఉండదు” అని విమర్శించారు. (2 కొరిం. 10:10) కానీ యేసు ఒకసారి పౌలుతో అద్భుతరీతిగా మాట్లాడడం వల్ల ఆయన క్రైస్తవుడు అయ్యాడని మనం మర్చిపోకూడదు. ‘ప్రజలకు [యేసు] పేరు గురించి సాక్ష్యమివ్వడానికి [క్రీస్తు] ఎంచుకున్న వ్యక్తిగా’ పౌలు ఏమేమి చేశాడో కూడా మనం ఆలోచించాలి. (అపొ. 9:3-5, 15; 22:6-8) అంతేకాదు, యెహోవా పౌలు చేత రాయించిన బైబిలు పుస్తకాల ద్వారా మనం ఎంత ప్రయోజనం పొందవచ్చో కూడా ఆలోచించాలి.

క్రైస్తవునిగా మారకముందు తాను సాధించినవాటి గురించి పౌలు గొప్పలు చెప్పుకోలేదు, తన రూపం గురించి వర్ణించుకోలేదు. (అపొ. 26:4, 5; ఫిలి. 3:4-6) బదులుగా ఆయన ఇలా ఒప్పుకున్నాడు, “నేను అపొస్తలులందరిలో తక్కువవాణ్ణి. . . . అపొస్తలుణ్ణని పిలవబడే అర్హత కూడా నాకు లేదు.” (1 కొరిం. 15:9) కొంతకాలానికి పౌలు ఇలా రాశాడు, “పవిత్రులందరిలో అల్పుడైనవాని కన్నా నేను తక్కువవాణ్ణి. అలాంటి నాకు దేవుడు ఈ అపారదయను ప్రసాదించాడు. లెక్కకు అందని క్రీస్తు సంపదల గురించిన మంచివార్తను నేను అన్యులకు ప్రకటించాలని, . . . దేవుడు నాకు ఈ అపారదయను ప్రసాదించాడు.” (ఎఫె. 3:8, 9) పౌలు రూపం ఎలా ఉండేదనే దానికన్నా ఆయన ప్రకటించిన ఆ సందేశమే చాలా ప్రాముఖ్యం.