కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆతిథ్యం ఇవ్వడంలో సంతోషం ఉంది

ఆతిథ్యం ఇవ్వడంలో సంతోషం ఉంది

“గొణుక్కోకుండా ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకుంటూ ఉండండి.” 1 పేతు. 4:9.

పాటలు: 100, 87

1. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు?

అపొస్తలుడైన పేతురు సుమారు క్రీ.శ. 62 నుండి 64 మధ్యకాలంలో “పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియ ప్రాంతాల్లో చెదిరివున్న తాత్కాలిక నివాసులకు” ఒక ఉత్తరం రాశాడు. (1 పేతు. 1:1) ఆ సహోదరసహోదరీలు వేర్వేరు ప్రాంతాలనుండి వచ్చారు. “అగ్నిలాంటి కష్టాల్ని” లేదా హింసల్ని ఎదుర్కొంటున్న వాళ్లకు ప్రోత్సాహం, నడిపింపు అవసరమైంది. పైగా, వాళ్లు జీవిస్తున్న కాలం చాలా ప్రమాదకరమైనది. అయితే, “అన్నిటి అంతం దగ్గరపడింది” అని పేతురు రాశాడు. ఎందుకంటే ఇంకో పది సంవత్సరాల్లో యెరూషలేము నాశనం కాబోతుంది. మరి ఆ కష్టాలను అప్పటి క్రైస్తవులందరూ ఎలా తట్టుకోగలిగారు?—1 పేతు. 4:4, 7, 12.

2, 3. ఆతిథ్యం ఇచ్చుకుంటూ ఉండమని పేతురు తోటి సహోదరుల్ని ఎందుకు ప్రోత్సహించాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)

2 “ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకుంటూ ఉండండి” అని పేతురు తన తోటి సహోదరులకు సలహా ఇచ్చాడు. (1 పేతు. 4:9) “ఆతిథ్యం” అనే పదానికి గ్రీకులో అక్షరార్థంగా “అపరిచితుల పట్ల దయ లేదా ప్రేమ చూపించడం” అని అర్థం. కానీ “ఒకరికొకరు” ఆతిథ్యం ఇచ్చుకోవాలని పేతురు చెప్పింది అపరిచితులకు కాదుగానీ తోటి సహోదరసహోదరీలకు. అంటే అప్పటికే పరిచయం ఉండి, కలిసి పని చేస్తున్నా ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకుంటూ ఉండాలని ఆయన చెప్పాడు. దానివల్ల ఆ క్రైస్తవులు ఎలాంటి ప్రయోజనం పొందారు?

3 ఆతిథ్యం ఇచ్చుకోవడం ద్వారా వాళ్లు ఒకరికొకరు దగ్గరయ్యారు. మరి మీ విషయమేమిటి? ఎవరైనా మిమ్మల్ని తమ ఇంటికి ఆహ్వానించినప్పుడు అలాగే మీరు వాళ్లను ఆహ్వానించినప్పుడు ఆహ్లాదంగా గడిపిన సమయం గుర్తుందా? అలా చేయడంవల్ల మీరు ఒకరికొకరు దగ్గరయ్యుంటారు. అవును, ఆతిథ్యమివ్వడం ద్వారా మన తోటి సహోదరసహోదరీల గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోగలుగుతాం. పేతురు కాలంలో సమస్యలు రోజురోజుకు ఎక్కువయ్యే కొద్దీ, క్రైస్తవులు ఒకరికొకరు మరింత దగ్గరవ్వాల్సి వచ్చింది. ఈ “చివరి రోజుల్లో” మనం కూడా ఒకరికొకరం మరింత దగ్గరవ్వాలి.—2 తిమో. 3:1.

4. ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

4 “ఒకరికొకరు” ఆతిథ్యం ఇచ్చుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఆతిథ్యమివ్వడానికి మనమెందుకు వెనకడుగు వేయవచ్చు? దాన్నెలా అధిగమించవచ్చు? మనం మంచి అతిథులుగా ఎలా ఉండవచ్చు? వంటి ప్రశ్నలకు ఈ ఆర్టికల్‌లో జవాబులు తెలుసుకుంటాం.

ఆతిథ్యమివ్వడానికి అవకాశాలు

5. మీటింగ్స్‌లో మీరెలా ఆతిథ్యం ఇవ్వవచ్చు?

5 మీటింగ్స్‌: మనం యెహోవా నుండి, ఆయన సంస్థ నుండి మీటింగ్స్‌కు రమ్మనే ఆహ్వానం పొందుతున్నాం. కాబట్టి మనం కూడా మీటింగ్స్‌కు వచ్చే ప్రతీఒక్కరిని, ముఖ్యంగా కొత్తవాళ్లను ప్రేమతో ఆహ్వానించాలి. (రోమా. 15:7) వాళ్లు కూడా యెహోవా అతిథులే కాబట్టి చూడ్డానికి ఎలా ఉన్నా, ఎలాంటి బట్టలు వేసుకున్నా వాళ్లను ఆప్యాయంగా పలకరించాలి. (యాకో. 2:1-4) కొత్తగా వచ్చిన వాళ్లు ఒంటరిగా కూర్చోవడం మీరు గమనిస్తే, వాళ్లను మీ పక్కన కూర్చోమని అడుగుతారా? మీటింగ్స్‌లో ఏమి చెప్తారో అర్థంచేసుకోవడానికి, లేఖనాలు తెరవడానికి మీరు సహాయం చేస్తే వాళ్లు సంతోషిస్తారు. ఆతిథ్యమివ్వడానికి ఇది ఒక చక్కని మార్గం.—రోమా. 12:13.

6. ముఖ్యంగా మనం ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి?

6 అల్పాహారం లేదా భోజనం: బైబిలు కాలాల్లోని ప్రజలు తోటివాళ్లతో స్నేహం పెంచుకోవడానికి, సమాధానపడడానికి వాళ్లను తమ ఇంటికి భోజనానికి పిలిచేవాళ్లు. (ఆది. 18:1-8; న్యాయా. 13:15; లూకా 24:28-30) మనం ముఖ్యంగా ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి? మన సంఘంలోని సహోదరసహోదరీలకు. ఈ లోకం అంతకంతకూ చెడిపోతుండగా మనం తోటి సహోదరసహోదరీల మీద ఆధారపడాలి, వాళ్లకు నమ్మకమైన స్నేహితులుగా ఉండాలి. 2011⁠లో పరిపాలక సభ, అమెరికా బెతెల్‌ కుటుంబంలో కావలికోట అధ్యయనం జరిగే సమయాన్ని సాయంత్రం 6:45 నుండి సాయంత్రం 6:15కు మార్చింది. ఎందుకు? అలా మార్చినప్పుడు చేసిన ప్రకటన ప్రకారం, ఆ అధ్యయనం త్వరగా అయిపోతే బెతెల్‌ కుటుంబసభ్యులు ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకోవడం తేలికౌతుంది. ఇతర బ్రాంచి కార్యాలయాల్లో కూడా అలాంటి మార్పే చేశారు. బెతెల్‌ కుటుంబసభ్యులు ఒకరితో ఒకరు పరిచయం పెంచుకోవడానికి అది ఒక మంచి అవకాశాన్నిచ్చింది.

7, 8. మన సంఘానికి అతిథి ప్రసంగీకులు వచ్చినప్పుడు వాళ్లకెలా ఆతిథ్యమివ్వవచ్చు?

7 కొన్నిసార్లు మన సంఘానికి వేరే సంఘాల సహోదరులు, ప్రాంతీయ పర్యవేక్షకులు, బ్రాంచి ప్రతినిధులు వచ్చి ప్రసంగాలు ఇస్తుంటారు. వాళ్లకు ఆతిథ్యమివ్వడానికి అవి మంచి సందర్భాలు కాదంటారా? (3 యోహాను 5-8 చదవండి.) వాళ్లను అల్పాహారానికి లేదా భోజనానికి రమ్మని మన ఇంటికి ఆహ్వానించవచ్చు.

8 అమెరికాలో ఉంటున్న ఒక సహోదరి ఇలా గుర్తుచేసుకుంటుంది, “చాలా సంవత్సరాలపాటు, ఎంతోమంది ప్రసంగీకులకు, వాళ్ల భార్యలకు ఆతిథ్యమిచ్చే అవకాశం నాకూ నా భర్తకూ దొరికింది.” అలా ఆతిథ్యమిచ్చిన ప్రతీసారి తమ విశ్వాసం బలపడిందని, వాళ్లతో చాలా సరదాగా సమయాన్ని గడిపారని ఆమె చెప్పింది. “ఆతిథ్యమిచ్చినందుకు మేము ఎప్పుడూ బాధపడలేదు” అని ఆమె అంది.

9, 10. (ఎ) ఎవరికి ఎక్కువ రోజులు వసతి ఏర్పాట్లు చేయాల్సి రావచ్చు? (బి) చిన్న ఇల్లు ఉన్నవాళ్లు కూడా ఎలా సహాయం చేయవచ్చు? ఒక ఉదాహరణ చెప్పండి.

9 ఎక్కువరోజులు ఉండే అతిథులు: బైబిలు కాలాల్లో కొంతమంది అతిథులకు వసతి కూడా ఏర్పాటు చేసేవాళ్లు. (యోబు 31:32; ఫిలే. 22) నేడు మనం కూడా అదే చేయవచ్చు. ప్రాంతీయ పర్యవేక్షకులు సంఘాల్ని సందర్శించడానికి వచ్చినప్పుడు వాళ్లకు వసతి అవసరమౌతుంది. అదే విధంగా, వివిధ పాఠశాలలకు హాజరవ్వడానికి వచ్చినవాళ్లకు, నిర్మాణ పనిలో సహాయపడే వాలంటీర్లకు కూడా వసతి అవసరం. కొంతమంది ప్రకృతి విపత్తుల వల్ల తమ ఇల్లు కోల్పోతారు. అలాంటివాళ్లు తమ ఇల్లు బాగుచేసుకునే వరకు ఎక్కడో ఒకచోట తలదాచుకోవాల్సి ఉంటుంది. అయితే పెద్దపెద్ద ఇళ్లు ఉన్నవాళ్లే సహాయం చేయగలరని అనుకోకూడదు. ఎందుకంటే, వాళ్లు ఇంతకుముందు ఎన్నోసార్లు సహాయం చేసుంటారు. మీ ఇల్లు చిన్నదైనా ఎవరికైనా వసతి ఏర్పాటు చేయగలరా?

10 ఉత్తర కొరియాకు చెందిన సహోదరుడు, వివిధ పాఠశాలలకు హాజరవ్వడానికి వచ్చిన కొంతమంది విద్యార్థులకు తన ఇంట్లో వసతి ఏర్పాటు చేశాడు. ఆయన ఇలా గుర్తుచేసుకుంటున్నాడు, “నేను మొదట్లో కాస్త వెనకాడాను, ఎందుకంటే నాకు కొత్తగా పెళ్లయింది, మా ఇల్లు కూడా చిన్నది. కానీ ఆ పాఠశాలకు వచ్చినవాళ్లకు వసతి ఏర్పాటు చేసినప్పుడు నిజంగా సంతోషంగా అనిపించింది. భార్యాభర్తలు కలిసి యెహోవా సేవ చేసినప్పుడు, కలిసి ఆధ్యాత్మిక లక్ష్యాలు చేరుకున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో వాళ్లను చూసి కొత్తగా పెళ్లయిన మేము తెలుసుకోగలిగాం.”

11. కొత్తగా సంఘానికి వచ్చినవాళ్లకు ఆతిథ్యం ఎందుకు అవసరం?

11 సంఘానికి కొత్తగా వచ్చిన సహోదరసహోదరీలు: కొంతమంది సహోదరసహోదరీలు లేదా కుటుంబాలు ఇతర సంఘాల నుండి మీ ప్రాంతానికి వచ్చివుండవచ్చు. బహుశా మీ సంఘానికి సహాయం చేయడానికి వాళ్లు వచ్చివుంటారు. లేదా సంస్థ వాళ్లను మీ సంఘానికి పయినీర్లుగా పంపించి ఉండవచ్చు. అలా మీ సంఘానికి రావడం వాళ్ల జీవితంలో ఓ పెద్ద మార్పే. వాళ్లు కొత్త ప్రాంతానికి, కొత్త సంఘానికి, కొన్నిసార్లు కొత్త భాషకు లేదా సంస్కృతికి అలవాటు పడాల్సి ఉంటుంది. అలాంటివాళ్లను అల్పాహారానికి లేదా భోజనానికి ఆహ్వానించగలరా? లేదా సరదాగా ఎక్కడికైనా మీతోపాటు తీసుకెళ్లగలరా? అలా చేయడంవల్ల వాళ్లు కొత్త స్నేహితుల్ని సంపాదించుకోగలుగుతారు, మారిన పరిస్థితులకు అలవాటు పడగలుగుతారు.

12. ఆతిథ్యమివ్వడానికి చాలా రకాల వంటలు చేయాల్సిన అవసరం లేదనడానికి ఓ అనుభవం చెప్పండి.

12 చాలా రకాల వంటలు చేస్తేనే ఆతిథ్యం ఇచ్చినట్లు కాదు. (లూకా 10:41, 42 చదవండి.) మిషనరీ సేవ ప్రారంభించిన కొత్తలో జరిగిన సంఘటనను గుర్తుచేసుకుంటూ ఒక సహోదరుడు ఇలా చెప్పాడు, “అప్పుడు మేము యౌవనులం, అంత అనుభవం కూడా లేదు, ఇంటిమీద బెంగతో ఉండేవాళ్లం. ఓరోజు సాయంత్రం నా భార్యకు తన ఇంట్లోవాళ్లు బాగా గుర్తొచ్చారు, ఆమెను ఓదార్చడానికి ఎంత ప్రయత్నించినా నావల్ల కాలేదు. అప్పుడు, సుమారు సాయంత్రం 7:30కి ఎవరో మా ఇంటి తలుపు తట్టారు. తలుపు తెరిచి చూసేసరికి ఒక బైబిలు విద్యార్థి మూడు నారింజ పండ్లు పట్టుకుని ఉంది. ఆమె కొత్తగా వచ్చిన మిషనరీలను ఆహ్వానించడానికి వచ్చింది. మేము ఆమెను ఇంట్లోకి ఆహ్వానించి మంచినీళ్లు ఇచ్చాం. తర్వాత టీ అలాగే హాట్‌ చాక్లెట్‌ డ్రింక్‌ ఇచ్చాం. అప్పటికి మాకు స్వాహిలి భాష రాదు, ఆమెకు ఇంగ్లీష్‌ రాదు.” కానీ స్థానిక సహోదరసహోదరీలతో స్నేహం చేయడానికి, తమ నియామకంలో మరింత సంతోషాన్ని పొందడానికి ఆ అనుభవం సహాయం చేసిందని ఆ సహోదరుడు చెప్పాడు.

ఆతిథ్యమివ్వకుండా మిమ్మల్ని ఏదీ ఆపనివ్వకండి

13. ఆతిథ్యమివ్వడం ద్వారా మీరెలాంటి ప్రయోజనం పొందుతారు?

13 ఆతిథ్యమివ్వడానికి మీరెప్పుడైనా వెనకాడారా? వెనకాడివుంటే, సరదాగా సమయం గడిపే అవకాశాన్ని, చిరకాల స్నేహితుల్ని సంపాదించుకునే అవకాశాన్ని మీరు చేజార్చుకున్నట్లే. ఒంటరితనం నుండి బయటపడడానికి ఒక శ్రేష్ఠమైన మార్గం, ఆతిథ్యమివ్వడం. కానీ ఆతిథ్యమివ్వడానికి కొంతమంది ఎందుకు వెనకాడతారు? దానికి కొన్ని కారణాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

14. ఆతిథ్యం ఇచ్చేంత లేదా తీసుకునేంత సమయం, శక్తి లేదని అనుకుంటే మనమేమి చేయవచ్చు?

14 సమయం, శక్తి: యెహోవా సేవకులు ఎన్నో పనులతో, బాధ్యతలతో బిజీగా ఉంటారు. తమకు ఆతిథ్యం ఇచ్చేంత సమయం లేదా శక్తి లేదని కొంతమంది అనుకుంటారు. మీరూ అలానే అనుకుంటున్నారా? అయితే ఆతిథ్యం ఇవ్వడానికి, తీసుకోవడానికి కొంత సమయం వెచ్చించేలా మీ పనుల్ని సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయడం ప్రాముఖ్యం, ఎందుకంటే ఆతిథ్యం ఇవ్వాలని బైబిలు చెప్తుంది. (హెబ్రీ. 13:2) కాబట్టి ఆతిథ్యమివ్వడం సరైన పని. దానికోసం అంతగా ప్రాముఖ్యంకాని పనుల్ని పక్కనబెట్టాల్సి రావచ్చు.

15. ఆతిథ్యం ఇవ్వలేమని కొంతమంది ఎందుకు అనుకుంటారు?

15 మీ భావాలు: మీకు ఆతిథ్యం ఇవ్వాలని ఉన్నా, ఇవ్వలేకపోతున్నారా? బహుశా మీరు బిడియస్థులై ఉండవచ్చు, అతిథులను సరదాగా ఉంచలేమని మీకు అనిపించవచ్చు. లేదా మీ దగ్గర ఆతిథ్యం ఇచ్చేంత డబ్బు లేకపోవచ్చు, వేరే సహోదరసహోదరీలు అతిథులను చూసుకున్నంత బాగా మీరు చూసుకోలేరని అనుకోవచ్చు. కానీ ఆతిథ్యమివ్వడానికి మీ ఇల్లు అందంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇల్లు శుభ్రంగా ఉండి, మీరు స్నేహపూర్వకంగా ఉంటే అతిథులు సంతోషిస్తారు.

16, 17. ఆతిథ్యం ఇవ్వడానికి ఆందోళన పడుతుంటే మీరేమి చేయవచ్చు?

16 ఆతిథ్యం ఇవ్వడానికి ఆందోళన పడుతున్నారా? అయితే మీలా భావించేవాళ్లు చాలామందే ఉన్నారు. బ్రిటన్‌లో సంఘపెద్దగా సేవచేస్తున్న ఒక సహోదరుడు ఇలా ఒప్పుకున్నాడు, “అతిథుల కోసం ఏవైనా ఏర్పాట్లు చేసేటప్పుడు కాస్త కంగారుగా అనిపిస్తుంది. కానీ యెహోవా సేవకు సంబంధించి ఏమి చేసినా, దానివల్ల వచ్చే ప్రయోజనాలు, సంతృప్తి మన ఆందోళన కన్నా అధికంగా ఉంటాయి. నేను అతిథులతోపాటు కూర్చొని కాఫీ తాగుతూ, కబుర్లు చెప్పేవాణ్ణి.” అతిథులపట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపించడం చాలా మంచిది. (ఫిలి. 2:4) చాలామంది తమ జీవితంలో ఎదురైన అనుభవాల గురించి చెప్పడానికి ఇష్టపడతారు. వాళ్లతో కలిసి సమయం గడిపినప్పుడే వాళ్ల అనుభవాలను వినే ఒక మంచి అవకాశం దొరుకుతుంది. మరో సంఘపెద్ద ఇలా రాశాడు, “సంఘంలోని స్నేహితుల్ని ఇంటికి పిలిచి ఆతిథ్యమివ్వడం వల్ల వాళ్లను మరింత బాగా అర్థంచేసుకోగలిగాను, వాళ్ల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోగలిగాను, ముఖ్యంగా వాళ్లు ఎలా సత్యంలోకి వచ్చారో తెలుసుకున్నాను.” మీ అతిథులపట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తే, అందరూ ఆనందంగా ఉంటారు.

17 వివిధ పాఠశాలలకు హాజరయ్యేవాళ్లకు తరచుగా వసతి ఏర్పాట్లు చేసే ఒక పయినీరు సహోదరి ఇలా ఒప్పుకుంటుంది, “మొదట్లో నేను చాలా కంగారుపడ్డాను. ఎందుకంటే నా దగ్గర కనీస అవసరాలకు సరిపోయే వస్తువులే ఉన్నాయి. పైగా అవన్నీ సెకండ్‌ హ్యాండ్‌ సామాన్లు. ఒక పాఠశాల ఉపదేశకుడి భార్య అన్న మాటలు నా కంగారును తగ్గించాయి. తక్కువ వస్తువులతో జీవిస్తూ తమలాగే యెహోవా సేవకు మొదటి స్థానమిచ్చే ఆధ్యాత్మిక వ్యక్తుల ఇళ్లలో గడిపిన సందర్భాలే తమకు ప్రయాణ సేవలో ఎక్కువ ఆనందాన్ని ఇచ్చాయని ఆమె నాకు చెప్పింది. అది విన్నాక మా అమ్మ చెప్పిన ఈ మాటలు గుర్తొచ్చాయి, ‘ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుట మేలు.’” (సామె. 15:17) ఆతిథ్యమివ్వడానికి ఆందోళనపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వేరే దేనికన్నా మన అతిథుల పట్ల చూపించే ప్రేమే ప్రాముఖ్యమైనది.

18, 19. ఆతిథ్యమిచ్చినప్పుడు ఇతరులపట్ల ఉన్న ప్రతి కూల భావాలు ఎలా పోతాయి?

18 ఇతరులపై మీ అభిప్రాయం: సంఘంలో మీకు చిరాకు తెప్పించేవాళ్లు ఎవరైనా ఉన్నారా? వాళ్లపట్ల మీకున్న ప్రతికూల భావాల్ని పోగొట్టుకోవడానికి మీరేమి చేయకపోతే మీ మధ్య సంబంధం ఎప్పటికీ మెరుగవ్వకపోవచ్చు. మీకు ఎవరి వ్యక్తిత్వమైనా నచ్చకపోయినా లేదా గతంలో మిమ్మల్ని బాధపెట్టినవాళ్లను క్షమించలేకపోయినా వాళ్లకు ఆతిథ్యం ఇవ్వడానికి వెనకాడతారు.

19 అయితే, ఆతిథ్యమివ్వడం ద్వారా ఇతరులతో ఆఖరికి మీ శత్రువులతో మీకున్న సంబంధాన్ని కూడా మెరుగుపర్చుకోవచ్చని బైబిలు చెప్తుంది. (సామెతలు 25:21, 22 చదవండి.) ఎవరికైనా ఆతిథ్యమిస్తే వాళ్లపట్ల మీకున్న ప్రతికూల భావాలు పోతాయి, వాళ్లతో మరింత దగ్గరి సంబంధాన్ని కలిగివుండగలుగుతారు. యెహోవా వాళ్లను సత్యంవైపు ఆకర్షించినప్పుడు ఆయన వాళ్లలో చూసిన మంచి లక్షణాల్ని మీరూ చూడగలుగుతారు. (యోహా. 6:44) తమను పిలవరని అనుకునేవాళ్లను కూడా మీరు ప్రేమతో ఆహ్వానిస్తే, వాళ్లతో మంచి స్నేహాన్ని సంపాదించుకోవచ్చు. వాళ్లకు ఆతిథ్యం ఇవ్వడానికి కావాల్సిన ప్రేమను మీరెలా సంపాదించుకోవచ్చు? దానికి ఒక మార్గమేమిటంటే, ఫిలిప్పీయులు 2:3⁠లో ఉన్న సూత్రాన్ని పాటించడం. అక్కడిలా ఉంది, “వినయంతో ఇతరులు మీకన్నా గొప్పవాళ్లని ఎంచండి.” మన సహోదరసహోదరీలు ఏయే విషయాల్లో మనకన్నా గొప్పవాళ్లో ఆలోచించాలి. బహుశా వాళ్ల విశ్వాసం, సహనం లేదా ఇతర క్రైస్తవ లక్షణాల నుండి మనం నేర్చుకోవచ్చు. వాళ్లలో ఉన్న మంచి లక్షణాల గురించి ఆలోచించినప్పుడు వాళ్లపట్ల ప్రేమ అధికమౌతుంది, వాళ్లకు ఆతిథ్యమివ్వడం తేలికౌతుంది.

మంచి అతిథిగా ఉండండి

ఆతిథ్యమిచ్చే వాళ్లు అతిథుల కోసం ముందుగానే ఏర్పాట్లు చేస్తారు (20వ పేరా చూడండి)

20. ఏదైనా ఆహ్వానాన్ని అంగీకరించినప్పుడు నమ్మకంగా ఉంటామని ఎందుకు చూపించాలి? ఎలా చూపించాలి?

20 “యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు?” అని కీర్తనకర్త దావీదు యెహోవాను అడిగాడు. (కీర్త. 15:1) ఆ తర్వాత, యెహోవా గుడారంలో అతిథిగా ఉండాలనుకునే వాళ్లకు కావాల్సిన లక్షణాలను దావీదు ప్రస్తావించాడు. అందులో ఒక లక్షణం నమ్మకంగా ఉండడం. “అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు” అని బైబిలు చెప్తుంది. (కీర్త. 15:4) మనం ఏదైనా ఆహ్వానాన్ని అంగీకరించినప్పుడు, అనివార్య పరిస్థితిలో తప్ప దాన్ని రద్దు చేసుకోకూడదు. ఆతిథ్యం ఇచ్చేవాళ్లు మనకోసం అంతా సిద్ధం చేసి ఉంటారు, ఆఖరి నిమిషంలో మనం రావట్లేదని చెప్తే వాళ్ల కష్టమంతా వృథా అవుతుంది. (మత్త. 5:37) కొంతమంది ఏదైనా మంచి ఆహ్వానం అందుకున్నప్పుడు, అంతకుముందు అంగీకరించిన ఆహ్వానాన్ని రద్దు చేసుకుంటారు. అలా చేస్తే ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి పట్ల ప్రేమ, గౌరవం చూపించినట్లు అవుతుందా? ఆతిథ్యమిచ్చే వ్యక్తి ఏమి ఇచ్చినా దానిపట్ల కృతజ్ఞత కలిగివుండాలి. (లూకా 10:7) ఒకవేళ అనుకోని పరిస్థితిలో ఆ ఆహ్వానాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తే, ఆ విషయం ఆతిథ్యమిచ్చే వ్యక్తికి వీలైనంత ముందే చెప్పాలి.

21. స్థానిక పద్ధతులను గౌరవిస్తున్నామని మనమెలా చూపించవచ్చు?

21 స్థానిక పద్ధతులను గౌరవించడం కూడా ముఖ్యం. కొన్ని సంస్కృతుల్లో అనుకోకుండా వచ్చిన అతిథులను కూడా సాదరంగా ఆహ్వానిస్తారు. కానీ కొన్ని సంస్కృతుల్లో మనం వచ్చే విషయం ముందుగానే చెప్పాలి. కొన్ని ప్రాంతాల్లో, శ్రేష్ఠమైన ఆహారాన్ని ముందు అతిథులకు పెడతారు, ఆ తర్వాతే కుటుంబ సభ్యులకు పెడతారు. ఇంకొన్ని ప్రాంతాల్లో అందరికీ ఒకేసారి వడ్డిస్తారు. కొన్ని ప్రాంతాల్లో, అతిథులు వచ్చేటప్పుడు ఏదోకటి తెస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో, అతిథులు ఏమీ తీసుకురాకపోవడమే గౌరవంగా భావిస్తారు. ఇతర సంస్కృతుల్లో, అతిథులు ఒకటి లేదా రెండుసార్లు ఆహ్వానాన్ని వద్దని చెప్తేనే ఆతిథ్యం ఇచ్చేవాళ్లను గౌరవిస్తున్నట్లు. కానీ కొన్ని సంస్కృతుల్లోనైతే మొదటిసారి ఆతిథ్యాన్ని కాదంటే ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిని అగౌరవపర్చినట్లే. కాబట్టి మనల్ని పిలిచిన వ్యక్తిని సంతోషపర్చేందుకు మనం చేయాల్సినదంతా చేయాలి.

22. ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకుంటూ ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

22 “అన్నిటి అంతం దగ్గరపడింది” అని పేతురు చెప్పాడు. (1 పేతు. 4:7) ముందెన్నడూ చూడనంత గొప్ప శ్రమను మనం చూడబోతున్నాం. ఈ లోకం రోజురోజుకూ చెడుగా మారుతుండగా, మన సహోదరసహోదరీల పట్ల ప్రగాఢమైన ప్రేమను పెంచుకోవాలి. “ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకుంటూ ఉండండి” అని పేతురు ఇచ్చిన సలహాను పాటించడం ముందెప్పటికన్నా ఇప్పుడు చాలా ప్రాముఖ్యం. (1 పేతు. 4:9) అవును, ఆతిథ్యం ఇవ్వడం మనకు చాలా సంతోషాన్నిస్తుంది. ఇప్పుడూ, భవిష్యత్తులో అది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన భాగం.