కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘క్రమశిక్షణను స్వీకరించి తెలివిగలవాళ్లు అవ్వండి’

‘క్రమశిక్షణను స్వీకరించి తెలివిగలవాళ్లు అవ్వండి’

‘నా కుమారులారా, క్రమశిక్షణను స్వీకరించి తెలివిగలవాళ్లు అవ్వండి.’సామె. 8:32, 33, NW.

పాటలు: 56, 89

1. మనం తెలివిని ఎలా సంపాదించుకోవచ్చు? అది మనకెలా సహాయం చేస్తుంది?

యెహోవాయే తెలివికి మూలం, ఆయన దాన్ని అందరికీ ఉదారంగా ఇస్తాడు. యాకోబు 1:5⁠లో ఇలా చదువుతాం, “మీలో ఎవరికైనా తెలివి కొరవడితే అతను దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ఆయన కోప్పడకుండా అందరికీ ఉదారంగా ఇచ్చే దేవుడు.” మనం ఆ తెలివిని సంపాదించుకునే ఒక మార్గమేమిటంటే, దేవుడు ఇచ్చే క్రమశిక్షణను స్వీకరించడం. అలా మనం సంపాదించుకున్న తెలివి మనల్ని తప్పు చేయకుండా కాపాడుతుంది, యెహోవాకు సన్నిహితం చేస్తుంది. (సామె. 2:10-12) శాశ్వతకాలం జీవిస్తామనే నిరీక్షణను కూడా ఇస్తుంది.—యూదా 21.

2. దేవుడు ఇచ్చే క్రమశిక్షణను స్వీకరించడం ఎలా నేర్చుకోవచ్చు?

2 మన అపరిపూర్ణతను బట్టి, పెరిగిన విధానం బట్టి క్రమశిక్షణను స్వీకరించడం లేదా దాన్ని సరైన దృష్టితో చూడడం కొన్నిసార్లు కష్టంగా ఉండవచ్చు. కానీ దేవుడు ఇచ్చే క్రమశిక్షణ వల్ల వచ్చే ప్రయోజనాలను అనుభవించినప్పుడు, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థంచేసుకుంటాం. సామెతలు 3:11, 12 ఇలా చెప్తుంది, “నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు . . . యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును.” అవును, మనకు శ్రేష్ఠమైనది ఇవ్వాలనే కోరిక యెహోవాకు ఉందనే నమ్మకంతో ఉండవచ్చు. (హెబ్రీయులు 12:5-11 చదవండి.) అంతేకాదు ఆయనకు మన గురించి బాగా తెలుసు కాబట్టి, ఎల్లప్పుడూ మనకు సరిపోయే, సరిగ్గా అవసరమయ్యే క్రమశిక్షణనే ఇస్తాడు. ఈ ఆర్టికల్‌లో క్రమశిక్షణకు సంబంధించి నాలుగు అంశాల్ని పరిశీలిస్తాం: (1) స్వీయ క్రమశిక్షణ, (2) తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వాల్సిన క్రమశిక్షణ, (3) సంఘంలో మనకు దొరికే క్రమశిక్షణ, (4) క్రమశిక్షణ కన్నా బాధకలిగించే పర్యవసానాలు.

స్వీయ క్రమశిక్షణ

3. స్వీయ క్రమశిక్షణను పిల్లలు ఎలా నేర్చుకుంటారు? ఒక ఉదాహరణ చెప్పండి.

3 మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకోవడం వల్ల లేదా స్వీయ క్రమశిక్షణ వల్ల మన ప్రవర్తనను, ఆలోచన విధానాన్ని అదుపు చేసుకోగలుగుతాం. స్వీయ క్రమశిక్షణ మనకు పుట్టుకతోనే రాదు, దాన్ని నేర్చుకోవాలి. ఉదాహరణకు, పిల్లలు సైకిల్‌ తొక్కడం నేర్చుకునేటప్పుడు తల్లి లేదా తండ్రి ఆ సైకిల్‌ పడిపోకుండా పట్టుకుంటారు. కానీ కొంతకాలానికి పిల్లవాడు సైకిల్‌ని బాలెన్స్‌ చేయడం కాస్త నేర్చుకున్నాక ఆ తల్లి లేదా తండ్రి కొన్ని సెకన్ల వరకు సైకిల్‌ని వదిలేస్తారు. పిల్లవాడు సైకిల్‌ తొక్కడం బాగా నేర్చుకున్నాడనే నమ్మకం కుదిరాక దాన్ని పూర్తిగా వదిలేస్తారు. అదేవిధంగా, తల్లిదండ్రులు “యెహోవా నిర్దేశాల ప్రకారం క్రమశిక్షణను” ఇచ్చినప్పుడు, తమ పిల్లలకు స్వీయ క్రమశిక్షణను, తెలివిని సంపాదించుకోవడానికి సహాయం చేసినవాళ్లౌతారు.—ఎఫె. 6:4.

4, 5. (ఎ) కొత్త వ్యక్తిత్వంలో స్వీయ క్రమశిక్షణ కూడా ఒక ముఖ్యమైన భాగమని ఎందుకు చెప్పవచ్చు? (బి) మనం ఏమైనా పొరపాట్లు చేసినప్పుడు ఎందుకు నిరుత్సాహపడకూడదు?

4 పెద్దవాళ్లయ్యాక యెహోవా గురించి నేర్చుకున్న వాళ్లకు కూడా అదే సూత్రం వర్తిస్తుంది. వాళ్లకు కొంతమేరకు స్వీయ క్రమశిక్షణ ఉన్నప్పటికీ, వాళ్లింకా పరిణతి సాధించని క్రైస్తవులే. కానీ వాళ్లు క్రీస్తులాంటి “కొత్త వ్యక్తిత్వాన్ని” అలవర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు మరింత పరిణతి సాధిస్తారు. (ఎఫె. 4:23, 24) “మనం ప్రస్తుత వ్యవస్థలో భక్తిలేని ప్రవర్తనకు దూరంగా ఉండేలా, లోకంలోని చెడు కోరికలను తిరస్కరించేలా, మంచి వివేచనతో, నీతితో, దేవుని మీద భక్తితో జీవించేలా” స్వీయ క్రమశిక్షణ సహాయం చేస్తుంది.—తీతు 2:12.

5 మనందరం పాపులం. (ప్రసం. 7:20) కాబట్టి ఏదైనా పొరపాటు చేస్తే, మనకు స్వీయ క్రమశిక్షణ లేదనా? కాదు. “నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును” అని సామెతలు 24:16⁠లో చదువుతాం. మరి ‘తిరిగి లేవడానికి’ మనకేది సహాయం చేస్తుంది? మన సొంత శక్తి కాదుగానీ దేవుని పవిత్రశక్తి సహాయం చేస్తుంది. (ఫిలిప్పీయులు 4:13 చదవండి.) పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్లో ఆత్మనిగ్రహం కూడా ఒకటి. దానికీ, స్వీయ క్రమశిక్షణకూ దగ్గరి సంబంధం ఉంది.

6. బైబిలు చదవడాన్ని మనమెలా మరింత ఆనందించవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

6 ప్రార్థన, బైబిలు చదవడం, చదివిన వాటిని ధ్యానించడం వల్ల కూడా స్వీయ క్రమశిక్షణను అలవర్చుకోగలుగుతాం. కానీ బైబిలు చదవడం మీకు కష్టంగా ఉంటే లేదా చదవడం ఇష్టంలేకపోతే అప్పుడేంటి? నిరుత్సాహపడకండి. మీరు యెహోవాకు అవకాశం ఇస్తే, తన వాక్యంపట్ల మీకున్న “ఆకలిని” ఆయన పెంచగలడు. (1 పేతు. 2:2) బైబిలు చదవడానికి సమయం కేటాయించేలా మిమ్మల్ని మీరు క్రమశిక్షణలో పెట్టుకోవడానికి సహాయం చేయమని యెహోవాను అడగండి. బహుశా మీరు కేవలం కొన్ని నిమిషాలే చదవడం మొదలుపెట్టవచ్చు. క్రమంగా అది మీకు తేలికౌతుంది, మీరు దాన్ని మరింత ఇష్టపడతారు. యెహోవా దేవుని విలువైన ఆలోచనల్ని ధ్యానించడానికి మీరు వెచ్చించే సమయాన్ని ఆనందించగలుగుతారు.—1 తిమో. 4:15.

7. స్వీయ క్రమశిక్షణ యెహోవా సేవలో మనం పెట్టుకున్న లక్ష్యాలు సాధించడానికి ఎలా సహాయం చేస్తుంది?

7 యెహోవా సేవలో మనం పెట్టుకున్న లక్ష్యాలు సాధించడానికి స్వీయ క్రమశిక్షణ సహాయం చేస్తుంది. ఉదాహరణకు, పెళ్లయి పిల్లలున్న ఒక సహోదరుడు పరిచర్యలో తన ఉత్సాహం తగ్గుతోందని గుర్తించాడు, దాంతో ఆయన క్రమ పయినీరు అవ్వాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఈ విషయంలో స్వీయ క్రమశిక్షణ ఆయనకు ఎలా సహాయం చేసింది? పయినీరు సేవ గురించి మన ప్రచురణలు ఏమి చెప్తున్నాయో ఆయన చదివాడు, దానిగురించి ప్రార్థించాడు. దానివల్ల యెహోవాతో ఆయనకున్న బంధం మరింత బలపడింది. అంతేకాదు వీలైనప్పుడల్లా ఆయన సహాయ పయినీరు సేవచేశాడు. తన లక్ష్యాన్ని చేరుకోనివ్వకుండా అడ్డుపడడానికి ఆయన దేన్నీ అనుమతించలేదు. బదులుగా తన లక్ష్యం పైనే దృష్టిపెట్టాడు, కొంతకాలానికి క్రమ పయినీరు అయ్యాడు.

మీ పిల్లలకు యెహోవా నిర్దేశాల ప్రకారం క్రమశిక్షణ ఇవ్వండి

పిల్లలకు ఏది మంచో ఏది చెడో పుట్టుకతోనే తెలియదు కాబట్టి వాళ్లకు క్రమశిక్షణ అవసరం (8వ పేరా చూడండి)

8-10. పిల్లలు యెహోవా సేవకులు అయ్యేలా తల్లిదండ్రులు ఎలా సహాయం చేయవచ్చు? ఒక ఉదాహరణ చెప్పండి.

8 “యెహోవా నిర్దేశాల ప్రకారం క్రమశిక్షణను ఇస్తూ, ఉపదేశాన్ని ఇస్తూ” పిల్లల్ని పెంచే బాధ్యత దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చాడు. (ఎఫె. 6:4) నేడున్న పరిస్థితుల్లో అలా చేయడం చాలా కష్టం. (2 తిమో. 3:1-5) పిల్లలకు ఏది మంచో ఏది చెడో పుట్టుకతోనే తెలియదు, వాళ్ల మనస్సాక్షి కూడా శిక్షణ పొందలేదు. కాబట్టి వాళ్లకు క్రమశిక్షణ అవసరం. (రోమా. 2:14, 15) “క్రమశిక్షణ” అని అనువదించబడిన గ్రీకు పదానికి పిల్లల్ని బాధ్యతగల వ్యక్తులుగా పెంచడం అనే అర్థం ఉందని ఒక బైబిలు పండితుడు చెప్పాడు.

9 తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమతో క్రమశిక్షణ ఇస్తే వాళ్లు మరింత సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారు. తమకున్న స్వేచ్ఛకు హద్దులు ఉన్నాయని, వాళ్లు చేసే ప్రతీదానికి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విషయంలో యెహోవా ఇచ్చే తెలివి మీద ఆధారపడడం చాలా ప్రాముఖ్యం. పిల్లల్ని పెంచే పద్ధతి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది, అవి మారుతుంటాయి కూడా. అయినప్పటికీ, దేవుని నిర్దేశాలు పాటించే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విషయంలో తమ సొంత అంచనాల మీదగానీ, అనుభవం మీదగానీ, మనుషుల ఆలోచనల మీదగానీ ఆధారపడరు.

10 ఈ విషయంలో నోవహు నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. యెహోవా ఆయనకు ఒక ఓడ కట్టమని చెప్పినప్పుడు, అదెలా కట్టాలో నోవహుకు తెలియదు. దానికోసం ఆయన యెహోవా మీద ఆధారపడాలి. నోవహు యెహోవా చెప్పినట్టే చేశాడని బైబిల్లో చదువుతాం. (ఆది. 6:22) దాని ఫలితం? ఆ ఓడ వల్లే నోవహు తన ప్రాణాన్ని, తన కుటుంబ సభ్యుల ప్రాణాల్ని కాపాడుకోగలిగాడు. నోవహు ఒక మంచి తండ్రి కూడా. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే ఆయన యెహోవా తెలివి మీద ఆధారపడ్డాడు. నోవహు తన పిల్లలకు చక్కగా బోధించాడు, వాళ్లకు మంచి ఆదర్శాన్ని ఉంచాడు. జలప్రళయం రాకముందు ఆయన జీవించిన కాలంలో అలా చేయడం అంత సులభం కాదు.—ఆది. 6:5.

11. పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి తల్లిదండ్రులు ఎందుకు కష్టపడాలి?

11 ఒకవేళ మీకు పిల్లలుంటే మీరు నోవహును ఎలా అనుకరించవచ్చు? యెహోవా చెప్పేది వినండి. పిల్లల్ని పెంచే విషయంలో ఆయన సహాయం తీసుకోండి. ఆయన వాక్యం అలాగే ఆయన సంస్థ చెప్పే వాటిని పాటించండి. ఇవన్నీ చేస్తే మీ పిల్లలు పెద్దవాళ్లయ్యాక మీకు ఎంతో కృతజ్ఞులై ఉంటారు. ఒక సహోదరుడు ఇలా రాశాడు, “మా అమ్మానాన్నలు నన్ను పెంచిన విధానానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. నా హృదయాన్ని చేరుకోవడానికి వాళ్లు చేయగలిగినదంతా చేశారు.” యెహోవాకు సన్నిహితం అవ్వడానికి తన తల్లిదండ్రులే సహాయం చేశారని ఆ సహోదరుడు చెప్పాడు. నిజమే, కొన్నిసార్లు తమ పిల్లలకు బోధించడానికి తల్లిదండ్రులు చేయగలిగినదంతా చేసినప్పటికీ, పిల్లలు యెహోవాను విడిచిపెట్టే అవకాశం ఉంది. కానీ పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి తమ శక్తికొలది ప్రయత్నించిన తల్లిదండ్రులు మంచి మనస్సాక్షితో ఉండవచ్చు, ఏదోక రోజు వాళ్లు యెహోవా దగ్గరకు తిరిగి వస్తారనే నమ్మకంతో కూడా ఉండవచ్చు.

12, 13. (ఎ) తమ కొడుకు లేదా కూతురు బహిష్కరించబడినప్పుడు తల్లిదండ్రులు యెహోవాకు లోబడుతున్నామని ఎలా చూపిస్తారు? (బి) తల్లిదండ్రులు యెహోవాకు లోబడడం వల్ల ఒక కుటుంబం ఎలా ప్రయోజనం పొందింది?

12 తమ పిల్లల్లో ఎవరైనా బహిష్కరించబడినప్పుడు కొంతమంది తల్లిదండ్రుల విధేయతకు ఒక పెద్ద పరీక్ష ఎదురౌతుంది. ఒక సహోదరి కూతురు బహిష్కరించబడి ఇంట్లో నుండి వెళ్లిపోయింది. ఆ సహోదరి ఇలా ఒప్పుకుంటుంది, “నా కూతురుతో, మనవరాలుతో సమయం గడపడానికి ఏమైనా అవకాశం ఉందేమోనని మన ప్రచురణలో లొసుగుల కోసం వెదికాను.” కానీ ఆ ఆలోచనను సరిచేసుకోవడానికి ఆ సహోదరి భర్త ఆమెకు దయగా సహాయం చేశాడు. ఇప్పుడు తమ కూతురు యెహోవా చేతుల్లో ఉందనీ, యెహోవా క్రమశిక్షణ ఇస్తున్నప్పుడు జోక్యం చేసుకోకూడదనీ ఆమెకు వివరించాడు.

13 కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ల కూతురు సంఘంలోకి తిరిగి చేర్చుకోబడింది. ఆ సహోదరి ఇలా చెప్తుంది, “ఇప్పుడు నా కూతురు ప్రతీరోజు ఫోన్‌ లేదా మెసేజ్‌ చేస్తూ ఉంటుంది. అంతేకాదు యెహోవాకు విధేయత చూపించినందుకు నన్నూ నా భర్తను బాగా గౌరవిస్తుంది. మాకు మా కూతురుతో మంచి సంబంధం ఉంది.” మీ కొడుకు లేదా కూతురు బహిష్కరించబడితే, పూర్ణ హృదయంతో యెహోవా మీద నమ్మకం ఉంచుతారా? మీ “స్వబుద్ధి” మీద ఆధారపడట్లేదని చూపిస్తారా? (సామె. 3:5, 6) యెహోవా ఇచ్చే క్రమశిక్షణ ఆయన తెలివిని, మనపట్ల ఆయనకున్న ప్రేమను చూపిస్తుందని గుర్తుంచుకోండి. దేవుడు మనుషులందరి కోసం అంటే మీ కొడుకు లేదా కూతురు కోసం కూడా తన కుమారుణ్ణి ఇచ్చాడు. ప్రతీఒక్కరు శాశ్వత జీవాన్ని సొంతం చేసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. (2 పేతురు 3:9 చదవండి.) కాబట్టి తల్లిదండ్రులారా, మీకు బాధ కలిగినా యెహోవా ఇచ్చే క్రమశిక్షణ, నిర్దేశం సరైనదనే నమ్మకంతో ఉండండి. దేవుడిచ్చే క్రమశిక్షణను స్వీకరించండి, దానికి విరుద్ధంగా ప్రవర్తించకండి.

సంఘంలో

14. ‘నమ్మకమైన గృహనిర్వాహకుడు’ ద్వారా యెహోవా ఇచ్చే నిర్దేశాల నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

14 క్రైస్తవ సంఘాన్ని సంరక్షిస్తానని, కాపాడతానని, బోధిస్తానని యెహోవా మాటిచ్చాడు. ఆయన దాన్ని ఎన్నో విధాలుగా చేస్తున్నాడు. ఉదాహరణకు, సంఘాన్ని చూసుకోవడానికి ఆయన తన కుమారుడైన యేసును నియమించాడు. మనకు ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించడానికి, యథార్థంగా ఉండేలా మనకు సహాయం చేయడానికి యేసు ‘నమ్మకమైన గృహనిర్వాహకున్ని’ నియమించాడు. (లూకా 12:42) ఆ “గృహనిర్వాహకుడు” మనకు విలువైన నిర్దేశాల్ని, క్రమశిక్షణను ఇస్తున్నాడు. మీరు విన్న ఒక ప్రసంగాన్ని బట్టి లేదా చదివిన ఆర్టికల్‌ని బట్టి మీ ఆలోచనను లేదా ప్రవర్తనను మార్చుకున్నారా? అలాగైతే మీరు సంతోషించవచ్చు, ఎందుకంటే యెహోవా ఇచ్చే క్రమశిక్షణను మీరు స్వీకరిస్తున్నారని దానర్థం.—సామె. 2:1-5.

15, 16. (ఎ) సంఘపెద్దలు చేసే పని నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు? (బి) సంఘపెద్దలు మనకు సలహా ఇవ్వడాన్ని ఎలా తేలిక చేయవచ్చు?

15 సంఘాన్ని ప్రేమతో సంరక్షించడానికి సంఘపెద్దల్ని కూడా యేసుక్రీస్తు ఏర్పాటు చేశాడు. వాళ్లను ‘మనుషుల్లో వరాలు’ అని బైబిలు పిలుస్తుంది. (ఎఫె. 4:8, 11-13) సంఘపెద్దలు చేసే పని నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు? మనం వాళ్ల విశ్వాసాన్ని, మంచి ఆదర్శాన్ని అనుకరించవచ్చు. బైబిలు ఆధారంగా వాళ్లిచ్చే సలహాల్ని పాటించవచ్చు. (హెబ్రీయులు 13:7, 17 చదవండి.) సంఘపెద్దలు మనల్ని ప్రేమిస్తారు, మనం దేవునికి దగ్గరవ్వాలని కోరుకుంటారు. మనం అప్పుడప్పుడు మీటింగ్స్‌కు రావట్లేదని లేదా మనలో ఉత్సాహం తగ్గిపోతుందని గమనిస్తే వెంటనే సహాయం చేస్తారు. వాళ్లు మనం చెప్పేదంతా విని, ప్రేమతో ప్రోత్సహించి బైబిలు నుండి మనకు కావాల్సిన తెలివైన సలహాలు ఇస్తారు. వాళ్లిచ్చే సహాయాన్ని యెహోవా ప్రేమకు నిదర్శనంగా భావిస్తారా?

16 మనకు సలహాలు ఇవ్వడం సంఘపెద్దలకు తేలిక కాదని గుర్తుంచుకోండి. ఘోరమైన పాపాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించిన దావీదు రాజుతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు నాతాను ప్రవక్త ఎలా భావించివుంటాడో ఆలోచించండి. (2 సమూ. 12:1-14) యూదులైన క్రైస్తవులపట్ల పక్షపాతం చూపించినందుకు 12 మంది అపొస్తలుల్లో ఒకరైన పేతురును హెచ్చరించాల్సి వచ్చినప్పుడు అపొస్తలుడైన పౌలుకు ఎలా అనిపించివుంటుందో ఆలోచించండి. దానికోసం పౌలుకు చాలా ధైర్యం అవసరమైవుంటుంది. (గల. 2:11-14) అయితే మీకు సలహా ఇచ్చే పనిని సంఘపెద్దలకు తేలిక చేయాలంటే ఏమి చేయవచ్చు? వినయంగా ఉండండి, కృతజ్ఞత చూపించండి, మాట్లాడడానికి సుముఖంగా ఉండండి. వాళ్లిచ్చే సహాయాన్ని దేవుని ప్రేమకు నిదర్శనంగా భావించండి. దానివల్ల మీరు ప్రయోజనం పొందుతారు, పెద్దలు కూడా తమ పనిని ఆనందిస్తారు.

17. ఒక సహోదరికి సంఘపెద్దలు ఎలా సహాయం చేశారు?

17 ఒక సహోదరి, గతంలో ఎదురైన అనుభవాల్ని బట్టి యెహోవాను ప్రేమించడం చాలా కష్టంగా మారిందని, చాలా కృంగిపోయానని చెప్పింది. “నా పరిస్థితిని సంఘపెద్దలకు వివరించాను. వాళ్లు నన్ను తిట్టలేదు, కించపర్చలేదు. బదులుగా నన్ను ప్రోత్సహించారు, బలపర్చారు. మీటింగ్‌ అయిపోయిన ప్రతీసారి వాళ్లెంత బిజీగా ఉన్నా, కనీసం వాళ్లలో ఒక్కరైనా నా బాగోగులు అడిగి తెలుసుకుంటారు. నా గతాన్నిబట్టి యెహోవా ప్రేమ పొందడానికి నేను అర్హురాల్ని కాదని అనుకున్నాను. కానీ యెహోవా తోటి సహోదరసహోదరీలను, పెద్దలను ఉపయోగించుకుని నా మీద తనకున్న ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. ఆయనకు నేను ఎన్నడూ దూరమవ్వకూడదని ప్రార్థనలో వేడుకుంటున్నాను” అని ఆమె అంది.

క్రమశిక్షణ కన్నా ఎక్కువ బాధ కలిగించేవి

18, 19. క్రమశిక్షణ వల్ల కలిగే బాధ కన్నా ఘోరమైనది ఏమిటి? ఒక ఉదాహరణ చెప్పండి.

18 క్రమశిక్షణ బాధగా అనిపించవచ్చు, కానీ దేవుడు ఇచ్చే క్రమశిక్షణను తిరస్కరించడం వల్ల మరింత బాధ కలిగించే పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. (హెబ్రీ. 12:11) ఈ విషయాన్ని కయీను అలాగే సిద్కియా రాజు వంటి చెడ్డ ఉదాహరణల నుండి నేర్చుకోవచ్చు. కయీను తన తమ్ముణ్ణి ద్వేషిస్తున్నాడని, అతన్ని చంపాలని చూస్తున్నాడని దేవుడు గమనించాడు. అందుకే యెహోవా కయీనును ఇలా హెచ్చరించాడు, “నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి? నీవు సత్క్రియ చేసినయెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను.” (ఆది. 4:6, 7) కయీను యెహోవా ఇచ్చే క్రమశిక్షణను తీసుకోలేదు, తన తమ్ముణ్ణి చంపాడు, మిగతా జీవితమంతా దాని చెడు పర్యవసానాలు అనుభవించాడు. (ఆది. 4:11, 12) కయీను యెహోవా చెప్పింది వినుంటే జీవితంలో అంత బాధ అనుభవించి ఉండేవాడుకాదు.

19 సిద్కియా ఒక అసమర్థుడైన దుష్ట రాజు. ఆయన పరిపాలనలో యెరూషలేము ప్రజలు చాలా గడ్డు పరిస్థితుల్ని అనుభవించారు. ప్రవర్తన మార్చుకోమని యిర్మీయా ప్రవక్త అతనికి పదేపదే చెప్తూ వచ్చాడు. కానీ ఆ రాజు దేవుడు ఇచ్చే క్రమశిక్షణను తిరస్కరించాడు, ఫలితంగా చాలా ఘోరమైన పర్యవసానాలు అనుభవించాడు. (యిర్మీ. 52:8-11) మనం అలాంటి అనవసరమైన బాధ అనుభవించాలని యెహోవా కోరుకోవట్లేదు.—యెషయా 48:17, 18 చదవండి.

20. దేవుని క్రమశిక్షణను స్వీకరించిన వాళ్లకు ఏమి జరుగుతుంది? స్వీకరించని వాళ్లకు ఏమి జరుగుతుంది?

20 నేడు లోకంలోని చాలామంది యెహోవా క్రమశిక్షణను ఎగతాళి చేస్తారు, పట్టించుకోరు. కానీ అలాంటి వాళ్లందరూ త్వరలో చాలా బాధాకరమైన పర్యవసానాలు ఎదుర్కొంటారు. (సామె. 1:24-31) “ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము” అని సామెతలు 4:13 చెప్తుంది. కాబట్టి ‘క్రమశిక్షణను స్వీకరించి తెలివిగలవాళ్లుగా’ తయారౌదాం.