కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రమశిక్షణ—దేవుని ప్రేమకు నిదర్శనం

క్రమశిక్షణ—దేవుని ప్రేమకు నిదర్శనం

“యెహోవా తాను ప్రేమించేవాళ్లకు క్రమశిక్షణ ఇస్తాడు.”హెబ్రీ. 12:6.

పాటలు: 123, 86

1. క్రమశిక్షణ అనే పదాన్ని బైబిలు తరచుగా ఎలా వర్ణిస్తుంది?

“క్రమశిక్షణ” అనే పదం వినగానే మీకేమి గుర్తొస్తుంది? చాలామందికి శిక్షించడం గుర్తొస్తుంది, కానీ క్రమశిక్షణ అంటే అది మాత్రమే కాదు. క్రమశిక్షణ మనకు మేలు చేస్తుందని బైబిలు చెప్తుంది. అంతేకాదు దాన్ని కొన్నిసార్లు జ్ఞానం, తెలివి, ప్రేమ, జీవం వంటివాటితో ముడిపెడుతుంది. (సామె. 1:2-7; 4:11-13) దేవుడు క్రమశిక్షణ ఇవ్వడం ద్వారా మనపట్ల ప్రేమ ఉందని, అలాగే మనం శాశ్వతకాలం జీవించాలని కోరుకుంటున్నాడని తెలియజేస్తున్నాడు. (హెబ్రీ. 12:6) నిజమే క్రమశిక్షణలో భాగంగా దేవుడు కొన్నిసార్లు శిక్షిస్తాడు, కానీ అది క్రూరంగా లేదా హానికరంగా ఉండదు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా “క్రమశిక్షణ” అనే పదానికి విద్య అనే అర్థం కూడా ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రేమతో ఇచ్చే విద్యతో దాన్ని పోల్చవచ్చు.

2, 3. క్రమశిక్షణలో నేర్పించడం అలాగే శిక్షించడం కూడా ఉంటాయని ఎలా చెప్పవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

2 ఈ ఉదాహరణ పరిశీలించండి: జానీ అనే పిల్లవాడు ఇంట్లో బంతితో ఆడుకుంటున్నాడు. అప్పుడు వాళ్ల అమ్మ, “జానీ, ఇంట్లో బంతితో ఆడొద్దని నీకు చెప్పానా! అది వేటికైనా తగిలితే అవి పగిలిపోతాయి” అని చెప్పింది. కానీ ఆ పిల్లవాడు అమ్మ మాట పట్టించుకోకుండా ఆడుకుంటూ ఉన్నాడు. ఆ బంతి వెళ్లి ఒక పూల కుండీకి తగలడంతో అది పగిలిపోయింది. మరి జానీకి క్రమశిక్షణ ఇవ్వడానికి వాళ్ల అమ్మ ఏమి చేసింది? ముందు, ఆ పిల్లవాడు చేసిన పని ఎందుకు తప్పో వివరించింది. అంతేకాదు అమ్మానాన్నల మాట వింటే మంచిదని, వాళ్లు పెట్టే నియమాలు అవసరమైనవని, సహేతుకమైనవనే పాఠం తన కొడుకుకు నేర్పించాలని ఆమె కోరుకుంది. అందుకే, కాసేపు జానీ దగ్గరనుండి బంతి తీసేసుకోవడం ద్వారా శిక్షించింది. ఇదంతా జానీకి బాధ కలిగించివుంటుంది. కానీ అమ్మానాన్నల మాట వినకపోతే, పర్యవసానాలు తప్పవని గుర్తుంచుకోవడానికి అది జానీకి సహాయం చేసింది.

3 క్రైస్తవులముగా, మనం దేవుని కుటుంబ సభ్యుల్లో ఒకరం. (1 తిమో. 3:15) ఏది సరైనదో, ఏది తప్పో నిర్ణయించే హక్కు మన తండ్రి అయిన యెహోవాకు ఉంది. అలాగే తన మాట వినకపోతే క్రమశిక్షణ ఇచ్చే హక్కు కూడా ఆయనకు ఉంది. మన పనులవల్ల చెడు పర్యవసానాలు ఎదురైతే, యెహోవాకు లోబడడం ఎంత ప్రాముఖ్యమో మనం గుర్తించడానికి ప్రేమతో ఆయన ఇచ్చే క్రమశిక్షణ సహాయం చేస్తుంది. (గల. 6:7) దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు, మనం బాధలుపడడం ఆయనకు ఇష్టంలేదు.—1 పేతు. 5:6, 7.

4. (ఎ) బైబిలు విద్యార్థులకు ఎలాంటి క్రమశిక్షణ ఇవ్వాలని యెహోవా కోరుకుంటున్నాడు? (బి) ఈ ఆర్టికల్‌లో మనమేమి చర్చిస్తాం?

4 మన పిల్లలకు లేదా బైబిలు విద్యార్థులకు బైబిలు సూత్రాల ఆధారంగా క్రమశిక్షణ ఇవ్వడం ద్వారా వాళ్లు క్రీస్తు అనుచరులవ్వడానికి మనం సహాయం చేయవచ్చు. ఏది సరైనదో వాళ్లకు నేర్పించడానికి అలాగే ‘యేసు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ’ అర్థంచేసుకొని పాటించడానికి బైబిలు ద్వారా సహాయం చేస్తాం. (మత్త. 28:19, 20; 2 తిమో. 3:16) అలాంటి శిక్షణవల్ల, బైబిలు విద్యార్థులు కూడా ఇతరుల్ని క్రీస్తు అనుచరులుగా చేసే సామర్థ్యం సంపాదించుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. (తీతు 2:11-14 చదవండి.) ఇప్పుడు, ప్రాముఖ్యమైన ఈ మూడు ప్రశ్నల్ని పరిశీలిద్దాం: (1) దేవుడిచ్చే క్రమశిక్షణ మనపట్ల ఆయనకు ప్రేమ ఉందని ఎలా నిరూపిస్తుంది? (2) గతంలో దేవుని క్రమశిక్షణను పొందినవాళ్ల నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (3) క్రమశిక్షణ ఇచ్చే విషయంలో యెహోవాను, ఆయన కుమారుణ్ణి మనమెలా అనుకరించవచ్చు?

దేవుడు ప్రేమతో క్రమశిక్షణ ఇస్తాడు

5. క్రమశిక్షణ యెహోవా ప్రేమను ఎలా నిరూపిస్తుంది?

5 యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి సరిదిద్దుతాడు, నేర్పిస్తాడు, శిక్షణనిస్తాడు. దానివల్ల మనం ఆయనకు సన్నిహితంగా ఉండవచ్చు, జీవ మార్గంలో నడవవచ్చు. (1 యోహా. 4:16) ఆయన మనల్ని ఎన్నడూ ఎగతాళి చేయడు లేదా చిన్నచూపు చూడడు. (సామె. 12:18) బదులుగా, మనలో ఉన్న మంచి లక్షణాల్ని చూస్తాడు, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ఇస్తాడు. బైబిలు ద్వారా, ప్రచురణల ద్వారా, అమ్మానాన్నల ద్వారా, సంఘపెద్దల ద్వారా మనం పొందే క్రమశిక్షణలో మీకు దేవుని ప్రేమ కనబడుతోందా? నిజానికి, ఫలానా తప్పు చేశామని గుర్తించకముందే మనల్ని ప్రేమగా, దయగా సరిదిద్దే సంఘపెద్దలు, నిజానికి యెహోవా ప్రేమను అనుకరిస్తున్నారు.—గల. 6:1.

6. సంఘంలో సేవావకాశాల్ని తీసేయడం దేవుని ప్రేమకు నిదర్శనమని ఎలా చెప్పవచ్చు?

6 కొన్నిసార్లు క్రమశిక్షణలో భాగంగా సలహాతోపాటు కొన్ని చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా గంభీరమైన పాపం చేస్తే, వాళ్లు సంఘంలో కొన్ని సేవావకాశాలు కోల్పోతారు. అలాంటి క్రమశిక్షణ కూడా దేవునికి వాళ్లమీద ఉన్న ప్రేమకు నిదర్శనమే. ఏవిధంగా? బైబిలు అధ్యయనం చేయడానికి, చదివినవాటిని లోతుగా ఆలోచించడానికి, ప్రార్థన కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించడం ఎంత ప్రాముఖ్యమో అర్థంచేసుకోవడానికి ఆ క్రమశిక్షణ వాళ్లకు సహాయం చేస్తుంది. అవన్నీ చేయడం ద్వారా యెహోవాతో వాళ్లకున్న సంబంధం మరింత బలపడుతుంది. (కీర్త. 19:7) కొంత సమయం గడిచాక, వాళ్లు కోల్పోయిన సేవావకాశాలను లేదా నియామకాలను మళ్లీ సంపాదించుకోవచ్చు. అంతేకాదు ఒకవ్యక్తిని సంఘం నుండి బహిష్కరించడం కూడా యెహోవా ప్రేమకు నిదర్శనమే. ఎందుకంటే, సంఘం పవిత్రంగా ఉండడానికి ఆ ఏర్పాటు సహాయం చేస్తుంది. (1 కొరిం. 5:6, 7, 11) బహిష్కరించబడిన వ్యక్తి, తాను చేసిన పాపం ఎంత గంభీరమైనదో అర్థంచేసుకోవడానికి వీలౌతుంది. ఫలితంగా అతను పశ్చాత్తాపం కూడా చూపించే అవకాశం ఉంది. కాబట్టి యెహోవా ఇచ్చే క్రమశిక్షణ ఎల్లప్పుడూ న్యాయమైనదే.—అపొ. 3:19.

యెహోవా ఇచ్చే క్రమశిక్షణ ప్రయోజనకరమైనది

7. షెబ్నా ఎవరు? ఆయనలో ఎలాంటి చెడు లక్షణం మొలకెత్తింది?

7 క్రమశిక్షణ ఎంత ప్రాముఖ్యమో అర్థంచేసుకోవడానికి, యెహోవా నుండి క్రమశిక్షణ పొందిన ఇద్దరు వ్యక్తుల గురించి పరిశీలిద్దాం. అందులో ఒకరు రాజైన హిజ్కియా కాలంలో జీవించిన షెబ్నా అనే ఇశ్రాయేలీయుడు. మరొకరు గ్రేయామ్‌ అనే మనకాలంలోని సహోదరుడు. షెబ్నా రాజైన హిజ్కియా దగ్గర ‘గృహనిర్వాహకునిగా’ లేదా రాజభవన పర్యవేక్షకునిగా పనిచేసేవాడు, ఆయనకు చాలా అధికారం ఉండేది. (యెష. 22:15) కానీ షెబ్నాలో గర్వం మొలకెత్తింది, దానివల్ల సొంత ఘనత కోసం ప్రాకులాడాడు. తనకోసం ఒక ఖరీదైన సమాధిని కూడా తొలిపించుకున్నాడు, “ఘనమైన రథముల” మీద ప్రయాణం చేశాడు.—యెష. 22:16-18.

వినయంగా ఉంటూ మన ఆలోచనా తీరును మార్చుకుంటే దీవెనలు పొందుతాం (8-10 పేరాలు చూడండి)

8. యెహోవా షెబ్నాకు ఎలా క్రమశిక్షణ ఇచ్చాడు? దాని ఫలితమేమిటి?

8 షెబ్నా సొంత ఘనత కోసం ప్రయత్నించాడు కాబట్టి ఆయన నియామకాన్ని యెహోవా ఎల్యాకీముకు ఇచ్చాడు. (యెష. 22:19-21) ఇదంతా అష్షూరు రాజైన సన్హెరీబు యెరూషలేము మీద దాడిచేయడానికి ప్రయత్నించినప్పుడు జరిగిన సంగతి. కొంతకాలం తర్వాత సన్హెరీబు యూదుల్ని భయపెట్టడానికి, హిజ్కియా రాజును లొంగిపోయేలా చేయడానికి తన అధికారుల్ని, పెద్ద సైన్యాన్ని పంపించాడు. (2 రాజు. 18:17-25) ఆ అధికారుల్ని కలవడానికి హిజ్కియా ఎల్యాకీమును, మరో ఇద్దర్ని పంపించాడు. ఆ ఇద్దర్లో ఒకరు షెబ్నా, అప్పటికి ఆయన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. దీన్నిబట్టి షెబ్నా తన నియామకాన్ని కోల్పోయినందుకు నిరుత్సాహపడలేదని, వినయంగా ఉండడం నేర్చుకున్నాడని అర్థమౌతుంది. ఆయన తక్కువస్థాయి పనిని కూడా చేయడానికి ఇష్టపడ్డాడు. మనం షెబ్నా నుండి మూడు పాఠాలు నేర్చుకోవచ్చు.

9-11. (ఎ) షెబ్నా నుండి మనం ఏ ప్రాముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు? (బి) యెహోవా షెబ్నాతో వ్యవహరించిన తీరు మీకెలాంటి ప్రోత్సాహాన్ని ఇస్తుంది?

9 మొట్టమొదటిగా షెబ్నా తన అధికారాన్ని కోల్పోవడం బట్టి, ‘నాశనానికి ముందు గర్వం నడుస్తుందనే’ మాట నిజమని మనం నేర్చుకోవచ్చు. (సామె. 16:18) సంఘంలో మనకు ప్రత్యేక సేవావకాశాలు ఉన్నప్పుడు ఇతరులు మనల్ని ప్రాముఖ్యమైన వాళ్లుగా ఎంచవచ్చు. అలాంటప్పుడు మనం వినయంగా ఉంటామా? మనకున్న సామర్థ్యాలు, సాధించిన విజయాలు యెహోవా వల్లే కలిగాయని గుర్తిస్తామా? (1 కొరిం. 4:7) అపొస్తలుడైన పౌలు ఇలా హెచ్చరించాడు, “ఎవ్వరూ తన గురించి తాను ఎక్కువగా అంచనా వేసుకోవద్దు. బదులుగా దేవుడు ప్రతీ ఒక్కరికి పంచి ఇచ్చిన విశ్వాసానికి తగిన వివేచన మీకుందని చూపించేలా అంచనా వేసుకోవాలి.”—రోమా. 12:3.

10 రెండవదిగా, యెహోవా షెబ్నాను గద్దించడం బట్టి, ఆయన మారతాడనే నమ్మకం యెహోవాకు ఉందని అర్థమౌతుంది. (సామె. 3:11, 12) ఏదైనా ప్రత్యేక నియామకం కోల్పోయిన వాళ్లకు ఇది ఒక మంచి పాఠం. అలాంటివాళ్లు కోపాన్ని పెంచుకొని చిన్నబుచ్చుకునే బదులు యెహోవా సేవలో చేయగలినదంతా చేయవచ్చు. అంతేకాదు తమకు దొరికిన క్రమశిక్షణను యెహోవా ప్రేమకు నిదర్శనంగా చూడాలి. వినయంగా ఉన్నవాళ్లకు యెహోవా తగిన సమయంలో ప్రతిఫలమిస్తాడని గుర్తుంచుకోండి. (1 పేతురు 5:6, 7 చదవండి.) వినయంగా, యెహోవా చేతిలో మెత్తని మట్టిలా ఉంటే ఆయన ప్రేమతో ఇచ్చే క్రమశిక్షణ బట్టి మనం మంచి వ్యక్తులుగా తయారౌతాం.

11 మూడవదిగా, యెహోవా షెబ్నాతో వ్యవహరించిన తీరును బట్టి మనం ఓ విలువైన పాఠం నేర్చుకోవచ్చు. ఏమిటది? యెహోవా ఇచ్చే క్రమశిక్షణ బట్టి ఆయన పాపాన్ని అసహ్యించుకుంటాడనీ, పాపం చేసిన వ్యక్తిపై ఆయనకు ప్రేమ ఉందనీ అర్థంచేసుకోవచ్చు. అవును, ఆయన మనుషుల్లో ఉన్న మంచినే చూస్తాడు. మీరు తండ్రి లేదా సంఘపెద్ద అయితే, యెహోవా క్రమశిక్షణ ఇచ్చే విధానాన్ని అనుకరిస్తారా?—యూదా 22, 23.

12-14. (ఎ) యెహోవా నుండి వచ్చే క్రమశిక్షణకు కొంతమంది ఎలా ప్రతిస్పందిస్తారు? (బి) ఒక సహోదరుడు తన ఆలోచన మార్చుకోవడానికి బైబిలు ఎలా సహాయం చేసింది? దాని ఫలితమేమిటి?

12 విచారకరంగా, క్రమశిక్షణ ఇచ్చినప్పుడు కొంతమంది ఎంత బాధపడతారంటే యెహోవాకు, సంఘానికి దూరమైపోతారు. (హెబ్రీ. 3:12, 13) మరి అలాంటివాళ్లకు ఎవ్వరూ సహాయం చేయలేరా? తప్పకుండా చేయగలరు. గ్రేయామ్‌ అనే సహోదరుని ఉదాహరణ పరిశీలించండి. సంఘం నుండి బహిష్కరించబడిన ఆయన, కొంతకాలం తర్వాత తిరిగి సంఘంలోకి చేర్చుకోబడ్డాడు. కానీ ఆ తర్వాత ప్రీచింగ్‌కి, మీటింగ్స్‌కి వెళ్లడం ఆపేశాడు. కొన్నేళ్ల తర్వాత ఒక సంఘపెద్ద గ్రేయామ్‌తో స్నేహం చేయడానికి ప్రయత్నించాడు, తనకు బైబిలు స్టడీ చేయమని గ్రేయామ్‌ ఆ సంఘపెద్దను అడిగాడు.

13 ఆ సంఘపెద్ద ఇలా గుర్తుచేసుకుంటున్నాడు, “గ్రేయామ్‌ గర్వంగా ప్రవర్తించేవాడు. తనను బహిష్కరించాలనే నిర్ణయం తీసుకున్న సంఘపెద్దల్ని విమర్శించేవాడు. కాబట్టి కొన్ని వారాల వరకు గర్వం గురించి, దానివల్ల వచ్చే చెడు పర్యవసానాల గురించి లేఖనాలు ఏమి చెప్తున్నాయో ఆయనతో చర్చించాను. గ్రేయామ్‌ మెల్లమెల్లగా దేవుని వాక్యమనే అద్దంలో తనను తాను చూసుకోవడం మొదలుపెట్టాడు, తనలో చాలా మార్పులు చేసుకోవాలని అర్థంచేసుకున్నాడు. దానివల్ల ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి! గర్వం అనే ‘దూలం’ వల్ల విషయాల్ని సరిగ్గా చూడలేకపోయాడని, ఇతరుల్ని విమర్శించే అలవాటే ఆయనకున్న సమస్య అని గుర్తించి వెంటనే మార్పులు చేసుకున్నాడు. క్రమంగా మీటింగ్స్‌కు రావడం, బైబిల్ని లోతుగా అధ్యయనం చేయడం, ప్రతీరోజు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఓ తండ్రిగా తనకున్న లేఖనాధారిత బాధ్యతల్ని నిర్వర్తించడం మొదలుపెట్టాడు. అది చూసి ఆయన భార్యాపిల్లలు ఎంతో సంతోషించారు.”—లూకా 6:41, 42; యాకో. 1:23-25.

14 ఆ సంఘపెద్ద ఇంకా ఇలా అన్నాడు, “ఒకరోజు గ్రేయామ్‌ నా హృదయాన్ని తాకే ఈ మాటలు చెప్పాడు, ‘నేను ఎన్నో ఏళ్ల క్రితమే సత్యం తెలుసుకున్నాను, ఒక పయినీరుగా కూడా సేవచేశాను. కానీ యెహోవాను ప్రేమిస్తున్నానని ఇప్పుడు మాత్రమే మనస్ఫూర్తిగా చెప్పగలను.’” కొంతకాలానికే, గ్రేయామ్‌ మీటింగ్స్‌లో మైక్‌ రోవింగ్‌ చేసే నియామకాన్ని పొందాడు, ఆయన దాన్ని చేయడానికి చాలా సంతోషించాడు. “ఒక వ్యక్తి దేవుని ముందు తనను తాను తగ్గించుకుని ఆయనిచ్చే క్రమశిక్షణను అంగీకరిస్తే, చెప్పలేనన్ని దీవెనలు దొరుకుతాయని గ్రేయామ్‌ ఉదాహరణ నాకు నేర్పించింది” అని ఆ సంఘపెద్ద అన్నాడు.

ఇతరులకు క్రమశిక్షణ ఇస్తున్నప్పుడు యెహోవాను, యేసుక్రీస్తును అనుకరించండి

15. మనమిచ్చే క్రమశిక్షణను ఇతరులు అంగీకరించాలంటే ఏమి చేయాలి?

15 మనం మంచి బోధకులు అవ్వాలంటే, ముందు మంచి విద్యార్థులుగా ఉండాలి. (1 తిమో. 4:15, 16) అదేవిధంగా ఇతరులకు క్రమశిక్షణ ఇవ్వాల్సిన బాధ్యతల్లో ఉన్నవాళ్లు, ముందుగా యెహోవా తమకిచ్చే నిర్దేశానికి వినయంగా లోబడాలి. మీరు వినయంగా ఉండడాన్ని ఇతరులు గమనించినప్పుడు మిమ్మల్ని గౌరవిస్తారు, మీరిచ్చే ఉపదేశాన్ని లేదా సలహాను సులభంగా అంగీకరిస్తారు. ఈ విషయంలో యేసు ఉంచిన ఆదర్శం నుండి ఎంతో నేర్చుకోవచ్చు.

16. క్రమశిక్షణ ఇచ్చే విషయంలో, బోధించే విషయంలో యేసు నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

16 యేసు తన తండ్రికి అన్నిసందర్భాల్లో లోబడ్డాడు. లోబడడం కష్టమైన సందర్భాల్లో కూడా ఆయన అలా చేశాడు. (మత్త. 26:39) తనకున్న జ్ఞానం, తన బోధలు అన్నీ తండ్రి నుండే వచ్చాయని యేసు చెప్పాడు. (యోహా. 5:19, 30) యేసు వినయాన్ని, లోబడే స్వభావాన్ని కలిగివుండడం వల్లే దయగల బోధకునిగా పేరు తెచ్చుకోగలిగాడు. ప్రజలు ఆయనతో ఉండడానికి ఇష్టపడ్డారు. (లూకా 4:22 చదవండి.) నిరుత్సాహంలో ఉన్నవాళ్లకు, కృంగిపోయినవాళ్లకు యేసు దయగల మాటలు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చాయి. (మత్త. 12:20) అంతేకాదు తనకు కోపం వచ్చే సందర్భాల్లో కూడా అంటే తమలో ఎవరు గొప్పవాళ్లని అపొస్తలులు వాదించుకున్నప్పుడు కూడా యేసు దయగా, ప్రేమగా వాళ్లను సరిదిద్దాడు.—మార్కు 9:33-37; లూకా 22:24-27.

17. సంఘాన్ని చక్కగా సంరక్షించడానికి పెద్దలకు ఏ లక్షణాలు సహాయం చేస్తాయి?

17 లేఖనాధారంగా క్రమశిక్షణ ఇస్తున్నప్పుడు సంఘపెద్దలు యేసుక్రీస్తును అనుకరించాలి. అలాచేస్తే తమ జీవితంలో యెహోవా అలాగే యేసు ఇచ్చే నిర్దేశాన్ని పాటించాలని కోరుకుంటున్నట్లు పెద్దలు చూపిస్తారు. అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు, “పర్యవేక్షకులుగా సేవచేస్తూ, మీ సంరక్షణలో ఉన్న దేవుని మందను కాయండి. బలవంతంగా కాకుండా దేవుని ముందు ఇష్టపూర్వకంగా ఆ పని చేయండి; అక్రమ లాభం మీద ప్రేమతో కాకుండా, ఉత్సాహంతో కాయండి; దేవుని సొత్తుగా ఉన్నవాళ్ల మీద పెత్తనం చెలాయించకుండా, దేవుని మందకు ఆదర్శంగా ఉంటూ దాన్ని కాయండి.” (1 పేతు. 5:2-4) దేవునికి, క్రీస్తుకు సంతోషంగా లోబడే పెద్దలు ఎంతో ప్రయోజనం పొందుతారు, వాళ్ల సంరక్షణలో ఉన్నవాళ్లు కూడా ప్రయోజనం పొందుతారు.—యెష. 32:1, 2, 17, 18.

18. (ఎ) తల్లిదండ్రులు ఏమి చేయాలని యెహోవా ఆశిస్తున్నాడు? (బి) వాళ్లకు యెహోవా ఎలా సహాయం చేస్తాడు?

18 మరి కుటుంబంలో ఇచ్చే క్రమశిక్షణ సంగతేంటి? కుటుంబ యజమానులకు యెహోవా ఇలా చెప్తున్నాడు, “తండ్రులారా, మీ పిల్లలకు కోపం తెప్పించకండి; యెహోవా నిర్దేశాల ప్రకారం క్రమశిక్షణను ఇస్తూ, ఉపదేశాన్ని ఇస్తూ వాళ్లను పెంచండి.” (ఎఫె. 6:4) పిల్లలకు క్రమశిక్షణ అవసరమా? సామెతలు 19:18⁠లో ఇలా చదువుతాం, “బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము అయితే వాడు చావవలెనని కోరవద్దు.” పిల్లలకు క్రమశిక్షణనిచ్చే బాధ్యతను యెహోవా తల్లిదండ్రులకు ఇచ్చాడు. ఒకవేళ వాళ్లు దాన్ని చేయకపోతే యెహోవాకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. (1 సమూ. 3:12-14) కానీ తల్లిదండ్రులు సహాయం కోసం ప్రార్థించినప్పుడు, బైబిలు నిర్దేశంపై, పవిత్రశక్తిపై ఆధారపడినప్పుడు వాళ్లకు కావాల్సిన తెలివిని, బలాన్ని యెహోవా ఇస్తాడు.—యాకోబు 1:5 చదవండి.

శాశ్వతకాలం సమాధానంగా జీవించడం నేర్చుకోండి

19, 20. (ఎ) దేవుడిచ్చే క్రమశిక్షణ స్వీకరిస్తే ఎలాంటి దీవెనలు వస్తాయి? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

19 దేవుడిచ్చే క్రమశిక్షణను స్వీకరిస్తే, యెహోవా అలాగే యేసుక్రీస్తు క్రమశిక్షణ ఇచ్చే విధానాన్ని అనుకరిస్తే మనం చెప్పలేనన్ని దీవెనలు పొందుతాం. మన కుటుంబాలు, సంఘాలు సమాధానంగా ఉంటాయి. అంతేకాదు ప్రతీఒక్కరు ప్రేమను పొందుతారు, విలువైనవాళ్లుగా ఎంచబడతారు, సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారు. భవిష్యత్తులో మనం అనుభవించబోయే సమాధానం, సంతోషానికి ఇదొక శాంపిల్‌ మాత్రమే. (కీర్త. 72:7) తండ్రైన యెహోవా సంరక్షణలో మనం ఒక కుటుంబంగా సమాధానంగా, ఐక్యంగా శాశ్వతకాలం జీవించడానికి ఆయనిచ్చే క్రమశిక్షణ సహాయం చేస్తుంది. (యెషయా 11:9 చదవండి.) ఈ విషయాన్ని గుర్తుంచుకున్నప్పుడు, క్రమశిక్షణ అనేది దేవుడు మనపట్ల చూపించే ప్రేమకు చక్కని నిదర్శనమని అర్థంచేసుకుంటాం.

20 కుటుంబంలో అలాగే సంఘంలో దొరికే క్రమశిక్షణ గురించి మరిన్ని విషయాలు తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. మనల్ని మనం క్రమశిక్షణలో ఎలా పెట్టుకోవచ్చో చర్చిస్తాం. క్రమశిక్షణ కన్నా ఎక్కువ బాధ కలిగించే పర్యవసానాలకు మనమెలా దూరంగా ఉండవచ్చో కూడా పరిశీలిస్తాం.