కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తల్లిదండ్రులారా, మీ పిల్లలు బాప్తిస్మానికి ప్రగతి సాధించేలా సహాయం చేస్తున్నారా?

తల్లిదండ్రులారా, మీ పిల్లలు బాప్తిస్మానికి ప్రగతి సాధించేలా సహాయం చేస్తున్నారా?

“నువ్విప్పుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? లేచి బాప్తిస్మం తీసుకో.” అపొ. 22:16.

పాటలు: 51, 135

1. తమ పిల్లలు బాప్తిస్మం తీసుకునే ముందు తల్లిదండ్రులు ఏ విషయం తెలుసుకోవాలి?

“బాప్తిస్మం తీసుకుంటానని కొన్ని నెలలుగా అమ్మానాన్నలకు చెప్తున్నాను. దానిగురించి వాళ్లు నాతో చాలాసార్లు మాట్లాడారు. ఆ నిర్ణయం ప్రాముఖ్యత నాకు అర్థమైందో లేదో వాళ్లు తెలుసుకోవాలనుకున్నారు. చివరికి 1934, డిసెంబరు 31న నేను బాప్తిస్మం తీసుకున్నాను” అని బ్లాసమ్‌ బ్రాంట్‌ తన అనుభవాన్ని వివరించింది. నేడు కూడా, తమ పిల్లలు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి తల్లిదండ్రులు సహాయం చేస్తున్నారు. ఒకవేళ ఏ కారణం లేకుండా బాప్తిస్మాన్ని వాయిదా వేస్తుంటే యెహోవాతో పిల్లలకున్న సంబంధం దెబ్బతింటుంది. (యాకో. 4:17) అయితే, తమ పిల్లలు క్రీస్తు శిష్యులు అవ్వడానికి నిజంగా సిద్ధంగా ఉన్నారో లేదో బాప్తిస్మానికి ముందే తల్లిదండ్రులు తెలుసుకోవాలి.

2. (ఎ) కొంతమంది ప్రాంతీయ పర్యవేక్షకులు ఏ సమస్యను గుర్తించారు? (బి) ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

2 చాలామంది యౌవనస్థులు సత్యంలో పెరిగినప్పటికీ ఇంకా బాప్తిస్మం తీసుకోలేదని కొంతమంది ప్రాంతీయ పర్యవేక్షకులు గుర్తించారు. చాలావరకు అలాంటి యౌవనులు మీటింగ్స్‌కి వెళ్తారు, ప్రీచింగ్‌ చేస్తారు, యెహోవాసాక్షులమని భావిస్తారు. కానీ వాళ్లు యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకోవట్లేదు. ఎందుకు? ఎందుకంటే వాళ్లు బాప్తిస్మం తీసుకునే సమయం ఇంకా రాలేదని వాళ్ల తల్లిదండ్రులు అనుకుంటున్నారు. బాప్తిస్మం తీసుకోమని పిల్లల్ని ప్రోత్సహించడానికి తల్లిదండ్రులు ఎందుకు వెనకాడతారో తెలియజేసే నాలుగు పరిస్థితుల గురించి ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

నా పిల్లలకు బాప్తిస్మం తీసుకునే వయసు ఉందా?

3. బ్లాసమ్‌ వాళ్ల అమ్మానాన్నలు దేనిగురించి ఆందోళనపడ్డారు?

3 మొదటి పేరాలో మనం చదివిన బ్లాసమ్‌కు బాప్తిస్మం తీసుకోవడమంటే ఏమిటో, అదెంత ప్రాముఖ్యమైన నిర్ణయమో అర్థంచేసుకునేంత వయసు ఉందో లేదోనని ఆమె అమ్మానాన్నలు ఆందోళనపడ్డారు. యెహోవాకు సమర్పించుకునేంత వయసు తమ పిల్లలకు ఉందో లేదో తల్లిదండ్రులు ఎలా తెలుసుకోవచ్చు?

4. మత్తయి 28:19, 20 వచనాల్లోని యేసు ఆజ్ఞ నేడు తల్లిదండ్రులకు ఎలా ఉపయోగపడుతుంది?

4 మత్తయి 28:19, 20 చదవండి. ఫలానా వయసులోనే బాప్తిస్మం తీసుకోవాలని బైబిలు ఖచ్చితంగా చెప్పట్లేదు. కానీ శిష్యుల్ని చేయడమంటే ఏమిటో జాగ్రత్తగా ఆలోచించడం వల్ల తల్లిదండ్రులు ప్రయోజనం పొందవచ్చు. మత్తయి 28:19⁠లో “శిష్యుల్ని చేయండి” అని అనువదించిన గ్రీకు పదానికి, ఒకర్ని విద్యార్థిగా లేదా శిష్యునిగా చేయాలనే లక్ష్యంతో బోధించడమని అర్థం. శిష్యుడు అంటే యేసు బోధల్ని అర్థంచేసుకుని ఆయన చెప్పినవాటిని పాటించాలనుకునే వ్యక్తి. కాబట్టి క్రీస్తు శిష్యుల్ని చేయాలనే లక్ష్యంతో తల్లిదండ్రులు తమ పిల్లలు పుట్టినప్పటి నుండే బోధించాలి. నిజమే పసిపిల్లలు బాప్తిస్మం తీసుకోవడానికి అర్హులు కాదు. అయినప్పటికీ బైబిలు చెప్తున్నట్లు వాళ్లు లేఖన సత్యాల్ని అర్థంచేసుకుని వాటిని ప్రేమించగలరు.

5, 6. (ఎ) తిమోతి గురించి పౌలు ఏమి చెప్పాడు? (బి) తెలివైన తల్లిదండ్రులు ఏమి చేస్తారు?

5 యెహోవా సేవచేయాలని చిన్నవయసులోనే నిర్ణయించుకున్న వాళ్లలో శిష్యుడైన తిమోతి ఉన్నాడు. తిమోతి “పసికందుగా ఉన్నప్పటి నుండే” దేవుని వాక్యంలోని సత్యాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టాడని పౌలు చెప్పాడు. తిమోతి వాళ్ల నాన్న యెహోవా ఆరాధకుడు కాదు. కానీ అమ్మ, అమ్మమ్మ సహాయంతో ఆయన దేవుని వాక్యాన్ని ప్రేమించగలిగాడు. ఫలితంగా బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకున్నాడు. (2 తిమో. 1:5; 3:14, 15) ఆయనకు దాదాపు 20 ఏళ్లు ఉన్నప్పుడు, సంఘంలో ప్రత్యేక నియామకాలు పొందడానికి కూడా అర్హత సాధించాడు.—అపొ. 16:1-3.

6 అయితే పిల్లలందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కో వయసులో పరిణతి సాధిస్తారు. కొంతమంది చిన్నవయసులోనే సత్యాన్ని అర్థంచేసుకుంటారు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, బాప్తిస్మం తీసుకోవాలనుకుంటారు. కొంతమంది మాత్రం ఇంకాస్త వయసు పెరిగేదాకా బాప్తిస్మం తీసుకోకపోవచ్చు. బాప్తిస్మం తీసుకోమని తమ పిల్లల్ని తెలివైన తల్లిదండ్రులు బలవంతం చేయరు. బదులుగా వాళ్లవాళ్ల సామర్థ్యాన్ని బట్టి ప్రగతి సాధించేలా సహాయం చేస్తారు. పిల్లలు సామెతలు 27:11⁠లోని మాటల్ని పాటిస్తే తల్లిదండ్రులు సంతోషిస్తారు. (చదవండి.) కానీ తమ పిల్లలు క్రీస్తు శిష్యులయ్యేందుకు సహాయం చేయడమే తమ లక్ష్యమని తల్లిదండ్రులు మర్చిపోకూడదు. దాన్ని మనసులో ఉంచుకుని వాళ్లు ఇలా ప్రశ్నించుకోవాలి, ‘దేవునికి సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకునేంత జ్ఞానం నా పిల్లలకు ఉందా?’

నా పిల్లలకు బాప్తిస్మం తీసుకునేంత జ్ఞానం ఉందా?

7. బాప్తిస్మం తీసుకోవాలంటే బైబిలు బోధలకు సంబంధించిన ప్రతీ చిన్న విషయం తెలిసుండాలా? వివరించండి.

7 తమ పిల్లలు సత్యం గురించిన సరైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. దేవునికి సమర్పించుకునేలా ఆ జ్ఞానమే పిల్లలకు సహాయం చేస్తుంది. అంతమాత్రాన సమర్పణకు, బాప్తిస్మానికి ముందే బైబిలు బోధలకు సంబంధించిన ప్రతీ చిన్న విషయం వాళ్లకు తెలుసుండాలని కాదు. క్రీస్తు శిష్యులందరూ బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా నేర్చుకుంటూనే ఉండాలి. (కొలొస్సయులు 1:9, 10 చదవండి.) అయితే బాప్తిస్మం తీసుకోవడానికి ఎంత జ్ఞానం ఉండాలి?

8, 9. ఫిలిప్పీలోని జైలు అధికారికి ఏమి జరిగింది? ఆ అనుభవం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

8 ప్రాచీన కాలంలోని ఒక కుటుంబానికి ఎదురైన అనుభవం నేటి తల్లిదండ్రులకు సహాయం చేస్తుంది. (అపొ. 16:25-33) క్రీ.శ. 50⁠లో రెండో మిషనరీ యాత్రలో భాగంగా పౌలు ఫిలిప్పీ నగరానికి వెళ్లాడు. అక్కడి ప్రజలు పౌలు సీలలపై తప్పుడు ఆరోపణలు చేసి, బంధించి, జైళ్లో వేశారు. ఆ రోజు రాత్రి పెద్ద భూకంపం వచ్చి జైలు తలుపులన్నీ తెరుచుకున్నాయి. ఖైదీలందరూ పారిపోయారనుకున్న జైలు అధికారి ఆత్మహత్య చేసుకోబోయాడు. ఇంతలో పౌలు ఆయన్ని ఆపాడు. ఆ తర్వాత పౌలు సీలలు ఆయనకూ, ఆయన కుటుంబానికీ యేసు గురించిన సత్యాన్ని బోధించారు. వాళ్లు దాన్ని అర్థంచేసుకుని, యేసుకు లోబడడం ఎంత ప్రాముఖ్యమో గ్రహించారు. కాబట్టి వెంటనే బాప్తిస్మం తీసుకున్నారు. ఆ అనుభవం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

9 ఆ జైలు అధికారి బహుశా మాజీ రోమా సైనికుడు అయ్యుంటాడు. ఆయనకు దేవుని వాక్యంలోని విషయాలు తెలీదు కాబట్టి క్రైస్తవునిగా మారాలంటే బైబిల్లోని ప్రాథమిక బోధల్ని ఆయన తెలుసుకోవాలి. అంతేకాదు తన సేవకుల నుండి యెహోవా ఏమి కోరుతున్నాడో అర్థంచేసుకోవాలి, యేసు బోధల్ని పాటించాలని కోరుకోవాలి. కొద్ది సమయంలో నేర్చుకున్న విషయాలు బాప్తిస్మం తీసుకునేలా ఆయన్ను ప్రోత్సహించాయి. అయితే బాప్తిస్మం అయ్యాక కూడా ఆయన మరిన్ని విషయాలు నేర్చుకుని ఉంటాడు. కాబట్టి మీ పిల్లలు యెహోవా మీదున్న ప్రేమతో, ఆయనకు లోబడాలనే కోరికతో బాప్తిస్మం తీసుకుంటామని మీతో చెప్తే మీరేమి చేయవచ్చు? వాళ్లను సంఘపెద్దలతో మాట్లాడమని చెప్పండి, మీ పిల్లలకు బాప్తిస్మం తీసుకునే అర్హత ఉందో లేదో వాళ్లు నిర్ణయిస్తారు. * బాప్తిస్మం తీసుకున్న మిగతా క్రైస్తవుల్లాగే, వాళ్లు కూడా తమ జీవితాంతం యెహోవా గురించి మరిన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటారు.—రోమా. 11:33, 34.

నా పిల్లలకు ఏ విద్య శ్రేష్ఠమైనది?

10, 11. (ఎ) కొంతమంది తల్లిదండ్రులు ఎలా భావిస్తారు? (బి) మీ పిల్లల్ని ఏది కాపాడుతుంది?

10 తమ పిల్లలు పైచదువులు చదివి, మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాకే బాప్తిస్మం తీసుకోవడం మంచిదని కొంతమంది తల్లిదండ్రులు భావిస్తారు. అది మంచి ఉద్దేశమే కావచ్చు, కాకపోతే అలాంటి తల్లిదండ్రులు ఇలా ప్రశ్నించుకోవాలి, ‘అవి జీవితంలో నిజమైన విజయం సాధించడానికి నా పిల్లలకు సహాయం చేస్తాయా? నా ఆలోచన, బైబిలు నుండి మేం నేర్చుకున్న వాటికి అనుగుణంగా ఉందా? మా జీవితాల్ని ఎలా ఉపయోగించాలని యెహోవా కోరుకుంటున్నాడు?’—ప్రసంగి 12:1 చదవండి.

11 మనందరం గుర్తుంచుకోవాల్సిన ప్రాము ఖ్యమైన విషయం ఒకటుంది. ఈ లోకం అలాగే దానిలో ఉన్నవన్నీ యెహోవా ఇష్టాలకు, ఆయన ఆలోచనలకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. (యాకో. 4:7, 8; 1 యోహా. 2:15-17; 5:19) మీ పిల్లలకు యెహోవాతో ఉండే దగ్గరి సంబంధమే వాళ్లను సాతాను నుండి, దుష్టలోకం నుండి, లోకంలోని చెడు ఆలోచనల నుండి కాపాడుతుంది. ఒకవేళ తల్లిదండ్రులు పైచదువులకు, మంచి ఉద్యోగాలకు మొదటి స్థానమిస్తే యెహోవాతో ఉన్న సంబంధం కన్నా ఈ లోకంలో ఉన్నవే ముఖ్యమైనవని పిల్లలు అనుకోవచ్చు. అలాంటి ఆలోచన ప్రమాదకరమైనది. ఏది నిజమైన సంతోషాన్నిస్తుందో మీ పిల్లలకు నేర్పించే అవకాశాన్ని లోకానికి ఇవ్వాలని ప్రేమగల తల్లిదండ్రులు అనుకుంటారా? వాస్తవమేమిటంటే, యెహోవాకు మొదటిస్థానం ఇచ్చినప్పుడే నిజమైన విజయాన్ని, ఆనందాన్ని సొంతం చేసుకుంటాం.—కీర్తన 1:2, 3 చదవండి.

నా పిల్లలు ఘోరమైన తప్పుచేస్తే?

12. కొంతకాలంపాటు తమ పిల్లలు బాప్తిస్మం తీసుకోకుండా ఉండడమే మంచిదని కొందరు తల్లిదండ్రులు ఎందుకు భావిస్తారు?

12 బాప్తిస్మం తీసుకోమని తన కూతుర్ని ఎందుకు ప్రోత్సహించలేదో వివరిస్తూ ఒక తల్లి ఇలా చెప్పింది, “నేను తనను ప్రోత్సహించకపోవడానికి ముఖ్యమైన కారణం బహిష్కరణ ఏర్పాటని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను.” కొంతమంది తల్లిదండ్రులు కూడా ఆ సహోదరిలాగే ఆలోచిస్తారు. మూర్ఖంగా అనిపించే తప్పులు చేసే వయసు దాటేంత వరకు తమ పిల్లలు బాప్తిస్మం తీసుకోకుండా ఉండడమే మంచిదని వాళ్లు భావిస్తారు. (ఆది. 8:21; సామె. 22:15) పిల్లలు బాప్తిస్మం తీసుకోకపోతే వాళ్లను బహిష్కరించరని ఆ తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అలా ఆలోచించడం ఎందుకు సరైనది కాదు?—యాకో. 1:22.

13. బాప్తిస్మం తీసుకోకపోతే యెహోవాకు లెక్క అప్పజెప్పాల్సిన అవసరం లేదా? వివరించండి.

13 నిజమే, పిల్లలు యెహోవాకు సమర్పించుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు వాళ్లు బాప్తిస్మం తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుకోరు. కానీ బాప్తిస్మం తీసుకోనంత వరకు, పిల్లలు ఏ తప్పు చేసినా వాళ్లు యెహోవాకు లెక్క అప్పజెప్పాల్సిన అవసరం లేదని అనుకోవడం పొరపాటే. పిల్లలకు తప్పొప్పుల గురించి యెహోవా చెప్పే విషయాలు తెలిసిన రోజు నుండే ఆయనకు లెక్క అప్పజెప్పాల్సిన అవసరం ఉంటుంది. (యాకోబు 4:17 చదవండి.) తెలివైన తల్లిదండ్రులు తమ పిల్లల్ని బాప్తిస్మం తీసుకోనివ్వకుండా నిరుత్సాహపర్చరు. బదులుగా తమలాగే యెహోవా ప్రేమించేవాటిని ప్రేమించమని, ఆయన ద్వేషించేవాటిని ద్వేషించమని చిన్నప్పటినుండి నేర్పిస్తారు. (లూకా 6:40) మీ పిల్లలకు యెహోవాపై ప్రేమ ఉంటే ఆయన దృష్టిలో సరైనదాన్ని చేయాలని కోరుకుంటారు. కాబట్టి ఘోరమైన తప్పులు చేయకుండా ఆ ప్రేమే వాళ్లను కాపాడుతుంది.—యెష. 35:8.

ఇతరులు సహాయం చేయవచ్చు

14. సంఘపెద్దలు తల్లిదండ్రులకు ఎలా సహాయపడవచ్చు?

14 ఆధ్యాత్మిక లక్ష్యాల వల్ల వచ్చే ప్రయోజనాల గురించి పిల్లలకు చెప్పడం ద్వారా సంఘపెద్దలు తల్లిదండ్రులకు సహాయపడవచ్చు. ఒక సహోదరి, ఆమెకు ఆరేళ్లు ఉన్నప్పుడు సహోదరుడు రస్సెల్‌ తనతో మాట్లాడిన విషయాల గురించి ఇలా చెప్పింది, “నా ఆధ్యాత్మిక లక్ష్యాల గురించి ఆయన నాతో 15 నిమిషాలు మాట్లాడారు.” దానివల్ల వచ్చిన ఫలితం? కొంతకాలానికి ఆమె పయినీరు సేవ మొదలుపెట్టి, 70 కన్నా ఎక్కువ ఏళ్లపాటు దాన్ని కొనసాగించింది. సానుకూలమైన, ప్రోత్సాహకరమైన మాటలు ఒక వ్యక్తి జీవితంపై ప్రభావం చూపిస్తాయనేది ఎంత వాస్తవమో కదా! (సామె. 25:11) రాజ్యమందిరానికి సంబంధించిన పనుల్లో సహాయం చేయడానికి తల్లిదండ్రుల్ని, పిల్లల్ని సంఘపెద్దలు ఆహ్వానించవచ్చు. పిల్లల వయసుకు, సామర్థ్యానికి తగ్గ పనులు వాళ్లతో చేయించవచ్చు.

15. సంఘంలోని ఇతరులు పిల్లలకు ఎలా సహాయపడవచ్చు?

15 మరి సంఘంలోని ఇతరులు ఎలా సహాయపడవచ్చు? వాళ్లు పిల్లలపై కొంతమేరకు శ్రద్ధ చూపించవచ్చు. ఉదాహరణకు, వాళ్లు ఆధ్యాత్మికంగా ఎంత ప్రగతి సాధిస్తున్నారో గమనిస్తూ ఉండవచ్చు. పిల్లలు ఎవరైనా మీటింగ్‌లో మంచి వ్యాఖ్యానం ఇచ్చారా? వారం మధ్యలో జరిగే మీటింగ్‌లో ఏదైనా నియామకం చేశారా? స్కూల్లో ఎవరికైనా తమ నమ్మకాల గురించి చెప్పారా? తప్పు చేయాలనే శోధనను ఎదిరించారా? ఒకవేళ వీటిలో ఏదైనా చేసివుంటే, వాళ్లను మెచ్చుకోండి. మీటింగ్‌కి ముందు, అలాగే తర్వాత పిల్లలతో మాట్లాడాలనే లక్ష్యాన్ని మనం పెట్టుకోవచ్చు. అలాచేస్తే, తాము కూడా “మహాసమాజములో” భాగమని పిల్లలు భావిస్తారు.—కీర్త. 35:18.

బాప్తిస్మానికి ప్రగతి సాధించేలా మీ పిల్లలకు సహాయం చేయండి

16, 17. (ఎ) పిల్లలు బాప్తిస్మం తీసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) ఏ ఆనందం కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తారు? (ప్రారంభ చిత్రం చూడండి.)

16 తల్లిదండ్రులకు ఉన్న గొప్ప బాధ్యతల్లో ఒకటేమిటంటే, తమ పిల్లల్లో యెహోవాపట్ల ప్రేమ పెంచడం. (ఎఫె. 6:4; కీర్త. 127:3) ఇశ్రాయేలీయులు యెహోవాకు సమర్పిత జనాంగం కాబట్టి వాళ్ల పిల్లలు పుట్టుకతోనే ఆయనకు సమర్పిత సేవకులయ్యేవాళ్లు. కానీ మనకాలంలో అలా కాదు. తల్లిదండ్రులు యెహోవాను, సత్యాన్ని ప్రేమించినంత మాత్రాన పిల్లలు కూడా అలానే ఉంటారని చెప్పలేం. కాబట్టి బిడ్డ పుట్టిన మొదటి రోజు నుండే, వాళ్లు యేసు శిష్యులయ్యి, దేవునికి సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకునేలా సహాయం చేయాలని తల్లిదండ్రులు లక్ష్యం పెట్టుకోవాలి. అంతకన్నా ప్రాముఖ్యమైనది ఏముంటుంది! మహాశ్రమ సమయంలో కాపాడబడాలంటే యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకుని, నమ్మకంగా సేవచేయాలి.—మత్త. 24:13.

తమ పిల్లలు యేసు శిష్యులవ్వడానికి సహాయం చేయాలనే లక్ష్యం తల్లిదండ్రులకు ఉండాలి (16, 17 పేరాలు చూడండి)

17 బ్లాసమ్‌ బ్రాంట్‌ బాప్తిస్మం తీసుకుంటానని చెప్పినప్పుడు, ఆమె నిజంగా సిద్ధంగా ఉందో లేదో ఆమె అమ్మానాన్నలు తెలుసుకోవాలనుకున్నారు. సిద్ధంగా ఉందని నమ్మకం కుదిరాక ఆమె నిర్ణయానికి వాళ్లు మద్దతిచ్చారు. తన బాప్తిస్మానికి ముందురోజు ఆమె నాన్న ఏమి చేశాడో వివరిస్తూ బ్లాసమ్‌ ఇలా చెప్పింది, “అందర్నీ మోకాళ్ల మీద ఉండమని చెప్పి, ఆయన ప్రార్థన చేశాడు. తన కూతురు దేవునికి సమర్పించుకోవాలని నిర్ణయించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని యెహోవాకు చెప్పాడు.” ఇది జరిగిన 60 కన్నా ఎక్కువ ఏళ్ల తర్వాత బ్లాసమ్‌ ఇలా చెప్పింది, “ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా, నేను మాత్రం ఆ రాత్రిని మర్చిపోలేను.” తల్లిదండ్రులారా, మీ పిల్లలు యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకోవడం చూసినప్పుడు మీకు కూడా ఆనందం, సంతృప్తి కలగాలని కోరుకుంటున్నాం.

^ పేరా 9 కావలికోట 1993, జనవరి సంచికలోని 24-27 పేజీల్లో ఉన్న సమాచారాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలతో చర్చించవచ్చు. అలాగే, మన రాజ్య పరిచర్య 2011, ఏప్రిల్‌ సంచికలోని 2వ పేజీలో ఉన్న “ప్రశ్నాభాగం” చూడండి.