కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బాప్తిస్మం—ఒక ప్రాముఖ్యమైన చర్య

బాప్తిస్మం—ఒక ప్రాముఖ్యమైన చర్య

‘బాప్తిస్మం కూడా మిమ్మల్ని ఇప్పుడు రక్షిస్తోంది.’1 పేతు. 3:21.

పాటలు: 52, 41

1, 2. (ఎ) పిల్లలు బాప్తిస్మం తీసుకుంటామని చెప్పినప్పుడు కొంతమంది అమ్మానాన్నల మదిలో ఎలాంటి ప్రశ్నలు మెదులుతాయి? (బి) యెహోవాకు సమర్పించుకున్నారా అని బాప్తిస్మ అభ్యర్థులను ఎందుకు అడుగుతారు? (ప్రారంభ చిత్రం చూడండి.)

మారీయ అనే అమ్మాయి బాప్తిస్మ అభ్యర్థులతోపాటు నిలబడివుంది. తన అమ్మానాన్నలు ఆమె వైపు చూస్తున్నారు. ప్రసంగీకుడు బాప్తిస్మ అభ్యర్థుల్ని రెండు ప్రశ్నలు అడిగాడు. వాటికి మారీయ బిగ్గరగా, స్పష్టంగా జవాబిచ్చింది. ఆ తర్వాత ఆమె బాప్తిస్మం తీసుకుంది.

2 మారీయ యెహోవాకు సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకున్నందుకు ఆమె అమ్మానాన్నలు చాలా గర్వపడ్డారు. ఇదంతా జరగకముందు మారీయ అమ్మ కాస్త ఆందోళనపడింది. ఎందుకంటే ఆమె వీటిగురించి ఆలోచించింది, ‘బాప్తిస్మం తీసుకునేంత వయసు మారీయకు ఉందా? తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకోవడం ఎంత పెద్ద విషయమో తను నిజంగా అర్థంచేసుకుందా? తను బాప్తిస్మం తీసుకోవడానికి ఇంకొంతకాలం ఆగితే బాగుంటుందా?’ నిజమే, తమ పిల్లలు బాప్తిస్మం తీసుకుంటామని చెప్పినప్పుడు చాలామంది అమ్మానాన్నల మదిలో ఇలాంటి ప్రశ్నలే మెదులుతాయి. (ప్రసం. 5:5) అయితే యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవాలని అనుకోవడమే అన్నిటికన్నా ప్రాముఖ్యమైన నిర్ణయం.—“ మీరు యెహోవాకు సమర్పించుకున్నారా?” అనే బాక్సు చూడండి.

3, 4. (ఎ) పేతురు బాప్తిస్మం గురించి మాట్లాడుతున్నప్పుడు దేన్ని ప్రస్తావించాడు? (బి) ఎందుకు?

3 అపొస్తలుడైన పేతురు బాప్తిస్మం గురించి మాట్లాడుతూ, నోవహు ఓడ కట్టడాన్ని ప్రస్తావించాడు. పేతురు ఇలా చెప్పాడు, “దానికి పోలికగా ఉన్న బాప్తిస్మం కూడా . . . మిమ్మల్ని ఇప్పుడు రక్షిస్తోంది.” (1 పేతురు 3:20, 21 చదవండి.) నోవహు దేవుని ఇష్టం చేయాలని ఎంతగా కోరుకున్నాడో ఆయన కట్టిన ఓడను బట్టి అర్థమౌతుంది. యెహోవా అప్పగించిన పనిని నోవహు నమ్మకంగా పూర్తిచేశాడు. నోవహు విశ్వాసమే ఆయననూ, ఆయన కుటుంబాన్నీ జలప్రళయం నుండి కాపాడింది. ఇంతకీ పేతురు మనకు చెప్పాలనుకుంటున్న విషయమేమిటి?

4 ప్రజలు ఓడను చూసినప్పుడు, నోవహుకు దేవుని మీద విశ్వాసం ఉందని అర్థంచేసుకున్నారు. అదేవిధంగా ప్రజలు బాప్తిస్మ అభ్యర్థులను చూసినప్పుడు, పునరుత్థానం చేయబడిన క్రీస్తు మీద విశ్వాసంతో వాళ్లు దేవునికి సమర్పించుకున్నారని అర్థంచేసుకుంటారు. బాప్తిస్మం తీసుకున్నవాళ్లు నోవహులాగే దేవునికి లోబడతారు, ఆయనిచ్చిన పనిని చేస్తారు. యెహోవా జలప్రళయం నుండి నోవహును కాపాడినట్టే, ఈ దుష్టలోక నాశనం నుండి బాప్తిస్మం తీసుకున్న తన నమ్మకమైన సేవకులను కూడా కాపాడతాడు. (మార్కు 13:10; ప్రక. 7:9, 10) కాబట్టి మనం యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మం తీసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఒకవేళ ఎవరైనా ఆలస్యం చేస్తే, శాశ్వత జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

5. ఈ ఆర్టికల్‌లో మనం ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

5 బాప్తిస్మం ఎంత ప్రాముఖ్యమైన నిర్ణయమో ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే, ఈ ఆర్టికల్‌లో వీటిని పరిశీలిస్తాం: బాప్తిస్మం గురించి బైబిలు ఏమి చెప్తుంది? బాప్తిస్మం తీసుకోవడానికి ముందు ఒక వ్యక్తి ఏమి చేయాలి? మన పిల్లలకు, బైబిలు విద్యార్థులకు స్టడీ చేస్తున్నప్పుడు బాప్తిస్మం ప్రాముఖ్యతను ఎందుకు మనసులో ఉంచుకోవాలి?

బాప్తిస్మం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

6, 7. (ఎ) ప్రజలు యోహాను దగ్గర ఎందుకు బాప్తిస్మం తీసుకునేవాళ్లు? (బి) యోహాను ఇచ్చిన అత్యంత ప్రాముఖ్యమైన బాప్తిస్మం ఏమిటి? అది ఎందుకు ప్రత్యేకమైనది?

6 ఇతరులకు బాప్తిస్మం ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి బాప్తిస్మమిచ్చు యోహానని బైబిల్లో చదువుతాం. (మత్త. 3:1-6) అప్పుడు ప్రజలు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నారు? మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా తాము చేసిన పాపాల విషయంలో పశ్చాత్తాపపడుతున్నామని తెలియజేయడానికి బాప్తిస్మం తీసుకునేవాళ్లు. కానీ యోహాను ఇచ్చిన అత్యంత ప్రాముఖ్యమైన బాప్తిస్మం ఒకటుంది. అది పరిపూర్ణుడైన యేసుకు ఇచ్చిన బాప్తిస్మం. దేవుని కుమారునికి బాప్తిస్మం ఇవ్వడం యోహానుకు దొరికిన ఒక గొప్ప గౌరవం. (మత్త. 3:13-17) నిజానికి, యేసు ఎన్నడూ పాపం చేయలేదు కాబట్టి ఆయన పశ్చాత్తాపపడాల్సిన అవసరం లేదు. (1 పేతు. 2:22) మరైతే యేసు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు? దేవుని ఇష్టం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేయడానికి ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు.—హెబ్రీ. 10:7.

7 యేసు ప్రకటించడం మొదలుపెట్టాక, ఆయన శిష్యులు ఇతరులకు బాప్తిస్మం ఇవ్వడం మొదలుపెట్టారు. (యోహా. 3:22; 4:1, 2) ఆ ప్రజలు కూడా మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేసిన పాపాలకు పశ్చాత్తాపపడుతున్నట్లు చూపించడానికే బాప్తిస్మం తీసుకునేవాళ్లు. అయితే యేసు చనిపోయి, పునరుత్థానం చేయబడిన తర్వాత ఆయన అనుచరులు వేరే కారణంతో బాప్తిస్మం తీసుకున్నారు.

8. (ఎ) పునరుత్థానమైన తర్వాత యేసు ఏ ఆజ్ఞ ఇచ్చాడు? (బి) క్రైస్తవులు బాప్తిస్మం తీసుకోవడానికి ముందు దేన్ని ఒప్పుకోవాలి?

8 క్రీ.శ. 33⁠లో పునరుత్థానమైన తర్వాత యేసు 500 కన్నా ఎక్కువమందికి కనిపించాడు. వాళ్లలో పురుషులు, స్త్రీలు, బహుశా పిల్లలు కూడా ఉండివుంటారు. ఆ సమయంలోనే ఆయన ఈ మాటలు చెప్పివుంటాడు, “కాబట్టి, మీరు వెళ్లి అన్ని దేశాల ప్రజలను శిష్యుల్ని చేయండి; తండ్రి పేరున, కుమారుడి పేరున, పవిత్రశక్తి పేరున వాళ్లకు బాప్తిస్మం ఇవ్వండి; నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించడం వాళ్లకు నేర్పించండి.” (మత్త. 28:19, 20; 1 కొరిం. 15:6) అవును, శిష్యుల్ని చేయమనే ఆజ్ఞ ఆయన వాళ్లకిచ్చాడు. తన శిష్యులు అవ్వాలనుకునే లేదా తన “కాడి” మోయాలనుకునే ప్రతీఒక్కరు బాప్తిస్మం తీసుకోవాలని కూడా ఆయన చెప్పాడు. (మత్త. 11:29, 30) దేవుడు ఇష్టపడే విధంగా సేవ చేయాలనుకునేవాళ్లు, ఆయన తన ఇష్టాన్ని నెరవేర్చడానికి యేసును ఉపయోగించుకుంటున్నాడని ఒప్పుకోవాలి. దాని తర్వాత వాళ్లు బాప్తిస్మం తీసుకోవచ్చు. దేవుడు అంగీకరించే ఏకైక నీటి బాప్తిస్మం అదే. బాప్తిస్మం తీసుకోవడం ఎంత ప్రాముఖ్యమో యేసు తొలి శిష్యులకు తెలుసని చెప్పడానికి బైబిల్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. వాళ్లు బాప్తిస్మాన్ని అనవసరంగా వాయిదా వేయలేదు.—అపొ. 2:41; 9:18; 16:14, 15, 32, 33.

ఆలస్యం చేయకండి

9, 10. ఐతియొపీయుడు, సౌలు ఉదాహరణల నుండి మనం బాప్తిస్మం గురించి ఏమి నేర్చుకోవచ్చు?

9 అపొస్తలుల కార్యాలు 8:35, 36 చదవండి. యూదా మతాన్ని స్వీకరించిన ఒక ఐతియొపీయుని ఉదాహరణ పరిశీలించండి. ఆయన యెరూషలేముకు వెళ్లి ఆరాధన చేసి ఇంటికి తిరిగొస్తుండగా, యెహోవా దూత పంపిన ఫిలిప్పు ఆయన్ని కలిశాడు. ఫిలిప్పు ఆయనకు “యేసు గురించిన మంచివార్తను” ప్రకటించాడు. మరి ఆ ఐతియొపీయుడు ఎలా స్పందించాడు? యేసును ప్రభువుగా ఒప్పుకోవడం ఎంత ప్రాముఖ్యమో, క్రైస్తవుల నుండి యెహోవా ఏమి కోరుతున్నాడో ఆయన అర్థంచేసుకున్నాడు. దాంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బాప్తిస్మం తీసుకున్నాడు.

10 మరో ఉదాహరణ యూదుడైన సౌలు. యూదా జనాంగమంతా యెహోవాకు సమర్పించుకున్నారు కానీ ఆయనకు లోబడలేదు. అందుకే ఆయన వాళ్లను తిరస్కరించాడు. కానీ సౌలు మాత్రం, యూదులు ఇంకా దేవున్ని సరైన విధంగానే ఆరాధిస్తున్నారని అనుకొని క్రైస్తవుల్ని హింసించాడు. ఒక రోజు, పునరుత్థానమైన యేసు పరలోకం నుండి సౌలుతో మాట్లాడాడు. దానికి సౌలు ఎలా స్పందించాడు? శిష్యుడైన అననీయ చేసిన సహాయాన్ని సౌలు సంతోషంగా స్వీకరించాడు. “అప్పుడు అతను లేచి బాప్తిస్మం తీసుకున్నాడు” అని బైబిలు చెప్తుంది. (అపొ. 9:17, 18; గల. 1:14) కొంతకాలానికి సౌలు అపొస్తలుడైన పౌలుగా మారాడు. దేవుడు తన ఇష్టాన్ని నెరవేర్చడానికి యేసును ఉపయోగించుకుంటున్నాడని అర్థంచేసుకున్న వెంటనే సౌలు బాప్తిస్మం తీసుకున్నాడని గమనించండి.—అపొస్తలుల కార్యాలు 22:12-16 చదవండి.

11. (ఎ) నేడు బైబిలు విద్యార్థులు ఎందుకు బాప్తిస్మం తీసుకుంటున్నారు? (బి) ఎవరైనా బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనకెలా అనిపిస్తుంది?

11 నేడు యౌవనులు, వృద్ధులు అయిన ఎంతోమంది బైబిలు విద్యార్థులు కూడా ఆలస్యం చేయకుండా బాప్తిస్మం తీసుకుంటున్నారు. బైబిలు సత్యాల పట్ల విశ్వాసం, నిజమైన మెప్పుదల ఉండడంవల్ల యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మం తీసుకోవాలనే ఉత్సాహంతో ఉన్నారు. నిజానికి, ప్రతీ సమావేశంలో బాప్తిస్మ ప్రసంగానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. బైబిలు విద్యార్థులు సత్యాన్ని స్వీకరించి, బాప్తిస్మం తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు యెహోవాసాక్షులు చాలా సంతోషిస్తారు. పిల్లలు అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషిస్తారు. 2017 సేవా సంవత్సరంలో 2,84,000 కన్నా ఎక్కువమంది కొత్తవాళ్లు యెహోవాకు సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకున్నారు. (అపొ. 13:48) దీన్నిబట్టి క్రైస్తవులకు బాప్తిస్మం ఎంత ప్రాముఖ్యమో వాళ్లు అర్థంచేసుకున్నారని చెప్పవచ్చు. అయితే, బాప్తిస్మం తీసుకోవడానికి ముందు వాళ్లు ఏమి చేశారు?

12. బాప్తిస్మం తీసుకోవడానికి ముందు బైబిలు విద్యార్థులు ఏమి చేయాలి?

12 బాప్తిస్మం తీసుకోవడానికి ముందు బైబిలు విద్యార్థులు దేవుని గురించిన సత్యం ఏమిటో, మనుషుల విషయంలో, భూమి విషయంలో ఆయన సంకల్పం ఏమిటో, మనుషుల్ని రక్షించడానికి ఆయనేమి చేశాడో తెలుసుకోవాలి. (1 తిమో. 2:3-6) దాని తర్వాత వాళ్లు విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడే వాళ్లు దేవుని ఆజ్ఞలకు లోబడగలుగుతారు, ఆయన ద్వేషించే వాటికి దూరంగా ఉండగలుగుతారు. (అపొ. 3:19) అది చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే యెహోవా ద్వేషించేవాటిని చేస్తూ ఉండేవాళ్ల సమర్పణను ఆయన అంగీకరించడు. (1 కొరిం. 6:9, 10) అయితే యెహోవాకు సమర్పించుకునేవాళ్లు ఆయన ఏర్పర్చిన ఉన్నత నైతిక ప్రమాణాలను అంటిపెట్టుకొని ఉంటే సరిపోదుగానీ సంఘ కూటాలకు వెళ్లాలి, ప్రకటించి బోధించే పనిలో క్రమంగా భాగం వహించాలి. క్రీస్తును అనుసరించాలనుకునే ప్రతిఒక్కరూ అలా చేయాలి. (అపొ. 1:8) అవన్నీ చేశాకే బైబిలు విద్యార్థులు ఏకాంతంగా చేసుకునే ప్రార్థనలో యెహోవాకు సమర్పించుకొని, తర్వాత అందరి ముందు బాప్తిస్మం తీసుకుంటారు.

బాప్తిస్మాన్ని ఒక లక్ష్యంగా పెట్టండి

బాప్తిస్మం ప్రాముఖ్యతను అర్థంచేసుకోవడానికి మీ బైబిలు విద్యార్థులకు సహాయం చేస్తున్నారా? (13వ పేరా చూడండి)

13. స్టడీ చేస్తున్నప్పుడు మనం ఏ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి? ఎందుకు?

13 మన పిల్లలకు, బైబిలు విద్యార్థులకు స్టడీ చేస్తున్నప్పుడు మనం ఏ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి? యేసు నిజ అనుచరులు అవ్వాలనుకునే ప్రతీఒక్కరూ ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగైతే సరైన సమయం వచ్చినప్పుడు సమర్పణకు, బాప్తిస్మానికి ఉన్న ప్రాముఖ్యత గురించి వాళ్లకు చెప్పడానికి మనం భయపడం. మన పిల్లలు అలాగే బైబిలు విద్యార్థులు ప్రగతి సాధించి బాప్తిస్మం తీసుకోవాలని మనం కోరుకుంటాం.

14. బాప్తిస్మం తీసుకోమని మనం ఎందుకు ఒత్తిడి చేయకూడదు?

14 బాప్తిస్మం తీసుకోమని పిల్లల్నిగానీ బైబిలు విద్యార్థుల్నిగానీ ఎవ్వరూ ఒత్తిడి చేయకూడదు లేదా బలవంతం చేయకూడదు. నిజానికి, తనను ఆరాధించమని యెహోవా ఎవ్వర్నీ బలవంతం చేయట్లేదు. (1 యోహా. 4:8) కాబట్టి యెహోవాతో వ్యక్తిగతంగా స్నేహాన్ని పెంచుకోవడం ఎంత ప్రాముఖ్యమో అర్థంచేసుకోవడానికి మన బైబిలు విద్యార్థులకు సహాయం చేయాలి. ఒకవేళ వాళ్లు దేవుని గురించి నేర్చుకున్న సత్యంపట్ల నిజమైన మెప్పుదల కలిగివుంటే, నిజ క్రైస్తవులు చేయాల్సిన ప్రతీదీ చేయడానికి ఇష్టపడుతుంటే బాప్తిస్మం తీసుకుంటారు.—2 కొరిం. 5:14, 15.

15, 16. (ఎ) ఫలానా వయసులోనే బాప్తిస్మం తీసుకోవాలనే నియమం ఏదైనా ఉందా? వివరించండి. (బి) ఒక బైబిలు విద్యార్థి వేరే మతంలో బాప్తిస్మం తీసుకున్నప్పటికీ, మళ్లీ ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి?

15 ఫలానా వయసులోనే బాప్తిస్మం తీసుకోవాలి అనే నియమమేమీ లేదు. అందరూ ఒకేలా ఉండరు, కొంతమంది వేరేవాళ్లకన్నా త్వరగా ప్రగతి సాధిస్తారు. చాలామంది చిన్నవయసులోనే బాప్తిస్మం తీసుకుంటారు, వాళ్లు పెరిగి పెద్దయ్యాక కూడా యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగుతారు. ఇంకొంతమంది వృద్ధాప్యంలో సత్యం తెలుసుకొని బాప్తిస్మం తీసుకుంటారు. వాళ్లలో కొంతమందికి 100 కన్నా ఎక్కువ సంవత్సరాలు ఉంటాయి!

16 యెహోవాసాక్షుల దగ్గర బైబిలు స్టడీ తీసుకుంటున్న ఒకావిడ అప్పటికే వేర్వేరు మతాల్లో బాప్తిస్మం తీసుకుంది. అందుకే మళ్లీ బాప్తిస్మం తీసుకోవడం అవసరమానని బైబిలు స్టడీ ఇస్తున్న సహోదరిని అడిగింది. దానికి ఆ సహోదరి కొన్ని లేఖనాలు చూపించి జవాబు చెప్పింది. బైబిలు చెప్పేది అర్థంచేసుకున్న తర్వాత ఆమె బాప్తిస్మం తీసుకుంది. అప్పటికే ఆమె వయసు దాదాపు 80 ఏళ్లు. ఈ అనుభవం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? యెహోవా గురించిన సత్యాన్ని నేర్చుకున్న తర్వాత తీసుకున్న బాప్తిస్మాన్నే ఆయన అంగీకరిస్తాడు. కాబట్టి మనం వేరే మతంలో బాప్తిస్మం తీసుకున్నప్పటికీ, సత్యం తెలుసుకున్న తర్వాత మళ్లీ బాప్తిస్మం తీసుకోవాలి.—అపొస్తలుల కార్యాలు 19:3-5 చదవండి.

17. బాప్తిస్మం తీసుకున్న రోజున బైబిలు విద్యార్థి దేని గురించి ఆలోచించాలి?

17 బాప్తిస్మం తీసుకున్న రోజున ఎవరికైనా సంతోషంగా ఉంటుంది. అయితే యెహోవాకు చేసుకున్న సమర్పణ గురించి, బాప్తిస్మం గురించి జాగ్రత్తగా ఆలోచించాల్సిన సమయం కూడా అదే. నేర్చుకున్న ప్రతీదాన్ని పాటించడానికి నిజ క్రైస్తవులు ఎంతో కృషి చేయాలి. యేసు శిష్యులు “ఇకమీదట తమకోసం జీవించకుండా, తమకోసం చనిపోయి బ్రతికించబడిన వ్యక్తి కోసం జీవించాలి.”—2 కొరిం. 5:15; మత్త. 16:24.

18. తర్వాతి ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

18 నిజ క్రైస్తవులు అవ్వాలనే నిర్ణయం చాలా గంభీరమైనదని ఈ ఆర్టికల్‌లో నేర్చుకున్నాం. అందుకే, ఈ ఆర్టికల్‌ మొదట్లో మారీయ తల్లి కొన్ని ప్రశ్నల గురించి ఆలోచించింది. మీరు కూడా తల్లిదండ్రులైతే బహుశా ఈ ప్రశ్నల గురించి ఆలోచించివుంటారు, ‘మా పిల్లలు బాప్తిస్మం తీసుకోవడానికి నిజంగా సిద్ధంగా ఉన్నారా? యెహోవాకు సమర్పించుకునేంతగా మా పిల్లలకు ఆయన గురించి తెలుసా? మా పిల్లలు పైచదువులు చదివి, మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాకే బాప్తిస్మం తీసుకోవడం మంచిదా? ఒకవేళ బాప్తిస్మం తీసుకున్నాక మా పిల్లలు ఘోరమైన పాపం చేస్తే, అప్పుడేంటి?’ ఈ ప్రశ్నల గురించి తర్వాతి ఆర్టికల్‌లో చర్చించుకుంటాం. అంతేకాదు, తల్లిదండ్రులు బాప్తిస్మం విషయంలో సరైన అవగాహనను ఎలా కలిగివుండవచ్చో కూడా నేర్చుకుంటాం.