కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

యెహోవా నన్నెప్పుడూ విడిచిపెట్టలేదు!

యెహోవా నన్నెప్పుడూ విడిచిపెట్టలేదు!

అడాల్ఫ్‌ హిట్లర్‌ ఒకసారి మా ప్రాంతంలో ప్రసంగం ఇవ్వడానికి వచ్చాడు. ఆయనకు పువ్వులు ఇవ్వడానికి ఎంచుకున్న నలుగురు చిన్నపిల్లల్లో నేను ఒకదాన్ని. కానీ నన్నెందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే, మా నాన్న నాజీ కార్యకలాపాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవాడు. పైగా నాజీ పార్టీకి చెందిన స్థానిక బ్రాంచి నాయకుని దగ్గర ఆయన డ్రైవరుగా పనిచేసేవాడు. మా అమ్మ క్యాథలిక్‌ మతస్థురాలు, నన్ను నన్‌ చేయాలని అనుకుంది. ఇలాంటి వ్యక్తుల పెంపకంలో పెరిగిన నేను అటు నాజీ అవ్వలేదు, ఇటు నన్‌ కూడా అవ్వలేదు. ఎందుకో తెలుసుకోవాలని ఉందా?

ఆస్ట్రియాలోని గ్రాజ్‌ నగరంలో నేను పెరిగాను. నాకు ఏడేళ్లు ఉన్నప్పుడు మా మతానికి సంబంధించిన శిక్షణ ఇచ్చే స్కూల్‌లో నన్ను చేర్పించారు. అక్కడ ప్రీస్టులు, నన్‌లతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం చూసి ఖంగుతిన్నాను. దాంతో సంవత్సరం తిరగకముందే ఆ స్కూల్‌ నుండి వచ్చేయడానికి అమ్మ ఒప్పుకుంది.

మిలిటరీ యూనిఫారమ్‌లో ఉన్న నాన్నతో మా కుటుంబం

తర్వాత నన్ను బోర్డింగ్‌ స్కూల్‌లో చేర్పించారు. ఒకరోజు రాత్రి, గ్రాజ్‌ నగరం మీద తీవ్రంగా బాంబుల దాడి జరగడంతో నన్ను సురక్షిత స్థలానికి తీసుకెళ్లడానికి నాన్న వచ్చాడు. మేం స్కాల్డ్‌మిన్‌ పట్టణంలో తలదాచుకున్నాం. అక్కడ మేం ఒక బ్రిడ్జ్‌ దాటగానే ఆ బ్రిడ్జ్‌ పేలిపోయింది. ఇంకోసారి నేనూ, మా అమ్మమ్మ పెరట్లో ఉన్నప్పుడు విమానాలు చాలా కింది నుండి వెళ్తూ మాపై దాడిచేశాయి. యుద్ధం ముగిసే సమయానికి చర్చి మీద, ప్రభుత్వం మీద మాకున్న నమ్మకం పోయింది.

యెహోవా మద్దతును రుచిచూశాను

1950లో యెహోవాసాక్షులు మా అమ్మకు బైబిలు స్టడీ చేయడం మొదలుపెట్టారు. నేను వాళ్ల సంభాషణను వినేదాన్ని, అమ్మతో కలిసి కొన్నిసార్లు మీటింగ్స్‌కి కూడా వెళ్లేదాన్ని. యెహోవాసాక్షులే సత్యాన్ని ప్రకటిస్తారనే నమ్మకం అమ్మకు కుదిరింది, దాంతో 1952⁠లో బాప్తిస్మం తీసుకుంది.

అప్పట్లో స్థానిక సంఘంలో ఎక్కువగా వృద్ధ సహోదరీలే ఉండేవాళ్లు. తర్వాత మేం ఒకసారి వేరే సంఘానికి వెళ్లాం, అక్కడ చాలామంది యౌవనస్థులు ఉన్నారు. గ్రాజ్‌కు తిరిగొచ్చాక అన్నీ మీటింగ్స్‌కి హాజరవ్వడం మొదలుపెట్టాను, నేను నేర్చుకుంటున్నది సత్యం అని కొంతకాలానికే అర్థమైంది. అంతేకాదు యెహోవా తన సేవకులకు మద్దతిస్తూనే ఉంటాడని కూడా తెలుసుకున్నాను. కొన్నిసార్లు మన శక్తికి మించిన సమస్యల్ని ఎదుర్కొంటున్నప్పుడు ఒంటరిగా అనిపిస్తుంది, కానీ ఆయన మన వెన్నంటే ఉంటాడు.—కీర్త. 3:5, 6.

నాకు ఇతరులకు సత్యాన్ని ప్రకటించాలని అనిపించింది. మొదటి ప్రయత్నంగా నా తోబుట్టువులకు ప్రకటించాను. అప్పటికే మా నలుగురు అక్కలు వేరే చోట ఉంటూ స్కూల్‌ టీచర్లుగా పనిచేస్తున్నారు. అందుకే వాళ్లు ఉంటున్న పల్లెటూళ్లకు వెళ్లి, బైబిలు గురించి నేర్చుకోమని ప్రోత్సహించాను. చివరికి నా తోబుట్టువులందరూ బైబిలు సత్యం నేర్చుకుని యెహోవాసాక్షులయ్యారు.

నేను ఇంటింటి పరిచర్య మొదలుపెట్టిన రెండో వారంలో, 30వ పడిలో ఉన్న ఒకామెను కలిశాను. ఆమె బైబిలు స్టడీకి ఒప్పుకుంది, బాప్తిస్మం కూడా తీసుకుంది. కొంతకాలానికి ఆమె భర్త, ఇద్దరు కొడుకులు కూడా యెహోవాసాక్షులయ్యారు. ఆమెకు స్టడీ ఇవ్వడం వల్ల నా విశ్వాసం కూడా బలపడింది. ఏవిధంగా? నాకు ఎవ్వరూ బైబిలు స్టడీ ఇవ్వలేదు. కాబట్టి నా బైబిలు విద్యార్థికి స్టడీ ఇవ్వడం కోసం ప్రతీ పాఠాన్ని బాగా సిద్ధపడేదాన్ని. ఒక్కమాటలో చెప్పాలంటే, పాఠంలోని విషయాల్ని ముందు నేను నేర్చుకుని, ఆ తర్వాత ఆమెకు నేర్పించేదాన్ని. దానివల్ల సత్యంపట్ల నాలో కృతజ్ఞత పెరిగింది. నేను 1954, ఏప్రిల్‌ నెలలో బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షిని అయ్యాను.

“హింస అనుభవించాను కానీ ఒంటరిగా కాదు”

నేను 1955⁠లో జర్మనీలో, ఫ్రాన్స్‌లో, ఇంగ్లండ్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశాలకు హాజరయ్యాను. లండన్‌లో ఉన్నప్పుడు ఆల్బర్ట్‌ ష్రోడర్‌ని కలిశాను. ఆయన గిలియడ్‌ పాఠశాలకు ఉపదేశకునిగా సేవచేసేవాడు. ఆ తర్వాత పరిపాలక సభ సభ్యునిగా సేవచేశాడు. ఆయన మాకు బ్రిటీష్‌ మ్యూజియం టూర్‌ ఇస్తున్నప్పుడు కొన్ని బైబిలు రాతప్రతుల్ని చూపించాడు. వాటిలో దేవుని పేరు హీబ్రూ భాషలో ఉంది, దాని ప్రాముఖ్యతను ఆయన మాకు వివరించాడు. ఆ విషయాలు యెహోవాపై, సత్యంపై నాకున్న ప్రేమను మరింత పెంచాయి. అంతేకాదు దేవుని వాక్యంలోని సత్యాన్ని ప్రకటించాలనే ఆసక్తి మరింత పెరిగింది.

ఆస్ట్రియాలోని మిస్టెల్‌బాక్‌లో ప్రత్యేక పయినీరుగా సేవచేస్తున్నప్పుడు నా పార్ట్‌నర్‌తో (కుడివైపు)

1956, జనవరి 1 నుండి పూర్తికాల పయినీరు సేవ మొదలుపెట్టాను. నాలుగు నెలల తర్వాత ఆస్ట్రియాలోని మిస్టెల్‌బాక్‌లో ప్రత్యేక పయినీరుగా సేవ చేయమనే నియామకం అందింది. అప్పటికి అక్కడ సాక్షులు ఎవ్వరూలేరు. అయితే అక్కడ నాకొక సవాలు ఎదురైంది. అదేమిటంటే, నా పయినీరు పార్ట్‌నర్‌ 25 ఏళ్ల పల్లెటూరు అమ్మాయి. నేనేమో సుమారు 19 ఏళ్లున్న సిటీ అమ్మాయిని. నాకు ఉదయానే త్వరగా లేచే అలవాటు లేదు, తనేమో చాలా త్వరగా లేచేది. సాయంత్రం ఇంటికొచ్చాక నేను చాలాసేపు మేల్కొని ఉండేదాన్ని, తనేమో త్వరగా నిద్రపోవాలనుకునేది. కానీ బైబిలు సలహాల్ని పాటిస్తూ ఆ సవాళ్లను అధిగమించి ఇద్దరం చక్కగా కలిసి సేవచేశాం.

నిజానికి మేం వాటికన్నా పెద్ద సవాళ్లను ఎదుర్కొన్నాం. కొన్నిరకాల హింసను కూడా ఎదుర్కొన్నాం కానీ “దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు.” (2 కొరిం. 4:7-9) ఒకసారి మేం ఒక పల్లెటూరిలో ప్రీచింగ్‌ చేస్తుండగా, అక్కడివాళ్లు తమ కుక్కల్ని మా మీదికి వదిలారు. కళ్లు మూసి తెరిచేలోగా పెద్దపెద్ద కుక్కలు మమ్మల్ని చుట్టుముట్టి, కోరల్లాంటి పళ్లను చూపిస్తూ మొరగడం మొదలుపెట్టాయి. నేనూ, నా పార్ట్‌నర్‌ చేతులు గట్టిగా పట్టుకుని, “యెహోవా అవి మమ్మల్ని కరవగానే మేం త్వరగా చనిపోయేలా చూడు తండ్రీ” అని ప్రార్థించుకున్నాం. కాసేపటికి అవి చేతికందే దూరం వరకు వచ్చి, అక్కడే ఆగిపోయి, తోకలు ఊపుకుంటూ వెనక్కి వెళ్లిపోయాయి. యెహోవాయే మమ్మల్ని కాపాడినట్లు అనిపించింది. ఆ తర్వాత మేం ఆ పల్లెటూర్లోని అందరికీ ప్రకటించాం, సంతోషకరమైన విషయమేమిటంటే అందరూ చక్కగా విన్నారు. బహుశా కుక్కలు మమ్మల్ని ఏమీ చేయలేదని వాళ్లు ఆశ్చర్యపోయుంటారు. లేదా అంత భయంకర సంఘటన తర్వాత కూడా మేం ప్రకటించడం ఆపలేదని అనుకొనివుంటారు. కొంతకాలానికి వాళ్లలో కొందరు యెహోవాసాక్షులయ్యారు.

ఇంకొక భయానక సంఘటన మాకు ఎదురైంది. ఒకరోజు మా ఇంటి యజమాని తాగి వచ్చి, మేం చుట్టుపక్కల వాళ్లను ఇబ్బందిపెడుతున్నామని, మమ్మల్ని చంపేస్తానని బెదిరించాడు. ఇంతలో వాళ్ల ఆవిడ వచ్చి అతన్ని శాంతపర్చడానికి ప్రయత్నించింది కానీ ఆమె వల్లకాలేదు. అతను చేస్తున్న గొడవంతా మేం మేడగదిలో ఉండి వింటున్నాం. వెంటనే మేం తలుపులకు కుర్చీలు అడ్డుపెట్టి మా బట్టల్ని సూట్‌కేసుల్లో సర్దుకోవడం ప్రారంభించాం. తలుపు తెరిచి చూసేసరికి, ఇంటి యజమాని చేతిలో పెద్ద కత్తి పట్టుకుని మెట్ల దగ్గర నిలబడి ఉన్నాడు. దాంతో మా సామాన్లన్నీ తీసుకుని వెనుక తలుపు నుండి కిందికి దిగి, పెరటి దారిగుండా పారిపోయాం. మళ్లీ ఎప్పుడూ తిరిగెళ్లలేదు.

తర్వాత హోటల్‌కి వెళ్లి రూమ్‌ కావాలని అడిగాం. మాకు రూమ్‌ దొరికాక దాదాపు సంవత్సరం వరకు అదే రూమ్‌లో ఉన్నాం, అది మా పరిచర్యకు బాగా ఉపయోగపడింది. ఎలా? ఆ హోటల్‌ పట్టణానికి నడిబొడ్డున ఉండేది, కాబట్టి కొంతమంది బైబిలు విద్యార్థులు అక్కడే స్టడీ తీసుకుంటామని అడిగేవాళ్లు. కొన్నిరోజులకు ఆ హోటల్‌ రూమ్‌లోనే మేం పుస్తక అధ్యయనాన్ని, కావలికోట అధ్యయనాన్ని జరుపుకున్నాం. సుమారు 15 మంది హాజరయ్యేవాళ్లు.

మేం మిస్టెల్‌బాక్‌లో సంవత్సరం పైనే ఉన్నాం. తర్వాత గ్రాజ్‌కు ఆగ్నేయాన ఉన్న ఫెల్ట్‌బాక్‌కు నన్ను నియమించారు. అక్కడ మళ్లీ కొత్త పయినీరు పార్ట్‌నర్‌ వచ్చింది, అక్కడ కూడా సంఘం లేదు. చెక్క ఇంటిలోని రెండో అంతస్తులో ఉన్న చిన్నగదిలో ఉండేవాళ్లం. చెక్కల సందుల్లో నుండి గాలి రావడం వల్ల బాగా శబ్దం వచ్చేది, న్యూస్‌పేపర్లతో ఆ సందుల్ని పూడ్చడానికి ప్రయత్నించాం. అంతేకాదు నీటిని బావి నుండి చేదుకునేవాళ్లం. మా కష్టం వృథా కాలేదు. కొన్ని నెలలకే అక్కడ ఒక గుంపు తయారైంది. మేం స్టడీ చేస్తున్న కుటుంబంలోని దాదాపు 30 మంది బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షులయ్యారు!

ఇలాంటి అనుభవాలు, రాజ్యానికి మొదటి స్థానమిచ్చేవాళ్లను విడిచిపెట్టని యెహోవాపట్ల నాకున్న కృతజ్ఞతను మరింత పెంచాయి. మనుషులు సహాయం చేయలేని పరిస్థితుల్లో కూడా యెహోవా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు.—కీర్త. 121:1-3.

దేవుడు తన కుడిచేతితో అందించిన సహాయం

1958లో న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియంలో అలాగే పోలో గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ సమావేశం జరగబోతుందని తెలిసింది. దానికి హాజరవ్వడానికి అనుమతివ్వమని బ్రాంచిని అడిగాను. కానీ బ్రాంచి నన్ను, 32వ గిలియడ్‌ పాఠశాలకు వెళ్లగలనేమో అడిగింది. అంత గొప్ప అవకాశాన్ని ఎవరైనా కాదంటారా? “వెళ్తాను” అని వెంటనే చెప్పాను.

గిలియడ్‌ పాఠశాలలో నేను మార్టిన్‌ పోయెట్‌జింగర్‌ పక్కన కూర్చున్నాను. ఆయన నాజీ కాన్‌సంట్రేషన్‌ క్యాంపుల్లో భయానకమైన సంఘటనల్ని తట్టుకుని నిలబడ్డాడు. కొంతకాలానికి ఆయన కూడా పరిపాలక సభ సభ్యునిగా సేవచేశాడు. క్లాస్‌ జరుగుతుండగా ఆయన కొన్నిసార్లు నా చెవి దగ్గరకు వచ్చి, “ఎరికా, జర్మన్‌ భాషలో దానర్థమేమిటి?” అని అడిగేవాడు.

సగం కోర్సు పూర్తయ్యాక, సహోదరుడు నేథన్‌ నార్‌ మా నియామకాల్ని ప్రకటించాడు. నన్ను పరాగ్వేకు నియమించారు. అప్పటికి నేనింకా యౌవనస్థురాలినే కాబట్టి, ఆ దేశానికి వెళ్లాలంటే మా నాన్న ఒప్పుకోవాలి. నాన్న ఒప్పుకున్నాక, 1959 మార్చి నెలలో పరాగ్వేలో అడుగుపెట్టాను. అక్కడ, నా పయినీరు పార్ట్‌నర్‌తో కలిసి అసూన్‌సీయోన్‌లోని మిషనరీ హోమ్‌లో ఉండేదాన్ని.

ఎంతోకాలం గడవకముందే, నేను వల్టర్‌ బ్రైట్‌ను కలిశాను. ఆయన 30వ గిలియడ్‌ తరగతి పట్టభద్రుడు. కొంతకాలానికి మేం పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఇద్దరం కలిసి ఎదుర్కోవచ్చు. మాకు ఏదైనా సమస్య వచ్చిన ప్రతీసారి యెషయా 41:10⁠లో ఉన్న యెహోవా వాగ్దానాన్ని చదువుకునేవాళ్లం. అక్కడిలా ఉంది: “నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును.” మేం ఆయనకు నమ్మకంగా ఉంటూ, రాజ్యానికి మొదటిస్థానం ఇచ్చినంత కాలం ఆయన మమ్మల్ని విడిచిపెట్టడనే ధైర్యాన్ని అది మాలో నింపింది.

కొంతకాలానికి మమ్మల్ని బ్రెజిల్‌ సరిహద్దుకు దగ్గర్లో ఉన్న ప్రాంతానికి నియమించారు. అక్కడి మతనాయకుడు మా మిషనరీ హోమ్‌ మీద రాళ్లు విసరమని కొంతమంది యౌవనస్థుల్ని ఉసిగొల్పాడు, అప్పటికే ఆ బిల్డింగ్‌ స్థితి బాగోలేదు. తర్వాత వల్టర్‌ పోలీసు అధికారికి స్టడీ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆయన కొన్ని వారాలపాటు కొంతమంది పోలీసులను మా ఇంటి దగ్గర కాపలా ఉంచాడు, దాంతో వ్యతిరేకులు మాకు ఏ ఇబ్బంది కలిగించలేదు. కొంతకాలం గడిచాక, మమ్మల్ని బ్రెజిల్‌ సరిహద్దులో ఉన్న సౌకర్యవంతమైన ఇళ్లకు మార్చారు. దానివల్ల మేం పరాగ్వేలో అలాగే బ్రెజిల్‌లో మీటింగ్స్‌ జరుపుకోవడం వీలైంది. మేం అక్కడి నుండి వచ్చేసే సమయానికి రెండు చిన్న సంఘాలు ఏర్పడ్డాయి.

పరాగ్వేలో నా భర్త వల్టర్‌తో కలిసి మిషనరీగా సేవచేస్తున్నప్పుడు

యెహోవా నన్ను సంరక్షిస్తూ వచ్చాడు

డాక్టర్లు నాకు పిల్లలు పుట్టరని చెప్పారు, కానీ 1962లో నేను గర్భవతి అనే విషయం తెలిసి మేం ఆశ్చర్యపోయాం. చివరికి ఫ్లోరిడాలోని హాలీవుడ్‌లో ఉన్న వల్టర్‌ వాళ్ల కుటుంబం దగ్గర్లో స్థిరపడ్డాం. కొన్నేళ్ల వరకు మా ఇద్దరికీ పయినీరు సేవ చేయడం కుదరలేదు. మా కుటుంబ అవసరాల్ని తీర్చుకుంటూనే రాజ్యానికి మొదటి స్థానమిస్తూ వచ్చాం.—మత్త. 6:33.

1962లో మేం ఫ్లోరిడాకు వచ్చేసరికి స్థానిక పరిస్థితుల వల్ల తెల్లజాతి సహోదరులు, నల్లజాతి సహోదరులు వేర్వేరుగా మీటింగ్స్‌ జరుపుకునేవాళ్లు, ప్రీచింగ్‌ కూడా వేర్వేరు ప్రాంతాల్లో చేసుకునేవాళ్లు. కానీ యెహోవాకు అలాంటి జాతి విభేదం నచ్చదు కాబట్టి ఎంతోకాలం గడవక ముందే అందరూ కలిసి ఆరాధించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎన్నో సంఘాలు ఏర్పడడం బట్టి ఆ ఏర్పాటులో యెహోవా చెయ్యి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

విచారకరంగా 2015లో వల్టర్‌ బ్రెయిన్‌ క్యాన్సర్‌తో చనిపోయాడు. 55 ఏళ్ల మా వివాహ జీవితంలో ఆయన నన్ను చాలా బాగా చూసుకున్నాడు, ఆయనకు యెహోవా అంటే చాలా ఇష్టం, ఎంతోమంది సహోదరులకు కూడా సహాయం చేశాడు. ఆయన మళ్లీ పూర్తి ఆరోగ్యంతో పునరుత్థానమయ్యే రోజు కోసం నేను ఎదురుచూస్తున్నాను.—అపొ. 24:15.

నేను 40 ఏళ్లు పూర్తికాల సేవలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది, ఎన్నో మధురానుభూతుల్ని, ఎన్నో ప్రతిఫలాల్ని పొందాను. అందులో ఒక్కటి చెప్పాలంటే, నేనూ, వల్టర్‌ మా బైబిలు విద్యార్థుల్లో 136 మంది బాప్తిస్మం తీసుకోవడం చూశాం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని ఒడిదుడుకులను కూడా ఎదుర్కొన్నాం. కానీ వాటిని సాకుగా ఉపయోగించుకుని సత్యదేవుణ్ణి నమ్మకంగా ఆరాధించడం మాత్రం మానలేదు. బదులుగా ఆయనకు ఇంకా దగ్గరయ్యాం. యెహోవా తన సమయంలో, తన పద్ధతిలో వాటిని పరిష్కరిస్తాడనే నమ్మకంతో ఉన్నాం. ఆయన మా నమ్మకాన్ని వమ్ము చేయలేదు.—2 తిమో. 4:16-17.

నాకు వల్టర్‌ బాగా గుర్తొస్తుంటాడు, కానీ పయినీరు సేవచేయడం వల్ల ఆ బాధను తట్టుకోగలుగుతున్నాను. ఇతరులకు ప్రకటించడం వల్ల, ముఖ్యంగా పునరుత్థాన నిరీక్షణ గురించి బోధించడం వల్ల చాలా ప్రయోజనం పొందుతున్నాను. నేను గుర్తుతెచ్చుకోలేని సందర్భాల్లో కూడా యెహోవా నన్ను ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఆయన మాటిచ్చినట్లే, నాకు తోడుగా ఉన్నాడు, నన్ను బలపర్చాడు, తన “నీతియను దక్షిణహస్తముతో” నన్ను గట్టిగా పట్టుకున్నాడు.—యెష. 41:9, 10.