కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మంచితనం​—⁠దాన్ని మనమెలా పెంపొందించుకోవచ్చు?

మంచితనం​—⁠దాన్ని మనమెలా పెంపొందించుకోవచ్చు?

ఇతరులు మనల్ని మంచివాళ్లు అనుకోవాలనే కోరిక మనలో ప్రతీఒక్కరికి ఉంటుంది. కానీ ఈ లోకంలో మంచివాళ్లుగా ఉండడం చాలా కష్టం. ఎందుకంటే ఈ లోకంలో ‘మంచిని ప్రేమించనివాళ్లే’ ఎక్కువమంది ఉన్నారు. (2 తిమో. 3:3) వాళ్లు మంచిచెడుల విషయంలో సొంత ప్రమాణాల్ని పాటిస్తుంటారు. ‘మంచిని చెడు అని, చెడును మంచి అని’ వాళ్లు చెప్తుంటారు. (యెష. 5:20, NW) అంతేకాదు మనకు కూడా మనకెదురైన చేదు అనుభవాల్ని బట్టి, మన అపరిపూర్ణతను బట్టి మంచితనం చూపించడం కష్టంగా ఉండవచ్చు. కాబట్టి మనం కూడా ఆన్‌ * అనే సహోదరిలాగే భావిస్తుండవచ్చు. ఆమె ఎన్నో దశాబ్దాలుగా యెహోవా సేవ చేస్తున్నప్పటికీ ఇలా అంది, ‘నేను మంచివ్యక్తిగా ఉండగలనా అనిపిస్తుంది.’

సంతోషకరమైన విషయమేంటంటే, మనందరం మంచితనాన్ని పెంపొందించుకోవచ్చు! అది దేవుని పవిత్రశక్తి పుట్టించే లక్షణం. మన చుట్టూ ఉన్న లోకం అలాగే ప్రజలు మనపై చూపించే చెడు ప్రభావాల కన్నా, మన సొంత అపరిపూర్ణతల కన్నా పవిత్రశక్తి ఎంతో శక్తివంతమైనది. అయితే మంచితనం అంటే ఏంటో, ఆ లక్షణాన్ని మనం మరింతగా ఎలా చూపించవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం.

మంచితనం అంటే ఏంటి?

ఒక్కమాటలో చెప్పాలంటే, మంచితనం అంటే చెడు లేదా కుళ్లు లేకపోవడం. ఒక మంచివ్యక్తి ఉన్నతమైన నైతిక ప్రమాణాలు పాటిస్తాడు, ఎప్పుడూ సరైనదే చేస్తాడు. మంచివ్యక్తి ఇతరులకు సహాయం చేసే అవకాశాల కోసం ఎల్లప్పుడూ చూస్తాడు, వాళ్లకు మంచి చేస్తాడు.

కొంతమంది తమ కుటుంబం కోసం, స్నేహితుల కోసం మంచి పనులు చేయడం మీరు చూసుంటారు. అంతమాత్రాన వాళ్లు యెహోవా దృష్టిలో మంచివాళ్లని కాదు. నిజమే ఎల్లప్పుడూ మంచిగా ఉండడం మనకు సాధ్యంకాకపోవచ్చు. ఎందుకంటే, “పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు” అని బైబిలు చెప్తుంది. (ప్రసం. 7:20) అపొస్తలుడైన పౌలు నిజాయితీగా ఇలా ఒప్పుకున్నాడు, “నాలో అంటే నా శరీరంలో మంచిదేదీ లేదని నాకు తెలుసు.” (రోమా. 7:18) కాబట్టి, మంచితనాన్ని పెంపొందించుకోవాలంటే, దానికి మూలమైన యెహోవా నుండి నేర్చుకోవడమే తెలివైన పని.

యెహోవా మంచివాడు

ఏది మంచిదనే విషయంలో యెహోవాయే ప్రమాణాలు ఏర్పాటు చేస్తాడు. ఆయన గురించి బైబిలు ఇలా చెప్తుంది, ‘నువ్వు మంచివాడివి, నీ పనులు మంచివి. నీ నియమాలు నాకు బోధించు.’ (కీర్త. 119:68, NW) ఈ వచనం చెప్తున్నట్లు, యెహోవా మంచితనానికి సంబంధించిన రెండు అంశాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.

యెహోవా మంచివాడు. మంచితనం యెహోవా వ్యక్తిత్వంలో విడదీయలేని భాగం. యెహోవా మోషేతో “నా మంచితనమంతయు నీ యెదుట కనుపరచెదను” అని చెప్పినప్పుడు ఏం జరిగిందో పరిశీలించండి. యెహోవా మంచితనంతోపాటు తన మహిమను మోషేకు చూపించినప్పుడు, “యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా; ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా” ఎంచడు అనే మాటలు మోషేకు వినిపించాయి. (నిర్గ. 33:19; 34:6, 7) దీన్నిబట్టి, యెహోవా ప్రతీ విషయంలో మంచివాడని స్పష్టంగా అర్థమౌతుంది. యేసు భూమ్మీదున్నప్పుడు, మంచితనానికి ప్రతిరూపంగా నిలిచినప్పటికీ ఇలా చెప్పాడు, “దేవుడు తప్ప మంచివాళ్లెవరూ లేరు.”—లూకా 18:19.

సృష్టిలో యెహోవా మంచితనం కనిపిస్తుంది

యెహోవా పనులు మంచివి. యెహోవా చేసే ప్రతీ పనిలో మంచితనం కనిపిస్తుంది. ‘యెహోవా అందరికీ మంచి చేస్తాడు, ఆయన కరుణ ఆయన పనులన్నిట్లో కనిపిస్తుంది.’ (కీర్త. 145:9, NW) యెహోవా మంచివాడు, పక్షపాతం చూపించడు కాబట్టి మనుషులందరికీ జీవాన్ని, బ్రతకడానికి కావాల్సినవన్నీ ఇస్తున్నాడు. (అపొ. 14:17) మన పాపాల్ని క్షమించడంలో కూడా ఆయన మంచితనం కనిపిస్తుంది. కీర్తనకర్త ఇలా రాశాడు: ‘యెహోవా, నువ్వు మంచివాడివి, క్షమించడానికి సిద్ధంగా ఉంటావు.’ (కీర్త. 86:5, NW) కాబట్టి, “యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు” అనే నమ్మకంతో మనం ఉండవచ్చు.—కీర్త. 84:11.

మంచి చేయడం నేర్చుకోండి

మనం దేవుని స్వరూపంలో చేయబడ్డాం కాబట్టి మంచివాళ్లుగా ఉండగలం, మంచిపనులు చేయగలం. (ఆది. 1:27) అయినప్పటికీ, బైబిలు దేవుని సేవకుల్ని “మేలు చేయ నేర్చుకొనుడి” అని ప్రోత్సహిస్తుంది. (యెష. 1:17) మరి ఈ ఆకర్షణీయమైన లక్షణాన్ని మనమెలా పెంపొందించుకోవచ్చు? దాన్ని చేయగల మూడు మార్గాల్ని పరిశీలించండి.

మొదటిగా, మనం పవిత్రశక్తి కోసం ప్రార్థించాలి. దేవుని దృష్టిలో మంచివాళ్లుగా ఉండడానికి పవిత్రశక్తి క్రైస్తవులకు సహాయం చేస్తుంది. (గల. 5:22) అవును, మంచిని ప్రేమించడానికి, చెడును అసహ్యించుకోవడానికి పవిత్రశక్తి మనకు సహాయం చేస్తుంది. (రోమా. 12:9) నిజానికి, మనం “ఎప్పుడూ మంచిపనులు చేసేలా, మంచిమాటలు మాట్లాడేలా” యెహోవా మనల్ని స్థిరపరుస్తాడని బైబిలు చెప్తుంది.—2 థెస్స. 2:16, 17.

రెండోదిగా, దేవుడు రాయించిన బైబిల్ని చదవాలి. బైబిలు చదివేటప్పుడు, యెహోవా మనకు మంచి మార్గాన్ని బోధిస్తూ “ప్రతీ మంచి పని చేయడానికి” మనల్ని సిద్ధం చేస్తాడు. (సామె. 2:9; 2 తిమో. 3:17) బైబిల్ని చదివి, చదివిన వాటిగురించి లోతుగా ఆలోచించినప్పుడు, దేవుని గురించిన అలాగే ఆయన ఇష్టం గురించిన మంచి విషయాలతో మన హృదయాన్ని నింపుకుంటాం. ఆ విధంగా, భవిష్యత్తులో ఉపయోగపడే మరికొన్ని విషయాల్ని మన ఖజానాలో చేర్చుకుంటాం.—లూకా 6:45; ఎఫె. 5:9.

మూడోదిగా, “మంచివాళ్లను” అనుకరించడానికి శాయశక్తులా కృషిచేయాలి. (3 యోహా. 11) మనం ఆదర్శంగా తీసుకోవడానికి బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నిజమే యెహోవా, యేసు మనకు అత్యుత్తమ ఆదర్శం. అయితే, వాళ్లతోపాటు మంచితనం చూపించిన ఇతరుల గురించి కూడా మనం పరిశీలించవచ్చు. బహుశా మీకు తబితా, బర్నబా గుర్తుకురావచ్చు. (అపొ. 9:36; 11:22-24) మీరు వాళ్ల గురించి బైబిల్లో అధ్యయనం చేసి, ఇతరులకు వాళ్లు ఏయే విధాలుగా సహాయం చేశారో ధ్యానించినప్పుడు ప్రయోజనం పొందుతారు. మీ కుటుంబంలో లేదా సంఘంలో ఇతరులకు సహాయం చేయడానికి మీరేమి చేయగలరో ఆలోచించండి. అంతేకాదు తబితా, బర్నబా ఇతరులకు మంచి చేయడం వల్ల ఎలాంటి ప్రతిఫలం పొందారో కూడా గమనించండి. అప్పుడు మీరు కూడా అలాంటి ప్రతిఫలమే పొందవచ్చు.

అంతేకాదు, ఈ కాలంలో కూడా మంచి పనులు చేసేవాళ్ల గురించి ఆలోచించవచ్చు. ఉదాహరణకు, “మంచితనాన్ని ప్రేమించే” కష్టపడి పనిచేస్తున్న సంఘపెద్దల గురించి ఆలోచించండి. అలాగే తమ మాటల ద్వారా, పనుల ద్వారా “మంచి విషయాలు” బోధించే నమ్మకమైన సహోదరీల గురించి కూడా ఆలోచించండి. (తీతు 1:8; 2:3) రోస్లన్‌ అనే సహోదరి ఇలా చెప్తుంది: “సంఘంలో ఇతరుల్ని ప్రోత్సహించడానికి నా స్నేహితురాలు ప్రత్యేకంగా కృషిచేస్తుంది. ఆమె వాళ్ల పరిస్థితుల గురించి ఆలోచిస్తుంది, తరచూ వాళ్లకు చిన్నచిన్న బహుమతులు ఇస్తుంది లేదా అవసరమైన సహాయం చేస్తుంది. ఆమె నిజంగా మంచి వ్యక్తని నాకు అనిపిస్తుంది.”

మంచిని చేయమని యెహోవా తన ప్రజల్ని ప్రోత్సహిస్తున్నాడు. (ఆమో. 5:14) అలాచేస్తే, మనం దేవుని ప్రమాణాల్ని ప్రేమించడం మాత్రమే కాదుగానీ మంచిని చేస్తూ ఉండాలనే మన కోరికను కూడా బలపర్చుకుంటాం.

మంచివాళ్లగా ఉంటూ మంచి పనులు చేయడానికి కృషిచేద్దాం

మంచివ్యక్తిగా ఉండాలంటే, ఇతరుల్ని ఆకట్టుకునే పెద్దపెద్ద పనులు చేయాల్సిన లేదా ఖరీదైన బహుమతులు ఇవ్వాల్సిన అవసరంలేదు. ఉదాహరణకు, ఒక మొక్క ఎదగాలంటే దానికి ఒక్కసారే ఎక్కువ నీళ్లు పోయం గానీ కొంచెంకొంచెంగా చాలాసార్లు పోస్తాం. అదేవిధంగా, ఇతరుల కోసం మనం చిన్నచిన్న పనులు చాలాసార్లు చేసినప్పుడు, మనం మంచివాళ్లమని చూపిస్తాం.

బైబిలు మనల్ని మంచి చేయడానికి “సిద్ధపడి,” “సిద్ధంగా” ఉండమని ప్రోత్సహిస్తుంది. (2 తిమో. 2:21; తీతు 3:1) మనం ఇతరుల పరిస్థితుల్ని గమనించినప్పుడు, వాళ్లను ‘బలపర్చడానికి, సంతోషపెట్టడానికి, వాళ్లకు మంచి చేయడానికి’ మార్గాల కోసం చూస్తాం. (రోమా. 15:2) అలా చేయాలంటే మన దగ్గర ఉన్నవాటిని వేరేవాళ్లతో పంచుకోవాలి కూడా. (సామె. 3:27) మనం ఎవరినైనా భోజనానికి పిలవవచ్చు లేదా ప్రోత్సాహకరమైన సహవాసం కోసం పిలవవచ్చు. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదని తెలిస్తే వాళ్లను వెళ్లి కలవవచ్చు లేదా ఫోన్‌ చేయవచ్చు. అవును, “వినేవాళ్లకు ప్రయోజనం కలిగేలా అవసరాన్ని బట్టి, బలపర్చే మంచి మాటలు” మాట్లాడే ఎన్నో అవకాశాలు మనం కనుగొనవచ్చు.—ఎఫె. 4:29.

యెహోవాలాగే మనం ప్రజలందరికీ మంచి చేయడానికి చూస్తాం. కాబట్టి మనం నిష్పక్షపాతంగా ఉంటాం. అలా ఉండే ఒక శ్రేష్ఠమైన మార్గం, రాజ్యం గురించిన మంచివార్తను అందరికీ ప్రకటించడం. యేసు ఆజ్ఞాపించినట్లు, మనల్ని ద్వేషించేవాళ్లకు కూడా మంచి చేయడానికి మనం కృషిచేస్తాం. (లూకా 6:27) ఇతరులపట్ల దయ చూపించడం, మంచి చేయడం ఎప్పుడూ తప్పుకాదు, “ఇలాంటి లక్షణాల్ని చూపించవద్దని చెప్పే శాసనం ఏదీ లేదు.” (గల. 5:22, 23) వ్యతిరేకత లేదా కష్టాలు ఎదురైనా మన మంచి ప్రవర్తన ద్వారా ఇతరుల్ని సత్యంవైపు ఆకర్షించవచ్చు, దేవునికి మహిమ తీసుకురావచ్చు.—1 పేతు. 3:16, 17.

మంచి పనులవల్ల వచ్చే ప్రతిఫలాలు

‘మంచివాడు తన పనుల ఫలితాలతో తృప్తి పొందుతాడు’ అని బైబిలు చెప్తుంది. (సామె. 14:14, NW) అలాంటి కొన్ని ఫలితాలు ఏంటి? మనం ఇతరులకు మంచి చేస్తే, వాళ్లు కూడా మనతో చక్కగా వ్యవహరించే అవకాశం ఉంది. (సామె. 14:22) ఒకవేళ ప్రజలు మనతో చక్కగా వ్యవహరించకపోయినా, మనం వాళ్లకు మంచిపనులు చేస్తూనే ఉండాలి. అలాచేస్తే, వాళ్లు మనపట్ల తమ ఆలోచన తీరును మార్చుకుని, మనతో మంచిగా వ్యవహరిస్తారు.—రోమా. 12:20, అధస్సూచి.

చెడు చేయడం మానేసి, మంచి చేసినప్పుడు ప్రయోజనం పొందామని చాలామంది సహోదరసహోదరీలు చెప్పారు. నాన్సీ అనే సహోదరి అనుభవం చూడండి. ఆమె ఇలా చెప్తుంది, “నేను ఎదుగుతున్నప్పుడు, ఎవ్వర్నీ లెక్కచేయకుండా, అనైతికంగా, అమర్యాదగా ఉండేదాన్ని. కానీ ఏది మంచిదనే విషయంలో దేవుని ప్రమాణాలు తెలుసుకుని, పాటించినప్పుడు ఎంతో సంతోషాన్ని పొందగలిగాను. ఇప్పుడు నేను ఆత్మగౌరవంతో జీవిస్తున్నాను.”

మనం మంచితనాన్ని పెంపొందించుకోవడానికి అత్యంత ముఖ్యమైన కారణం ఏంటంటే, మనం అలాచేస్తే యెహోవా సంతోషిస్తాడు. మనం చేసేవాటిని ఇతరులు చూడకపోయినా, యెహోవా చూస్తాడు. మన ప్రతీ మంచి పనిని, ఆలోచనను ఆయన చూడగలడు. (ఎఫె. 6:7, 8) దాని ఫలితం ఏంటి? మంచివాళ్లు యెహోవా ఆమోదం సంపాదించుకుంటారని బైబిలు చెప్తుంది. (సామె. 12:2) కాబట్టి మనం మంచితనాన్ని పెంపొందించుకుందాం. “మంచిపనులు చేసే ప్రతీ ఒక్కరికి . . . మహిమను, ఘనతను, శాంతిని” ప్రసాదిస్తానని యెహోవా మాటిస్తున్నాడు.—రోమా. 2:10.

^ పేరా 2 అసలు పేరు కాదు.