అధ్యయన ఆర్టికల్ 14
పెద్దలారా—అపొస్తలుడైన పౌలును అనుకరిస్తూ ఉండండి
“నన్ను ఆదర్శంగా తీసుకొని నడుచుకోండి.”—1 కొరిం. 11:1.
పాట 99 వేవేల సహోదరులు
ఈ ఆర్టికల్‌లో . . . *
1-2. పౌలు ఆదర్శం నేడు పెద్దలకు ఎలా సహాయం చేయగలదు?
అపొస్తలుడైన పౌలు తన సహోదరుల్ని ప్రేమించాడు. ఆయన రాత్రింబగళ్లు వాళ్లకోసం కష్టపడ్డాడు. (అపొ. 20:31) దానివల్ల సహోదరసహోదరీలు కూడా పౌలును ఎంతో ప్రేమించారు. ఒకానొక సందర్భంలో ఎఫెసులోని పెద్దలకు, ఇక ఎప్పటికీ పౌలును చూడలేమని తెలిసినప్పుడు ‘వాళ్లు చాలా ఏడ్చారు.’ (అపొ. 20:37) నేడు కష్టపడి పనిచేస్తున్న సంఘపెద్దలు కూడా తోటి సహోదరసహోదరీల్ని చాలా ప్రేమిస్తారు. వాళ్లకు సహాయం చేయడానికి చేయగలిగినదంతా చేస్తారు. (ఫిలి. 2:16, 17) అయితే పెద్దలకు కొన్ని సవాళ్లు ఎదురవ్వొచ్చు. వాటిని అధిగమించడానికి వాళ్లకేది సహాయం చేస్తుంది?
2 కష్టపడి పనిచేసే పెద్దలు పౌలు ఉంచిన ఆదర్శం గురించి ఆలోచించొచ్చు. (1 కొరిం. 11:1) పౌలుకు దేవదూతలకున్న లాంటి సామర్థ్యాలు లేవు. ఆయన కూడా అపరిపూర్ణుడే. అందుకే సరైంది చేసే విషయంలో పౌలు కొన్నిసార్లు పోరాడాడు. (రోమా. 7:18-20) అలాగే ఆయన వేరే సమస్యల్ని ఎదుర్కొన్నాడు. అయినా ఆయన నిరుత్సాహపడలేదు లేదా సంతోషాన్ని కోల్పోలేదు. కాబట్టి పౌలు ఆదర్శాన్ని పాటిస్తే, పెద్దలు సవాళ్లను అధిగమించవచ్చు అలాగే యెహోవా సేవలో సంతోషంగా కొనసాగవచ్చు. దాన్ని వాళ్లెలా చేయవచ్చో ఇప్పుడు చర్చిద్దాం.
3. మనం ఈ ఆర్టికల్‌లో ఏం చర్చిస్తాం?
3 ఈ ఆర్టికల్‌లో పెద్దలకు సాధారణంగా ఎదురయ్యే నాలుగు సవాళ్ల గురించి పరిశీలిస్తాం. అవేంటంటే: (1) పరిచర్యకు, ఇతర సంఘ పనులకు తగినంత సమయం పెట్టడం, (2) తోటి సహోదరసహోదరీల్ని ప్రోత్సహించడానికి సమయాన్ని కేటాయించడం, (3) సొంత బలహీనతల వల్ల నిరుత్సాహపడకుండా ఉండడం, (4) అపరిపూర్ణులైన తోటి సహోదరసహోదరీలతో కలిసి పనిచేయడం. పౌలు ఈ నాలుగు సవాళ్లను ఎలా అధిగమించాడో, పెద్దలు ఆయన ఆదర్శాన్ని ఎలా పాటించవచ్చో చర్చిస్తాం.
పరిచర్యకు, ఇతర సంఘ పనులకు తగినంత సమయం పెట్టడం
4. ప్రకటనాపని చేసే విషయంలో మంచి ఆదర్శం ఉంచడం పెద్దలకు కొన్నిసార్లు ఎందుకు కష్టంగా ఉంటుంది?
4 అది ఎందుకు ఒక సవాలుగా ఉండొచ్చు? సంఘపెద్దలు ప్రకటనాపని చేసే విషయంలో ఒక మంచి ఆదర్శం ఉంచుతారు. దాంతోపాటు వాళ్లు సంఘంలో ఎన్నో పనులు చేస్తారు. ఉదాహరణకు, చాలామంది పెద్దలు వారంమధ్యలో జరిగే మీటింగ్‌కు తరచూ ఛైర్మన్‌గా ఉంటారు లేదా సంఘ బైబిలు అధ్యయనాన్ని నిర్వహిస్తారు. వాళ్లు వేరే ప్రసంగాలు కూడా ఇవ్వొచ్చు. అలాగే సంఘ పరిచారకులకు శిక్షణ ఇవ్వడానికి ఎంతో కృషిచేస్తారు. సహోదరసహోదరీలకు కావాల్సిన ప్రోత్సాహాన్ని ఇవ్వడంలో బిజీగా ఉంటారు. (1 పేతు. 5:2) కొంతమంది పెద్దలు రాజ్యమందిరాల్ని, సంస్థకు సంబంధించిన ఇతర భవనాల్ని కట్టడంలో, వాటిని మంచిస్థితిలో ఉంచడంలో సహాయం చేస్తారు. అవన్నీ చేస్తున్నా సంఘంలోని మిగతా వాళ్లందరిలాగే పెద్దలు చేసే అత్యంత ప్రాముఖ్యమైన పని ఏంటంటే ప్రకటనాపని.—మత్త. 28:19, 20.
5. ప్రకటనాపని చేసే విషయంలో పౌలు ఎలా మంచి ఆదర్శం ఉంచాడు?
5 పౌలు ఆదర్శం. ప్రకటనాపని చేసే విషయంలో మంచి ఆదర్శం ఉంచేలా పౌలుకు ఏది సహాయం చేసింది? ఫిలిప్పీయులు 1:10లో ఆయన ఇలా అన్నాడు: “ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోవాలి.” ఆ సలహాను ఆయన కూడా పాటించాడు. ఆయనకు ప్రకటించే పని అప్పగించబడింది, ఆయన ఎన్నో సంవత్సరాలపాటు ఆ పనికి తన జీవితంలో మొదటిస్థానం ఇచ్చాడు. ఆయన “బహిరంగంగా ఇంటింటా” ప్రకటించాడు. (అపొ. 20:20) ఆయన రోజులో ఏదో ఒక్క సమయంలో లేదా వారంలో ఏదో ఒక్కరోజు ప్రకటించలేదు. బదులుగా, తనకు దొరికిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రకటించాడు. ఉదాహరణకు పౌలు తన స్నేహితుల కోసం ఏథెన్సులో వేచి ఉన్నప్పుడు, అక్కడున్న ప్రముఖులకు మంచివార్త ప్రకటించాడు. వాళ్లలో కొంతమంది బాగా స్పందించారు. (అపొ. 17:16, 17, 34) పౌలు గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు కూడా ప్రకటించాడు.—ఫిలి. 1:13, 14; అపొ. 28:16-24.
6. పౌలు ఏయే విషయాల్లో ఇతరులకు శిక్షణ ఇచ్చాడు?
6 పౌలు తన సమయాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. తనతోపాటు పరిచర్య చేయడానికి ఆయన తరచూ ఇతరుల్ని పిలిచాడు. ఉదాహరణకు, పౌలు తన మొదటి మిషనరీ యాత్రకు వెళ్తున్నప్పుడు, మార్కు అనే పేరు కూడా ఉన్న యోహానును తనతోపాటు తీసుకెళ్లాడు. అలాగే రెండో మిషనరీ యాత్రకు వెళ్తున్నప్పుడు తిమోతిని తీసుకెళ్లాడు. (అపొ. 12:25; 16:1-4) సంఘ పనుల్ని ఒక పద్ధతి ప్రకారం ఎలా చేయాలో, సహోదరసహోదరీల్ని ఎలా చూసుకోవాలో, నైపుణ్యంగల బోధకులుగా ఎలా తయారవ్వాలో పౌలు వాళ్లకు నేర్పించడానికి శాయశక్తులా కృషిచేశాడు.—1 కొరిం. 4:17.
7. ఎఫెసీయులు 6:14, 15లో పౌలు చెప్పిన మాటల్ని పెద్దలు ఎలా పాటించొచ్చు?
7 పాఠం. పెద్దలు ఇంటింటి పరిచర్య చేయడంతోపాటు, ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రకటించడానికి సిద్ధంగా ఉండడం ద్వారా పౌలు ఆదర్శాన్ని పాటించొచ్చు. (ఎఫెసీయులు 6:14, 15 చదవండి.) ఉదాహరణకు, వాళ్లు షాపింగ్‌కు వెళ్లినప్పుడు లేదా ఉద్యోగస్థలంలో ఉన్నప్పుడు ప్రకటించొచ్చు. లేదా వాళ్లు రాజ్యమందిరాన్ని కడుతున్నప్పుడు పొరుగువాళ్లకు గానీ, నిర్మాణ వస్తువుల్ని అమ్మేవాళ్లకు గానీ ప్రకటించొచ్చు. పౌలులాగే పెద్దలు, ప్రకటనాపని చేస్తున్నప్పుడు సంఘ పరిచారకులతో సహా ఇతరులకు శిక్షణ ఇవ్వడానికి ఆ సమయాన్ని ఉపయోగించొచ్చు.
8. కొన్నిసార్లు ఒక పెద్ద ఏం చేయాల్సి రావచ్చు?
8 ప్రకటనాపని చేయడానికి సమయం లేనంతగా పెద్దలు సంఘ పనుల్లో లేదా సర్క్యూట్ పనుల్లో మునిగిపోకూడదు. వాళ్లు చేయాల్సిన అన్ని పనులకు సమయం ఉండాలంటే, అదనపు పనుల్ని చేయలేమని చెప్పాల్సి రావచ్చు. ఆ పనుల్ని కూడా ఒప్పుకుంటే, ఎక్కువ ప్రాముఖ్యమైన వాటికి సమయం ఉండదని ప్రార్థనాపూర్వకంగా ఆలోచించినప్పుడు వాళ్లకు అర్థమవ్వొచ్చు. ఎక్కువ ప్రాముఖ్యమైన వాటిలో ప్రతీవారం కుటుంబ ఆరాధన చేయడం, ఉత్సాహంగా ప్రకటించడం లేదా ఎలా ప్రకటించాలో పిల్లలకు శిక్షణ ఇవ్వడం వంటివి ఉంటాయి. కొంతమంది పెద్దలకు, అదనపు బాధ్యతల్ని చేయలేమని చెప్పడం కష్టంగా ఉండొచ్చు. కానీ వేటికి ఇవ్వాల్సిన సమయం వాటికి ఇవ్వాలనే వాళ్ల కోరికను యెహోవా అర్థంచేసుకుంటాడనే నమ్మకంతో పెద్దలు ఉండొచ్చు.
తోటి సహోదరసహోదరీల్ని ప్రోత్సహించడానికి సమయాన్ని కేటాయించడం
9. ఎన్నో పనులు చేసే పెద్దలకు ఏది సవాలుగా ఉండొచ్చు?
9 అది ఎందుకు ఒక సవాలుగా ఉండొచ్చు? యెహోవా ప్రజలు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ చివరి రోజుల్లో మనందరికీ ప్రోత్సాహం, సహాయం, ఓదార్పు అవసరం. ఉదాహరణకు, కొంతమందికి తప్పుడు పనులు చేయకుండా ఉండే విషయంలో సహాయం అవసరం. (1 థెస్స. 5:14) నిజమే, యెహోవా ప్రజలు ఎదుర్కొనే సమస్యలన్నిటినీ పెద్దలు తీసేయలేరు. అయినప్పటికీ తన ప్రజల్ని ప్రోత్సహించడానికి, కాపాడడానికి పెద్దలు చేయగలిగినదంతా చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు. అయితే ఇప్పటికే ఎన్నో పనులు చేస్తున్న పెద్దలకు, తోటి సహోదరసహోదరీలకు కావాల్సిన సహాయం చేయడానికి సమయం ఎక్కడ దొరుకుతుంది?
10. మొదటి థెస్సలొనీకయులు 2:7 ప్రకారం, పౌలు యెహోవా ప్రజలతో ఎలా వ్యవహరించాడు?
10 పౌలు ఆదర్శం. పౌలు తోటి సహోదరసహోదరీలను మెచ్చుకోవడానికి, ప్రోత్సహించడానికి అవకాశాల కోసం చూశాడు. పెద్దలు యెహోవా ప్రజలతో ప్రేమగా, మృదువుగా వ్యవహరిస్తూ పౌలు ఆదర్శాన్ని పాటించాలి. (1 థెస్సలొనీకయులు 2:7 చదవండి.) తోటి సహోదరసహోదరీలను తాను అలాగే యెహోవా ప్రేమిస్తున్నారని పౌలు చెప్పాడు. (2 కొరిం. 2:4; ఎఫె. 2:4, 5) పౌలు సంఘంలోని వాళ్లను స్నేహితులుగా భావిస్తూ వాళ్లతో సమయం గడిపాడు. తనకున్న భయాల గురించి, బలహీనతల గురించి దాచుకోకుండా చెప్పడం ద్వారా ఆయన వాళ్లను నమ్ముతున్నాడని చూపించాడు. (2 కొరిం. 7:5; 1 తిమో. 1:15) అయితే, పౌలు తన సమస్యల గురించి ఎక్కువ ఆలోచించలేదు. బదులుగా తన సహోదరులకు సహాయం చేయాలనుకున్నాడు.
11. పౌలు తన సహోదరసహోదరీలకు ఎందుకు సలహా ఇచ్చాడు?
11 కొన్నిసార్లు తన సహోదరసహోదరీలకు పౌలు సలహా ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఆయనకు వాళ్లమీద కోపమొచ్చి సలహా ఇవ్వలేదు. కానీ వాళ్లను ప్రేమించాడు అలాగే వేర్వేరు ప్రమాదాల నుండి కాపాడాలనుకున్నాడు, అందుకే సలహా ఇచ్చాడు. సహోదరసహోదరీలు ఏయే విషయాల్లో మార్పులు చేసుకోవాలో తేలిగ్గా అర్థమయ్యేలా ఆయన సలహా ఇచ్చాడు. అలాగే వాళ్లు దాన్ని పాటించాలని కోరుకున్నాడు. ఉదాహరణకు, పౌలు కొరింథీయులకు ఉత్తరం రాస్తున్నప్పుడు వాళ్లను తీవ్రంగా మందలిస్తూ సలహా ఇచ్చాడు. ఆయన ఉత్తరం రాసిన తర్వాత వాళ్లు ఆ సలహాకు ఎలా స్పందించారో తెలుసుకోవడానికి తీతును పంపించాడు. వాళ్లు ఆ సలహాను అంగీకరించి, దాన్ని పాటించారని విన్నప్పుడు ఆయన చాలా సంతోషించాడు.—2 కొరిం. 7:6, 7.
12. తోటి ఆరాధకులను సంఘపెద్దలు ఎలా బలపరుస్తారు?
12 పాఠం. పెద్దలు తోటి ఆరాధకులతో సమయం గడపడం ద్వారా పౌలు ఆదర్శాన్ని పాటించొచ్చు. అలా చేయడానికి ఒక మార్గమేంటంటే, ఇతరులతో ప్రోత్సాహకరంగా మాట్లాడేలా కూటాలకు ముందుగానే రావడం. సాధారణంగా, ఒక సహోదరుణ్ణి లేదా సహోదరిని ప్రేమపూర్వకంగా ప్రోత్సహించడానికి కేవలం కొన్ని నిమిషాలే పడుతుంది. (రోమా. 1:12; ఎఫె. 5:16) అయితే పౌలు ఆదర్శాన్ని పాటించే ఒక పెద్ద, దేవుని వాక్యాన్ని ఉపయోగించి తోటి ఆరాధకుల విశ్వాసాన్ని బలపరుస్తాడు; అలాగే దేవుడు వాళ్లను ప్రేమిస్తున్నాడనే భరోసా ఇస్తాడు. దాంతోపాటు తాను కూడా వాళ్లను ప్రేమిస్తున్నానని చూపిస్తాడు. ఆయన సంఘంలోని వాళ్లతో క్రమంగా మాట్లాడతాడు. వాళ్లను మెచ్చుకోవడానికి అవకాశాల కోసం చూస్తాడు. సలహా ఇవ్వాల్సి వచ్చినప్పుడు, అది దేవుని వాక్యానికి అనుగుణంగా ఉండేలా చూసుకుంటాడు. సలహాను సూటిగా ఇచ్చినా, దయతో ఇస్తాడు. ఎందుకంటే దాన్ని తోటి సహోదరసహోదరీలు పాటించాలని ఆయన కోరుకుంటాడు.—గల. 6:1.
సొంత బలహీనతల వల్ల నిరుత్సాహపడకుండా ఉండడం
13. ఒక పెద్ద తన బలహీనతల గురించి ఎలా ఆలోచించొచ్చు?
13 అది ఎందుకు ఒక సవాలుగా ఉండొచ్చు? పెద్దలు పరిపూర్ణులు కారు. అందరిలాగే వాళ్లు కూడా తప్పులు చేస్తారు. (రోమా. 3:23) కొన్నిసార్లు తమ బలహీనతల్ని సరైన దృష్టితో చూడడం వాళ్లకు కష్టంగా ఉండొచ్చు. కొంతమంది పెద్దలు వాటిగురించి ఎక్కువగా ఆలోచించి నిరుత్సాహపడొచ్చు. ఇంకొంతమంది తమ బలహీనతలు అంత పెద్దవేవి కావని, మార్పులు చేసుకోవాల్సిన అవసరంలేదని అనుకోవచ్చు.
14. ఫిలిప్పీయులు 4:13 ప్రకారం, తన బలహీనతల్ని అధిగమించడానికి పౌలుకు వినయం ఎలా సహాయం చేసింది?
14 పౌలు ఆదర్శం. పౌలు వినయం గలవాడు; కాబట్టి తన బలహీనతల్ని అధిగమించాలంటే సొంత శక్తి సరిపోదని, దేవుని శక్తి తనకు అవసరమని అర్థంచేసుకున్నాడు. ఒకప్పుడు పౌలు తలబిరుసుగా ప్రవర్తించాడు, క్రైస్తవుల్ని క్రూరంగా హింసించాడు. కానీ కొంతకాలానికి తాను చేసింది తప్పని అర్థంచేసుకుని తన ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. (1 తిమో. 1:12-16) పౌలు యెహోవా సహాయంతో ఒక ప్రేమగల, కనికరంగల, వినయంగల పెద్దగా తయారయ్యాడు. తనలో ఎన్నో బలహీనతలు ఉన్నాయని తెలిసినా, పౌలు వాటిగురించే ఆలోచిస్తూ ఉండిపోలేదు. బదులుగా, యెహోవా తనను క్షమిస్తాడని నమ్మాడు. (రోమా. 7:21-25) పౌలు పరిపూర్ణుడిగా ఉండడానికి ప్రయత్నించలేదు. బదులుగా, క్రైస్తవ లక్షణాల్ని పెంచుకోవడానికి తీవ్రంగా కృషిచేశాడు. అలాగే తనకిచ్చిన పనిని పూర్తిచేయడానికి యెహోవా సహాయం మీద వినయంగా ఆధారపడ్డాడు.—1 కొరిం. 9:27; ఫిలిప్పీయులు 4:13 చదవండి.
15. పెద్దలు ఏం చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు?
15 పాఠం. పెద్దలు పరిపూర్ణులు కారు. కానీ వాళ్లు తప్పులు ఒప్పుకుని, క్రైస్తవ లక్షణాల్ని పెంచుకోవాలని వాళ్లను నియమించిన యెహోవా కోరుకుంటున్నాడు. (ఎఫె. 4:23, 24) ఒక పెద్ద, వ్యక్తిగత బైబిలు అధ్యయనం ద్వారా తనను తాను పరిశీలించుకుని, అవసరమైన మార్పులు చేసుకోవాలి. అలాచేస్తే సంతోషంగా ఉండడానికి, ఒక మంచి పెద్దగా ఉండడానికి యెహోవా అతనికి సహాయం చేస్తాడు.—యాకో. 1: 25.
అపరిపూర్ణులైన తోటి సహోదరసహోదరీలతో కలిసి పనిచేయడం
16. ఒక పెద్ద ఇతరుల లోపాల మీదే దృష్టిపెడితే ఏం జరగొచ్చు?
16 అది ఎందుకు ఒక సవాలుగా ఉండొచ్చు? పెద్దలు సహోదరసహోదరీలతో ఎక్కువ సమయం గడిపినప్పుడు, వాళ్లలో ఉన్న లోపాలు కూడా కనిపిస్తాయి. ఒకవేళ పెద్దలు ఆ లోపాల మీదే దృష్టిపెడితే వాళ్లమీద చిరాకుపడొచ్చు, వాళ్లతో దురుసుగా ప్రవర్తించొచ్చు, లేదా వాళ్లలో తప్పులు వెదకొచ్చు. పెద్దలు అలా ప్రవర్తించాలనేది సాతాను కోరికని పౌలు హెచ్చరించాడు.—2 కొరిం. 2:10, 11.
17. పౌలు తన సహోదరసహోదరీల గురించి ఎలా ఆలోచించాడు?
17 పౌలు ఆదర్శం. పౌలు తన సహోదరసహోదరీల గురించి ఎప్పుడూ మంచిగానే ఆలోచించాడు. వాళ్లు తప్పులు చేశారని ఆయనకు తెలుసు; ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ల పనులవల్ల ఆయన కూడా నొచ్చుకున్నాడు. అయితే ఒకవ్యక్తి తప్పు చేసినంత మాత్రాన అతను చెడ్డవాడు కాదని పౌలుకు తెలుసు. ఆయన తన తోటివాళ్లను ప్రేమించాడు, వాళ్లలో ఉన్న మంచి లక్షణాల మీద మనసుపెట్టాడు. ఒకవేళ సహోదరసహోదరీలకు సరైనది చేయడం కష్టంగా అనిపిస్తుంటే, వాళ్ల ఉద్దేశాలు మంచివే అయ్యుంటాయని, వాళ్లకు కావాల్సిందల్లా సహాయమని పౌలు అనుకున్నాడు.
18. యువొదియ, సుంటుకేలతో పౌలు వ్యవహరించిన విధానం నుండి మీరేం నేర్చుకోవచ్చు? (ఫిలిప్పీయులు 4:1-3)
18 ఫిలిప్పీ సంఘంలో ఉన్న ఇద్దరు సహోదరీలకు పౌలు ఎలా సహాయం చేశాడో గమనించండి. (ఫిలిప్పీయులు 4:1-3 చదవండి.) బహుశా అభిప్రాయభేదాల వల్ల యువొదియ సుంటుకేలు మాట్లాడుకోవడం మానేశారు. అప్పుడు పౌలు వాళ్లతో దురుసుగా ప్రవర్తించలేదు లేదా వాళ్లను తప్పుపట్టలేదు. బదులుగా వాళ్లలో ఉన్న మంచి లక్షణాల మీద దృష్టిపెట్టాడు. ఈ నమ్మకమైన సహోదరీలు చాలాకాలం నుండి యెహోవాను సేవిస్తున్నారు కాబట్టి ఆయన వాళ్లను ప్రేమిస్తాడని పౌలుకు తెలుసు. పౌలుకు ఆ సహోదరీల మీద మంచి అభిప్రాయం ఉంది కాబట్టి వాళ్లను సమాధానపడమని ప్రోత్సహించాడు. పౌలు ఇతరుల్లో ఉన్న మంచి లక్షణాల మీద దృష్టిపెట్టడం వల్ల, తన సంతోషాన్ని కాపాడుకోగలిగాడు అలాగే సంఘంలోని వాళ్లతో దగ్గరి స్నేహాల్ని కలిగివున్నాడు.
19. (ఎ) తోటి ఆరాధకుల్లో ఉన్న వేటిమీద మనసుపెట్టడానికి పెద్దలు కృషిచేయాలి? (బి) ఈ పేరాకు సంబంధించిన చిత్రం నుండి మీరేం నేర్చుకోవచ్చు?
19 పాఠం. పెద్దలారా, సంఘంలోని తోటి సహోదరసహోదరీల్లో ఉన్న మంచి లక్షణాల్ని చూడండి. మనందరం అపరిపూర్ణులమే, అయినా మనందరిలో మంచి లక్షణాలు ఉంటాయి. (ఫిలి. 2:3) నిజమే, పెద్దలు ఒక సహోదరుడి లేదా సహోదరి ఆలోచనా విధానాన్ని సరిచేయడానికి అప్పుడప్పుడు సలహా ఇవ్వాల్సి రావొచ్చు. అయితే చిరాకు తెప్పించే ఆ వ్యక్తి మాటలు, పనుల మీద మనసుపెట్టకుండా ఉండడానికి పెద్దలు పౌలులాగే కృషిచేయాలి. ఆ వ్యక్తికి యెహోవాపట్ల ఉన్న ప్రేమ మీద, ఆయన్ని సేవించడంలో చూపిస్తున్న సహనం మీద, మంచి చేయగల అతని సామర్థ్యం మీద పెద్దలు మనసుపెట్టడానికి కృషిచేయాలి. ఇతరుల మంచి లక్షణాల మీద మనసుపెట్టే పెద్దలు సంఘంలో ప్రేమపూర్వక వాతావరణం ఉండేలా సహాయం చేస్తారు.
పౌలు ఆదర్శాన్ని పాటిస్తూ ఉండండి
20. పౌలు ఆదర్శం నుండి పెద్దలు ఎలా ప్రయోజనం పొందుతూ ఉండొచ్చు?
20 పెద్దలారా, పౌలు గురించి అధ్యయనం చేస్తూ ఉంటే మీరు ప్రయోజనం పొందుతారు. ఉదాహరణకు, సమగ్ర సాక్ష్యమివ్వండి (ఇంగ్లీష్) పుస్తకం నుండి అలాగే “ప్రతిలేఖనము” బ్రోషురు నుండి మీరు కొంత సమాచారం చదవొచ్చు. * మీరు పౌలు గురించి ఎక్కువ నేర్చుకునేకొద్దీ ఇలా ప్రశ్నించుకోండి: ‘సంఘపెద్దగా నా బాధ్యతను చేస్తున్నప్పుడు, నా సంతోషాన్ని కాపాడుకోవడానికి పౌలు ఆదర్శం ఎలా సహాయం చేస్తుంది?’
21. పెద్దలు ఏ నమ్మకంతో ఉండొచ్చు?
21 పెద్దలారా, మీరు పరిపూర్ణులుగా ఉండాలని యెహోవా కోరట్లేదు, కానీ మీరు నమ్మకంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. (1 కొరిం. 4:2) పౌలు కష్టపడి పనిచేశాడు, నమ్మకంగా ఉన్నాడు దాన్ని చూసి యెహోవా సంతోషించాడు. అదేవిధంగా మీరు చేసే సేవను చూసి కూడా ఆయన సంతోషిస్తున్నాడనే నమ్మకంతో ఉండండి. “మీరు పవిత్రులకు సేవచేశారు, ఇంకా సేవ చేస్తున్నారు; ఈ విధంగా మీరు చేసే పనిని, తన పేరు విషయంలో మీరు చూపించే ప్రేమను” యెహోవా ఎప్పుడూ మర్చిపోడు.—హెబ్రీ. 6:10.
పాట 87 రండి, సేదదీర్పు పొందండి!
^ పేరా 5 మనకు సహాయం చేయడం కోసం పెద్దలు చేస్తున్న కృషికి మనమెంతో కృతజ్ఞులమై ఉన్నాం. వాళ్లకు సాధారణంగా ఎదురయ్యే నాలుగు సవాళ్ల గురించి ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. వాటిని అధిగమించడానికి పౌలు ఆదర్శం పెద్దలకు ఎలా సహాయం చేస్తుందో కూడా తెలుసుకుంటాం. అయితే పెద్దలను అర్థంచేసుకుని వాళ్లపట్ల ప్రేమ చూపించేలా, వాళ్ల పనిని తేలిక చేసేలా ఈ ఆర్టికల్ మనకు సహాయం చేస్తుంది.
^ పేరా 20 దేవుని రాజ్యం గురించి ‘సమగ్ర సాక్ష్యమివ్వండి’ (ఇంగ్లీష్) పుస్తకంలోని 12వ అధ్యాయంలో 17 నుండి 20 పేరాలు అలాగే 21వ అధ్యాయంలో 6, 7 పేరాలు చూడండి. “ప్రతిలేఖనము”—విశ్వసనీయమైనది, ప్రయోజనకరమైనది (మత్తయి-కొలొస్సయులు), 24వ పేజీలో 19వ పేరా అలాగే (1 థెస్సలొనీకయులు-ప్రకటన), 12-13 పేజీల్లో 8, 9 పేరాలు చూడండి.
^ పేరా 62 చిత్రాల వివరణ: ఒక సహోదరుడు పని నుండి ఇంటికి వెళ్తునప్పుడు తోటి ఉద్యోగికి ప్రకటిస్తున్నాడు.
^ పేరా 64 చిత్రాల వివరణ: ఇతరులతో అంతగా కలవని ఒక సహోదరుణ్ణి, ఒక సంఘపెద్ద ప్రేమగా ప్రోత్సహిస్తున్నాడు.
^ పేరా 66 చిత్రాల వివరణ: ఒక విషయం వల్ల నొచ్చుకున్న ఒక సహోదరునికి, మరో సహోదరుడు ఉపయోగపడే సలహా ఇస్తున్నాడు.
^ పేరా 68 చిత్రాల వివరణ: రాజ్యమందిరాన్ని శుభ్రం చేయడానికి స్వచ్ఛందంగా వచ్చిన ఒక సహోదరుని ధ్యాస పక్కకు మళ్లింది. అది చూసిన పెద్ద అతన్ని తప్పుపట్టడం లేదు.