పాఠకుల ప్రశ్న
రూతును పెళ్లి చేసుకోవడంవల్ల తన ఆస్తి “పాడౌతుందని” ఆమె “దగ్గరి బంధువు” ఎందుకు అన్నాడు? (రూతు 4:1, 6)
బైబిలు కాలాల్లో ఒక పెళ్లయిన పురుషుడు పిల్లలు లేకుండా చనిపోతే కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఆయన ఆస్తి ఎవరికి వెళ్తుంది? ఆయన వంశం అక్కడితో ఆగిపోతుందా? ఇలాంటి ప్రశ్నలకు మోషే ధర్మశాస్త్రం జవాబిస్తుంది.
ఒక వ్యక్తి చనిపోతే లేదా పేదరికం వల్ల తన భూమిని అమ్ముకుంటే, అప్పుడేంటి? తన సహోదరుడు లేదా దగ్గరి బంధువు దాన్ని విడిపించాలి లేదా తిరిగి కొనాలి. అలా ఆ భూమి ఆ కుటుంబం మధ్యే ఉండిపోతుంది.—లేవీ. 25:23-28; సంఖ్యా. 27:8-11.
ఒక వ్యక్తి చనిపోతే అతని వంశం అక్కడితో ఆగిపోతుందా? లేదు. మరిది ధర్మం అనే ఏర్పాటు వల్ల అది నిలబడుతుంది. రూతు విషయంలో కూడా అదే జరిగింది. చనిపోయిన వ్యక్తి భార్యని, అతని సహోదరుడు పెళ్లి చేసుకుంటాడు. అలా అతనికి పుట్టిన పిల్లలు, చనిపోయిన వ్యక్తి వంశాన్ని నిలబెడతారు, ఆస్తిని కాపాడుకుంటారు. అంతేకాదు, ఈ ప్రేమపూర్వక ఏర్పాటు వల్ల ఆ విధవరాలు కూడా సంరక్షించబడుతుంది.—ద్వితీ. 25:5-7; మత్త. 22:23-28.
నయోమి గురించి ఆలోచించండి. ఆమె ఎలీమెలెకును పెళ్లిచేసుకుంది. ఆమె భర్త, ఇద్దరు కొడుకులు చనిపోయిన తర్వాత కనీసం ఆమెను పోషించడానికి కూడా ఎవ్వరూ లేరు. (రూతు 1:1-5) యూదాకు వచ్చేశాక, ఎలీమెలెకు దగ్గరి బంధువైన బోయజుని తమ భూమిని తిరిగి కొనమని అడగడానికి నయోమి రూతును పంపించింది. (రూతు 2:1, 19, 20; 3:1-4) కానీ, బోయజు తనకన్నా “దగ్గరి బంధువు” ఒకతను ఉన్నాడని గుర్తించి, భూమిని తిరిగి కొనే అవకాశాన్ని ముందు అతనికి ఇచ్చాడు.—రూతు 3:9, 12, 13.
ఆ “దగ్గరి బంధువు” సహాయం చేయడానికి మొదట్లో ఇష్టపడ్డాడు. (రూతు 4:1-4) ఎందుకంటే, నయోమికి పిల్లలు పుట్టి, ఆ వారసులు ఆ భూమిని చేజిక్కించుకునే అవకాశంలేదు. కాబట్టి, కాస్త ఖర్చయినా దాన్ని కొనడానికి అతను ముందుకొచ్చాడు. అలాగే ఆ భూమిని కొంటే ఇకముందు తనదే అవుతుంది కాబట్టి, అది మంచి పెట్టుబడే అని అనుకున్నాడు.
కానీ రూతును పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని తెలిసిన తర్వాత ఆ దగ్గరి బంధువు తన మనసు మార్చుకున్నాడు. అతను ఇలా అన్నాడు: “నేను దాన్ని కొనలేను. ఎందుకంటే, నేను నా సొంత వారసత్వపు ఆస్తిని పాడుచేసుకుంటానేమో.” (రూతు 4:5, 6) అతను ఎందుకు మనసు మార్చుకున్నాడు?
ఒకవేళ ఆ దగ్గరి బంధువు గానీ, ఇంకెవరైనా గానీ రూతును పెళ్లి చేసుకుని, ఒక కొడుకును కంటే ఎలీమెలెకు భూమికి ఆ కొడుకు వారసుడౌతాడు. మరి ఆ దగ్గరి బంధువు “ఆస్తి” ఎలా “పాడౌతుంది”? దానికి బైబిలు ఏం చెప్పడంలేదు. కానీ, ఇవి కొన్ని కారణాలై ఉండవచ్చు.
మొదటిది, తను ఎంత డబ్బు పెట్టి కొన్నా ఎలీమెలెకు భూమి, చివరికి రూతు కొడుకుదే అవుతుంది గానీ తనది అవ్వదు. కాబట్టి తన పెట్టుబడి అంతా వృథా అవుతుందని అతను అనుకుని ఉంటాడు.
రెండోది రూతును, నయోమిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా తనమీద పడుతుందని అతను అనుకుని ఉంటాడు.
మూడోది, ఆ దగ్గరి బంధువుకు ఇంతకుముందే పిల్లలు ఉండుంటే, ఇప్పుడు రూతుతో కనే పిల్లలు, ఆ పిల్లలు ఆస్తిని పంచుకోవాల్సి వస్తుందేమో అని ఆలోచించి ఉంటాడు.
నాలుగవది, ఒకవేళ ఈ దగ్గరి బంధువుకు ఇంతకుముందే పిల్లలు లేకపోయుంటే, రూతుతో కనే కొడుకు ఎలీమెలెకు భూమికి, తన భూమికి వారసుడౌతాడు. ఒకవేళ తను చనిపోతే, తన భూమి తనకు కాకుండా ఎలీమెలెకు వంశానికి చెందుతుందని అతను ఆలోచించి ఉంటాడు. ఈ దగ్గరి బంధువు నయోమికి సహాయం చేయడం కోసం తన భూమిని త్యాగం చేయాలని అనుకోలేదు. అందుకే ఆ అవకాశాన్ని, బాధ్యతని తన తర్వాత తిరిగి కొనగలిగే హక్కున్న బోయజుకు వదిలేశాడు. ‘చనిపోయిన వ్యక్తి పేరును నిలిపి అతని వారసత్వాన్ని కాపాడాలి’ అని బోయజు అనుకున్నాడు. కాబట్టి ఆ దగ్గరి బంధువు చేయలేని పనిని ఈయన చేశాడు.—రూతు 4:10.
ఆ దగ్గరి బంధువు స్వార్థంగా తన పేరు గురించి, తన ఆస్తి గురించి ప్రాకులాడాడు. తన పేరు చరిత్రలో నిలిచిపోవాలి అనుకున్నాడు కానీ అది చరిత్రలో కొట్టుకుపోయింది. అలాగే, బోయజుకు దక్కిన ఒక గొప్ప అవకాశాన్ని కూడా అతను కోల్పోయాడు. అదేంటంటే, బోయజు మెస్సీయ అయిన యేసుక్రీస్తుకు పూర్వీకుడయ్యాడు! ఆ దగ్గరి బంధువు స్వార్థంగా ఆలోచించి, అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయకపోవడం వల్ల అతనికి అదెంత చేదు ముగింపో కదా!—మత్త. 1:5; లూకా 3:23, 32.