కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 11

బాప్తిస్మం తీసుకోవడానికి మీరు ఎలా సిద్ధపడవచ్చు?

బాప్తిస్మం తీసుకోవడానికి మీరు ఎలా సిద్ధపడవచ్చు?

“నేను బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకం ఏంటి?”—అపొ. 8:36.

పాట 50 నా సమర్పణ ప్రార్థన

ఈ ఆర్టికల్‌లో a

భూవ్యాప్తంగా యౌవనులైనా, వృద్ధులైనా ప్రగతి సాధించి, బాప్తిస్మం తీసుకుంటున్నారు (1-2 పేరాలు చూడండి)

1-2. మీరు బాప్తిస్మం తీసుకోవడానికి ఇంకా సిద్ధంగా లేకపోతే మీరెందుకు నిరుత్సాహపడకూడదు? (కవర్‌ పేజీ మీదున్న చిత్రం చూడండి.)

 బాప్తిస్మం తీసుకోవాలనే లక్ష్యం మీకుంటే, మీరు చాలా గొప్ప పనిచేసినట్టే. మీరు ఇప్పటికిప్పుడు బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ సిద్ధంగా ఉన్నాం అని మీకు అనిపించి, మీ సంఘపెద్దలు దానికి ఒప్పుకుంటే, బాప్తిస్మం తీసుకోవడానికి ఈసారి వచ్చే అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మీకోసం యెహోవా సేవలో ఒక బంగారు భవిష్యత్తు వేచివుంది.

2 ఒకవేళ బాప్తిస్మానికి ముందే, మీరు కొన్ని మార్పులు చేసుకోవాలని మీ సంఘపెద్దలు చెప్పినా లేదా మీకే అనిపించినా నిరుత్సాహపడకండి. మీరు ఏ వయసు వాళ్లయినా, తగిన మార్పులు చేసుకుని బాప్తిస్మం తీసుకోవాలనే ముఖ్యమైన లక్ష్యాన్ని చేరుకోగలరు.

“నేను బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకం ఏంటి?”

3. ఇతియోపియాకు చెందిన ఆస్థాన అధికారి ఫిలిప్పును ఏం అడిగాడు? కానీ మనకు ఏ ప్రశ్న రావచ్చు? (అపొస్తలుల కార్యాలు 8:36, 38)

3 అపొస్తలుల కార్యాలు 8:36, 38 చదవండి. ఇతియోపియాకు చెందిన ఆస్థాన అధికారి ఫిలిప్పును ఇలా అడిగాడు: “నేను బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకం ఏంటి?” ఆ ఇతియోపీయుడు బాప్తిస్మం తీసుకోవాలని బలంగా కోరుకున్నాడు. కానీ, ఆయన నిజంగా బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా?

ఇతియోపీయుడైన అధికారి యెహోవా గురించి ఎక్కువ నేర్చుకోవాలనే తపనతో ఉన్నాడు (4వ పేరా చూడండి)

4. ఇతియోపీయుడైన అధికారి ఇంకా నేర్చుకోవాలనే తపనతో ఉన్నాడని ఎలా చెప్పవచ్చు?

4 ఆ ఇతియోపీయుడైన అధికారి యెహోవాను “ఆరాధించడం కోసం … యెరూషలేముకు” వెళ్లాడు. (అపొ. 8:27) ఆయన యూదా మతాన్ని స్వీకరించి, యూదునిగా మారిన అన్యుడై ఉంటాడు. ఆయన హీబ్రూ లేఖనాల నుండి యెహోవా గురించి నేర్చుకుని ఉంటాడు. అయినా, ఆయన ఇంకా నేర్చుకోవాలనే తపనతో ఉన్నాడు. నిజానికి, ఫిలిప్పు ఆ అధికారిని కలిసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన యెషయా ప్రవక్త రాసిన గ్రంథపు చుట్టను కళ్లార్పకుండా చదువుతున్నాడు. (అపొ. 8:28) అది బలమైన ఆధ్యాత్మిక ఆహారం. ఆ ఆస్థాన అధికారి కేవలం ప్రాథమిక బోధలతో తృప్తిపడలేదు గానీ, ఇంకా ఎక్కువ నేర్చుకుంటూ ఉండాలనుకున్నాడు.

5. ఇతియోపీయుడు నేర్చుకున్న దానికి తగ్గట్టుగా ఏ పనులు చేశాడు?

5 ఆ ఇతియోపీయుడు, రాణి అయిన కందాకే కింద పనిచేసేవాడు. ఆయన “రాణి ఖజానా అంతటినీ చూసుకునేవాడు.” (అపొ. 8:27) కాబట్టి ఆయన చాలా బాధ్యతలతో బిజీగా ఉండేవాడు. అయినప్పటికీ, యెహోవాను ఆరాధించడానికి సమయం తీసుకున్నాడు. ఆయన కేవలం సత్యాన్ని నేర్చుకుని ఊరుకోలేదు గానీ, వాటి ప్రకారంగా పనులు చేశాడు. ఆయన ఇతియోపియా నుండి యెరూషలేము వరకు చాలా దూరం ప్రయాణించి యెహోవాను ఆరాధించాడు. అలా ప్రయాణించాలంటే చాలా సమయం, డబ్బు ఖర్చవుతుంది. అయినాసరే, యెహోవా ఆరాధన ముందు అవేవీ ఆయనకు లెక్కలోకి రాలేదు.

6-7. ఆ ఇతియోపీయునికి యెహోవా మీద ఎలా ప్రేమ కలిగింది?

6 ఆ ఇతియోపీయుడు ఫిలిప్పు దగ్గర కొన్ని ముఖ్యమైన కొత్త సత్యాలు నేర్చుకున్నాడు. అందులో ఒకటి, యేసే మెస్సీయ అనే సత్యం. (అపొ. 8:34, 35) ఈ విషయం ఆ ఇతియోపీయుని హృదయాన్ని ఎంతో తాకింది. యేసు తనకోసం ఏం చేశాడో ఆయన అర్థం చేసుకున్నాడు. మరి ఆయన ఎలా స్పందించాడు? ఆయన యూదునిగా మారిన అన్యునిగా మాత్రమే ఉండే బదులు యెహోవా మీద, యేసు మీద ప్రేమను పెంచుకున్నాడు. దానివల్ల ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. యేసుక్రీస్తు అనుచరుడిగా ఆయన బాప్తిస్మం తీసుకోవాలనుకున్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడని ఫిలిప్పు గమనించి, ఆయనకు బాప్తిస్మం ఇచ్చాడు.

7 మీరు కూడా ఇతియోపీయుడు చేసిన పనులే చేస్తే బాప్తిస్మానికి సిద్ధపడవచ్చు. అప్పుడు మీరు కూడా గట్టి నమ్మకంతో “నేను బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకం ఏంటి?” అని అడుగుతారు. ఆ ఇతియోపీయుడు చేసిన పనులేంటో, వాటిని మీరెలా చేయవచ్చో ఇప్పుడు చూద్దాం. ఆయన చేసిన మూడు పనులు ఏంటంటే: ఆయన యెహోవా గురించి నేర్చుకుంటూనే ఉన్నాడు; నేర్చుకున్నవాటి ప్రకారం పనులు చేశాడు; దేవుని మీదున్న ప్రేమను పెంచుకుంటూనే ఉన్నాడు.

యెహోవా గురించి నేర్చుకుంటూ ఉండండి

8. యోహాను 17:3 మీరేం చేయాలని చెప్తుంది?

8 యోహాను 17:3 చదవండి. యేసు చెప్పిన ఈ మాటలు చదివాకే, బైబిలు స్టడీ తీసుకోవాలని మీరు నిర్ణయించుకున్నారా? మనలో చాలామందిమి అదే చేశాం. కానీ మనం నేర్చుకోవడం ఆపేయకూడదు అని కూడా ఆ మాటలు చెప్తున్నాయా? అవును. మనం ‘సత్యదేవుని గురించి నేర్చుకోవడం ఎప్పటికీ ఆపేయం.’ (ప్రసం. 3:11) ఎన్ని యుగాలైనా మనం ఆయన గురించి నేర్చుకుంటూనే ఉంటాం. యెహోవా గురించి మనం ఎంతెక్కువ నేర్చుకుంటే, ఆయనకు అంతెక్కువ దగ్గరౌతాం.—కీర్త. 73:28.

9. ప్రాథమిక బోధలు నేర్చుకున్న తర్వాత మనం ఏం చేయాలి?

9 అయితే, యెహోవా గురించి నేర్చుకోవడం అనేది ప్రాథమిక విషయాలతో మొదలౌతుంది. వీటిని సూచించడానికే అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన ఉత్తరంలో “ప్రాథమిక బోధలు” అనే మాటను ఉపయోగించాడు. అంటే మనం నేర్చుకోవాల్సిన “ప్రాథమిక సిద్ధాంతాల్ని” ఆయన చిన్నచూపు చూస్తున్నాడని దానర్థమా? కానేకాదు. బదులుగా ఆయన వాటిని, పసిపిల్లల ఎదుగుదలకు తోడ్పడే పాలతో పోల్చాడు. (హెబ్రీ. 5:12; 6:1) అయితే క్రైస్తవులందరూ ఆ ప్రాథమిక బోధలకు మించి, బైబిల్లో ఉన్న లోతైన సత్యాల్ని నేర్చుకోవాలని ఆయన ప్రోత్సహించాడు. బైబిల్లో ఉన్న లోతైన సత్యాల్ని నేర్చుకోవాలన్న తపన మీలో ఉందా? యెహోవా గురించి, ఆయన ఉద్దేశాల గురించి ఇంకా ఎక్కువ నేర్చుకోవాలనే కోరిక మీలో ఉందా?

10. కొంతమందికి చదవడం అంటే ఎందుకు కష్టంగా అనిపిస్తుంది?

10 అయితే మనలో చాలామందికి చదవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మీ పరిస్థితి ఏంటి? మీరు స్కూల్లో బాగా చదివే విద్యార్థా? మీకు చదవడమన్నా, కొత్త విషయాలు నేర్చుకోవడమన్నా ఆసక్తా? లేదా పుస్తకాల్లో నుండి ఎంత చదివినా మీ బుర్రకు ఎక్కదు అనిపిస్తుందా? ఒకవేళ మీకు అలా అనిపిస్తే, మీరు ఒంటరివాళ్లు కాదు. మీలా చాలామందికి అనిపిస్తుంది. కానీ యెహోవా మీకు సహాయం చేయగలడు. ఎందుకంటే ఆయన తిరుగులేని, బెస్ట్‌ టీచర్‌.

11. యెహోవా “మహాగొప్ప ఉపదేశకుడు” అని ఎలా చెప్పవచ్చు?

11 యెహోవా “మహాగొప్ప ఉపదేశకుడు” అని బైబిలు చెప్తుంది. (యెష. 30:20, 21) ఆయన ఓపిగ్గా, దయగా, అర్థంచేసుకుంటూ నేర్పించే టీచర్‌. ఆయన తన విద్యార్థుల్లో మంచినే చూస్తాడు. (కీర్త. 130:3) మనం చేయగలిగిన దానికన్నా ఎక్కువ చేయాలని ఆయన ఎప్పుడూ ఆశించడు. మనకున్న అద్భుతమైన మెదడును తయారుచేసింది యెహోవా దేవుడే అని మర్చిపోకండి. (కీర్త. 139:14) అందుకే, మన అందరికి సహజంగానే కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఉంటుంది. మనం ఎప్పటికీ నేర్చుకుంటూ, ఆనందంగా ఉండాలని మన సృష్టికర్త కోరుకుంటున్నాడు. కాబట్టి బైబిలు సత్యాల మీద ఇప్పుడే ‘ఆకలిని పెంచుకోవడం’ తెలివైన పని. (1 పేతు. 2:2) దానికోసం, మీరు చేరుకోగల లక్ష్యాల్ని పెట్టుకోండి. బైబిలు చదవడానికి, అధ్యయనం చేయడానికి ఒక షెడ్యూల్‌ని వేసుకుని, దాన్ని పాటించండి. (యెహో. 1:8) యెహోవా సహాయంతో, మీరు ఆయన గురించి రోజురోజుకీ ఎక్కువ చదవగలుగుతారు, నేర్చుకోగలుగుతారు.

12. యేసు జీవితం గురించి, పరిచర్య గురించి ఎందుకు అధ్యయనం చేయాలి?

12 యేసు జీవితం, పరిచర్య గురించి ఎప్పటికప్పుడు సమయం తీసుకుని ధ్యానించండి. ముఖ్యంగా, ఈ కష్టమైన కాలాల్లో మనం యెహోవా సేవను నమ్మకంగా చేయాలంటే, యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడవడం చాలా ప్రాముఖ్యం. (1 పేతు. 2:21) తన అనుచరులు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటారో యేసు నిర్మొహమాటంగా చెప్పాడు. (లూకా 14:27, 28) అయినా, తనలాగే తన అనుచరులు కూడా కష్టాలన్నిటినీ నమ్మకంగా సహిస్తారని యేసు ధీమాగా ఉన్నాడు. (యోహా. 16:33) యేసు జీవితం గురించి అధ్యయనం చేయండి, ప్రతీరోజు ఆయనలాగే బ్రతకాలనే లక్ష్యం పెట్టుకోండి.

13. మీరు యెహోవాను ఏం అడుగుతూ ఉండాలి? ఎందుకు?

13 అయితే కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు. ఆ జ్ఞానం యెహోవా గురించి ఎక్కువ తెలుసుకోవడానికి; ప్రేమ, విశ్వాసం లాంటి లక్షణాలు పెంచుకోవడానికి సహాయపడాలి. (1 కొరిం. 8:1-3) మీరు యెహోవా గురించి ఇంకా తెలుసుకుంటుండగా, ఎక్కువ విశ్వాసం ఇవ్వమని ఆయన్ని అడగండి. (లూకా 17:5) అలాంటి ప్రార్థనలకు ఆయన తప్పకుండా జవాబిస్తాడు. ఖచ్చితమైన జ్ఞానం మీద ఆధారపడిన విశ్వాసం మీకు ఉంటే, నేర్చుకున్న దానికి తగ్గట్టు పనులు చేయగలుగుతారు.—యాకో. 2:26.

నేర్చుకున్నవాటి ప్రకారం పనులు చేయండి

జలప్రళయానికి ముందు నోవహు, ఆయన కుటుంబం తెలుసుకున్న దాని ప్రకారం పనులు చేశారు (14వ పేరా చూడండి)

14. మనం నేర్చుకున్న వాటి ప్రకారం పనులు చేయడం ప్రాముఖ్యమని అపొస్తలుడైన పేతురు ఎలా నొక్కి చెప్పాడు? (చిత్రం కూడా చూడండి.)

14 క్రీస్తు అనుచరులు నేర్చుకున్న వాటి ప్రకారం పనులు చేయడం ఎంత ప్రాముఖ్యమో, అపొస్తలుడైన పేతురు నొక్కి చెప్పాడు. ఆయన నోవహు గురించిన వృత్తాంతాన్ని ప్రస్తావించాడు. తన కాలంలో ఉన్న చెడ్డ ప్రజలందర్నీ జలప్రళయం ద్వారా నాశనం చేస్తానని యెహోవా నోవహుతో చెప్పాడు. నోవహు, ఆయన కుటుంబం తమ ప్రాణాల్ని కాపాడుకోవాలంటే జలప్రళయం వస్తుందనే విషయాన్ని తెలుసుకుంటే మాత్రమే సరిపోదు. ఇక్కడ పేతురు, జలప్రళయానికి ముందు అంటే ‘ఓడ నిర్మించబడుతున్న’ కాలాన్ని ప్రస్తావించాడు. (1 పేతు. 3:20) అవును నోవహు, ఆయన కుటుంబం దేవుని నుండి తెలుసుకున్న వాటి ప్రకారం పనులు చేశారు, అంటే ఓడను కట్టారు. (హెబ్రీ. 11:7) పేతురు ఆ తర్వాత నోవహు చేసిన పనిని బాప్తిస్మంతో పోల్చాడు. ఆయన ఇలా అన్నాడు: “దానికి పోలికగా ఉన్న బాప్తిస్మం కూడా … మిమ్మల్ని ఇప్పుడు రక్షిస్తోంది.” (1 పేతు. 3:21) ఒక విధంగా, బాప్తిస్మం తీసుకోవడానికి మీరు సిద్ధపడడం నోవహు, ఆయన కుటుంబం ఓడను నిర్మించడానికి చేసిన పనులతో పోల్చవచ్చు. ఇంతకీ, మీరు బాప్తిస్మం కోసం సిద్ధపడుతుండగా ఏ పని చేయాలి?

15. మీరు నిజంగా పశ్చాత్తాపపడుతున్నారని ఎలా చూపించవచ్చు?

15 మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, మన పాపాలన్నిటికీ నిజంగా పశ్చాత్తాపపడాలి. (అపొ. 2:37, 38) నిజమైన పశ్చాత్తాపం చూపిస్తే, నిజమైన మార్పు వస్తుంది. యెహోవాకు ఇష్టంలేని పనులన్నీ మీరు ఆపేశారా? అంటే అనైతికంగా జీవించడం, సిగరెట్‌ తాగడం లేదా బూతులు తిట్టడం ఆపేశారా? (1 కొరిం. 6:9, 10; 2 కొరిం. 7:1; ఎఫె. 4:29) ఒకవేళ మీరు ఇంకా ఆపేయకపోతే, వాటిని మార్చుకోవడానికి గట్టిగా కృషిచేయండి. సహాయం కోసం, నిర్దేశం కోసం మీతో బైబిలు స్టడీ చేస్తున్న వ్యక్తిని లేదా సంఘపెద్దల్ని అడగండి. మీరు పిల్లలైతే, బాప్తిస్మం తీసుకోవడానికి అడ్డుగా ఉన్న చెడు అలవాట్లను ఎలా మానుకోవాలో మీ అమ్మానాన్నల్ని అడుగుతూ ఉండండి.

16. మనం యెహోవాను క్రమంగా ఆరాధించడానికి ఏయే పనులు చేయాలి?

16 యెహోవాను క్రమంగా ఆరాధించడం కూడా చాలా ప్రాముఖ్యం. అందులో మీటింగ్స్‌కు వెళ్లడం, కామెంట్స్‌ చెప్పడం కూడా ఒక భాగం. (హెబ్రీ. 10:24, 25) ఒకవేళ మీరు ప్రీచింగ్‌ చేయడానికి అర్హత సాధిస్తే, క్రమంగా ప్రీచింగ్‌కి వెళ్లడానికి ప్రయత్నించండి. ప్రీచింగ్‌ ప్రజల ప్రాణాల్ని రక్షించే పని కాబట్టి, మీరు దానిలో ఎంత భాగం వహిస్తే అంత సంతోషంగా ఉంటారు. (2 తిమో. 4:5) ఒకవేళ మీరు పిల్లలైతే, ఈ ప్రశ్న వేసుకోండి: ‘మీటింగ్స్‌కి రమ్మని లేదా ప్రీచింగ్‌కి రమ్మని మీ అమ్మానాన్న మీకు గుర్తుచేయాల్సి వస్తుందా? లేదా మీ అంతటా మీరే వెళ్తున్నారా?’ ఒకవేళ మీ అంతటా మీరే వెళ్తుంటే మీ విశ్వాసాన్ని, యెహోవా మీదున్న ప్రేమను, కృతజ్ఞతను మీరు చూపించిన వాళ్లవుతారు. ఇవన్నీ “దైవభక్తిగల పనులు,” యెహోవాకు మనం ఇచ్చే బలులు. (2 పేతు. 3:11; హెబ్రీ. 13:15) మనం యెహోవాకు ఇచ్చేవి బలవంతంగా కాకుండా, మనస్ఫూర్తిగా ఇస్తే ఆయన సంతోషిస్తాడు. (2 కొరింథీయులు 9:7 పోల్చండి.) యెహోవాకు మనం వీలైనంత మంచిది ఇస్తే సంతోషంగా ఉంటాం కాబట్టి అవన్నీ మనం చేస్తాం.

యెహోవా మీదున్న ప్రేమను పెంచుకుంటూ ఉండండి

17-18. మీరు బాప్తిస్మం వైపు అడుగులు వేయడానికి ఏ ముఖ్యమైన లక్షణం సహాయం చేస్తుంది? ఎందుకు? (సామెతలు 3:3-6)

17 మీరు బాప్తిస్మం వైపు అడుగులు వేస్తున్నప్పుడు కొన్ని సవాళ్లు రావచ్చు. కొంతమంది మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు, వ్యతిరేకించవచ్చు, తిట్టవచ్చు. (2 తిమో. 3:12) కొన్నిసార్లు మీరు ఒక చెడు అలవాటును మానుకోవడానికి బాగా కష్టపడుతున్నారు కానీ, అప్పుడప్పుడు మళ్లీ అదే పనిచేస్తున్నారు. అప్పుడు, మీరిక ఎంత ప్రయత్నించినా వృథానే, ఇక నావల్ల కాదని మీకు అనిపించి, మీమీద మీకే కోపం రావచ్చు. అలాంటప్పుడు, సహించడానికి మీకేది సహాయం చేస్తుంది? యెహోవా మీదున్న ప్రేమే.

18 మీలో చాలా అమూల్యమైన, ఆకర్షణీయమైన లక్షణం యెహోవా మీదున్న ప్రేమే. (సామెతలు 3:3-6 చదవండి.) అది కష్టాల వేడికి ఆవిరైపోయేది కాదు. ఆ ప్రేమ వల్ల మీ కష్టాల్ని నమ్మకంగా సహించగలుగుతారు. యెహోవా కూడా తన సేవకులపట్ల విశ్వసనీయ ప్రేమను చూపిస్తాడని బైబిలు చాలాసార్లు చెప్తుంది. విశ్వసనీయ ప్రేమ అంటే, తన సేవకుల్ని ఎప్పుడూ విడిచిపెట్టకుండా అంటిపెట్టుకుని ఉండేది. (కీర్త. 100:5) మీరు దేవుని స్వరూపంలో చేయబడ్డారు. (ఆది. 1:26) కాబట్టి ఇలాంటి ప్రేమను మీరెలా చూపించవచ్చు?

మీరు యెహోవాకు ప్రతీరోజు కృతజ్ఞతలు చెప్పవచ్చు (19వ పేరా చూడండి) b

19. యెహోవా మీకోసం చేసిన వాటన్నిటికి కృతజ్ఞతను ఎలా పెంచుకోవచ్చు? (గలతీయులు 2:20)

19 కృతజ్ఞత చెప్పడంతో మొదలుపెట్టండి. (1 థెస్స. 5:18) దానికోసం, ‘యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడని ఎలా చూపిస్తున్నాడు?’ అని ప్రతీరోజు ఆలోచించండి. ఆ తర్వాత యెహోవా మీకోసం చేసిన వాటికి ప్రార్థనలో కృతజ్ఞత చెప్పండి. ఆయన మిమ్మల్ని ప్రేమించి ఇప్పటికే మీకోసం ఏమేం చేశాడో గుర్తుచేసుకోండి. అపొస్తలుడైన పౌలు కూడా అదే చేశాడు. (గలతీయులు 2:20 చదవండి.) మీరు కూడా, ‘నేను యెహోవాను తిరిగి ఎలా ప్రేమించవచ్చు?’ అని ఆలోచించండి. యెహోవా మీద ప్రేముంటే, మీకు వచ్చే ఏ కష్టానైనా నమ్మకంగా తట్టుకోగలుగుతారు. దానివల్ల యెహోవాను ఆరాధించడానికి చేసే పనులన్నిటిని క్రమంగా చేయగలుగుతారు; ప్రతీరోజు మీ పరలోక తండ్రిపై ప్రేమ చూపించగలుగుతారు.

20. మీరు యెహోవాకు సమర్పించుకోవడానికి ఏం చేయాలి? అదెందుకు చాలా ప్రాముఖ్యమైన నిర్ణయం?

20 ఈ పనులన్నీ చేసిన తర్వాత, యెహోవా మీదున్న ప్రేమతో మీరు ఆయనకు సమర్పించుకోవడానికి ఒక ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చాలా ప్రత్యేకమైనది. ఒక్కసారి మీరు యెహోవాకు సమర్పించుకుంటే, రానున్న జీవితం ఎలా ఉంటుంది? ఇక నుండి యెహోవాతో మీకున్న సంబంధం విడవని ముడిలా ఉంటుంది. ఇక మీరు ఆయన సొంతం. యెహోవాకు మీరు సమర్పించుకుంటున్నారని ఇచ్చిన మాట, మీ జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా చెరిగిపోదు, కాలంతో కరిగిపోదు. నిజమే, సమర్పించుకోవడంతో మీ జీవితంలో ఒక కొత్త పేజీ మొదలౌతుంది. బహుశా మీ జీవితంలో చాలా నిర్ణయాలు తీసుకుని ఉంటారు. కొన్ని మంచి నిర్ణయాలు కూడా తీసుకుని ఉంటారు. కానీ ఇప్పటివరకు మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ ఒక ఎత్తు, సమర్పించుకోవాలని తీసుకున్న ఈ నిర్ణయం ఇంకో ఎత్తు. దీనికి మించిన నిర్ణయం మరొకటి లేదు! (కీర్త. 50:14) మీ పరలోక తండ్రిపై మీకున్న ప్రేమను, నమ్మకాన్ని చల్లార్చడానికి సాతాను శతవిధాల ప్రయత్నిస్తాడు. కానీ సాతానును అస్సలు గెలవనివ్వకండి! (యోబు 27:5) యెహోవాపై మీకున్న చెరగని ప్రేమనుబట్టి మీరు మీ సమర్పణకు తగ్గట్టు జీవించగలుగుతారు; మీ పరలోకం తండ్రికి రోజురోజుకు దగ్గరవ్వగలుగుతారు.

21. బాప్తిస్మం ఒక ముగింపు కాదని ఎందుకు చెప్పవచ్చు?

21 మీరు యెహోవాకు సమర్పించుకున్న తర్వాత, ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ఒక్క అడుగు దూరంలోనే ఉన్నారు. కాబట్టి మీ సంఘ పెద్దలతో మాట్లాడండి. బాప్తిస్మం ఒక ముగింపు కాదుగానీ తరాలపాటుగా యెహోవా సేవ చేయడానికి ఒక మంచి ఆరంభం అని గుర్తుంచుకోండి. కాబట్టి మీ తండ్రిపై ప్రేమను ఇప్పుడే బలపర్చుకోండి. ఆ ప్రేమ రోజురోజుకు పెరిగేలా లక్ష్యాలు పెట్టుకోండి. ఇవన్నీ చేస్తే, బాప్తిస్మం అనే గమ్యాన్ని మీరు చేరుకోగలుగుతారు. అది మీకు మరపురాని రోజుగా ఉంటుంది. అది ఒక మంచి జీవితానికి తొలి అడుగు మాత్రమే. యెహోవా మీద, ఆయన కుమారుడి మీద మీకున్న ప్రేమ ఎప్పటికీ పెరుగుతూనే ఉండాలనేది మా కోరిక.

పాట 135 యెహోవా ప్రేమతో అడుగుతున్నాడు: ‘నా కుమారుడా, జ్ఞానాన్ని సంపాదించు’

a మీరు బాప్తిస్మం వైపు అడుగులు వేయాలనుకుంటే, మీకు సరైన ఉద్దేశం ఉండాలి. దానికోసం సరైన పనులు చేయాలి. ఈ ఆర్టికల్‌లో, ఇతియోపీయుడైన ఆస్థాన అధికారి ఉదాహరణను పరిశీలిస్తాం. అలాగే, ఒక బైబిలు విద్యార్థి బాప్తిస్మం తీసుకోవడానికి అర్హత సాధించాలంటే ఏయే పనులు చేయాలో కూడా చూస్తాం.

b చిత్రాల వివరణ: యెహోవా తనకోసం చేసిన వాటన్నిటికి కృతజ్ఞతలు చెప్తున్న ఒక సిస్టర్‌.