కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 10

మీరు ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి?

మీరు ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి?

“మీలో ప్రతీ ఒక్కరు … బాప్తిస్మం తీసుకోండి.”—అపొ. 2:38.

పాట 34 యథార్థంగా జీవించడం

ఈ ఆర్టికల్‌లో a

1-2. ఒకవ్యక్తి బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

 సమావేశంలో మీరు ఎప్పుడైనా బాప్తిస్మ అభ్యర్థుల్ని చూశారా? వాళ్లు తల ఎత్తుకుని రెండు ప్రశ్నలకు జవాబిస్తూ వాళ్లకున్న గట్టి విశ్వాసాన్ని చూపిస్తారు. వాళ్లు ఏదో సాధించారన్న సంతృప్తి కుటుంబ సభ్యుల్లో, స్నేహితుల్లో కనిపిస్తుంది. బాప్తిస్మ అభ్యర్థులు నీళ్లలో నుండి బయటికి వచ్చినప్పుడు ఆ ప్రాంతమంతా చప్పట్లతో మారుమ్రోగిపోతుంది. అలాగే వాళ్ల ముఖాలు సంతోషంతో వెలిగిపోతాయి. సగటున, ప్రతీవారం వేలమంది యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకుంటున్నారు.

2 మరి మీ సంగతేంటి? మీరు బాప్తిస్మం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఈ చీకటి లోకంలో మిణుగురుల్లా ఉన్నారు. మీరు ‘యెహోవాను వెతుకుతున్నారు.’ (కీర్త. 14:1, 2) మీరు ఏ వయసు వాళ్లయినా ఈ ఆర్టికల్‌ మీకోసమే. ఇప్పటికే బాప్తిస్మం తీసుకున్నవాళ్లు కూడా యెహోవాను ఎప్పటికీ సేవిస్తూ ఉండాలనే నిర్ణయాన్ని బలపర్చుకోవడానికి ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది. యెహోవా సేవ చేయడానికి చాలా కారణాలున్నాయి. అయితే వాటిలో మూడిటిని ఇప్పుడు చూద్దాం.

మీరు సత్యాన్ని, నీతిని ప్రేమిస్తున్నారు

వేల సంవత్సరాలుగా, యెహోవా పవిత్రమైన పేరును పాడుచేయడమే సాతాను పనిగా పెట్టుకున్నాడు (3-4 పేరాలు చూడండి)

3. మీరు సత్యాన్ని, నీతిని ప్రేమిస్తున్నారని ఎందుకు చెప్పవచ్చు? (కీర్తన 119:128, 163)

3 ‘సత్యాన్ని ప్రేమించమని’ యెహోవా తన ప్రజలకు చెప్పాడు. (జెక. 8:19) నీతిని ప్రేమించమని యేసు తన శిష్యులకు చెప్పాడు. (మత్త. 5:6) అంటే, యెహోవా దృష్టిలో సరైనది, మంచిది చేయాలనే బలమైన కోరిక మనకు ఉండాలి. మీరు సత్యాన్ని, నీతిని ప్రేమిస్తున్నారా? మీరు ఖచ్చితంగా ప్రేమిస్తున్నారని మాకు తెలుసు. మీకు అబద్ధాలంటే ఇష్టముండదు. తప్పు చేయడమన్నా, చెడుతనం అన్నా మీకు అసహ్యం. (కీర్తన 119:128, 163 చదవండి.) ఈ లోక పరిపాలకుడైన సాతాను అబద్ధాలకు నిలువెత్తు రూపం. (యోహా. 8:44; 12:31) యెహోవా పవిత్రమైన పేరును పాడుచేయడమే సాతాను పనిగా పెట్టుకున్నాడు. ఇప్పుడే కాదు ఏదెను తోట నుండే యెహోవా మీద సాతాను చాడీలు చెప్తూ ఉన్నాడు. యెహోవా అంటే స్వార్థంతో మనుషులకు ఏదో మంచిని దక్కకుండా చేసే ఒక చెడ్డ పరిపాలకుడని చిత్రీకరించాడు. (ఆది. 3:1, 4, 5) అలా యెహోవా గురించి అబద్ధాలు చెప్పీ చెప్పీ మనుషుల్లో సాతాను విషాన్ని నూరిపోశాడు. ఎవరైతే ‘సత్యాన్ని ప్రేమించాలని’ అనుకోవట్లేదో వాళ్లను అనైతికత వైపుకు, చెడుతనం వైపుకు అడుగులు వేయిస్తున్నాడు.—రోమా. 1:25-31.

4. యెహోవా ‘సత్యవంతుడని’ ఎలా చూపించాడు? (చిత్రం కూడా చూడండి.)

4 యెహోవా ‘సత్యవంతుడు.’ ఆయన తనను ప్రేమించే వాళ్లందరికీ పెద్ద మనసుతో సత్యాన్ని నేర్పిస్తున్నాడు. (కీర్త. 31:5) అలా చేయడంవల్ల, యెహోవా సాతాను చెప్పే అబద్ధాల చెర నుండి ప్రజల్ని విడిపిస్తున్నాడు. అంతేకాదు తన ప్రజలు నీతిగా, నిజాయితీగా బ్రతకడం నేర్పిస్తున్నాడు. దానివల్ల ప్రజలు మనశ్శాంతితో, ఒకింత ఆత్మగౌరవంతో బ్రతకగలుగుతున్నారు. (సామె. 13:5, 6) బైబిలు స్టడీ తీసుకుంటున్నప్పుడు యెహోవా మీకు కూడా అలా నేర్పించాడని అనిపించిందా? మనుషులందరికీ అలాగే మీకూ యెహోవా చూపించే దారే సరైనదని తెలుసుకున్నారు. (కీర్త. 77:13) అందుకే నీతి పక్షాన నిలబడాలని మీరు కోరుకుంటున్నారు. (మత్త. 6:33) అంతేకాదు సత్యం వైపు ఉండి, యెహోవా మీద పడ్డ నిందలన్నీ అబద్ధమని నిరూపించాలనే కోరిక మీలో ఉంది. మరి మీరు దాన్ని ఎలా చేయవచ్చు?

5. మీరు సత్యం వైపు, నీతి వైపు ఉన్నారని ఎలా చూపిస్తారు?

5 “నేను సాతాను అబద్ధాల్ని వినను, సత్యం వైపే ఉంటాను. యెహోవాయే నా పరిపాలకుడు. ఆయన చెప్పిందే నేను చేస్తాను” అన్నట్టు మీరు జీవించాలి. మీరు దాన్ని ఎలా చేయవచ్చు? ముందుగా యెహోవాకు ప్రార్థన చేసి, ఇక మీ జీవితాన్ని తనకు అంకితం చేస్తున్నారని చెప్పండి. తర్వాత అందరికీ కనిపించేలా బాప్తిస్మం తీసుకోండి. సత్యాన్ని, నీతిని ప్రేమించాలనే బలమైన కోరిక మీలో ఉంటే మీరు బాప్తిస్మం తీసుకుంటారు.

మీరు యేసుక్రీస్తును ప్రేమిస్తున్నారు

6. యేసుక్రీస్తును ప్రేమించడానికి కీర్తన 45:4​లో ఏ కారణాలున్నాయి?

6 మీరు యేసుక్రీస్తును ఎందుకు ప్రేమిస్తున్నారు? దానికిగల సరైన కారణాల్ని కీర్తన 45:4​లో మనం చూస్తాం. (చదవండి.) యేసు సత్యం కోసం, వినయం కోసం, నీతి కోసం నిలబడ్డాడు. మీరు సత్యాన్ని, నీతిని ప్రేమిస్తున్నట్లయితే యేసుక్రీస్తును కూడా ప్రేమిస్తున్నట్లే. ఆయన సత్యం వైపు, నీతి వైపు ధైర్యంగా నిలబడ్డాడని మీకు తెలుసు. (యోహా. 18:37) మరైతే, మనం వినయంగా ఉండాలని యేసు ఎలా నేర్పిస్తున్నాడు?

7. యేసు వినయం గురించి మీకేది బాగా నచ్చింది?

7 యేసు తన పనుల ద్వారా మనకు వినయాన్ని నేర్పించాడు. ఉదాహరణకు, ఆయన చేసిన పనులన్నిటి ఘనత తన తండ్రికే ఇచ్చాడు గానీ తను తీసుకోలేదు. (మార్కు 10:17, 18; యోహా. 5:19) అలాంటి వినయాన్ని చూసినప్పుడు మీకేం అనిపిస్తుంది? దేవుని కుమారుడైన యేసును ప్రేమించాలని, ఆయన్ని అనుకరించాలని ఖచ్చితంగా కోరుకుంటారు కదా! ఇంతకీ యేసు ఎందుకు వినయం చూపించాడు? ఎందుకంటే ఆయన తండ్రి వినయస్థుడు. యేసు ఆయన్ని ప్రేమించాడు, ఆయనలాగే ఉండాలనుకున్నాడు కాబట్టి వినయం చూపించాడు. (కీర్త. 18:35; హెబ్రీ. 1:3) యెహోవా లక్షణాల్ని అంతబాగా చూపించిన యేసు, మీ మనసుకు దగ్గరైన మనిషిలా అనిపించట్లేదా?

8. మన రాజైన యేసును మనం ఎందుకు ప్రేమిస్తాం?

8 మన రాజైన యేసుక్రీస్తును మనం ప్రేమిస్తాం. ఎందుకంటే ఆయనకు ఎవ్వరూ సాటిరారు. యెహోవాయే దగ్గరుండి తన కుమారునికి శిక్షణ ఇచ్చి, ఆయన్ని రాజుగా చేశాడు. (యెష. 50:4, 5) యేసు కూడా మీకోసం ప్రాణం ఇచ్చేంతగా మిమ్మల్ని ప్రేమించాడు. (యోహా. 13:1) యేసు మీ రాజు. మీ ప్రేమను పొందే పూర్తి హక్కు ఆయనకుంది. తనను మనస్ఫూర్తిగా ప్రేమించేవాళ్లను తన స్నేహితులని ఆయన పిలిచాడు. వాళ్లు ఆయనిచ్చిన ఆజ్ఞల్ని పాటిస్తూ ఆయనమీద ప్రేమ చూపిస్తారు. (యోహా. 14:15; 15:14, 15) యెహోవా కుమారునికి స్నేహితునిగా ఉండడం కన్నా గొప్ప గౌరవం ఇంకేం ఉంటుంది!

9. క్రైస్తవుల బాప్తిస్మానికి, యేసు బాప్తిస్మానికి కొన్ని పోలికలు ఏంటి?

9 యేసు ఇచ్చిన ఆజ్ఞల్లో ఒకటి, తన అనుచరులు బాప్తిస్మం తీసుకోవడం. (మత్త. 28:19, 20) నిజానికి ఆయనే అలా చేసి చూపించాడు. ఆయన బాప్తిస్మానికి, తన అనుచరుల బాప్తిస్మానికి కొన్ని పోలికలు, తేడాలు ఉన్నాయి. (“ యేసు బాప్తిస్మానికి, తన అనుచరుల బాప్తిస్మానికి తేడాలు ఏంటి?” అనే బాక్సు చూడండి.) యేసు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా తన తండ్రి ఇష్టాన్నే చేస్తానని చూపించాడు. (హెబ్రీ. 10:7) అలాగే తన అనుచరుల విషయానికొస్తే, వాళ్లు యెహోవాకు తమ జీవితాన్ని అంకితం చేశారని లేదా సమర్పించుకున్నారని అందరిముందు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా చూపిస్తారు. ఆ తర్వాత నుండి, తమ కోసం కాకుండా యెహోవా ఇష్టం చేయడం కోసమే జీవిస్తారు. అలా వాళ్లు తమ నాయకుడైన యేసును అనుకరిస్తారు.

10. మీరు యేసును ప్రేమిస్తున్నారని ఎలా చూపించవచ్చు?

10 యేసు యెహోవాకు ఏకైక కుమారుడని, దేవుడు ఆయన్ని రాజుగా నియమించాడని మీరు నమ్ముతున్నారు. యేసు వినయస్థుడని, అచ్చం తన నాన్న లక్షణాల్ని చూపిస్తున్నాడని మీకు తెలుసు. ఆకలిగా ఉన్నవాళ్లకు ఆహారం పెట్టాడని, బాధలో ఉన్నవాళ్లను ఓదార్చాడని, అనారోగ్యంతో ఉన్నవాళ్లను బాగుచేశాడని మీరు తెలుసుకున్నారు. (మత్త. 14:14-21) ఈరోజుల్లో ఆయన సంఘాన్ని ఎలా నడిపిస్తున్నాడో మీరు చూస్తున్నారు. (మత్త. 23:10) ఆయన దేవుని రాజ్యానికి రాజుగా, భవిష్యత్తులో వీటన్నిటినీ ఇంకా ఎక్కువ స్థాయిలో చేస్తాడని కూడా మీకు తెలుసు. మరైతే, మీరు ఆయన్ని ప్రేమిస్తున్నారని ఎలా చూపించవచ్చు? ఆయన్ని అనుకరించడం ద్వారా. (యోహా. 14:21) అంటే యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మీరు అలా చేయవచ్చు.

మీరు యెహోవాను ప్రేమిస్తున్నారు

11. బాప్తిస్మం తీసుకోవడానికి అన్నిటికన్నా ముఖ్యమైన కారణం ఏంటి? యెహోవాను మీరెంతలా ప్రేమించాలి?

11 మీరు బాప్తిస్మం తీసుకోవడానికి అన్నిటికన్నా ముఖ్యమైన కారణం ఏంటి? ఆ కారణం గురించి చెప్తూ యేసు ఇలా అన్నాడు: “నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ నిండు మనసుతో, నీ పూర్తి బలంతో ప్రేమించాలి.” దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లో ఇదే అన్నిటికన్నా ముఖ్యమైనది. (మార్కు 12:30) మరి, మీరు యెహోవాను అంతే ప్రేమిస్తున్నారా?

ఇప్పటివరకు మీకున్న మంచి వాటన్నిటికి, ఇకముందు రాబోయే వాటన్నిటికి యెహోవాయే మూలం (12-13 పేరాలు చూడండి)

12. మీరు యెహోవాను ఎందుకు ప్రేమిస్తున్నారు? (చిత్రం కూడా చూడండి.)

12 యెహోవాను ప్రేమించడానికి చాలా కారణాలున్నాయి. ఉదాహరణకు, ఆయనే ‘జీవానికి మూలం’ అని, “ప్రతీ మంచి బహుమతి, ప్రతీ పరిపూర్ణ వరం” ఆయనే ఇస్తాడని మనం అర్థంచేసుకున్నాం. (కీర్త. 36:9; యాకో. 1:17) కాబట్టి మన దగ్గరున్న మంచివన్నీ యెహోవా పెద్ద మనసు చేసుకుని ఇచ్చినవే.

13. విమోచన క్రయధనం ఎందుకు వెలకట్టలేని బహుమతి?

13 విమోచన క్రయధనం యెహోవా మనకోసం ఇచ్చిన వెలకట్టలేని బహుమతి. అలాగని ఎందుకు చెప్పవచ్చు? యెహోవాకు, యేసుకు ఉన్న బంధం గురించి ఆలోచించండి. యేసు ఇలా అన్నాడు: “తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, … నేను తండ్రిని ప్రేమిస్తున్నాను.” (యోహా. 10:17; 14:31) వాళ్ల బంధం, ఒకట్రెండు కాదుగానీ కొన్ని కోటానుకోట్ల సంవత్సరాలది. (సామె. 8:22, 23, 30) ఒక్కసారి ఊహించండి, కళ్లముందే కొడుకు ప్రాణం పోతుంటే ఆ తండ్రి ఎంత విలవిలలాడి ఉంటాడో కదా. యెహోవా మనుషుల్ని ప్రేమిస్తున్నాడు అంటే మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు. ఎంతగా అంటే మీరూ, ఇతరులు ఎల్లప్పుడూ జీవించాలని ఆయన తన ప్రియాతి ప్రియమైన కుమారుడిని త్యాగం చేశాడు. (యోహా. 3:16; గల. 2:20) దేవున్ని ప్రేమించడానికి ఇంతకు మించి ఇంకేదైనా కారణం ఉంటుందా?

14. మీ జీవితంలో మీరు పెట్టుకోగల మంచి లక్ష్యం ఏంటి?

14 మీరు యెహోవా గురించి బాగా నేర్చుకున్నారు కాబట్టి ఆయన మీద మీకు ప్రేమ పెరిగింది. అందుకే ఇప్పుడు, ఎల్లప్పుడు ఆయనకు దగ్గరవ్వాలని మీరు కోరుకుంటారు. మీరు అలా అవ్వగలరు కూడా. తన హృదయాన్ని సంతోషపెట్టమని ఆయన మిమ్మల్ని అడుగుతున్నాడు. (సామె. 23:15, 16) మీ మాటల్లోనే కాదు, మీ చేతల్లో కూడా అలా చేయవచ్చు. యెహోవాకు నచ్చినట్టు జీవించడం ద్వారా ఆయన మీద మీకు నిజంగా ప్రేమ ఉందని చూపిస్తారు. (1 యోహా. 5:3) అదే మీ జీవితంలో మీరు పెట్టుకోగల మంచి లక్ష్యం.

15. యెహోవా మీద ప్రేమను మీ చేతల్లో ఎలా చూపించవచ్చు?

15 యెహోవా మీద ప్రేమను మీ చేతల్లో ఎలా చూపించవచ్చు? ముందు, మీరు సత్యదేవునికి సమర్పించుకుంటున్నారని ఒంటరిగా ప్రార్థనలో చెప్పండి. (కీర్త. 40:8) తర్వాత, మీరలా సమర్పించుకున్నారని అందరికీ తెలిసేలా బాప్తిస్మం తీసుకోండి. మనం ఈ ఆర్టికల్‌లో ముందు చూసినట్టు, అలా బాప్తిస్మం తీసుకునే రోజు మీ జీవితంలో మరపురాని మధుర క్షణంగా ఉంటుంది. మీ జీవితంలో ఒక కొత్త పేజీ మొదలౌతుంది, అది మీకోసం కాదు యెహోవా కోసం. (రోమా. 14:8; 1 పేతు. 4:1, 2) వినడానికి ఇది చాలా పెద్ద పనిగా అనిపించవచ్చు. నిజమే, అది పెద్ద పనే. కానీ దానివల్ల మీరు ఒక కొత్త జీవితానికి నాంది పలుకుతారు. అదెలా?

16. తమ జీవితాన్ని యెహోవాకు అంకితం చేసినవాళ్లకు ఎలాంటి భవిష్యత్తు ఉంటుందని కీర్తన 41:12 చెప్తుంది?

16 యెహోవాది పెద్ద చేయి. ఎంతగా అంటే మనం ఆయనకు రవ్వంత ఇచ్చినా ఆయన తిరిగి కొండంత ఇస్తాడు. (మార్కు 10:29, 30) ఆయుష్షు నిండిపోయిన ఈ లోకంలో కూడా మీ జీవితం సంతృప్తిగా, సంతోషంగా, ఆసక్తిగా సాగిపోయేలా ఆయన చేయగలడు. అయితే, ఇది కేవలం ఆరంభం మాత్రమే. మీ ప్రియ పరలోక తండ్రిని సేవించాలనే మీ ప్రయాణం బాప్తిస్మంతో మొదలై, ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఎంతవరకు అంటే, యెహోవా ఉన్నంతవరకు మీరు కూడా ప్రాణాలతో ఉంటూ ఆయన సేవ చేయగలుగుతారు. అలా మీకు, మీ పరలోక తండ్రికి మధ్య ప్రేమ రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది.—కీర్తన 41:12 చదవండి.

17. అన్నీ ఇచ్చిన యెహోవాకు మీరేం ఇవ్వగలరు?

17 మీరు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకుంటే మీ పరలోకపు తండ్రికి విలువైనది ఇచ్చే అవకాశం మీకు ఉంటుంది. ఇప్పటివరకు మీకున్న మంచివన్నీ, మీరు గడిపిన మధుర క్షణాలన్నీ ఆయన ఇచ్చినవే. ఈ ఆకాశం, భూమి సమస్తం ఆయనవే. కానీ ఆయన దగ్గర ఒకటి లేదు. అదే, మనసారా అంకితభావంతో మీరు చేసే సేవ. యెహోవా మీకిచ్చిన వాటన్నిటి పట్ల కృతజ్ఞతతో అది మీరు ఆయనకు ఇవ్వచ్చు. (యోబు 1:8; 41:11; సామె. 27:11) మీ జీవితాన్ని యెహోవాకు ఇవ్వడంకన్నా మంచిపని ఇంకేమైనా ఉంటుందా? మీరు బాప్తిస్మం తీసుకోవడానికి యెహోవా మీద ప్రేమే ముఖ్యమైన కారణమని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఇక ఆలస్యం దేనికి?

18. మీరు ఏ ప్రశ్నలు వేసుకోవచ్చు?

18 మీరు బాప్తిస్మం తీసుకుంటారా అని మిమ్మల్ని అడిగితే మీ జవాబు ఏంటి? ఆ ప్రశ్నకు మీరు మాత్రమే జవాబివ్వగలరు. ‘ఇక బాప్తిస్మం తీసుకోవడానికి నేను ఎందుకు ఆలస్యం చేస్తున్నాను?’ అని ఆలోచించడం మంచిది. (అపొ. 8:36) ఈ ఆర్టికల్‌లో చర్చించిన మూడు కారణాలు మీకు గుర్తున్నాయా? మొదటిది మీరు సత్యాన్ని, నీతిని ప్రేమిస్తున్నారు. దానిగురించి ఈ ప్రశ్న వేసుకోండి: ‘అందరూ సత్యం మాట్లాడుతూ, సరైనది చేసే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నానా?’ రెండోది, మీరు యేసుక్రీస్తును ప్రేమిస్తున్నారు. దానిగురించి ఈ ప్రశ్న వేసుకోండి: ‘దేవుని కుమారుడిని నా రాజుగా కోరుకుంటూ, ఆయన్ని అనుకరించాలని అనుకుంటున్నానా?’ మూడోదీ అన్నిటికన్నా ముఖ్యమైనదీ ఏంటంటే, మీరు యెహోవాను ప్రేమిస్తున్నారు. దానిగురించి ఈ ప్రశ్న వేసుకోండి: ‘నా దేవుడిగా యెహోవాను సేవిస్తూ, ఆయన హృదయాన్ని సంతోషపెట్టాలని అనుకుంటున్నానా?’ ఈ ప్రశ్నలన్నిటికీ మీ జవాబు అవును అయితే, ఇక బాప్తిస్మం తీసుకోవడానికి ఆలస్యం దేనికి?అపొ. 16:33.

19. మీరు బాప్తిస్మం తీసుకోవడానికి ఎందుకు వెనకాడకూడదు? ఉదాహరణ చెప్పండి. (యోహాను 4:34)

19 మీరు బాప్తిస్మం తీసుకోవడానికి వెనకాడుతుంటే, యేసు చెప్పిన ఈ ఉదాహరణ గురించి ఆలోచించండి. (యోహాను 4:34 చదవండి.) తన తండ్రి ఇష్టాన్ని చేయడాన్ని ఆయన ఆహారంతో పోల్చాడు. ఎందుకు? ఆహారం మనకు మంచే చేస్తుంది. యెహోవా మనకు చేయమని చెప్పిన ప్రతీది మన మంచికే అని యేసుకు తెలుసు. మనకు హాని కలిగించేది ఏదైనా చేయమని యెహోవా అడుగుతాడా? అడగడు కదా. మరి, మీరు బాప్తిస్మం తీసుకోవాలని యెహోవా ఇష్టపడుతున్నాడా? అవును. (అపొ. 2:38) అలాగైతే, యెహోవా చెప్పింది చేయడంవల్ల మీకు ఖచ్చితంగా మంచే జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, మీకు ఎంతో ఇష్టమైన ఆహారాన్ని తినడానికి వెనకాడనప్పుడు, బాప్తిస్మం తీసుకోవడానికి ఎందుకు వెనకాడాలి!

20. తర్వాతి ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

20 ఇక ఆలస్యం దేనికి అని అడిగితే, చాలామంది “నేను రెడీగా లేను” అని అంటారు. నిజమే యెహోవాకు సమర్పించుకోవడం, బాప్తిస్మం తీసుకోవడం తొందరపడి చేసే పని కాదు. అది చాలా ప్రాముఖ్యమైంది. అందుకే, మీరు దానికోసం జాగ్రత్తగా ఆలోచించాలి. సమయం తీసుకుని అర్హతలు సంపాదించడానికి కృషిచేయాలి. ఒకవేళ మీకు బాప్తిస్మం తీసుకోవాలనే బలమైన కోరిక ఉంటే ఇప్పుడే దానికోసం ఎలా సిద్ధపడవచ్చు? ఈ ప్రశ్న గురించి తర్వాతి ఆర్టికల్‌లో చర్చిస్తాం.

పాట 28 యెహోవా స్నేహాన్ని సంపాదించుకోవడం

a ప్రతీ బైబిలు విద్యార్థి బాప్తిస్మం తీసుకోవడం ప్రాముఖ్యం. అయితే, ఒక విద్యార్థి ఏ కారణంతో బాప్తిస్మం తీసుకోవాలి? ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రేమ. ఇంతకీ దేనిమీద ప్రేమ, ఎవరిమీద ప్రేమ? ఈ ఆర్టికల్‌లో దానిగురించి తెలుసుకుంటాం. అలాగే బాప్తిస్మం తర్వాత వాళ్ల జీవితం ఎలా ఉంటుందో కూడా చూస్తాం.