కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 13

మీ పిల్లలకు సృష్టిని చూపిస్తూ యెహోవా గురించి నేర్పించండి

మీ పిల్లలకు సృష్టిని చూపిస్తూ యెహోవా గురించి నేర్పించండి

“వీటిని ఎవరు సృష్టించారు?”—యెష. 40:26.

పాట 11 సృష్టి దేవుణ్ణి స్తుతిస్తోంది

ఈ ఆర్టికల్‌లో a

1. తల్లిదండ్రులు దేనికోసం పరితపిస్తారు?

 పిల్లలు యెహోవాను తెలుసుకుని, ఆయన్ని ప్రేమించేలా సహాయం చేయాలని తల్లిదండ్రులందరూ పరితపిస్తారు. కానీ దేవుడు కనిపించడు కదా, మరి మీ పిల్లలు ఆయన్ని ఒక నిజమైన వ్యక్తిలా చూడాలన్నా, ఆయనకు దగ్గరవ్వాలన్నా మీరేం చేయవచ్చు?—యాకో. 4:8.

2. పిల్లలకు యెహోవా లక్షణాల గురించి ఎలా నేర్పించవచ్చు?

2 పిల్లలు యెహోవాకు దగ్గరయ్యేలా చేయడానికి మొట్టమొదటి పద్ధతి, వాళ్లతో బైబిలు స్టడీ చేయడం. (2 తిమో. 3:14-17) అయితే, ఇంకొక పద్ధతి కూడా ఉందని బైబిలు చెప్తుంది. దాని గురించే సామెతల పుస్తకం చెప్తుంది. అక్కడ ఒక తండ్రి తన కొడుకుతో మాట్లాడుతూ సృష్టిలో కనిపించే యెహోవా లక్షణాల్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయవద్దని చెప్పాడు. (సామె. 3:19-21) తమ పిల్లలకు యెహోవా లక్షణాల గురించి నేర్పించడానికి తల్లిదండ్రులు ఈ సృష్టిని ఎలా ఉపయోగించవచ్చో కొన్ని పద్ధతుల్ని ఇప్పుడు చూద్దాం.

సృష్టిని చూపిస్తూ నేర్పించండి—ఎలా?

3. పిల్లలతో సరదాగా బయటికి వెళ్లినప్పుడు తల్లిదండ్రులు ఏం చేయవచ్చు?

3 దేవుని “అదృశ్య లక్షణాలు, … లోకం సృష్టించబడినప్పటి నుండి స్పష్టంగా కనిపిస్తున్నాయి; ఆయన చేసినవాటిని గమనించడం ద్వారా ఆ లక్షణాల్ని తెలుసుకోవచ్చు” అని బైబిలు చెప్తుంది. (రోమా. 1:20) తల్లిదండ్రులారా, బహుశా మీ పిల్లలతో కలిసి సరదాగా బయటికి వెళ్లడం మీరు ఇష్టపడుతుండవచ్చు. అయితే, ఆ సమయాన్ని ఉపయోగించి యెహోవా ‘చేసిన వాటిలో’ ఆయనకున్న లక్షణాల్ని చూసేలా మీ పిల్లలకు సహాయం చేయండి. ఈ విషయంలో, యేసు బోధించిన విధానం నుండి తల్లిదండ్రులు ఏం నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

4. యేసు ఈ సృష్టిని ఉపయోగించుకుని ఎలా బోధించాడు? (లూకా 12:24, 27-30)

4 యేసు ఈ సృష్టిని ఉపయోగించుకుని ఎలా బోధించాడో గమనించండి. ఒక సందర్భంలో కాకుల్ని, లిల్లీ పువ్వుల్ని గమనించమని తన శిష్యులకు చెప్పాడు. (లూకా 12:24, 27-30 చదవండి.) యేసు కావాలనుకుంటే వేరే ఏ జంతువునైనా లేదా చెట్టునైనా చూపించి మాట్లాడవచ్చు. కానీ ఆయన పక్షిని, పువ్వుల్నే ఎందుకు ఉపయోగించాడు? ఎందుకంటే ఆయన శిష్యులకు అవి బాగా తెలుసు. ఆ శిష్యులు బహుశా కాకులు ఆకాశంలో ఎగరడం, పొలాల్లో పువ్వులు పూయడం చాలాసార్లు చూసివుంటారు. యేసు వాటివైపు చూపిస్తూ మాట్లాడడాన్ని ఒక్కసారి ఊహించండి. వాటిగురించి చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడు? వాళ్ల పరలోక తండ్రి చాలా పెద్ద మనసుగలవాడని, ఎంతో దయగలవాడని శిష్యులు అర్థంచేసుకునేలా ఒక శక్తివంతమైన పాఠాన్ని నేర్పించాడు. అదేంటంటే: యెహోవా కాకుల్ని, పువ్వుల్నే చూసుకుంటున్నాడంటే తన నమ్మకమైన సేవకులకు తప్పకుండా ఆహారాన్ని, బట్టల్ని ఇస్తాడు.

5. పిల్లలకు యెహోవా గురించి నేర్పిస్తున్నప్పుడు తల్లిదండ్రులు సృష్టిని ఎలా ఉపయోగించవచ్చు?

5 తల్లిదండ్రులారా మీ పిల్లలకు యేసులా ఎలా బోధించవచ్చు? బహుశా ఈ సృష్టిలో మీకు బాగా నచ్చే జంతువు లేదా చెట్టు గురించి వాళ్లతో చెప్పవచ్చు. అలా చెప్తున్నప్పుడు, ఆ జంతువు లేదా చెట్టు యెహోవాకున్న ఏ లక్షణాన్ని చూపిస్తుందో వాళ్లకు వివరించవచ్చు. ఆ తర్వాత, మీ పిల్లలకు ఇష్టమైన జంతువు లేదా చెట్టు గురించి అడగవచ్చు. అలా అడిగినప్పుడు ఈ సృష్టిలో ఉన్న యెహోవా లక్షణాల గురించి మీరు మాట్లాడుతుంటే వాళ్లు ఇంకా శ్రద్ధగా వినడానికి ఇష్టపడతారు.

6. క్రిస్టఫర్‌ వాళ్ల అమ్మ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

6 అయితే, ఏదైనా జంతువు గురించి లేదా చెట్టు గురించి పిల్లలకు చెప్పాలంటే తల్లిదండ్రులు చాలా టైం తీసుకుని, రీసర్చ్‌ చేయాల్సిన అవసరం ఉందా? అవసరంలేదు. యేసు కాకులు ఏమేం తింటాయి, లిల్లీ పువ్వులు ఎలా పెరుగుతాయి అనే దానిగురించి గంటలకొద్దీ ఉపన్యాసం ఏమీ ఇవ్వలేదు. నిజమే, కొన్నిసార్లు సృష్టిలో ఉన్న లోతైన విషయాల గురించి చెప్తున్నప్పుడు మీ పిల్లలు కుతూహలంతో వినవచ్చు. కానీ చాలావరకు సింపుల్‌గా చెప్పినా, ఒక ప్రశ్న వేసినా సరిపోతుంది. క్రిస్టఫర్‌ అనే బ్రదర్‌ తన చిన్ననాటి రోజుల్ని నెమరువేసుకుంటూ ఇలా అన్నాడు: “మా చుట్టూవున్న ప్రకృతి గురించి మా మమ్మీ కొన్ని విషయాలు చెప్తూ ఉండేది. ఉదాహరణకు, మేము కొండల్ని చూసినప్పుడు ‘ఆ కొండలు చూడు ఎంత పెద్దగా, ఎంత అందంగా ఉన్నాయో! యెహోవా ఎంత గొప్పవాడో కదా!’ అని అనేది. లేదా మేము సముద్రం దగ్గరికి వెళ్లినప్పుడు ‘ఆ అలలు ఎంత ఎత్తున ఎగసిపడుతున్నాయో చూడు, యెహోవా చాలా శక్తివంతుడు కదా!’ అని చెప్పేది. ఇలా చాలా సింపుల్‌గా, చిన్నచిన్న మాటల్లో చెప్పిన విషయాలే మమ్మల్ని చాలా ఆలోచింపజేశాయి.”

7. సృష్టి గురించి ఆలోచించేలా మీ పిల్లలకు ఎలా శిక్షణ ఇవ్వచ్చు?

7 మీ పిల్లలు పెరిగేకొద్దీ, సృష్టి గురించి ఎక్కువ ఆలోచించేలా, దాన్నుండి యెహోవా లక్షణాలు నేర్చుకునేలా వాళ్లకు శిక్షణ ఇవ్వండి. దానికోసం సృష్టిలో యెహోవా చేసిన ఏదోకటి చూపించండి. ఆ తర్వాత, “ఇది యెహోవా గురించి ఏం నేర్పిస్తుంది?” అని అడగండి. అప్పుడు వాళ్లిచ్చిన జవాబుకు మీరు ఆశ్చర్యపోతారు, ఎంతో మురిసిపోతారు.—మత్త. 21:16.

సృష్టిని చూపిస్తూ నేర్పించండి—ఎప్పుడు?

8. ఇశ్రాయేలీయులు “దారిలో” వెళ్తున్నప్పుడు వాళ్లకు ఏ అవకాశాలు దొరికేవి?

8 తమ పిల్లలకు, “దారిలో” నడుస్తున్నప్పుడు యెహోవా గురించి బోధించాలని ఇశ్రాయేలీయులైన తల్లిదండ్రులకు దేవుడు చెప్పాడు. (ద్వితీ. 11:19) ఇశ్రాయేలు పల్లెల్లో నడుస్తున్నప్పుడు, దారిపొడవునా ఎన్నో ప్రకృతి అందాలు కనిపించేవి. వాళ్లకు రకరకాల జంతువులు, పక్షులు, పువ్వులు కనిపించేవి. కాబట్టి ఇశ్రాయేలీయులు దారిలో వెళ్తున్నప్పుడు, తమ పిల్లల్లో యెహోవా సృష్టి మీద ఆసక్తిని చిగురింపజేసే ఎన్నో అవకాశాలు వాళ్లకు దొరికేవి. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకు సృష్టి గురించి నేర్పించడానికి అలాంటి అవకాశాల్నే ఉపయోగించవచ్చు. కొంతమంది తల్లిదండ్రులు దీన్ని ఎలా చేశారో గమనించండి.  

9. పునీత, కాట్యా నుండి మీరేం నేర్చుకున్నారు?

9 ఇండియాలో పునీత అనే ఒక సిస్టర్‌ ఇలా చెప్తుంది: “మేము పల్లెటూరిలో ఉన్న మా కుటుంబాన్ని చూడడానికి వెళ్లినప్పుడు, ఈ అద్భుతమైన సృష్టిని చూపిస్తూ యెహోవా గురించి పిల్లలకు నేర్పించడానికి ప్రయత్నించేవాళ్లం. జనాలతో, ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోయిన ఈ సిటీలకు దూరంగా వెళ్లినప్పుడే పిల్లలు సృష్టి గురించి బాగా అర్థం చేసుకుంటారని నాకు అనిపించింది.” తల్లిదండ్రులారా, ప్రకృతికి దగ్గరగా మీ పిల్లలతో గడిపిన క్షణాల్ని వాళ్లు ఎప్పటికీ మర్చిపోలేరు. మాల్డోవాలో ఉంటున్న కాట్యా అనే సిస్టర్‌ ఇలా చెప్తుంది: “నా చిన్ననాటి మధుర క్షణాలన్నీ చాలావరకు మా అమ్మానాన్నలతో పల్లెటూరిలో గడిపినవే. చిన్నప్పటినుండే సృష్టిని చూసిన ప్రతీసారి ఆగి యెహోవా గురించి ఆలోచించడాన్ని మా అమ్మానాన్నలు నేర్పించారు. దానికి వాళ్లకు ఎంతో రుణపడి ఉన్నాను.”

సిటీల్లో కూడా యెహోవా గురించి మీ పిల్లలకు నేర్పించడానికి ఈ సృష్టిలో ఎన్నో ఉంటాయి (10వ పేరా చూడండి)

10. మీరు ప్రకృతిని చూడ్డానికి వెళ్లే పరిస్థితి లేకపోతే ఏం చేయవచ్చు? (“ తల్లిదండ్రుల కోసం” అనే బాక్సు చూడండి.)

10 అయితే మీరు ప్రకృతిని చూడ్డానికి వెళ్లే పరిస్థితి లేకపోతే, అప్పుడేంటి? ఇండియాలో ఉంటున్న అమల్‌ అనే బ్రదర్‌ ఇలా చెప్తున్నాడు: “మేము ఉంటున్న ప్రాంతంలో అమ్మానాన్నలు చాలా గంటలు పనిచేయాల్సి వస్తుంది. ప్రకృతిని చూడ్డానికి వెళ్లాలంటే చాలా డబ్బుతో కూడుకున్న పని. కాబట్టి చిన్న పార్కుకి లేదా డాబా పైకి వెళ్లి సృష్టిని గమనించవచ్చు, యెహోవాకున్న లక్షణాల గురించి మాట్లాడుకోవచ్చు.” మీరు జాగ్రత్తగా గమనిస్తే, బహుశా మీ ఇంటి చుట్టుపక్కలే సృష్టిలో ఉన్న ఎన్నో అందాలు కనిపిస్తాయి. వాటిని మీ పిల్లలకు చూపించవచ్చు. (కీర్త. 104:24) బహుశా మీకు పక్షులు, చీమలు, పురుగులు, చెట్లు ఇంకా ఎన్నో కనిపిస్తాయి. జర్మనీలో ఉంటున్న కరీనా అనే సిస్టర్‌ ఇలా చెప్తుంది: “మా మమ్మీకి పువ్వులంటే ప్రాణం. నా చిన్నతనంలో మేము సరదాగా నడుస్తున్నప్పుడు, మా మమ్మీ అందమైన పువ్వుల్ని చూపించేది.” తల్లిదండ్రులారా, మీ పిల్లలకు సృష్టి గురించి నేర్పించడానికి సంస్థ తయారుచేసిన వీడియోల్ని, ఆర్టికల్స్‌ని కూడా ఉపయోగించవచ్చు. అవును, మీ పరిస్థితులు ఎలాంటివైనా ఈ సృష్టిని చూసేలా మీ పిల్లలకు సహాయం చేయవచ్చు. ఈ సృష్టిలో యెహోవా లక్షణాల్ని మీ పిల్లలకు ఎలా చూపించవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం.

యెహోవా “అదృశ్య లక్షణాలు సృష్టిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి”

11. పిల్లలు యెహోవా ప్రేమను అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులు ఏం చేయవచ్చు?

11 మీ పిల్లలు యెహోవా ప్రేమను అర్థం చేసుకోవడానికి, జంతువులు వాటి పిల్లల్ని ఎలా సంరక్షిస్తాయో చూపించవచ్చు. (మత్త. 23:37) అంతేకాదు, ఈ సృష్టిలో ఉన్న రకరకాల ప్రకృతి అందాల్ని మీరు వాళ్లకు చూపించవచ్చు. ఇంతకుముందు చెప్పిన కరీనా అనే సిస్టర్‌ ఇలా గుర్తుచేసుకుంటుంది: “మేము సరదాగా నడవడానికి వెళ్లినప్పుడు మా మమ్మీ, ఆగి ప్రతీ పువ్వును చూడమని చెప్పేది. పువ్వులన్నీ ఒకదానికొకటి ఎలా వేరుగా ఉన్నాయో, వాటి అందం యెహోవా ప్రేమకు ఎలా అద్దంపడుతుందో ఆలోచించమని చెప్పేది. సంవత్సరాలు గడిచినా, నేను ఇప్పటికీ పువ్వుల్ని జాగ్రత్తగా గమనిస్తాను. వాటి రంగును, రూపురేఖల్ని, వైవిధ్యాన్ని చూస్తాను. యెహోవా నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అవన్నీ గుర్తుచేస్తాయి.”

అద్భుతంగా తయారుచేయబడిన మన శరీరాన్ని చూపించి, మీ పిల్లలకు యెహోవా తెలివి గురించి నేర్పించవచ్చు (12వ పేరా చూడండి)

12. పిల్లలు దేవుని తెలివిని అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులు ఏం చేయవచ్చు? (కీర్తన 139:14) (చిత్రం కూడా చూడండి.)

12 మీ పిల్లలు దేవుని తెలివిని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. యెహోవా మన అందరికన్నా చాలా తెలివైనవాడు. (రోమా. 11:33) ఉదాహరణకు, నీళ్లన్నీ మబ్బుల్లా తయారై గాల్లో ఎలా తేలుతాయో చూపించవచ్చు. (యోబు 38:36, 37) అంతేకాదు, మనిషి శరీరం ఎంత అద్భుతంగా తయారు చేయబడిందో చెప్పవచ్చు. (కీర్తన 139:14 చదవండి.) వ్లాడీమిర్‌ అనే బ్రదర్‌ ఇలా చెప్తున్నాడు: “ఒకరోజు మా అబ్బాయి సైకిల్‌ మీద నుండి కిందపడి దెబ్బ తగిలించుకున్నాడు. కొన్నిరోజులకు అది మానిపోయింది. దాన్ని ఉపయోగించుకుని నేనూ, నా భార్య యెహోవా మన శరీరాన్ని దానంతటదే బాగుచేసుకునే సామర్థ్యంతో ఎలా సృష్టించాడో వివరించాం. మనిషి తయారుచేసిన ఏ వస్తువులో కూడా ఈ సామర్థ్యం ఉండదు అని చెప్పాం. ఉదాహరణకు, ఒక కారుకు యాక్సిడెంట్‌ అయ్యి, పాడైతే దానంతటదే బాగుచేసుకోలేదు కదా అని మేము వివరించాం. దీనివల్ల, మా అబ్బాయి యెహోవా తెలివి గురించి అర్థం చేసుకోగలిగాడు.”

13. పిల్లలు దేవుని శక్తిని అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులు ఏం చేయవచ్చు? (యెషయా 40:26)

13 మన కళ్లు పైకెత్తి ఆకాశాన్ని, వాటివాటి స్థానాల్లో ఉన్న నక్షత్రాల్ని చూసి తన శక్తి గురించి ఆలోచించమని యెహోవా చెప్తున్నాడు. (యెషయా 40:26 చదవండి.) మీరు కూడా ఆకాశాన్ని, అందులో ఉన్న నక్షత్రాల్ని చూడమని మీ పిల్లలకు చెప్పండి. తైవాన్‌లో ఉన్న షిన్‌షిన్‌ అనే సిస్టర్‌ తన చిన్ననాటి రోజుల్ని గుర్తుచేసుకుంటూ ఇలా చెప్పింది: “ఒకరోజు మా మమ్మీ నన్ను ప్రకృతికి దగ్గరగా ఉండే ఒక క్యాంపుకు తీసుకెళ్లింది. సిటీ లైట్లకు దూరంగా ఉన్నాం కాబట్టి ఆకాశంలో ఉన్న మెరిసే తారల్ని చాలా స్పష్టంగా చూడగలిగాం. నిజానికి ఆ సమయంలో, నా క్లాస్‌మేట్స్‌ నుండి నాకు చాలా ఒత్తిడి వచ్చింది. నేను యెహోవాకు నమ్మకంగా సేవ చేయలేనేమో అని నాకు అనిపించింది. కానీ మమ్మీ అప్పుడు, ఇన్ని నక్షత్రాలు తయారుచేసే శక్తి ఉన్న యెహోవా, నీ కష్టాన్ని తట్టుకోవడానికి కావల్సిన శక్తిని ఇవ్వలేడా? అని చెప్పింది. అలా యెహోవా సృష్టిని ఆ క్యాంపులో దగ్గరగా చూడడంవల్ల, ఆయన గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే కోరిక కలిగింది, ఆయనకు నమ్మకంగా సేవచేయాలనే నా నిర్ణయం బలపడింది.”

14. యెహోవా సంతోషంగల దేవుడని పిల్లలు అర్థం చేసుకునేలా తల్లిదండ్రులు ఏం చేయవచ్చు?

14 యెహోవా సంతోషంగల దేవుడు, మనం కూడా సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగని ఈ సృష్టిని బట్టి మనం చెప్పవచ్చు. చాలా జంతువులు ఆఖరికి పక్షులు, చేపలు కూడా ఆటలు ఆడతాయని సైంటిస్టులు గమనించారు. (యోబు 40:20) ఏవైనా జంతువులు ఆడుకోవడం చూసి మీ పిల్లలు నవ్వుకున్నారా? బహుశా కుక్కపిల్ల తన తోకను తనే పట్టుకోవడానికి గిరగిరా తిరిగినప్పుడు, కోతి ఒక కొమ్మ నుండి ఇంకో కొమ్మ మీదికి దూకినప్పుడు మీ పిల్లలు నవ్వుంటారు. కాబట్టి ఈసారి ఏదైనా జంతువు చేష్టల్ని చూసి మీ పిల్లలు నవ్వితే, మనం సంతోషంగల దేవున్ని ఆరాధిస్తున్నామని గుర్తుచేయండి.—1 తిమో. 1:11.

కుటుంబమంతా కలిసి యెహోవా సృష్టిని ఆస్వాదించండి

మీతో కలిసి ప్రకృతిని ఆనందిస్తున్నప్పుడు పిల్లలకు ప్రశాంతంగా అనిపిస్తుంది, మనసువిప్పి మాట్లాడగలుగుతారు (15వ పేరా చూడండి)

15. పిల్లల మనసు తెలుసుకోవడానికి తల్లిదండ్రులు ఏం చేయవచ్చు? (సామెతలు 20:5) (చిత్రం కూడా చూడండి.)

15 పిల్లల సమస్యలు ఏంటో తెలుసుకోవడం కొన్నిసార్లు తల్లిదండ్రులకు కష్టంగా అనిపించవచ్చు. మీ పరిస్థితి కూడా అదే అయితే, మీ పిల్లల మనసును ఎలా తెలుసుకోవచ్చు? (సామెతలు 20:5 చదవండి.) పిల్లలతో కలిసి ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్లినప్పుడు, పిల్లల మనసు అర్థం చేసుకోవడం చాలా ఈజీ అయిందని కొంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారు. ఎందుకు? ఒక కారణం ఏంటంటే, ప్రకృతిని చూడ్డానికి వెళ్లినప్పుడు తల్లిదండ్రులకు, పిల్లలకు ఇద్దరికీ ఈ ఉరుకులుపరుగుల జీవితంలో కాస్త విరామం దొరుకుతుంది. తైవాన్‌లో ఉంటున్న మసాహీకో అనే బ్రదర్‌ ఇంకో కారణాన్ని చెప్తున్నాడు: “మా పిల్లలతో సరదాగా కొండలు ఎక్కుతున్నప్పుడు లేదా బీచ్‌ పక్కన నడుస్తున్నప్పుడు వాళ్లు చాలా ప్రశాంతంగా ఫీలౌతారు. వాళ్ల మనసులో ఉన్నదంతా చెప్తారు. దాంతో వాళ్ల మనసును అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది.” ఇంతకుముందే ప్రస్తావించిన కాట్యా అనే సిస్టర్‌ ఇంకా ఇలా చెప్తుంది: “స్కూల్‌ తర్వాత మా మమ్మీ నన్ను పార్కుకి తీసుకెళ్లేది. ప్రశాంతమైన ఆ వాతావరణంలో నా భయాలన్నీ, స్కూల్లో జరిగినవన్నీ మా మమ్మీకి మనసువిప్పి చెప్పేదాన్ని.”

16. కుటుంబాలు ప్రశాంతంగా, సరదాగా సమయం గడపడానికి ఏం చేయవచ్చు?

16 కుటుంబాలు ప్రశాంతంగా, సరదాగా సమయం గడపడానికి కూడా యెహోవా చేసిన ఈ సృష్టి మంచి అవకాశాన్ని ఇస్తుంది. దీనివల్ల కుటుంబ బంధాలు కూడా బలపడతాయి. “నవ్వడానికి … గంతులు వేయడానికి ఒక సమయం” ఉందని బైబిలు చెప్తుంది. (ప్రసం. 3:1, 4, అధస్సూచి) యెహోవా తయారుచేసిన ఈ అందమైన భూమ్మీద మనకు నచ్చిన ప్రదేశానికి వెళ్లి, మన మనసుకు నచ్చిన పనిచేసే అవకాశం మనందరికీ ఉంది. చాలా కుటుంబాలు ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రాంతాల్ని, జూ పార్క్‌ని, కొండల్ని, బీచ్‌లను చుట్టి రావడాన్ని ఇష్టపడతారు. కొంతమంది పిల్లలైతే, పార్కుల్లో తనివితీరా పరుగెత్తి ఆడుకోవడాన్ని ఇష్టపడతారు. జంతువుల్ని చూడడాన్ని, నదిలో, సముద్రంలో, లేదా బీచ్‌లో ఈత కొట్టడాన్ని ఇష్టపడతారు. చూడాలేగానీ ఈ అందమైన భూమిపై మనం మనసారా ఆస్వాదించడానికి యెహోవా ఎన్నిటినో తయారుచేశాడు!

17. పిల్లలు దేవుని సృష్టిని ఆనందించడానికి తల్లిదండ్రులు ఎందుకు సహాయం చేయాలి?

17 కొత్తలోకంలో తల్లిదండ్రులు, పిల్లలు యెహోవా సృష్టిని ముందెప్పటికన్నా ఎక్కువ ఆనందిస్తారు. అప్పుడు మనం ఏ జంతువుకీ భయపడాల్సిన అవసరంలేదు. అవి కూడా మనల్ని చూసి భయపడవు. (యెష. 11:6-9) యెహోవా సృష్టిని ఆస్వాదించడానికి మనకు లెక్కలేనంత టైం ఉంటుంది. (కీర్త 22:26) కానీ తల్లిదండ్రులారా, మీ పిల్లలు సృష్టిని ఆనందించడానికి కొత్తలోకం వచ్చే వరకు ఆగకండి. మీరు సృష్టిని ఉపయోగించి మీ పిల్లలకు యెహోవా గురించి నేర్పిస్తున్నప్పుడు, వాళ్లు రాజైన దావీదులాగే ఇలా అంటారు: “యెహోవా, … నీ పనులు సాటిలేనివి.”—కీర్త. 86:8.

పాట 134 పిల్లలు యెహోవా ఇచ్చిన బాధ్యత

a చాలామంది బ్రదర్స్‌, సిస్టర్స్‌కి తమ తల్లిదండ్రులతో కలిసి సృష్టిని ఆస్వాదించిన ఎన్నో మధుర క్షణాలు ఉండివుంటాయి. వాళ్ల తల్లిదండ్రులు ఆ సందర్భాల్ని ఉపయోగించుకుని, యెహోవా గురించి నేర్పించిన విషయాల్ని వాళ్లు ఎప్పటికీ మర్చిపోలేరు. ఒకవేళ మీకు పిల్లలు ఉంటే, సృష్టిని చూపిస్తూ యెహోవాకున్న లక్షణాల గురించి వాళ్లకు ఎలా నేర్పించవచ్చు? ఈ ఆర్టికల్‌లో ఆ ప్రశ్న గురించి చర్చిస్తాం.