కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 11

పాట 129 సహనం చూపిస్తూ ఉందాం

ఆశలు ఆవిరైనా యెహోవా సేవను పట్టుదలగా చేయండి

ఆశలు ఆవిరైనా యెహోవా సేవను పట్టుదలగా చేయండి

“నువ్వు నా పేరు కోసం ఎన్నో సహించావు.”ప్రక. 2:3.

ముఖ్యాంశం

మన ఆశలు ఆవిరైనా యెహోవా సేవను పట్టుదలగా చేస్తూ ఉండగలం.

1. యెహోవా సంస్థలో ఒకరిగా ఉండడం వల్ల మనం ఎలాంటి దీవెనలు పొందుతున్నాం?

 అల్లకల్లోలంగా ఉన్న ఈ చివరిరోజుల్లో యెహోవా సంస్థలో ఒకరిగా ఉండడం మనందరికి దొరికిన గొప్ప దీవెన. లోకంలో పరిస్థితులు ఎంత దారుణంగా తయారౌతున్నా, మనకు తోడుగా ఉండడానికి యెహోవా బ్రదర్స్‌-సిస్టర్స్‌ని ఇచ్చాడు. (కీర్త. 133:1) మన కుటుంబ అనుబంధాల్ని నిలబెట్టుకోవడానికి సహాయం చేస్తున్నాడు. (ఎఫె. 5:33–6:1) అలాగే ఒత్తిళ్లలో సంతోషంగా ఉండడానికి కావల్సిన తెలివిని ఇస్తున్నాడు.

2. మనం ఏం చేస్తూ ఉండాలి? ఎందుకు?

2 అయితే, మనం యెహోవా సేవను నమ్మకంగా చేస్తూ ఉండడానికి కృషిచేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు వేరేవాళ్లు మనల్ని బాధపెట్టవచ్చు. ఇంకొన్నిసార్లు మనమే చేసిన తప్పుల్ని మళ్లీమళ్లీ చేస్తూ డీలా పడిపోవచ్చు. ఈ ఆర్టికల్‌లో మనం మూడు విషయాల గురించి చూస్తాం. (1) బ్రదర్స్‌సిస్టర్స్‌ మనల్ని గాయపర్చినా, (2) భర్త లేదా భార్య మన ఆశల్ని నీరుగార్చినా, (3) మన తప్పుల వల్ల నిరాశలో కూరుకుపోయినా యెహోవా సేవను ఎలా చేస్తూ ఉండవచ్చో చూస్తాం. దాంతోపాటు బైబిల్లో ఇలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొన్న ముగ్గురి నుండి మనమేం నేర్చుకోవచ్చో చూస్తాం.

బ్రదర్స్‌-సిస్టర్స్‌ మనల్ని గాయపర్చినా . . .

3. మనకు ఏ సమస్య రావచ్చు?

3 సమస్య. కొంతమంది బ్రదర్స్‌-సిస్టర్స్‌ చేసే పనుల వల్ల మనకు చిరాకు రావచ్చు. ఇంకొంతమంది మాటల వల్ల మన గుండె చివుక్కుమనొచ్చు. ఇంకొన్నిసార్లు సంఘపెద్దలు పొరపాట్లు చేయవచ్చు. ఇలాంటివి చూసినప్పుడు ఇది నిజంగా దేవుని సంస్థేనా అనే ప్రశ్న కొంతమందికి రావచ్చు. అలాంటివాళ్లు, మన బ్రదర్స్‌సిస్టర్స్‌తో “ఐక్యంగా” కలిసి యెహోవా సేవ చేసే బదులు, తమను బాధపెట్టినవాళ్లతో ఎడముఖం పెడముఖం అన్నట్టుగా ఉంటారు, ఆఖరికి మీటింగ్స్‌ కూడా మానేస్తారు. (జెఫ. 3:9) మరి అలా చేయడం సరైనదేనా? బైబిల్లో ఇలాంటి సమస్యల్నే ఎదుర్కొన్న ఒక వ్యక్తి నుండి మనం ఏం నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

4. అపొస్తలుడైన పౌలుకు ఏ సమస్యలు వచ్చాయి?

4 బైబిలు ఉదాహరణ. అపొస్తలుడైన పౌలుకు తోటి బ్రదర్స్‌-సిస్టర్స్‌ అపరిపూర్ణులని తెలుసు. ఉదాహరణకు, ఆయన అసలు యేసు శిష్యుడో కాదో అని కొంతమంది భయపడ్డారు. (అపొ. 9:26) ఇంకొంతమంది ఆయన వెనక గోతులు తవ్వి, పేరు పాడుచేయడానికి చూశారు. (2 కొరిం. 10:10) సంఘంలో ఒక పెద్ద వేరేవాళ్లను తడబడేలా చేసే తప్పుడు నిర్ణయాన్ని తీసుకోవడం పౌలు చూశాడు. (గల. 2:11, 12) అంతేకాదు, పౌలుకు దగ్గరి స్నేహితుడైన మార్కు తన నమ్మకాన్ని వమ్ము చేశాడు. (అపొ. 15:37, 38) వీటిలో ఏ ఒక్క కారణాన్నిబట్టి అయినా, తనను బాధపెట్టినవాళ్లకు దూరంగా ఉండాలని పౌలు అనుకోవచ్చు. కానీ ఆయన అలా చేయకుండా, బ్రదర్స్‌సిస్టర్స్‌లో ఉన్న మంచిని చూస్తూ, యెహోవా సేవలో నమ్మకంగా ముందుకెళ్లాడు. అలా ఉండడానికి పౌలుకు ఏది సహాయం చేసింది?

5. బ్రదర్స్‌సిస్టర్స్‌ని క్షమించడానికి పౌలుకు ఏది సహాయం చేసింది? (కొలొస్సయులు 3:13, 14) (చిత్రం కూడా చూడండి.)

5 పౌలు తన తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌ని ప్రేమించాడు. అందుకే వాళ్లలో లోపాల్ని కాకుండా మంచి లక్షణాల్ని చూశాడు. అంతేకాదు, ఆ ప్రేమవల్లే పౌలు ఇతరుల్ని క్షమించగలిగాడు. కొలొస్సయులు 3:13, 14 లో మనల్ని కూడా అదే చేయమని ఆయన రాశాడు. (చదవండి.) ఆ మాటల్ని పౌలు మార్కు విషయంలో ఎలా పాటించాడో గమనించండి. పౌలు మొదటి మిషనరీ యాత్రకు వెళ్లినప్పుడు, మార్కు ఆయన్ని విడిచిపెట్టేశాడు. పౌలుకు బాధగా అనిపించినా, మార్కు మీద కోపం పెంచుకోలేదు. తర్వాత కొలొస్సీ సంఘానికి ఆయన ఉత్తరం రాస్తూ, మార్కు మంచి తోటి పనివాడని “ఎంతో ఊరటను” ఇచ్చాడని పొగిడాడు. (కొలొ. 4:10, 11) రోములో ఖైదీగా ఉన్నప్పుడు కూడా మార్కును సహాయం చేయడానికి రమ్మని పౌలు ప్రత్యేకంగా కోరాడు. (2 తిమో. 4:11) వీటన్నిటినిబట్టి చూస్తే తనను బాధపెట్టిన బ్రదర్స్‌ని పౌలు క్షమించాడని, వాళ్లకు దగ్గరగా ఉన్నాడని అర్థమౌతుంది. మరి పౌలు నుండి మనమేం నేర్చుకోవచ్చు?

పౌలు, బర్నబా, మార్కుల మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. కానీ పౌలు వాటన్నిటినీ మర్చిపోయి, మార్కుతో మనస్ఫూర్తిగా పని చేశాడు (5వ పేరా చూడండి)


6-7. మన బ్రదర్స్‌సిస్టర్స్‌లో లోపాలున్నా వాళ్లను ప్రేమిస్తూనే ఎలా ఉండవచ్చు? (1 యోహాను 4:7)

6 పాఠం. మనం మన బ్రదర్స్‌సిస్టర్స్‌ని ప్రేమిస్తూ ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. (1 యోహాను 4:7 చదవండి.) కాబట్టి ఎవరైనా మనల్ని బాధపెడితే, వాళ్లు కావాలని చేసి ఉండరులే అనుకోవాలి. బహుశా వాళ్లు కూడా యెహోవా సూత్రాల్ని పాటించడానికి ప్రయత్నిస్తున్నారేమో కదా! (సామె. 12:18) తన నమ్మకమైన సేవకుల్లో లోపాలున్నా, యెహోవా వాళ్లను ప్రేమిస్తున్నాడు. మనం తప్పులు చేస్తున్నామని చెప్పి, ఆయన మనల్ని దూరం పెట్టట్లేదు లేదా మన మీద కోపాన్ని పెంచుకోవట్లేదు. (కీర్త. 103:9) యెహోవా మనల్ని క్షమిస్తున్నందుకు మనం చాలా సంతోషిస్తాం, కాబట్టి మనం కూడా వేరేవాళ్లను క్షమిస్తూ యెహోవాలా ఉందాం.—ఎఫె. 4:32–5:1.

7 అంతానికి ఒక్కో మెట్టు దగ్గరౌతుండగా, మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి ఇంకా దగ్గరవ్వాలని మనం గుర్తుంచుకోవాలి. ముందుముందు ఇంకా ఎక్కువ హింస రావచ్చు. విశ్వాసం కారణంగా మనం జైలుకు వెళ్లాల్సి రావచ్చు. ఒకవేళ అదే జరిగితే, అప్పుడు మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ తోడు మనకు చాలా అవసరం. (సామె. 17:17) స్పెయిన్‌లో ఉంటున్న జోసఫ్‌ a అనే సంఘపెద్ద గురించి ఒకసారి ఆలోచించండి. రాజకీయాల్లో ఎవ్వరి పక్షం ఉండనందుకు ఆయన్ని, ఇంకొంతమంది బ్రదర్స్‌ని జైల్లో వేశారు. జోసఫ్‌ ఇలా అంటున్నాడు: “జైల్లో మేమందరం కలిసుంటాం కాబట్టి కొన్నిసార్లు బ్రదర్స్‌ ప్రవర్తన చిరాకు పెట్టే అవకాశం ఉంది. కానీ మేము ఒకరినొకరం భరించుకుంటూ, క్షమించుకుంటూ ఉన్నాం. దానివల్ల మేము కలిసికట్టుగా ఉండగలిగాం. అంతేకాదు, యెహోవాను ఆరాధించని తోటి ఖైదీల ప్రభావం మామీద పడకుండా మమ్మల్ని మేము కాపాడుకోగలిగాం. ఒకసారైతే నా చేతికి దెబ్బ తగిలి, కట్టు వేయడంతో నేను ఏ పనీ చేసుకోలేకపోయాను. అప్పుడు ఒక బ్రదర్‌ నా బట్టలు ఉతికి, నాకు అవసరమైన సహాయం చేశాడు. నాకు సరిగ్గా అవసరమైనప్పుడు నేను నిజమైన ప్రేమను రుచి చూశాను.” మన తోటి బ్రదర్స్‌-సిస్టర్స్‌తో ఏమైనా సమస్యలుంటే దాన్ని ఇప్పుడే పరిష్కరించుకోవడం మంచిది!

భర్త లేదా భార్య మన ఆశల్ని నీరుగార్చినా …

8. పెళ్లయినవాళ్లకు ఏ సమస్య రావచ్చు?

8 సమస్య. పెళ్లి జీవితం పూల బాట కాదు. పెళ్లయినవాళ్లకు “శరీర సంబంధమైన శ్రమలు వస్తాయి” అని బైబిలు చాలా స్పష్టంగా చెప్తుంది. (1 కొరిం. 7:28) ఎందుకంటే వేర్వేరు వ్యక్తిత్వాలు, ఇష్టాయిష్టాలు ఉన్న ఇద్దరు అపరిపూర్ణ మనుషుల కలయికే పెళ్లి! వాళ్ల నేపథ్యం, పుట్టి-పెరిగిన వాతావరణం కూడా చాలా వేరుగా ఉండవచ్చు. కాలం గడిచేకొద్దీ పెళ్లికి ముందు కనిపించని కొన్ని లక్షణాలు ఇప్పుడు కొట్టొచ్చినట్టు కనిపించవచ్చు. వీటన్నిటి వల్ల వాళ్ల జీవితంలో సమస్యలు పుట్టుకొస్తాయి. సమస్య వచ్చినప్పుడు పొరపాటు ఇద్దరివైపు ఉన్నా, తప్పు నీదంటే నీది అని నిందించుకుంటారు. అలా ఇద్దరు కలిసి సమస్యతో పోరాడే బదులు, ఒకరితో ఒకరు పోట్లాడుకునే అవకాశం ఉంది. ఇక వేరైపోవడమో లేదా విడాకులు తీసుకోవడమో సమస్యకు పరిష్కారం అనుకుంటారు. కానీ నిజంగా అదేనా పరిష్కారం? b కాపురంలో అష్టకష్టాలు పడినా, విడిపోవడం గురించి ఆలోచించని ఒక బైబిలు ఉదాహరణ నుండి మనమేం నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

9. అబీగయీలుకు ఏ సమస్య వచ్చింది?

9 బైబిలు ఉదాహరణ. అబీగయీలు భర్త నాబాలు “కఠినుడు, చెడ్డగా ప్రవర్తించేవాడు” అని బైబిలు చెప్తుంది. (1 సమూ. 25:3) అలాంటి వ్యక్తితో బ్రతకడం అబీగయీలుకు కత్తి మీద సాములాంటిది. మరి, అతన్ని వదిలించుకునే అవకాశం అబీగయీలుకు వచ్చిందా? వచ్చింది! ఒక సందర్భంలో నాబాలు ఇశ్రాయేలుకు కాబోయే రాజైన దావీదును, ఆయన మనుషుల్ని అవమానించాడు. దానికి దావీదు కోపంతో రగిలిపోయి నాబాలును, అతని మనుషుల్ని చంపడానికి వచ్చాడు. (1 సమూ. 25:9-13) కావాలనుకుంటే అబీగయీలు అక్కడి నుండి పారిపోయి, నాబాలును దావీదు చేతికి వదిలేయవచ్చు. కానీ ఆమె అలా చేయలేదు! నాబాలు ప్రాణం తీయొద్దని దావీదును బ్రతిమాలింది. (1 సమూ. 25:23-27) ఇంతకీ ఆమె ఎందుకలా చేసింది?

10. అబీగయీలు తన కాపురాన్ని ఎందుకు నిలబెట్టుకోవాలని అనుకుంది?

10 అబీగయీలుకు యెహోవా అంటే చాలా ఇష్టం. ఆయన పెళ్లిని ఎలా చూస్తాడో ఆమె కూడా అలాగే చూసింది. ఆదాముహవ్వల పెళ్లి చేసినప్పుడు యెహోవా ఏం చెప్పాడో ఆమెకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. (ఆది. 2:24) పెళ్లిని యెహోవా ఒక పవిత్రమైన ఏర్పాటుగా చూస్తున్నాడని అబీగయీలుకు తెలుసు. ఆమె యెహోవాకు నచ్చినట్టు ఉండాలనుకుంది. అందుకే భర్తని, కాపురాన్ని కాపాడుకోవడానికి ఆమె చెయ్యని పని అంటూ లేదు. ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా, నాబాలును చంపడానికి వస్తున్న దావీదును ఆపింది. ఆమె చేయని తప్పుకు కూడా క్షమాపణ అడగడానికి వెనకాడలేదు. స్వార్థమే తెలియని, ధైర్యంగల అబీగయీలు యెహోవాకు బాగా నచ్చి ఉంటుందని అనడంలో సందేహం లేదు. అయితే, అబీగయీలు నుండి భార్యలు అలాగే భర్తలు ఏం నేర్చుకోవచ్చు?

11. (ఎ) భార్యాభర్తలు ఏం చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు? (ఎఫెసీయులు 5:33) (బి) తన కాపురాన్ని నిలబెట్టుకోవడానికి కార్మన్‌ చేసిన పని నుండి మీరేం నేర్చుకున్నారు? (చిత్రం కూడా చూడండి.)

11 పాఠం. భర్తతో గానీ భార్యతో గానీ ఒక్క నిమిషం కూడా ఉండలేను అనుకున్నాసరే, భార్యాభర్తలు కలిసే ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. కాపురంలో వచ్చే సమస్యల్ని పరిష్కరించుకుంటూ భర్త నుండి గానీ భార్య నుండి గానీ ఏమీ ఆశించకుండా ప్రేమ, గౌరవాన్ని చూపించుకునే భార్యాభర్తల్ని చూసి యెహోవా ఎంత మురిసిపోతాడో కదా! (ఎఫెసీయులు 5:33 చదవండి.) కార్మన్‌ అనే సిస్టర్‌ అనుభవాన్ని గమనించండి. ఆమె పెళ్లయిన ఆరు సంవత్సరాలకు యెహోవాసాక్షుల దగ్గర బైబిలు స్టడీ తీసుకుంది. ఆ తర్వాత బాప్తిస్మం తీసుకుంది. కార్మన్‌ ఇలా చెప్తుంది: “అది మా ఆయనకు అస్సలు నచ్చలేదు. నేను మీటింగ్స్‌, ప్రీచింగ్‌ అని వెళ్లడం చూసి ఆయనకు యెహోవా మీద కోపం వచ్చింది. దాంతో నన్ను సూటిపోటి మాటలతో బాధపెట్టేవాడు, నన్ను వదిలేస్తానని బెదిరించేవాడు.” అయినాసరే కార్మన్‌ భర్తను వదిలేయాలని ఎప్పుడూ ఆలోచించలేదు. 50 సంవత్సరాలపాటు వాళ్లాయన మీద ప్రేమ, గౌరవం చూపిస్తూ కాపురాన్ని చక్కదిద్దుకుంది. ఆమె ఇంకా ఇలా చెప్తుంది: “సంవత్సరాలు గడుస్తున్నప్పుడు మా ఆయన మనస్తత్వం ఏంటో అర్థం చేసుకుని మాట్లాడడం నేర్చుకున్నాను. యెహోవా పెళ్లిని చాలా పవిత్రంగా చూస్తున్నాడు కాబట్టి, నా కాపురాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయడానికైనా నేను వెనకాడలేదు. నేను యెహోవాను ప్రేమిస్తున్నాను కాబట్టి నా భర్తను వదిలేయాలనే ఆలోచన కూడా రానివ్వలేదు.” c మీ కాపురంలో కూడా సమస్యలు వస్తే, దాన్ని నిలబెట్టుకోవడానికి యెహోవా సహాయం చేస్తాడని నమ్మండి.

తన కాపురాన్ని చక్కదిద్దుకోవడానికి కష్టపడ్డ అబీగయీలు నుండి మీరేమైనా పాఠం నేర్చుకోగలరా? (11వ పేరా చూడండి)


మన తప్పుల వల్ల నిరాశలో కూరుకుపోయినా …

12. ఘోరమైన పాపం చేసినప్పుడు మనకు ఏం అనిపించవచ్చు?

12 సమస్య. మనం ఏదైనా ఘోరమైన పాపం చేసినప్పుడు తీవ్రమైన బాధలో కూరుకుపోవచ్చు. మనం చేసిన పాపాలు మన హృదయానికి, మనసుకు మానని గాయాలు చేస్తాయని బైబిలు కూడా చెప్తుంది. (కీర్త. 51:17) రాబర్ట్‌ అనే బ్రదర్‌ సంఘ పరిచారకుడిగా అర్హత సాధించడానికి కొన్ని సంవత్సరాలుగా అహర్నిశలు కష్టపడుతూ వచ్చాడు. కానీ ఆయన ఒక ఘోరమైన పాపం చేశాడు. దానివల్ల యెహోవాకు నమ్మకద్రోహం చేసినట్లు ఆయనకు అనిపించింది. ఆయనిలా అంటున్నాడు: “నా మనస్సాక్షి నామీద ఒక పెద్ద బండరాయి వేసినట్టు అనిపించింది. ఆ తర్వాత నా గుండె పగిలిపోయింది. నేను వెక్కివెక్కి ఏడుస్తూ యెహోవాకు ప్రార్థన చేశాను. నా ప్రార్థనకు యెహోవా ముఖం తిప్పేసుకుంటాడని నాకు అనిపించేది. యెహోవా నమ్మకాన్ని వమ్ము చేశాను కాబట్టి ఆయన ఇక నా ప్రార్థన ఎందుకు వింటాడని అనుకున్నాను.” మనం ఏదైనా పాపం చేసినప్పుడు యెహోవా మన మీద ఆశలు వదులుకుంటాడని, ఇక ఆయన్ని ఆరాధించే అర్హతలేదని మనకు అనిపించి, మన గుండె బాధతో బరువెక్కి ఉండవచ్చు. (కీర్త. 38:4) మీకు ఒకవేళ అలా అనిపిస్తే, ఘోరమైన పాపం చేసినా, పట్టుదలగా యెహోవా సేవలో కొనసాగిన బైబిల్లోని వ్యక్తి గురించి ఆలోచించండి.

13. అపొస్తలుడైన పేతురు ఎలాంటి తప్పులు చేశాడు? అది ఎలాంటి ఘోరమైన పాపానికి నడిపించింది?

13 బైబిలు ఉదాహరణ. యేసు చనిపోవడానికి ముందురోజు రాత్రి అపొస్తలుడైన పేతురు తప్పుమీద తప్పు చేసుకుంటూ ఘోరమైన పాపాన్ని మూటకట్టుకున్నాడు. ముందుగా, మిగతా అపొస్తలులు యేసును వదిలేసినా తను మాత్రం నమ్మకంగా ఉంటానని పేతురు గొప్పలు చెప్పుకొని మితిమీరిన ఆత్మ విశ్వాసాన్ని చూపించాడు. (మార్కు 14:27-29) ఆ తర్వాత, గెత్సేమనే తోటలో మెలకువగా ఉండకుండా నిద్రపోయాడు. (మార్కు 14:32, 37-41) అంతటితో ఆగకుండా, యేసును ఒక గుంపు బంధించడానికి వచ్చినప్పుడు ఆయన్ని ఒంటరిగా వదిలేసి పారిపోయాడు. (మార్కు 14:50) చివరిగా, యేసు ఎవరో తెలీదని మూడుసార్లు చెప్పాడు. ఆఖరికి ఆ అబద్ధాన్ని నమ్మించడానికి ఒట్టు కూడా పెట్టుకున్నాడు. (మార్కు 14:66-71) కానీ పేతురు ఎంతపెద్ద తప్పు చేశాడో అర్థం చేసుకున్నాక అతనికి ఎలా అనిపించింది? అతను తప్పుచేశాననే బాధతో కుప్పకూలిపోయాడు. అతని కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. (మార్కు 14:72) కొన్ని గంటల తర్వాత తన స్నేహితుడైన యేసును చంపాకా, పేతురు ఎంత యాతన అనుభవించాడో ఊహించుకోండి. ఇక తను ఎందుకూ పనికిరానని అనుకొనివుంటాడు!

14. యెహోవా సేవను పట్టుదలగా చేయడానికి పేతురుకు ఏది సహాయం చేసింది? (కవర్‌ పేజీ చిత్రం చూడండి.)

14 ఇంత జరిగినా, పేతురు యెహోవా సేవను పట్టుదలగా చేస్తూ ఉండడానికి కొన్ని విషయాలు సహాయం చేశాయి. అతను ఇతరులకు దూరంగా వెళ్లిపోలేదు గానీ తోటి శిష్యుల దగ్గరికి వెళ్లాడు. అప్పుడు వాళ్లు అతన్ని ఓదార్చి ఉంటారు. (లూకా 24:33) దాంతోపాటు, బహుశా పేతురును ప్రోత్సహించడానికే పునరుత్థానమైన తర్వాత యేసు అతనికి కనబడి ఉంటాడు. (లూకా 24:34; 1 కొరిం. 15:5) అప్పుడు, చేసిన తప్పులకు యేసు తిట్టే బదులు తన స్నేహితుడైన పేతురుకు ఇంకొన్ని బాధ్యతలు అప్పగించాడు. (యోహా. 21:15-17) తను చేసిన తప్పు పెద్దదే అని పేతురుకు తెలుసు. అయినాసరే తనమీద తను ఆశలు వదులుకోలేదు. ఎందుకంటే తన యజమానియైన యేసు తన మీద ఆశలు వదులుకోలేదని పేతురు నమ్మాడు. దాంతోపాటు, తోటి శిష్యులు కూడా పేతురుకు వెన్నంటే ఉన్నారు. పేతురు ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

యోహాను 21:​15-17 ప్రకారం, యేసు పేతురు మీద ఆశలు వదులుకోలేదు. అది పట్టుదలగా ముందుకెళ్లడానికి పేతురుకు సహాయం చేసింది (14వ పేరా చూడండి)


15. మనం ఏ నమ్మకంతో ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు? (కీర్తన 86:5; రోమీయులు 8:38, 39) (చిత్రం కూడా చూడండి.)

15 పాఠం. యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని, క్షమించడానికి సిద్ధంగా ఉంటాడని మనం నమ్మాలి. (కీర్తన 86:5; రోమీయులు 8:38, 39 చదవండి.) మనం పాపం చేసినప్పుడు చాలా బాధగా ఉంటుంది. అది సహజమే, సరైనది కూడా. కానీ ఇక మనల్ని ప్రేమించేవాళ్లు గానీ, క్షమించేవాళ్లు గానీ ఎవ్వరూ లేరని అనుకోవద్దు. దానికి బదులు సహాయం తీసుకోవడానికి వెంటనే ముందుకు రావాలి. ముందు పేరాలో చెప్పుకున్న రాబర్ట్‌ ఇలా అంటున్నాడు: “తప్పు చేయాలనే ఒత్తిడిని నేను నా సొంత శక్తితో ఎదిరించాలని చూశాను. అందుకే నేను పాపం చేశాను.” ఆయన సంఘపెద్దలతో మాట్లాడాలని అర్థం చేసుకున్నాడు. ఆయనిలా అంటున్నాడు: “నేను సంఘపెద్దలతో మాట్లాడిన తర్వాత యెహోవా నా చెయ్యిపట్టుకొని నన్ను పైకి లేపినట్టు నాకు అనిపించింది. సంఘపెద్దలు కూడా ఇక నేను మారను అనుకోలేదు. యెహోవా నన్ను విడిచిపెట్టలేదని నమ్మడానికి వాళ్లు నాకు సహాయం చేశారు.” మనం కూడా యెహోవా మనల్ని చాలా ప్రేమిస్తున్నాడని, మన పాపాలకు పశ్చాత్తాపం చూపిస్తే క్షమిస్తాడని నమ్మాలి. అయితే, మనం చేయాల్సిందల్లా ఇతరుల సహాయం తీసుకోవాలి, చేసిన తప్పులే మళ్లీ చేయకుండా ఉండడానికి శతవిధాల కృషిచేయాలి. (1 యోహా. 1:8, 9) యెహోవా మీద మనకు ఆ నమ్మకం ఉంటే, తప్పు చేసినప్పుడు మనమీద మనం ఆశ వదులుకోకుండా ఉండగలుగుతాం.

కష్టపడి పనిచేసే సంఘపెద్దలు మీకు సహాయం చేసినప్పుడు మీకేమనిపిస్తుంది? (15వ పేరా చూడండి)


16. మీరు యెహోవా సేవలో పట్టుదలగా ముందుకు కొనసాగాలని ఎందుకు అనుకుంటున్నారు?

16 ఈ చివరిరోజుల్లో తన సేవ చేయడానికి మనం చేసే ప్రతీ ప్రయత్నాన్ని యెహోవా చాలా విలువైనదిగా చూస్తాడు. ఆయన సహాయంతో మన సొంత తప్పుల వల్ల లేదా వేరేవాళ్ల తప్పుల వల్ల మనం డీలా పడినా, పట్టుదలగా ముందుకు కొనసాగగలం. దానికోసం మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ మీద ప్రేమ పెంచుకోవాలి. వాళ్లు మనల్ని బాధపెడితే క్షమించి, వదిలేయాలి. అంతేకాదు, యెహోవాను మనం ఎంత ప్రేమిస్తున్నామో, ఆయన చేసిన ఏర్పాటును ఎంత గౌరవిస్తున్నామో చూపించాలంటే మన కాపురంలో వచ్చే సమస్యల్ని పరిష్కరించడానికి చేయగలిగినదంతా చేయాలి. అలాగే, మనం ఏదైనా పాపం చేసినప్పుడు యెహోవా సహాయం తీసుకుని ఆయన ప్రేమను, క్షమాపణను అంగీకరించాలి, ఆయన సేవలో ముందుకెళ్తూ ఉండాలి. అలా “మనం మానకుండా మంచిపనులు” చేస్తూ ఉంటే, తప్పకుండా యెహోవా దీవెనలు అనే పంట కోస్తాం!—గల. 6:9.

ఈ సందర్భాల్లో యెహోవా సేవలో పట్టుదలగా ముందుకెళ్లడానికి ఏం సహాయం చేస్తుంది?

  • బ్రదర్స్‌-సిస్టర్స్‌ మనల్ని గాయపర్చినప్పుడు

  • భర్త లేదా భార్య మన ఆశల్ని నీరుగార్చినప్పుడు

  • మన తప్పుల వల్ల నిరాశలో కూరుకుపోయినప్పుడు

పాట 139 కొత్త లోకంలో ఉన్నట్టు ఊహించుకోండి!

a కొన్ని పేర్లను మార్చాం.

b భార్యాభర్తలు విడిపోకూడదని, ఒకవేళ విడిపోతే భార్యకు గానీ భర్తకు గానీ మళ్లీ పెళ్లి చేసుకునే హక్కు ఉండదని బైబిలు స్పష్టంగా చెప్తుంది. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల్లో కొంతమంది క్రైస్తవులు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే పుస్తకంలో “అదనపు సమాచారం” కింద “భార్యాభర్తలు విడిపోవడం” అనే 4వ పాయింట్‌ చూడండి.