అధ్యయన ఆర్టికల్ 12
పాట 77 చీకటి లోకంలో వెలుగు
చీకటి వద్దు—వెలుగులో ఉండు
“ఒకప్పుడు మీరు చీకట్లో ఉన్నారు, కానీ ఇప్పుడు . . వెలుగులో ఉన్నారు.”—ఎఫె. 5:8.
ముఖ్యాంశం
ఎఫెసీయులు 5వ అధ్యాయంలో పౌలు ఉపయోగించిన చీకటి, వెలుగు అనే పదచిత్రాల నుండి మనమేం నేర్చుకోవచ్చు?
1-2. (ఎ) పౌలు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎఫెసీయులకు ఉత్తరం రాశాడు? (బి) మనం ఇప్పుడు ఏ ప్రశ్నల్ని చూస్తాం?
రోములో గృహనిర్బంధంలో ఉన్నప్పుడు అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవుల్ని ప్రోత్సహించాలని అనుకున్నాడు. అయితే, ఆయన వాళ్లను నేరుగా కలవలేడు కాబట్టి ఉత్తరాలు రాశాడు. ఆ ఉత్తరాల్లో ఒకదాన్ని ఎఫెసీయులకు దాదాపు క్రీ.శ. 60 లేదా 61లో రాశాడు.—ఎఫె. 1:1; 4:1.
2 దాదాపు పదేళ్ల క్రితం, పౌలు కొంతకాలం ఎఫెసులో ఉన్నాడు. అక్కడ ఆయన మంచివార్త ప్రకటించాడు. అలాగే ఎన్నో ప్రసంగాలు ఇచ్చాడు. (అపొ. 19:1, 8-10; 20:20, 21) పౌలు తన బ్రదర్స్‌సిస్టర్స్‌ని ఎంతో ప్రేమించాడు. వాళ్లు యెహోవాకు నమ్మకంగా ఉండేలా సహాయం చేయాలనుకున్నాడు. మరైతే, అభిషిక్త క్రైస్తవులకు ఆయన ఎందుకు చీకటి, వెలుగు గురించి చెప్పాడు? ఆయన చెప్పిన వాటినుండి క్రైస్తవులందరూ ఏ పాఠాలు నేర్చుకోవచ్చు? ఇప్పుడు వాటిగురించి చూద్దాం.
చీకటి నుండి వెలుగులోకి
3. ఎఫెసీయులకు రాసిన ఉత్తరంలో పౌలు ఏ పదచిత్రాల్ని ఉపయోగించాడు?
3 ఎఫెసులోని క్రైస్తవులకు పౌలు ఇలా రాశాడు: “ఒకప్పుడు మీరు చీకట్లో ఉన్నారు, కానీ ఇప్పుడు . . వెలుగులో ఉన్నారు.” (ఎఫె. 5:8) వాళ్లు ఒకప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, తర్వాత ఏ పరిస్థితుల్లోకి మారారో చెప్పడానికి పౌలు చీకటి, వెలుగు అనే పదచిత్రాల్ని ఉపయోగించాడు. ఎఫెసులో ఉన్నవాళ్లు ఒకప్పుడు “చీకట్లో” ఉన్నారని పౌలు ఎందుకు రాశాడో ఇప్పుడు చూద్దాం.
4. ఒకప్పుడు ఎఫెసులో ఉన్నవాళ్లు అబద్ధమతం అనే చీకట్లో ఎలా ఉన్నారు?
4 అబద్ధమతం అనే చీకటి. సత్యం నేర్చుకుని క్రైస్తవులుగా మారకముందు ఎఫెసులో ఉన్నవాళ్లు అబద్ధమత ఆచారాలకు, నమ్మకాలకు కట్టు బానిసలుగా ఉండేవాళ్లు. ఎఫెసు నగరం అర్తెమి ఆలయానికి పుట్టినిల్లు. అప్పట్లో దీన్ని ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా చూసేవాళ్లు. అక్కడున్న ప్రజలు అబద్ధారాధనలో నిండా మునిగారు. అంతేకాదు, అర్తెమి మహాదేవి విగ్రహాలు తయారుచేసి అమ్మే వ్యాపారం కాసుల వర్షం కురిపించింది. (అపొ. 19:23-27) దానికితోడు, ఈ నగరం మంత్రవిద్యకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.—అపొ. 19:19.
5. ఎఫెసులోనివాళ్లు అనైతికత అనే చీకట్లో ఎలా ఉన్నారు?
5 అనైతికత అనే చీకటి. అనైతికత, దిగజారిన ప్రవర్తన అనగానే ఎఫెసులో ఉన్న ప్రజలే గుర్తుకొచ్చేవాళ్లు. వాళ్ల సినిమాల్లో, పండుగల్లో బూతులు మామూలే. (ఎఫె. 5:3) ఎఫెసులోని చాలామంది “నైతిక విచక్షణను పూర్తిగా” కోల్పోయారు అంటే, వాళ్లు తప్పు చేస్తున్నారన్న బాధ కూడా వాళ్లకు లేదని అర్థమౌతుంది. (ఎఫె. 4:17-19) తప్పొప్పుల విషయంలో యెహోవా ప్రమాణాల్ని నేర్చుకోకముందు ఎఫెసీయుల మనస్సాక్షి మొద్దుబారిపోయింది. లేదా యెహోవాకు జవాబు చెప్పాలి అన్న ఆలోచన కూడా వాళ్లకు ఉండేదికాదు. అందుకే వాళ్ల గురించి పౌలు ‘అజ్ఞానం వల్ల చీకట్లో ఉండి, దేవుడు ఇస్తానన్న శాశ్వత జీవితానికి దూరంగా ఉన్నారు’ అని చెప్పాడు.
6. ఎఫెసులోనివాళ్లు ‘ఇప్పుడు వెలుగులో ఉన్నారు’ అని పౌలు ఎందుకు చెప్పాడు?
6 ఎఫెసులోని కొంతమంది చీకటి నుండి బయటికి వచ్చారు. వాళ్ల గురించి, “ఇప్పుడు ప్రభువు శిష్యులుగా వెలుగులో ఉన్నారు” అని పౌలు రాశాడు. (ఎఫె. 5:8) లేఖన సత్యాలు నేర్చుకుని వాళ్లు వెలుగులోకి వచ్చారు. (కీర్త. 119:105) అబద్ధమతానికి సంబంధించిన పనుల్ని, అనైతిక ప్రవర్తనను వాళ్లు విడిచిపెట్టారు. ‘దేవుణ్ణి అనుకరిస్తూ’ యెహోవాను ఆరాధించడానికి, ఆయన్ని సంతోషపెట్టడానికి అన్ని ప్రయత్నాలూ చేశారు.—ఎఫె. 5:1.
7. సత్యం నేర్చుకోకముందు మనం కూడా ఎఫెసులోని క్రైస్తవుల్లా ఎలా ఉన్నాం?
7 మనం కూడా సత్యం నేర్చుకోకముందు అబద్ధమతం, అనైతికత అనే చీకట్లో ఉన్నాం. మనలో కొంతమందిమి అబద్ధమత పండుగల్లో మునిగితేలాం, ఇంకొంతమందిమి అనైతిక జీవితమే లోకంగా బ్రతికాం. కానీ ఒక్కసారి తప్పొప్పుల విషయంలో యెహోవా ప్రమాణాలు నేర్చుకున్న తర్వాత చాలా మార్పులు చేసుకున్నాం. అప్పటినుండి యెహోవా కోరుకున్నట్లు జీవించడాన్నే లోకంగా చేసుకున్నాం. దానివల్ల మనం చాలా సంతోషంగా ఉన్నాం. (యెష. 48:17) అయితే, మనం వదిలేసి వచ్చిన చీకటి దారిలో మళ్లీ మన అడుగులు వేయకుండా “వెలుగు బిడ్డల్లా నడుచుకుంటూ” ఉండడం అన్నిసార్లూ ఈజీ కాదు. అయినాసరే దాన్ని ఎలా చేయవచ్చు?
చీకటి వద్దు
8. ఎఫెసీయులు 5:3-5 ప్రకారం, ఎఫెసులోని క్రైస్తవులు వేటికి దూరంగా ఉండాలి?
8 ఎఫెసీయులు 5:3-5 చదవండి. అనైతికత అనే చీకటి దరిదాపుల్లోకి కూడా వెళ్లకూడదంటే, ఎఫెసులోని క్రైస్తవులు యెహోవాను బాధపెట్టే పనుల జోలికి వెళ్లకూడదు. అంటే లైంగిక పాపానికే కాదు ఎలాంటి అసభ్యమైన మాటలు కూడా వాళ్లు మాట్లాడకూడదు. ఒకవేళ ఎఫెసులోని క్రైస్తవులు “క్రీస్తు పరిపాలించే దేవుని రాజ్యానికి” వారసులు అవ్వాలంటే ఇలాంటివాటి నీడ కూడా వాళ్లమీద పడకూడదని పౌలు వాళ్లకు గుర్తుచేశాడు.
9. అనైతిక విషయాల జోలికి వెళ్లకుండా మనం ఎందుకు జాగ్రత్తపడాలి?
9 మనం కూడా “పనికిరాని చీకటి పనులు” అనే సుడిగుండంలో చిక్కుకోకుండా గట్టిగా ప్రయత్నిస్తూ ఉండాలి. (ఎఫె. 5:11) ఎందుకంటే, ఒకవ్యక్తి అదే పనిగా అనైతికమైనవి చూసినా, విన్నా, మాట్లాడినా ఇక అవకాశం దొరికితే తప్పు చేయడానికి క్షణం పట్టదని చాలా అనుభవాలు చూపిస్తున్నాయి. (ఆది. 3:6; యాకో. 1:14, 15) ఒక దేశంలో చాలామంది బ్రదర్స్ కలిసి ఆన్‌లైన్‌లో ఒక చాట్ గ్రూపు తయారు చేసుకున్నారు. మొదట్లో, అందులో చాలామంది బైబిలు విషయాలు మాట్లాడుకున్నారు. కానీ మెల్లిమెల్లిగా వాళ్ల మాటలు హద్దులు దాటి, సెక్స్ చుట్టూ తిరిగాయి. అలా మాట్లాడుకోవడం వల్ల లైంగిక పాపానికి ఒడిగట్టామని అందులో చాలామంది తర్వాత ఒప్పుకున్నారు.
10. సాతాను మనల్ని ఎలా మోసం చేస్తున్నాడు? (ఎఫెసీయులు 5:6)
10 యెహోవా తప్పు అని చెప్పే అనైతిక విషయాలు, పనులు అసలు తప్పే కావని నమ్మించడానికి సాతాను లోకం ప్రయత్నిస్తూనే ఉంది. (2 పేతు. 2:19) అది చూసి మనకు ఆశ్చర్యంగా అనిపించదు. ఎందుకంటే, జిత్తులమారి సాతాను ఇలాంటి ఎత్తులు వేయడం కొత్తేమీ కాదు. తప్పుకు-ఒప్పుకు మధ్యున్న గీతను మసకబారేలా చేసి ప్రజలు తికమకపడేలా అతను చేస్తాడు. (యెష. 5:20; 2 కొరిం. 4:4) అందుకే యెహోవా నైతిక ప్రమాణాలకు పూర్తి విరుద్ధమైన వాటిని చాలా సినిమాలు, టీవీ షోలు, ఇంటర్నెట్ చూపిస్తున్నాయి! అనైతిక జీవితం, పనులు అసలు తప్పే కాదని, వాటిలో చాలా ఆనందం ఉంటుందని, ఏ హాని ఉండదని సాతాను మనల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు.—ఎఫెసీయులు 5:6 చదవండి.
11. ఎఫెసీయులు 5:7లో ఉన్న తెలివైన సలహాను పాటించడం చాలా ప్రాముఖ్యమని ఏంజిలా అనుభవం ఎలా చూపిస్తుంది? (చిత్రం కూడా చూడండి.)
11 యెహోవా ప్రమాణాల్ని అంటిపెట్టుకోవడం కష్టం చేసే ప్రజలతో మనం రాసుకుపూసుకు తిరగాలని సాతాను కోరుకుంటున్నాడు. అందుకే పౌలు ఎఫెసీయులకు “మీరు వాళ్లలా ఉండకండి” అని చెప్పాడు. అంటే దేవుని దృష్టిలో తప్పుడు పనులు చేసేవాళ్లతో మనం సమయం గడపకూడదు. (ఎఫె. 5:7) అయితే మనం ఎఫెసీయుల కన్నా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఇంటర్నెట్ యుగంలో జీవిస్తున్నాం. మనం నేరుగానే కాదు సోషల్ మీడియాలో కూడా స్నేహితుల్ని చేసుకునే అవకాశం ఉంది. ఆసియాలో ఉంటున్న ఏంజిలా a సోషల్ మీడియా ఎంత ప్రమాదమో అర్థం చేసుకుంది. ఆమె ఇలా ఒప్పుకుంటుంది: “అదొక ఊబి! మన మనస్సాక్షిని మెల్లిమెల్లిగా మొద్దుబారేలా చేస్తుంది. బైబిలు అంటే అస్సలు లెక్కచేయని వాళ్లను కూడా ‘ఫ్రెండ్స్’ చేసుకున్నా పర్వాలేదు అనే స్థాయికి నేను చేరుకున్నాను. మెల్లిమెల్లిగా యెహోవాకు ఇష్టంలేని జీవితం గడపడం కూడా పెద్ద తప్పేం కాదులే అనుకున్నాను.” సంతోషకరమైన విషయమేమిటంటే, ఏంజిలా మార్పులు చేసుకోవడానికి సంఘపెద్దలు ప్రేమగా సహాయం చేశారు. ఆమె ఇలా చెప్తుంది: “ఇప్పుడు నేను నా మనసంతా సోషల్ మీడియాతో నింపుకునే బదులు బైబిలు విషయాలతో నింపుకుంటున్నాను.”
12. తప్పొప్పుల విషయంలో యెహోవా ప్రమాణాల్ని అంటిపెట్టుకొని ఉండడానికి మనకేది సహాయం చేస్తుంది?
12 అనైతికంగా జీవించడం పెద్ద తప్పేం కాదులే అనే ఈ లోక ఆలోచనకు మనం ఎదురీదాలి. అలాంటి ఆలోచన తప్పని మనకు తెలుసు. (ఎఫె. 4:19, 20) కాబట్టి ఇలా ప్రశ్నించుకోండి: ‘నాతోపాటు పనిచేసే వాళ్లతో, క్లాస్‌మేట్స్‌తో లేదా యెహోవా ప్రమాణాల్ని అస్సలు లెక్కచేయనివాళ్లతో అనవసరంగా సమయం గడపకుండా జాగ్రత్తపడుతున్నానా? నేనింకా పాత కాలంలోనే ఆగిపోయానని ఎవరైనా అన్నాసరే యెహోవా ప్రమాణాల్ని ధైర్యంగా పాటిస్తున్నానా?’ అంతెందుకు క్రైస్తవ సంఘంలో కూడా మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నామో జాగ్రత్తగా చూసుకోవాలని 2 తిమోతి 2:20-22 వచనాలు చెప్తున్నాయి. ఎందుకంటే, యెహోవాకు నమ్మకంగా సేవచేయాలనే మన ఉత్సాహాన్ని కొంతమంది నీరుగార్చే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి.
“వెలుగు బిడ్డల్లా నడుచుకోండి”
13. “వెలుగు బిడ్డల్లా” నడుచుకుంటూ ఉండడం అంటే ఏంటి? (ఎఫెసీయులు 5:7-9)
13 ఎఫెసులోని క్రైస్తవులు చీకటికి దూరంగా ఉండడమే కాదు “వెలుగు బిడ్డల్లా” నడుచుకుంటూ ఉండాలని పౌలు చెప్పాడు. (ఎఫెసీయులు 5:7-9 చదవండి.) దానర్థమేంటి? ఒక్క ముక్కలో చెప్పాలంటే, మనం 24 గంటలూ నిజక్రైస్తవులుగా ఉండాలి. అలా చేయడానికి ఒక పద్ధతి ఏంటంటే బైబిల్ని, ప్రచురణల్ని శ్రద్ధగా చదవాలి, అధ్యయనం చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా, ఈ “లోకానికి వెలుగు” అయిన యేసుక్రీస్తు బోధల్ని, ఆదర్శాన్ని దగ్గరగా పాటించాలి. —యోహా. 8:12; సామె. 6:23.
14. పవిత్రశక్తి మనకు ఎలా సహాయం చేస్తుంది?
14 మనం “వెలుగు బిడ్డల్లా” నడుచుకుంటూ ఉండాలంటే దేవుని పవిత్రశక్తి సహాయం కూడా చాలా అవసరం. ఎందుకు? ఎందుకంటే, అనైతికతతో కంపుకొట్టే ఈ లోకంలో శుభ్రంగా ఉండడం అంత తేలిక కాదు! (1 థెస్స. 4:3-5, 7, 8) యెహోవా ఆలోచనలకు ఈ లోకంలో ఉన్నవాళ్ల ఆలోచనలకు అస్సలు పొంతన లేదు. కాబట్టి ఆ ఆలోచనల్ని తిప్పికొట్టాలంటే మనకు పవిత్రశక్తి సహాయం కావాలి. అంతేకాదు, పవిత్రశక్తి మనలో “అన్నిరకాల మంచితనం, నీతి” అనే ఫలాల్ని పుట్టిస్తుంది.—ఎఫె. 5:9.
15. పవిత్రశక్తి పొందాలంటే మనమేం చేయాలి? (ఎఫెసీయులు 5:19, 20)
15 పవిత్రశక్తిని పొందే ఒక విధానం ఏంటంటే, దానికోసం ప్రార్థన చేయడం. “తనను అడిగేవాళ్లకు” యెహోవా పవిత్రశక్తి ఇస్తాడని యేసు చెప్పాడు. (లూకా 11:13) అలాగే మీటింగ్స్‌లో మనం అందరితో కలిసి యెహోవాను స్తుతించినప్పుడు కూడా పవిత్రశక్తిని పొందుతాం. (ఎఫెసీయులు 5:19, 20 చదవండి.) పవిత్రశక్తి మనమీద పనిచేసినప్పుడు యెహోవాను సంతోషపెట్టేలా బ్రతుకుతాం.
16. తెలివైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఏం చేయాలి? (ఎఫెసీయులు 5:10, 17)
16 మనం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు “యెహోవా ఇష్టం ఏమిటో” అర్థంచేసుకోవాలి, ఆ తర్వాత దాని ప్రకారం పనిచేయాలి. (ఎఫెసీయులు 5:10, 17 చదవండి.) మన పరిస్థితికి సరిగ్గా సరిపోయే బైబిలు సూత్రాల్ని తెలుసుకుంటున్నామంటే, నిజానికి యెహోవా ఆలోచనల్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టే. ఆ తర్వాత ఆ సూత్రాల్ని పాటించినప్పుడు మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం.
17. మన సమయాన్ని తెలివిగా ఉపయోగించాలంటే ఏం చేయాలి? (ఎఫెసీయులు 5:15, 16) (చిత్రం కూడా చూడండి.)
17 ఎఫెసులోని క్రైస్తవులు తమ సమయాన్ని తెలివిగా ఉపయోగించాలని కూడా పౌలు సలహా ఇచ్చాడు. (ఎఫెసీయులు 5:15, 16 చదవండి.) మన శత్రువైన సాతాను చాలా ‘దుష్టుడు.’ యెహోవా సేవ చేయడానికి సమయం ఉండనంతగా ఈ లోకంలో మునిగిపోవాలని అతను కోరుకుంటున్నాడు. (1 యోహా. 5:19) అందుకే ఒక క్రైస్తవుడు యెహోవా సేవ కన్నా చదువులకు, ఉద్యోగాలకు, డబ్బు సంపాదనకే మొదటిస్థానం ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే, ఈ లోక ఆలోచనలు మనలో ఇంకినట్టే. నిజమే, అవన్నీ చేయడం తప్పేమీ కాకపోవచ్చు. కానీ మన జీవితంలో అవే అన్నిటికంటే ముఖ్యమైనవి కాకూడదు! మనం “వెలుగు బిడ్డల్లా” నడుచుకోవాలంటే నిజంగా ముఖ్యమైన విషయాల మీద దృష్టి పెడుతూ “[మన] సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా” ఉపయోగించాలి.
18. తన సమయాన్ని ఇంకా చక్కగా ఉపయోగించుకోవడానికి డోనాల్డ్ ఏం చేశాడు?
18 యెహోవా సేవ ఎక్కువ చేసే అవకాశాల కోసం వెదకండి. దక్షిణ ఆఫ్రికాలో ఉంటున్న డోనాల్డ్ అనే బ్రదర్ అదే చేశాడు. ఆయనిలా అంటున్నాడు: “నా జీవితాన్ని ఒకసారి చూసుకున్నాను. తర్వాత ఇంకా ఎక్కువ సేవ చేసే అవకాశాన్ని ఇమ్మని యెహోవాకు ప్రార్థన చేశాను. ప్రీచింగ్‌కి ఎక్కువ టైమ్ ఉండేలాంటి ఉద్యోగం కావాలని యెహోవాను అడిగాను. యెహోవా సహాయంతో నాకు సరిగ్గా సరిపోయే ఉద్యోగం దొరికింది. ఆ తర్వాత నేను, నా భార్య కలిసి పూర్తికాల సేవ చేయడం మొదలుపెట్టాం.”
19. “వెలుగు బిడ్డల్లా” నడుచుకుంటూ ఉండడానికి మనమేం చేయవచ్చు?
19 యెహోవాకు నమ్మకంగా సేవచేయడానికి ఎఫెసులోని క్రైస్తవులకు పౌలు రాసిన ఉత్తరం చాలా సహాయం చేసింది. పవిత్రశక్తి ప్రేరణతో ఆయన రాసిన ఆ మాటలు ఇప్పుడు మనకు కూడా పనికొస్తాయి. ఈ ఆర్టికల్‌లో మనం చూసినట్టు వినోదాన్ని, స్నేహితుల్ని తెలివిగా ఎంచుకోవడానికి ఆ ఉత్తరం సహాయం చేస్తుంది. అలాగే సత్యపు వెలుగులో ముందుకెళ్లడానికి బైబిలు అధ్యయనం క్రమంగా చేయాలని ఆ ఉత్తరం ప్రోత్సహిస్తుంది. అంతేకాదు, పవిత్రశక్తి ఎంత ప్రాముఖ్యమైందో, అది మనలో ఎలాంటి మంచి లక్షణాల్ని పుట్టిస్తుందో ఆ ఉత్తరం చెప్తుంది. పౌలు రాసిన ఆ మాటల్ని మనం పాటిస్తే, యెహోవా ఆలోచనకు తగ్గట్టు తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఇవన్నీ చేసినప్పుడు ఈ లోకంలో ఉన్న చీకటి వద్దని, వెలుగులో ఉంటాం!
మీరెలా జవాబిస్తారు?
-
ఎఫెసీయులు 5:8లో ఉన్న “చీకటి,” “వెలుగు” అంటే ఏంటి?
-
మనం “చీకటిని” ఎలా వదిలేయవచ్చు?
-
మనం “వెలుగు బిడ్డల్లా” నడుచుకుంటూ ఉండడానికి ఏం చేయవచ్చు?
పాట 95 వెలుగు అంతకంతకూ ఎక్కువౌతుంది
a కొన్ని పేర్లను మార్చాం.
b చిత్రం వివరణ: ఎఫెసీయులకు పౌలు రాసిన ఉత్తరపు తొలి నకలు కాపీల్లో ఒకటి.