కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 10

పాట 13 క్రీస్తు మన ఆదర్శం

బాప్తిస్మం తర్వాత కూడా యేసును “అనుసరిస్తూ ఉండండి”

బాప్తిస్మం తర్వాత కూడా యేసును “అనుసరిస్తూ ఉండండి”

“ఒక వ్యక్తి నా శిష్యుడు అవ్వాలనుకుంటే, అతను ఇక తన కోసం తాను జీవించకుండా, ప్రతీరోజు తన హింసాకొయ్యను మోస్తూ, నన్ను అనుసరిస్తూ ఉండాలి.”లూకా 9:23.

ముఖ్యాంశం

యెహోవాకు సమర్పించుకున్న తర్వాత మన జీవితం ఎలా మారిపోతుందో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. ముఖ్యంగా, కొత్తగా బాప్తిస్మం తీసుకున్నవాళ్లు ఎలా నమ్మకంగా కొనసాగవచ్చో చూస్తాం.

1-2. బాప్తిస్మం తర్వాత మీ జీవితం ఎలా మారిపోతుంది?

 బాప్తిస్మం తీసుకుని, యెహోవా కుటుంబంలో ఒకరు అయ్యాక మన ఆనందానికి అవధులుండవు. ఇప్పటికే యెహోవాకు మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నవాళ్లకు కీర్తనకర్త దావీదులాగే అనిపిస్తుంది. ఆయన ఇలా అన్నాడు: “నీ ప్రాంగణాల్లో నివసించడం కోసం, నువ్వు [యెహోవా] ఎంచుకుని, నీ దగ్గరికి తెచ్చుకునే వ్యక్తి సంతోషంగా ఉంటాడు.”—కీర్త. 65:4.

2 యెహోవా ఎవర్ని పడితే వాళ్లను తన ప్రాంగణంలోకి తీసుకురాడు. ముందటి ఆర్టికల్‌లో చూసినట్లు, తనతో దగ్గరి స్నేహం కావాలని కోరుకునే వాళ్లనే ఆయన తన ప్రాంగణంలోకి తీసుకొస్తాడు. (యాకో. 4:8) మీరు యెహోవాకు సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆయనకు ఒక ప్రత్యేకమైన విధానంలో దగ్గరౌతారు. ఆ తర్వాత యెహోవా ‘మీకు కొరత అనేదే లేకుండాపోయే వరకు మీపై దీవెనల్ని కుమ్మరిస్తాడు’ అనే నమ్మకంతో ఉండండి.—మలా. 3:10; యిర్మీ. 17:7, 8.

3. సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులకు ఏ బాధ్యత ఉంటుంది? (ప్రసంగి 5:4, 5)

3 యెహోవా సేవలో మీ ప్రయాణానికి బాప్తిస్మం ఒక తొలిమెట్టు మాత్రమే. మీరు బాప్తిస్మం తీసుకున్న తర్వాత, ఏం చేసైనా సరే మీరిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి చూస్తారు. ఆఖరికి మీ విశ్వాసానికి పరీక్షలు వచ్చినా, తప్పు చేయాలనే ఒత్తిడి వచ్చినా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. (ప్రసంగి 5:4, 5 చదవండి.) యేసు శిష్యులుగా మీరు ఆయన అడుగులో అడుగువేస్తూ, ఆయన మాట జవదాటకుండా ఆయన చెప్పింది చేస్తారు. (మత్త. 28:19, 20; 1 పేతు. 2:21) అలా చేయడానికే ఈ ఆర్టికల్‌ మీకు సహాయం చేస్తుంది.

పరీక్షలు, ఒత్తిళ్లు వచ్చినా మీరు యేసును ‘అనుసరిస్తూ ఉండండి’

4. తన అనుచరులు “హింసాకొయ్యను” మోస్తారు అంటే దానర్థం ఏంటి? (లూకా 9:23)

4 బాప్తిస్మం తర్వాత మీ జీవితం ఏ కష్టాలూ లేకుండా హాయిగా సాగిపోతుందని అనుకోకండి. నిజానికి తన శిష్యులు “హింసాకొయ్యను” మోస్తారని యేసు స్పష్టంగా చెప్పాడు. వాళ్లు దాన్ని “ప్రతీరోజు” మోస్తారు. (లూకా 9:23 చదవండి.) అంటే దానర్థం తన అనుచరులు ఎప్పటికీ కష్టాలు పడుతూనే ఉంటారనా? కానేకాదు. తన అనుచరులకు దీవెనలతో పాటు కష్టాలు కూడా వస్తాయని యేసు చెప్పాలనుకున్నాడు. కొన్ని కష్టాలు మనకు మానని గాయాన్ని కూడా చేయవచ్చు.—2 తిమో. 3:12.

5. త్యాగాలు చేసేవాళ్లకు ఏ దీవెనలు వస్తాయని యేసు మాటిచ్చాడు?

5 నా అనుకునేవాళ్లు మిమ్మల్ని వ్యతిరేకించి ఉండవచ్చు, లేదా దేవుని రాజ్యానికి మొదటిస్థానం ఇవ్వడానికి బాగా డబ్బు సంపాదించే అవకాశాన్ని మీరు వదులుకొని ఉండవచ్చు. (మత్త. 6:33) అలాగైతే, యెహోవా మీద నమ్మకంతో మీరు చేసిన ఆ పనుల్ని ఆయన గమనించడు అంటారా? (హెబ్రీ. 6:10) యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటలు నిజమని మీరు రుచి చూసుంటారు: “నా కోసం, మంచివార్త కోసం ఇల్లును గానీ, అన్నదమ్ముల్ని గానీ, అక్కచెల్లెళ్లను గానీ, అమ్మను గానీ, నాన్నను గానీ, పిల్లల్ని గానీ, భూముల్ని గానీ వదులుకున్నవాళ్లు ఇప్పుడు 100 రెట్లు ఎక్కువగా ఇళ్లను, అన్నదమ్ముల్ని, అక్కచెల్లెళ్లను, తల్లుల్ని, పిల్లల్ని, భూముల్ని, వాటితోపాటు హింసల్ని పొందుతారు; అలాగే రానున్న వ్యవస్థలో శాశ్వత జీవితాన్ని పొందుతారు.” (మార్కు 10:29, 30) నిజానికి, మనం పొందిన దీవెనలు సముద్రమంతయైతే, మనం చేసిన త్యాగాలు అందులో నీటిబొట్టంత.—కీర్త. 37:4.

6. బాప్తిస్మం తర్వాత కూడా ఎందుకు శరీర కోరికలతో పోరాడాల్సి ఉంటుంది?

6 మీరు బాప్తిస్మం తర్వాత కూడా ‘శరీరాశతో’ అంటే శరీర కోరికలతో పోరాడుతూనే ఉండాలి. (1 యోహా. 2:16) ఎంతైనా మనందరం ఆదాము పిల్లలమేగా. కొన్నిసార్లు మనకు అపొస్తలుడైన పౌలుకు అనిపించినట్టే అనిపించవచ్చు. ఆయనిలా రాశాడు: “దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి నా హృదయంలో నేను నిజంగా సంతోషిస్తున్నాను. కానీ నా శరీరంలో ఇంకో నియమం ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. అది నా మనసులో ఉన్న నియమానికి విరుద్ధంగా పోరాడుతోంది, నా శరీరంలో ఉన్న పాపపు నియమానికి నన్ను బందీగా అప్పగిస్తోంది.” (రోమా. 7:22, 23) బహుశా మీరెంత మంచిగా ఉండాలనుకున్నా, మీలో చెడు కోరికలు పుడుతుండవచ్చు. అది చూసి మీరు డీలాపడిపోవచ్చు. కానీ సమర్పించుకున్నప్పుడు మీరు యెహోవాకు ఇచ్చిన మాట గురించి ఆలోచించినప్పుడు, తప్పుడు కోరికలతో పోరాడడానికి కావల్సిన బలం మీకు వస్తుంది. నిజానికి, యెహోవాకు సమర్పించుకున్నప్పుడు మీరిచ్చిన మాట, తప్పుడు కోరికలు రాకుండా ఒక కంచెలా పనిచేస్తుంది. ఎలా?

7. యెహోవాకు సమర్పించుకోవడం మనం నమ్మకంగా ఉండడానికి ఎలా సహాయం చేస్తుంది?

7 మీరు యెహోవాకు సమర్పించుకున్నప్పుడు, ఇక మీకోసం కాకుండా యెహోవా కోసం బ్రతుకుతారు. దానర్థం యెహోవాను బాధపెట్టే కోరికలు కావచ్చు, లక్ష్యాలు కావచ్చు వాటిని పక్కన పెట్టేస్తారు. (మత్త. 16:24) కాబట్టి మీకేదైనా కష్టం వచ్చినప్పుడు ఏ దారిలో వెళ్లాలా అని గింజుకోకుండా, అన్ని దారులు మూసేసి యెహోవాకు నమ్మకంగా ఉండడం అనే దారినే ఎంచుకుంటారు. యెహోవాను సంతోషపెట్టాలని గట్టిగా కోరుకుంటారు. ఒక రకంగా మీరు యోబులా ఉంటారు. ఎందుకంటే, ఆయనకు విపరీతమైన కష్టాలు వచ్చాయి. కానీ ఇలా గట్టిగా నిర్ణయించుకున్నాడు: “చనిపోయేంతవరకు నా యథార్థతను విడిచిపెట్టను!”—యోబు 27:5.

8. సమర్పించుకున్నప్పుడు చేసిన ప్రార్థన గురించి ఆలోచిస్తే, తప్పుడు కోరికలు ఎలా తిప్పికొట్టవచ్చు?

8 యెహోవాకు సమర్పించుకున్నప్పుడు చేసిన ప్రార్థన గురించి ఆలోచిస్తే, తప్పుడు కోరికల్ని తిప్పికొట్టేంత బలం వస్తుంది. ఉదాహరణకు మీరు పక్కవాళ్ల భర్తతో గానీ, భార్యతో గానీ సరసాలాడతారా లేదా మరీ చనువుగా ఉంటారా? ఉండరు కదా! అలాంటివన్నీ అస్సలు చెయ్యం అని ఇంతకుముందే యెహోవాకు మాటిచ్చారు. అలా మీ హృదయంలో తప్పుడు కోరికలు మొలకెత్తకుండా చూసుకుంటారు కాబట్టి తర్వాత వాటిని పీకేయడానికి కష్టపడాల్సిన అవసరం ఉండదు. దానివల్ల మీరు “చెడ్డవాళ్ల దారి” నుండి “పక్కకు” తప్పుకుంటారు.—సామె. 4:14, 15.

9. సమర్పించుకున్నప్పుడు చేసిన ప్రార్థన గురించి ఆలోచించడం యెహోవాను మీ జీవితంలో ముందుంచడానికి ఎలా సహాయం చేస్తుంది?

9 మీటింగ్స్‌కి మిస్‌ అయ్యేలాంటి ఉద్యోగం వస్తే అప్పుడేంటి? దాంట్లో డౌట్‌ ఏముంది, అలాంటి ఉద్యోగం చెయ్యం అని మనం ఇంతకుముందే నిర్ణయించుకున్నాం! కాబట్టి ఆ ఉద్యోగం చేస్తూ, దేవుని రాజ్యానికి ఎలా మొదటిస్థానం ఇవ్వాలా అని తర్జనభర్జన పడం. యేసుక్రీస్తు గురించి ఆలోచించండి. ఆయన తన తండ్రిని సంతోషపెట్టాలని గట్టిగా కోరుకున్నాడు. కాబట్టి దేవున్ని బాధపెట్టే ఏ పనీ చేయాలనుకోలేదు. మనం ఆయన గురించి ఆలోచించినప్పుడు, యెహోవాను బాధపెట్టే పని ఎవరైనా చేయమని చెప్తే వెంటనే, నిక్కచ్చిగా చెయ్యం అని చెప్తాం.—మత్త. 4:10; యోహా. 8:29.

10. బాప్తిస్మం తర్వాత మీరు యేసును ‘అనుసరిస్తూ ఉండడానికి’ యెహోవా ఎలా సహాయం చేస్తాడు?

10 నిజానికి కష్టాలు, తప్పు చేయాలనే ఒత్తిడి మీరు యేసును “అనుసరిస్తూ ఉండాలి” అని గట్టిగా నిర్ణయించుకున్నట్టు చూపించడానికి ఒక అవకాశాన్నిస్తాయి. మీరలా చేసినప్పుడు యెహోవా మీ వెన్నంటే ఉంటాడని మర్చిపోకండి. బైబిలు ఇలా చెప్తుంది: “దేవుడు నమ్మకమైనవాడు, మీరు తట్టుకోగలిగే దానికన్నా ఎక్కువగా మిమ్మల్ని పరీక్షకు గురికానివ్వడు; ఏదైనా పరీక్ష వచ్చినప్పుడు, దాన్నుండి తప్పించుకునే మార్గం కలగజేస్తాడు, సహించడానికి సహాయం చేస్తాడు.”—1 కొరిం. 10:13.

యేసును అనుసరిస్తూ ఉండడానికి మీరేం చేయవచ్చు?

11. యేసును అనుసరిస్తూ ఉండడానికి ఒక ముఖ్యమైన పద్ధతి ఏంటి? (చిత్రం కూడా చూడండి.)

11 యేసు మనస్ఫూర్తిగా యెహోవా సేవ చేశాడు. ప్రార్థనలో ఆయనకు దగ్గరగా ఉన్నాడు. (లూకా 6:12) నిజానికి బాప్తిస్మం తర్వాత యేసును అనుసరిస్తూ ఉండడానికి ఒక మంచి పద్ధతి ఏంటంటే, యెహోవాకు దగ్గరయ్యే పనులు చేస్తూ ఉండడమే! బైబిలు ఇలా చెప్తుంది: “మనం ప్రగతి సాధించినమేరకు ఇదే పద్ధతిలో ముందుకు సాగిపోతూ ఉందాం.” (ఫిలి. 3:16) అప్పుడప్పుడు, ఎక్కువ సేవ చేయాలనే లక్ష్యం పెట్టుకున్న బ్రదర్స్‌-సిస్టర్స్‌ అనుభవాల్ని మీరు వినుంటారు. బహుశా వాళ్లు రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు వెళ్లుంటారు లేదా అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లుంటారు. మీరు అలాంటి లక్ష్యాలు పెట్టుకోగలరేమో ఆలోచించండి. యెహోవా ప్రజలందరూ తమ సేవను ఇంకా ఎక్కువ చేయాలని ఇష్టంగా ముందుకు వస్తున్నారు. (అపొ. 16:9) అయితే, ప్రస్తుతం మీరున్న పరిస్థితినిబట్టి ఎక్కువ చేయలేకపోతే అప్పుడేంటి? ఎక్కువ సేవ చేస్తున్న బ్రదర్స్‌సిస్టర్స్‌ని చూసి మీరు తక్కువ అనుకోకండి. మనం సహిస్తూ నమ్మకంగా కొనసాగడమే అన్నిటికంటే ప్రాముఖ్యం. (మత్త. 10:22) మీ సామర్థ్యాల్ని, పరిస్థితుల్ని బట్టి మీరెంత చేసినా, యెహోవా దాన్ని విలువైనదిగా చూస్తాడని మర్చిపోకండి. బాప్తిస్మం తర్వాత యేసును అనుసరిస్తూ ఉండడానికి ఇదే అన్నిటికంటే ముఖ్యమైన పద్ధతి.—కీర్త. 26:1.

బాప్తిస్మం తర్వాత, యెహోవాకు దగ్గరయ్యే పనులు చేయాలనే లక్ష్యం పెట్టుకోండి (11వ పేరా చూడండి)


12-13. మీ ఉత్సాహం తగ్గుతున్నట్టు అనిపిస్తే మీరేం చేయవచ్చు? (1 కొరింథీయులు 9:16, 17) (“ మీ పరుగు ఆపకండి” అనే బాక్స్‌ కూడా చూడండి.)

12 అయితే, కొన్ని రోజులుగా మీ ప్రార్థనలు హృదయం నుండి కాకుండా పెదాల నుండి వస్తున్నట్టు అనిపించిందా? ఏదో చేయాలి కదా అన్నట్టుగా ప్రీచింగ్‌ చేస్తున్నారా? బైబిలు ఒకప్పుడు చదివినంత ఇష్టంగా చదవలేకపోతున్నారా? బాప్తిస్మం తర్వాత మీకు అలాంటి పరిస్థితి వస్తే, ఇక యెహోవా తన పవిత్రశక్తిని మీకు ఇవ్వట్లేదని అనుకోకండి. మనందరం అపరిపూర్ణులం, మన మనసు రకరకాల ఫీలింగ్స్‌తో ఊగిసలాడుతూ ఉంటుంది. ఒకవేళ మీ ఉత్సాహం తగ్గుతున్నట్టు అనిపిస్తే, అపొస్తలుడైన పౌలును గుర్తుతెచ్చుకోండి. ఆయన యేసుక్రీస్తును అనుసరించడానికి ఎంత ప్రయత్నించినా, కొన్నిసార్లు ఆయన చేయాల్సిన పనిని మనసుపెట్టి చేయలేకపోయాడు. (1 కొరింథీయులు 9:16, 17 చదవండి.) ఆయనిలా అన్నాడు: “ఒకవేళ నేను ఆ పనిని ఇష్టం లేకుండా చేసినా, దేవుడు అప్పగించిన బాధ్యత నా మీద అలాగే ఉంటుంది.” మరో మాటలో చెప్పాలంటే, ఆ క్షణం పౌలుకు పరిచర్య చేయడానికి మనసు రాకపోయినా ఆయన దాన్ని చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.

13 అదేవిధంగా, అపరిపూర్ణత వల్ల మీలో కలిగే ఫీలింగ్స్‌ మీ నిర్ణయాల మీద పైచేయి సాధించనివ్వకండి. మీకెలా అనిపించినా సరే, సరైంది చేయాలని గట్టిగా నిర్ణయించుకోండి. సరైంది చేస్తూ ఉన్నప్పుడు కొన్నిరోజులకు మీలో ఉన్న ఫీలింగ్స్‌ మారవచ్చు. ఏదేమైనా, బాప్తిస్మం తర్వాత యేసును అనుసరిస్తూ ఉండడానికి క్రమంగా వ్యక్తిగత అధ్యయనం, ప్రార్థన, మీటింగ్స్‌కి వెళ్లడం, ప్రీచింగ్‌ చేయడం లాంటి పనులు ఆపకండి. అప్పుడు మిమ్మల్ని చూసే బ్రదర్స్‌సిస్టర్స్‌కి కూడా మీలా ఉండాలనిపిస్తుంది.—1 థెస్స. 5:11.

“పరీక్షించుకుంటూ . . . రుజువు చేసుకుంటూ ఉండండి”

14. మీరు ఎప్పటికప్పుడు ఏ విషయాల్ని పరీక్షించుకుంటూ ఉండాలి? ఎందుకు? (2 కొరింథీయులు 13:5)

14 బాప్తిస్మం తర్వాత కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ఉండడం మంచిది. (2 కొరింథీయులు 13:5 చదవండి.) ఎప్పటికప్పుడు మీ జీవితాన్ని, మీ అలవాట్లను పరిశీలించుకోండి. ఉదాహరణకు, ప్రతీరోజు ప్రార్థన చేస్తున్నారా? బైబిల్ని చదువుతూ అధ్యయనం చేస్తున్నారా? క్రమంగా మీటింగ్స్‌కి వెళ్తున్నారా? ప్రీచింగ్‌లో చక్కగా భాగం వహిస్తున్నారా? ఈ విషయాల్లో ఇంకా ఏమైనా మెరుగు అవ్వొచ్చేమో ఆలోచించండి. దానికోసం మీరు ఈ ప్రశ్నలు వేసుకోవచ్చు: ‘నేను బైబిల్లో ఉన్న ప్రాథమిక బోధల్ని వేరేవాళ్లకు వివరించగలనా? ప్రీచింగ్‌ ఇంకా సంతోషంగా చేయడానికి నేనేమి చేయవచ్చు? ప్రార్థనలో నాకు కావాల్సినవాటిని స్పష్టంగా అడుగుతున్నానా? నేను యెహోవా మీద పూర్తిగా ఆధారపడుతున్నానని నా ప్రార్థనలు చూపిస్తున్నాయా? మీటింగ్స్‌కి క్రమంగా వెళ్తున్నానా? మీటింగ్స్‌లో నా ధ్యాస పక్కకు మళ్లకుండా, శ్రద్ధగా వింటూ వాటిలో చక్కగా భాగం వహించడానికి నేనేమి చేయవచ్చు?’

15-16. తప్పుచేయాలనే ఒత్తిడిని ఎదిరించడం గురించి ఒక బ్రదర్‌ అనుభవం నుండి మీరేం నేర్చుకున్నారు?

15 మీ బలహీనతల గురించి నిజాయితీగా పరీక్షించుకోవడం మంచిది. అదెందుకు అవసరమో రాబర్ట్‌ అనే బ్రదర్‌ ఉదాహరణ నుండి నేర్చుకోవచ్చు. ఆయనిలా చెప్పాడు: “నాకు 20 ఏళ్లున్నప్పుడు నేనొక పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేసేవాణ్ణి. అయితే ఒకరోజు ఆఫీస్‌ అయిపోయాక, నాతోపాటు పనిచేసే ఒకామె తన ఇంటికి రమ్మని పిలిచింది. ఇంట్లో ఎవ్వరూ ఉండరు, ‘నాతో నీకు నచ్చింది చేసుకోవచ్చు’ అని ఆమె చెప్పింది. మొదట్లో నేను ఏవో కుంటిసాకులు చెప్పి తప్పించుకున్నాను. కానీ చివరికి నేను రానని చెప్పి ఆమెకు కారణాన్ని వివరించాను.” రాబర్ట్‌ తప్పుచేయాలనే ఒత్తిడిని ఎదిరించాడు. అది మంచి విషయమే! కానీ, జరిగిన సంఘటన గురించి ఆయన ఒక్కసారి వెనక్కెళ్లి చూసుకుంటే, ఆమె అడిగినదానికి ఇంకా బాగా జవాబు చెప్పాల్సింది అనుకున్నాడు! ఆయనిలా ఒప్పుకుంటున్నాడు: “పోతీఫరు భార్య అడిగినదాన్ని యోసేపు కాదన్నంత నిక్కచ్చిగా నేను చెప్పలేకపోయాను. (ఆది. 39:7-9) నిజానికి, ఆమె అడిగినదాన్ని కాదని చెప్పడం నాకు ఎందుకంత కష్టమైందో ఆలోచిస్తే భయమేసింది. కానీ యెహోవాతో నాకున్న స్నేహాన్ని నేనింకా బలపర్చుకోవాల్సిన అవసరం ఉందని నాకప్పుడు అర్థమైంది!”

16 రాబర్ట్‌లాగే మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం చాలా మంచిది. అయితే, మీరు తప్పుచేయాలనే ఒత్తిడిని చక్కగా ఎదిరించి ఉండవచ్చు. అయినాసరే ఇలా ప్రశ్నించుకోండి ‘నేను కాదని చెప్పడానికి ఎంత టైమ్‌ పట్టింది?’ ఒకవేళ ఈ విషయంలో మీరు ఇంకా మెరుగవ్వాల్సి ఉందని మీకు అనిపిస్తే బాధపడకండి. ఆ బలహీనత మీలో ఉందని గుర్తించినందుకు సంతోషించండి. దానిగురించి ప్రార్థన చేయండి. యెహోవా నైతిక ప్రమాణాలకు తగ్గట్టు జీవించాలనే మీ నిర్ణయాన్ని బలపర్చుకోవడానికి తగిన పనులు చేయండి.—కీర్త. 139:23, 24.

17. రాబర్ట్‌కి ఎదురైన అనుభవాన్ని బట్టి ఆయన యెహోవా పేరును ఎలా ఘనపర్చాడు?

17 రాబర్ట్‌ అనుభవం అంతటితో అయిపోలేదు. ఆయనింకా ఇలా అంటున్నాడు: “నాతోపాటు పనిచేసే ఆవిడ తన ఇంటికి పిలిచినప్పుడు నేను వెళ్లనందుకు ఆమె ఇలా అంది: ‘నువ్వు పాస్‌ అయ్యావు!’ ఆమె ఏం అనిందో అర్థంకాక, ఏంటని అడిగాను. అప్పుడామె చెప్పింది ఏంటంటే, ఒకప్పటి యెహోవాసాక్షియైన ఆమె ఫ్రెండ్‌ యెహోవాసాక్షుల్లో యౌవనస్థులందరూ అవకాశం దొరికితే రహస్యంగా తప్పులు చేస్తారని చెప్పాడు. అది నిజమో కాదో ఆమె నన్ను పరీక్షించి తెలుసుకోవాలి అనుకుంది. ఆమె దగ్గర యెహోవా పేరును ఘనపర్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది.”

18. బాప్తిస్మం తర్వాత ఏం చేయాలని నిర్ణయించుకున్నారు? (“ పరుగెత్తుతూ ఉండడానికి ఈ రెండు ఆర్టికల్స్‌ సహాయం చేస్తాయి” అనే బాక్స్‌ కూడా చూడండి.)

18 యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్నప్పుడు మీరు ఆరు నూరైనా, నూరు ఆరైనా ఆయన పేరును పవిత్రపర్చాలని అనుకుంటున్నట్టు చూపిస్తారు. మీకొచ్చే పరీక్షలు అలాగే తప్పు చేయాలనే ఒత్తిళ్లను మీరెలా ఎదిరిస్తున్నారో యెహోవా గమనిస్తాడని గుర్తుపెట్టుకోండి. ఆయనకు నమ్మకంగా ఉండడానికి మీరు చేసే ప్రతీ ప్రయత్నం వెనుక ఆయన ఉంటాడు. అలా చేయడానికి మీకు కావల్సిన బలాన్ని ఆయన తన పవిత్రశక్తి ద్వారా ఇస్తాడని మర్చిపోకండి. (లూకా 11:11-13) యెహోవా ఉన్నాడనే ధైర్యంతో మీరు బాప్తిస్మం తర్వాత కూడా యేసును అనుసరిస్తూ ఉండగలరు!

మీరెలా జవాబిస్తారు?

  • క్రైస్తవులు ప్రతీరోజు హింసాకొయ్యను మోస్తూ ఉంటారంటే దానర్థం ఏంటి?

  • బాప్తిస్మం తర్వాత కూడా యేసును “అనుసరిస్తూ ఉండడానికి” మీరేం చేయవచ్చు?

  • మీరు నమ్మకంగా ఉండడానికి, సమర్పించుకున్నప్పుడు మీరు చేసిన ప్రార్థనను గుర్తుచేసుకోవడం ఎలా సహాయం చేస్తుంది?

పాట 89 వినండి, లోబడండి, దీవెనలు పొందండి