కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 9

పాట 75 ‘నేనున్నాను! నన్ను పంపించు!’

మీరు యెహోవాకు సమర్పించుకోవడానికి రెడీనా?

మీరు యెహోవాకు సమర్పించుకోవడానికి రెడీనా?

“యెహోవా నాకు చేసిన మంచి అంతటికీ నేను ఆయనకు ఏమి ఇవ్వను?”కీర్త. 116:12.

ముఖ్యాంశం

మీరు యెహోవాతో దగ్గరి సంబంధం పెంచుకునేలా ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది. అలా మీరు ఆయనకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవాలనే కోరికను పెంచుకోగలుగుతారు.

1-2. ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకోవడానికి ముందే ఏం చేయాలి?

 గడిచిన ఐదేళ్లలో, పది లక్షలకంటే ఎక్కువమంది బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షులయ్యారు. వాళ్లలో చాలామంది మొదటి శతాబ్దపు శిష్యుడైన తిమోతిలాగే సత్యాన్ని “పసితనం నుండే” నేర్చుకున్నారు. (2 తిమో. 3:14, 15) ఇంకొంతమంది, పెద్దయ్యాక లేదా వృద్ధాప్యంలో యెహోవా గురించి నేర్చుకున్నారు. కొన్నేళ్ల క్రితం, యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకున్న ఒకావిడ 97 ఏళ్ల వయసులో బాప్తిస్మం తీసుకుంది.

2 ఒకవేళ మీరు బైబిలు స్టడీ తీసుకుంటుంటే లేదా యెహోవాసాక్షుల పిల్లలైతే మీరు బాప్తిస్మం తీసుకోవడం గురించి ఆలోచిస్తున్నారా? అది మీరు పెట్టుకోగల మంచి లక్ష్యం. అయితే, బాప్తిస్మం కన్నా ముందు మిమ్మల్ని మీరు యెహోవాకు సమర్పించుకోవాలి. ఇంతకీ సమర్పించుకోవడం అంటే ఏంటి? మీరు రెడీగా ఉన్నారని అనిపిస్తే సమర్పించుకోవడానికి, బాప్తిస్మం తీసుకోవడానికి ఎందుకు వెనకడుగు వేయకూడదో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

సమర్పించుకోవడం అంటే ఏంటి?

3. బైబిల్లో యెహోవాకు సమర్పించుకున్న కొంతమంది ఎవరు?

3 బైబిలు ప్రకారం, సమర్పించుకోవడం అంటే ఒక ప్రత్యేకమైన పనికోసం వేరుగా ఉండడం అని అర్థం. ఇశ్రాయేలీయులు ఒక జనాంగంగా యెహోవాకు సమర్పించుకున్నారు. అయితే, వాళ్లలో కొంతమంది యెహోవాకు ప్రత్యేకమైన పద్ధతిలో సమర్పించుకున్నారు. ఉదాహరణకు, “సమర్పణకు గుర్తుగా ఉన్న పవిత్రమైన మెరిసే బంగారు రేకును” అహరోను పెట్టుకునేవాడు. ఆ బంగారు రేకు ఆయన ఇశ్రాయేలీయులకు ప్రధానయాజకుడిగా సేవ చేయడానికి ప్రత్యేకించబడ్డాడని సూచించేది. (లేవీ. 8:9) నాజీరులు కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో యెహోవాకు సమర్పించుకున్నారు. “నాజీరు” అని అనువదించిన హీబ్రూ పదానికి “ప్రత్యేకించబడిన వ్యక్తి” లేదా “సమర్పించబడిన వ్యక్తి” అని అర్థం. నాజీరులు మోషే ధర్మశాస్త్రంలో తమకోసం ఇవ్వబడిన ఆజ్ఞలకు అనుగుణంగా జీవించాల్సి ఉండేది.—సంఖ్యా. 6:2-8.

4. (ఎ) మీరు సమర్పించుకోవడం ద్వారా ఏం చేస్తారు? (బి) “తన కోసం తాను జీవించకుండా” ఉండడం అంటే ఏంటి? (చిత్రం కూడా చూడండి.)

4 యెహోవాకు సమర్పించుకున్నప్పుడు మీరు యేసుక్రీస్తు శిష్యులు అవ్వాలని నిర్ణయించుకుంటారు. యెహోవా ఇష్టాన్ని చేయడమే మీ జీవితంగా చేసుకుంటారు. అయితే, సమర్పించుకోవడంలో భాగంగా మీరు ఏది కూడా చేయాలి? యేసు ఇలా చెప్పాడు: “ఒక వ్యక్తి నా శిష్యుడు అవ్వాలనుకుంటే, అతను ఇక తన కోసం తాను జీవించకుండా” ఉండాలి. (మత్త. 16:24) యెహోవాకు సమర్పించుకున్న సేవకులుగా మీరు ఆయన ఇష్టానికి అడ్డొచ్చే దేన్ని చేయకూడదు. (2 కొరిం. 5:14, 15) అంటే లైంగిక పాపం లాంటి “శరీర కార్యాలు” చేయకూడదు. (గల. 5:19-21; 1 కొరిం. 6:18) ఇలాంటి నియమాలు మీ జీవితాన్ని కట్టిపడేస్తాయా? ఒకవేళ మీరు యెహోవాను ప్రేమిస్తే, ఆయన చెప్పేవన్నీ మీ మంచికోసమే అని మీరు నమ్మితే, మీకు అస్సలు అలా అనిపించదు. (కీర్త. 119:97; యెష. 48:17, 18) నికోలస్‌ అనే బ్రదర్‌ ఇలా అంటున్నాడు: “మీరు యెహోవా ప్రమాణాల్ని, మిమ్మల్ని కట్టిపడేసే జైలు గోడల్లా చూడొచ్చు, లేదా సింహం నుండి కాపాడే బోనులా చూడొచ్చు.”

మీరు యెహోవా ప్రమాణాల్ని, మిమ్మల్ని కట్టిపడేసే జైలు గోడల్లా చూడొచ్చు, లేదా సింహం నుండి కాపాడే బోనులా చూడొచ్చు. (4వ పేరా చూడండి)


5. (ఎ) మిమ్మల్ని మీరు యెహోవాకు ఎలా సమర్పించుకుంటారు? (బి) సమర్పించుకోవడానికి, బాప్తిస్మానికి తేడా ఏంటి? (చిత్రం కూడా చూడండి.)

5 మిమ్మల్ని మీరు యెహోవాకు ఎలా సమర్పించుకుంటారు? ఆయన్ని మాత్రమే ఆరాధిస్తారని, మీ జీవితంలో ఆయన ఇష్టాన్నే ముందు ఉంచుతారని ప్రార్థనలో మాటివ్వడం ద్వారా అలా చేస్తారు. అంటే ‘నిండు హృదయంతో, నిండు ప్రాణంతో, నిండు మనసుతో, పూర్తి బలంతో’ ఆయన్ని ప్రేమిస్తూనే ఉంటారని యెహోవాకు మాటిస్తారు. (మార్కు 12:30) సమర్పించుకోవడం అనేది మీరు ఒంటరిగా చేస్తారు. అది మీకు, యెహోవాకు మధ్య మాత్రమే ఉంటుంది. కానీ బాప్తిస్మం అందరిముందు తీసుకుంటారు. మీరు యెహోవాకు సమర్పించుకున్నారని చూసే వాళ్లందరికీ అర్థమౌతుంది. సమర్పణ అనేది ఒట్టి మాట కాదు, అది చాలా ముఖ్యమైంది. మీరు ఇచ్చిన మాటమీద నిలబడాలని యెహోవా కోరుకుంటున్నాడు. మీరూ అలాగే కోరుకోవాలి.—ప్రసం. 5:4, 5.

యెహోవాకు సమర్పించుకోవడం అంటే ఆయన్ని మాత్రమే ఆరాధిస్తామని, మన జీవితంలో ఆయన ఇష్టాన్నే ముందుంచుతామని ఒంటరిగా యెహోవాకు ప్రార్థనలో మాటివ్వడం (5వ పేరా చూడండి)


మీరెందుకు యెహోవాకు సమర్పించుకోవాలి?

6. ఒక వ్యక్తి ఎందుకు యెహోవాకు సమర్పించుకోవాలని అనుకుంటాడు?

6 మీరు యెహోవాను ప్రేమిస్తున్నారు కాబట్టే ఆయనకు సమర్పించుకోవాలని అనుకుంటారు. అయితే, ఆ ప్రేమ కేవలం ఒక ఫీలింగ్‌ కాదు. ఆయన గురించి, ఆయన ఉద్దేశాల గురించి “సరైన జ్ఞానం” తెలుసుకోవడం వల్ల మీకు ఆయన మీద ప్రేమ పుట్టింది. (కొలొ. 1:9) బైబిలు చదవడం ద్వారా (1) యెహోవా నిజమైన వ్యక్తని, (2) బైబిల్ని ఆయనే రాయించాడని, (3) తన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆయన తన సంస్థను ఉపయోగించుకుంటున్నాడని మీరు తెలుసుకున్నారు.

7. యెహోవాకు సమర్పించుకునే ముందు మనమేం చేయాలి?

7 యెహోవాకు సమర్పించుకున్నవాళ్లు బైబిల్లో ఉన్న ప్రాథమిక సత్యాల్ని తెలుసుకోవాలి, అందులో ఉన్న ప్రమాణాలకు తగ్గట్టు జీవించాలి. అంతేకాదు, వాళ్లు తమ పరిస్థితులు అనుమతించినంత మేరకు నేర్చుకున్నవాటిని ఇతరులకు చెప్తారు. (మత్త. 28:19, 20) యెహోవా మీద వాళ్లకున్న ప్రేమ, ఆయన్ని మాత్రమే ఆరాధించాలనే కోరికను పెంచుతుంది. మీ విషయంలో కూడా అంతేనా? అలాంటి ప్రేమ ఉంటే, మీకు స్టడీ ఇస్తున్న వ్యక్తి కోసమో, మీ అమ్మానాన్నల కోసమో, మీ ఫ్రెండ్స్‌ కోసమో సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకోవాలని అనుకోరు.

8. సమర్పించుకోవడానికి ఒక వ్యక్తిని ఏది కదిలిస్తుంది? (కీర్తన 116:12-14)

8 యెహోవా మీకోసం చేసినవాటన్నిటి గురించి ఆలోచించినప్పుడు మీ హృదయం కృతజ్ఞతతో ఉప్పొంగిపోతుంది. అప్పుడు, ఆయనకు సమర్పించుకోవాలనే కోరిక మీలో కలుగుతుంది. (కీర్తన 116:12-14 చదవండి.) “ప్రతీ మంచి బహుమతి, ప్రతీ పరిపూర్ణ వరం” యెహోవా నుండే వచ్చాయని బైబిలు సరిగ్గానే చెప్తుంది. (యాకో. 1:17) ఎందుకంటే ఆయనిచ్చిన బహుమతుల్లో, తన కుమారుడైన యేసును విమోచన క్రయధనంగా త్యాగం చేయడమే అన్నిటికన్నా గొప్ప గిఫ్ట్‌. ఆ బహుమతి వల్ల ఏమేమి సాధ్యం అయ్యాయో ఒక్కసారి ఆలోచించండి! యెహోవాతో దగ్గరి స్నేహానికి, శాశ్వత జీవితానికి మార్గం తెరుచుకుంది. (1 యోహా. 4:9, 10, 19) ఆ త్యాగానికి అలాగే యెహోవా మీపై కుమ్మరించిన ఇతర దీవెనలకు కృతజ్ఞత చూపించడానికి మీరు యెహోవాకు సమర్పించుకుంటారు. (ద్వితీ. 16:17; 2 కొరిం. 5:15) అలాంటి కృతజ్ఞతను చూపించడానికి, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలోని 46వ పాఠంలో 4వ పాయింట్‌ సహాయం చేస్తుంది. అందులో దేవునికి మీరు ఏ బహుమతి ఇవ్వవచ్చు? అనే మూడు నిమిషాల వీడియో కూడా ఉంది.

సమర్పించుకోవడానికి, బాప్తిస్మం తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా?

9. ఒక వ్యక్తి సమర్పించుకోవడానికి ఎందుకు తొందరపడకూడదు?

9 కొన్ని కారణాల్ని బట్టి మీరింకా సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవడానికి రెడీగా లేరని మీకు అనిపించవచ్చు. బహుశా యెహోవా ప్రమాణాలకు తగ్గట్టు మీ జీవితంలో ఇంకా మార్పులు చేసుకోవడానికి, లేదా మీ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి ఇంకొంచెం టైమ్‌ కావాలని మీకు అనిపించవచ్చు. (కొలొ. 2:6, 7) బైబిలు విద్యార్థులందరూ ఒకేలా ప్రగతి సాధించరు. అలాగే పిల్లలందరూ ఒకే వయసులో సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవడానికి రెడీగా ఉండరు. కాబట్టి ఇతరులతో పోల్చుకోకుండా మీరు ఇంకా ఎలాంటి మార్పులు చేసుకోవాలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.—గల. 6:4, 5.

10. మీరు సమర్పించుకోవడానికి, బాప్తిస్మం తీసుకోవడానికి ఇప్పుడే రెడీగా లేరనిపిస్తే ఏం చేయవచ్చు? (“ యెహోవాసాక్షుల పిల్లలకు” అనే బాక్స్‌ కూడా చూడండి.)

10 మీరు ఇప్పుడే రెడీగా లేరనిపిస్తే ఏం చేయాలి? మీరు సమర్పించుకోవాలనే లక్ష్యం పెట్టుకోండి. అవసరమైన మార్పులు చేసుకోవడానికి సహాయం చేయమని యెహోవాను అడగండి. (ఫిలి. 2:13; 3:16) యెహోవా మీ ప్రార్థనలు విని, జవాబిస్తాడనే నమ్మకంతో ఉండండి.—1 యోహా. 5:14.

కొంతమంది ఎందుకు వెనకడుగు వేస్తారు?

11. నమ్మకంగా ఉండేలా యెహోవా మనకెలా సహాయం చేస్తాడు?

11 కొంతమంది సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవడానికి రెడీగా ఉన్నా వెనకడుగు వేస్తారు. వాళ్లు ‘నేను ఏదైనా ఘోరమైన తప్పు చేసి బహిష్కరించబడతానేమో’ అని భయపడతారు. మీకూ అలాంటి భయమే ఉందా? అలాగైతే, యెహోవా చెప్పినట్టు నడుచుకునేలా, “ఆయన్ని పూర్తిగా సంతోషపెట్టేలా” మీకు సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉండండి. (కొలొ. 1:10) ఎందుకంటే, సరైనది చేసేలా ఆయన ఇప్పటికే చాలామందికి సహాయం చేశాడు. (1 కొరిం. 10:13) అందుకే, చాలా తక్కువమంది మాత్రమే సంఘం నుండి బహిష్కరించబడతారు. తన ప్రజలు నమ్మకంగా ఉండడానికి యెహోవా సహాయం చేస్తాడు.

12. మనం పాపం చేయకుండా ఎలా ఉండగలం?

12 అపరిపూర్ణ మనుషులుగా తప్పు చేయాలనే ఒత్తిడి అందరికీ వస్తుంది. (యాకో. 1:14) కానీ ఆ ఒత్తిడికి లొంగిపోవాలా వద్దా అన్నది మీ నిర్ణయమే. ఎందుకంటే మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. అయితే మన ఫీలింగ్స్‌, మన పనులు మన చేతుల్లో ఉండవని కొందరంటారు. కానీ అది పచ్చి అబద్ధం! తప్పుడు కోరికల్ని మీరు అదుపు చేసుకోగలరు. కొన్నిసార్లు తప్పుడు కోరికలు వచ్చినా, ఆ కోరికల్ని తిప్పికొట్టొచ్చు. దానికోసం ప్రతీరోజు ప్రార్థిస్తూ, బైబిల్ని చదువుతూ ఉండండి, క్రమంగా మీటింగ్స్‌కి వెళ్లండి, మీరు నేర్చుకుంటున్న వాటిని ఇతరులకు చెప్పండి. ఈ పనులన్నిటినీ ఆపకుండా చేస్తే, మీ సమర్పణకు తగ్గట్టు జీవించడానికి కావాల్సిన బలం వస్తుంది. అంతేకాదు, అవన్నీ చేయడానికి యెహోవా మీకు సహాయం చేస్తాడని ఎప్పుడూ మర్చిపోకండి.—గల. 5:16.

13. యోసేపు మనకు ఎలాంటి మంచి ఆదర్శాన్ని ఉంచాడు?

13 తప్పు చేయాలనే ఒత్తిడి వచ్చినప్పుడు ఏం చేయాలో ముందే నిర్ణయించుకోండి. అప్పుడు మీ సమర్పణకు తగ్గట్టు జీవించగలుగుతారు. అపరిపూర్ణులే అయినా, నమ్మకంగా ఉన్న చాలామంది గురించి బైబిలు చెప్తుంది. ఉదాహరణకు యోసేపునే తీసుకోండి. పోతీఫరు భార్య ఆయన్ని లొంగదీసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలనే దానిగురించి యోసేపుకు డౌటే లేదు. ఆయన దానికి అస్సలు ‘ఒప్పుకోలేదని’ బైబిలు చెప్తుంది. ఆయన ఇలా అన్నాడు: “నేను ఇంత చెడ్డపని చేసి దేవునికి వ్యతిరేకంగా ఎలా పాపం చేయగలను?” (ఆది. 39:8-10) ఆమె ఆ ఒత్తిడి తీసుకురాకముందే దానికి ఎలా ప్రతిస్పందించాలో యోసేపుకు తెలుసని దీన్నిబట్టి అర్థమౌతుంది. దానివల్ల ఆ ఒత్తిడి వచ్చినప్పుడు సరైనది చేయడం ఆయనకు ఈజీ అయ్యింది.

14. ఒత్తిడి వచ్చినప్పుడు పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి?

14 ఒత్తిడి వచ్చినప్పుడు మీరు యోసేపులా ఎలా ఉండవచ్చు? ఒత్తిడి వచ్చినప్పుడు ఏం చేయాలో ఇప్పుడే నిర్ణయించుకోండి. యెహోవా అసహ్యించుకునే పనులు చెయ్యం అని ఖరాఖండిగా చెప్పండి. కనీసం వాటిగురించి ఆలోచించడానికి కూడా ఇష్టపడకండి. (కీర్త. 97:10; 119:165) మీరలా ముందే నిర్ణయించుకుంటే, ఒత్తిడి వచ్చినప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు కాబట్టి అటూఇటూ ఊగిసలాడరు.

15. ఒక వ్యక్తి యెహోవాను ‘మనస్ఫూర్తిగా వెదుకుతున్నాడు’ అని ఎలా చూపించవచ్చు? (హెబ్రీయులు 11:6)

15 మీ విషయానికొస్తే, మీకు ఇదే సత్యమని తెలుసు. యెహోవాను పూర్ణ హృదయంతో సేవించాలనే కోరిక కూడా మీకుంది. కానీ సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకోకుండా మిమ్మల్ని ఏదో వెనక్కి లాగుతుందా? అలాగైతే, మీరు కూడా దావీదులా యెహోవాను ఇలా బ్రతిమాలొచ్చు: “దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో. నన్ను పరిశీలించి, నన్ను కలవరపెడుతున్న ఆలోచనల్ని తెలుసుకో. హానికరమైన మార్గంలోకి తీసుకెళ్లేది ఏదైనా నాలో ఉందేమో చూడు, శాశ్వత మార్గంలో నన్ను నడిపించు.” (కీర్త. 139:23, 24) అవును, “తనను మనస్ఫూర్తిగా వెదికేవాళ్లకు” యెహోవా దీవెనలు ఉంటాయి. ఆయనకు సమర్పించుకోవడానికి, బాప్తిస్మం తీసుకోవడానికి మీరు వేసే అడుగులు, మీరు ఆయన్ని మనస్ఫూర్తిగా వెదుకుతున్నారని చూపిస్తున్నాయి.—హెబ్రీయులు 11:6 చదవండి.

యెహోవాకు దగ్గరౌతూ ఉండండి

16-17. సాక్షుల పిల్లల్ని యెహోవా ఎలా ఆకర్షించుకుంటాడు? (యోహాను 6:44)

16 తన శిష్యుల్ని యెహోవాయే ఆకర్షించాడని యేసు చెప్పాడు. (యోహాను 6:44 చదవండి.) ఆ ఆలోచన ఎంత బాగుందో కదా! అది మీ విషయంలో ఎలా నిజమైందో ఆలోచించండి. యెహోవా ప్రతీ ఒక్కరిలో ఏదోక మంచిని చూసి, తనవైపుకు ఆకర్షించుకుంటాడు. ఆయన ఒక్కొక్కరిని తన “ప్రత్యేకమైన సొత్తుగా” లేదా తన “విలువైన సంపదగా” చూస్తాడు. (ద్వితీ. 7:6; అధస్సూచి.) ఆయన మిమ్మల్ని కూడా అలాగే చూస్తున్నాడు.

17 మీరు సాక్షుల కుటుంబంలో పెరిగిన పిల్లలా? అలాగైతే, మీ తల్లిదండ్రులు యెహోవాను ఆరాధిస్తున్నారు కాబట్టి మీరు కూడా యెహోవాసాక్షులు అయ్యారని, యెహోవా మిమ్మల్ని ఏమీ ప్రత్యేకంగా తనవైపుకు ఆకర్షించలేదని మీకు అనిపించవచ్చు. కానీ బైబిలు ఇలా చెప్తుంది: “దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు.” (యాకో. 4:8; 1 దిన. 28:9) మీరు యెహోవాకు దగ్గరవ్వడానికి తొలి అడుగు వేస్తే, దానికి ఆయన ప్రతిస్పందించి మీకు దగ్గరౌతాడు. కాబట్టి యెహోవా మిమ్మల్ని ఫలానా కుటుంబంలోని సభ్యులుగా మాత్రమే చూడడు. ఆయన అందర్నీ ఆకర్షించినట్టే, సాక్షుల కుటుంబంలో పెరిగిన పిల్లల్ని కూడా తన వైపుకు ఆకర్షించుకున్నాడు. వాళ్లు యెహోవాకు దగ్గరవ్వడానికి చొరవ తీసుకుంటే, యాకోబు 4:8 చెప్తున్నట్టు ఆయన ప్రతిస్పందిస్తాడు.—2 థెస్సలొనీకయులు 2:13 తో పోల్చండి.

18. తర్వాతి ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం? (కీర్తన 40:8)

18 మీరు యెహోవాకు సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకోవడం ద్వారా యేసు మనస్తత్వాన్ని అద్దం పడతారు. యేసు ఇష్టంగా తననుతాను తండ్రికి అప్పగించుకోవడం ద్వారా తండ్రి మాటనే బాటగా చేసుకున్నాడు. (కీర్తన 40:8 చదవండి; హెబ్రీ. 10:7) అయితే, బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా మీరు యెహోవాకు నమ్మకంగా సేవచేస్తూ ఉండడానికి ఏది సహాయం చేస్తుందో తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

మీరెలా జవాబిస్తారు?

  • యెహోవాకు సమర్పించుకోవడం అంటే ఏంటి?

  • కృతజ్ఞతకు, సమర్పించుకోవడానికి సంబంధం ఏంటి?

  • ఘోరమైన పాపం చేయకుండా మనల్ని ఏది కాపాడుతుంది?

పాట 38 ఆయనే నిన్ను బలపరుస్తాడు