కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 13

పాట 127 నేను ఇలాంటి వ్యక్తిగా ఉండాలి

యెహోవా మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నాడా?

యెహోవా మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నాడా?

“నిన్ను చూసి నేను సంతోషిస్తున్నాను.”లూకా 3:22.

ముఖ్యాంశం

యెహోవా మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నాడో లేదో అనే అనుమానాల్ని ఎలా తీసేసుకోవచ్చు?

1. కొంతమంది యెహోవా నమ్మకమైన సేవకులకు కూడా ఏ అనుమానం రావచ్చు?

 యెహోవా మనల్ని ఒక గుంపుగా చూసి సంతోషిస్తాడని తెలుసుకోవడం ఎంత ధైర్యాన్ని ఇస్తుందో కదా! బైబిలు ఇలా చెప్తుంది: “యెహోవా తన ప్రజల్ని బట్టి సంతోషిస్తాడు.” (కీర్త. 149:4) అయితే, కొన్నిసార్లు కొంతమంది ఎంత డీలా పడిపోతారంటే ‘యెహోవా నన్ను చూసి అసలు సంతోషిస్తున్నాడా?’ అని అనుకుంటారు. బైబిల్లో కొంతమంది నమ్మకమైన యెహోవా సేవకులు కూడా అలాంటి ఆలోచనలతో సతమతమయ్యారు.—1 సమూ. 1:6-10; యోబు 29:2, 4; కీర్త. 51:11.

2. యెహోవా ఎవర్ని చూసి సంతోషిస్తాడు?

2 అపరిపూర్ణ మనుషులు కూడా యెహోవాను సంతోషపెట్టగలరని బైబిలు స్పష్టంగా చూపిస్తుంది. ఎలా? మనం యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచాలి, బాప్తిస్మం తీసుకోవాలి. (యోహా. 3:16) అలా బాప్తిస్మం తీసుకున్నప్పుడు మన పాపాల విషయంలో పశ్చాత్తాపం చూపించామని, యెహోవా ఇష్టం చేస్తామనే మాటిచ్చామని అందరికీ చూపిస్తాం. (అపొ. 2:38; 3:19) మనం తనతో స్నేహం ఏర్పరచుకోవడానికి ఈ పనులన్నీ చేయడం చూసి యెహోవా తప్పకుండా సంతోషిస్తాడు. మనం సమర్పించుకున్నప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శాయశక్తులా కృషి చేసినంత కాలం, యెహోవా మనల్ని చూసి సంతోషిస్తూనే ఉంటాడు, తన స్నేహితుల చిట్టాలోకి చేర్చుకుంటాడు.—కీర్త. 25:14.

3. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

3 అయితే, కొన్నిసార్లు దేవుడు తమను చూసి సంతోషిచట్లేదని కొంతమంది ఎందుకు అనుకోవచ్చు? యెహోవా మనల్ని చూసి సంతోషిస్తున్నాడని ఎలా చూపిస్తాడు? ఆయన మనల్ని చూసి సంతోషిస్తాడనే నమ్మకాన్ని ఎలా బలపర్చుకోవచ్చు?

దేవుడు తమను చూసి సంతోషించట్లేదని కొంతమంది ఎందుకు అనుకోవచ్చు?

4-5. మనం ఎందుకూ పనికిరానివాళ్లం అనిపించినా మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?

4 మనలో చాలామందికి చిన్నప్పటినుండి ఎందుకూ పనికిరాం అని అనిపిస్తూ ఉండవచ్చు. (కీర్త. 88:15) అడ్రియన్‌ అనే బ్రదర్‌ ఇలా చెప్తున్నాడు: “నాకెప్పుడూ అలాగే అనిపించేది. పరదైసులో ఉండే అర్హత నాకు లేదని అనిపించేది. నా కుటుంబ సభ్యులైనా పరదైసులో ఉండాలని చిన్నప్పుడు ప్రార్థన చేయడం నాకింకా గుర్తుంది.” యెహోవాసాక్షుల కుటుంబంలో పెరగని టోని అనే బ్రదర్‌ ఇలా చెప్తున్నాడు: “నన్ను ప్రేమిస్తున్నారని గానీ నన్ను చూసి గర్వపడుతున్నారని గానీ మా మమ్మీడాడీ ఎప్పుడూ చెప్పలేదు. ఇక వాళ్లను సంతోషపెట్టడం నావల్ల కాదని అనిపించేది.”

5 అప్పుడప్పుడు మనకు కూడా ఎందుకూ పనికిరానివాళ్లం అని అనిపించవచ్చు. అప్పుడు యెహోవాయే స్వయంగా మనల్ని ఆకర్షించుకున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. (యోహా. 6:44) మనలో మనం కూడా చూసుకోలేని మంచిని ఆయన చూడగలడు. అంతేకాదు, ఆయనకు మన మనసు తెలుసు. (1 సమూ. 16:7; 2 దిన. 6:30) కాబట్టి మనం తనకు చాలా విలువైనవాళ్లమని ఆయన చెప్పినప్పుడు దాన్ని నమ్మవచ్చు.—1 యోహా. 3:19, 20.

6. ఒకప్పుడు చేసిన పాపాల గురించి అపొస్తలుడైన పౌలుకు ఎలా అనిపించింది?

6 సత్యం తెలుసుకోక ముందు మనలో కొంతమంది ఎన్నో తప్పులు చేసుంటాం. ఆ తప్పులు ఎందుకు చేశామని ఇప్పటికీ బాధపడుతుండవచ్చు. (1 పేతు. 4:3) నమ్మకమైన క్రైస్తవులు కూడా తమకున్న బలహీనతలతో ఇంకా పోరాడుతూనే ఉంటారు. మరి మీ విషయమేంటి? కొన్నిసార్లు యెహోవా మిమ్మల్ని అస్సలు క్షమించడని మీకు అనిపిస్తుందా? అలాగైతే, యెహోవాకు నమ్మకంగా సేవచేసిన వాళ్లకు కూడా మీలాగే అనిపించిందని మర్చిపోకండి. ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు కూడా తనకున్న అపరిపూర్ణతల గురించి ఆలోచించినప్పుడు చాలా బాధపడ్డాడు. (రోమా. 7:24) నిజమే పౌలు తన పాపాల విషయంలో పశ్చాత్తాపపడి, బాప్తిస్మం తీసుకున్నాడు. అయినాసరే, “అపొస్తలులందరిలో తక్కువవాణ్ణి,” “వాళ్లందరిలో నేనే పెద్ద పాపిని” అని ఆయన అన్నాడు.—1 కొరిం. 15:9; 1 తిమో. 1:15.

7. మనం ఒకప్పుడు చేసిన పాపాల గురించి ఏం గుర్తుపెట్టుకోవాలి?

7 మనం పశ్చాత్తాపం చూపిస్తే, క్షమిస్తానని మన పరలోక తండ్రి మాటిస్తున్నాడు. (కీర్త. 86:5) కాబట్టి మనం చేసిన పాపాలకు మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగితే, యెహోవా ఇచ్చిన మాట ప్రకారం మనల్ని క్షమించేశాడనే నమ్మకంతో ఉండవచ్చు.—కొలొ. 2:13.

8-9. యెహోవాను సంతోషపెట్టేంత సేవ మనం ఎప్పుడూ చేయలేం అనే ఆలోచనను ఎలా తీసేసుకోవచ్చు?

8 మనం యెహోవా సేవలో చేయగలిగినదంతా చేయాలని కోరుకుంటాం. అయితే, కొంతమంది దేవున్ని సంతోషపెట్టేంత సేవ ఎప్పుడూ చేయలేనని అనుకోవచ్చు. అమాండ అనే సిస్టర్‌ ఇలా చెప్తుంది: “యెహోవాకు నా బెస్ట్‌ ఇవ్వడమంటే, నేను చేసేది సరిపోదు ఇంకా ఎక్కువ చేయాలి అని అనుకునేదాన్ని. కాబట్టే నేను చేయగలిగే దానికంటే ఎక్కువ చేయాలని అనుకునేదాన్ని. అలా చేయలేనప్పుడు నాకు నేను నచ్చకపోయేదాన్ని, యెహోవాకు కూడా నేను నచ్చను అనిపించేది.”

9 యెహోవాను సంతోషపెట్టేంత సేవ మనం ఎప్పుడూ చేయలేం అనే ఆలోచనను ఎలా తీసేసుకోవచ్చు? యెహోవా మొండిపట్టు పట్టేవాడు కాదని గుర్తుంచుకోండి. మనం చేయగలిగే దానికన్నా ఎక్కువ చేయాలని ఆయన ఆశించడు. మన పరిస్థితుల్ని బట్టి మన శక్తి లోపంలేకుండా చేయగలిగినదంతా చేసినప్పుడు, అది చూసి ఆయన సంతోషిస్తాడు. అంతేకాదు మనస్ఫూర్తిగా యెహోవా సేవ చేసిన బైబిలు ఉదాహరణల్ని ఆలోచించండి. ఉదాహరణకు పౌలు గురించి ఆలోచించండి. ఆయన సంవత్సరాలపాటు ఉత్సాహంగా ప్రకటనా పని చేశాడు, ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించాడు, చాలా సంఘాల్ని స్థాపించాడు. అయినా కొన్ని పరిస్థితుల వల్ల అంతగా ప్రకటనా పని చేయనప్పుడు యెహోవా ఆయన్ని చూసి సంతోషించలేదా? సంతోషించాడు! తన పరిస్థితుల్ని బట్టి తను చేయగలిగినదంతా చేస్తూ ఉన్నప్పుడు యెహోవా పౌలును దీవించాడు. (అపొ. 28:30, 31) అదేవిధంగా, యెహోవా సేవలో మనం చేయగలిగేది కూడా పరిస్థితుల్ని బట్టి మారవచ్చు. అయితే, మనం ఎంత చేస్తున్నాం అన్నది కాదుగానీ ఎందుకు చేస్తున్నాం అనేదే యెహోవాకు చాలా ప్రాముఖ్యం. యెహోవా మనల్ని చూసి సంతోషిస్తున్నాడని తెలిపే కొన్ని విధానాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

యెహోవా మనల్ని చూసి సంతోషిస్తున్నాడని ఎలా చూపిస్తాడు?

10. యెహోవా మనల్ని చూసి సంతోషిస్తున్నాడని చెప్పే మాటల్ని ఎక్కడ “వింటాం”? (యోహా. 16:27)

10 బైబిలు ద్వారా. యెహోవా తన ప్రజల్ని ప్రేమిస్తున్నానని, వాళ్లను చూసి సంతోషిస్తున్నానని చెప్పే మార్గాల కోసం వెదుకుతాడు. తన కుమారుడైన యేసును ప్రేమిస్తున్నాడని, తనని చూసి సంతోషిస్తున్నాడని రెండు సందర్భాల్లో చెప్పినట్లు లేఖనాలు చూపిస్తున్నాయి. (మత్త. 3:17; 17:5) మిమ్మల్ని చూసి కూడా యెహోవా సంతోషిస్తున్నాడని చెప్పడం వినాలనుకుంటున్నారా? యెహోవా మనకు వినిపించేలా మాట్లాడకపోవచ్చు గానీ మనకు కనిపించే బైబిలు ద్వారా మాట్లాడతాడు. సువార్త పుస్తకాల్లో యేసు చెప్పిన మాటల్ని చదివినప్పుడు యెహోవా మనల్ని చూసి సంతోషిస్తున్నట్టు చెప్పడాన్ని “వింటాం.” (యోహాను 16:27 చదవండి.) ఎందుకంటే, యేసు తన తండ్రి వ్యక్తిత్వాన్ని అచ్చుగుద్దినట్టు ప్రతిబింబించాడు. కాబట్టి తన నమ్మకమైన అపరిపూర్ణ అనుచరుల్ని చూసి యేసు సంతోషిస్తున్నానని చెప్పిన మాటల్ని చదివినప్పుడు, ఒకవిధంగా యెహోవా మనల్ని చూసి సంతోషిస్తున్నాడని చెప్పినట్టుగా ఊహించుకోవచ్చు.—యోహా. 15:9, 15.

యెహోవా మనల్ని చూసి సంతోషిస్తున్నాడని చాలా విధాలుగా చూపిస్తాడు (10 పేరాలు చూడండి)


11. కష్టాలు వచ్చాయంటే యెహోవా మనల్ని చూసి సంతోషించట్లేదని దానర్థమా? (యాకో. 1:12)

11 తన పనుల ద్వారా. మనకు కావాల్సినవి ఇస్తూ మనకు సహాయం చేయాలని యెహోవా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు. అయితే, కొన్నిసార్లు యోబులాగే మనం కూడా కష్టాలుపడేలా ఆయన అనుమతించవచ్చు. (యోబు 1:8-11) మనకు కష్టాలు వస్తున్నాయంటే మనల్ని చూసి యెహోవా సంతోషించట్లేదని దానర్థం కాదు. బదులుగా, మనకు ఆయన మీద ఎంత ప్రేమ ఉందో, మనం ఆయన్ని ఎంత నమ్ముతున్నామో చూపించే అవకాశాలుగా వాటిని చూడాలి. (యాకోబు 1:12 చదవండి.) ఆ కష్టాల్ని తట్టుకోవడానికి యెహోవా సహాయం చేసినప్పుడు ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, ఎంత మద్దతిస్తున్నాడో రుచి చూడగలుగుతాం.

12. దిమిత్రి అనుభవం నుండి మనమేం నేర్చుకోవచ్చు?

12 ఆసియాలో ఉండే దిమిత్రి అనే బ్రదర్‌ ఉదాహరణ గమనించండి. ఆయన ఉద్యోగం పోయింది. ఎన్ని నెలలు ప్రయత్నించినా మళ్లీ ఉద్యోగం దొరకలేదు, కానీ ఎక్కువ ప్రీచింగ్‌ చేస్తూ యెహోవా మీద నమ్మకం చూపించాలని అనుకున్నాడు. చాలా నెలలు గడిచాయి అయినా ఆయనకు ఉద్యోగం దొరకలేదు. ఆ తర్వాత ఆయనకు అనారోగ్య సమస్యలు వచ్చి, మంచాన పడ్డాడు. ఒక భర్తగా, తండ్రిగా ఆయన ఎందుకూ పనికిరానని అనుకున్నాడు. యెహోవా ఆమోదాన్ని కూడా కోల్పోయానని అనుకున్నాడు. ఆ తర్వాత ఒకరోజు రాత్రి వాళ్ల పాప ఒక పేపర్‌ మీద, యెషయా 30:15 లో ఉన్న ఈ మాటల్ని రాసింది: “కంగారుపడకుండా, నమ్మకం చూపిస్తే అదే మీకు బలం.” ఆ పేపర్‌ని ఆయన దగ్గరికి తీసుకొచ్చి, “డాడీ నీకు బాధగా అనిపించినప్పుడు ఈ లేఖనం గుర్తుతెచ్చుకో” అని చెప్పింది. నిజానికి యెహోవా వల్లే తన కుటుంబానికి కావాల్సిన ఆహారం, బట్టలు, ఇల్లు ఉన్నాయని దిమిత్రి గుర్తించాడు. ఆయనిలా అంటున్నాడు: “ఇప్పుడు నేను చేయాల్సిందల్లా, కంగారుపడకుండా నా దేవుడైన యెహోవా మీద నమ్మకం చూపిస్తూ ఉండడమే.” మీకు కూడా అలాంటి కష్టాలు వస్తే, యెహోవా మిమ్మల్ని పట్టించుకుంటాడని, మీరు వాటిని తట్టుకోవడానికి సహాయం చేస్తాడని నమ్మండి.

యెహోవా మనల్ని చూసి సంతోషిస్తున్నాడని చాలా విధాలుగా చూపిస్తాడు (12వ పేరా చూడండి) a


13. మనమీద తన ఆమోదం ఉందని యెహోవా ఎవరి ద్వారా చూపిస్తాడు? ఎలా చూపిస్తాడు?

13 మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ ద్వారా. యెహోవా బ్రదర్స్‌సిస్టర్స్‌ని ఉపయోగించుకుని మనమీద తన ఆమోదం ఉందని చూపిస్తాడు. ఉదాహరణకు, మనకు సరిగ్గా అవసరమైనప్పుడు ప్రోత్సాహాన్ని ఇచ్చేలా మాట్లాడడానికి ఆయన వాళ్లను కదిలించవచ్చు. ఆసియాలో ఒక సిస్టర్‌కి అలాంటి అనుభవమే ఎదురైంది. ఆమె చాలా ఒత్తిడిలో ఉంది. ఆమె ఉద్యోగం పోయింది, ఒక పెద్ద అనారోగ్య సమస్య వచ్చింది. తర్వాత ఆమె భర్త కూడా ఒక గంభీరమైన పాపం చేసి సంఘపెద్దగా తొలగించబడ్డాడు. ఆమె ఇలా చెప్తుంది: “ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థంకాలేదు. బహుశా నేనేమైనా తప్పు చేశానేమో అందుకే యెహోవా ఆమోదాన్ని కోల్పోయాను అని నాకు అనిపించింది.” యెహోవా ఆమోదం తనకుందని చూపించేలా చేయమని ఆమె వేడుకుంది. మరి, యెహోవా ఏం చేశాడు? ఆమె ఇలా చెప్తుంది: “సంఘపెద్దలు వచ్చి నాతో మాట్లాడారు. యెహోవా నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడనే అభయాన్ని వాళ్లు ఇచ్చారు.” ఆ తర్వాత ఆమె యెహోవా సహాయాన్ని మళ్లీ అడిగింది. ఆమె ఇలా చెప్తుంది: “అదేరోజు కొంతమంది బ్రదర్స్‌సిస్టర్స్‌ నాకు ఒక ఉత్తరాన్ని రాశారు. ఓదార్పునిచ్చే వాళ్ల మాటల్ని చదివినప్పుడు, యెహోవా నా మాటలు విన్నాడని అనిపించింది.” అవును, యెహోవా తరచూ తన ఆమోదం మనకుందని వేరేవాళ్ల మాటల ద్వారా చూపిస్తాడు.—కీర్త. 10:17.

యెహోవా మనల్ని చూసి సంతోషిస్తున్నాడని చాలా విధాలుగా చూపిస్తాడు (13వ పేరా చూడండి) b


14. మనమీద తన ఆమోదం ఉందని యెహోవా చూపించే ఇంకో విధానం ఏంటి?

14 మనకు అవసరమైనప్పుడు కావాల్సిన దిద్దుబాటును బ్రదర్స్‌-సిస్టర్స్‌ ఇచ్చేలా ఆయన చేస్తాడు. ఉదాహరణకు మొదటి శతాబ్దంలో, అపొస్తలుడైన పౌలు తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌కి 14 ఉత్తరాలు రాసేలా యెహోవా ప్రేరేపించాడు. ఆ ఉత్తరాల్లో పౌలు సూటిగా, ప్రేమగా ఇచ్చిన దిద్దుబాటు ఉంది. ఆ దిద్దుబాటు ఇచ్చేలా యెహోవా పౌలును ఎందుకు ప్రేరేపించాడు? ఎందుకంటే యెహోవా ఒక మంచి తండ్రి. ఆయన “తాను ప్రేమించే” పిల్లలకు క్రమశిక్షణ ఇస్తాడు. (సామె. 3:11, 12) కాబట్టి ఒకవేళ మీకు బైబిలు ఆధారంగా ఏదైనా దిద్దుబాటు వస్తే, మీరు యెహోవా ఆమోదాన్ని కోల్పోయినట్టు కాదుగానీ, మీకు యెహోవా ఆమోదం ఉందనడానికి అది రుజువు! (హెబ్రీ. 12:6) మనకు యెహోవా ఆమోదం ఉందనడానికి ఇంకా ఏ రుజువులున్నాయి?

యెహోవా మనల్ని చూసి సంతోషిస్తున్నాడని చెప్పడానికి ఇంకొన్ని రుజువులు

15. యెహోవా తన పవిత్రశక్తిని ఎవరికి ఇస్తాడు? అది మనలో ఏ నమ్మకాన్ని పుట్టిస్తుంది?

15 యెహోవా ఎవర్ని చూసైతే సంతోషిస్తాడో వాళ్లకు తన పవిత్రశక్తిని ఇస్తాడు. (మత్త. 12:18) కాబట్టి ఇలా ప్రశ్నించుకోండి: ‘నా జీవితంలో నేను పవిత్రశక్తి పుట్టించే కొన్ని లక్షణాలైనా చూపించానా?’ ఇంతకుముందుకన్నా యెహోవా గురించి తెలుసుకున్న తర్వాత మీరు వేరేవాళ్లతో ఓర్పుగా ఉంటున్నారా? నిజానికి పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్ని చూపించడం ఎంత నేర్చుకుంటే, యెహోవా ఆమోదం మనకుందని అంత రుజువు చూడవచ్చు.—“ పవిత్రశక్తి మనుషుల్లో పుట్టించే లక్షణాలు ఏమిటంటే . . . ” అనే బాక్స్‌ చూడండి.

యెహోవా మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నాడని చెప్పడానికి రుజువు ఏంటి? (15వ పేరా చూడండి)


16. మంచివార్త ప్రకటించే బాధ్యతను యెహోవా ఎవరికి అప్పగిస్తాడు? అది విన్నాక మీకేం అనిపిస్తుంది? (1 థెస్సలొనీకయులు 2:4)

16 యెహోవా ఎవర్ని చూసైతే సంతోషిస్తాడో వాళ్లకు మంచివార్త ప్రకటించే బాధ్యతను అప్పగిస్తాడు. (1 థెస్సలొనీకయులు 2:4 చదవండి.) ఇతరులకు మంచివార్త ప్రకటించడం వల్ల జోస్‌లిన్‌ అనే సిస్టర్‌ ఎలా ప్రయోజనం పొందిందో గమనించండి. ఒకరోజు జోస్‌లిన్‌ చాలా బాధగా నిద్రలేచింది. ఆమె ఇలా అంటుంది: “యెహోవాకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అనుకున్నాను. కానీ నేను పయినీరింగ్‌ చేస్తున్నాను. ఆరోజు ప్రీచింగ్‌కి వెళ్లాల్సిన రోజు. యెహోవాకు ప్రార్థన చేసుకుని నేను ప్రీచింగ్‌కి బయల్దేరాను.” ఆరోజు పొద్దున జోస్‌లిన్‌, మేరీ అనే ఆవిడను కలిసింది. ఆమె బైబిలు స్టడీ తీసుకోవడానికి కూడా ఒప్పుకుంది. సరిగ్గా తనకు సహాయం చేయమని దేవునికి ప్రార్థిస్తున్నప్పుడే జోస్‌లిన్‌ తన తలుపు తట్టిందని మేరీ కొన్ని నెలల తర్వాత చెప్పింది. ఆ అనుభవం గురించి ఆలోచించినప్పుడు జోస్‌లిన్‌ ఇలా అంటుంది: “ఒకవిధంగా యెహోవా ‘నిన్ను చూసి నేను సంతోషిస్తున్నాను’ అని నాతో చెప్పినట్లు అనిపించింది.” నిజమే మనం ప్రీచింగ్‌ చేసినప్పుడు అందరూ ఒకేలా స్పందించకపోవచ్చు. కానీ మంచివార్త ప్రకటించడానికి మనం చేయగలిగినదంతా చేసినప్పుడు యెహోవా సంతోషిస్తాడన్న నమ్మకంతో ఉండవచ్చు.

యెహోవా మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నాడని చెప్పడానికి రుజువు ఏంటి? (16వ పేరా చూడండి) c


17. విమోచన క్రయధనం గురించి విక్కీ చెప్పిన మాటల నుండి మీరేం నేర్చుకున్నారు? (కీర్తన 5:12)

17 యెహోవా ఎవర్ని చూసైతే సంతోషిస్తాడో వాళ్లకు విమోచన క్రయధన విలువను అన్వయిస్తాడు. (1 తిమో. 2:5, 6) అయితే, మనకు విమోచన క్రయధనం మీద విశ్వాసం ఉండి, బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా యెహోవా మనల్ని చూసి సంతోషించట్లేదేమో అనే అనుమానం ఉంటే, అప్పుడేంటి? మనల్ని మనం నమ్ముకోవడం కన్నా యెహోవాను నమ్మడం తెలివైన పని అని గుర్తుంచుకోండి. విమోచన క్రయధనం మీద విశ్వాసం ఉంచేవాళ్లు తన దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు అలాగే వాళ్లను దీవిస్తాను అని యెహోవా మాటిస్తున్నాడు. (కీర్తన 5:12 చదవండి; రోమా. 3:26) విమోచన క్రయధనం గురించి లోతుగా ఆలోచించడం విక్కీ అనే సిస్టర్‌కి చాలా సహాయం చేసింది. ఒకరోజు ఆమె విమోచన క్రయధనం గురించి బాగా ఆలోచించిన తర్వాత ఇలా ఒప్పుకుంటుంది: “యెహోవా నామీద ఎప్పటినుండో చాలా ఓర్పు చూపించాడు. . . . అయినాసరే నేను మాత్రం: ‘నీ ప్రేమ నన్ను చేరుకోలేదు, నీ కుమారుని త్యాగం నా పాపాల్ని కప్పడానికి సరిపోదు’ అని చెప్పినట్టుగా ప్రవర్తించాను.” విమోచన క్రయధనం అనే బహుమతి గురించి లోతుగా ఆలోచించినప్పుడు ఆమె యెహోవా ప్రేమను రుచి చూడడం మొదలుపెట్టింది. మనం కూడా విమోచన క్రయధనం గురించి ఆలోచించినప్పుడు యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని, మనల్ని చూసి సంతోషిస్తున్నాడని గుర్తించగలుగుతాం.

యెహోవా మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నాడని చెప్పడానికి రుజువు ఏంటి? (17వ పేరా చూడండి)


18. మనం యెహోవాను ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఏ నమ్మకంతో ఉండవచ్చు?

18 పైన చెప్పిన సలహాలన్నీ పాటించిన తర్వాత కూడా కొన్నిసార్లు మనం డీలా పడిపోయి, యెహోవా మనల్ని చూసి సంతోషిస్తున్నాడో లేదో అని అనుకోవచ్చు. ఒకవేళ అదే జరిగితే, “తనను ప్రేమిస్తూ” ఉండేవాళ్లను చూసి యెహోవా తప్పకుండా సంతోషిస్తాడని గుర్తుపెట్టుకోండి. (యాకో. 1:12) కాబట్టి ఆయనకు దగ్గరౌతూ ఉండండి, మిమ్మల్ని చూసి ఆయన సంతోషిస్తున్నాడని ఏయే విధాలుగా చూపిస్తున్నాడో గమనిస్తూ ఉండండి. అంతేకాదు, “ఆయన మనలో ఏ ఒక్కరికీ దూరంగా లేడు” అని గుర్తుంచుకోండి.—అపొ. 17:27.

మీరెలా జవాబిస్తారు?

  • దేవుడు తమను చూసి సంతోషించట్లేదని కొంతమంది ఎందుకు అనుకోవచ్చు?

  • యెహోవా మనల్ని చూసి సంతోషిస్తున్నాడని ఎలా చూపిస్తాడు?

  • యెహోవా మనల్ని చూసి సంతోషిస్తాడనే నమ్మకంతో ఎలా ఉండవచ్చు?

పాట 88 నీ మార్గాలు నాకు తెలియజేయి

a చిత్రం వివరణ: ఫోటో కోసం నటించింది

b చిత్రం వివరణ: ఫోటో కోసం నటించింది

c చిత్రం వివరణ: ఫోటో కోసం నటించింది