కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆనాటి జ్ఞాపకాలు

“ఆ పని ఎవరికి అప్పగించబడింది”

“ఆ పని ఎవరికి అప్పగించబడింది”

అది 1919వ సంవత్సరం, సెప్టెంబరు 1 సోమవారం. ఎన్నో రోజులుగా ఎడతెరిపి లేకుండా వస్తున్న గాలివాన ఆ రోజే ఆగి ఎండ వచ్చింది. ఆరోజు మధ్యాహ్నం, అమెరికాలో ఒహాయోలోని సిడార్‌ పాయింట్‌లో ఉన్న ఓ ఆడిటోరియంలో జరుగుతున్న సమావేశానికి 1,000 కన్నా తక్కువ మంది హాజరయ్యారు. సాయంత్రానికల్లా మరో 2,000 మంది పడవల్లో, కార్లలో, ప్రత్యేక రైళ్లలో అక్కడికి వచ్చారు. నిజానికి ఆ ఆడిటోరియం 2,500 మంది కూర్చోవడానికి మాత్రమే సరిపోతుంది. కాని మంగళవారం ఎంతమంది వచ్చారంటే ఆ ఆడిటోరియం సరిపోలేదు. దాంతో మిగిలిన సమావేశ కార్యక్రమాన్ని బయట ఉన్న పెద్ద చెట్ల కింద జరపాల్సి వచ్చింది.

ఆ చెట్ల ఆకుల మధ్య నుండి వస్తున్న సూర్యుని కిరణాలవల్ల ఆ ఆకుల నీడలు సహోదరుల బట్టలపై పడి అల్లికల్లా కనబడుతున్నాయి. లేక్‌ ఎరీ సరస్సు నుండి మెల్లగా వస్తున్న పిల్లగాలులకు సహోదరీల టోపీలకున్న ఈకలు ఊగుతున్నాయి. “లోకంలోని శబ్దాలకు దూరంగా అందమైన పార్కులాంటి ఆ పరిసరాల్లో నిజంగా పరదైసులో ఉన్నట్లు అనిపించింది” అని ఓ సహోదరుడు గుర్తుచేసుకున్నాడు.

కానీ సమావేశానికి హాజరైనవాళ్ల ముఖాల్లో కనిపించిన ఆనందం ముందు ఆ పరిసరాల అందాలు వెలవెలబోయాయి. ఓ స్థానిక వార్తాపత్రిక ఇలా రాసింది, “అక్కడ అందరూ చాలా భక్తిగా కనిపించారు. అదే సమయంలో చాలా ఆనందంగా, సరదాగా కూడా ఉన్నారు.” గత కొన్నేళ్లుగా ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్న ఆ బైబిలు విద్యార్థులకు తమ సహోదరసహోదరీల సహవాసం చాలా ఆనందాన్నిచ్చింది. యుద్ధ సమయంలో వ్యతిరేకత, సంఘాల్లో ఐక్యత లేకపోవడం, బ్రూక్లిన్‌ బెతెల్‌ను మూసేయడం, రాజ్యానికి మద్దతిస్తున్నందుకు ఎంతోమందిని జైల్లో వేయడం, నాయకత్వం వహిస్తున్న ఎనిమిది మంది సహోదరులకు 20 ఏళ్లు జైలుశిక్ష విధించడం వంటి పరీక్షల్ని సహోదరసహోదరీలు ఎదుర్కొన్నారు. a

ఆ సంవత్సరాల్లో పరిస్థితులు కష్టంగా మారడంతో, కొంతమంది బైబిలు విద్యార్థులు నిరుత్సాహం, అయోమయం వల్ల పరిచర్యను ఆపేశారు. మిగిలినవాళ్లు, పరిచర్యను ఆపమని అధికారుల నుండి వస్తున్న ఒత్తిడిని సహించడానికి చేయగలిగినదంతా చేశారు. ఓ కేసు విషయంలో సాక్షుల్ని విచారిస్తున్న ఓ అధికారి మాట్లాడుతూ, ఎంత తీవ్రంగా హెచ్చరించినప్పటికీ తాను విచారించిన బైబిలు విద్యార్థులు మాత్రం, “అంతం వరకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే” ఉంటామని తేల్చి చెప్పారని అన్నాడు.

ఈ పరీక్షా కాలమంతటిలో నమ్మకమైన బైబిలు విద్యార్థులు, “ప్రభువు తమను ఎలా నడిపిస్తున్నాడో గమనిస్తూ . . . ప్రతీ విషయంలో తండ్రి నడిపింపు కోసం ప్రార్థిస్తూ వచ్చారు.” ఇప్పుడు వాళ్లు సిడార్‌ పాయింట్‌లో జరుగుతున్న సమావేశంలో తిరిగి కలుసుకుని ఆనందిస్తున్నారు. ఎంతోమందిలాగే ఓ సహోదరి కూడా, “ప్రకటనా పనిని మరింత ఎక్కువగా ఓ పద్ధతి ప్రకారం మళ్లీ ఎలా చేస్తామోనని” ఆందోళనపడింది. ఏదేమైనా సహోదరసహోదరీలందరూ ప్రకటనా పనిని తిరిగి మొదలుపెట్టాలనుకున్నారు.

“GA”—ఓ సరికొత్త ఉపకరణం

ఆ సమావేశం జరుగుతున్న వారమంతా సమావేశ ప్రోగ్రామ్‌ షీట్లపై, హాజరైనవాళ్ల హోటల్‌ గదుల్లో పెట్టిన గ్రీటింగ్‌ కార్డులపై, సమావేశ ఆవరణలోని సైన్‌ బోర్డులపై ఉన్న “GA” అనే అక్షరాల అర్థమేమిటో అక్కడ హాజరైనవాళ్లకు అంతుచిక్కలేదు. దాన్ని తెలుసుకోవాలని సమావేశానికి హాజరైన 6,000 మంది పడుతున్న ఆత్రుతకు శుక్రవారం, “కో-లేబరర్స్‌ డే” రోజున సహోదరుడు జోసెఫ్‌ ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌ తెరదించాడు. “GA” అంటే ద గోల్డెన్‌ ఏజ్‌. పరిచర్యలో ఉపయోగించడం కోసం తయారుచేసిన ఓ కొత్త పత్రిక. b

తన తోటి అభిషిక్త క్రైస్తవుల గురించి మాట్లాడుతూ సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ ఇలా అన్నాడు, “కష్టతరమైన ఈ కాలాల్లో విశ్వాసమనే కంటితో మెస్సీయ పరిపాలన అనే బంగారు యుగాన్ని వాళ్లు చూస్తున్నారు . . . మెస్సీయ రాజ్యం వస్తుందని లోకానికి ప్రకటించడాన్ని వాళ్లు తమ ప్రథమ కర్తవ్యంగా, గౌరవంగా ఎంచుతున్నారు. దేవుడు వాళ్లకు అప్పగించిన పనిలో ఇది ఓ భాగం.”

“సత్యం, నిరీక్షణ, నమ్మకంతో కూడిన పత్రిక” అయిన ద గోల్డెన్‌ ఏజ్‌ను సత్యాన్ని అందరికీ వ్యాప్తి చేయడానికి ఓ కొత్త పద్ధతిగా ఉపయోగించాలి. సబ్‌స్క్రిప్షన్‌ క్యాంపైన్‌ ద్వారా ఇంటింటికి వెళ్లి ఆ పత్రికను అందించాలి. అయితే ఈ పని చేయడానికి ఎంతమందికి ఆసక్తి ఉందని అడిగినప్పుడు సమావేశానికి హాజరైనవాళ్లంతా లేచి నిలబడి తమ ఆసక్తిని చాటిచెప్పారు. ఆ తర్వాత, యేసు అడుగుజాడల్లో నడిచేవాళ్లకు మాత్రమే తెలిసిన ఆసక్తి, ఉత్సాహంతో వాళ్లు, ‘నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, ఓ ప్రభువా’ అంటూ పాట పాడారు. ఆ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ జె. ఎం. నారిస్‌ అనే సహోదరుడు ఇలా చెప్పాడు, “ఆ శబ్దానికి చెట్లు ఎలా దద్దరిల్లిపోయాయో నేను ఎన్నటికీ మర్చిపోను.”

సమావేశ సెషన్‌ అయిపోయిన తర్వాత, ఆ పత్రికకు మొదటి చందాదారులు అవ్వడం కోసం హాజరైనవాళ్లంతా గంటల తరబడి లైన్లో నిలబడ్డారు. మేబల్‌ఫిల్‌బ్రిక్‌ అనే సహోదరుడు ఇలా అన్నాడు, “మేము చేయడానికి మళ్లీ పనుందని తెలుసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది.” చాలామంది ఆయనలాగే భావించారు.

“ఆ పని ఎవరికి అప్పగించబడింది”

ఆ పత్రికను ఉపయోగించి పరిచర్య చేయడానికి దాదాపు 7,000 మంది బైబిలు విద్యార్థులు సిద్ధమయ్యారు. ఆర్గనైజేషన్‌ మెథడ్‌ అనే హ్యాండ్‌ బిల్‌లో అలాగే ఆ పని ఎవరికి అప్పగించబడింది(ఇంగ్లీషు) అనే చిన్నపుస్తకంలో ఈ వివరాలు ఉన్నాయి: ప్రధాన కార్యాలయంలోని కొత్త సేవా విభాగం ఈ పనిని నడిపిస్తుంది. సంఘంలో సేవా కమిటీని ఏర్పాటు చేయాలి, అలాగే సూచనల్ని ఇవ్వడానికి ఓ డైరక్టర్‌ను నియమించాలి. క్షేత్రాలను సెక్షన్లుగా విభజించాలి, ప్రతీ సెక్షన్‌లో 150-200 ఇళ్లు ఉండాలి. సహోదరులు తమ అనుభవాలను పంచుకొని, పరిచర్య చేసిన గంటల్ని రిపోర్టు చేసేలా ప్రతీ గురువారం సాయంత్రం సేవా కూటం నిర్వహించబడుతుంది.

“మేమందరం మా ఇళ్లకు తిరిగెళ్లిపోయాక సబ్‌స్క్రిప్షన్‌ క్యాంపైన్‌ చేస్తూ బిజీ అయిపోయాం” అని హర్మన్‌ ఫిల్‌బ్రిక్‌ చెప్పాడు. ఆసక్తి ఉన్న ప్రజలు వాళ్లకు ప్రతీచోట కనిపించారు. “యుద్ధం, అది మిగిల్చిన ఎంతో బాధవల్ల సంతోషకరమైన పరిస్థితుల గురించి చెప్పినప్పుడు ప్రతీఒక్కరూ దాన్ని విని ఆనందించారనిపించింది” అని బ్యూల కోవీ చెప్పింది. “పత్రికకు చందాదారులుగా ఉండడానికి ఇష్టపడినవాళ్ల సంఖ్య చూసి సంఘమంతా చాలా ఆశ్చర్యపోయింది” అని ఆర్థర్‌ క్లావుస్‌ రాశాడు. ఆ పత్రిక మొదటి సంచిక వచ్చిన రెండు నెలల్లోపు దాదాపు ఐదు లక్షల సాంపిల్‌ కాపీలు పంచిపెట్టబడ్డాయి. 50,000 మంది చందాదారులుగా తమ పేర్లను నమోదు చేయించుకున్నారు.

సహోదరుడు ఎ. హెచ్‌. మాక్‌మిలన్‌, కావలికోట 1920 జూలై 1 సంచికలోని “గాస్పెల్‌ ఆఫ్‌ ద కింగ్‌డం” అనే ఆర్టికల్‌ గురించి చెప్తూ, ‘దేవుని రాజ్యం గురించి ప్రకటించమని సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదరసహోదరీలందర్నీ ప్రోత్సహించడం ఇదే మొదటిసారి’ అని అన్నాడు. అంతేకాదు, “పరలోక రాజ్యం పరిపాలిస్తోందని లోకమంతటికీ సాక్ష్యమివ్వమని” ఆ ఆర్టికల్‌ అభిషిక్త క్రైస్తవుల్ని ప్రోత్సహించింది. ‘ఆ పని ఎవరికైతే అప్పగించబడిందో’ ఆ క్రీస్తు సహోదరులతో నేడు లక్షలమంది జత కలిశారు. వాళ్లు మెస్సీయ రాజ్యం తీసుకొచ్చే బంగారు భవిష్యత్తు కోసం ఎదురుచూస్తూ వాక్యాన్ని ఉత్సాహంగా ప్రకటిస్తున్నారు.

a జెహోవాస్‌ విట్నెసస్‌—ప్రొక్లెయిమర్స్‌ ఆఫ్‌ గాడ్స్‌ కింగ్‌డం అనే పుస్తకంలోని “ఎ టైం ఆఫ్‌ టెస్టింగ్‌ (1914-1918)” అనే 6వ అధ్యాయాన్ని చూడండి.

b ఆ పత్రిక పేరును 1937⁠లో కన్సోలేషన్‌ అని, ఆ తర్వాత 1946⁠లో అవేక్‌! అని మార్చారు.