కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రభుత్వ అధికారులతో వ్యవహరిస్తున్నప్పుడు, క్రైస్తవులు బైబిలు సూత్రాలతో శిక్షణనిచ్చిన తమ మనస్సాక్షిని ఉపయోగించాలి

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

ప్రభుత్వ ఉద్యోగులకు గిఫ్ట్‌లు లేదా డబ్బులు ఇవ్వడం సరైనదో కాదో నిర్ణయించుకోవడానికి క్రైస్తవులకు ఏది సహాయం చేస్తుంది?

ఈ విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఎన్నో అంశాల్ని మనసులో ఉంచుకోవాలి.అవేంటంటే, క్రైస్తవులు నిజాయితీగా ఉండాలి. యెహోవా ప్రమాణాలకు వ్యతిరేకంగా లేనంతవరకు తమ దేశంలోని నియమాలకు వాళ్లు లోబడాలి. (మత్త. 22:21; రోమా. 13:1, 2; హెబ్రీ. 13:18) అంతేకాదు, స్థానిక ప్రజల పద్ధతుల్ని-మనోభావాల్ని గౌరవించడానికి, ‘నిన్నువలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి’ అనే సూత్రాన్ని పాటించడానికి క్రైస్తవులు కృషిచేస్తారు. (మత్త. 22:39; రోమా. 12:17, 18; 1 థెస్స. 4:10-12) కాబట్టి వేర్వేరు దేశాల్లో ఉన్న క్రైస్తవులు, ప్రభుత్వ ఉద్యోగులకు గిఫ్ట్‌లు లేదా డబ్బులు ఇవ్వాలో వద్దో నిర్ణయించుకునేటప్పుడు బహుశా ఈ సూత్రాల్నే పరిగణలోకి తీసుకుంటారు.

చాలా ప్రాంతాల్లో, ఓ వ్యక్తి తనకు న్యాయంగా రావాల్సిన వాటిని పొందడానికి ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా ఏమీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఆ ఉద్యోగులు చేసే పనికి ప్రభుత్వం జీతం ఇస్తుంది కాబట్టి వాళ్లు ప్రజల నుండి డబ్బుల్ని లేదా వేరేవాటిని అదనంగా ఆశించరు. చాలా దేశాల్లోనైతే, ప్రభుత్వ ఉద్యోగులు తమ విధుల్ని నిర్వహించడానికి ప్రజల దగ్గరనుండి డబ్బులు అడగడం లేదా తీసుకోవడం నేరం. ఒకవేళ మనం ఇచ్చే డబ్బు లేదా గిఫ్ట్‌ అధికారులు చేయాల్సిన పనిపై ఎలాంటి ప్రభావం చూపించకపోయినా, ఆ గిఫ్ట్‌ లంచమే అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో గిఫ్ట్‌లు లేదా డబ్బులు ఇవ్వడం సరైనదా కాదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. అది ఖచ్చితంగా తప్పే.

అయితే, కొన్ని దేశాల్లో గిఫ్ట్‌లు లేదా డబ్బులు తీసుకోకూడదు అనే నియమాలు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా, వాటిని అంత ఖచ్చితంగా పాటిస్తుండకపోవచ్చు. అలాంటి దేశాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, గిఫ్ట్‌లు లేదా డబ్బులు తీసుకోవడంలో తప్పులేదని అనుకుంటారు. కొన్ని దేశాల్లోని ప్రభుత్వ అధికారులైతే, తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల దగ్గరనుండి డబ్బును లేదా తమకు కావాల్సినవాటిని అడుగుతారు. అడిగినవి ఇవ్వకపోతే వాళ్లు ఏ పనీ చేయరు. ఉదాహరణకు పెళ్లిళ్లు రిజిస్టర్‌ చేయడానికి, ఆదాయపు పన్ను కట్టించుకోవడానికి, బిల్డింగ్‌ పర్మిట్‌లు ఇవ్వడానికి అధికారులు డబ్బులు అడుగుతారు. ఒకవేళ వాళ్లకు డబ్బులు ఇవ్వకపోతే పౌరులకు న్యాయంగా రావాల్సినవి కూడా రాకుండా చేయవచ్చు లేదా లేనిపోని సమస్యలు సృష్టించవచ్చు. ఒకానొక దేశంలోనైతే, అడిగినంత డబ్బు ఇచ్చేవరకు అగ్నిమాపకశాఖలో పనిచేసే ఉద్యోగులు అత్యవసర పరిస్థితుల్లో కూడా మంటలు ఆర్పరని ఓ నివేదిక చెప్తోంది.

కొన్నిసార్లు, ఓ వ్యక్తి తాను పొందిన సేవలకు కృతజ్ఞతగా గిఫ్ట్‌లు లేదా డబ్బులు ఇవ్వవచ్చు

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు డబ్బులు లేదా లంచం ఇవ్వకపోతే పనులు జరగవని కొంతమంది అనుకోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఓ క్రైస్తవుడు, తనకు న్యాయంగా రావాల్సినదాన్ని పొందడం కోసం అధికారికి ఇచ్చే డబ్బును అదనపు ఫీజుగా భావించవచ్చు. కానీ అవినీతి సర్వసాధారణమైపోయిన ప్రాంతాల్లో నివసించే క్రైస్తవుడు, తప్పొప్పుల విషయంలో దేవుని ప్రమాణాలను మర్చిపోకుండా జాగ్రత్తపడాలి. న్యాయంగా తనకు రావాల్సిన వాటికోసం డబ్బు ఇవ్వడం వేరు, తనది కాని దాన్ని పొందడం కోసం డబ్బు ఇవ్వడం వేరు. అవినీతి ఎక్కువైపోయిన ఈ లోకంలో, కొంతమంది ప్రజలు తమకు చెందనిదాన్ని పొందడానికి అధికారులకు డబ్బులు ఇస్తారు లేదా శిక్షను, ఫైన్‌ను తప్పించుకోవడానికి పోలీసులకు డబ్బులు ఇస్తారు. “లంచము” ఇచ్చి అధికారుల్ని అవినీతిపరులుగా చేయడం తప్పు, అదేవిధంగా “లంచము” తీసుకుని అవినీతిపరులుగా ఉండడం కూడా తప్పు. ఈ రెండు పనులు అన్యాయానికి దారితీస్తాయి.—నిర్గ. 23:8; ద్వితీ. 16:19; సామె. 17:23.

బైబిలు సూత్రాల ప్రకారం తమ మనస్సాక్షికి శిక్షణనిచ్చిన పరిణతిగల చాలామంది క్రైస్తవులు, అధికారులకు డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడరు. అలా ఇస్తే అవినీతిని ప్రోత్సహించినట్లే అవుతుందని వాళ్లు భావిస్తారు. అందుకే వాళ్లు అధికారులకు ఎలాంటి లంచము ఇవ్వరు.

అన్యాయంగా దేన్నైనా పొందడానికి డబ్బులు లేదా గిఫ్ట్‌లు ఇస్తే అది లంచంతో సమానం కావచ్చని పరిణతిగల క్రైస్తవులు గుర్తిస్తారు. అయితే స్థానిక పరిస్థితుల్నిబట్టి, ప్రజల మనోభావాల్నిబట్టి న్యాయంగా తమకు రావాల్సిన వాటిని పొందడానికి లేదా తమ పని అనవసరంగా ఆలస్యం అవ్వకుండా ఉండడానికి కొంత డబ్బుగానీ లేదా గిఫ్ట్‌గానీ ఇవ్వాలనుకోవచ్చు. కొన్ని ఇతర సందర్భాల్లో, ప్రభుత్వ హాస్పిటల్‌లో ఉచిత వైద్యం పొందినందుకు కొంతమంది క్రైస్తవులు కృతజ్ఞతగా డాక్టర్లకు, నర్సులకు కొన్ని గిఫ్ట్‌లు ఇస్తారు. వాళ్లు ఈ పనిని వైద్యం పొందకముందు కాదుగానీ వైద్యం పొందిన తర్వాత చేస్తారు. కాబట్టి అది, ప్రత్యేక వైద్యం కోసం డాక్టర్లకు లంచం ఇచ్చినట్లు అవ్వదు.

ప్రతీ దేశంలో ఉన్న పరిస్థితి గురించి ఈ ఆర్టికల్‌లో చర్చించడం అసాధ్యం. కాబట్టి స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మనస్సాక్షి తమను నిందించే లాంటి నిర్ణయాలు తీసుకోకుండా క్రైస్తవులు జాగ్రత్తపడాలి. (రోమా. 14:1-6) వాళ్లు చట్టవ్యతిరేకమైన పనులు చేయకూడదు. (రోమా. 13:1-7) యెహోవాకు చెడ్డపేరు తీసుకొచ్చేలా లేదా ఇతరులు అభ్యంతరపడేలా వాళ్లు ఏ పనీ చేయకూడదు. (మత్త. 6:9; 1 కొరిం. 10:32) అంతేకాదు, వాళ్లు తీసుకునే నిర్ణయాల్లో పొరుగువాళ్ల మీద ప్రేమ కనిపించాలి.—మార్కు 12:31.

బహిష్కరించబడిన ఓ వ్యక్తిని తిరిగి సంఘంలోకి చేర్చుకుంటున్నట్లు ప్రకటన చేసినప్పుడు సంఘంలోని వాళ్లు తమ సంతోషాన్ని ఎలా తెలియజేయవచ్చు?

లూకా 15వ అధ్యాయంలో, 100 గొర్రెలున్న ఓ వ్యక్తి గురించి యేసు చెప్పిన ఓ శక్తివంతమైన ఉపమానం చదువుతాం. 100 గొర్రెల్లో ఒక్కటి తప్పిపోయినప్పుడు, ఆ వ్యక్తి 99 గొర్రెల్ని అడవిలో విడిచిపెట్టి ‘తప్పిపోయినది దొరకేవరకు’ దాన్ని వెతుక్కుంటూ వెళ్లాడు. అయితే, “అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసికొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి—మీరు నాతో కూడ సంతోషించుడి; తప్పిపోయిన నా గొఱ్ఱె దొరకినదని వారితో చెప్పును” అని యేసు చెప్పాడు. ఆ తర్వాత ఆయనిలా ముగించాడు, “అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిదిమంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సుపొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును.”—లూకా 15:4-7.

యేసు ఆ మాటలు అన్న సందర్భాన్ని చూస్తే, పన్ను వసూలు చేసేవాళ్లతో, పాపులతో కలిసి భోజనం చేస్తున్నందుకు శాస్త్రులు-పరిసయ్యులు ఆయన్ను విమర్శించారు. వాళ్ల ఆలోచనను సరిదిద్దడానికే యేసు ఆ మాటలు అన్నట్లు తెలుస్తోంది. (లూకా 15:1-3)

ఓ పాపి పశ్చాత్తాపం చూపినప్పుడు పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందని యేసు నొక్కిచెప్పాడు. కాబట్టి మనమిలా అనుకోవచ్చు, ‘పరలోకంలో సంతోషం కలిగినప్పుడు, మరి పాపం చేసిన వ్యక్తి పశ్చాత్తాపం చూపించి తిరిగి సరైన మార్గంలోకి వచ్చినందుకు భూమ్మీద మనం కూడా సంతోషించవచ్చా?’—హెబ్రీ. 12:13.

బహిష్కరించబడిన వ్యక్తిని తిరిగి సంఘంలోకి చేర్చుకోవడం మనం సంతోషించడానికి ఓ మంచి కారణం. అతన్ని సంఘంలోకి తిరిగి చేర్చుకోవాలంటే, అతను యెహోవాకు యథార్థంగా ఉంటూ పశ్చాత్తాపం చూపించాలి. అతను అలా పశ్చాత్తాపం చూపించినందుకు మనం సంతోషిస్తాం కాబట్టి అతన్ని తిరిగి సంఘంలోకి చేర్చుకుంటున్నట్లు సంఘపెద్దలు ప్రకటన చేసినప్పుడు మర్యాదపూర్వకంగా చప్పట్లు కొట్టవచ్చు.

యెరూషలేములోని బేతెస్ద అనే కోనేరులోని నీళ్లు కదలడానికి కారణం ఏంటి?

బేతెస్ద అనే కోనేరులో నీళ్లు కదిలినప్పుడు, ఆ నీళ్లకు రోగాల్ని నయం చేసే శక్తి ఉంటుందని యేసు కాలంలోని కొంతమంది యెరూషలేము వాసులు నమ్మేవాళ్లు. (యోహా. 5:​1-7) అందుకే రోగాలతో బాధపడేవాళ్లందరూ అక్కడికి వచ్చేవాళ్లు.

నిజానికి, బేతెస్ద కోనేరు పక్కనే ఓ రిజర్వాయర్‌ ఉండేది. అందులోని నీళ్లను ఎప్పటికప్పుడు కోనేరులోకి విడుదలచేసేవాళ్లు దాంతో కోనేరులో ఎప్పుడూ నీళ్లు ఉండేవి. అయితే ఆ ప్రాంతాన్ని పరిశోధించినప్పుడు తెలిసిన విషయమేమిటంటే, కోనేరుకీ, రిజర్వాయర్‌కీ మధ్య ఓ డామ్‌ ఉండేది. ఆ డామ్‌కు ఉన్న గేటును ఎత్తినప్పుడు రిజర్వాయర్‌లోని నీళ్లు బేతెస్ద కోనేరులోకి ప్రవాహంలా వచ్చేవి. అలా రావడంవల్ల అందులోని నీళ్లు కదిలేవి.

యోహాను 5:​3-4 వచనాల్లో, కోనేరులోని నీళ్లను దేవదూత కదిలిస్తాడని ఉంది. కానీ ఆసక్తికరమైన విషయమేమిటంటే, నాలుగవ శతాబ్దపు కోడెక్స్‌ సైనాయ్‌టికస్‌ వంటి ఎంతో ప్రాచుర్యం పొందిన ప్రాచీన గ్రీకు రాతప్రతుల్లో ఆ మాటలు లేవు. ఏదేమైనా 38 సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న ఒకతన్ని బేతెస్ద దగ్గర యేసు బాగుచేశాడు. అతను ఆ కోనేరులోకి దిగకుండానే, అక్కడికక్కడే బాగయ్యాడు.