కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వ్యక్తిగత నిర్ణయాల్ని మీరెలా తీసుకుంటారు?

వ్యక్తిగత నిర్ణయాల్ని మీరెలా తీసుకుంటారు?

“ప్రభువుయొక్క [యెహోవా] చిత్తమేమిటో గ్రహించుకొనుడి.”ఎఫె. 5:17.

పాటలు: 11, 22

1. బైబిల్లో ఉన్న కొన్ని ఆజ్ఞలు ఏమిటి? అవి పాటించడంవల్ల మనమెలా ప్రయోజనం పొందుతాం?

 బైబిల్లో ఉన్న ఆజ్ఞల్నిబట్టి, మనమేమి చేయాలని యెహోవా కోరుకుంటున్నాడో స్పష్టంగా తెలుస్తుంది. ఉదాహరణకు విగ్రహారాధన, దొంగతనం, అతిగా త్రాగడం, అనైతిక పనులు వంటివి చేయకూడదని ఆయన మనల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. (1 కొరిం. 6:9, 10) అంతేకాదు యెహోవా కుమారుడైన యేసు కూడా తన అనుచరులకు స్పష్టమైన ఈ ఆజ్ఞను ఇచ్చాడు: ‘సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రియొక్క కుమారునియొక్క పరిశుద్ధాత్మయొక్క నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.’ (మత్త. 28:19, 20) యెహోవా, యేసు మనల్ని చేయమని చెప్పేదేదైనా అది మన మంచికే. మనల్ని, మన కుటుంబాల్ని ఎలా చూసుకోవాలో యెహోవా ఆజ్ఞలు, నియమాలు మనకు నేర్పిస్తాయి. అంతేకాదు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండడానికి కూడా అవి మనకు సహాయం చేస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా, ప్రకటించమనే ఆజ్ఞతోపాటు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ పాటించినప్పుడు ఆయన సంతోషిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు.

2, 3. (ఎ) జీవితంలోని ప్రతీ విషయానికి సంబంధించి ఖచ్చితమైన నియమాలు బైబిల్లో ఎందుకు లేవు? (బి) ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం? (ప్రారంభ చిత్రం చూడండి.)

2 అయితే మన జీవితంలోని ప్రతీ అంశానికి సంబంధించిన ఖచ్చితమైన నియమాలు బైబిల్లో లేవు. ఉదాహరణకు, మనమెలాంటి బట్టలు వేసుకోవాలి అనే విషయానికి సంబంధించి ఖచ్చితమైన నియమాలు బైబిల్లో లేవు. ఇది యెహోవా జ్ఞానాన్ని ఎలా వెల్లడిపరుస్తోంది? ప్రతీ ప్రాంతంలో వేర్వేరు పద్ధతులు, ఆచారాలు ఉంటాయి. పైగా ఫ్యాషన్‌ కూడా ఎప్పటికప్పుడు మారిపోతోంది. ఒకవేళ ఇలాంటి బట్టలే వేసుకోవాలి, ఇలానే తయారవ్వాలి అని బైబిల్లో ఖచ్చితమైన నియమాలు ఉండివుంటే అవి అన్నికాలాల్లో ఉపయోగపడేవి కావు. అంతేకాదు మనం ఎలాంటి ఉద్యోగాలు చేయాలి, ఎలాంటి వినోదాన్ని ఎంచుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలి వంటి వాటిగురించిన నియమాల చిట్టా బైబిల్లో లేదు. ఈ విషయాల్లో కుటుంబపెద్దలు అలాగే ఎవరికి వాళ్లు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ యెహోవా ఇచ్చాడు.

3 కాబట్టి మన జీవితంపై ప్రభావం చూపించే ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చినప్పుడు, వాటికి సంబంధించిన నియమమేదీ బైబిల్లో లేకపోవచ్చు. అప్పుడు మనమిలా అనుకోవచ్చు: ‘నేనెలాంటి నిర్ణయం తీసుకుంటాననే విషయాన్ని యెహోవా పట్టించుకుంటాడా? బైబిల్లో ఉన్న నియమాల్ని మీరకుండా మనం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆయన సంతోషిస్తాడా? నేను తీసుకునే నిర్ణయాలనుబట్టి ఆయన సంతోషిస్తున్నాడని నేనెలా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు?’

మన నిర్ణయాలు మనపై, ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?

4, 5. మనం తీసుకునే నిర్ణయాలు మనపై, ఇతరులపై ఎలా ప్రభావం చూపించవచ్చు?

4 తమకు నచ్చింది చేయవచ్చని కొంతమంది ప్రజలు అనుకుంటారు. కానీ మనం మాత్రం యెహోవాను సంతోషపెట్టాలనుకుంటాం. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేముందు, దానిగురించి బైబిలు ఏం చెప్తుందో తెలుసుకుని దాన్ని పాటించాలి. ఉదాహరణకు, మనం దేవున్ని సంతోషపెట్టాలంటే, రక్తం విషయంలో దేవుని అభిప్రాయమేమిటో తెలుసుకుని దాన్ని పాటించాలి. (ఆది. 9:4; అపొ. 15:28, 29) యెహోవాను సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకోవడానికి ప్రార్థన మనకు సహాయం చేస్తుంది.

5 మనం తీసుకునే ప్రాముఖ్యమైన నిర్ణయాలు మనపై ప్రభావం చూపిస్తాయి. మనం మంచి నిర్ణయం తీసుకుంటే యెహోవాకు దగ్గరౌతాం. ఒకవేళ చెడ్డ నిర్ణయం తీసుకుంటే యెహోవాతో మనకున్న స్నేహం పాడౌతుంది. మనం తీసుకునే నిర్ణయాలు ఇతరులపై కూడా ప్రభావం చూపిస్తాయి. సహోదరులను బాధపెట్టే లేదా వాళ్ల విశ్వాసాన్ని నీరుగార్చే ఏ పనినీ మనం చేయాలనుకోం. అంతేకాదు సంఘంలో ఉన్న తోటి సహోదరుల మధ్య గొడవలు పెట్టాలని కూడా అనుకోం. కాబట్టి మనం మంచి నిర్ణయాలు తీసుకోవడం ప్రాముఖ్యం.—రోమీయులు 14:19; గలతీయులు 6:7 చదవండి.

6. నిర్ణయాల్ని మనమెలా తీసుకోవాలి?

6 ఏదైనా విషయంలో స్పష్టమైన బైబిలు నియమం లేనప్పుడు మనం మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు? అలాంటి సమయాల్లో మనకు నచ్చింది చేయకుండా, మన పరిస్థితి గురించి జాగ్రత్తగా ఆలోచించి యెహోవాను సంతోషపెట్టే నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు మంచి ఫలితాలు వచ్చేలా ఆయన మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు.—కీర్తన 37:5 చదవండి.

మనమేమి చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు?

7. ఏదైనా విషయంలో స్పష్టమైన బైబిలు నియమం లేనప్పుడు, ఆ పరిస్థితిలో మనమేం చేయాలని యెహోవా కోరుకుంటాడో ఎలా తెలుసుకోవచ్చు?

7 ఎలాంటి నిర్ణయాలు యెహోవాను సంతోషపెడతాయో మనమెలా తెలుసుకోవచ్చు? ఎఫెసీయులు 5:17 ఇలా చెప్తుంది, “ప్రభువుయొక్క [యెహోవా] చిత్తమేమిటో గ్రహించుకొనుడి.” కాబట్టి ఏదైనా విషయంలో స్పష్టమైన బైబిలు నియమం లేనప్పుడు, ఆ పరిస్థితిలో మనమేం చేయాలని యెహోవా కోరుకుంటాడో ఎలా తెలుసుకోవచ్చు? ప్రార్థించడం ద్వారా, తన పవిత్రశక్తి ఇచ్చే నడిపింపును తీసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు.

8. తాను ఏం చేయాలని యెహోవా కోరుకుంటున్నాడో యేసు ఎలా గ్రహించాడు? ఓ ఉదాహరణ చెప్పండి.

8 తాను ఏం చేయాలని యెహోవా కోరుకుంటున్నాడో యేసు ఎలా గ్రహించాడో పరిశీలించండి. ఉదాహరణకు, జనసమూహాలు ఆకలిగొన్న రెండు సందర్భాల్లో, యేసు ముందు ప్రార్థించి ఆ తర్వాత అద్భుతరీతిలో వాళ్లకు ఆహారం పెట్టాడు. (మత్త. 14:17-20; 15:34-37) అయితే అరణ్యంలో యేసు ఆకలిగొన్నప్పుడు, రాళ్లను రొట్టెలుగా చేసుకోమని సాతాను శోధించాడు కానీ యేసు అలా చేయలేదు. (మత్తయి 4:2-4 చదవండి.) ఎందుకంటే యేసుకు తన తండ్రి గురించి బాగా తెలుసు. పవిత్రశక్తిని సొంత అవసరాల కోసం ఉపయోగించడం యెహోవాకు ఇష్టముండదని యేసుకు తెలుసు. అంతేకాదు తండ్రి తనకు నడిపింపును, అవసరమైన ఆహారాన్నిస్తాడని కూడా యేసుకు ఖచ్చితంగా తెలుసు.

9, 10. యెహోవాను సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది? ఓ ఉదాహరణ చెప్పండి.

9 యేసులాగే మనం కూడా నడిపింపు కోసం యెహోవాపై ఆధారపడితే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. బైబిలు ఇలా చెప్తుంది, “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచి పెట్టుము.” (సామె. 3:5-7) మనం బైబిల్ని అధ్యయనం చేస్తూ యెహోవా ఆలోచనా విధానాన్ని తెలుసుకుంటే, ఫలానా పరిస్థితిలో మనమేమి చేయాలని ఆయన కోరుకుంటాడో అర్థంచేసుకోగలుగుతాం. యెహోవా ఆలోచనా విధానం గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, ఆయన్ను సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకోవడం మనకు అంత తేలికౌతుంది. ఆ విధంగా మనం యెహోవా నడిపింపును పొందగలుగుతాం.—కీర్త. 119:11, 12.

10 దీన్ని అర్థంచేసుకోవడానికి ఓ ఉదాహరణ పరిశీలిద్దాం. ఒకామె షాపింగ్‌ చేస్తూ అందమైన చెప్పులను చూసింది, కానీ అవి చాలా ఖరీదైనవి. ఆ సమయంలో తన భర్త అక్కడ లేకపోయినప్పటికీ, అంత ఎక్కువ డబ్బు ఖర్చుపెడితే అతను ఏమనుకుంటాడో ఆమెకు తెలుసు. ఎందుకంటే, వాళ్లకు పెళ్లయి కొంతకాలం గడిచివుండవచ్చు కాబట్టి డబ్బును ఎలా ఖర్చుపెట్టాలని అతను కోరుకుంటాడో ఆమెకు తెలుసు. అదేవిధంగా యెహోవా ఆలోచనా విధానమేమిటో, ఆయన గతంలో ఏమి చేశాడో తెలుసుకుంటే వేర్వేరు పరిస్థితుల్లో మనమేం చేయాలని ఆయన కోరుకుంటున్నాడో మనకు తెలుస్తుంది.

యెహోవా ఆలోచనా విధానమేమిటో మనమెలా తెలుసుకోవచ్చు?

11. బైబిల్ని చదివి, అధ్యయనం చేస్తున్నప్పుడు మనమేమని ప్రశ్నించుకోవాలి? (“బైబిల్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఇలా ప్రశ్నించుకోండి” అనే బాక్సు చూడండి.)

11 యెహోవా ఆలోచనా విధానాన్ని మనమెలా తెలుసుకోవచ్చు? అలా తెలుసుకోవాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా క్రమంగా బైబిల్ని చదివి, అధ్యయనం చేయాలి. అలా చేస్తున్నప్పుడు, ‘యెహోవా గురించి ఇది నాకేమి నేర్పిస్తుంది? ఆయనెందుకు ఇలా చేశాడు?’ అని ప్రశ్నించుకోవచ్చు. అంతేకాదు “యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను” అని రాసిన దావీదులానే మనం కూడా, తనను మరింత ఎక్కువగా తెలుసుకోవడానికి సహాయం చేయమని యెహోవాను అడగాలి. (కీర్త. 25:4, 5) యెహోవా గురించి ఏదైనా తెలుసుకున్నప్పుడు, మీరిలా ఆలోచించవచ్చు, ‘నేను దీన్ని నా జీవితంలో ఎలా పాటించవచ్చు? ఎక్కడ పాటించవచ్చు? ఇంట్లోనా? ఉద్యోగ స్థలంలోనా? స్కూల్లోనా? పరిచర్యలోనా?’ ఎక్కడ పాటించాలో నిర్ణయించుకుంటే, దాన్ని మనం ఎలా పాటించాలని యెహోవా కోరుకుంటున్నాడో సులభంగా తెలుసుకోగలుగుతాం.

12. వివిధ విషయాల గురించి యెహోవా ఆలోచన ఏమిటో తెలుసుకోవడానికి మన ప్రచురణలు, మీటింగ్స్‌ ఎలా సహాయం చేస్తాయి?

12 యెహోవా ఆలోచనా విధానాన్ని తెలుసుకోవడానికి మరో మార్గమేమిటంటే, బైబిలు ద్వారా ఆయన సంస్థ నేర్పిస్తున్న వాటిపై మనసుపెట్టడం. ఉదాహరణకు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, యెహోవా ఆలోచనేమిటో తెలుసుకోవడానికి యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకం, ఇతర రీసర్చ్‌ ఉపకరణాలు మనకు సహాయం చేస్తాయి. అంతేకాదు మీటింగ్స్‌లో శ్రద్ధగా వినడం, కామెంట్స్‌ చెప్పడం, నేర్చుకున్న వాటిగురించి లోతుగా ఆలోచించడం ద్వారా కూడా మనం ప్రయోజనం పొందుతాం. ఇవన్నీ మనకు యెహోవాలా ఆలోచించడానికి సహాయం చేస్తాయి. దానివల్ల మనం ఆయన్ను సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకోగలుగుతాం, దీవెనలు పొందుతాం.

నిర్ణయం తీసుకునేముందు యెహోవా ఆలోచనేమిటో తెలుసుకోండి

13. యెహోవా ఆలోచనా విధానాన్ని తెలుసుకుంటే తెలివైన నిర్ణయాలు తీసుకోగలమని తెలిపే ఓ ఉదాహరణ చెప్పండి.

13 యెహోవా ఆలోచనల్ని తెలుసుకుంటే తెలివైన నిర్ణయాలు ఎలా తీసుకోగలుగుతామో అర్థంచేసుకోవడానికి ఓ ఉదాహరణ పరిశీలించండి. బహుశా మీకు పయినీరు సేవ చేయాలనే కోరిక ఉండివుండవచ్చు. అందుకోసం ఎక్కువ సమయాన్ని పరిచర్యలో గడిపేలా మీరు జీవితంలో కొన్ని మార్పులు కూడా చేసుకుని ఉండవచ్చు. కానీ తక్కువ డబ్బుతో, వస్తువులతో మీరు నిజంగా సంతోషంగా ఉండగలరో లేదోనని మాత్రం ఇంకా తేల్చుకోలేకపోతున్నారు. నిజమే, యెహోవాను సేవించాలంటే పయినీరు సేవ చేసి తీరాలని బైబిలు చెప్పట్లేదు. ప్రచారకులుగా ఉంటూ కూడా యెహోవాను నమ్మకంగా సేవించవచ్చు. కానీ రాజ్యం కోసం త్యాగాలు చేసేవాళ్లను యెహోవా దీవిస్తాడని యేసు చెప్పాడు. (లూకా 18:29, 30 చదవండి.) తనను స్తుతించడానికి మనం చేయగలిగినదంతా చేసినప్పుడు యెహోవా సంతోషిస్తాడని బైబిలు కూడా చెప్తుంది. అంతేకాదు తనను సేవిస్తూ మనం సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. (కీర్త. 119:108; 2 కొరిం. 9:7) కాబట్టి అలా చేయడానికి సహాయం చేయమని యెహోవాకు ప్రార్థిస్తూ, వాటిగురించి లోతుగా ఆలోచించాలి. అప్పుడు మనం తెలివైన నిర్ణయం తీసుకోగలుగుతాం, యెహోవా దీవెనల్ని పొందుతాం.

14. ఫలానా రకమైన బట్టల విషయంలో యెహోవా ఆలోచనేమిటో మీరెలా తెలుసుకోవచ్చు?

14 మరో ఉదాహరణ పరిశీలించండి. మీకు ఓ రకమైన బట్టలు బాగా నచ్చాయనుకోండి. కానీ వాటిని వేసుకుంటే సంఘంలో కొందరు అభ్యంతరపడతారని మీకు తెలుసు. అయితే ఫలానా రకమైన బట్టలే వేసుకోవాలి అనే నియమమేదీ బైబిల్లో లేదు. మరి ఈ విషయం గురించి యెహోవా ఆలోచనేమిటో మీరెలా తెలుసుకోవచ్చు? బైబిలు ఇలా చెప్తోంది, “స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.” (1 తిమో. 2:9, 10) ఈ సూత్రం స్త్రీలకే కాదు పురుషులకు కూడా వర్తిస్తుంది. మనలో అణకువ ఉంటే, మన బట్టల గురించి వేరేవాళ్లు ఏమనుకుంటారోనని ఆలోచిస్తాం. అంతేకాదు మనం తోటి విశ్వాసులను ప్రేమిస్తాం కాబట్టి వాళ్లను బాధపెట్టం లేదా అభ్యంతరపడేలా చేయం. (1 కొరిం. 10:23, 24; ఫిలి. 3:17) కాబట్టి బైబిలు ఏం చెప్తుందో, యెహోవా ఎలా ఆలోచిస్తాడో పరిశీలిస్తే, ఆయన్ను సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకోగలుగుతాం.

15, 16. (ఎ) మనం అనైతిక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే యెహోవా ఎలా భావిస్తాడు? (బి) వినోదం విషయంలో యెహోవా అభిప్రాయమేమిటో తెలుసుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది? (సి) ప్రాముఖ్యమైన నిర్ణయాల్ని ఎలా తీసుకోవాలి?

15 ప్రజలు చెడ్డ పనులు చేసినప్పుడు, చెడ్డవాటి గురించి ఆలోచించినప్పుడు యెహోవా చాలా బాధపడతాడని బైబిలు చెప్తోంది. (ఆదికాండము 6:5, 6 చదవండి.) దీన్నిబట్టి, మనం అనైతిక విషయాల గురించి ఆలోచిస్తూ ఊహల్లో తేలడం యెహోవాకు ఇష్టంలేదని స్పష్టమౌతుంది. నిజానికి మనం అలాంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే, వాటిని నిజంగా చేసే ప్రమాదం ఉంది. బదులుగా మనం పవిత్రమైన వాటిగురించి, మంచి విషయాల గురించి ఆలోచించాలని యెహోవా కోరుకుంటున్నాడు. వేరేదేనికన్నా యెహోవా గురించిన జ్ఞానమే “మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిది” అని శిష్యుడైన యాకోబు రాశాడు. (యాకో. 3:17) కాబట్టి అపవిత్రమైనవాటిని లేదా చెడ్డవాటిని ఊహించుకునేలా, కోరుకునేలా చేసే ఎలాంటి వినోదానికైనా మనం దూరంగా ఉండాలి. అంతేకాదు యెహోవాకు ఏది ఇష్టమో, ఏది అసహ్యమో బైబిలు సహాయంతో స్పష్టంగా తెలుసుకుంటే ఏ పుస్తకాలు, సినిమాలు లేదా ఆటలు ఎంచుకోవాలో సులభంగా నిర్ణయించుకోగలుగుతాం. అప్పుడు, ఏం చేయాలో చెప్పమని మనం వేరేవాళ్లను అడగాల్సిన పరిస్థితి రాదు.

16 మనమేదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, యెహోవాను సంతోషపెట్టే విధంగా ఎన్నో రకాలుగా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ చాలా ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, సంఘపెద్ద లేదా అనుభవం ఉన్న సహోదరుడు/సహోదరి సలహా తీసుకోవడం మంచిది. (తీతు 2:3-5; యాకో. 5:13-15) అయితే మన బదులు వాళ్లనే నిర్ణయం తీసుకోమని మాత్రం అడగకూడదు. బదులుగా దానిగురించి బైబిలు ఏం చెప్తుందో తెలుసుకుని మనమే సొంతగా నిర్ణయం తీసుకోవాలి. (హెబ్రీ. 5:14) అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు, “ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా?”—గల. 6:5.

17. యెహోవాను సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం?

17 మనం యెహోవాను సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆయనకు మరింత దగ్గరౌతాం. దానితోపాటు ఆయన ప్రేమను, ఆశీర్వాదాన్ని కూడా పొందుతాం. (యాకో. 4:8) అప్పుడు యెహోవాపై మనకున్న విశ్వాసం మరింత బలపడుతుంది. కాబట్టి మనం బైబిల్లో చదువుతున్న వాటిగురించి లోతుగా ఆలోచిస్తూ యెహోవా ఆలోచనా విధానాన్ని అర్థంచేసుకుందాం. నిజమే, మనం ఎంత తెలుసుకున్నా యెహోవా గురించి నేర్చుకోవడానికి ఏదోక కొత్త విషయం ఉంటూనే ఉంటుంది. (యోబు 26:14) కానీ ఆయన గురించి నేర్చుకోవడానికి ఇప్పుడు మనం కష్టపడితే జ్ఞానాన్ని సంపాదించుకుంటాం, తెలివైన నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతాం. (సామె. 2:1-5) మనుషుల ఆలోచనలు, ప్రణాళికలు మారతాయి కానీ యెహోవా ఎప్పటికీ మారడు. “యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును” అని కీర్తనకర్త చెప్పాడు. (కీర్త. 33:11) అవును, మనం యెహోవాలా ఆలోచించడం నేర్చుకుని, ఆయన్ను సంతోషపెట్టేవాటిని చేసినప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం.