కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నువ్వు వీటికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?”

“నువ్వు వీటికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?”

“యోహాను కొడుకువైన సీమోనూ, నువ్వు వీటికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?”యోహా. 21:15.

పాటలు: 32, 45

1, 2. పేతురు చేపలు పట్టడానికి రాత్రంతా ప్రయత్నించిన తర్వాత ఏమి జరిగింది?

 ఏడుగురు శిష్యులు రాత్రంతా గలిలయ సముద్రములో చేపలు పట్టడానికి ప్రయత్నించారు. కానీ వాళ్లకు ఒక్క చేప కూడా దొరకలేదు. ఇంతలో తెల్లారిపోయింది, పునరుత్థానమైన యేసు సముద్రం ఒడ్డున నిలబడి వాళ్లను చూస్తున్నాడు. “అప్పుడు యేసు వాళ్లతో, ‘పడవ కుడిపక్క వల వేయండి, మీకు కొన్ని చేపలు దొరుకుతాయి’ అని వాళ్లకు చెప్పాడు. దాంతో వాళ్లు వల వేశారు, అయితే చాలా చేపలు పడడంతో వాళ్లు వలను లాగలేకపోయారు.”—యోహా. 21:1-6.

2 ఆ ఉదయం శిష్యులు తినడానికి చేపలను, రొట్టెలను యేసు ఇచ్చాడు. దాని తర్వాత ఆయన సీమోను పేతురు వైపు తిరిగి, “యోహాను కొడుకువైన సీమోనూ, నువ్వు వీటికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. పేతురుకు చేపలు పట్టడమంటే చాలా ఇష్టమని యేసుకు తెలుసు. అయితే పేతురు చేపల వ్యాపారానికన్నా తనను, తన బోధల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడో లేదో తెలుసుకోవడానికి యేసు అలా అడిగివుంటాడు. పేతురు యేసుకు ఇలా జవాబిచ్చాడు, “ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు.” (యోహా. 21:15) ఆ మాటలు నిజమని పేతురు తన జీవన విధానం ద్వారా చూపించాడు. అప్పటినుండి, ప్రకటనా పనిలో బిజీగా ఉండడం ద్వారా తనకు క్రీస్తు మీద ప్రేమ ఉందని చూపించాడు. అంతేకాదు క్రైస్తవ సంఘంలో ఒక ప్రాముఖ్యమైన సభ్యుడు కూడా అయ్యాడు.

3. క్రైస్తవులు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి?

3 యేసు పేతురును అడిగిన ప్రశ్న నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? యేసుపై మనకున్న ప్రేమ తగ్గిపోకుండా జాగ్రత్తపడాలి. మనం ఈ లోకంలో ఎన్నో ఒత్తిళ్లను, ఆందోళనలను, సవాళ్లను ఎదుర్కొంటామని యేసుకు తెలుసు. ఆయన విత్తువాని ఉపమానాన్ని చెప్తూ, కొంతమంది “రాజ్యం గురించిన వాక్యం” అంగీకరిస్తారని చెప్పాడు. అంతేకాదు వాళ్లు మొదట్లో ఎంతో ఆసక్తి చూపిస్తారు కానీ కొంతకాలానికి వాళ్లలో ఆసక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే, “ఈ వ్యవస్థలో ఉన్న ఆందోళనలు, సిరిసంపదలకున్న మోసకరమైన శక్తి వాక్యాన్ని ఎదగనివ్వవు” అని యేసు చెప్పాడు. (మత్త. 13:19-22; మార్కు 4:19) ఒకవేళ మనం జాగ్రత్తగా లేకపోతే, రోజూ ఎదురయ్యే ఆందోళనలు యెహోవా సేవపై మన ఆసక్తిని తగ్గించేస్తాయి. అందుకే యేసు తన శిష్యులను ఇలా హెచ్చరించాడు, “మీ విషయంలో శ్రద్ధ తీసుకోండి. అతిగా తినడం వల్ల, అతిగా తాగడం వల్ల, జీవిత చింతల వల్ల మీ హృదయాలు ఎన్నడూ ఉక్కిరిబిక్కిరి కాకుండా చూసుకోండి.”—లూకా 21:34.

4. యేసు మీద మనకున్న ప్రేమ ఎంత బలంగా ఉందో ఎలా తెలుస్తుంది? (ప్రారంభ చిత్రం చూడండి.)

4 పేతురులాగే, మనం కూడా ప్రకటనా పనికి మొదటిస్థానం ఇవ్వడం ద్వారా యేసును ప్రేమిస్తున్నామని చూపిస్తాం. ప్రకటనా పనికే మొదటిస్థానం ఇస్తూ ఉండడానికి మనకేది సహాయం చేస్తుంది? మనం ఈ ప్రశ్నలు వేసుకోవచ్చు: ‘నేను అన్నిటికన్నా ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నాను? యెహోవా సేవలో ఆనందాన్ని పొందుతున్నానా లేదా వేరే విషయాల్లోనా?’ వీటికి జవాబులు తెలుసుకోవాలంటే యేసు మీద మనకున్న ప్రేమను తగ్గించగల మూడు విషయాలను పరిశీలిద్దాం. అవేమిటంటే: ఉద్యోగం, ఉల్లాస కార్యక్రమాలు, వస్తుసంపదలు.

ఉద్యోగం

5. కుటుంబ పెద్దలకు యెహోవా ఏ బాధ్యత ఇచ్చాడు?

5 పేతురు కేవలం సరదా కోసం చేపలు పట్టేవాడు కాదు, అది అతని జీవనాధారం. మన కాలంలో కూడా కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యతను యెహోవా కుటుంబ పెద్దలకు ఇచ్చాడు. (1 తిమో. 5:8) దానికోసం వాళ్లు కష్టపడి పనిచేయాలి. అయితే, ఈ చివరి రోజుల్లో ఉద్యోగాల వల్ల ఎంతో ఆందోళన కలుగుతోంది.

6. ఉద్యోగాల్లో ఎందుకు ఒత్తిడి పెరుగుతోంది?

6 నిరుద్యోగులైతే చాలామంది ఉన్నారుగానీ ఉద్యోగాలు మాత్రం కొన్నే ఉన్నాయి. అందుకే ప్రజలు వాటికోసం పోటీపడుతున్నారు. చాలామంది తక్కువ జీతాలకు ఎక్కువ గంటలు పని చేయాల్సివస్తోంది. ఎప్పుడూ లేనంతగా వ్యాపారస్థులు తక్కువమంది పనివాళ్లతో ఎక్కువ వస్తువుల్ని ఉత్పత్తి చేయడానికి చూస్తున్నారు. దానివల్ల ఉద్యోగులకు ఒత్తిడి, అలసట ఎక్కువౌతున్నాయి, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. యజమాని చెప్పిందల్లా చేయకపోతే ఉద్యోగం పోతుందేమోననే ఆందోళన చాలామందిలో ఉంది.

7, 8. (ఎ) మనం అందరికన్నా ఎక్కువగా ఎవరికి నమ్మకంగా ఉంటాం? (బి) థాయ్‌లాండ్‌లోని ఒక సహోదరుడు ఆధ్యాత్మిక విషయాలకు ఎక్కువ సమయం ఇవ్వడానికి ఏమి చేశాడు?

7 క్రైస్తవులముగా మనం ఉద్యోగ యజమానికి కాదుగానీ యెహోవాకే నమ్మకంగా ఉండాలనుకుంటాం. (లూకా 10:27) మనం కేవలం కనీస అవసరాలకు, పరిచర్యకు అయ్యే ఖర్చుల కోసం ఉద్యోగం చేస్తాం. ఒకవేళ మనం జాగ్రత్తగా లేకపోతే, ఉద్యోగ బాధ్యతల్లో మునిగిపోయి దేవున్ని సరిగ్గా ఆరాధించ లేకపోవచ్చు. థాయ్‌లాండ్‌లోని ఒక సహోదరుని అనుభవాన్ని పరిశీలించండి. అతనిలా చెప్పాడు, “నేను కంప్యూటర్లను రిపేరు చేసేవాణ్ణి. ఆ పని చాలా ఆసక్తిగా ఉండేది. కానీ ఎక్కువ గంటలు పనిచేయాల్సి వచ్చేది. దానివల్ల, ఆధ్యాత్మిక విషయాలకు సమయం ఉండేది కాదు. కాబట్టి దేవుని రాజ్య సంబంధ విషయాలకు మొదటిస్థానం ఇవ్వాలంటే ముందు నా పనిలో మార్పులు చేసుకోవాలని నేను గుర్తించాను.” మరి ఆ సహోదరుడు ఏమి చేశాడు?

8 ఆ సహోదరుడు ఇలా వివరించాడు, “దాదాపు ఒక సంవత్సరంపాటు బాగా ఆలోచించాక, వీధుల్లో తిరుగుతూ ఐస్‌క్రీమ్‌ అమ్మాలని నిర్ణయించుకున్నాను. మొదట్లో ఆర్థిక ఇబ్బందులవల్ల నిరుత్సాహపడ్డాను. అంతకుముందు నాతోపాటు పనిచేసినవాళ్లు ఎదురుపడినప్పుడు, చక్కగా ఏ.సీ.లో కూర్చొని కంప్యూటర్లతో చేసే అంతమంచి పని వదిలేసి ఇలా ఐస్‌క్రీమ్‌ అమ్మే పని ఎందుకు చేస్తున్నావ్‌ అని నన్ను ఎగతాళి చేసేవాళ్లు. వాళ్ల ఎగతాళిని తట్టుకొని, ఆధ్యాత్మిక విషయాలకు ఎక్కువ సమయం ఇవ్వాలనే నా లక్ష్యాన్ని చేరుకునేందుకు సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించాను. కొంతకాలానికే పరిస్థితి మెరుగైంది. నా కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు ఐస్‌క్రీమ్‌ తయారుచేసే నైపుణ్యం సంపాదించుకున్నాను. ఏరోజు తయారుచేసిన ఐస్‌క్రీమ్‌ ఆరోజే అమ్ముడుబోయేది. నిజానికి, అంతకుముందు చేసిన కంప్యూటర్ల పనితో పోలిస్తే ఈ పని వల్లే ఎక్కువ సంపాదించగలిగాను. దీంట్లో అంతగా ఒత్తిడి, ఆందోళన కూడా లేవు అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా యెహోవాకు మరింత దగ్గరైనట్టు అనిపించింది.”—మత్తయి 5:3, 6 చదవండి.

9. మన జీవితంలో ఉద్యోగానికి మొదటిస్థానం ఇవ్వకుండా ఉండడానికి ఏది సహాయం చేస్తుంది?

9 కష్టపడి పనిచేసేవాళ్లను యెహోవా మెచ్చుకుంటాడు. కష్టపడి పనిచేయడంవల్ల ఎప్పుడూ మంచి ఫలితాలే వస్తాయి. (సామె. 12:14) అలాగని యెహోవా సేవకన్నా ఉద్యోగానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వకూడదు. మన కనీస అవసరాల గురించి మాట్లాడుతూ యేసు ఇలా చెప్పాడు, “మీరు ఆయన రాజ్యానికి, నీతికి మొదటిస్థానం ఇస్తూ ఉండండి; అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు ఇస్తాడు.” (మత్త. 6:33) మనం ఒకవేళ ఉద్యోగానికి మొదటిస్థానం ఇస్తున్నామేమో ఎలా తెలుసుకోవచ్చు? మనమిలా ప్రశ్నించుకోవచ్చు: ‘నాకు దేవుని సేవ కన్నా నా ఉద్యోగమే ఆసక్తిగా, ఉత్సాహంగా అనిపిస్తోందా?’ ఈ ప్రశ్న గురించి ఆలోచించినప్పుడు మనం నిజంగా దేన్ని ప్రేమిస్తున్నామో స్పష్టంగా తెలుస్తుంది.

10. యేసు ఏ ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పించాడు?

10 దేనికి మొదటిస్థానం ఇవ్వాలో యేసు మనకు నేర్పించాడు. యేసు ఒకసారి మరియ, మార్త అనే ఇద్దరు అక్కచెల్లెళ్ల ఇంటికి వెళ్లాడు. వెంటనే, మార్త ఆయన కోసం భోజనం తయారుచేయడం మొదలుపెట్టింది. కానీ మరియ యేసు దగ్గరే కూర్చొని ఆయన చెప్పేవి వింటోంది. మరియ తనకు సహాయం చేయట్లేదని మార్త యేసుకు ఫిర్యాదు చేసింది. అప్పుడు ఆయన మార్తతో ఇలా అన్నాడు, “మరియ సరైనదాన్ని ఎంచుకుంది, అది ఆమె నుండి తీసివేయబడదు.” (లూకా 10:38-42) ఇక్కడ యేసు ఒక ప్రాముఖ్యమైన పాఠం నేర్పించాడు. మన సొంత అవసరాలవల్ల మనసు పక్కకు మళ్లకూడదంటే, క్రీస్తు మీదున్న మన ప్రేమను నిరూపించుకోవాలంటే, “సరైనదాన్ని” ఎంచుకోవాలి. అంటే మన జీవితంలో యెహోవాతో ఉన్న స్నేహానికే అన్నిటికన్నా ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వాలని అర్థం.

ఉల్లాస కార్యక్రమాలు, వినోదం

11. విశ్రాంతి తీసుకోవడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

11 మనం ఎన్నో పనులతో బిజీగా ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు విశ్రాంతి, సేదదీర్పు అవసరం. బైబిల్లో ఇలా ఉంది, “అన్నపానములు పుచ్చుకొనుటకంటెను, తన కష్టార్జితముచేత సుఖపడుటకంటెను నరునికి మేలుకరమైనదేదియు లేదు.” (ప్రసం. 2:24) తన శిష్యులకు విశ్రాంతి అవసరమని యేసుకు తెలుసు. ఉదాహరణకు, ఒక సందర్భంలో ప్రకటనాపని చేసి బాగా అలసిపోయిన తన శిష్యులతో యేసు, “మనం ఏకాంత ప్రదేశానికి వెళ్దాం పదండి, కాస్త విశ్రాంతి తీసుకుందాం” అని అన్నాడు.—మార్కు 6:31, 32.

12. ఉల్లాస కార్యక్రమాలు, వినోదం విషయంలో మనమెందుకు జాగ్రత్తగా ఉండాలి? ఒక ఉదాహరణ చెప్పండి.

12 మనం విశ్రాంతి తీసుకోవడానికి, సేదదీరడానికి ఉల్లాస కార్యక్రమాలు, వినోదం సహాయం చేస్తాయి. కానీ సరదాగా సమయం గడపడమే మన జీవితంలో అన్నిటికన్నా ప్రాముఖ్యం అవ్వకూడదు. మొదటి శతాబ్దంలోని చాలామంది ఇలా అనుకునేవాళ్లు, “ఎలాగూ రేపు చచ్చిపోతాం కదా, రండి తిందాం, తాగుదాం.” (1 కొరిం. 15:32) మనకాలంలో కూడా చాలామంది అలానే ఆలోచిస్తున్నారు. ఉదాహరణకు, పశ్చిమ యూరప్‌లోని ఒక యువకుడు యెహోవాసాక్షుల కూటాలకు వెళ్లడం మొదలుపెట్టాడు. కానీ వినోదం మీద ఉన్న ఇష్టాన్నిబట్టి కొంతకాలానికి యెహోవాసాక్షులతో సహవసించడం మానేశాడు. వినోదానికే ఎక్కువ సమయం ఇవ్వడం వల్ల అతనికి చాలా సమస్యలు ఎదురయ్యాయని తర్వాత తెలుసుకున్నాడు. అతను మళ్లీ బైబిలు స్టడీ తీసుకోవడం ప్రారంభించాడు. కొంతకాలానికి అతను ప్రీచింగ్‌ చేయడం మొదలుపెట్టి, బాప్తిస్మం తీసుకున్నాడు. ఆ తర్వాత అతనిలా చెప్పాడు, “ఈ లోకంలోని వినోదం కన్నా యెహోవా సేవలోనే ఎంతో సంతోషం ఉంటుందని ఇప్పుడు నేను గుర్తించాను. కానీ ఇంతకాలం చాలా సమయాన్ని వృథా చేసుకున్నందుకు బాధగా ఉంది.”

13. (ఎ) ఉల్లాస కార్యక్రమాలకు, వినోదానికి ఎక్కువ సమయం వెచ్చించడం ఎందుకు మంచిది కాదో ఒక ఉదాహరణ చెప్పండి. (బి) ఉల్లాస కార్యక్రమాలకు, వినోదానికి ఏ స్థానం ఇస్తున్నామో ఎలా తెలుసుకోవచ్చు?

13 ఉల్లాస కార్యక్రమాలు మనకు సేదదీర్పును, నూతనోత్తేజాన్ని ఇవ్వాలి. మరి ఉల్లాస కార్యక్రమాల కోసం మనం ఎంత సమయం వెచ్చించాలి? దీనికి జవాబు తెలుసుకోవాలంటే మనం ఇలా ఆలోచించవచ్చు: చాలామందికి కేకులు, స్వీట్లు అంటే ఇష్టం. కానీ మనం ఎప్పుడూ వాటినే తింటే మన ఆరోగ్యం పాడౌతుందని మనకు తెలుసు. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. అదేవిధంగా ఉల్లాస కార్యక్రమాలకు, వినోదానికే ఎక్కువ సమయం వెచ్చిస్తే యెహోవాతో మన స్నేహం దెబ్బతింటుంది. ఉల్లాస కార్యక్రమాలకు సరైన స్థానం ఇస్తున్నామో లేదో మనం ఎలా తెలుసుకోవచ్చు? మనం ఏమి చేయవచ్చంటే ఒక పేపరు మీద మొదటిగా, ఒక వారంలో యెహోవా సేవకు అంటే మీటింగ్స్‌, ప్రీచింగ్‌, వ్యక్తిగత బైబిలు అధ్యయనం, కుటుంబ ఆరాధన వంటివాటికి ఎన్ని గంటలు వెచ్చించామో రాసుకోవచ్చు. తర్వాత అదే వారంలో ఆటలు, టీవీ లేదా వీడియో గేమ్‌లు వంటి ఉల్లాస కార్యక్రమాలకు ఎన్ని గంటలు వెచ్చించామో రాసుకోవచ్చు. ఆ రెండింటిని పోల్చి చూసినప్పుడు మీకేమనిపిస్తోంది? ఏమైనా మార్పు చేసుకోవాలనిపిస్తోందా?—ఎఫెసీయులు 5:15, 16 చదవండి.

14. మంచి ఉల్లాస కార్యక్రమాల్ని, వినోదాన్ని ఎంపిక చేసుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది?

14 ఉల్లాస కార్యక్రమాలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను యెహోవా మనకు ఇచ్చాడు. కుటుంబ పెద్దలు కూడా తమ కుటుంబానికి సరిపోయే వినోదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. యెహోవా తన ఆలోచనల్ని తెలియజేసే సూత్రాల్ని బైబిల్లో ఇచ్చాడు. ఈ సూత్రాల సహాయంతో మనం మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. a మంచి ఉల్లాస కార్యక్రమాలు “దేవుడిచ్చు బహుమానమే”. (ప్రసం. 3:12, 13) నిజమే, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వినోదం నచ్చుతుంది. (గల. 6:4, 5) కాబట్టి మనం ఎలాంటి వినోదాన్ని ఎంచుకున్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యేసు ఇలా చెప్పాడు, “నీ సంపద ఎక్కడ ఉంటే నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది.” (మత్త. 6:21) దేవుని రాజ్యం కన్నా మనకు ఇంకేదీ ప్రాముఖ్యం కాదని మన ఆలోచనలు, మాటలు, ప్రవర్తన ద్వారా చూపించాలి. అలా చూపించేలా మన రాజైన యేసు మీదున్న ప్రేమే మనల్ని పురికొల్పుతుంది.—ఫిలి. 1:9, 10.

వస్తుసంపదలు

15, 16. (ఎ) వస్తుసంపదలపై మోజు ఎలా మనకు ఒక ఉరిలా తయారవ్వవచ్చు? (బి) వస్తుసంపదల గురించి యేసు ఏ తెలివైన సలహా ఇచ్చాడు?

15 ఈ రోజుల్లో చాలామంది కొత్త ఫ్యాషన్‌ బట్టలు, కొత్త ఫోన్‌లు, కంప్యూటర్లు వంటి ఇతర వస్తువులు తమ దగ్గర ఉండాలనుకుంటారు. వస్తువులు, డబ్బే అన్నిటికన్నా ప్రాముఖ్యంగా భావించే జీవిత విధానాన్ని వాళ్లు కోరుకుంటారు. ఒక క్రైస్తవునిగా మీకు ఏది అన్నిటికన్నా ప్రాముఖ్యం? ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి, ‘మీటింగ్స్‌కి సిద్ధపడడం కన్నా కొత్త కార్లు లేదా ఫ్యాషన్‌ల గురించి ఆలోచించడానికే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నానా? ప్రార్థన చేసుకోవడానికి, బైబిలు చదవడానికి సమయం లేనంత బిజీగా ఉంటున్నానా?’ ఒకవేళ మనం జాగ్రత్తగా లేకపోతే, యేసును కాకుండా వస్తుసంపదలనే ఎక్కువ ప్రేమించే అవకాశం ఉంది. యేసు చెప్పిన ఈ మాటల గురించి మనం ఆలోచించాలి, “ఏ రకమైన అత్యాశకూ చోటివ్వకుండా జాగ్రత్తపడండి.” (లూకా 12:15) యేసు ఎందుకలా అన్నాడు?

16 యేసు ఇలా అన్నాడు, “ఏ వ్యక్తీ ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు . . . మీరు ఒకే సమయంలో దేవునికీ డబ్బుకూ దాసులుగా ఉండలేరు.” అవును, ఒకవైపు వస్తుసంపదలకు ప్రాముఖ్యతను ఇస్తూ యెహోవా కోరేవన్నీ చేయడం సాధ్యం కాదు. యేసు ఇలా వివరించాడు, “అతను ఒక యజమానిని ద్వేషించి ఇంకో యజమానిని ప్రేమిస్తాడు, లేదా ఒక యజమానికి నమ్మకంగా ఉండి ఇంకో యజమానిని చిన్నచూపు చూస్తాడు.” (మత్త. 6:24) మనం అపరిపూర్ణులం కాబట్టి, వస్తుసంపదలపై మోజుతోపాటు ‘మన శరీరం కోరుకున్నవాటితో’ పోరాడుతూనే ఉండాలి.—ఎఫె. 2:3.

17. (ఎ) కొంతమంది వస్తుసంపదలను సమకూర్చుకోవడమే లోకంగా ఎందుకు బ్రతుకుతారు? (బి) వస్తుసంపదల మోజుతో పోరాడడానికి మనకేది సహాయం చేస్తుంది?

17 చాలామంది తమ సొంత కోరికలకు, సంతోషాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారంటే, వస్తుసంపదలను సమకూర్చుకోవడమే లోకంగా బ్రతుకుతారు. (1 కొరింథీయులు 2:14 చదవండి.) వాళ్లు సరిగ్గా ఆలోచించట్లేదు కాబట్టి, తప్పొప్పులను తెలుసుకోవడం వాళ్లకు కష్టంగా ఉండవచ్చు. (హెబ్రీ. 5:11-14) వస్తుసంపదల్ని సమకూర్చుకోవాలనే కోరిక వాళ్లలో అంతకంతకూ బలపడుతుంది. అంతేకాదు, వాళ్లు సంపాదించే కొద్దీ ఇంకా సంపాదించాలని కోరుకుంటారు. (ప్రసం. 5:10) కానీ అలాంటి ఆలోచనలకు మనం దూరంగా ఉండాలంటే ప్రతిరోజు బైబిలు చదవాలి. అప్పుడు వస్తుసంపదలపై మోజుతో పోరాడేందుకు కావాల్సిన బలాన్ని పొందుతాం. (1 పేతు. 2:2) యెహోవా జ్ఞానం గురించి యేసు ధ్యానించాడు, అందుకే ఆయన సాతాను శోధనను తిప్పికొట్టగలిగాడు. మనం కూడా వస్తుసంపదల మోజులో పడకూడదంటే యెహోవా ఇస్తున్న నిర్దేశాలను పాటించాలి. (మత్త. 4:8-10) అలా పాటిస్తే, మనం వస్తుసంపదలకన్నా యేసునే ఎక్కువగా ప్రేమిస్తున్నామని చూపిస్తాం.

మీ జీవితంలో అన్నిటికన్నా దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు? (18వ పేరా చూడండి)

18. మీరు ఏమి చేయాలని నిర్ణయించుకున్నారు?

18 యేసు పేతురుని, “నువ్వు వీటికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని అడగడం ద్వారా పేతురు యెహోవా సేవ చేయడం మీదే మనసుపెట్టాలని యేసు చెప్తున్నాడు. ఆసక్తికరంగా పేతురు అనే పేరుకు ‘బండ’ అని అర్థం. పేతురుకున్న మంచి లక్షణాలను ఒక బండతో పోల్చవచ్చు. (అపొ. 4:5-20) నేడు, యేసుపై మనకున్న ప్రేమ కూడా చెక్కుచెదరకుండా బండలా స్థిరంగా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి ఉద్యోగానికి, ఉల్లాస కార్యక్రమాలకు లేదా వినోదానికి, వస్తుసంపదలకు మన జీవితంలో ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వకుండా చూసుకోవాలి. అప్పుడు పేతురులాగే మనం కూడా, “ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు” అని చెప్పగలుగుతాం.

a 2011, అక్టోబరు 15 కావలికోట సంచికలోని 9-12 పేజీల్లో ఉన్న “మీరు ఉల్లాసం కోసం చేసేవి ప్రయోజనకరంగా ఉంటున్నాయా?” అనే ఆర్టికల్‌లో 6-15 పేరాలు చూడండి.