‘సంతోషంతో యెహోవాను సేవించేలా’ పరదేశులకు సహాయం చేయడం
“యెహోవా పరదేశులను కాపాడువాడు.”—కీర్త. 146:9.
1, 2. (ఎ) మన సహోదరసహోదరీల్లో కొంతమంది ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు? (బి) మనకెలాంటి ప్రశ్నలు వస్తాయి?
“బురుండిలో రెండు గుంపుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు మా కుటుంబమంతా ఒక సమావేశంలో ఉన్నాం” అని సహోదరుడు లీజె చెప్పాడు. అతనింకా ఇలా చెప్పాడు, “కాల్పులు జరగడం, ప్రజలు పరుగులు తీయడం మేము చూశాం. మా అమ్మానాన్న అలాగే 11 మంది తోబుట్టువులం ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకొని మా దగ్గరున్న కొన్ని వస్తువులతో పారిపోయాం. అలా 1,600 కన్నా ఎక్కువ కి.మీ. ప్రయాణించాక మాలో కొంతమందిమి మలావీలోని శరణార్థుల శిబిరానికి చేరుకున్నాం. మిగతావాళ్లం వేర్వేరు చోట్లకు చెదిరిపోయాం.”
2 యుద్ధం లేదా హింస కారణంగా ప్రపంచవ్యాప్తంగా 650 లక్షల కన్నా ఎక్కువమంది శరణార్థులుగా వెళ్లిపోతున్నారు. వాళ్ల సంఖ్య ముందెప్పుడూ లేనంత ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. a ఆ శరణార్థుల్లో కొన్ని వేలమంది యెహోవాసాక్షులు ఉన్నారు. చాలామంది తమ ప్రియమైనవాళ్లను, తమకున్న సర్వస్వాన్ని కోల్పోయారు. వాళ్లింకా ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? వాటిని ఎదుర్కొంటున్న మన సహోదరసహోదరీలు యెహోవాను సంతోషంగా సేవించడానికి మనమెలా సహాయం చేయగలం? (కీర్త. 100:2) అంతేకాదు, యెహోవా గురించి ఇంకా తెలియని శరణార్థులకు ప్రీచింగ్ చేయడానికి ఉన్న ఉత్తమమైన మార్గం ఏమిటి?
శరణార్థుల జీవితం
3. యేసు, ఆయన శిష్యుల్లో చాలామంది ఎలా శరణార్థులు అయ్యారు?
3 హేరోదు రాజు యేసును చంపడానికి ప్రయత్నిస్తున్నాడని యెహోవా దూత యోసేపును హెచ్చరించాడు. అప్పుడు యోసేపు మరియలు యేసును తీసుకుని ఐగుప్తు దేశానికి శరణార్థులుగా వెళ్లిపోయారు. హేరోదు చనిపోయేంతవరకు వాళ్లు ఐగుప్తులోనే ఉన్నారు. (మత్త. 2:13, 14, 19-21) అదే విధంగా దశాబ్దాల తర్వాత, హింస కారణంగా యేసు శిష్యులు “యూదయ, సమరయ అంతటా చెదిరిపోయారు.” (అపొ. 8:1) వాళ్లలో చాలామందికి ఇల్లు వదిలిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని యేసుకు తెలుసు. అందుకే ఆయనిలా చెప్పాడు, “ఒక నగరంలో హింసించినప్పుడు, ఇంకో నగరానికి పారిపోండి.” (మత్త. 10:23) కారణం ఏదైనాసరే ఇల్లు వదిలి వెళ్లిపోవడం అంత సులభం కాదు.
4, 5. (ఎ) ఇల్లు వదిలి వెళ్లిపోతున్నప్పుడు (బి) శరణార్థ శిబిరాల్లో ఉంటున్నప్పుడు శరణార్థులు ఎలాంటి ప్రమాదాల్ని ఎదుర్కొంటారు?
4 ఇల్లు వదిలి వెళ్లిపోతున్నప్పుడు లేదా శరణార్థ శిబిరాల్లో ఉంటున్నప్పుడు శరణార్థులకు వేర్వేరు ప్రమాదాలు ఎదురౌతాయి. లీజె తమ్ముడైన గ్యాడ్ ఇలా చెప్పాడు, “వందల శవాలను దాటుతూ మేము కొన్ని వారాలు నడిచాం. నాకప్పుడు 12 ఏళ్లు. నా పాదాలు ఎంతగా వాచిపోయాయంటే నన్ను వదిలేసి వెళ్లిపోండని మావాళ్లతో అన్నాను. నన్ను తిరుగుబాటుదారుల చేతుల్లో వదిలిపెట్టడం ఇష్టంలేని మా నాన్న, నన్ను ఎత్తుకొని నడిచాడు. యెహోవా మీద నమ్మకం ఉంచి ప్రార్థిస్తూ, కొన్నిసార్లు కేవలం దారివెంబడి పండే మామిడి కాయలనే తింటూ రోజులు గడిపాం.”—ఫిలి. 4:12, 13.
5 లీజె కుటుంబ సభ్యుల్లో చాలామంది ఎన్నో సంవత్సరాలు ఐక్యరాజ్య సమితిలోని శరణార్థ శిబిరాల్లోనే ఉన్నారు. కానీ అక్కడ కొన్ని ప్రమాదాలు ఎదురయ్యాయి. ఇప్పుడు ప్రాంతీయ పర్యవేక్షకుడిగా సేవ చేస్తున్న లీజె ఇలా అంటున్నాడు, “చాలామందికి ఉద్యోగాలు ఉండేవి కావు. వాళ్లు ఒకరిమీద ఒకరు చాడీలు చెప్పుకునేవాళ్లు, తాగేవాళ్లు, పేకాట ఆడేవాళ్లు, దొంగతనం చేసేవాళ్లు, అనైతికంగా జీవించేవాళ్లు.” వాళ్ల ప్రభావం సాక్షుల మీద పడకూడదంటే సహోదరసహోదరీలు సంఘ పనుల్లో బిజీగా ఉండాలి. (హెబ్రీ. 6:11, 12; 10:24, 25) వాళ్లు సత్యంలో స్థిరంగా ఉండడానికి తమ సమయాన్ని తెలివిగా ఉపయోగించారు. చాలామంది పయినీరు సేవ మొదలుపెట్టారు. ఇశ్రాయేలీయులు కొంతకాలానికి అరణ్యం నుండి బయటికి వచ్చినట్టే, తాము కూడా శరణార్థ శిబిరాల నుండి బయటపడతామని ఒకరికొకరు గుర్తుచేసుకున్నారు. దానివల్ల వాళ్లు సానుకూల దృక్పథంతో ఉండగలిగారు.—2 కొరిం. 4:18.
శరణార్థుల పట్ల ప్రేమ చూపించండి
6, 7. (ఎ) “దేవుని మీద ప్రేమ” ఉంటే మన సహోదరులను ఎలా చూస్తాం? (బి) ఉదాహరణ చెప్పండి.
6 “దేవుని మీద ప్రేమ” ఉంటే మన సహోదరుల్ని ప్రేమిస్తాం. ముఖ్యంగా వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తాం. (1 యోహాను 3:17, 18 చదవండి.) ఉదాహరణకు, కరువువల్ల యూదయలోని క్రైస్తవులకు ఆహారం దొరకనప్పుడు, సంఘ సభ్యులు వాళ్లకు సహాయం చేశారు. (అపొ. 11:28, 29) ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకోవాలని కూడా అపొస్తలుడైన పౌలు, పేతురు క్రైస్తవులను ప్రోత్సహించారు. (రోమా. 12:13; 1 పేతు. 4:9) వేరే ప్రాంతాల నుండి వచ్చే సహోదరులకు ఆతిథ్యం ఇవ్వాలని క్రైస్తవులు ప్రోత్సహించబడుతున్నారు. అలాంటప్పుడు, అపాయంలో ఉన్న మన సహోదరులపట్ల లేదా తమ నమ్మకాల్నిబట్టి హింసను ఎదుర్కొంటున్న సహోదరులపట్ల ఇంకెంత దయ చూపించాలో కదా.—సామెతలు 3:27 చదవండి. b
7 తూర్పు యుక్రెయిన్‌లో జరిగిన యుద్ధం, హింసవల్ల వేలాది యెహోవాసాక్షులు తమ ఇళ్లను వదిలిపెట్టి వెళ్లాల్సివచ్చింది. విచారకరంగా వాళ్లలో కొంతమంది చంపబడ్డారు. కానీ అలా వెళ్లిపోయిన చాలామంది సహోదరులను యుక్రెయిన్, రష్యాల్లోని వేరే ప్రాంతాల్లో ఉన్న సహోదరసహోదరీలు తమ ఇళ్లకు ఆహ్వానించారు. ఆ రెండు దేశాల్లోని సహోదరులు రాజకీయ విషయాల్లో తలదూర్చకుండా, ‘లోకానికి చెందినవాళ్లలా’ ఉండకుండా, ఉత్సాహంగా “మంచివార్తను ప్రకటిస్తూ ఉన్నారు.”—యోహా. 15:19; అపొ. 8:4.
విశ్వాసాన్ని బలపర్చుకోవడంలో శరణార్థులకు సహాయం చేయండి
8, 9. (ఎ) శరణార్థులకు కొత్త దేశంలో ఎలాంటి సవాళ్లు ఎదురుకావచ్చు? (బి) మనం వాళ్లకు ఓపిగ్గా ఎందుకు సహాయం చేయాలి?
8 కొంతమంది శరణార్థులు తమ దేశంలోనే వేరే ప్రాంతంలో ఉండాల్సిరావచ్చు. కానీ చాలామంది కొత్త దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. నిజమే ప్రభుత్వాలు శరణార్థులకు ఆహారాన్ని, బట్టల్ని, ఇంటిని ఇచ్చినప్పటికీ వాళ్లకు కొన్ని సవాళ్లు ఎదురౌతాయి. ఉదాహరణకు, వాళ్లు ఎప్పుడూ తినే ఆహారంతో పోలిస్తే వాళ్లు వెళ్లిన ప్రాంతంలో ఆహారం వేరుగా ఉండవచ్చు. వాతావరణం వేడిగా ఉండే దేశాలనుండి చల్లగా ఉండే దేశాలకు వెళ్లే కొంతమందికి అక్కడి చలిని తట్టుకోవడానికి ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలియకపోవచ్చు. ఇంకొంతమంది ఆధునిక పరికరాలను ఉపయోగించడం నేర్చుకోవాల్సిరావచ్చు.
9 శరణార్థులు కొత్త దేశానికి అలవాటు పడేందుకు సహాయం చేసే కార్యక్రమాల్ని కొన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. కానీ కొన్ని నెలల తర్వాత వాళ్లపట్ల వాళ్లే శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టంగా ఉండవచ్చు. వాళ్లు ఏమేమి నేర్చుకోవాలో ఆలోచించండి: కొత్త భాష, కొత్త పద్ధతులు నేర్చుకోవాలి. అంతేకాదు బిల్లులు-పన్నులు కట్టే విషయంలో అలాగే పిల్లల్ని స్కూల్లో చేర్పించడం, క్రమశిక్షణ ఇవ్వడం వంటి విషయాలకు సంబంధించిన కొత్త చట్టాలను తెలుసుకోవాలి. శరణార్థులుగా వచ్చి, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మన సహోదరసహోదరీలకు మీరు ఓపిగ్గా, గౌరవపూర్వకంగా సహాయం చేయగలరా?—ఫిలి. 2:3, 4.
10. మన దేశానికి శరణార్థులుగా వచ్చినవాళ్లు తమ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి మనమెలా సహాయం చేయవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)
10 కొన్నిసార్లు మన సహోదరులను స్థానికంగా ఉండే సంఘాలకు వెళ్లనివ్వకుండా కొంతమంది అధికారులు ఇబ్బందిపెడతారు. సహోదరులకు సహాయం చేయడం ఆపేయమని కొన్ని ప్రభుత్వ సంస్థలు మనల్ని బెదిరిస్తాయి. ప్రభుత్వాలు ఇచ్చిన ఉద్యోగాల వల్ల శరణార్థులుగా వచ్చిన మన సహోదరులకు మీటింగ్స్‌కు రావడం ఒక్కోసారి కష్టంకావచ్చు. కానీ అలాంటి ఉద్యోగాలు చేయకపోతే తమ దేశంలో ఉండడం కుదరదని ప్రభుత్వాలు చెప్పవచ్చు. కొంతమంది సహోదరులు భయం, నిస్సహాయత వల్ల అలాంటి ఉద్యోగాలు చేయడానికి ఒప్పుకున్నారు. కాబట్టి మన దేశానికి శరణార్థులుగా వచ్చిన సహోదరులను వీలైనంత త్వరగా కలవడం చాలా ప్రాముఖ్యం. మనకు వాళ్లపట్ల శ్రద్ధ ఉందని వాళ్లకు తెలియాలి. అలాంటి పట్టింపు, సహాయం వాళ్ల విశ్వాసాన్ని బలపరుస్తాయి.—సామె. 12:25; 17:17.
శరణార్థులకు కావాల్సిన సహాయం చేయండి
11. (ఎ) మొదటిగా శరణార్థులకు ఏమి అవసరం? (బి) వాళ్లు ఎలా కృతజ్ఞతను చూపించవచ్చు?
11 మొదట, మన సహోదరులకు ఆహారం, బట్టలు లేదా అవసరమైన ఇతర వస్తువులు ఇవ్వాల్సిరావచ్చు. c మనం చిన్నచిన్న గిఫ్ట్‌లు కూడా ఇవ్వవచ్చు. ఒక సహోదరునికి మనం ఇచ్చే టై వంటి చిన్న గిఫ్ట్ అయినా అతనికి ఎంతో ఉపయోగపడవచ్చు. అయితే శరణార్థులు తమకు ఇది కావాలని అది కావాలని అడగకుండా, ఇతరులు తమకు చేస్తున్న సహాయానికి కృతజ్ఞత చూపిస్తే సహాయం చేస్తున్న సహోదరులకు సంతోషంగా ఉంటుంది. రోజులు గడుస్తుండగా శరణార్థులు తమ అవసరాలను తాము తీర్చుకోవడం ప్రాముఖ్యం. అలా చేస్తే వాళ్లకు ఆత్మగౌరవం ఉంటుంది అలాగే తోటి సహోదరులతో వాళ్ల సంబంధం పాడవ్వకుండా ఉంటుంది. (2 థెస్స. 3:7-10) అయినప్పటికీ శరణార్థులకు ఇంకొన్ని విషయాల్లో మన సహాయం అవసరమౌతుంది.
12, 13. (ఎ) శరణార్థులకు మనమెలా సహాయం చేయవచ్చు? (బి) ఉదాహరణ చెప్పండి.
12 శరణార్థులకు సహాయం చేయడం కోసం ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు. వాళ్లకు మన సమయం, ప్రేమ ఎక్కువ అవసరం. ఉదాహరణకు, వాళ్లు ఎక్కడికైనా వెళ్లడానికి ఏయే రవాణా సౌకర్యాలు ఉన్నాయో చూపించవచ్చు. తక్కువ ధరకే ఆరోగ్యకరమైన ఆహారం ఎక్కడ దొరుకుతుందో చూపించవచ్చు. అలాగే బట్టలు కుట్టడం లేదా పెయింట్ వేయడం వంటి పనులు నేర్పించవచ్చు. అప్పుడు వాటిని వాళ్లు తమ జీవనాధారంగా చేసుకోగలుగుతారు. అన్నిటికన్నా ముఖ్యంగా, కొత్త సంఘంలోని సభ్యులతో కలిసిమెలిసి ఉండడానికి సహాయం చేయవచ్చు. వీలైతే, వాళ్లను మీ కారులోనే మీటింగ్‌కు తీసుకువెళ్లవచ్చు. అంతేకాదు, ఆ ప్రాంతంలోని ప్రజలకు మంచివార్తను ఎలా ప్రకటిస్తే వింటారో శరణార్థులకు నేర్పించవచ్చు, వాళ్లతో కలిసి పరిచర్య కూడా చేయవచ్చు.
13 శరణార్థులుగా వచ్చిన నలుగురు యౌవనులు ఒక సంఘానికి వెళ్లినప్పుడు, కొంతమంది సంఘపెద్దలు వాళ్లకు కావాల్సిన సహాయం చేశారు. వాళ్లకు కారు డ్రైవింగ్, ఉత్తరం టైప్ చేయడం, ఉద్యోగం కోసం అప్లికేషన్ నింపడం నేర్పించారు. అంతేకాదు, యెహోవా సేవకు మొదటిస్థానం ఇచ్చేలా తమ పనుల్ని ఎలా సర్దుబాటు చేసుకోవాలో కూడా చూపించారు. (గల. 6:10) కొంతకాలానికే, ఆ నలుగురు యౌవనులు పయినీరు సేవ మొదలుపెట్టారు. సంఘపెద్దల సహాయంవల్ల, యెహోవా సేవలో లక్ష్యాలు పెట్టుకుని కృషిచేయడంవల్ల వాళ్లు క్రైస్తవులుగా ప్రగతి సాధించి, సాతాను లోకానికి దూరంగా ఉండగలిగారు.
14. (ఎ) శరణార్థులు వేటిని అధిగమించాలి? (బి) ఉదాహరణ చెప్పండి.
14 మిగతా క్రైస్తవుల్లాగే, శరణార్థులు కూడా యెహోవాతో ఉన్న స్నేహానికి ప్రాముఖ్యతనిస్తూ ఎక్కువ డబ్బును సంపాదించాలనే కోరికను, ఒత్తిడిని అధిగమించాలి. d మనం మొదటి పేరాల్లో చూసిన సహోదరుడు లీజె, అతని కుటుంబం శరణార్థులుగా వెళ్లిపోతున్నప్పుడు వాళ్ల నాన్న తమకు విశ్వాసం గురించి కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు నేర్పించినట్లు గుర్తుచేసుకున్నారు. వాళ్లిలా చెప్పారు, “ఒకదాని తర్వాత ఒకటి మా దగ్గరున్న అవసరంలేని వస్తువుల్ని నాన్న పడేశాడు. చివరికి, ఖాళీ బ్యాగు చూపించి చిరునవ్వు చిందిస్తూ, ‘చూశారా, మనకు కావాల్సింది ఇదే’ అని అన్నాడు.”—1 తిమోతి 6:8 చదవండి.
శరణార్థుల అత్యంత ప్రాముఖ్యమైన అవసరాల్ని తీర్చండి
15, 16. (ఎ) సహోదరుల విశ్వాసాన్ని మనమెలా బలపర్చవచ్చు? (బి) వాళ్లను మనమెలా ఓదార్చవచ్చు?
15 శరణార్థులకు ఆహారం, బట్టలు ఉంటేనే సరిపోదు. వాళ్లకు ఓదార్పు, బైబిలు ఇస్తున్న ప్రోత్సాహం అవసరం. (మత్త. 4:4) శరణార్థుల భాషలో ఉన్న ప్రచురణల్ని సంఘపెద్దలు తెప్పించి ఇవ్వవచ్చు. శరణార్థుల భాష మాట్లాడే సహోదరులను సంప్రదించేలా వాళ్లకు సహాయం చేయవచ్చు. చాలామంది శరణార్థులు తమకు ఇష్టం లేకపోయినా తమ సర్వస్వాన్ని వదిలిపెట్టి వచ్చారు కాబట్టి వాళ్లపై అలా శ్రద్ధ చూపించడం చాలా ప్రాముఖ్యం. వాళ్లు తమ కుటుంబానికి, ప్రజలకు, సంఘానికి దూరంగా వచ్చారు. అందుకే తోటి క్రైస్తవుల మధ్య యెహోవా ప్రేమను, కనికరాన్ని వాళ్లు రుచిచూడగలగాలి. లేకపోతే, శరణార్థులు సహాయం కోసం తమ దేశానికి చెందిన వేరేవాళ్ల వైపు చూస్తారు. కానీ ఆ వేరేవాళ్లు యెహోవా ఆరాధకులు కాకపోవచ్చు. (1 కొరిం. 15:33) తాము సంఘంలో ఒకరని శరణార్థులకు అనిపించేలా మనం చేయగలిగినప్పుడు, “పరదేశులను” కాపాడుతున్న యెహోవాతో కలిసి పనిచేసిన వాళ్లమౌతాం.—కీర్త. 146:9.
16 శత్రువులు తమ దేశాన్ని పరిపాలిస్తున్నంతకాలం యేసు, ఆయన కుటుంబసభ్యులు తమ ఇంటికి తిరిగి వెళ్లలేకపోయారు. అదేవిధంగా, శరణార్థులు కూడా తమ దేశంలో హింసలు లేదా యుద్ధాలు జరుగుతున్నంత కాలం ఇంటికి తిరిగి వెళ్లలేరు. కొంతమందికి తిరిగి వెళ్లాలని కూడా అనిపించకపోవచ్చు. ఎందుకంటే, తిరుగుబాటుదారులు తమ కుటుంబ సభ్యుల్ని బలత్కరించడాన్ని, చంపడాన్ని చాలామంది అమ్మానాన్నలు చూశారు. అది చూశాక తమ పిల్లల్ని మళ్లీ అలాంటి చోటుకు తీసుకువెళ్లడానికి వాళ్లు ఇష్టపడట్లేదని లీజె చెప్తున్నాడు. మన సహోదరులకు సహాయం చేయాలంటే, ‘సహానుభూతి, సోదర ప్రేమ, వాత్సల్యం, వినయం’ వంటి లక్షణాలు మనకు అవసరం. (1 పేతు. 3:8) హింసలు అనుభవించి విసిగిపోయిన కొంతమంది శరణార్థులు ఇతరులతో సహవసించడం మానేశారు. వాళ్లు పడిన బాధ గురించి చెప్పడానికి ముఖ్యంగా తమ పిల్లల ముందు చెప్పడానికి వాళ్లు ఇష్టపడకపోవచ్చు. ఈ ప్రశ్న గురించి ఆలోచించండి, ‘ఒకవేళ నేను అలాంటి బాధను అనుభవిస్తే, ఇతరులు నన్ను ఎలా చూడాలని నేను కోరుకుంటాను?’—మత్త. 7:12.
యెహోవాసాక్షులుకాని శరణార్థులకు ప్రకటిస్తున్నప్పుడు
17. మన ప్రకటనాపని వల్ల శరణార్థులు ఎలా మనశ్శాంతిని పొందుతున్నారు?
17 నేడు చాలామంది శరణార్థులు మన ప్రకటనాపనిని నిషేధించిన దేశాలనుండి వస్తున్నారు. వాళ్లకు ఉత్సాహవంతమైన ప్రచారకులు ప్రీచింగ్ చేస్తున్నారు. ఆ ప్రచారకులకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే దానివల్ల వేలమంది శరణార్థులు “రాజ్యం గురించిన వాక్యం” మొదటిసారి వింటున్నారు. (మత్త. 13:19, 23) “భారం మోస్తూ” ఉన్న చాలామంది మన మీటింగ్స్‌లో ఓదార్పును, మనశ్శాంతిని పొందుతున్నారు. అందుకే వాళ్లు, “దేవుడు నిజంగా మీ మధ్య ఉన్నాడు” అని అంటున్నారు.—మత్త. 11:28-30; 1 కొరిం. 14:25.
18, 19. మనం శరణార్థులకు ప్రీచింగ్ చేస్తున్నప్పుడు ఎలా తెలివిగా ఉండాలి?
18 మనం శరణార్థులకు ప్రీచింగ్ చేస్తున్నప్పుడు తెలివిగా, “అప్రమత్తంగా” ఉండాలి. (మత్త. 10:16; సామె. 22:3) వాళ్లు మాట్లాడుతుంటే ఓపిగ్గా వినండి, కానీ రాజకీయల గురించి మాట్లాడకండి. మనం లేదా ఇతరులు ప్రమాదంలో పడకూడదంటే బ్రాంచి కార్యాలయం, అలాగే స్థానిక అధికారులు ఇస్తున్న నిర్దేశాలను పాటించాలి. ఎందుకంటే శరణార్థులు వేర్వేరు మతాల నుండి, సంస్కృతుల నుండి వస్తారు. మనం వాళ్ల భావాల్ని, అభిప్రాయాల్ని తెలుసుకుని, గౌరవించాలి. ఉదాహరణకు, కొన్ని దేశాల ప్రజలకు స్త్రీలు ఎలాంటి బట్టలు వేసుకోవాలనే విషయంలో కొన్ని బలమైన అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి, మనం వాళ్లకు ప్రీచింగ్ చేస్తున్నప్పుడు వాళ్లకు అభ్యంతరం కలగకుండా చక్కని బట్టలు వేసుకోవాలి.
19 బాధపడుతున్న ప్రజలకు మనం సహాయం చేయాలనుకుంటాం. వాళ్లు యెహోవాసాక్షులు కాకపోయినా సహాయం చేయాలనుకుంటాం. అలా చేసినప్పుడు, యేసు చెప్పిన ఉపమానంలోని మంచి సమరయుడిని అనుకరించిన వాళ్లమౌతాం. (లూకా 10:33-37) మనం ప్రజలకు సహాయం చేయగల ఉత్తమమైన మార్గం ఏమిటంటే మంచివార్తను ప్రకటించడం. మనం యెహోవాసాక్షులమని నేరుగా చెప్పడం ప్రాముఖ్యమని చాలామంది శరణార్థులకు సహాయం చేసిన ఒక సంఘపెద్ద చెప్తున్నాడు. మనం వాళ్లకు వస్తుపరంగా సహాయం చేయడానికి కాదుగానీ బైబిల్లోని అద్భుతమైన నిరీక్షణ గురించి చెప్పడానికే వచ్చామని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి.
సంతోషకరమైన ఫలితాలు
20, 21. (ఎ) శరణార్థులపట్ల నిజమైన ప్రేమ చూపించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? (బి) తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏమి తెలుసుకుంటాం?
20 మనం “పరదేశుల” పట్ల నిజమైన ప్రేమ చూపించినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. ఉదాహరణకు, ఎరిట్రయాలో జరుగుతున్న హింస నుండి తప్పించుకోవడానికి తన కుటుంబంతో సహా శరణార్థురాలిగా వెళ్లిపోయానని ఒక క్రైస్తవ సహోదరి చెప్పింది. తన నలుగురు పిల్లలు ఎనిమిది రోజులపాటు ఎడారి గుండా ప్రయాణించి అలసిపోయి, చివరికి సూడాన్‌కు చేరుకున్నారు. ఆ సహోదరి ఇలా అంటుంది, “అక్కడున్న సహోదరులు మమ్మల్ని సొంత బంధువుల్లా చూసుకున్నారు. ఆహారం, బట్టలు, ఉండడానికి ఒక గది ఏర్పాటు చేశారు, అలాగే ప్రయాణ ఖర్చులు కూడా ఇచ్చారు. కేవలం ఒకే దేవున్ని ఆరాధిస్తున్నామనే కారణాన్ని బట్టి అపరిచితులను ఇలా ఇంటికి ఆహ్వానించే వాళ్లు ఇంకెవరైనా ఉంటారా? యెహోవాసాక్షులు తప్ప ఇంకెవ్వరూ ఉండరు.”—యోహాను 13:35 చదవండి.
21 మరి తమ అమ్మానాన్నలతో పాటు వలస వచ్చే ఎంతోమంది పిల్లల సంగతేమిటి? అలాంటి కుటుంబాలన్నీ యెహోవాను సంతోషంతో సేవించేందుకు మనందరం ఎలా సహాయం చేయవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.
a ఈ ఆర్టికల్‌లో “శరణార్థులు” అనే పదం యుద్ధం, హింస, ప్రకృతి వైపరిత్యాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో తమ ఇళ్లను వదిలిపెట్టి వెళ్లిపోయిన ప్రజల్ని సూచిస్తుంది. వాళ్లు బహుశా మరో దేశానికి వెళ్లివుండవచ్చు లేదా తమ దేశంలోనే వేరే ప్రాంతానికి వెళ్లివుండవచ్చు. అయితే, ప్రపంచంలో ప్రతీ 113 మందిలో ఒకరు శరణార్థులుగా మారాల్సి వస్తోందని UNHCR (శరణార్థుల ఐక్యరాజ్య సమితి ఉన్నత కమీషనర్) చెప్తోంది.
b 2016 అక్టోబరు, కావలికోట సంచికలోని “అపరిచితులపట్ల దయచూపించడం మర్చిపోకండి” అనే ఆర్టికల్‌లో 8-12 పేరాలు చూడండి.
c శరణార్థులు తమ సంఘానికి వచ్చిన తర్వాత, సంఘపెద్దలు యెహోవా చిత్తం చేస్తున్న సంస్థ పుస్తకంలో 8వ అధ్యాయం, 30వ పేరాలో ఉన్న నిర్దేశాన్ని వీలైనంత త్వరగా పాటించాలి. శరణార్థుల సొంత దేశంలో ఉన్న సంఘాన్ని సంప్రదించాలంటే jw.org వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తూ సంఘపెద్దలు తమ బ్రాంచికి ఉత్తరం రాయవచ్చు. ఈలోపు ఆ శరణార్థి ఆధ్యాత్మికత ఎలా ఉందో తెలుసుకోవడానికి అతని సంఘం గురించి, పరిచర్య గురించి తెలివిగా కొన్ని విషయాలు అడగవచ్చు.
d 2014, ఏప్రిల్ 15 కావలికోట సంచికలోని “ఎవ్వరూ, ఇద్దరు యజమానులను సేవించలేరు” అలాగే “‘మంచి ధైర్యంతో ఉండండి’ యెహోవాయే మీకు సహాయం చేస్తాడు!” అనే ఆర్టికల్స్‌లో 17-26 పేజీలు చూడండి.