జీవిత కథ
ఒకప్పుడు పేదవాణ్ణి, ఇప్పుడు ధనవంతుణ్ణి
నేను అమెరికాలో ఉన్న ఇండియానాలోని లిబర్టీ అనే చాలా చిన్న ఊరిలో, ఒకే గది ఉన్న చెక్క ఇంట్లో పుట్టాను. అప్పటికే మా అమ్మానాన్నలకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నా తర్వాత ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లి పుట్టారు.
ఆ కాలంలో మా స్కూల్లో పరిస్థితి ఎలా ఉండేదంటే, ఫస్ట్ గ్రేడ్ చదువుతున్నప్పుడు క్లాస్‌లో ఎవరెవరు ఉండేవాళ్లో, స్కూల్ చదువు అయిపోయే నాటికి కూడా వాళ్లే ఉండేవాళ్లు. మా ఊర్లో ఎంత తక్కువమంది ఉండేవాళ్లంటే అక్కడున్న దాదాపు అందరి పేర్లు మాకు తెలుసు, మా పేర్లు కూడా వాళ్లకు తెలుసు.
మేముండే ప్రాంతం చుట్టూ చిన్నచిన్న పొలాలు ఉండేవి, అక్కడ ఎక్కువగా మొక్కజొన్న పండించేవాళ్లు. నేను పుట్టే నాటికి మా నాన్న స్థానిక రైతు దగ్గర పనిచేసేవాడు. నేను టీనేజీలో ఉన్నప్పుడు ట్రాక్టర్ నడపడం, పొలం పనులు చేయడం నేర్చుకున్నాను.
నాన్న యౌవనంలో ఎలా ఉండేవాడో నాకు తెలీదు. ఎందుకంటే నేను పుట్టేటప్పటికి ఆయనకు 56 ఏళ్లు, అమ్మకు 35 ఏళ్లు. ఆ వయసులో కూడా నాన్న చాలా బలంగా, ఆరోగ్యంగా ఉండేవాడు. మా నాన్నకు కష్టపడి పనిచేయడమంటే చాలా ఇష్టం. మాకు కూడా అదే నేర్పించాడు. నాన్న పెద్దగా డబ్బు సంపాదించకపోయినా, మాకు తలదాచుకోవడానికి ఇల్లు, వేసుకోవడానికి బట్టలు, కడుపు నింపుకోవడానికి ఆహారం ఉండేలా చూశాడు. ఆయన ఎప్పుడూ మాతో సమయం గడిపేవాడు. నాన్నకు 93 ఏళ్లు ఉన్నప్పుడు చనిపోయాడు, అమ్మ 86 ఏళ్ల వయసులో చనిపోయింది. వాళ్లిద్దరూ యెహోవాసాక్షులు కాదు. కానీ ఒక తమ్ముడు మాత్రం సత్యం నేర్చుకుని 1972 నుండి సంఘపెద్దగా సేవచేస్తున్నాడు.
నా చిన్నతనం
అమ్మకు భక్తి ఎక్కువ. ప్రతీ ఆదివారం మమ్మల్ని బాప్టిస్ట్ చర్చికి తీసుకెళ్లేది. నాకు 12 ఏళ్లు ఉన్నప్పుడు మొదటిసారి త్రిత్వం గురించి విన్నాను. కుతూహలంతో అమ్మ దగ్గరికి వెళ్లి, “కుమారుడు, తండ్రి ఇద్దరూ యేసే ఎలా అవుతాడు?” అని అడిగాను. అప్పుడు అమ్మ, “అది ఒక మర్మం. దానిగురించి మనం ఆలోచించకూడదు” అని చెప్పడం నాకిప్పటికీ గుర్తు. నిజంగానే నాకు అదొక మర్మంగా ఉండేది. అయినాసరే 14 ఏళ్లు ఉన్నప్పుడు మా ఊరిలోని నీటి కాలువలో బాప్తిస్మం తీసుకున్నాను. తండ్రి, కుమారుడు, పవిత్రశక్తి పేరు మీద వాళ్లు నన్ను మూడుసార్లు నీటిలో ముంచారు.
నాకు స్కూల్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఆ అబ్బాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొనేవాడు, నన్ను కూడా బాక్సింగ్ నేర్చుకోమని బలవంతం చేశాడు. శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టి, గోల్డెన్ గ్లౌస్ అనే ఒక బాక్సింగ్ సంస్థలో సభ్యునిగా చేరాను. కానీ దానిలో రాణించలేకపోవడంతో ఆపేశాను. తర్వాత నాకు యు.ఎస్. ఆర్మీలో చేరమనే పిలుపు అందింది, చేరాక నన్ను జర్మనీకి పంపించారు. అక్కడ పనిచేస్తుండగా పై అధికారులు నాలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని భావించి ఒక మిలిటరీ అకాడమీకి పంపించారు. నేను మిలిటరీలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని వాళ్లు భావించారు. కానీ నాకు అక్కడ ఉండడం నచ్చలేదు. దాంతో రెండేళ్లు విధులు నిర్వహించాక 1956లో ఆర్మీ నుండి బయటికొచ్చాను. ఆ తర్వాత ఎంతోకాలం గడవకముందే నేను ఇంకో రకమైన ఆర్మీలో చేరాను.
కొత్త జీవితం
సత్యం తెలియక ముందు, ఒక పురుషుడు ఎలా ఉండాలనే విషయం మీద నాకు తప్పుడు అభిప్రాయం ఉండేది. ఎందుకంటే సినిమాల ప్రభావం, చుట్టూ ఉన్నవాళ్ల ప్రభావం నాపై చాలా ఉండేది. బైబిలు గురించి మాట్లాడే పురుషులను చేతకానివాళ్లుగా చూసేవాడిని. కానీ నేను నేర్చుకున్న కొన్ని విషయాలు నా జీవితాన్నే మార్చేశాయి. నేనొకసారి నా ఎర్ర కారులో మా ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు ఇద్దరు అమ్మాయిలు చేతులు ఊపుతూ నన్ను పిలిచారు. వాళ్లు మా పెద్ద బావగారి చెల్లెళ్లు. ఆ ఇద్దరు అమ్మాయిలు అప్పటికే యెహోవాసాక్షులు. అంతకుముందు ఒకసారి నాకు కావలికోట, తేజరిల్లు! పత్రికల్ని ఇచ్చారు. కానీ కావలికోట అర్థంచేసుకోవడానికి చాలా కష్టంగా ఉన్నట్లు అనిపించింది. కానీ ఈసారి వాళ్లు నన్ను తమ ఇంట్లో జరిగే సంఘ పుస్తక అధ్యయనానికి రమ్మని పిలిచారు, అది బైబిల్లోని విషయాలు చర్చించడానికి జరిగే చిన్న కూటం. నేను ఆలోచిస్తానని చెప్పాను. వాళ్లు చిన్నగా నవ్వి, “నిజంగా వస్తారా, ప్రామిస్?” అని అడిగారు. నేను “ప్రామిస్” అన్నాను.
అనవసరంగా మాటిచ్చేశానే అనిపించింది, ఎలాగో మాటిచ్చాను కాబట్టి వెళ్లక తప్పదు అనుకున్నాను. ఆ రోజు రాత్రి కూటానికి వెళ్లాను. అక్కడికి వచ్చిన చిన్నపిల్లలకు ఉన్న బైబిలు జ్ఞానం చూసి చాలా ఆశ్చర్యపోయాను. నేను మా అమ్మతో కలిసి ప్రతీ ఆదివారం చర్చీకి వెళ్లినా బైబిలు గురించి ఏమీ తెలుసుకోలేదు. కనీసం ఇప్పుడైనా బైబిలు గురించి నేర్చుకోవాలనుకుని బైబిలు స్టడీ తీసుకుంటానని చెప్పాను. నేను నేర్చుకున్న మొదటి విషయం, సర్వోన్నతుడైన దేవుని పేరు యెహోవా అని. కొన్నేళ్ల క్రితం యెహోవాసాక్షుల గురించి అమ్మను అడిగినప్పుడు, “వాళ్లా! వాళ్లు ఎవరో యెహోవా అనే ముసలాయన్ని ఆరాధిస్తారంట” అని చెప్పింది. కానీ స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాక నిజాలు తెలుసుకోగలిగాను.
సత్యం తెలుసుకున్నాననే నమ్మకం కుదరడంతో చాలా త్వరగా ప్రగతి సాధించాను. మొదటిసారి కూటానికి వెళ్లిన తొమ్మిది నెలలకే అంటే 1957 మార్చిలో బాప్తిస్మం తీసుకున్నాను. అప్పటినుండి నా ఆలోచనా తీరు మారిపోయింది. ఒక పురుషుడు ఎలా ఉండాలని బైబిలు చెప్తుందో తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. యేసు పరిపూర్ణ పురుషుడు. ఏ పురుషునికీ లేని బలం, శక్తి ఆయనకు ఉండేవి. కానీ ఆయన గొడవలు పడలేదు, ‘కష్టాలన్నీ భరించాడు.’ (యెష. 53:2, 7, NW) యేసును నిజంగా అనుసరించేవాళ్లు “అందరితో మృదువుగా వ్యవహరించాలని” తెలుసుకున్నాను.—2 తిమో. 2:24.
బాప్తిస్మం తీసుకున్న తర్వాతి సంవత్సరం అంటే 1958లో పయినీరు సేవ మొదలుపెట్టాను. కానీ కొంతకాలానికే దాన్ని కాస్త ఆపాల్సివచ్చింది. ఎందుకు? ఎందుకంటే నేను గ్లోరియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆమె ఎవరో కాదు నన్ను సంఘ పుస్తక అధ్యయనానికి పిలిచిన ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు. తనను పెళ్లి చేసుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఆమె అప్పుడూ, ఇప్పుడూ నాకొక విలువైన రత్నం లాంటిది. అత్యంత విలువైన వజ్రం కన్నా తను నాకెంతో అమూల్యమైనది. ఆమె నా భార్య అయినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. గ్లోరియా గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఆమె ఏమి చెప్తుందో చూడండి:
“మా అమ్మానాన్నలకు మొత్తం 17 మంది పిల్లలం. అమ్మ నమ్మకమైన యెహోవాసాక్షి. నాకు 14 ఏళ్లున్నప్పుడు అమ్మ చనిపోయింది. ఆ తర్వాత నాన్న స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాడు. అమ్మ చనిపోయింది కాబట్టి నాన్న మా స్కూల్ ప్రిన్సిపాల్‌తో మాట్లాడి ఒక ఏర్పాటు చేశాడు. అప్పటికి అక్క హైస్కూల్ చివరి సంవత్సరం చదువుతోంది. నేనూ, అక్క వంతులవారీగా రోజు మార్చి రోజు స్కూలుకి రావచ్చానని ప్రిన్సిపాల్‌ని అడిగాడు. దానివల్ల మా తమ్ముళ్లను, చెల్లెళ్లను చూసుకోవడానికి ఇంట్లో ఎవరో ఒకరు ఉంటామనీ, నాన్న పని నుండి ఇంటికొచ్చేసరికి ఇంట్లో అందరికీ భోజనం సిద్ధం చేస్తామనీ నాన్న ఆలోచన. దానికి మా ప్రిన్సిపాల్ ఒప్పుకోవడంతో అక్క స్కూల్ చదువు అయిపోయేదాకా నేనూ, తనూ వంతులవారీగా స్కూలుకు వెళ్లేవాళ్లం. సాక్షులైన రెండు కుటుంబాలు మాకు స్టడీ చేసేవాళ్లు, మా తోబుట్టువుల్లో 11 మందిమి యెహోవాసాక్షులమయ్యాం. నేను చాలా బిడియస్థురాలిని, కానీ ప్రీచింగ్ చేయడానికి మాత్రం ముందుండేదాన్ని. ఆ బిడియాన్ని వదిలిపెట్టడానికి నా భర్త సామ్ ఆ తర్వాతి సంవత్సరాల్లో నాకు సహాయం చేశాడు.”
నేనూ, గ్లోరియా 1959 ఫిబ్రవరి నెలలో పెళ్లిచేసుకున్నాం. కలిసి పయినీరింగ్ చేస్తూ చాలా సంతోషించాం. అదే సంవత్సరం జూలై నెలలో బెతెల్ సేవచేయడానికి దరఖాస్తు చేసుకున్నాం. ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సేవచేయాలనే కోరిక మా ఇద్దరికీ ఉండేది. బెతెల్‌లో సేవచేస్తున్న సహోదరుడు సైమన్ క్రేకర్ మమ్మల్ని ఇంటర్వ్యూ చేశాడు. అప్పట్లో దంపతుల్ని బెతెల్‌కి ఆహ్వానించట్లేదని ఆయన మాతో చెప్పాడు. కానీ మా కోరిక మాత్రం అలానే ఉండేది, ఆ కోరిక తీరడానికి చాలాకాలం పట్టింది.
అయితే, అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవచేయడానికి మమ్మల్ని పంపమని అడుగుతూ ప్రపంచ ప్రధాన కార్యాలయానికి మేం ఒక ఉత్తరం రాశాం. వాళ్లు మమ్మల్ని ఆర్కన్‌సాస్‌లో ఉన్న పైన్ బ్లఫ్‌కి వెళ్లమని చెప్పారు. అప్పట్లో అక్కడ రెండు సంఘాలు ఉండేవి. ఒక సంఘంలో తెల్లజాతి ప్రచారకులు ఉండేవాళ్లు. ఇంకో సంఘంలో నల్లజాతి ప్రచారకులు ఉండేవాళ్లు. మమ్మల్ని నల్లజాతి ప్రచారకులున్న సంఘానికి పంపారు, అక్కడ 14 మంది ప్రచారకులు మాత్రమే ఉండేవాళ్లు.
వివక్షను, జాతి విభేదాన్ని సహించడం
యెహోవాసాక్షులు తెల్లజాతి ప్రచారకుల్ని, నల్లజాతి ప్రచారకుల్ని వేరుచేయడం ఏమిటానని మీకు సందేహం కలగవచ్చు. కానీ అప్పట్లో వేరే దారి లేదు. వేర్వేరు జాతులవాళ్లు కలుసుకోవడం అప్పట్లో చట్టవిరుద్ధం, కలుసుకుంటే గొడవలు కూడా జరిగేవి. చాలా ప్రాంతాల్లో, ఒకవేళ రెండు జాతులవాళ్లు కలిసి మీటింగ్ జరుపుకుంటే రాజ్యమందిరాన్ని కూల్చేస్తారేమోనని సహోదరులు భయపడేవాళ్లు. అలాంటి సంఘటనలు జరిగాయి కూడా. ఒకవేళ తెల్లజాతి వాళ్లుండే ప్రాంతానికి వెళ్లి నల్లజాతి ప్రచారకులు ప్రీచింగ్ చేస్తే పోలీసులు అరెస్ట్ చేసేవాళ్లు, కొట్టేవాళ్లు కూడా. మనకు కావాల్సింది ప్రకటనా పని జరగడమే కాబట్టి మేం చట్టానికి లోబడేవాళ్లం, యెహోవా పరిస్థితుల్ని మారుస్తాడనే నమ్మకంతో ఉండేవాళ్లం.
మా ప్రీచింగ్ అంత తేలిగ్గా ఉండేది కాదు. కొన్నిసార్లు నల్లజాతివాళ్లు ఉండే ప్రాంతంలో ప్రీచింగ్ చేస్తున్నప్పుడు, అనుకోకుండా తెల్లజాతీయుల ఇంటికి వెళ్లేవాళ్లం. అలాంటి సమయాల్లో వాళ్లకు మేం వచ్చిన కారణాన్ని రెండు ముక్కల్లో చెప్పాలో లేక క్షమించమని అడిగి అక్కడనుండి వెళ్లిపోవాలో త్వరగా నిర్ణయించుకోవాల్సి వచ్చేది. అప్పట్లో పరిస్థితులు అలానే ఉండేవి.
మేం పయినీరు సేవ చేస్తూనే, బ్రతకడానికి ఉద్యోగం కూడా చేయాల్సి వచ్చేది. మా రోజువారీ జీతం చాలా తక్కువ ఉండేది. గ్లోరియా కొంతమంది ఇళ్లల్లో పనిచేసేది. ఒక ఇంట్లో ఆమెతోపాటు నేను కూడా పనిచేయడానికి ఒప్పుకున్నారు, దానివల్ల పనిని తక్కువ సమయంలో పూర్తి చేయగలిగేవాళ్లం. వాళ్లే మాకు భోజనం కూడా ఇచ్చేవాళ్లు. పని ముగించుకుని ఇంటికి వెళ్లేముందు దాన్నే ఇద్దరం తినేవాళ్లం. ప్రతీవారం గ్లోరియా ఒకరి ఇంట్లో బట్టలు ఇస్త్రీ చేసేది. నేను తోటపని, కిటికీలు శుభ్రం చేయడం, ఇతర ఇంటి పనులు చేసేవాడిని. ఒక తెల్లజాతీయుల ఇంట్లో మేం కిటికీలు శుభ్రం చేసేవాళ్లం. గ్లోరియా లోపలి వైపు శుభ్రం చేస్తుంటే, నేను బయట వైపు శుభ్రం చేసేవాడిని. ఆ పని రోజంతా పట్టేది కాబట్టి మధ్యాహ్నం పూట వాళ్లే భోజనం ఇచ్చేవాళ్లు. గ్లోరియాను ఇంట్లో తినడానికి అనుమతించారు, కాకపోతే యజమాని కుటుంబం నుండి దూరంగా కూర్చోవాలి. నేనేమో గ్యారేజీలో తినాల్సి వచ్చింది, దానికి నేను బాధపడలేదు. భోజనం మాత్రం బాగుండేది. ఆ కుటుంబం మంచిదే, కానీ
చుట్టూ ఉన్న ప్రజల ప్రభావం వల్ల అలా ప్రవర్తించేవాళ్లు. ఒకసారైతే మేం పెట్రోల్ బంక్ దగ్గర కారులో పెట్రోల్ కొట్టించాక, గ్లోరియా బాత్‌రూమ్ ఉపయోగించుకోవడం కుదురుతుందానని అక్కడ పనిచేస్తున్న తెల్లజాతి అబ్బాయిని అడిగాను. అతను నా వైపు కోపంగా చూసి “తాళం వేసుంది” అన్నాడు.గుర్తుండిపోయిన సహాయాలు
ఏవి ఎలాగున్నా, సహోదరులతో మేం చక్కగా సమయం గడిపాం, ప్రీచింగ్ ఆనందించాం. మేం పైన్ బ్లఫ్‌కి వచ్చిన కొత్తలో అప్పట్లో కాంగ్రిగేషన్ సర్వెంట్‌గా సేవచేస్తున్న సహోదరుని ఇంట్లో ఉండేవాళ్లం. అప్పటికి అతని భార్య యెహోవాసాక్షి కాలేదు. గ్లోరియా ఆమెకు స్టడీ చేయడం మొదలుపెట్టింది. నేనేమో వాళ్ల కూతురికి, అల్లుడికి స్టడీ ఇచ్చేవాడిని. ఆ తల్లీ కూతుళ్లు యెహోవా సేవ చేయాలని నిర్ణయించుకుని బాప్తిస్మం తీసుకున్నారు.
తెల్లజాతి ప్రచారకులున్న సంఘంలో కూడా మాకు మంచి స్నేహితులున్నారు. వాళ్లు మమ్మల్ని రాత్రిపూట భోజనానికి పిలిచేవాళ్లు. అయితే ఎవ్వరి కంట పడకుండా బాగా చీకటిపడ్డాకే వాళ్ల ఇంటికి వెళ్లేవాళ్లం. జాతి విభేదాల్ని, హింసను ప్రోత్సహించే కు క్లాక్స్ క్లాన్ (KKK) అనే సంస్థ అప్పట్లో చాలా చురుగ్గా పనిచేసేది. ఒకసారి హాలొవీన్ a పండుగ రోజున ఒకవ్యక్తి KKK సంస్థలోని వాళ్లు వేసుకునేలాంటి బట్టల్ని వేసుకుని వరండాలో కూర్చుని ఉండడం చూశాను. చేదు అనుభవాలు ఎదురైనా సరే మన సహోదరులు మాత్రం దయ చూపించడం ఆపలేదు. ఒకానొక వేసవి కాలంలో, సమావేశానికి వెళ్లడానికి మాకు డబ్బులు అవసరమయ్యాయి. ఒక సహోదరుడు మా కారు కొనుక్కొని డబ్బులు ఇచ్చాడు. నెల తర్వాత ఒకరోజు మేం మండుటెండలో ప్రీచింగ్ చేసి, అటునుండిఅటు నడుచుకుంటూ చాలా స్టడీలకు వెళ్లి బాగా అలసిపోయి ఇంటికి తిరిగొచ్చాం. మా కారు మా ఇంటి ముందు ఆగివుండడం చూసి ఆశ్చర్యపోయాం! దానిమీద ఒక కాగితం అంటించి ఉంది. “మీ కారును తిరిగి మీకు బహుమతిగా ఇస్తున్నాను. ఇట్లు, మీ సహోదరుడు” అని దానిమీద రాసుంది.
మరొకరు చేసిన సహాయం కూడా మనసులో ముద్రించుకుపోయింది. 1962లో న్యూయార్క్‌లోని సౌత్ లాన్సింగ్‌లో జరుగుతున్న రాజ్య పరిచర్య పాఠశాలకు హాజరుకమ్మని నాకు ఆహ్వానం వచ్చింది. సంఘాల్ని పర్యవేక్షించేవాళ్లకు, ప్రాంతీయ, జిల్లా పర్యవేక్షకులకు ఒక నెలపాటు ఆ పాఠశాలలో శిక్షణనిస్తారు. అప్పటికి నాకు ఉద్యోగం లేదు, చేతిలో సరిపడా డబ్బులు కూడా లేవు. ఉద్యోగం కోసం పైన్ బ్లఫ్‌లోని ఒక టెలిఫోన్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్లాను. ఒకవేళ వాళ్లు నాకు ఉద్యోగం ఇస్తే, ఆ కంపెనీలో పనిచేసిన మొదటి నల్లజాతీయుణ్ణి నేనే అవుతాను. ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యానని వాళ్లు నాకు చెప్పారు. న్యూయార్క్‌కు వెళ్లడానికి డబ్బుల్లేవు కాబట్టి ఆ పాఠశాలకు వెళ్లకుండా ఉద్యోగంలో చేరుదామనే ఆలోచనలో ఉన్నాను. అయితే, పాఠశాలకు రావట్లేదని బెతెల్‌కు ఉత్తరం రాయాలని అనుకుంటుండగా జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన జరిగింది.
ఒకరోజు ఉదయాన్నే మా సంఘంలోని ఒక సహోదరి మా తలుపు తట్టింది, ఆమె భర్త యెహోవాసాక్షి కాదు. ఆమె నా చేతిలో ఒక కవరు పెట్టింది. దాని నిండా డబ్బు ఉంది. కొన్నివారాలపాటు ఆమె, ఆమె పిల్లలు ఉదయాన్నే లేచి పత్తి చేనులకు వెళ్లి కలుపు తీసే పనిచేశారు. వాళ్లు అంత కష్టపడింది నేను న్యూయార్క్ వెళ్లడానికి కావాల్సిన డబ్బును సంపాదించడానికి. ఆ సహోదరి ఇలా చెప్పింది, “మీరు ఆ పాఠశాలకు వెళ్లి
వీలైనన్ని ఎక్కువ విషయాలు నేర్చుకోండి. తిరిగొచ్చి అవి మాకు నేర్పించండి.” నేను టెలిఫోన్ కంపెనీ వాళ్లను కలిసి ఐదు వారాల తర్వాత ఉద్యోగంలో చేరవచ్చానని అడిగాను. వాళ్లు “కుదరదు” అని సూటిగా చెప్పారు. కానీ పాఠశాలకు వెళ్లాలని అప్పటికే నిర్ణయించుకున్నాను కాబట్టి నేను బాధపడలేదు. నిజానికి ఆ ఉద్యోగంలో చేరనందుకు చాలా సంతోషిస్తున్నాను.పైన్ బ్లఫ్‌లో మాకు ఎదురైన అనుభవాల గురించి గ్లోరియా ఏమనుకుంటుందో చూడండి: “నాకు ఆ ప్రాంతం చాలా బాగా నచ్చింది. నాకు 15 నుండి 20 స్టడీలు దొరికాయి. మేం ఉదయం పూట ఇంటింటి పరిచర్యకు వెళ్లేవాళ్లం, ఆ తర్వాత నుండి స్టడీలకు వెళ్లేవాళ్లం. కొన్నిసార్లు ఇంటికి తిరిగొచ్చేసరికి రాత్రి 11 అయ్యేది. ప్రీచింగ్ చాలా సరదాగా ఉండేది. అక్కడే ఉండుంటే బాగుండేది. నిజం చెప్పాలంటే, నియామకాన్ని మార్చుకుని ప్రాంతీయ సేవలోకి వెళ్లడానికి నేను ఇష్టపడలేదు. కానీ మా విషయంలో యెహోవాకు వేరే ఆలోచన ఉంది.” ఆయన దాని ప్రకారం చేశాడు కూడా.
ప్రయాణ సేవలో జీవితం
పైన్ బ్లఫ్‌లో పయినీర్లుగా సేవచేస్తున్నప్పుడు ప్రత్యేక పయినీరు సేవకోసం దరఖాస్తు పెట్టుకున్నాం. మా దరఖాస్తును ఖచ్చితంగా స్వీకరిస్తారని అనుకున్నాం. ఎందుకంటే టెక్సాస్‌లోని ఒక సంఘానికి సహాయం చేయడానికి మమ్మల్ని ప్రత్యేక పయినీర్లుగా పంపించాలని మా జిల్లా పర్యవేక్షకుడు అనుకున్నాడు. ఆ ఆలోచన మాకు నచ్చింది. జవాబు ఎప్పుడు వస్తుందోనని ప్రతీరోజు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశాం, కానీ మా లెటర్ బాక్సు ఎప్పుడూ ఖాళీగా కనిపించేది. చివరికి ఒకరోజు ఉత్తరం వచ్చింది. మమ్మల్ని ప్రయాణ సేవకు నియమిస్తున్నట్లు ఆ ఉత్తరంలో ఉంది. ఇదంతా 1965 జనవరిలో జరిగింది. లియన్ వీవర్ అనే సహోదరుణ్ణి కూడా అప్పుడే ప్రాంతీయ పర్యవేక్షకునిగా నియమించారు. ఆయన ప్రస్తుతం యునైటడ్ స్టేట్స్ బ్రాంచి కమిటీ సమన్వయకర్తగా సేవచేస్తున్నాడు.
ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవచేయడానికి భయమేసింది. ఇదంతా జరగడానికి దాదాపు ఒక సంవత్సరం ముందు, మా జిల్లా పర్యవేక్షకుడు జేమ్స్ ఎ. థామ్సన్ జూనియర్ నా అర్హతల్ని పరిశీలించాడు. మంచి ప్రాంతీయ పర్యవేక్షకునికి ఉండాల్సిన నైపుణ్యాల్ని ప్రస్తావిస్తూ నేను ఏయే విషయాల్లో మెరుగవ్వాలో దయతో వివరించారు. ఆయనిచ్చిన సలహా ఎంత విలువైనదో ప్రాంతీయ సేవ మొదలుపెట్టిన వెంటనే గ్రహించాను. ప్రాంతీయ సేవను మొదలుపెట్టిన తర్వాత నేను మొదట కలిసి పనిచేసింది సహోదరుడు థామ్సన్‌తోనే. నమ్మకమైన ఆ సహోదరుని నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.
ఆ కాలంలో ప్రాంతీయ పర్యవేక్షకునికి ఎక్కువ శిక్షణ ఇచ్చేవాళ్లు కాదు. ఒక ప్రాంతీయ పర్యవేక్షకుడు ఒక సంఘాన్ని సందర్శిస్తుండగా నేను గమనించాను; తర్వాతి సంఘాన్ని నేను సందర్శిస్తుండగా ఆయన నన్ను గమనించాడు. తర్వాత ఆయన నాకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడు. అది అయ్యాక ఇక సొంతగా సంఘాల్ని సందర్శించడానికి పంపించారు. “అప్పుడే మనం సొంతగా సంఘాల్ని సందర్శించగలమా?” అని నేను గ్లోరియాతో అనడం నాకిప్పటికీ గుర్తు. కాలం గడిచేకొద్దీ నేనొక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తించాను. మనకు
సహాయం చేయగల మంచి సహోదరులు ఎప్పుడూ ఉంటారు. కాకపోతే సహాయం చేసే అవకాశాన్ని మనం వాళ్లకివ్వాలి. నాకు సహాయం చేసిన అలాంటి సహోదరుల్లో కొంతమంది ఎవరంటే, సహోదరుడు జె.ఆర్. బ్రౌన్. ఆయన కూడా ప్రయాణ పర్యవేక్షకునిగా సేవచేశాడు. తర్వాత ఫ్రెడ్ రస్క్, ఆయన బెతెల్ కుటుంబ సభ్యుడు. వాళ్లిచ్చిన సహాయాన్ని ఇప్పటికీ విలువైనదిగా చూస్తాను.అప్పట్లో జాతి వివక్ష ఎక్కువగా ఉండేది. ఒకసారి మేం టెన్నెసీలోని ఒక సంఘాన్ని సందర్శిస్తున్నప్పుడు KKK సంస్థ వాళ్లు ఒక ర్యాలీ నిర్వహించారు. మరోసారి, ప్రీచింగ్ చేస్తూ విరామం కోసం రెస్టారెంట్ దగ్గర కాసేపు ఆగాం. నేను బాత్‌రూమ్ లోపలికి వెళ్లాను, అప్పుడొక వ్యక్తి నన్ను వెంబడించాడు. చూడడానికి చాలా కోపిష్ఠిలా ఉన్నాడు, పైగా తెల్లజాతీయులే గొప్ప అని చూపించే టాటూలు వేసుకున్నాడు. ఇంతలో, ఆ వ్యక్తి కన్నా ఎత్తుగా ఉన్న ఒక తెల్లజాతి సహోదరుడు వచ్చి, “అంతా ఓకేనా బ్రదర్ హెర్డ్?” అని అడిగాడు. అది చూసి ఆ వ్యక్తి బాత్‌రూమ్ ఉపయోగించుకోకుండానే వెళ్లిపోయాడు. ఇన్ని సంవత్సరాల్లో నేనొక విషయం గ్రహించాను. అదేంటంటే, జాతి వివక్ష అనేది ప్రజల రంగు వల్ల కాదు, మనందరిలో ఉన్న పాపం వల్లే పుట్టుకొచ్చింది. అంతేకాదు రంగు ఏదైనా సహోదరులు ఎప్పుడూ సహోదరులే, అవసరమైతే మనకోసం ప్రాణాలు కూడా ఇస్తారు.
ఆధ్యాత్మికంగా ధనవంతుణ్ణి
నేను 12 ఏళ్లు ప్రాంతీయ పర్యవేక్షకునిగా, 21 ఏళ్లు జిల్లా పర్యవేక్షకునిగా సేవచేశాను. ప్రయోజనకరమైన, ప్రోత్సాహకరమైన ఎన్నో అనుభవాలు మేం రుచిచూశాం. అవే కాకుండా మరో బహుమానాన్ని కూడా అందుకున్నాం. ఎన్నో ఏళ్లుగా మేం కన్న ఒక కల 1997 ఆగస్టు నెలలో నిజమైంది. అమెరికాలోని బెతెల్‌లో పనిచేసే అవకాశం మాకు దొరికింది! ఆ విధంగా, బెతెల్‌కు దరఖాస్తు పెట్టుకున్న 38 ఏళ్లకు మాకు ఆహ్వానం వచ్చింది. సెప్టెంబరు నెల నుండి బెతెల్ సేవ ప్రారంభించాం. అయితే నన్ను కేవలం కొన్ని రోజులు పనిచేయడం కోసమే పిలిచారని అనుకున్నాను. కానీ జరిగింది అది కాదు.
నా మొదటి నియామకం సేవా విభాగంలో వచ్చింది. అక్కడ ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆ విభాగంలో పనిచేసే సహోదరులను దేశవ్యాప్తంగా ఉన్న సంఘపెద్దల సభలు, ప్రాంతీయ పర్యవేక్షకులు ఎన్నో కష్టమైన ప్రశ్నలు అడుగుతుంటారు. వాటికి చాలా జాగ్రత్తగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. నాకు శిక్షణ ఇస్తున్నప్పుడు ఆ విభాగంలోని సహోదరులు చూపించిన ఓపికకు, చేసిన సహాయానికి నేను ఎంతో కృతజ్ఞుణ్ణి. ఒకవేళ నన్ను మళ్లీ ఆ విభాగానికి నియమించినా సరే, నేను ఆ సహోదరుల నుండి నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా ఎన్నో ఉంటాయి.
బెతెల్ జీవితమంటే నాకూ, గ్లోరియాకు చాలా ఇష్టం. మాకు మామూలుగానే ఉదయం త్వరగా లేవడమంటే ఇష్టం, ఆ అలవాటు బెతెల్‌లో ఉన్నప్పుడు ఉపయోగపడింది. దాదాపు సంవత్సరం తర్వాత నుండి, యెహోవాసాక్షుల పరిపాలక సభలోని సేవా కమిటీకి సహాయకునిగా సేవచేయడం ప్రారంభించాను. తర్వాత 1999లో పరిపాలక సభ సభ్యునిగా నియమించబడ్డాను. ఈ నియామకంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా, క్రైస్తవ సంఘానికి శిరస్సు ఒక మనిషి కాదుగానీ, యేసుక్రీస్తు అని నేర్చుకున్నాను.
కొన్నిసార్లు నా జీవితం గురించి ఆలోచిస్తే, నేను ఆమోసు ప్రవక్త లాంటివాణ్ణి అనిపిస్తుంది. ఆమోసు ప్రవక్త ఒక సాధారణ పశువుల కాపరి, పేదవాళ్లు మాత్రమే తినే అత్తి పండ్లకు గాట్లుపెట్టే వ్యక్తి. కానీ యెహోవా ఆ వినయస్థుడిని గమనించి, ప్రవక్తగా నియమించి, ఆ నియామకంలో చక్కని ఫలితాలు సాధించేలా సహాయం చేశాడు. (ఆమో. 7:14, 15) అదే విధంగా, నేను ఇండియానాలోని లిబర్టీలో ఉండే ఒక పేద రైతు కొడుకును. కానీ యెహోవా నన్ను గుర్తించాడు. పైగా ఆయన నాకు ఎన్ని దీవెనలు ఇచ్చాడంటే, వాటన్నిటినీ చెప్పడానికి సమయం కూడా చాలదు. (సామె. 10:22) నేను పేదవాడిగా పుట్టాను, కానీ ఆధ్యాత్మికంగా ఊహించిన దానికన్నా గొప్ప ధనవంతుణ్ణి అయ్యాను!
a ప్రజలు వింత బట్టలు వేసుకుని ఈ పండుగ జరుపుకుంటారు.