కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనమెందుకు “ఎక్కువగా ఫలిస్తూ” ఉండాలి?

మనమెందుకు “ఎక్కువగా ఫలిస్తూ” ఉండాలి?

“మీరు ఎక్కువగా ఫలిస్తూ, నా శిష్యులని నిరూపించుకుంటూ ఉంటే నా తండ్రికి మహిమ వస్తుంది.”యోహా. 15:8.

పాటలు: 53, 60

1, 2. (ఎ) యేసు చనిపోవడానికి ముందురోజు రాత్రి తన శిష్యులతో ఏయే విషయాలు మాట్లాడాడు? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) నేడు మనం ప్రకటనా పనిని కొనసాగిస్తూ ఉండడానికి గల కారణాల్ని తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? (సి) ఈ ఆర్టికల్‌లో ఏమి చర్చిస్తాం?

చనిపోవడానికి ముందురోజు రాత్రి యేసు తన అపొస్తలులతో చాలాసేపు మాట్లాడాడు. వాళ్లపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో తెలియజేశాడు. మనం ముందటి ఆర్టికల్‌లో చర్చించుకున్న ద్రాక్షచెట్టు ఉదాహరణను కూడా వాళ్లకు చెప్పాడు. ఎందుకంటే, వాళ్లు “ఎక్కువగా ఫలిస్తూ” ఉండాలని, అంటే రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించడంలో కొనసాగుతూ ఉండాలని యేసు వాళ్లను ప్రోత్సహించాలనుకున్నాడు.—యోహా. 15:8.

2 అయితే ఆయన కేవలం వాళ్లు ఏమి చేయాలో చెప్పి ఊరుకోలేదు గానీ దాన్ని ఎందుకు చేయాలో వివరించాడు. ప్రకటనా పనిని కొనసాగిస్తూ ఉండడానికి గల కారణాల్ని వాళ్లకు చెప్పాడు. నేడు మనం కూడా ప్రకటనా పనిని ఎందుకు కొనసాగిస్తూ ఉండాలో తెలుసుకోవడం ప్రాముఖ్యం. ఎందుకంటే, ఆ కారణాల గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల “అన్ని దేశాల ప్రజలకు” ప్రకటించాలనే ప్రోత్సాహం మనలో కలుగుతుంది. (మత్త. 24:13, 14) ఈ ఆర్టికల్‌లో, మనం ప్రకటనా పనిని చేయడానికి గల నాలుగు లేఖనాధారిత కారణాల్ని చర్చిస్తాం. అంతేకాదు ఆ పనిలో కొనసాగుతూ ఉండడానికి యెహోవా మనకిచ్చిన నాలుగు వరాలు ఏమిటో కూడా తెలుసుకుంటాం.

మనం యెహోవాను మహిమపరుస్తాం

3. (ఎ) యోహాను 15:8 ప్రకారం మనం ప్రకటించడానికి గల అతిప్రాముఖ్యమైన కారణమేమిటి? (బి) యేసు ఉదాహరణలోని ద్రాక్షపండ్లు దేన్ని సూచిస్తున్నాయి? ఆ పోలిక ఎందుకు సరైనది?

3 మనం ప్రకటించడానికి గల అతిప్రాముఖ్యమైన కారణమేమిటంటే, మనం యెహోవాను మహిమపర్చాలనుకుంటాం, ఆయన పేరును పవిత్రపర్చాలని కోరుకుంటాం. (యోహాను 15:1, 8 చదవండి.) ద్రాక్షచెట్టు ఉదాహరణలో, యెహోవాను ద్రాక్షపండ్లు పండించే వ్యవసాయదారునితో యేసు పోల్చాడు. అంతేకాదు ఆ ఉదాహరణలోని ద్రాక్షచెట్టు తానేనని, ఆ చెట్టు కొమ్మలు తన అనుచరులని యేసు చెప్పాడు. (యోహా. 15:5) కాబట్టి ద్రాక్షపండ్లు యేసు శిష్యులు ఫలించేవాటిని, అంటే వాళ్లు చేసే ప్రకటనా పనిని సూచిస్తున్నాయని చెప్పవచ్చు. యేసు తన అపొస్తలులతో ఇలా చెప్పాడు, ‘మీరు ఎక్కువగా ఫలిస్తూ ఉంటే నా తండ్రికి మహిమ వస్తుంది.’ ద్రాక్షచెట్లు కాపు కాసి ద్రాక్షగెలలు వచ్చినప్పుడు దాని వ్యవసాయదారునికి మంచిపేరు వస్తుంది. అదేవిధంగా రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించడానికి శాయశక్తులా కృషిచేసినప్పుడు యెహోవాకు మహిమను, ఘనతను తెస్తాం.—మత్త. 25:20-23.

4. (ఎ) మనం దేవుని పేరును ఏవిధంగా పవిత్రపరుస్తాం? (బి) దేవుని పేరును పవిత్రపర్చే గొప్ప అవకాశం మీకు దొరికినందుకు ఎలా భావిస్తున్నారు?

4 దేవుని పేరు పూర్తిస్థాయిలో పవిత్రమైనది. దాన్ని మరింత పవిత్రపర్చడానికి మనం చేయగలిగింది ఏమీ లేదు. మరి మన ప్రకటనా పని దేవుని పేరును ఏవిధంగా పవిత్రపరుస్తుంది? యెషయా ప్రవక్త ఏమి చెప్పాడో గమనించండి: ‘సైన్యాలకు అధిపతైన యెహోవానే పవిత్రుడిగా ఎంచాలి.’ (యెష. 8:13, NW) కాబట్టి దేవుని పేరైన యెహోవాను మిగతా పేర్లన్నిటి కన్నా గొప్పదిగా ఎంచడం ద్వారా, దాని పవిత్రతను అర్థంచేసుకునేలా ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఆ పేరును పవిత్రపరుస్తాం. (మత్త. 6:9, అధస్సూచి) ఉదాహరణకు, యెహోవా దేవుని అద్భుతమైన లక్షణాల గురించి, మనుషులు పరదైసులో శాశ్వతకాలం జీవించి ఉండాలనే ఆయన సంకల్పం గురించి ఇతరులకు చెప్పినప్పుడు సాతాను చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని వాళ్లకు తెలిసేలా చేస్తాం. (ఆది. 3:1-5) “మహిమ, ఘనత, శక్తి పొందడానికి” యెహోవాయే అర్హుడని తెలుసుకునేందుకు ఇతరులకు సహాయం చేసినప్పుడు కూడా మనం దేవుని పేరును పవిత్రపరుస్తాం. (ప్రక. 4:11) 16 ఏళ్లుగా పయినీరు సేవ చేస్తున్న రూన అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు, “ఈ విశ్వాన్ని సృష్టించిన వ్యక్తి గురించి సాక్ష్యమిచ్చే అవకాశం దొరికినందుకు నేను చాలా కృతజ్ఞుణ్ణి. ఆ కృతజ్ఞతా భావమే ప్రకటనా పని చేస్తూ ఉండాలనే కోరికను నాలో కలిగిస్తుంది.”

యెహోవాను, ఆయన కుమారుణ్ణి ప్రేమిస్తాం

5. (ఎ) యోహాను 15:9, 10 వచనాల ప్రకారం ప్రకటించడానికి గల రెండవ ముఖ్యమైన కారణమేమిటి? (బి) ఓర్పు అనే లక్షణం ఎంత అవసరమో గుర్తించడానికి తన శిష్యులకు యేసు ఎలా సహాయం చేశాడు?

5 యోహాను 15:9, 10 చదవండి. మనం ప్రకటించడానికి గల రెండవ ముఖ్యమైన కారణమేమిటంటే, యెహోవాను, యేసును ప్రేమిస్తాం. (మార్కు 12:30; యోహా. 14:15) యేసు తన శిష్యులకు, “నా ప్రేమ పొందేవాళ్లుగా ఉండండి” అని చెప్పాడు. ఎందుకలా చెప్పాడు? ఎందుకంటే నిజక్రైస్తవులుగా జీవిస్తూ ఉండడానికి తన శిష్యులకు ఓర్పు అవసరమని ఆయనకు తెలుసు. నిజానికి యోహాను 15:4-10 వచనాలు గమనిస్తే, “ఉండండి” లేదా “ఉంటే” వంటి మాటల్ని పదేపదే చెప్పడం ద్వారా ఓర్పు అనే లక్షణం ఎంత అవసరమో తన శిష్యులు గుర్తించడానికి యేసు సహాయం చేశాడు.

6. క్రీస్తు ప్రేమను పొందాలని కోరుకుంటున్నట్లు మనం ఎలా చూపించవచ్చు?

6 క్రీస్తు ప్రేమను, అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నట్లు మనమెలా చూపిస్తాం? ఆయనకు విధేయులుగా ఉండడం ద్వారా చూపిస్తాం. ఆయన స్వయంగా చేసినవాటినే మనల్ని కూడా చేయమని యేసు చెప్తున్నాడు. ఆయనిలా అన్నాడు, ‘నేను తండ్రి ఆజ్ఞలు పాటిస్తూ ఎప్పుడూ ఆయన ప్రేమ పొందే వ్యక్తిగా ఉన్నాను.’ అవును, యేసు మనకు ఆదర్శాన్ని ఉంచాడు.—యోహా. 13:15.

7. విధేయత, ప్రేమ ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయి?

7 విధేయత ప్రేమతో ముడిపడి ఉందని యేసు అన్న ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి, “నా ఆజ్ఞల్ని స్వీకరించి, వాటిని పాటించే వ్యక్తే నన్ను ప్రేమించే వ్యక్తి.” (యోహా. 14:21) యేసు ఇచ్చే ఆజ్ఞలకు మూలం ఆయన తండ్రి. కాబట్టి ప్రకటించమనే యేసు ఆజ్ఞను మనం పాటిస్తే యెహోవాను ప్రేమిస్తున్నామని చూపిస్తున్నట్లే. (మత్త. 17:5; యోహా. 8:28) ఎప్పుడైతే యెహోవాను, యేసును ప్రేమిస్తున్నామని చూపిస్తామో వాళ్లు కూడా మన పట్ల ప్రేమ చూపిస్తారు.

ప్రజల్ని హెచ్చరిస్తాం

8, 9. (ఎ) మనం ప్రకటించడానికి గల మూడో కారణమేమిటి? (బి) యెహెజ్కేలు 3:18,19; 18:23 వచనాలు మనం ప్రకటనా పనిలో కొనసాగుతూ ఉండేలా ఎలా ప్రోత్సహిస్తున్నాయి?

8 మనం ప్రకటించడానికి గల మూడో కారణమేమిటంటే, రాబోతున్న యెహోవా దినం గురించి ఇతరుల్ని హెచ్చరించాలని కోరుకుంటాం. బైబిలు నోవహును ప్రకటనా పని చేసిన వ్యక్తిగా వర్ణించింది. (2 పేతురు 2:5 చదవండి.) జలప్రళయానికి ముందు నోవహు ప్రకటించిన సందేశంలో రాబోతున్న నాశనం గురించిన హెచ్చరిక కూడా ఉండివుంటుంది. దేన్నిబట్టి అలా చెప్పవచ్చు? ఎందుకంటే యేసు ఇలా అన్నాడు, “జలప్రళయానికి ముందున్న కాలంలో ప్రజలు తింటూ, తాగుతూ, పెళ్లిళ్లు చేసుకుంటూ ఉన్నారు; నోవహు ఓడలోకి వెళ్లే రోజు వరకు వాళ్లు అలాగే చేశారు. జలప్రళయం వచ్చి వాళ్లందర్నీ కొట్టుకొనిపోయే వరకు వాళ్లు ఏమీ పట్టించుకోలేదు. మానవ కుమారుడి ప్రత్యక్షత కూడా అలాగే ఉంటుంది.” (మత్త. 24:38, 39) చాలామంది నోవహును పట్టించుకోకపోయినా, ఆయన మాత్రం యెహోవా చెప్పిన హెచ్చరికను నమ్మకంగా ప్రకటించాడు.

9 అదేవిధంగా మనుషుల విషయంలో యెహోవాకున్న సంకల్పం గురించి ప్రజలందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేడు మనం రాజ్యసందేశాన్ని ప్రకటిస్తాం. ప్రజలందరూ ఆ సందేశాన్ని విని, శాశ్వత జీవితాన్ని సొంతం చేసుకోవాలని యెహోవా కోరుకుంటున్నట్లే మనం కూడా కోరుకుంటాం. (యెహె. 18:23) అంతేకాదు దేవుని రాజ్యం వస్తుందని, అది ఈ చెడ్డ లోకాన్ని నాశనం చేస్తుందని ఇంటింటి పరిచర్య, అలాగే బహిరంగ సాక్ష్యం ద్వారా వీలైనంత ఎక్కువమందిని హెచ్చరిస్తాం.—యెహె. 3:18, 19; దాని. 2:44; ప్రక. 14:6, 7

ప్రజల్ని ప్రేమిస్తాం

10. (ఎ) మత్తయి 22:39 ప్రకారం మనం ప్రకటించడానికి గల నాల్గవ కారణమేమిటి? (బి) ఫిలిప్పీలో పౌలు, సీలలు జైలు అధికారికి ఎలా సహాయం చేశారు?

10 మనం ప్రకటించడానికి గల నాల్గవ కారణమేమిటంటే, ప్రజల్ని ప్రేమిస్తాం. (మత్త. 22:39) ఆ ప్రేమే మనం ప్రకటనా పనిలో కొనసాగడానికి సహాయం చేస్తుంది. నిజానికి ప్రజల పరిస్థితులు మారినప్పుడు వాళ్ల ఆలోచనా తీరు కూడా మారే అవకాశం ఉంటుందని మనకు తెలుసు. ఉదాహరణకు, ఫిలిప్పీ నగరంలోని వ్యతిరేకులు పౌలు, సీలలను పట్టుకుని జైళ్లో వేశారు. కానీ ఆ అర్థరాత్రి పెద్ద భూకంపం వచ్చి జైలు తలుపులు తెరుచుకున్నాయి. ఖైదీలంతా పారిపోయారనుకున్న జైలు అధికారి ఆత్మహత్య చేసుకోబోయాడు. అతన్ని చూసిన పౌలు, “అలా చేయకు” అని గట్టిగా అరిచాడు. అప్పుడు ఆ అధికారి, “రక్షణ పొందాలంటే నేనేం చేయాలి?” అని అడిగాడు. ‘ప్రభువైన యేసు మీద విశ్వాసముంచు. అప్పుడు నువ్వు రక్షణ పొందుతావు’ అని పౌలు, సీలలు అతనితో చెప్పారు.—అపొ. 16:25-34.

మనకు యెహోవాపై, యేసుపై, ప్రజలపై ప్రేమ ఉంది కాబట్టే ప్రకటిస్తాం (5, 10 పేరాలు చూడండి)

11, 12. (ఎ) జైలు అధికారి గురించిన అనుభవం ప్రకటనా పని గురించి మనకేమి నేర్పిస్తుంది? (బి) ప్రకటనా పనిని కొనసాగించాలని మనమెందుకు కోరుకుంటాం?

11 జైలు అధికారి గురించిన అనుభవం ప్రకటనా పని గురించి మనకేమి నేర్పిస్తుంది? భూకంపం వచ్చిన తర్వాతే ఆ అధికారి ఆలోచనా తీరును మార్చుకుని, సహాయం కోసం అడిగాడని గమనించండి. అదేవిధంగా, బైబిలు సందేశాన్ని వినడానికి ఇష్టపడని ప్రజల జీవితాల్లో ఏదైనా విషాద సంఘటన జరిగినప్పుడు వాళ్ల ఆలోచనా తీరు మారి సహాయం కోసం ఎదురుచూసే అవకాశం ఉంది. కొంతమంది ఉద్యోగం పోవడం వల్లగానీ, విడాకులు తీసుకోవడం వల్లగానీ ఆందోళన పడుతుండవచ్చు. ఇంకొంతమంది తీవ్రమైన అనారోగ్యం వల్లగానీ, ఇష్టమైనవాళ్లు చనిపోవడం వల్లగానీ బాధలో కూరుకుపోయి ఉండవచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు ప్రజలు జీవితానికి సంబంధించి ఒకప్పుడు ఆలోచించని ప్రశ్నల్ని ఇప్పుడు అడిగే అవకాశం ఉంటుంది. ‘రక్షణ పొందాలంటే మేమేం చేయాలి?’ అని వాళ్లు ఆలోచిస్తుండవచ్చు. మనం చెప్పే నిరీక్షణా సందేశాన్ని వినాలనే కోరిక జీవితంలో మొదటిసారి వాళ్లలో కలుగవచ్చు.

12 కాబట్టి ప్రజలు వినడానికి, మనం ఇచ్చే సేదదీర్పును స్వీకరించడానికి సుముఖంగా ఉన్నప్పుడు వాళ్లకు సహాయం చేయగలగాలంటే మనం ప్రకటనా పనిని నమ్మకంగా కొనసాగిస్తూ ఉండాలి. (యెష. 61:1) 38 ఏళ్లుగా పయినీరు సేవచేస్తున్న చార్లెట్‌ అనే సహోదరి ఇలా చెప్తుంది, “ఈ కాలంలోని ప్రజలు నిరాశలో ఉన్నారు. వాళ్లకు మంచివార్త వినే అవకాశాన్ని ఇవ్వాలి.” 34 ఏళ్లుగా పయినీరు సేవచేస్తున్న ఏవర్‌ అనే మరో సహోదరి ఇలా చెప్పింది, “ఇంతకుముందుకన్నా ఇప్పుడే చాలామంది మానసికంగా కృంగిపోతున్నారు. నాకు వాళ్లకు సహాయం చేయాలనుంది. అందుకే ప్రకటనా పనిని కొనసాగిస్తున్నాను.” వీటన్నిటిని బట్టి, ప్రకటనా పనిలో కొనసాగడానికి ప్రజలపట్ల ఉన్న ప్రేమ ఒక అద్భుతమైన కారణమని చెప్పవచ్చు.

ఓర్పుగా కొనసాగడానికి సహాయం చేసే వరాలు

13, 14. (ఎ) యోహాను 15:11 లో ఏ వరం గురించి ఉంది? (బి) యేసుకున్న సంతోషాన్ని మనమెలా పొందగలం? (సి) ప్రకటనా పనిని కొనసాగించడానికి సంతోషం ఎలా సహాయం చేస్తుంది?

13 చనిపోవడానికి ముందురోజు రాత్రి యేసు అపొస్తలులతో మాట్లాడుతూ, వాళ్లు ఫలిస్తూ ఉండడానికి సహాయం చేసే వరాల గురించి ప్రస్తావించాడు. ఆ వరాలు ఏమిటి? అవి నేడు మనకెలా సహాయం చేస్తాయి?

14 సంతోషం అనే వరం. ప్రకటనా పని మనకు భారమా? అస్సలు కాదు. యేసుక్రీస్తు ద్రాక్షచెట్టు గురించిన ఉదాహరణ చెప్పిన తర్వాత, ప్రకటనా పని చేస్తే ఆయనకున్న సంతోషాన్ని మనం పొందుతామని అన్నాడు. (యోహాను 15:11 చదవండి.) అదెలా సాధ్యం? ఆ ఉదాహరణలోని ద్రాక్షచెట్టు యేసని, కొమ్మలు ఆయన శిష్యులని మనం తెలుసుకున్నాం. కొమ్మలు చెట్టును అంటిపెట్టుకుని ఉంటేనే వాటికి కావాల్సిన నీళ్లు, పోషణ అందుతాయి. అదేవిధంగా, మనం యేసును అంటిపెట్టుకుని ఆయన అడుగుజాడల్లో నడిస్తేనే ఆయనలా సంతోషంగా ఉండగలుగుతాం. అంతేకాదు దేవుని ఇష్టం నెరవేర్చడం వల్ల కలిగే సంతోషాన్ని పొందుతాం. (యోహా. 4:34; 17:13; 1 పేతు. 2:21) 40 కన్నా ఎక్కువ ఏళ్లుగా పయినీరు సేవ చేస్తున్న హాన అనే సహోదరి ఇలా చెప్పింది, “ప్రీచింగ్‌కి వెళ్లి వచ్చిన ప్రతీసారి నేను అనుభవించే సంతోషమే యెహోవా సేవలో కొనసాగడానికి నాకు సహాయం చేస్తుంది.” అవును, మనం చెప్పే సందేశాన్ని ఎక్కువమంది వినకపోయినా ప్రకటనా పనిని కొనసాగించడానికి కావాల్సిన బలాన్ని ఆ సంతోషమే ఇస్తుంది.—మత్త. 5:10-12.

15. (ఎ) యోహాను 14:27 లో ఏ వరం గురించి ఉంది? (బి) ప్రకటించడంలో కొనసాగడానికి యేసు ఇచ్చిన శాంతి ఎలా సహాయం చేయగలదు?

15 శాంతి అనే వరం. (యోహాను 14:27 చదవండి.) తాను చనిపోవడానికి ముందురోజు సాయంత్రం యేసు తన అపొస్తలులతో ఇలా చెప్పాడు, “నా శాంతినే మీకు ఇస్తున్నాను.” ప్రకటించడంలో కొనసాగడానికి యేసు ఇచ్చిన శాంతి ఎలా సహాయం చేయగలదు? ప్రకటనా పనిని కొనసాగించడం ద్వారా యెహోవాను, యేసును సంతోషపెడుతున్నామని తెలుసుకున్నప్పుడు మనశ్శాంతిగా అనిపిస్తుంది. (కీర్త. 149:4; రోమా. 5:3, 4; కొలొ. 3:15) 45 ఏళ్లుగా పయినీరు సేవ చేస్తున్న ఉల్ఫ్‌ అనే సహోదరుడు ఇలా చెప్పాడు, “ప్రీచింగ్‌ చేశాక అలసిపోతుంటాను. కానీ ఆ పనే నిజమైన సంతృప్తిని, జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తోంది.” శాశ్వతకాలం ఉండే శాంతిని పొందినందుకు మనమెంత కృతజ్ఞులమో కదా!

16. (ఎ) యోహాను 15:15 లో ఏ వరం గురించి ఉంది? (బి) ఎప్పటికీ యేసుకు స్నేహితులుగా ఉండాలంటే అపొస్తలులు ఏమి చేయాలి?

16 స్నేహం అనే వరం. అపొస్తలులు సంతోషంగా ఉండాలనేదే తన కోరికని చెప్పాక, నిస్వార్థమైన ప్రేమ చూపించడం ఎందుకు ప్రాముఖ్యమో యేసు వాళ్లకు వివరించాడు. (యోహా. 15:11-13) ఆ తర్వాత ఆయనిలా అన్నాడు, “నేను మిమ్మల్ని స్నేహితులని పిలిచాను.” యేసుకు స్నేహితులుగా ఉండడం ఎంత అమూల్యమైన వరమో కదా! కానీ ఆ స్నేహాన్ని కాపాడుకోవాలంటే అపొస్తలులు ఏమి చేయాలి? యేసు ఇలా వివరించాడు, ‘మీరు ఫలిస్తూ ఉండండి.’ (యోహాను 15:14-16 చదవండి.) మరో మాటలో చెప్పాలంటే, ప్రకటనా పనిని కొనసాగిస్తూ ఉండమని యేసు చెప్పాడు. అది చెప్పడానికి సుమారు రెండేళ్ల ముందు యేసు తన అపొస్తలులతో ఇలా అన్నాడు, “‘పరలోక రాజ్యం దగ్గరపడింది’ అని ప్రకటించండి.” (మత్త. 10:7) అందుకే ఆ ప్రకటనా పనిలో ఓర్పుతో కొనసాగమని చనిపోవడానికి ముందురోజు రాత్రి ఆయన తన శిష్యుల్ని ప్రోత్సహించాడు. (మత్త. 24:13; మార్కు 3:14) అయితే అదంత తేలిక కాదని యేసుకు తెలుసు. కానీ వాళ్లు దాన్ని చేయగలరు, ఎప్పటికీ ఆయనకు స్నేహితులుగా ఉండగలరు. ఎలా? ఆయనిచ్చిన మరో వరం వాళ్లకు సహాయం చేస్తుంది.

17, 18. (ఎ) యోహాను 15:7 లో ఏ వరం గురించి ఉంది? (బి) యేసు శిష్యులకు ఆ వరం ఎలా సహాయపడింది? (సి) మనకు ఏ వరాలు సహాయపడతాయి?

17 ప్రార్థనలకు జవాబు అనే వరం. యేసు ఇలా చెప్పాడు, “మీకు ఇష్టమైనది ఏది అడిగినా దాన్ని పొందుతారు.” (యోహా. 15:7, 16) యేసు ఇచ్చిన ఆ మాట అపొస్తలులకు చాలా బలాన్ని ఇచ్చివుంటుంది. * ఆయన త్వరలో చనిపోతాడనే విషయం వాళ్లకు నిజంగా అర్థంకాలేదు. కానీ ఆయన మరణం అపొస్తలులను ఒంటరివాళ్లను చేయదు. ఎందుకంటే వాళ్ల ప్రార్థనలకు జవాబివ్వడానికి, ప్రకటనా పనిలో సహాయం చేయడానికి యెహోవా సిద్ధంగా ఉన్నాడు. యేసు చనిపోయిన కొన్నిరోజుల తర్వాత, తమకు ధైర్యాన్ని ఇవ్వమని అపొస్తలులు చేసుకున్న విన్నపానికి యెహోవా జవాబిచ్చాడు.—అపొ. 4:29, 31.

సహాయం కోసం మనం చేసే ప్రార్థనలకు యెహోవా ఖచ్చితంగా జవాబిస్తాడు (18వ పేరా చూడండి)

18 మన విషయంలో కూడా అంతే. మనం ప్రకటనా పనిలో ఓర్పుతో కొనసాగితే యేసుకు ఎల్లప్పుడూ స్నేహితులుగా ఉంటాం. అంతేకాదు ప్రకటించడం కష్టంగా అనిపించినప్పుడు సహాయం చేయమని చేసే ప్రార్థనలకు జవాబివ్వడానికి యెహోవా సిద్ధంగా ఉన్నాడనే నమ్మకంతో ఉండవచ్చు. (ఫిలి. 4:13) యెహోవా మన ప్రార్థనలకు జవాబిస్తున్నందుకు, యేసు మనకు స్నేహితునిగా ఉన్నందుకు ఎంత కృతజ్ఞులమో కదా! యెహోవా ఇచ్చిన ఈ వరాలు మనం ఎల్లప్పుడూ ఫలిస్తూ ఉండడానికి కావాల్సిన బలాన్నిస్తాయి.—యాకో. 1:17.

19. (ఎ) మనం ప్రకటనా పనిలో ఎందుకు కొనసాగుతాం? (బి) దేవుడిచ్చిన పనిని పూర్తిచేయడానికి మనకేమి సహాయం చేస్తాయి?

19 ఈ ఆర్టికల్‌లో మనం ప్రకటించడానికి గల నాలుగు కారణాలేమిటో చూశాం. అవి: యెహోవాను మహిమపర్చి ఆయన పేరును పవిత్రపర్చడం; యెహోవాపై, యేసుపై ప్రేమ చూపించడం; ప్రజల్ని హెచ్చరించడం; ప్రజలపై ప్రేమ చూపించడం. యెహోవా మనకిచ్చిన నాలుగు వరాలేమిటో కూడా తెలుసుకున్నాం. అవి: సంతోషం, శాంతి, స్నేహం, ప్రార్థనలకు జవాబు. యెహోవా మనకిచ్చిన పనిని పూర్తి చేయడానికి ఆ వరాలు సహాయం చేస్తాయి. “ఎక్కువగా ఫలిస్తూ” ఉండడానికి మనం చేసే కృషిని చూసి యెహోవా చాలా సంతోషిస్తాడు.

^ పేరా 17 యెహోవా వాళ్ల ప్రార్థనలకు జవాబిస్తాడని యేసు తన అపొస్తలులతో మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు గుర్తుచేశాడు.—యోహా. 14:13; 15:7, 16; 16:23.