కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యౌవనులారా—అపవాదిని ఎదిరించి స్థిరంగా నిలబడండి

యౌవనులారా—అపవాదిని ఎదిరించి స్థిరంగా నిలబడండి

“మీరు అపవాది పన్నాగాలకు పడిపోకుండా స్థిరంగా నిలబడగలిగేలా దేవుడు ఇచ్చే సంపూర్ణ యుద్ధ కవచాన్ని తొడుక్కోండి.”ఎఫె. 6:11.

పాటలు: 79, 140

1, 2. (ఎ) యౌవన క్రైస్తవులు సాతానుతో, చెడ్డదూతలతో చేస్తున్న పోరాటంలో ఎలా గెలుస్తున్నారు? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) మనమేమి చర్చిస్తాం?

అపొస్తలుడైన పౌలు క్రైస్తవుల్ని యుద్ధంలో పోరాడుతున్న సైనికులతో పోల్చాడు. మనం చేస్తున్న యుద్ధం ఆధ్యాత్మికమైనది కావచ్చు, కానీ మన శత్రువులు మాత్రం నిజమైన వ్యక్తులు. అయితే వాళ్లు మనుషులు కాదుగానీ సాతాను, అతని చెడ్డదూతలు. వాళ్లు యుద్ధం చేయడంలో ఎంతో అనుభవం, నైపుణ్యం ఉన్న యోధులు. అలాంటివాళ్లతో మనం పోరాడి గెలవడం అసాధ్యమని అనిపించవచ్చు. ఒకవేళ మనం యౌవనులమైతే, వాళ్లతో తలపడడం మనవల్ల కానిపని అనిపించవచ్చు. కానీ వాస్తవమేమిటంటే, యౌవనులు ఆ శక్తివంతమైన శత్రువులతో పోరాడి గెలవగలరు. ఇప్పటికే గెలుస్తున్నారు కూడా. ఎందుకంటే యెహోవా వాళ్లకు శక్తినిస్తున్నాడు. అంతేకాదు వాళ్లు “దేవుడు ఇచ్చే సంపూర్ణ యుద్ధ కవచాన్ని” తొడుక్కొని మంచి శిక్షణ పొందిన సైనికుల్లా యుద్ధానికి సిద్ధపడుతున్నారు.—ఎఫెసీయులు 6:10-12 చదవండి.

2 ఈ ఉదాహరణ చెప్తున్నప్పుడు, పౌలు మనసులో రోమా సైనికులు తొడుక్కునే కవచం ఉండివుంటుంది. (అపొ. 28:16) ఈ ఆర్టికల్‌లో ఆ అద్భుతమైన ఉదాహరణను పరిశీలిస్తాం. అంతేకాదు ఆధ్యాత్మిక కవచంలోని ప్రతీదాన్ని ధరించడంలో ఉన్న సవాళ్ల గురించి, ప్రయోజనాల గురించి కొంతమంది యౌవనస్థులు ఏమంటున్నారో కూడా తెలుసుకుంటాం.

మీరు సంపూర్ణ యుద్ధ కవచాన్ని తొడుక్కున్నారా?

“సత్యం అనే నడికట్టు”

3, 4. దేవుని వాక్యంలోని సత్యాల్ని రోమా సైనికుల నడికట్టుతో ఎందుకు పోల్చవచ్చు?

3 ఎఫెసీయులు 6:14 చదవండి. రోమా సైనికుడు కట్టుకునే నడికట్టుకు లోహంతో చేసిన పలకలు ఉండేవి. అవి సైనికుని నడుముకు రక్షణగా ఉండేవి, అతను వేసుకునే రొమ్ము-కవచం బరువును ఆపడానికి సహాయపడేవి. కొన్ని రకాల నడికట్టుకు ఖడ్గాన్ని, చిన్న కత్తిని పెట్టుకునేందుకు వీలుగా బలమైన కొక్కేలు కూడా ఉండేవి. ఇలాంటి నడికట్టును బిగుతుగా కట్టుకున్న తర్వాత సైనికులు ధైర్యంగా యుద్ధభూమిలో అడుగుపెట్టేవాళ్లు.

4 ఆ నడికట్టులాగే, దేవుని వాక్యం నుండి మనం నేర్చుకునే సత్యాలు మనల్ని అబద్ధ బోధల నుండి రక్షిస్తాయి. (యోహా. 8:31, 32; 1 యోహా. 4:1) ఆ సత్యాల్ని ప్రేమించే కొద్దీ మన “రొమ్ము-కవచాన్ని” తొడుక్కోవడం అంటే దేవుని ప్రమాణాలకు తగ్గట్లు జీవించడం మనకు మరింత తేలికౌతుంది. (కీర్త. 111:7, 8; 1 యోహా. 5:3) అంతేకాదు ఆ సత్యాల్ని ఎంత బాగా అర్థంచేసుకుంటే, మనల్ని వ్యతిరేకించేవాళ్ల ముందు వాటిని అంత ధైర్యంగా సమర్థించగలుగుతాం.—1 పేతు. 3:15.

5. మనం ఎల్లప్పుడూ ఎందుకు నిజమే మాట్లాడాలి?

5 బైబిల్లోని సత్యాల్ని మనం చాలా ప్రాముఖ్యంగా ఎంచుతాం కాబట్టి వాటిని పాటిస్తాం, ఎల్లప్పుడూ నిజమే మాట్లాడతాం. సాతాను విజయం సాధించడానికి ఉపయోగించిన శక్తివంతమైన ఆయుధాల్లో అబద్ధాలు కూడా ఒకటి. అబద్ధాలు చెప్పే వ్యక్తితోపాటు, వాటిని నమ్మే వ్యక్తి కూడా చెడు పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. (యోహా. 8:44) కాబట్టి మనం అపరిపూర్ణులమైనా, అబద్ధాలాడకుండా ఉండడానికి శాయశక్తులా కృషిచేస్తాం. (ఎఫె. 4:25) దానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. 18 ఏళ్ల అబీగయీల్‌ అనే అమ్మాయి ఇలా చెప్పింది, “నిజం చెప్పడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడాల్సివస్తుంది. మరిముఖ్యంగా, అబద్ధమాడితే బయటపడడం తేలికనిపించే సందర్భాల్లో నిజం చెప్పడం చాలా కష్టం.” అయినాసరే ఆ అమ్మాయి ఎందుకు ఎప్పుడూ నిజాలే చెప్తుంది? అబీగయీల్‌ ఇంకా ఇలా చెప్పింది, “నిజం చెప్పిన ప్రతీసారి నేను యెహోవా దగ్గర మంచి మనస్సాక్షితో ఉండగలుగుతాను. మా అమ్మానాన్నలకు, స్నేహితులకు కూడా నాపై నమ్మకం కలుగుతుంది.” 23 ఏళ్ల విక్టోరియా ఇలా చెప్పింది, “నిజం మాట్లాడి, మీ నమ్మకాలను సమర్థించినప్పుడు ఇతరులు మిమ్మల్ని వేధించవచ్చు. కానీ నిజం చెప్పడం వల్ల ఎల్లప్పుడూ అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, యెహోవాకు మరింత దగ్గరౌతారు, మీకిష్టమైన వాళ్ల గౌరవాన్ని సంపాదించుకుంటారు.” వీటినిబట్టి, ఎల్లప్పుడూ “సత్యం అనే నడికట్టు” తొడుక్కోవడం ఎందుకు ప్రాముఖ్యమో మీరు అర్థంచేసుకున్నారా?

సత్యం అనే నడికట్టు (3-5 పేరాలు చూడండి)

“నీతి అనే రొమ్ము-కవచం”

6, 7. నీతి ప్రమాణాల్ని రొమ్ము-కవచంతో ఎందుకు పోల్చవచ్చు?

6 రోమా సైనికుడు తొడుక్కునే రొమ్ము-కవచం, ఛాతి భాగాన్ని కప్పివుంచే విధంగా ఇనుప పలకలతో తయారు చేయబడి ఉంటుంది. ఆ ఇనుప పలకల్ని లోహపు కొక్కేల సాయంతో తోలు ముక్కలకు బిగించేవాళ్లు. భుజాల భాగంలో ఎక్కువ ఇనుప పలకల్ని అమర్చేవాళ్లు, వాటిని కూడా తోలు ముక్కల సాయంతోనే బిగించేవాళ్లు. రొమ్ము-కవచం సైనికుని కదలికల్ని నియంత్రిస్తుంది కాబట్టి ఆ ఇనుప పలకలు సరైన స్థానంలో ఉన్నాయో లేదో అతను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాల్సి వచ్చేది. కానీ ఆ కవచం పదునైన ఖడ్గాల నుండి లేదా బాణాల నుండి సైనికుని గుండెకు, ఇతర అవయవాలకు రక్షణనిచ్చేది.

7 ఆ రొమ్ము-కవచంలాగే, యెహోవా దేవుని నీతి ప్రమాణాలు కూడా మన సూచనార్థక హృదయాన్ని కాపాడతాయి. (సామె. 4:23) ఏ సైనికుడూ తన ఇనుప రొమ్ము-కవచాన్ని వదిలేసి, బలహీనమైన లోహంతో చేసిన కవచాన్ని తొడుక్కోడు. అదేవిధంగా మంచిచెడుల విషయంలో యెహోవా ఏర్పాటు చేసిన నీతి ప్రమాణాలకు బదులు మన సొంత ప్రమాణాల్ని పాటించాలని ఎన్నడూ కోరుకోం. మన హృదయాన్ని కాపాడుకునేంత జ్ఞానం మనకు లేదు. (సామె. 3:5, 6) కాబట్టి మన “రొమ్ము-కవచం” హృదయాన్ని కాపాడే విధంగా ఉందో లేదో ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి.

8. యెహోవా ప్రమాణాలకు తగ్గట్లు జీవించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

8 యెహోవా ప్రమాణాలు మీ స్వేచ్ఛను హరిస్తున్నాయని లేదా నచ్చింది చేయనివ్వకుండా అడ్డుపడుతున్నాయని ఎప్పుడైనా అనిపించిందా? 21 ఏళ్ల డానియెల్‌ ఇలా చెప్పాడు, “బైబిలు ప్రమాణాలకు తగ్గట్లు జీవిస్తున్నందుకు టీచర్లు, తోటి విద్యార్థులు కొన్నిసార్లు నన్ను ఎగతాళి చేశారు. దానివల్ల కొంతకాలంపాటు నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి కృంగిపోయాను.” కానీ ఇప్పుడు అతను ఎలా భావిస్తున్నాడు? డానియెల్‌ ఇలా చెప్తున్నాడు, “యెహోవా ప్రమాణాలకు తగ్గట్లు జీవించడం వల్ల వచ్చే ప్రయోజనాలేమిటో కొంతకాలానికి గ్రహించగలిగాను. నా ‘స్నేహితుల్లో’ కొంతమంది డ్రగ్స్‌కు అలవాటుపడ్డారు, ఇంకొంతమంది స్కూల్‌కి రావడం మానేశారు. వాళ్ల జీవితం ఎలా తయారైందో చూసినప్పుడు బాధనిపించింది. నిజంగా యెహోవా మనల్ని కాపాడుతున్నాడు.” 15 ఏళ్ల మాడిసన్‌ ఇలా చెప్తుంది, “నా స్నేహితులు సరదా కోసం చేసేవాటికి నేను దూరంగా ఉంటూ యెహోవా ప్రమాణాలకు కట్టుబడి ఉండడం చాలా కష్టంగా అనిపిస్తుంది.” మరి ఆ అమ్మాయి ఏమి చేసింది? “కానీ అది సాతాను తీసుకొచ్చే శోధనని, నేను యెహోవా పేరు ధరించానని గుర్తుచేసుకుంటాను. ఆ శోధనను విజయవంతంగా ఎదిరించాక గర్వంగా అనిపిస్తుంది.”

నీతి అనే రొమ్ము-కవచం (6-8 పేరాలు చూడండి)

“సంసిద్ధత అనే చెప్పులు”

9-11. (ఎ) క్రైస్తవులు వేసుకునే సూచనార్థకమైన చెప్పులు ఏమిటి? (బి) మంచివార్త ప్రకటించడాన్ని మరింత ఆనందించాలంటే మనమేమి చేయాలి?

9 ఎఫెసీయులు 6:15 చదవండి. రోమా సైనికులు చెప్పులు లేకుండా యుద్ధానికి వెళ్లలేరు. సైనికుల చెప్పులను మూడు పొరల తోలుతో తయారుచేసేవాళ్లు, అవి చాలా బలంగా ఉండేవి. అంతేకాదు త్వరగా పాడయ్యేవి కావు, జారకుండా నడవడానికి సౌకర్యంగా కూడా ఉండేవి.

10 రోమా సైనికులు వేసుకునే చెప్పులు వాళ్లు యుద్ధంలో గెలవడానికి సహాయపడినట్లే, మనం వేసుకునే సూచనార్థకమైన చెప్పులు “శాంతికరమైన మంచివార్తను” ప్రకటించడానికి సహాయపడతాయి. (యెష. 52:7; రోమా. 10:15) అయినాసరే, ప్రకటించడానికి కొన్నిసార్లు ధైర్యం అవసరమౌతుంది. 20 ఏళ్ల బో అనే యువకుడు ఇలా చెప్తున్నాడు, “తోటి విద్యార్థులకు ప్రకటించడానికి నాకు భయమేసేది. ఇబ్బందిగా అనిపించడం వల్ల భయమేసేది అనుకుంట. ఇప్పుడు ఆ రోజుల్ని తలుచుకుంటే, నా భయానికి అర్థంలేదనిపిస్తుంది. ఇప్పుడైతే నా వయసువాళ్లకు సంతోషంగా మంచివార్త ప్రకటిస్తున్నాను.”

11 ముందే సిద్ధపడడం వల్ల ప్రకటనా పనిని మరింత ఆనందించవచ్చని చాలామంది యౌవనులు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. మరి ఎలా సిద్ధపడాలి? 16 ఏళ్ల జూలియా ఇలా చెప్పింది, “నా స్కూల్‌ బ్యాగ్‌లో పత్రికలు పెట్టుకుంటాను. తోటి విద్యార్థులు తమ అభిప్రాయాల్ని, నమ్మకాల్ని చెప్తున్నప్పుడు వింటాను. దానివల్ల వాళ్లకు ఏ విషయం చెప్తే బాగుంటుందో ఆలోచించగలుగుతాను. ఈ విధంగా ముందే సిద్ధపడినప్పుడు వాళ్లకు ఉపయోగపడే వాటిగురించి చక్కగా మాట్లాడగలుగుతాను.” 23 ఏళ్ల మెకెన్జీ ఇలా చెప్పింది, “మీకు దయతోపాటు, వినే అలవాటు ఉంటే తోటి వయసువాళ్ల సమస్యలేమిటో అర్థంచేసుకోగలుగుతారు. నేనైతే యౌవనుల కోసం సంస్థ తయారుచేసిన సమాచారం అంతటినీ చదువుతుంటాను. అప్పుడు బైబిల్లో గానీ, jw.org వెబ్‌సైట్‌లో గానీ వాళ్లకు సహాయపడే సమాచారాన్ని చూపించగలుగుతాను.” ప్రకటించడానికి చక్కగా సిద్ధపడడం అనేది, మీకు సరిగ్గా సరిపోయే ‘చెప్పులను’ వేసుకోవడం లాంటిది.

సంసిద్ధత అనే చెప్పులు (9-11 పేరాలు చూడండి)

“విశ్వాసం అనే పెద్ద డాలు”

12, 13. సాతాను ఎలాంటి ‘అగ్ని బాణాల్ని’ విసురుతాడు?

12 ఎఫెసీయులు 6:16 చదవండి. రోమా సైనికుడు దీర్ఘచతురస్రాకారంలో ఉండే పెద్ద డాలును తీసుకెళ్లేవాడు. అది అతని భుజాల నుండి మోకాళ్ల వరకు కప్పేది. ఖడ్గాలు, ఈటెలు, బాణాలు శరీరానికి తగలకుండా అది అతనికి రక్షణనిచ్చేది.

13 సాతాను మీపై ఎలాంటి ‘అగ్ని బాణాల్ని’ విసురుతాడు? బహుశా అవి యెహోవా గురించిన అబద్ధాలు కావచ్చు. యెహోవాకు మీపై ప్రేమ లేదనీ, ఎవ్వరికీ మీరంటే పట్టింపు లేదని మీరు అనుకోవాలనేది సాతాను కోరిక. 19 ఏళ్ల ఈడ అనే యువతి ఇలా చెప్తుంది, “యెహోవా నా నుంచి దూరంగా ఉంటున్నాడని, నాతో స్నేహం చేయడం ఆయనకు ఇష్టం లేదని చాలాసార్లు అనిపించేది.” అలా అనిపించినప్పుడు ఆమె ఏమి చేసేది? ఈడ ఇలా చెప్పింది, “మీటింగ్స్‌ నా విశ్వాసాన్ని చాలా బలపర్చేవి. ఇంతకుముందు మీటింగ్‌కి వచ్చి, నా వ్యాఖ్యానాల్ని ఎవ్వరు పట్టించుకుంటారులే అని ఆలోచిస్తూ నోరు మెదపకుండా కూర్చునేదాన్ని. కానీ ఇప్పుడు మీటింగ్స్‌కి సిద్ధపడి వస్తాను, కనీసం రెండు మూడు వ్యాఖ్యానాలు చేయడానికి ప్రయత్నిస్తాను. అది కష్టమైన పనేగానీ, దాన్ని చేసినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సహోదరసహోదరీలు నన్ను చాలా ప్రోత్సహిస్తారు. మీటింగ్‌ నుండి తిరిగొచ్చే ప్రతీసారి యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడనే నమ్మకంతో ఉంటాను.”

14. ఈడా అనుభవం మనకేమి నేర్పిస్తుంది?

14 ఈడా అనుభవం మనకొక ప్రాముఖ్యమైన సత్యాన్ని నేర్పిస్తుంది. అదేమిటంటే: సైనికులు వాడే డాలు ఎప్పుడూ ఒకే పరిమాణంలో ఉంటుంది. కానీ విశ్వాసమనే మన డాలు మాత్రం పెరగగలదు, తగ్గగలదు. దాన్ని ఎలా ఉంచుకోవాలనేది మన చేతుల్లోనే ఉంది. (మత్త. 14:31; 2 థెస్స. 1:3) ‘విశ్వాసం అనే డాలు’ మనకు రక్షణగా ఉండాలంటే దాన్ని పెద్దదిగా, బలమైనదిగా చేసుకుంటూ ఉండాలి.

విశ్వాసం అనే పెద్ద డాలు (12-14 పేరాలు చూడండి)

“రక్షణ అనే శిరస్త్రాణం”

15, 16. రక్షణ నిరీక్షణ శిరస్త్రాణం వంటిదని ఎందుకు చెప్పవచ్చు?

15 ఎఫెసీయులు 6:17 చదవండి. రోమా సైనికులు తమ తలకు, మెడకు, ముఖానికి రక్షణగా ఉండేందుకు శిరస్త్రాణాన్ని పెట్టుకునేవాళ్లు. అయితే దాన్ని చేత్తో పట్టుకుని తీసుకెళ్లేందుకు వీలుగా కొన్నిటికి పిడి కూడా ఉండేది.

16 శిరస్త్రాణం సైనికుని మెదడుకు రక్షణగా ఉన్నట్లే, “రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణం” మన ఆలోచనలకు కాపుదలగా ఉంటుంది. (1 థెస్స. 5:8; సామె. 3:21) మన సమస్యల వల్ల నిరుత్సాహపడకుండా, దేవుని వాగ్దానాలపై మనసు నిలపడానికి నిరీక్షణ సహాయం చేస్తుంది. (కీర్త. 27:1, 14; అపొ. 24:15) కానీ మనం రక్షణ పొందాలంటే ఆ నిరీక్షణను వాస్తవమైనదిగా చూడాలి. అంటే ఆ ‘శిరస్త్రాణాన్ని’ తలకు పెట్టుకోవాలిగానీ చేత్తో పట్టుకుని ఉండకూడదు.

17, 18. (ఎ) శిరస్త్రాణాన్ని తీసేయాలనే కోరికను సాతాను మనలో ఏ విధంగా కలిగించగలడు? (బి) మనం సాతాను మాయలో పడలేదని ఎలా చూపించవచ్చు?

17 ఆ శిరస్త్రాణాన్ని తీసేయాలనే కోరికను కలిగించడానికి సాతాను మనల్ని ఏ విధంగా మోసం చేయగలడు? సాతాను యేసుతో వ్యవహరించిన తీరు గురించి ఒకసారి ఆలోచించండి. యేసు మానవజాతికి పరిపాలకుడు అవుతాడని సాతానుకు తెలుసు. కానీ దానికన్నా ముందు ఆయన బాధలు అనుభవించి చనిపోవాలి. ఆ తర్వాత యేసును రాజుగా చేయడానికి యెహోవా నిర్ణయించిన సమయం దాకా వేచిచూడాలి. కాబట్టి అడ్డదారిలో రాజయ్యే మార్గాన్ని సాతాను చూపించాడు. ఒక్కసారి తనను ఆరాధిస్తే చాలు వెంటనే ప్రపంచానికి రాజుగా చేస్తానని సాతాను యేసుకు మాటిచ్చాడు. (లూకా 4:5-7) అదేవిధంగా యెహోవా మనకు కొత్తలోకంలో ఇస్తానని చెప్పిన అద్భుతమైన విషయాలేమిటో కూడా సాతానుకు తెలుసు. కానీ ఆ వాగ్దానాలు నిజమవ్వాలంటే మనం కొంతకాలం ఆగాలి, ఈలోపు ఎన్నో సమస్యల్ని కూడా ఎదుర్కోవాలి. కాబట్టి సౌకర్యవంతమైన జీవితాన్ని ఇప్పుడే ఆనందించే మార్గాన్ని సాతాను మనకు చూపిస్తున్నాడు. మనం సొంత సౌకర్యాలకు మొదటిస్థానం ఇచ్చి, దేవుని రాజ్యానికి రెండవ స్థానం ఇవ్వాలని సాతాను కోరుకుంటున్నాడు.—మత్త. 6:31-33.

18 కానీ చాలామంది యౌవనులు సాతాను మాయలో పడలేదు. ఉదాహరణకు 20 ఏళ్ల కీయాన అనే యువతి ఇలా చెప్పింది, “దేవుని రాజ్యమే మన సమస్యలన్నిటికీ పరిష్కారమని నాకు తెలుసు.” ఆ నిరీక్షణ ఆమె ఆలోచనలపై, జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించింది? ఈ లోకంలో ఉన్నవన్నీ తాత్కాలికమని గుర్తుంచుకోవడానికి అది ఆమెకు సహాయం చేసింది. ఈ లోకంలో మంచి జీవితాన్ని గడిపేందుకు కష్టపడే బదులు తన సమయాన్ని, శక్తిని యెహోవా కోసం ఉపయోగిస్తోంది.

రక్షణ అనే శిరస్త్రాణం (15-18 పేరాలు చూడండి)

“పవిత్రశక్తి ద్వారా ఇవ్వబడిన దేవుని వాక్యం అనే ఖడ్గం”

19, 20. దేవుని వాక్యాన్ని మరింత నైపుణ్యవంతంగా ఉపయోగించడం మనమెలా నేర్చుకోవచ్చు?

19 రోమా సైనికులు ఉపయోగించే ఖడ్గాలు 50 సెంటీమీటర్ల పొడవు ఉండేవి. దాన్ని ఉపయోగించే విషయంలో ప్రతీరోజు సాధన చేసేవాళ్లు కాబట్టి ఆ సైనికులు తమ ఖడ్గాన్ని చాలా నైపుణ్యవంతంగా వాడేవాళ్లు.

20 దేవుని వాక్యం ఖడ్గం లాంటిదని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. ఆ ఖడ్గాన్ని యెహోవా మనకిచ్చాడు. కానీ దాని సహాయంతో మన నమ్మకాల్ని సమర్థించాలన్నా, మన ఆలోచనల్ని సరిచేసుకోవాలన్నా దాన్ని నైపుణ్యవంతంగా వాడడం నేర్చుకోవాలి. (2 కొరిం. 10:4, 5; 2 తిమో. 2:15) దేవుని వాక్యాన్ని నైపుణ్యవంతంగా ఉపయోగించడం ఎలా నేర్చుకోవచ్చు? 21 ఏళ్ల సెబాస్టియన్‌ అనే యువకుడు ఇలా చెప్పాడు, “బైబిలు చదువుతున్నప్పుడు ప్రతీ అధ్యాయం నుండి ఒక లేఖనాన్ని పుస్తకంలో రాసుకుంటాను. ఆ విధంగా నాకు నచ్చిన లేఖనాల లిస్టును తయారు చేసుకుంటున్నాను.” యెహోవా ఆలోచనా విధానాన్ని మరింత బాగా అర్థంచేసుకోవడానికి అది సెబాస్టియన్‌కు సహాయం చేస్తుంది. డానియెల్‌ ఇలా చెప్పాడు, “నేను బైబిలు చదివేటప్పుడు, పరిచర్యలో కలిసే ప్రజలకు ఉపయోగపడే లేఖనాల్ని కనుగొనడానికి ప్రయత్నిస్తుంటాను. మీకు బైబిలుపై ఆసక్తి ఉందని, దాన్ని ఇతరులకు అర్థమయ్యేలా వివరించడానికి కృషిచేస్తున్నారని ప్రజలు గమనించినప్పుడు చక్కగా స్పందిస్తారని అనుభవంతో తెలుసుకున్నాను.”

దేవుని వాక్యం అనే ఖడ్గం (19-20 పేరాలు చూడండి)

21. సాతానుకు, చెడ్డదూతలకు మనం ఎందుకు భయపడాల్సిన అవసరంలేదు?

21 మనం సాతానుకు, చెడ్డదూతలకు భయపడాల్సిన అవసరం లేదని ఈ ఆర్టికల్‌లోని యౌవనుల అనుభవాలు నేర్పిస్తున్నాయి. నిజమే సాతాను, చెడ్డదూతలు శక్తివంతమైనవాళ్లు. కానీ యెహోవా వాళ్లకన్నా శక్తిమంతుడు. పైగా వాళ్లు త్వరలో నాశనమౌతారు. వెయ్యేళ్ల పరిపాలనా కాలంలో మనుషులకు హాని తలపెట్టకుండా యేసు వాళ్లను బంధిస్తాడు, ఆ తర్వాత నాశనం చేస్తాడు. (ప్రక. 20:1-3, 7-10) మన శత్రువు ఎలాంటివాడో, అతని పన్నాగాలేమిటో, లక్ష్యమేమిటో మనకు ఇప్పుడు తెలుసు. యెహోవా సహాయంతో మనం అపవాదిని ఎదిరించి స్థిరంగా నిలబడగలం!