కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 22

మీ అధ్యయన అలవాట్లను మెరుగుపర్చుకోండి!

మీ అధ్యయన అలవాట్లను మెరుగుపర్చుకోండి!

‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోండి.’—ఫిలి. 1:10.

పాట 35 ‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోండి’

ఈ ఆర్టికల్‌లో . . . *

1. కొంతమందికి అధ్యయనం చేయడం ఎందుకు కష్టంగా ఉంటుంది?

ఈరోజుల్లో, బ్రతకడానికి కావాల్సిన డబ్బు సంపాదించడం కోసం ఎంతో కష్టపడాలి. మన సహోదరుల్లో చాలామంది, తమ కుటుంబ కనీస అవసరాలు తీర్చడానికి ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తోంది. ఇంకా చాలామంది, తమ ఉద్యోగానికి వెళ్లి రావడానికి రోజూ ఎన్నో గంటలు ప్రయాణిస్తున్నారు. ఎక్కువమంది శారీరక శ్రమ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రాత్రి అయ్యేసరికి, కష్టపడి పనిచేస్తున్న ఈ సహోదరసహోదరీలు బాగా అలసిపోతున్నారు! ఇక అధ్యయనం చేయడానికి ఓపిక ఎక్కడ ఉంటుంది!

2. మీరు ఏ సమయంలో అధ్యయనం చేస్తారు?

2 అయితే, నిజానికి మనం దేవుని వాక్యాన్ని, మన క్రైస్తవ ప్రచురణల్ని అధ్యయనం చేయడానికి ఖచ్చితంగా సమయం కేటాయించాలి. ఎందుకంటే, యెహోవాతో మన సంబంధం అలాగే మన శాశ్వత జీవితం దానిమీదే అధారపడి ఉన్నాయి! (1 తిమో. 4:15, 16) కొంతమంది ప్రతీరోజు ఉదయాన్నే లేచి అధ్యయనం చేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో ఇల్లు నిశ్శబ్దంగా ఉంటుంది అలాగే నిద్రలేచాక వాళ్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొందరు రాత్రిపూట ప్రశాంతంగా ఉండే సమయంలో కొన్ని నిమిషాలు వెచ్చించి బైబిల్ని, మన ప్రచురణల్ని చదివి ధ్యానిస్తారు.

3-4. మనకు వచ్చే సమాచారం విషయంలో పరిపాలక సభ ఏ మార్పు చేసింది? ఎందుకు?

3 అధ్యయనం కోసం సమయం కేటాయించడం ప్రాముఖ్యమని బహుశా మీరు ఒప్పుకుంటారు. కానీ దేన్ని అధ్యయనం చేయాలి? ‘చదవడానికి చాలా సమాచారం ఉంది, అదంతా చదవడం నాకు కష్టం’ అని మీరు అనవచ్చు. కొంతమంది బైబిలు ఆధారిత ప్రచురణలన్నిటినీ చదవగలుగుతున్నారు, వీడియోలన్నీ చూడగలుగుతున్నారు. కానీ ఎక్కువమందికి మాత్రం వాటికోసం సమయం కేటాయించడం కష్టంగా ఉంది. ఈ విషయం పరిపాలక సభకు తెలుసు. అందుకే, ముద్రిత రూపంలో అలాగే ఎలక్ట్రానిక్‌ రూపంలో మనకు వచ్చే సమాచారాన్ని తగ్గించాలని పరిపాలక సభ ఈ మధ్యకాలంలో నిర్ణయించింది.

4 ఉదాహరణకు, యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం ఇప్పుడు ప్రచురించబడట్లేదు. ఎందుకంటే jw.org® వెబ్‌సైట్‌లో అలాగే ప్రతీనెల JW బ్రాడ్‌కాస్టింగ్‌లో ప్రోత్సాహకరమైన ఎన్నో అనుభవాలు వస్తున్నాయి. ప్రస్తుతం కావలికోట సార్వజనిక ప్రతి అలాగే తేజరిల్లు! సంవత్సరానికి మూడుసార్లు మాత్రమే ప్రచురించబడుతున్నాయి. అయితే, మనం వేరే పనులు చేసుకోవడానికి ఎక్కువ సమయం దొరకాలనే ఉద్దేశంతో పరిపాలక సభ ఈ మార్పులు చేయలేదు. బదులుగా, “ఎక్కువ ప్రాముఖ్యమైన” పనుల మీద మనం మనసుపెట్టడానికే ఈ మార్పులు చేసింది. (ఫిలి. 1:10) ఇంతకీ ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో మనం ఎలా నిర్ణయించుకోవచ్చు? వ్యక్తిగత బైబిలు అధ్యయనం నుండి మనం పూర్తి ప్రయోజనాన్ని ఎలా పొందవచ్చు? వీటిగురించి ఇప్పుడు చర్చించుకుందాం.

ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో నిర్ణయించుకోండి

5-6. మనం ఏయే ప్రచురణల్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి?

5 మనం మొదటిగా దేన్ని అధ్యయనం చేయాలి? మనం ప్రతీరోజు ఖచ్చితంగా బైబిల్ని అధ్యయనం చేయడం కోసం సమయం కేటాయించాలి. వారం మధ్యలో జరిగే మీటింగ్‌ కోసం మనం చదవాల్సిన బైబిలు అధ్యాయాల సంఖ్యను సంస్థ తగ్గించింది. ఎందుకంటే దానివల్ల మనం చదివే లేఖనాల్ని ధ్యానించడానికి, మరింత సమాచారం కోసం మన ప్రచురణల్లో పరిశోధన చేయడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. ఆ వారం కోసం నియమించిన అధ్యాయాల్ని కేవలం పూర్తి చేయడం మన లక్ష్యమై ఉండకూడదు. బదులుగా అవి మన హృదయాల్ని తాకి, మనల్ని యెహోవాకు ఇంకా దగ్గర చేయాలి.—కీర్త. 19:14.

6 మనం వేటిని కూడా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి? మనం కావలికోట అధ్యయనం కోసం, వారం మధ్యలో జరిగే సంఘ బైబిలు అధ్యయనం కోసం, అలాగే ఆ మీటింగ్‌లోని ఇతర భాగాల కోసం ఖచ్చితంగా సిద్ధపడాలి. మనం కావలికోట, తేజరిల్లు! పత్రికల ప్రతీ సంచికను కూడా చదవాలి.

7. మన వెబ్‌సైట్‌లో అలాగే JW బ్రాడ్‌కాస్టింగ్‌లో వచ్చే ప్రతీదాన్ని చదవలేకపోతే లేదా చూడలేకపోతే నిరుత్సాహపడాలా?

7 ‘సరే, మరి jw.org వెబ్‌సైట్‌లో వచ్చే ఆర్టికల్స్‌, వీడియోలు అలాగే JW బ్రాడ్‌కాస్టింగ్‌లో వచ్చే సమాచారం సంగతేంటి? వాటిలో చాలా సమాచారం ఉంది కదా!’ అని మీరు అనవచ్చు. ఉదాహరణకు, మీరు ఒక పెళ్లి విందుకు హాజరయ్యారనుకోండి. అక్కడ చాలా రకాల వంటకాలు ఉన్నాయి, మీరు వాటన్నిటినీ తినగలరా? లేదు కదా. మీరు వాటిలో కొన్నిటినే తినగలుగుతారు. అదేవిధంగా, ఎలక్ట్రానిక్‌ రూపంలో వస్తున్న ప్రతీదాన్ని మీరు చదవలేకపోతే లేదా చూడలేకపోతే నిరుత్సాహపడకండి. మీకు వీలైనన్ని చదవండి లేదా చూడండి. అయితే, అధ్యయనం చేయడం అంటే ఏంటో, దానినుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు చర్చిద్దాం.

అధ్యయనం చేయడానికి కృషి అవసరం!

8. కావలికోటను ఎలా అధ్యయనం చేయవచ్చు? అలా చేయడం వల్ల మీరు ఎలాంటి ప్రయోజనం పొందుతారు?

8 అధ్యయనం చేస్తున్నప్పుడు మీరు చదువుతున్న వాటిమీద మనసుపెడతారు, దానివల్ల ప్రాముఖ్యమైన పాఠాల్ని నేర్చుకుంటారు. అధ్యయనం చేయడం అంటే ఉన్న సమాచారాన్ని గబగబా చదివేసి, జవాబులను అండర్‌లైన్‌ చేసుకోవడం కాదు. ఉదాహరణకు కావలికోట అధ్యయనం కోసం సిద్ధపడుతున్నప్పుడు, ముందుగా ‘ఈ ఆర్టికల్‌లో . . . ’ అనేదాని కింద ఇచ్చిన సమాచారాన్ని చదవండి. ఆ తర్వాత ఆర్టికల్‌ ముఖ్యాంశాన్ని, ఉపశీర్షికల్ని, పునఃసమీక్ష ప్రశ్నల్ని చదివి వాటిగురించి ఆలోచించండి. దాని తర్వాత, ఆర్టికల్‌ మొత్తాన్ని నిదానంగా, జాగ్రత్తగా చదవండి. అలా చదువుతున్నప్పుడు, పేరా దేనిగురించి చర్చిస్తుందో తెలియజేసే వాక్యం మీద మనసుపెట్టండి, అది సాధారణంగా ప్రతీ పేరా ప్రారంభంలోనే ఉంటుంది. పేరాలోని మొదటి వాక్యం తరచూ ఆ పేరాలో వివరించబడే విషయాన్ని తెలియజేస్తుంది. ఆర్టికల్‌ చదువుతున్నప్పుడు ప్రతీ పేరా ఉపశీర్షికలతో, ముఖ్యాంశంతో ఎలా ముడిపడి ఉందో ఆలోచించండి. మీకు తెలియని పదాల్ని, ఇంకా పరిశోధన చేయాలనుకునే విషయాల్ని రాసుకోండి.

9. (ఎ) మనం కావలికోటను అధ్యయనం చేస్తున్నప్పుడు లేఖనాల మీద ఎందుకు, ఎలా మనసుపెట్టాలి? (బి) యెహోషువ 1:8⁠లో చెప్తున్నట్లు, మనం లేఖనాల్ని చదవడంతో పాటు ఏం చేయాలి?

9 కావలికోట అధ్యయనం చేయడం ద్వారా మనం బైబిల్ని అర్థంచేసుకుంటాం. కాబట్టి లేఖనాలపై మీరు మనసుపెట్టండి, ముఖ్యంగా సంఘంలో ఆర్టికల్‌ని చర్చించేటప్పుడు చదవబోయే లేఖనాలమీద మనసుపెట్టండి. ఆ లేఖనాల్లో ఉన్న ఏ పదాలు లేదా పదబంధాలు, పేరాలోని ముఖ్య విషయాన్ని తెలియజేస్తున్నాయో ప్రత్యేకంగా గమనించండి. దాంతోపాటు, సమయం తీసుకొని మీరు చదివిన లేఖనాల గురించి, వాటిని మీ జీవితంలో ఎలా పాటించవచ్చు అనే దానిగురించి ధ్యానించండి.—యెహోషువ 1:8 చదవండి.

తల్లిదండ్రులారా, అధ్యయనం ఎలా చేయాలో మీ పిల్లలకు నేర్పించండి (10వ పేరా చూడండి) *

10. హెబ్రీయులు 5:14 ప్రకారం, తల్లిదండ్రులు సమయం తీసుకొని తమ పిల్లలకు అధ్యయనం ఎలా చేయాలో, పరిశోధన ఎలా చేయాలో ఎందుకు నేర్పించాలి?

10 ప్రతీవారం జరిగే కుటుంబ ఆరాధనను పిల్లలు ఆనందించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కుటుంబ ఆరాధనలో ఏం చర్చించాలో తల్లిదండ్రులు ముందే ప్రణాళిక వేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ, తాము ప్రతీవారం ప్రత్యేకమైన లేదా ఆహ్లాదకరమైన కార్యక్రమాల్ని ఏర్పాటు చేయాల్సిందేనని అనుకోవాల్సిన అవసరం లేదు. కుటుంబ ఆరాధనలో భాగంగా, JW బ్రాడ్‌కాస్టింగ్‌లో ప్రతీనెల వచ్చే కార్యక్రమాల్ని చూడవచ్చు లేదా అప్పుడప్పుడు నోవహు ఓడ నమూనాను తయారుచేయడం లాంటి ప్రత్యేక ప్రాజెక్టును చేయవచ్చు, అయితే అధ్యయనం ఎలా చేయాలో పిల్లలకు నేర్పించడం కూడా ప్రాముఖ్యం. ఉదాహరణకు, మీటింగ్స్‌ కోసం ఎలా సిద్ధపడాలో లేదా స్కూల్లో ఎదురైన ఒక సమస్య గురించి ఎలా పరిశోధన చేయాలో వాళ్లకు నేర్పించాలి. (హెబ్రీయులు 5:14 చదవండి.) పిల్లలు ఇంట్లో సమయం తీసుకొని బైబిలు సంబంధిత అంశాల మీద అధ్యయనం చేస్తే, మీటింగ్స్‌లో అలాగే సమావేశాల్లో చెప్పే విషయాల్ని శ్రద్ధగా వినగలుగుతారు. ఎందుకంటే, అలాంటి మీటింగ్స్‌లో ప్రతీసారి వీడియోలు ఉండకపోవచ్చు. తల్లిదండ్రులు పిల్లలతో ఎంతసేపు అధ్యయనం చేయాలి అనేది పిల్లల వయసు, వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది.

11. మన బైబిలు విద్యార్థులకు సొంతగా అర్థవంతంగా అధ్యయనం చేయడం ఎందుకు నేర్పించాలి?

11 మన బైబిలు విద్యార్థులు కూడా అధ్యయనం ఎలా చేయాలో నేర్చుకోవాలి. వాళ్లు కొత్తగా బైబిలు స్టడీ తీసుకుంటున్నప్పుడు, స్టడీ కోసం లేదా మీటింగ్స్‌ కోసం జవాబులు అండర్‌లైన్‌ చేసుకొని సిద్ధపడడం చూసి మనం సంతోషిస్తాం. కానీ ఎలా పరిశోధన చేయాలో, వాళ్లంతట వాళ్లే లోతుగా ఎలా అధ్యయనం చేయాలో మన బైబిలు విద్యార్థులకు నేర్పించాలి. అప్పుడు, ఏదైనా సమస్య వస్తే సహాయం కోసం వెంటనే సంఘంలోని సహోదరసహోదరీల దగ్గరకు వెళ్లే బదులు, మన ప్రచురణల్లో పరిశోధన చేయడం ద్వారా ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవచ్చో వాళ్లు తెలుసుకుంటారు.

ఒక లక్ష్యంతో అధ్యయనం చేయండి

12. అధ్యయనం చేస్తున్నప్పుడు మనకు ఏ లక్ష్యాలు ఉండాలి?

12 ఒకవేళ మీకు ఎక్కువసేపు చదవడం, అధ్యయనం చేయడం ఇష్టం లేకపోతే, మీరు ఎప్పటికీ అధ్యయనాన్ని ఆనందించలేరని అనుకోవాలా? లేదు! ముందుగా, కొంచెం సమయం అధ్యయనం చేయడం మొదలుపెట్టండి. తర్వాత మెల్లమెల్లగా అధ్యయన సమయాన్ని పెంచుకోండి. ఒక లక్ష్యం పెట్టుకోండి. నిజమే, యెహోవాకు దగ్గరౌతూ ఉండాలనేది మన అత్యంత ప్రాముఖ్యమైన లక్ష్యమై ఉండాలి. అయితే మనం త్వరగా చేరుకోగల లక్ష్యం ఏంటంటే, ఇతరులు అడిగిన ఏదైనా ప్రశ్నకు జవాబు చెప్పడం లేదా మనం ఎదుర్కొంటున్న ఏదైనా సమస్య గురించి పరిశోధన చేయడం.

13. (ఎ) తమ నమ్మకాల గురించి క్లాస్‌లో వాళ్లకు చెప్పడానికి పిల్లలు ఏం చేయవచ్చో వివరించండి. (బి) కొలొస్సయులు 4:6⁠లో ఉన్న సలహాను మీరెలా పాటించవచ్చు?

13 ఉదాహరణకు, మీరు స్కూల్‌కి వెళ్లే పిల్లలా? బహుశా మీ క్లాస్‌లో వాళ్లందరూ పుట్టిన రోజు జరుపుకుంటుండవచ్చు. వాళ్ల పుట్టిన రోజు వేడుకల్లో మీరు ఎందుకు భాగం వహించరో బైబిలు నుండి వివరించాలనుకోవచ్చు. కానీ దాన్ని ఎలా చెప్పాలో మీకు తెలియకపోవచ్చు. అప్పుడు దానిగురించి మీరు అధ్యయనం చేయండి! అలా చేస్తున్నప్పుడు మీరు ఈ రెండు లక్ష్యాలు పెట్టుకోవచ్చు: (1) పుట్టిన రోజు వేడుకలు దేవునికి ఇష్టం లేవనే మీ నమ్మకాన్ని బలపర్చుకోవడం, (2) సత్యాన్ని వివరించే మీ సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవడం. (మత్త. 14:6-11; 1 పేతు. 3:15) మీరు ఈ ప్రశ్న వేసుకోవచ్చు, ‘పుట్టినరోజు జరుపుకోవడానికి నా క్లాస్‌లో వాళ్లు చెప్పే కారణాలు ఏంటి?’ ఆ తర్వాత మన ప్రచురణల సహాయంతో జాగ్రత్తగా పరిశోధన చేయండి. మీ నమ్మకాల్ని వివరించడం మీరు అనుకున్నంత కష్టం కాకపోవచ్చు. ఎందుకంటే, అందరూ పుట్టినరోజులు జరుపుకుంటున్నారు కాబట్టే మేమూ జరుపుకుంటున్నామని చాలామంది చెప్తారు. మీరు ఒకట్రెండు వాస్తవాల్ని పరిశోధన చేసి తెలుసుకున్నా, నిజంగా ఆసక్తి ఉన్నవాళ్లకు సంతృప్తికరమైన జవాబు ఇవ్వగలుగుతారు.—కొలొస్సయులు 4:6 చదవండి.

నేర్చుకోవాలనే మీ కోరికను పెంచుకోండి

14-16. (ఎ) మీకు అంతగా తెలియని ఒక బైబిలు పుస్తకం గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ఏం చేయవచ్చు? (బి) ఆమోసు పుస్తకాన్ని బాగా అర్థంచేసుకోవడానికి పేరాలో ఇచ్చిన లేఖనాలు ఎలా ఉపయోగపడతాయో వివరించండి. (“ బైబిలు చదువుతున్నప్పుడు అందులోని వ్యక్తులు మీ కళ్లముందే ఉన్నట్లు ఊహించుకోండి!” అనే బాక్సు కూడా చూడండి.)

14 రాబోయే ఒక మీటింగ్‌లో, మీకు అంతగా తెలియని ఏదైనా ఒక చిన్న ప్రవచన పుస్తకాన్ని పరిశీలించబోతున్నారని అనుకోండి. మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే, ఆ పుస్తకంలో ఏం ఉందో ఎక్కువ తెలుసుకోవాలనే మీ కోరికను పెంచుకోవడం. దాన్నెలా చేయవచ్చు?

15 ముందుగా ఈ ప్రశ్నలు వేసుకోండి, ‘ఆ పుస్తకం రచయిత గురించి నాకు ఏం తెలుసు? ఆయన ఎవరు, ఎక్కడ జీవించాడు, ఏ పని చేసేవాడు?’ రచయిత నేపద్యం గురించి ఎక్కువ వివరాలు తెలుసుకుంటే, ఆయన ఫలానా పదాల్ని, ఉదాహరణల్ని ఎందుకు ఉపయోగించాడో అర్థమౌతుంది. మీరు బైబిల్లో ఆ పుస్తకం చదువుతున్నప్పుడు, అందులోని కొన్ని వాక్యాలు ఆ రచయిత వ్యక్తిత్వాన్ని ఎలా తెలియజేశాయో గమనించండి.

16 తర్వాత, ఆ పుస్తకం ఎప్పుడు రాయబడిందో తెలుసుకోవడం మీకు సహాయకరంగా ఉంటుంది. పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం చివర్లో ఉండే “బైబిలు పుస్తకాల పట్టిక” చూస్తే దాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. దాంతోపాటు, అనుబంధం A6లో ఉన్న ప్రవక్తలు, రాజులు గురించిన చార్టును సమీక్షించవచ్చు. ఒకవేళ మీరు చదువుతున్నది ప్రవచన పుస్తకం అయితే, ఆ పుస్తకాన్ని రాసే సమయంలో ప్రజల పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకోవడం మంచిది. ఆ ప్రవక్త ఏ చెడు ఆలోచనల్ని లేదా పనుల్ని సరిదిద్దాలని కోరుకున్నాడు? ఆయన సమకాలీనులు ఎవరు? అప్పటి పరిస్థితుల గురించి బాగా అర్థం చేసుకోవాలంటే, మీరు ఇతర బైబిలు పుస్తకాల్ని కూడా పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, ఆమోసు ప్రవక్త కాలంలో పరిస్థితులు ఎలా ఉండేవో బాగా అర్థంచేసుకోవడానికి, ఆమోసు 1:1 మార్జినల్‌ రెఫరెన్సుల్లో ఇచ్చిన 2వ రాజులు, 2వ దినవృత్తాంతాలు పుస్తకాల్లోని వచనాల్ని పరిశీలించవచ్చు. అంతేకాదు, బహుశా ఆమోసు సమకాలీనుడైన హోషేయ రాసిన పుస్తకాన్ని కూడా మీరు సమీక్షించవచ్చు. ఇలా ఇతర బైబిలు పుస్తకాల్ని పరిశోధించినప్పుడు, ఆమోసు కాలంలో పరిస్థితులు ఎలా ఉండేవో బాగా అర్థంచేసుకోగలుగుతారు.—2 రాజు. 14:25-28; 2 దిన. 26:1-15; హోషే. 1:1-11; ఆమో. 1:1.

చిన్నచిన్న వివరాల మీద మనసుపెట్టండి

17-18. చిన్నచిన్న వివరాల మీద మనసుపెట్టినప్పుడు వ్యక్తిగత బైబిలు అధ్యయనాన్ని ఆనందించవచ్చని పేరాల్లో ఇచ్చిన ఉదాహరణలు గానీ సొంత ఉదాహరణ గానీ ఉపయోగించి చెప్పండి.

17 బైబిలు చదువుతున్నప్పుడు, ఎక్కువ నేర్చుకోవాలనే బలమైన కోరిక ఉంటే మంచిది. ఉదాహరణకు, మెస్సీయ మరణం గురించి ప్రవచించిన జెకర్యా పుస్తకంలో 12వ అధ్యాయాన్ని మీరు చదువుతున్నారు అనుకుందాం. (జెక. 12:10) జెకర్యా 12:12-14⁠లో, మెస్సీయ మరణించినప్పుడు “నాతాను కుటుంబికులు” బాగా ఏడుస్తారని మీరు చదివారు. మీరు ఆ మాటల్ని పట్టించుకోకుండా తర్వాతి వచనాన్ని చదివే బదులు, కాస్త ఆగి ఈ ప్రశ్నలు వేసుకోవచ్చు: ‘నాతాను కుటుంబికులకు, మెస్సీయకు ఉన్న సంబంధం ఏంటి? దానిగురించి ఎక్కువ సమాచారం ఎలా తెలుసుకోవచ్చు?’ కాస్త పరిశోధన చేయండి. ఆ లేఖనానికి మార్జినల్‌ రెఫరెన్సుగా 2 సమూయేలు 5:13, 14 వచనాల్ని ఇచ్చారు. ఆ వచనాల్లో, నాతాను దావీదు కుమారుల్లో ఒకడని ఉంది. రెండవ మార్జినల్‌ రెఫరెన్సుగా లూకా 3:23, 31 వచనాల్ని ఇచ్చారు. ఆ వచనాల్ని గమనిస్తే, నాతాను మరియ వైపు నుండి యేసుకు పూర్వీకుడు అవుతాడని అర్థమౌతుంది. (కావలికోట No. 3, 2016, 9వ పేజీలో ఉన్న “మీకు తెలుసా?” అనే ఆర్టికల్‌ చూడండి.) ఇప్పుడు మీలో ఒక్కసారిగా ఆసక్తి కలుగుతుంది! యేసు దావీదు వంశం నుండి వస్తాడని చెప్పే ప్రవచనం గురించి మీకు తెలుసు. (మత్త. 22:42) కానీ దావీదుకు 20 కన్నా ఎక్కువమంది కుమారులు ఉన్నారు, అయితే యేసు మరణం గురించి నాతాను కుటుంబికులు ఏడుస్తారని జెకర్యా ప్రత్యేకంగా చెప్పడం ఆశ్చర్యంగా లేదా?

18 మరో ఉదాహరణ పరిశీలించండి. లూకా మొదటి అధ్యాయంలో, గబ్రియేలు దూత మరియ దగ్గరకు వచ్చి ఆమెకు పుట్టబోయే కుమారుడి గురించి ఈ ఆసక్తికరమైన విషయం చెప్పాడు: “ఆయన గొప్పవాడిగా ఉంటాడు, సర్వోన్నతుని కుమారుడని పిలువబడతాడు. ఆయన తండ్రైన దావీదు సింహాసనాన్ని యెహోవా దేవుడు ఆయనకు ఇస్తాడు. ఆయన యాకోబు వంశస్థుల్ని ఎప్పటికీ రాజుగా పరిపాలిస్తాడు.” (లూకా 1:32, 33) గబ్రియేలు దూత చెప్పిన సందేశంలో, యేసు “సర్వోన్నతుని కుమారుడని పిలువబడతాడు” అనే మొదటి భాగం మీదే బహుశా మనం మనసుపెడతాం. కానీ యేసు “రాజుగా పరిపాలిస్తాడు” అని కూడా గబ్రియేలు దూత ప్రవచించాడు. కాబట్టి మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు, గబ్రియేలు దూత దేని గురించి మాట్లాడుతున్నాడని మరియ అనుకొని ఉంటుంది? రాజైన హేరోదు స్థానంలో లేదా అతని వారసుల స్థానంలో యేసు ఇశ్రాయేలుకు రాజు అవుతాడని మరియ అనుకొని ఉంటుందా? ఒకవేళ యేసు రాజైతే, మరియ రాజమాత అవుతుంది, వాళ్ల కుటుంబం రాజభవనంలో నివసిస్తుంది. కానీ, మరియ గబ్రియేలు దూత దగ్గర అలాంటి ప్రస్తావన తెచ్చినట్టు బైబిల్లో లేదు; అంతేకాదు, యేసు ఇద్దరు శిష్యుల్లా, మరియ దేవుని రాజ్యంలో మంచి స్థానం కోసం అడిగినట్టు కూడా బైబిల్లో ఎక్కడా లేదు. (మత్త. 20:20-23) ఈ వివరాల్ని బట్టి, మరియ చాలా వినయస్థురాలు అనే మన నమ్మకం ఇంకా బలపడుతుంది.

19-20. యాకోబు 1:22-25 అలాగే 4:8 ప్రకారం, అధ్యయనం చేస్తున్నప్పుడు మనకు ఏ లక్ష్యాలు ఉండాలి?

19 దేవుని వాక్యాన్ని, అలాగే మన క్రైస్తవ ప్రచురణల్ని అధ్యయనం చేయడం వెనకున్న ముఖ్య లక్ష్యం యెహోవాకు మరింత దగ్గరవ్వడమే అని గుర్తుపెట్టుకుందాం. అంతేకాదు, మనం ఎలాంటి వ్యక్తులుగా ఉన్నామో ఇంకా స్పష్టంగా చూసుకొని, యెహోవాను సంతోషపెట్టడానికి ఏయే మార్పులు చేసుకోవాలో తెలుసుకోవాలి. (యాకోబు 1:22-25; 4:8 చదవండి.) అందుకే, మనం వ్యక్తిగత అధ్యయనం మొదలుపెట్టే ప్రతీసారి, పవిత్రశక్తి కోసం యెహోవాకు ప్రార్థించాలి. అధ్యయనం చేసే సమాచారం నుండి పూర్తి ప్రయోజనం పొందేలా, ఎక్కడ మార్పులు చేసుకోవాలో స్పష్టంగా తెలుసుకునేలా సహాయం చేయమని మనం వేడుకోవాలి.

20 దేవుని నమ్మకమైన సేవకుడు ఎలా ఉంటాడో చెప్తూ కీర్తనకర్త ఇలా అన్నాడు, “యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు . . . అతడు చేయునదంతయు సఫలమగును.” మనందరం ఆ నమ్మకమైన సేవకునిలా ఉందాం.—కీర్త. 1:2, 3.

పాట 88 నీ మార్గాలు నాకు తెలియజేయి

^ పేరా 5 మనం చూడడానికి, చదవడానికి, అధ్యయనం చేయడానికి యెహోవా ఎంతో సమాచారాన్ని ఇస్తున్నాడు. అయితే, మీరు దేన్ని అధ్యయనం చేయాలో నిర్ణయించుకోవడానికి, అలాగే మీరు చేసే అధ్యయనం నుండి వీలైనంత ఎక్కువ ప్రయోజనాన్ని ఎలా పొందవచ్చో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది.

^ పేరా 61 చిత్రాల వివరణ: ప్రతీవారం జరిగే కావలికోట అధ్యయనానికి ఎలా సిద్ధపడాలో పిల్లలకు చూపిస్తున్న తల్లిదండ్రులు.

^ పేరా 63 చిత్రాల వివరణ: ఒక సహోదరుడు బైబిలు రచయిత అయిన ఆమోసు గురించి పరిశోధన చేస్తున్నాడు. ఆ సహోదరుడు బైబిలు వృత్తాంతాల్ని చదివి, ధ్యానిస్తున్నప్పుడు ఆ దృశ్యాల్ని ఊహించుకుంటున్నాడని అతని వెనకున్న చిత్రాలు చూపిస్తున్నాయి.