అధ్యయన ఆర్టికల్ 18
క్రైస్తవ సంఘంలో ప్రేమ, న్యాయం
“ఒకరి భారం ఒకరు మోసుకుంటూ ఉండండి. అప్పుడు మీరు క్రీస్తు శాసనాన్ని పాటించినవాళ్లౌతారు.”—గల. 6:2.
పాట 12 యెహోవా గొప్ప దేవుడు
ఈ ఆర్టికల్‌లో . . . *
1. మనం ఏ రెండు విషయాల్ని ఖచ్చితంగా నమ్మవచ్చు?
యెహోవా దేవుడు తన ఆరాధకుల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన గతంలో వాళ్లమీద ప్రేమ చూపించాడు, ఇప్పుడూ భవిష్యత్తులో కూడా చూపిస్తాడు. ఆయన న్యాయాన్ని కూడా ప్రేమిస్తున్నాడు. (కీర్త. 33:5) కాబట్టి మనం ఈ రెండు విషయాల్ని ఖచ్చితంగా నమ్మవచ్చు: (1) తన సేవకులకు అన్యాయం జరిగినప్పుడు యెహోవా బాధపడతాడు. (2) తన సేవకులకు తప్పకుండా న్యాయం జరిగేలా ఆయన చూస్తాడు. నాలుగు ఆర్టికల్స్‌లోని మొదటి ఆర్టికల్‌లో, * దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రేమ మీద ఆధారపడిందని నేర్చుకున్నాం. ఆ ధర్మశాస్త్రం న్యాయాన్ని ప్రోత్సహించింది, ఆఖరికి నిస్సహాయ స్థితిలో ఉన్నవాళ్లతో కూడా న్యాయంగా వ్యవహరించమని అది ప్రోత్సహించింది. (ద్వితీ. 10:18) యెహోవాకు తన ఆరాధకుల పట్ల ఎంత శ్రద్ధ ఉందో ధర్మశాస్త్రం తెలియజేస్తుంది.
2. మనం ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?
2 క్రీ.శ. 33లో క్రైస్తవ సంఘం స్థాపించబడినప్పుడు మోషే ధర్మశాస్త్రం ముగిసింది. కాబట్టి క్రైస్తవులకు ప్రేమ మీద ఆధారపడి, న్యాయాన్ని ప్రోత్సహించే శాసనం ఏదీ లేకుండా పోయిందా? ఎంతమాత్రం కాదు! వాళ్లకు ఒక కొత్త శాసనం అమలులోకి వచ్చింది. ఈ ఆర్టికల్‌లో ముందుగా ఆ శాసనం ఏంటో పరిశీలిస్తాం. ఆ తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం: ఆ శాసనం ప్రేమ మీద ఆధారపడిందని ఎందుకు చెప్పవచ్చు? అది న్యాయాన్ని ప్రోత్సహిస్తుందని ఎందుకు చెప్పవచ్చు? ఆ శాసనం ప్రకారం, అధికార స్థానంలో ఉన్నవాళ్లు ఇతరులతో ఎలా వ్యవహరించాలి?
‘క్రీస్తు శాసనం’ అంటే ఏంటి?
3. గలతీయులు 6:2లో ఉన్న ‘క్రీస్తు శాసనంలో’ ఏమేమి ఉన్నాయి?
3 గలతీయులు 6:2 చదవండి. క్రైస్తవులు “క్రీస్తు శాసనాన్ని” పాటించాలి. యేసు తన అనుచరులకు ఒక నియమాల పట్టిక ఇవ్వలేదు గానీ వాళ్లు పాటించడానికి ఉపదేశాల్ని, ఆజ్ఞల్ని, సూత్రాల్ని ఇచ్చాడు. యేసు బోధించిన ప్రతీది ‘క్రీస్తు శాసనం’ కిందకే వస్తుంది. ఈ శాసనం గురించి మరిన్ని వివరాలు తర్వాతి పేరాల్లో చూద్దాం.
4-5. యేసు ఏయే విధాలుగా బోధించాడు? ఎప్పుడు బోధించాడు?
4 యేసు ఏయే విధాలుగా బోధించాడు? మొదటిగా, ఆయన తన మాటల ద్వారా బోధించాడు. అవి శక్తివంతమైనవి, ఎందుకంటే అవి దేవుని గురించిన సత్యాన్ని, జీవిత సంకల్పాన్ని తెలియజేశాయి; అంతేకాదు మనుషుల బాధలన్నిటికీ దేవుని రాజ్యమే పరిష్కారమని తెలియజేశాయి. (లూకా 24:19) రెండోదిగా, యేసు తన ఆదర్శం ద్వారా బోధించాడు. తన అనుచరులు ఎలా జీవించాలో యేసు తన జీవన విధానం ద్వారా చూపించాడు.—యోహా. 13:15.
5 యేసు ఎప్పుడు బోధించాడు? ఆయన భూమ్మీద పరిచర్య చేసినప్పుడు బోధించాడు. (మత్త. 4:23) ఆయన పునరుత్థానమైన తర్వాత కూడా తన అనుచరులకు బోధించాడు. ఉదాహరణకు, ఆయన ఒకసారి 500 కన్నా ఎక్కువమందికి కనబడి “శిష్యుల్ని చేయండి” అనే ఆజ్ఞ ఇచ్చాడు. (మత్త. 28:19, 20; 1 కొరిం. 15:6) పరలోకానికి వెళ్లిన తర్వాత కూడా, యేసు సంఘానికి శిరస్సుగా తన శిష్యులకు నిర్దేశాల్ని ఇస్తూ వచ్చాడు. ఉదాహరణకు, దాదాపు క్రీ.శ. 96లో అభిషిక్త క్రైస్తవులకు ప్రోత్సాహాన్ని, సలహాను ఇచ్చేలా ఆయన అపొస్తలుడైన యోహానును నిర్దేశించాడు.—కొలొ. 1:18; ప్రక. 1:1.
6-7. (ఎ) యేసు బోధలు ఎక్కడ నమోదు చేయబడ్డాయి? (బి) మనం ఏం చేస్తే క్రీస్తు శాసనాన్ని పాటించినవాళ్లమౌతాం?
6 యేసు బోధించిన విషయాలు ఎక్కడ నమోదు చేయబడ్డాయి? యేసు భూమ్మీద ఉన్నప్పుడు చెప్పిన, చేసిన చాలా విషయాలు నాలుగు సువార్త వృత్తాంతాల్లో నమోదు చేయబడ్డాయి. అంతేకాదు మిగతా క్రైస్తవ గ్రీకు లేఖనాలు కూడా యేసు ఆలోచనల్ని అర్థంచేసుకోవడానికి సహాయం చేస్తాయి. ఎందుకంటే పవిత్రశక్తి చేత ప్రేరేపించబడి, “క్రీస్తు మనసు” కలిగి ఉన్నవాళ్లు వాటిని రాశారు.—1 కొరిం. 2:16.
7 పాఠాలు: యేసు బోధలు మన జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్లో సహాయం చేస్తాయి. కాబట్టి మనం ఇంట్లో, ఉద్యోగ స్థలంలో, స్కూల్లో, సంఘంలో చేసే ప్రతీ పనిమీద క్రీస్తు శాసనం ప్రభావం చూపిస్తుంది. మనం క్రైస్తవ గ్రీకు లేఖనాల్ని చదివి, వాటిగురించి లోతుగా ఆలోచించడం ద్వారా క్రీస్తు శాసనం గురించి నేర్చుకోవచ్చు. ఆ ప్రేరేపిత లేఖనాల్లో ఉన్న ఉపదేశాలకు, ఆజ్ఞలకు, సూత్రాలకు అనుగుణంగా జీవించినప్పుడు మనం క్రీస్తు శాసనాన్ని పాటించినవాళ్లమౌతాం. మనం క్రీస్తు శాసనాన్ని పాటించినప్పుడు మన ప్రేమగల తండ్రి అయిన యెహోవాకు లోబడినవాళ్లమౌతాం. ఎందుకంటే యోహా. 8:28.
యేసు బోధలన్నిటికీ యెహోవాయే మూలం.—ప్రేమ మీద ఆధారపడిన శాసనం
8. క్రీస్తు శాసనం దేనిమీద రూపొందించబడింది?
8 ఒక ఇల్లు గట్టి పునాది మీద పటిష్ఠంగా కట్టబడినప్పుడు ఆ ఇంట్లో నివసించేవాళ్లు సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారు. అదేవిధంగా, ఒక మంచి శాసనం గట్టి పునాది మీద రూపొందించబడినప్పుడు, దాన్ని పాటించేవాళ్లు సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారు. క్రీస్తు శాసనం ప్రేమ అనే అత్యంత శ్రేష్ఠమైన పునాది మీద రూపొందించబడింది. అలాగని ఎలా చెప్పవచ్చు?
9-10. యేసు ఏం చేసినా ప్రేమతోనే చేశాడని ఏ ఉదాహరణల్ని బట్టి చెప్పవచ్చు? మనం యేసును ఎలా అనుకరించవచ్చు?
9 మొదటిగా, యేసు ఏం చేసినా ప్రేమతోనే చేశాడు. ప్రేమ ఉన్నప్పుడే జాలి లేదా కనికరం కలుగుతాయి. ఆ జాలి వల్లే యేసు ప్రజలకు బోధించాడు, రోగుల్ని స్వస్థపరిచాడు, ఆకలితో ఉన్నవాళ్లకు ఆహారం పెట్టాడు, చనిపోయినవాళ్లను బ్రతికించాడు. (మత్త. 14:14; 15:32-38; మార్కు 6:34; లూకా 7:11-15) ఆయన అవన్నీ చేయడానికి ఎంతో సమయాన్ని, శక్తిని వెచ్చించాల్సి వచ్చింది. అయినప్పటికీ యేసు ఇష్టపూర్వకంగా, తన అవసరాల కన్నా ఇతరుల అవసరాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు. యేసు తన ప్రేమను చూపించిన అత్యంత గొప్ప విధానం, ఇతరుల కోసం తన ప్రాణాన్ని అర్పించడం.—యోహా. 15:13.
10 పాఠాలు: మన అవసరాల కన్నా ఇతరుల అవసరాలకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడం ద్వారా మనం యేసును అనుకరించవచ్చు. అంతేకాదు, మన క్షేత్రంలో ఉన్న ప్రజలపట్ల కనికరాన్ని పెంపొందించుకోవడం ద్వారా మనం యేసును అనుకరించవచ్చు. అలాంటి కనికరంతో మనం మంచివార్తను ప్రకటించినప్పుడు, బోధించినప్పుడు క్రీస్తు శాసనాన్ని పాటించినవాళ్లమౌతాం.
11-12. (ఎ) యెహోవాకు మనపట్ల ఎంతో శ్రద్ధ ఉందని ఎలా చెప్పవచ్చు? (బి) మనం యెహోవా ప్రేమను ఎలా అనుకరించవచ్చు?
11 రెండోదిగా, యేసు తన తండ్రికున్న ప్రేమను తెలియజేశాడు. యెహోవాకు తన ఆరాధకులపట్ల ఎంత శ్రద్ధ ఉందో యేసు పరిచర్య చేస్తున్నప్పుడు చూపించాడు. ఆయన దాన్ని చాలా విధాలుగా చూపించాడు. ఉదాహరణకు, యేసు యెహోవా గురించి బోధించిన ఈ విషయాల్ని ఆలోచించండి: మనలో ప్రతీఒక్కరం మన పరలోక తండ్రికి విలువైనవాళ్లం అని యేసు బోధించాడు. (మత్త. 10:31) తప్పిపోయిన గొర్రెల్లాంటివాళ్లు పశ్చాత్తాపపడి, సంఘానికి తిరిగొస్తే వాళ్లను ఆహ్వానించాలని యెహోవా ఆతురతతో ఉన్నాడని యేసు చెప్పాడు. (లూకా 15:7, 10) మనకోసం తన కుమారుణ్ణి విమోచన క్రయధనంగా ఇవ్వడం ద్వారా యెహోవా మనమీద తన ప్రేమను నిరూపించుకున్నాడని యేసు బోధించాడు.—యోహా. 3:16.
12 పాఠాలు: మనం యెహోవా ప్రేమను ఎలా అనుకరించవచ్చు? (ఎఫె. 5:1, 2) సహోదరసహోదరీల్లో ప్రతీఒక్కరిని మనం విలువైనవాళ్లుగా చూస్తాం. “తప్పిపోయిన గొఱ్ఱె” లాంటివాళ్లు యెహోవా దగ్గరకు తిరిగివచ్చినప్పుడు మనం వాళ్లను సంతోషంగా ఆహ్వానిస్తాం. (కీర్త. 119:176) మన సహోదరసహోదరీల కోసం మన సమయాన్ని, శక్తిని వెచ్చించడం ద్వారా, ముఖ్యంగా వాళ్లు అవసరంలో ఉన్నప్పుడు అలా చేయడం ద్వారా వాళ్లమీద మనకు ప్రేమ ఉందని నిరూపించుకుంటాం. (1 యోహా. 3:17) మనం ఇతరులపట్ల ప్రేమ చూపించినప్పుడు క్రీస్తు శాసనాన్ని పాటించినవాళ్లమౌతాం.
13-14. (ఎ) యోహాను 13:34, 35లో యేసు తన అనుచరులు ఏం చేయాలని ఆజ్ఞ ఇచ్చాడు? అది ఎందుకు కొత్త ఆజ్ఞ? (బి) ఆ కొత్త ఆజ్ఞను మనం ఎలా పాటిస్తాం?
13 మూడోదిగా, స్వయంత్యాగ ప్రేమ చూపించుకోమని యేసు తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. (యోహాను 13:34, 35 చదవండి.) యేసు ఇచ్చిన ఆజ్ఞ కొత్తది, ఎందుకంటే అలాంటి ప్రేమ చూపించమని ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం చెప్పలేదు. ఈ కొత్త ఆజ్ఞ ప్రకారం, యేసు మనల్ని ప్రేమించినట్టే మనం మన సహోదరసహోదరీల్ని ప్రేమించాలి. అలా చేయాలంటే, మనం స్వయంత్యాగ ప్రేమ చూపించాలి. * మనల్ని మనం ప్రేమించుకునే దానికన్నా ఎక్కువగా మన సహోదరసహోదరీల్ని ప్రేమించాలి. యేసులాగే, మనం కూడా సహోదరసహోదరీల కోసం ఇష్టపూర్వకంగా మన ప్రాణాల్ని ఇచ్చేంతగా వాళ్లను ప్రేమించాలి.
14 పాఠాలు: మనం కొత్త ఆజ్ఞను పాటించాలంటే ఏం చేయాలి? ఒక్కమాటలో చెప్పాలంటే, మన సహోదరసహోదరీల కోసం త్యాగాలు చేయడం ద్వారా ఆ ఆజ్ఞను పాటిస్తాం. ప్రాణం ఇవ్వడం లాంటి పెద్ద త్యాగం చేయడానికే కాదుగానీ చిన్నచిన్న త్యాగాలు చేయడానికి కూడా మనం సిద్ధంగా ఉంటాం. ఉదాహరణకు, మనం ప్రతీవారం సమయం వెచ్చించి పెద్దవయసు సహోదరుణ్ణి లేదా సహోదరిని మీటింగ్‌కి తీసుకురావడానికి వెళ్లినప్పుడు, లేదా తోటి సహోదరసహోదరీల సంతోషం కోసం మన ఇష్టాల్ని త్యాగం చేసినప్పుడు, లేదా ఉద్యోగానికి సెలవు పెట్టి విపత్తు సహాయక పనుల్లో భాగం వహించినప్పుడు, మనం క్రీస్తు శాసనాన్ని పాటించినవాళ్లమౌతాం. దానివల్ల మన సంఘంలోని ప్రతీఒక్కరు సురక్షితంగా ఉన్నట్లు భావించేలా చేస్తాం.
న్యాయాన్ని ప్రోత్సహించే శాసనం
15-17. (ఎ) న్యాయం విషయంలో యేసుకున్న అభిప్రాయాన్ని ఆయన పనులు ఎలా తెలియజేశాయి? (బి) మనం యేసును ఎలా అనుకరించవచ్చు?
15 బైబిల్లో ఉపయోగించబడిన “న్యాయం” అనే పదానికి, దేవుని దృష్టిలో సరైనదాన్ని నిష్పక్షపాతంగా చేయడం అనే అర్థముంది. క్రీస్తు శాసనం న్యాయాన్ని ప్రోత్సహిస్తుందని మనం ఎందుకు చెప్పవచ్చు?
16 మొదటిగా, న్యాయం విషయంలో యేసుకున్న అభిప్రాయాన్ని ఆయన పనులు ఎలా తెలియజేశాయో ఆలోచించండి. యేసు కాలంలో యూదా మత నాయకులు అన్యుల్ని ద్వేషించారు, సామాన్య యూదుల్ని చిన్నచూపు చూశారు, స్త్రీలతో అగౌరవంగా వ్యవహరించారు. కానీ యేసు ప్రతీఒక్కరితో నిష్పక్షపాతంగా, న్యాయంగా వ్యవహరించాడు. తనమీద విశ్వాసంతో తన దగ్గరకు వచ్చిన అన్యుల్ని యేసు తిరస్కరించలేదు. (మత్త. 8:5-10, 13) ధనవంతులు, పేదవాళ్లు అనే భేదం లేకుండా అందరికీ మంచివార్త ప్రకటించాడు. (మత్త. 11:5; లూకా 19:2, 9) ఆయన స్త్రీలతో ఎన్నడూ కటువుగా ప్రవర్తించలేదు లేదా వాళ్లను కోప్పడలేదు. బదులుగా ఆయన స్త్రీలందర్నీ, ఆఖరికి ఇతరులు హీనంగా చూసిన స్త్రీలను కూడా గౌరవించాడు, వాళ్లపట్ల దయ చూపించాడు.—లూకా 7:37-39, 44-50.
17 పాఠాలు: మనం ఇతరులతో నిష్పక్షపాతంగా వ్యవహరించడం ద్వారా; పేద-ధనిక, జాతి-మతం అనే భేదం లేకుండా మంచివార్త వినడానికి ఇష్టపడేవాళ్లందరికీ ప్రకటించడం ద్వారా యేసును అనుకరించవచ్చు. క్రైస్తవ పురుషులు, స్త్రీలను గౌరవించడం ద్వారా యేసును అనుకరిస్తారు. మనం వీటిని చేసినప్పుడు క్రీస్తు శాసనాన్ని పాటించినవాళ్లమౌతాం.
18-19. యేసు న్యాయం గురించి ఏం బోధించాడు? ఆయన బోధ నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?
18 రెండోదిగా, యేసు న్యాయం గురించి ఏం బోధించాడో పరిశీలించండి. తన అనుచరులు ఇతరులతో న్యాయంగా వ్యవహరించడానికి సహాయం చేసే కొన్ని సూత్రాల్ని యేసు బోధించాడు. ఉదాహరణకు, బంగారు సూత్రం గురించి ఆలోచించండి. (మత్త. 7:12) ఇతరులు మనతో న్యాయంగా వ్యవహరించాలని మనందరం కోరుకుంటాం. కాబట్టి మనం ఇతరులతో న్యాయంగా వ్యవహరించాలి. అప్పుడు వాళ్లు కూడా మనతో అలాగే వ్యవహరించే అవకాశం ఉంది. కానీ ఒకవేళ ఎవరైనా మనకు అన్యాయం చేస్తే, అప్పుడేంటి? “రాత్రింబగళ్లు తనను వేడుకుంటూ” ఉండేవాళ్లకు యెహోవా ‘తప్పకుండా న్యాయం జరిగేలా చేస్తాడు’ అనే నమ్మకంతో ఉండవచ్చని యేసు తన అనుచరులకు బోధించాడు. (లూకా 18:6, 7) ఆ మాటలు మనకు ఈ అభయాన్ని ఇస్తున్నాయి: ఈ చివరి రోజుల్లో మనం ఎదుర్కొంటున్న కష్టాలు న్యాయవంతుడైన మన దేవునికి తెలుసు, అంతేకాదు ఆయన తగిన సమయంలో మనకు న్యాయం జరిగేలా చేస్తాడు.—2 థెస్స. 1:6.
19 పాఠాలు: యేసు బోధించిన సూత్రాల్ని పాటించినప్పుడు మనం ఇతరులతో న్యాయంగా వ్యవహరిస్తాం. ఒకవేళ సాతాను లోకంలో మనం అన్యాయానికి గురై బాధపడుతున్నా, యెహోవా మనకు న్యాయం జరిగేలా చేస్తాడని తెలుసుకొని ఓదార్పు పొందవచ్చు.
అధికార స్థానంలో ఉన్నవాళ్లు ఇతరులతో ఎలా వ్యవహరించాలి?
20-21. (ఎ) అధికార స్థానంలో ఉన్నవాళ్లు ఇతరులతో ఎలా వ్యవహరించాలి? (బి) ఒక భర్త స్వయంత్యాగ ప్రేమను ఎలా చూపించవచ్చు? ఒక తండ్రి తన పిల్లలతో ఎలా వ్యవహరించాలి?
20 క్రీస్తు శాసనం ప్రకారం, అధికార స్థానంలో ఉన్నవాళ్లు ఇతరులతో ఎలా వ్యవహరించాలి? ఆ శాసనం ప్రేమ మీద ఆధారపడింది కాబట్టి, అధికార స్థానంలో ఉన్నవాళ్లు తమ కిందున్నవాళ్లతో గౌరవంగా, ప్రేమగా వ్యవహరించాలి. మనం చేసే ప్రతీ పనిలో ప్రేమ కనిపించాలనేది యేసు కోరికని మనం గుర్తుంచుకోవాలి.
21 కుటుంబంలో. ‘క్రీస్తు సంఘాన్ని’ ఏవిధంగా ప్రేమించాడో ఒక భర్త తన భార్యను అలాగే ప్రేమించాలి. (ఎఫె. 5:25, 28, 29) భర్త తన అవసరాలు, ఇష్టాలకన్నా భార్య అవసరాలకు, ఇష్టాలకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడం ద్వారా యేసు చూపించినలాంటి స్వయంత్యాగ ప్రేమను చూపించాలి. కొంతమంది పురుషులకు అలాంటి ప్రేమ చూపించడం కష్టం కావచ్చు. ఎందుకంటే ఇతరులతో న్యాయంగా, ప్రేమగా వ్యవహరించే వాతావరణంలో వాళ్లు పెరిగి ఉండకపోవచ్చు. అందుకే అలాంటివాళ్లకు చెడు అలవాట్లను మానుకోవడం కష్టం కావచ్చు, కానీ క్రీస్తు శాసనాన్ని పాటించాలంటే మార్పులు చేసుకోవాలి. స్వయంత్యాగ ప్రేమ చూపించే భర్త, తన భార్య గౌరవాన్ని సంపాదించుకుంటాడు. తన పిల్లల్ని నిజంగా ప్రేమించే తండ్రి, మాటల ద్వారా లేదా పనుల ద్వారా వాళ్లను ఎన్నడూ గాయపర్చడు. (ఎఫె. 4:31) బదులుగా, ఆయన వాళ్లమీద ప్రేమను, అంగీకారాన్ని చూపిస్తాడు. దానివల్ల పిల్లలు సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారు. అలాంటి తండ్రి తన పిల్లల ప్రేమను, నమ్మకాన్ని సంపాదించుకుంటాడు.
22. మొదటి పేతురు 5:1-3 ప్రకారం, “గొర్రెలు” ఎవరికి చెందినవి? ఆ గొర్రెలతో సంఘపెద్దలు ఎలా వ్యవహరించాలి?
22 సంఘంలో. తమ పర్యవేక్షణలో ఉన్న “గొర్రెలు” తమవి కావని సంఘపెద్దలు గుర్తుంచుకోవాలి. (యోహా. 10:16; 1 పేతురు 5:1-3 చదవండి.) “దేవుని మంద,” “దేవుని ముందు,” “దేవుని సొత్తు” అనే పదాలు ఆ గొర్రెలు యెహోవాకు చెందినవని పెద్దలకు గుర్తుచేస్తాయి. తన గొర్రెలతో ప్రేమగా, మృదువుగా వ్యవహరించాలని ఆయన కోరుకుంటున్నాడు. (1 థెస్స. 2:7, 8) కాపరులుగా తమ బాధ్యతని ప్రేమపూర్వకంగా నిర్వర్తించే సంఘపెద్దలు యెహోవా ఆమోదాన్ని సంపాదించుకుంటారు. అంతేకాదు ఆ పెద్దలు సహోదరసహోదరీల ప్రేమను, గౌరవాన్ని కూడా సంపాదించుకుంటారు.
23-24. (ఎ) సంఘంలో ఎవరైనా గంభీరమైన పాపం చేస్తే సంఘపెద్దల బాధ్యత ఏంటి? (బి) ఆ సందర్భంలో పెద్దలు ఏ విషయాల గురించి ఆలోచిస్తారు?
23 గంభీరమైన తప్పులు చేసినవాళ్లతో వ్యవహరించేటప్పుడు సంఘపెద్దల పాత్ర ఏంటి? ధర్మశాస్త్రం కిందున్న న్యాయాధిపతుల, పెద్దల పాత్రతో పోలిస్తే నేటి సంఘపెద్దల పాత్ర వేరుగా ఉంది. ధర్మశాస్త్రం కిందున్న నియమిత పురుషులు కేవలం యెహోవా ఆరాధనకు సంబంధించిన విషయాల్నే కాదుగానీ ప్రజల తగాదాలకు, నేరాలకు సంబంధించిన విషయాల్ని కూడా చూసుకునేవాళ్లు. కానీ క్రీస్తు శాసనం కిందున్న సంఘపెద్దలు మాత్రం యెహోవా ఆరాధనకు సంబంధించి చేసిన తప్పుల విషయంలోనే తీర్పుతీర్చాలి. తగాదాలు, నేరాల విషయంలో తీర్పుతీర్చే బాధ్యత దేవుడు ప్రభుత్వ అధికారులకు ఇచ్చాడని పెద్దలు గుర్తిస్తారు. ఆ బాధ్యతలో, జరిమానాలు లేదా జైలు శిక్ష లాంటివి విధించే అధికారం కూడా ఉంది.—రోమా. 13:1-4.
24 సంఘంలో ఎవరైనా గంభీరమైన పాపం చేస్తే సంఘపెద్దల బాధ్యత ఏంటి? విషయాల్ని అంచనా వేయడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్లు లేఖనాల్ని ఉపయోగిస్తారు. క్రీస్తు శాసనం ప్రేమ మీద ఆధారపడిందని వాళ్లు గుర్తుంచుకుంటారు. ఆ ప్రేమను బట్టి పెద్దలు ఈ విషయం గురించి ఆలోచిస్తారు: ఆ పాపం వల్ల సంఘంలో ఉన్నవాళ్లు ఎవరైనా నష్టపోతే వాళ్లకు ఎలా సహాయం చేయాలి? పాపం చేసిన వ్యక్తి విషయంలో, పెద్దలు ప్రేమతో వీటి గురించి ఆలోచిస్తారు: అతను పశ్చాత్తాపపడ్డాడా? అతను తిరిగి యెహోవాతో మంచి సంబంధం కలిగివుండడానికి మేము సహాయం చేయగలమా?
25. మనం తర్వాతి ఆర్టికల్‌లో ఏ ప్రశ్నకు జవాబు తెలుసుకుంటాం?
25 మనం క్రీస్తు శాసనం కింద ఉన్నందుకు ఎంత కృతజ్ఞులమో కదా! ఆ శాసనాన్ని పాటించడానికి మనందరం కృషిచేసినప్పుడు, సంఘంలో ప్రతీఒక్కరూ తాము ప్రేమించబడుతున్నామని, విలువైనవాళ్లమని, సురక్షితంగా ఉన్నామని భావిస్తారు. కానీ, ‘దుష్టులు అంతకంతకూ చెడిపోయే’ లోకంలో మనం జీవిస్తున్నాం. (2 తిమో. 3:13) కాబట్టి మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. పిల్లలపై లైంగిక దాడి చేసినవాళ్లతో వ్యవహరిస్తున్నప్పుడు క్రైస్తవ సంఘం దేవునికున్న లాంటి న్యాయాన్ని ఎలా చూపించవచ్చు? ఆ ప్రశ్నకు జవాబు తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.
పాట 15 యెహోవా మొదటి కుమారుణ్ణి కీర్తించండి!
^ పేరా 5 యెహోవా ప్రేమ, న్యాయం గల దేవుడనే నమ్మకంతో మనం ఎందుకు ఉండవచ్చో ఈ ఆర్టికల్ అలాగే తర్వాతి రెండు ఆర్టికల్స్ వివరిస్తాయి. తన ప్రజలకు న్యాయం జరగాలని ఆయన కోరుకుంటున్నాడు, అంతేకాదు ఈ చెడ్డ లోకంలో అన్యాయానికి గురైనవాళ్లను ఆయన ఓదారుస్తాడు.
^ పేరా 1 2019, ఫిబ్రవరి కావలికోట సంచికలోని “ధర్మశాస్త్రం యెహోవా ప్రేమకు, న్యాయానికి నిదర్శనం” అనే ఆర్టికల్ చూడండి.
^ పేరా 13 పదాల వివరణ: మనకు స్వయంత్యాగ ప్రేమ ఉంటే మన అవసరాలకన్నా ఇతరుల అవసరాలకు, సంక్షేమానికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాం. ఇతరుల ప్రయోజనం కోసం మనం దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాం.
^ పేరా 61 చిత్రాల వివరణ: తన ఒక్కగానొక్క కొడుకును కోల్పోయిన విధవరాలిని యేసు గమనిస్తున్నాడు. ఆయన జాలిపడి, చనిపోయిన ఆ యువకుడిని బ్రతికించాడు.
^ పేరా 63 చిత్రాల వివరణ: సీమోను అనే పరిసయ్యుడి ఇంట్లో యేసు భోజనం చేస్తున్నాడు. బహుశా ఒక వేశ్య, యేసు పాదాల్ని తన కన్నీళ్లతో తడిపి, తన తలవెంట్రుకలతో తుడిచి, పాదాలపై కొంత తైలం పోసింది. ఆమె చేసిన పనిని సీమోను తప్పుబట్టాడు, కానీ యేసు ఆమెను సమర్థించాడు.