కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 20

లైంగిక దాడికి గురైనవాళ్లకు ఓదార్పును ఇవ్వడం

లైంగిక దాడికి గురైనవాళ్లకు ఓదార్పును ఇవ్వడం

“ఎలాంటి పరిస్థితిలోనైనా ఓదార్పును ఇచ్చే దేవుడు . . . మన కష్టాలన్నిటిలో మనల్ని ఓదారుస్తాడు.”—2 కొరిం. 1:3, 4.

పాట 134 పిల్లలు యెహోవా ఇచ్చిన బాధ్యత

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. (ఎ) మనుషులందరికీ ఓదార్పు అవసరమని, వాళ్లకు ఇతరుల్ని ఓదార్చే సామర్థ్యం ఉందని ఎలా చెప్పవచ్చు? (బి) కొంతమంది పిల్లలకు ఎలాంటి గాయాలు అవుతాయి?

మనుషులందరికీ సహజంగానే ఓదార్పు అవసరం, అంతేకాదు ఇతరుల్ని ఓదార్చే అద్భుతమైన సామర్థ్యం కూడా మనుషులకు ఉంది. ఈ ఉదాహరణ పరిశీలించండి. ఒక బాబు ఆడుకుంటూ కింద పడిపోయి మోకాలికి దెబ్బ తగిలితే, ఏడుస్తూ అమ్మ దగ్గరికో, నాన్న దగ్గరికో పరిగెత్తుతాడు. వాళ్లు ఆ బాబుకు తగిలిన దెబ్బను మాన్పలేరు, కానీ అతన్ని ఓదార్చగలరు. బహుశా వాళ్లు బాబుని, ఏం జరిగిందని అడుగుతారు, అతని కన్నీళ్లు తుడుస్తారు, ప్రేమగా తల నిమురుతూ తగ్గిపోతుందిలే అని ఓదారుస్తారు. అంతేకాదు కాస్త మందు రాయడమో, కట్టుకట్టడమో చేస్తారు. కాసేపటికే ఆ బాబు ఏడ్పు ఆపేసి, మళ్లీ ఆడుకోవడం మొదలుపెడతాడు. కొన్ని రోజులకు ఆ దెబ్బ మానిపోతుంది.

2 కొన్నిసార్లు, పిల్లలకు ఘోరమైన గాయాలు అవుతాయి. కొంతమందిపై లైంగిక దాడి జరుగుతుంది. బహుశా అది ఒక్కసారే జరగవచ్చు లేదా కొన్ని సంవత్సరాల పాటు జరుగుతూ ఉండవచ్చు. ఏదేమైనా, ఆ దాడివల్ల వాళ్లు చాలాకాలంపాటు మానసిక క్షోభ అనుభవిస్తారు. కొన్ని సందర్భాల్లో దాడి చేసిన వ్యక్తి దొరుకుతాడు, అతనికి శిక్షపడుతుంది. ఇంకొన్ని సందర్భాల్లో అలాంటివాళ్లు శిక్ష తప్పించుకుంటున్నట్లు అనిపిస్తుంది. దాడి చేసిన వ్యక్తికి వెంటనే శిక్షపడినా, ఆ దాడికి గురైన పిల్లలు మాత్రం పెద్దవాళ్లు అయ్యాక కూడా వేదన అనుభవిస్తుండవచ్చు.

3. రెండో కొరింథీయులు 1:3, 4 ప్రకారం యెహోవా ఏం కోరుకుంటున్నాడు? మనం ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?

3 చిన్నప్పుడు లైంగిక దాడికి గురైన ఒక సహోదరుడు లేదా సహోదరి, పెద్దయ్యాక కూడా దానివల్ల మానసిక క్షోభ అనుభవిస్తుంటే, వాళ్లకు ఎలాంటి సహాయం అందుబాటులో ఉంది? (2 కొరింథీయులు 1:3, 4 చదవండి.) అవును, తన గొర్రెలు అవసరమైన ప్రేమను, ఓదార్పును పొందాలని యెహోవా కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఈ మూడు ప్రశ్నల్ని పరిశీలిద్దాం: (1) చిన్నప్పుడు లైంగిక దాడికి గురైనవాళ్లకు ఓదార్పు ఎందుకు అవసరం? (2) వాళ్లను ఎవరు ఓదార్చగలరు? (3) వాళ్లను మనం ఎలా ఓదార్చవచ్చు?

ఓదార్పు ఎందుకు అవసరం?

4-5. (ఎ) పెద్దవాళ్ల కన్నా పిల్లలు వేరుగా ఉంటారని గుర్తుపెట్టుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) లైంగిక దాడి జరిగినప్పుడు, పిల్లలకు ఇతరులపై ఉన్న నమ్మకం ఏమౌతుంది?

4 చిన్నప్పుడు లైంగిక దాడికి గురైన కొంతమందికి, ఆ దాడి జరిగి చాలా సంవత్సరాలు గడిచాక కూడా ఓదార్పు అవసరం కావచ్చు. ఎందుకు? దాన్ని అర్థంచేసుకోవాలంటే, పిల్లలు పెద్దవాళ్ల కన్నా చాలా వేరుగా ఉంటారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి దాడులు పెద్దవాళ్లకు చేసే హాని కన్నా పిల్లలకు చేసే హాని ఎక్కువ. కొన్ని ఉదాహరణల్ని పరిశీలించండి.

5 తమను పెంచే, తమ బాగోగులు చూసుకునే వాళ్లతో పిల్లలు సన్నిహితంగా ఉండాలి, వాళ్లను నమ్మగలగాలి. అప్పుడే పిల్లలు సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారు, అలాగే తమను ప్రేమించే ఇతరుల్ని నమ్మడం నేర్చుకుంటారు. (కీర్త. 22:9) విచారకరంగా, చాలా సందర్భాల్లో లైంగిక దాడి ఇంట్లోనే జరుగుతుంది. పైగా ఆ దాడి చేసేది ఎక్కువగా సన్నిహిత కుటుంబ సభ్యులు, బాగా తెలిసినవాళ్లే. నమ్మినవాళ్లే అలా దాడి చేస్తే, అది జరిగి చాలా సంవత్సరాలు గడిచాక కూడా పిల్లలకు ఇతరుల్ని నమ్మడం కష్టమౌతుంది.

6. లైంగిక దాడి క్రూరమైనది, హానికరమైనది అని ఎందుకు చెప్పవచ్చు?

6 పిల్లలు నిస్సహాయులు. అలాగే లైంగిక దాడి క్రూరమైనది, హానికరమైనది. వివాహ ఏర్పాటులో ఉండే సెక్స్‌కు శారీరకంగా, భావోద్రేకంగా, మానసికంగా సిద్ధమవ్వడానికి చాలా సంవత్సరాల ముందే పిల్లల్ని అలాంటి పనుల్లో పాల్గొనమని బలవంతం చేయడంవల్ల వాళ్లకు ఎంతో హాని జరగవచ్చు. పిల్లలపై లైంగిక దాడి జరిగినప్పుడు వాళ్లకు సెక్స్‌ మీద తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుంది. అంతేకాదు తాము ఎందుకూ పనికిరానివాళ్లమని భావిస్తారు, ఇతరుల మీద వాళ్లకున్న నమ్మకం కూడా పోతుంది.

7. (ఎ) పిల్లల్ని మోసం చేయడం ఎందుకు తేలిక? లైంగిక దాడి చేసే వ్యక్తి పిల్లల్ని ఎలా మోసం చేస్తాడు? (బి) అలాంటి అబద్ధాలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?

7 పిల్లలకు ఆలోచించే, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం గానీ ప్రమాదాన్ని పసిగట్టి దాన్ని తప్పించుకునే సామర్థ్యం గానీ అంతగా ఉండదు. (1 కొరిం. 13:11) కాబట్టి వాళ్లను మోసం చేయడం, వాళ్లపై దాడి చేయడం చాలా తేలిక. లైంగిక దాడి చేసేవాళ్లు పిల్లలకు హానికరమైన అబద్ధాలు చెప్తారు. ఉదాహరణకు, జరిగిన దాంట్లో తప్పంతా పిల్లలదేనని, దీని గురించి ఎవ్వరికీ చెప్పకూడదని, ఒకవేళ చెప్పినా ఎవ్వరూ వినరని, పట్టించుకోరని, ఇలాంటి పనుల ద్వారా పెద్దవాళ్లు, పిల్లలు ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకోవడం తప్పేం కాదని చెప్తారు. కానీ అవన్నీ నిజం కాదని అర్థంచేసుకోవడానికి పిల్లలకు చాలా సంవత్సరాలు పడుతుంది. లైంగిక దాడికి గురైన పిల్లలు పెరిగి పెద్దౌతుండగా తాము చెడిపోయామని, అపవిత్రులయ్యామని, ఇతరుల ప్రేమకు లేదా ఓదార్పుకు అర్హులం కాదని భావిస్తారు.

8. బాధ అనుభవిస్తున్న వాళ్లను యెహోవా ఓదారుస్తాడని మనం ఎందుకు నమ్మవచ్చు?

8 కాబట్టి లైంగిక దాడికి గురైనవాళ్లు చాలాకాలంపాటు ఎందుకు బాధ అనుభవిస్తారో మనం అర్థంచేసుకోవచ్చు. లైంగిక దాడి అనేది చాలా క్రూరమైన నేరం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి దాడుల్ని చూస్తుంటే మనం చివరి రోజుల్లో జీవిస్తున్నామని స్పష్టంగా అర్థమౌతుంది. చివరి రోజుల్లో ఎక్కువమంది ‘మమకారం లేనివాళ్లుగా’ ఉంటారని, ‘దుష్టులు, మోసగాళ్లు అంతకంతకూ చెడిపోతారని’ బైబిలు చెప్తుంది. (2 తిమో. 3:1-5, 13) సాతాను పన్నాగాలు నిజంగా చాలా చెడ్డవి, దానికితోడు ప్రజలు సాతాను ఇష్టపడే పనులు చేయడం విచారకరం. కానీ యెహోవా సాతాను కన్నా, అతని చెప్పుచేతల్లో ఉండే ప్రజలకన్నా ఎంతో శక్తిమంతుడు. సాతాను చేసే పనులు యెహోవాకు తెలుసు. మనం పడే బాధ యెహోవాకు పూర్తిగా తెలుసని, మనకు కావాల్సిన ఓదార్పు ఆయన ఇవ్వగలడని మనం నమ్మకంతో ఉండవచ్చు. మన దేవుడు “ఎలాంటి పరిస్థితిలోనైనా ఓదార్పును ఇచ్చే దేవుడు. ఆయన మన కష్టాలన్నిటిలో మనల్ని ఓదారుస్తాడు. దానివల్ల, దేవుని నుండి మనం పొందే ఓదార్పుతో ఎలాంటి కష్టాల్లో ఉన్నవాళ్లనైనా ఓదార్చగలుగుతాం.” మనం అలాంటి దేవున్ని సేవిస్తున్నందుకు చాలా సంతోషిస్తాం. (2 కొరిం. 1:3, 4) అయితే యెహోవా ఎవరి ద్వారా ఓదార్పునిస్తాడు?

ఎవరు ఓదార్పు ఇవ్వగలరు?

9. కీర్తన 27:10⁠లో ఉన్న రాజైన దావీదు మాటల ప్రకారం, కుటుంబ సభ్యులు పట్టించుకోకుండా వదిలేసిన వాళ్ల విషయంలో యెహోవా ఏం చేస్తాడు?

9 తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల దాడికి గురైన పిల్లలకు లేదా బాగా తెలిసినవాళ్ల చేతుల్లో దాడికి గురైన పిల్లలకు ముఖ్యంగా ఓదార్పు అవసరం. యెహోవా ఎల్లప్పుడూ ఓదార్పును ఇస్తాడనే విషయం రాజైన దావీదుకు తెలుసు. (కీర్తన 27:10 చదవండి.) కుటుంబ సభ్యులు పట్టించుకోకుండా వదిలేసిన వాళ్లను యెహోవా చేరదీస్తాడని దావీదు నమ్మాడు. యెహోవా ఆ పని ఎలా చేస్తాడు? దానికోసం ఆయన తన నమ్మకమైన సేవకుల్ని ఉపయోగించుకుంటాడు. సంఘంలో ఉండే మన సహోదరసహోదరీలే మనకు కుటుంబం. ఉదాహరణకు, తనతోపాటు యెహోవాను ఆరాధించేవాళ్లే తన సహోదరులు, సహోదరీలు, తల్లి అని యేసు ఒక సందర్భంలో అన్నాడు.—మత్త. 12:48-50.

10. సంఘపెద్దగా తాను చేసిన పని గురించి అపొస్తలుడైన పౌలు ఏం చెప్పాడు?

10 క్రైస్తవ సంఘంలోని సహోదరసహోదరీలు కుటుంబ సభ్యుల్లా ఉంటారనడానికి ఒక ఉదాహరణ పరిశీలించండి. అపొస్తలుడైన పౌలు కష్టపడి పనిచేసే, నమ్మకమైన సంఘపెద్ద. ఆయన మంచి ఆదర్శాన్ని ఉంచాడు. అంతేకాదు తాను యేసును అనుకరించినట్లే తనను అనుకరించమని ఆయన పవిత్రశక్తి ప్రేరణతో చెప్పాడు. (1 కొరిం. 11:1) సంఘపెద్దగా తన పని గురించి పౌలు ఒకసారి ఏం చెప్పాడో గమనించండి: “పాలిచ్చే తల్లి తన పిల్లల్ని అపురూపంగా చూసుకున్నట్టు, మేము మీతో మృదువుగా వ్యవహరించాం.” (1 థెస్స. 2:7) నేడు నమ్మకమైన సంఘపెద్దలు కూడా బైబిల్ని ఉపయోగిస్తూ ఇతరుల్ని ఓదార్చేటప్పుడు పౌలులాగే మృదువైన, సున్నితమైన మాటల్ని ఉపయోగిస్తారు.

పరిణతిగల సహోదరీలు చక్కగా ఓదార్చగలరు (11వ పేరా చూడండి) *

11. బాధపడుతున్న వాళ్లను ఓదార్చగలిగేది సంఘపెద్దలు మాత్రమే కాదని ఎలా చెప్పవచ్చు?

11 అయితే, లైంగిక దాడికి గురైనవాళ్లకు ఓదార్పు ఇవ్వగలిగేది సంఘపెద్దలు మాత్రమేనా? కాదు. “ఒకరికొకరు ఊరటను ఇచ్చుకుంటూ” ఉండాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. (1 థెస్స. 4:18) ముఖ్యంగా పరిణతిగల క్రైస్తవ సహోదరీలు ఓదార్పు అవసరమైన సహోదరీలకు ఎంతో సహాయంగా ఉండవచ్చు. ఒక సందర్భంలో యెహోవా కూడా, కుమారుణ్ణి ఓదార్చే ఒక తల్లితో తనను తాను పోల్చుకున్నాడు. (యెష. 66:13) కృంగిపోయినవాళ్లను ఓదార్చిన స్త్రీల ఉదాహరణలు కూడా బైబిల్లో ఉన్నాయి. (యోబు 42:11) నేడు క్రైస్తవ స్త్రీలు, మానసిక క్షోభ అనుభవిస్తున్న తోటి సహోదరీలను ఓదార్చడం చూసి యెహోవా ఎంత సంతోషిస్తాడో కదా! కొన్ని సందర్భాల్లో, అలాంటి వేదన అనుభవిస్తున్న ఒక సహోదరికి సహాయం చేయడం వీలౌతుందేమో అని సంఘపెద్దలు పరిణతిగల ఒక సహోదరిని అడగవచ్చు. *

మనం ఎలా ఓదార్పు ఇవ్వవచ్చు?

12. మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి?

12 మనం అలాంటి ఒక సహోదరునికి లేదా సహోదరికి సహాయం చేస్తున్నప్పుడు, వాళ్లు మాట్లాడడానికి ఇష్టపడని విషయాల గురించి అడగకూడదు. (1 థెస్స. 4:11) మరి సహాయం, ఓదార్పు అవసరమైనవాళ్లకు మనం ఏం చేయవచ్చు? ఇతరులను ఓదార్చడానికి సహాయపడే ఐదు లేఖనాధార మార్గాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.

13. మొదటి రాజులు 19:5-8⁠లో ఉన్నట్లు, యెహోవా దూత ఏలీయాకు ఎలా సహాయం చేశాడు? మనం ఆ దేవదూతను ఎలా అనుకరించవచ్చు?

13 వాళ్లకు అవసరమైన సహాయం చేయండి. తనను చంపడానికి ప్రయత్నిస్తున్నవాళ్ల నుండి పారిపోతున్నప్పుడు ఏలీయా ఎంత నిరుత్సాహపడ్డాడంటే ఆయనకు చనిపోవాలని అనిపించింది. నిరాశలో ఉన్న ఏలీయా దగ్గరకు యెహోవా ఒక బలమైన దేవదూతను పంపించాడు. ఆ దేవదూత ఏలీయాకు సరిగ్గా అవసరమైన సహాయం చేశాడు, ఆయన ఏలీయాకు వేడివేడి ఆహారం వండి పెట్టి, దాన్ని తినమని దయగా చెప్పాడు. (1 రాజులు 19:5-8 చదవండి.) ఆ వృత్తాంతం ఒక సత్యాన్ని తెలియజేస్తుంది. అదేంటంటే, కొన్నిసార్లు మనం దయతో చేసే ఒక చిన్న పని ఇతరులకు ఎంతో మేలు చేస్తుంది. బాధ అనుభవిస్తున్న ఒక సహోదరుడిని లేదా సహోదరిని మనం ప్రేమిస్తున్నామని చూపించడానికి వాళ్లకోసం ఆహారం వండి పెట్టడం, ఒక చిన్న గిఫ్ట్‌ ఇవ్వడం లేదా ఒక గ్రీటింగ్‌ కార్డు మీద ప్రోత్సాహకరమైన మాటలు రాసి ఇవ్వడం లాంటివి చేయవచ్చు. ఒకవేళ వాళ్లకు జరిగిన దానిగురించి వాళ్లతో మాట్లాడడం మనకు ఇబ్బందిగా అనిపించినా, వాళ్లకు అవసరమైన సహాయం చేయడం ద్వారా వాళ్లపట్ల మనకు శ్రద్ధ ఉందని చూపించవచ్చు.

14. ఏలీయా వృత్తాంతం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

14 వాళ్లు సురక్షితంగా, సౌకర్యంగా ఉన్నట్లు భావించేలా చేయండి. ఏలీయా వృత్తాంతం నుండి మనం ఇంకో పాఠం కూడా నేర్చుకోవచ్చు. యెహోవా అద్భుతరీతిలో ఏలీయాకు శక్తిని ఇవ్వడం వల్ల ఆయన చాలా దూరం నడిచి హోరేబు కొండకు చేరుకున్నాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితం యెహోవా తన ప్రజలతో ఒప్పందం చేసుకున్న ఆ స్థలంలో తాను సురక్షితంగా ఉన్నట్లు బహుశా ఏలీయా భావించి ఉంటాడు. చివరికి, తనను చంపడానికి ప్రయత్నిస్తున్నవాళ్లకు అందనంత దూరంలో ఉన్నానని ఏలీయాకు అనిపించివుంటుంది. దీన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? లైంగిక దాడికి గురైనవాళ్లకు ఓదార్పు ఇవ్వాలంటే, ముందుగా వాళ్లు సురక్షితంగా ఉన్నామని భావించేలా చేయాలి. ఉదాహరణకు, కృంగుదలలో ఉన్న ఒక సహోదరికి రాజ్యమందిరంలో కన్నా తన ఇంటి దగ్గరే మాట్లాడడం మరింత సురక్షితంగా, సౌకర్యంగా అనిపించవచ్చు అనే విషయాన్ని సంఘపెద్దలు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొంతమందికేమో, రాజ్యమందిరంలో మాట్లాడడం సౌకర్యంగా అనిపించవచ్చు.

ఓపిగ్గా వినడం ద్వారా, హృదయపూర్వకంగా ప్రార్థించడం ద్వారా, ఓదార్పునిచ్చే మాటల్ని ఎంపిక చేసుకోవడం ద్వారా మనం వాళ్ల గాయాన్ని మాన్పవచ్చు (15-20 పేరాలు చూడండి) *

15-16. శ్రద్ధగా వినడమంటే ఏంటి?

15 వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినండి. బైబిలు ఈ సూటైన సలహా ఇస్తుంది. “ప్రతీ ఒక్కరు వినడానికి సిద్ధంగా ఉండాలి, తొందరపడి మాట్లాడకూడదు.” (యాకో. 1:19) మరి మనం శ్రద్ధగా వింటున్నామా? శ్రద్ధగా వినడమంటే అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వాళ్ల వైపే చూస్తూ, ఏమీ మాట్లాడకుండా ఉండడం అని మనం అనుకోవచ్చు. కానీ శ్రద్ధగా వినడంలో అంతకన్నా ఎక్కువే ఉంది. ఉదాహరణకు, ఏలీయా తన ఆందోళనను చివరికి యెహోవా ముందు కుమ్మరించాడు, అప్పుడు యెహోవా దాన్ని విన్నాడు. ఏలీయా భయపడుతున్నాడని, ఒంటరిగా భావిస్తున్నాడని, తాను చేసిన సేవ వృథా అయిపోయిందని అనుకుంటున్నాడని యెహోవా అర్థంచేసుకున్నాడు. ఏలీయా తన ఆందోళనలన్నిటిని అధిగమించడానికి యెహోవా ప్రేమతో సహాయం చేశాడు. ఆ విధంగా, ఏలీయా చెప్పింది తాను నిజంగా విన్నానని యెహోవా చూపించాడు.—1 రాజు. 19:9-11, 15-18.

16 ఒక సహోదరుడు లేదా సహోదరి చెప్పేది వింటున్నప్పుడు మనం సానుభూతిని, కనికరాన్ని ఎలా చూపించవచ్చు? మనం జాగ్రత్తగా ఎంపిక చేసుకొని, ఆప్యాయంగా మాట్లాడే కొన్ని మాటలు వాళ్ల విషయంలో మనం ఎలా భావిస్తున్నామో తెలియజేస్తాయి. ఉదాహరణకు మీరు ఇలా అనవచ్చు: “మీకు ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది! పిల్లలెవ్వరికీ ఇలా జరగకూడదు!” ఆందోళనలో ఉన్న మీ స్నేహితులు చెప్పేది సరిగ్గా అర్థంచేసుకోవడానికి మీరు ఒకట్రెండు ప్రశ్నలు అడగవచ్చు. “మీరు చెప్పింది అర్థంకాలేదు, కాస్త వివరిస్తారా?” లేదా “మీరు అంటున్నది ఇదేనా . . . నేను సరిగ్గానే అర్థం చేసుకున్నానా?” అని మీరు అడగవచ్చు. అలా ప్రేమగా మాట్లాడడం వల్ల మీరు నిజంగా వింటున్నారని, చెప్పేది అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అవతలి వ్యక్తి నమ్ముతాడు.—1 కొరిం. 13:4, 7.

17. మనం ఎందుకు ఓర్పు చూపించాలి? ఎందుకు “తొందరపడి మాట్లాడకూడదు”?

17 అయితే, ‘తొందరపడి మాట్లాడకుండా’ జాగ్రత్తపడండి. వాళ్లు మాట్లాడుతున్నప్పుడు, సలహా ఇవ్వడానికో వాళ్లను సరిజేయడానికో మధ్యలో మాట్లాడకండి. బదులుగా ఓర్పు చూపించండి! ఎంతో ఆందోళనలో ఉన్న ఏలీయా తన భావాల్ని యెహోవాకు చెప్పుకునేటప్పుడు చాలా బాధగా మాట్లాడాడు. తర్వాత, యెహోవా ఏలీయా విశ్వాసాన్ని బలపర్చిన కాసేపటికే, ఆయన మళ్లీ అంతకుముందు చెప్పిన మాటల్నే చెప్తూ తన భావాల్ని యెహోవాకు చెప్పుకున్నాడు. (1 రాజు. 19:9, 10, 13, 14) దీన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? కొన్నిసార్లు బాధలో ఉన్నవాళ్లు తమ భావాల్ని ఒకటి కన్నా ఎక్కువసార్లు మనతో చెప్పుకుంటారు. అప్పుడు మనం యెహోవాలా ఓపిగ్గా వినాలి. ఆ సమయంలో వాళ్ల సమస్యకు పరిష్కారం చెప్పడానికి ప్రయత్నించే బదులు వాళ్లపట్ల సానుభూతిని, కనికరాన్ని చూపిస్తాం.—1 పేతు. 3:8.

18. మన ప్రార్థనలు బాధలో ఉన్నవాళ్లను ఎందుకు ఓదారుస్తాయి?

18 బాధలో ఉన్నవాళ్లతో కలిసి హృదయపూర్వకంగా ప్రార్థించండి. తీవ్రంగా కృంగిపోయినవాళ్లకు ప్రార్థన చేసుకోవడం కష్టంగా ఉండవచ్చు. యెహోవాతో మాట్లాడే అర్హత తమకు లేదని వాళ్లు భావించవచ్చు. అలాంటివాళ్లను ఓదార్చాలంటే మనం వాళ్లతో కలిసి, వాళ్ల పేరు ప్రస్తావిస్తూ ప్రార్థన చేయవచ్చు. వాళ్లు మనకు, అలాగే సంఘంలోనివాళ్లకు ఎంత ప్రియమైనవాళ్లో ఆ ప్రార్థనలో చెప్పవచ్చు. తన అమూల్యమైన ఆ సేవకుడికి లేదా సేవకురాలికి ఊరటను, ఓదార్పును ఇవ్వమని యెహోవాను అడగవచ్చు. అలాంటి ప్రార్థనలు ఎంతో ఓదార్పునిస్తాయి.—యాకో. 5:16.

19. ఇతరుల్ని ఓదార్చడానికి మనం ఎలా సిద్ధపడవచ్చు?

19 గాయాన్ని మాన్పే, ఓదార్పునిచ్చే మాటల్ని ఎంపిక చేసుకోండి. మాట్లాడే ముందు ఆలోచించండి. అనాలోచితంగా మాట్లాడే మాటలు వాళ్లను బాధపెట్టవచ్చు. దయగల మాటలు గాయాన్ని మాన్పగలవు. (సామె. 12:18) కాబట్టి దయగా మాట్లాడడానికి, ఓదార్పును, ఊరటను ఇచ్చేలా మాట్లాడడానికి సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించండి. అయితే వేరే ఏ మాటలకన్నా బైబిల్లో ఉన్న యెహోవా మాటలే చాలా శక్తివంతమైనవని గుర్తుపెట్టుకోండి.—హెబ్రీ. 4:12.

20. లైంగిక దాడికి గురైన కొంతమంది సహోదరసహోదరీలు తమ గురించి తాము ఏమనుకుంటారు? వాళ్లకు మనం ఏ విషయం గుర్తుచేయాలి?

20 లైంగిక దాడికి గురైన కొంతమంది సహోదరసహోదరీలు తాము అపవిత్రులమని, ఎందుకూ పనిరానివాళ్లమని, ఇతరుల ప్రేమను పొందడానికి అర్హులం కామని అనుకుంటారు. కానీ అది పచ్చి అబద్ధం! కాబట్టి లేఖనాలు ఉపయోగిస్తూ, వాళ్లు యెహోవా దృష్టిలో ఎంతో విలువైనవాళ్లని గుర్తుచేయండి. (“ లేఖనాలు ఇచ్చే ఓదార్పు” అనే బాక్సు చూడండి.) ఒకానొక సమయంలో దానియేలు ప్రవక్త నిరుత్సాహపడి, కృంగిపోయినప్పుడు ఒక దేవదూత ఆయన్ని ఎలా దయతో బలపర్చాడో గుర్తుచేసుకోండి. దానియేలు తనకు ఎంతో అమూల్యమైనవాడని తెలుసుకునేలా యెహోవా దానియేలుకు సహాయం చేశాడు. (దాని. 10:2, 11, 19) అదేవిధంగా ఆందోళనలో ఉన్న మన సహోదరసహోదరీలు కూడా యెహోవాకు ఎంతో అమూల్యమైనవాళ్లు!

21. తప్పుచేసి పశ్చాత్తాపపడని వాళ్లందరికీ ఏం జరగబోతుంది? ఈలోగా మనం ఏం చేయాలని నిశ్చయించుకోవాలి?

21 మనం ఇతరుల్ని ఓదార్చినప్పుడు, యెహోవాకు వాళ్లమీదున్న ప్రేమను గుర్తుచేస్తాం. యెహోవా న్యాయంగల దేవుడనే విషయాన్ని కూడా మనం ఎన్నడూ మర్చిపోకూడదు. లైంగిక దాడికి సంబంధించిన ఎలాంటి చెడ్డ పనైనా యెహోవా కంటపడకుండా ఉండదు. ఆయన అందర్నీ చూస్తున్నాడు, తప్పుచేసి పశ్చాత్తాపపడని వాళ్లందరికీ శిక్షపడేలా ఆయన చేస్తాడు. (సంఖ్యా. 14:18) ఈలోగా, లైంగిక దాడికి గురైన వాళ్లందరిపట్ల మనం ప్రేమ చూపించడానికి చేయగలిగినదంతా చేద్దాం. సాతాను, అతని లోకం చేతుల్లో దాడికి గురైన వాళ్లందరి గాయాల్ని యెహోవా శాశ్వతంగా నయం చేస్తాడని తెలుసుకోవడం ఎంత ఓదార్పును ఇస్తుందో కదా! త్వరలోనే, మనకు బాధ కలిగించే ఇలాంటి విషయాలు ఇక ఎప్పుడూ గుర్తుకురావు, అవి మన హృదయంలో కూడా ఉండవు.—యెష. 65:17.

పాట 109 మనస్ఫూర్తిగా ప్రగాఢమైన ప్రేమ చూపించండి

^ పేరా 5 చిన్నప్పుడు లైంగిక దాడికి గురైనవాళ్లు ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా మానసిక క్షోభ అనుభవిస్తుండవచ్చు. దానికిగల కారణాన్ని అర్థంచేసుకోవడానికి ఈ ఆర్టికల్‌ మనకు సహాయం చేస్తుంది. అంతేకాదు అలాంటివాళ్లకు ఎవరు ఓదార్పు ఇవ్వగలరో, మనం వాళ్లను ఎలా ఓదార్చవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

^ పేరా 11 లైంగిక దాడికి గురైన వ్యక్తి డాక్టరు సహాయం తీసుకోవాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయం.

^ పేరా 76 చిత్రాల వివరణ: మానసిక క్షోభ అనుభవిస్తున్న ఒక సహోదరిని ఓదారుస్తున్న పరిణతిగల సహోదరి.

^ పేరా 78 చిత్రాల వివరణ: బాధలో ఉన్న సహోదరితో మాట్లాడుతున్న ఇద్దరు సంఘపెద్దలు. ఆ సమయంలో తనతోపాటు ఉండడానికి ఆమె పరిణతిగల సహోదరిని పిలిచింది.