కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 21

“ఈ లోకపు తెలివి” వల్ల మోసపోకండి

“ఈ లోకపు తెలివి” వల్ల మోసపోకండి

“ఈ లోకపు తెలివి దేవుని దృష్టిలో మూర్ఖత్వం.”—1 కొరిం. 3:19.

పాట 98 లేఖనాల్ని దేవుడు ప్రేరేపించాడు

ఈ ఆర్టికల్‌లో . . . *

1. దేవుని వాక్యం మనకు ఏం ఇస్తుంది?

యెహోవా మనకు మహాగొప్ప ఉపదేశకుడిగా ఉన్నాడు కాబట్టి మనం ఏ సమస్యనైనా అధిగమించగలం. (యెష. 30:20, 21) ‘ప్రతీ మంచి పని చేయడానికి పూర్తిగా సమర్థులు’ అవ్వడానికి, ‘పూర్తిగా సిద్ధంగా ఉండడానికి’ కావాల్సిన ప్రతీది దేవుని వాక్యం మనకు ఇస్తుంది. (2 తిమో. 3:17) మనం బైబిలు బోధల ప్రకారం జీవించినప్పుడు, “ఈ లోకపు” తెలివిని ప్రోత్సహించేవాళ్ల కన్నా తెలివైనవాళ్లం అవుతాం.—1 కొరిం. 3:19; కీర్త. 119:97-100.

2. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

2 మనం ఇప్పుడు పరిశీలించబోతున్నట్లు, ఈ లోకపు తెలివి మనల్ని స్వార్థ కోరికలు తీర్చుకోమని తరచూ ప్రోత్సహిస్తుంది. కాబట్టి లోకస్థుల్లా ఆలోచించకుండా, ప్రవర్తించకుండా ఉండడం మనకు కష్టం కావచ్చు. అందుకే బైబిలు మంచి కారణంతోనే ఇలా చెప్తుంది, “మనుషుల సంప్రదాయాల ప్రకారం . . . ఉన్న తత్త్వజ్ఞానంతో, మోసపూరితమైన వట్టి మాటలతో ఎవ్వరూ మిమ్మల్ని బానిసలుగా చేసుకోకుండా జాగ్రత్తపడండి.” (కొలొ. 2:8) అయితే, సాతాను బోధించే రెండు అబద్ధాల్ని ప్రజలు ఎలా నమ్మడం మొదలుపెట్టారో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. ప్రతీదాన్ని పరిశీలిస్తున్నప్పుడు, ఈ లోకపు తెలివి ఎందుకు మోసకరమైనదో, అలాగే దేవుని వాక్యంలోని తెలివి ఈ లోకం అందించే వేరే దేనికన్నా ఎందుకు చాలా ఉన్నతమైనదో తెలుసుకుంటాం.

నైతిక విషయాల్లో ప్రజల అభిప్రాయంలో వచ్చిన మార్పులు

3-4. అమెరికాలో 20వ శతాబ్దం తొలినాళ్లలో నైతిక విషయాలకు సంబంధించి ప్రజల అభిప్రాయంలో ఎలాంటి మార్పులు వచ్చాయి?

3 అమెరికాలో 20వ శతాబ్దం తొలినాళ్లలో నైతిక విషయాలకు సంబంధించి ప్రజల అభిప్రాయాల్లో పెద్ద మార్పు వచ్చింది. అంతకుముందు వరకు, పెళ్లయినవాళ్ల మధ్య మాత్రమే లైంగిక సంబంధాలు ఉండాలనీ, అది నలుగురిలో చర్చించే అంశం కాదనీ చాలామంది అనుకునేవాళ్లు. కానీ ఆ ప్రమాణాలు పూర్తిగా నీరుగారిపోయి, తప్పుడు అభిప్రాయాలు వ్యాప్తిచెందాయి.

4 మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రజల ప్రవర్తన, లైంగిక విషయాల్లో వాళ్ల అభిప్రాయం ఘోరంగా మారిపోయాయి. ఒక పరిశోధకురాలు ఇలా చెప్పింది, “సినిమాల్లో, నాటకాల్లో, పాటల్లో, నవలల్లో, వ్యాపార ప్రకటనల్లో అనైతిక విషయాలే ఎక్కువగా ఉండేవి.” ఆ సంవత్సరాల్లో, డాన్సులు కూడా రెచ్చగొట్టేవిగా తయారయ్యాయి, ప్రజలు ఒళ్లు కనిపించేలా బట్టలు వేసుకోవడం మొదలుపెట్టారు. చివరి రోజుల గురించి బైబిలు ముందే చెప్పినట్లు, ప్రజలు ముందెప్పుడూ లేనంత ఎక్కువగా ‘సుఖాల్ని ప్రేమించడం’ మొదలుపెట్టారు.—2 తిమో. 3:4.

లోకంలోని దిగజారిపోయిన నైతిక విలువల వల్ల యెహోవా ప్రజలు మోసపోరు (5, 9 పేరాలు చూడండి) *

5. నైతిక ప్రమాణాల విషయంలో 1960ల నుండి ప్రజల ఆలోచనకు ఏమైంది?

5 1960లలో, పెళ్లిచేసుకోకుండానే కలిసి జీవించడం, స్వలింగ సంపర్కం, విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైపోయాయి. వినోదంలో సెక్స్‌ని బహిరంగంగా చూపించడం మొదలుపెట్టారు. వీటన్నిటివల్ల వచ్చిన ఫలితం ఏంటి? ప్రజలు నైతిక ప్రమాణాలు పాటించకపోవడం వల్ల చాలా ఘోరమైన పర్యవసానాలు వచ్చాయని ఒక విద్యావేత్త చెప్పింది. ఉదాహరణకు, వాటివల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అయ్యాయని, తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాల సంఖ్య పెరిగిందని, మానసిక గాయాలు అయ్యాయని, చాలామంది అశ్లీల చిత్రాలకు బానిసలు అయ్యారని ఆమె చెప్పింది. ఎయిడ్స్‌ వంటి సుఖవ్యాధులు కూడా ఎక్కువౌతున్నాయి, దీనంతటిని బట్టి ఈ లోకపు తెలివి చాలా మోసకరమైనదని అర్థమౌతుంది.—2 పేతు. 2:19.

6. సెక్స్‌ విషయంలో లోకస్థుల అభిప్రాయం సాతాను ఇష్టానికి అనుగుణంగా ఉందని ఎలా చెప్పవచ్చు?

6 లైంగిక విషయాల్లో లోకస్థుల అభిప్రాయం సాతాను ఇష్టానికి అనుగుణంగా ఉంది. ప్రజలు దేవుడిచ్చిన బహుమానమైన సెక్స్‌ని దుర్వినియోగం చేయడం, పెళ్లి ఏర్పాటును అగౌరవపర్చడం చూసి సాతాను తప్పకుండా సంతోషిస్తాడు. (ఎఫె. 2:2) లైంగిక పాపాలు చేసే వ్యక్తి, పిల్లల్ని కనడం అనే యెహోవా ఇచ్చిన బహుమానానికి విలువలేదన్నట్లు చూపించడమే కాదు శాశ్వత జీవితాన్ని కూడా కోల్పోతాడు.—1 కొరిం. 6:9, 10.

నైతిక విషయాల్లో బైబిలు అభిప్రాయం

7-8. లైంగిక విషయాల గురించి ఈ లోకపు తెలివి చెప్పే దానికన్నా బైబిలు చెప్పేది ఎందుకు చాలా ఉన్నతమైనది?

7 ఈ లోకపు తెలివి ప్రకారం జీవించే ప్రజలు, బైబిల్లోని నైతిక ప్రమాణాలు మన కాలానికి పనికిరావని చెప్తూ వాటిని ఎగతాళి చేస్తారు. బహుశా వాళ్లు ఇలా అడగవచ్చు, ‘అసలు దేవుడు మనల్ని లైంగిక కోరికలతో సృష్టించి, వాటికి దూరంగా ఉండమని ఎందుకు చెప్తాడు?’ అయితే అలాంటి ప్రశ్న, మనుషులు తమకు కలిగే ప్రతీ కోరికను తప్పకుండా తీర్చుకోవాలనే తప్పుడు ఆలోచన మీద ఆధారపడివుంది. కానీ దానికి భిన్నంగా బైబిలు మాత్రం, మనకు కలిగే ప్రతీ కోరికకు లొంగిపోవాల్సిన అవసరం లేదని, తప్పు చేయకుండా పోరాడే సామర్థ్యం మనకుందని చెప్తుంది. (కొలొ. 3:5) దాంతోపాటు, లైంగిక కోరికల్ని సరైన పద్ధతిలో తీర్చుకోవడానికి యెహోవా పెళ్లి అనే ఏర్పాటు చేశాడు. (1 కొరిం. 7:8, 9) ఆ ఏర్పాటులో, లైంగిక పాపం వల్ల కలిగే ఇబ్బందులు, అపరాధ భావాలు లేకుండా భార్యాభర్తలు లైంగిక కోరికల్ని తీర్చుకోవచ్చు.

8 ఈ లోకపు తెలివికి భిన్నంగా, లైంగిక విషయాల గురించి బైబిలు సరైన అభిప్రాయాన్ని బోధిస్తుంది. దానిలో ఆనందం ఉంటుందని బైబిలు చెప్తుంది. (సామె. 5:18, 19) అయితే, “మీరు పవిత్రంగా, గౌరవప్రదంగా ఉండాలంటే మీలో ప్రతీ ఒక్కరికి మీ శరీరాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలిసివుండాలి. మీరు దేవుడు తెలియని ప్రజల్లా అత్యాశతో కూడిన లైంగిక వాంఛతో రగిలిపోకూడదు” అని కూడా బైబిలు చెప్తుంది.—1 థెస్స. 4:4, 5.

9. (ఎ) ఇరవై శతాబ్దపు తొలినాళ్లలో యెహోవా ప్రజలు దేవుని వాక్యంలోని ఉన్నతమైన తెలివి ప్రకారం జీవించడానికి ఏది సహాయం చేసింది? (బి) 1 యోహాను 2:15, 16⁠లో ఏ తెలివైన సలహా ఉంది? (సి) రోమీయులు 1:24-27⁠లో ఉన్న ఎలాంటి అనైతిక పనులకు మనం దూరంగా ఉండాలి?

9 ఇరవై శతాబ్దపు తొలినాళ్లలో యెహోవా ప్రజలు, ‘నైతిక విచక్షణ కోల్పోయిన’ ప్రజల ఆలోచనల వల్ల మోసపోలేదు. (ఎఫె. 4:19) వాళ్లు యెహోవా ప్రమాణాలను అంటిపెట్టుకుని ఉండడానికి కృషిచేశారు. 1926, మే 15 వాచ్‌ టవర్‌ ఇలా చెప్పింది, “ఒక పురుషుడు లేదా స్త్రీ తన ఆలోచనల్లో, పనుల్లో ముఖ్యంగా భిన్న లింగ వ్యక్తులతో వ్యవహరిస్తున్నప్పుడు పవిత్రంగా, స్వచ్ఛంగా ఉండాలి.” తమ చుట్టూ ఏం జరుగుతున్నా సరే యెహోవా ప్రజలు మాత్రం దేవుని వాక్యంలోని ఉన్నతమైన తెలివి ప్రకారం జీవించారు. (1 యోహాను 2:15, 16 చదవండి.) దేవుని వాక్యం ఉన్నందుకు మనమెంత కృతజ్ఞులమో కదా! నైతిక విషయాల్లో ఈ లోకపు తెలివి వల్ల మోసపోకుండా యెహోవా ఎప్పటికప్పుడు ఇస్తున్న ఆధ్యాత్మిక ఆహారాన్నిబట్టి కూడా మనం కృతజ్ఞత కలిగివుంటాం. *రోమీయులు 1:24-27 చదవండి.

తమను తాము ప్రేమించుకునే విషయంలో వచ్చిన మార్పులు

10-11. చివరి రోజుల్లో ఏం జరుగుతుందని బైబిలు హెచ్చరించింది?

10 చివరి రోజుల్లో ప్రజలు తమను తాము ప్రేమించుకునేవాళ్లుగా తయారౌతారని బైబిలు హెచ్చరించింది. (2 తిమో. 3:1, 2) అందుకే ఈ లోకం స్వార్థపు ఆలోచనల్ని ప్రోత్సహించడం చూసి మనం ఆశ్చర్యపోం. ఒక రెఫరెన్సు పుస్తకం ఏం చెప్పిందంటే, 1970లలో ‘జీవితంలో విజయం ఎలా సాధించాలో చెప్పే పుస్తకాల సంఖ్య బాగా పెరిగిపోయింది.’ ఒకవ్యక్తి తన వ్యక్తిత్వాన్ని అస్సలు మార్చుకోకూడదని, తన వ్యక్తిత్వంలో ఏదో లోపం ఉన్నట్లు ఎప్పుడూ అనుకోకూడదని కొన్ని పుస్తకాలు ప్రోత్సహించాయి. అలాంటి ఒక పుస్తకంలో ఇలా ఉంది: ‘మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఎందుకంటే, మీ అంత అందమైన వ్యక్తి, ఆహ్లాదకరమైన, ఉత్తముడైన వ్యక్తి ప్రపంచంలోనే లేడు.’ ఒకవ్యక్తి ఎలా ప్రవర్తించాలో తనకు తానే నిర్ణయించుకోవాలని, తనకు ఏది సరైనదిగా, అనుకూలంగా అనిపిస్తే అదే చేయాలని ఆ పుస్తకం చెప్పింది.

11 ఆ మాటలు ఎప్పుడైనా విన్నట్లు అనిపిస్తోందా? హవ్వను అలాంటి పనే చేయమని సాతాను చెప్పాడు. ఆమె ‘మంచి చెడ్డలను ఎరిగి దేవతవలె’ అవ్వగలదని సాతాను చెప్పాడు. (ఆది. 3:5) నేడు, చాలామంది తమ గురించి తాము గొప్పగా ఊహించుకుంటారు, తమకు ఏది తప్పో ఏది ఒప్పో ఎవ్వరూ, ఆఖరికి దేవుడు కూడా చెప్పకూడదని అనుకుంటారు. ఉదాహరణకు, పెళ్లి గురించి ప్రజలకున్న అభిప్రాయంలో ఆ వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది.

ఒక క్రైస్తవుడు ఇతరుల అవసరాలకు, ముఖ్యంగా వివాహజత అవసరాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు (12వ పేరా చూడండి) *

12. పెళ్లి విషయంలో ఈ లోకం ఎలాంటి ఆలోచనను ప్రోత్సహిస్తుంది?

12 భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలని, వాళ్ల పెళ్లి ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని బైబిలు బోధిస్తుంది. భార్యాభర్తలు కలిసి ఉండాలని తీర్మానించుకోవాలని బైబిలు ప్రోత్సహిస్తుంది. అదిలా చెప్తుంది, “పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.” (ఆది. 2:24) కానీ ఈ లోకపు తెలివి ప్రకారం జీవించేవాళ్లు పూర్తి భిన్నమైన అభిప్రాయాన్ని కలిగివుంటారు. భర్త అయినా, భార్య అయినా తన సొంత అవసరాలకే ప్రాముఖ్యతనివ్వాలని వాళ్లు చెప్తుంటారు. విడాకుల గురించి రాసిన ఒక పుస్తకంలో ఇలా ఉంది, “కొన్ని దేశాల్లో, పెళ్లి ప్రమాణం చేసేటప్పుడు ‘మనిద్దరం బ్రతికివున్నంత కాలం’ అనే మాటను ‘మనకు ఒకరిమీద ఒకరికి ప్రేమ ఉన్నంత కాలం’ అని మార్చారు.” పెళ్లి విషయంలో అలాంటి నిర్లక్ష్య వైఖరి వల్ల ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం అయ్యాయి, ఎంతోమంది మానసిక క్షోభ అనుభవించారు. దీన్నిబట్టి పెళ్లి విషయంలో ఈ లోకపు తెలివి మోసపూరితమైనదని చాలా స్పష్టమౌతోంది.

13. గర్విష్ఠుల్ని యెహోవా అసహ్యించుకోవడానికి ఒక కారణం ఏంటి?

13 “గర్వహృదయులందరు యెహోవాకు హేయులు” అని బైబిలు చెప్తుంది. (సామె. 16:5) గర్విష్ఠుల్ని యెహోవా ఎందుకు అసహ్యించుకుంటున్నాడు? ఒక కారణం ఏంటంటే, తమను తాము ఎక్కువగా ప్రేమించుకునేవాళ్లు, అలా చేయమని ఇతరుల్ని ప్రోత్సహించేవాళ్లు సాతానులా గర్విష్ఠులుగా తయారౌతారు. ఒకసారి ఊహించుకోండి, ఈ సృష్టంతటినీ చేయడానికి దేవుడు ఉపయోగించుకున్న యేసును తనకు మొక్కమని అడిగాడంటే, సాతాను ఎంత గర్విష్ఠో కదా! (మత్త. 4:8, 9; కొలొ. 1:15, 16) అలా గర్వంతో ఉబ్బిపోయేవాళ్లను చూస్తే, ఈ లోకపు తెలివి దేవుని దృష్టిలో మూర్ఖత్వమని స్పష్టమౌతుంది.

మనమే అందరికన్నా ప్రాముఖ్యమనే ఆలోచన గురించి బైబిలు అభిప్రాయం

14. మనగురించి మనం సరైన ఆలోచన కలిగివుండడానికి రోమీయులు 12:3 ఎలా సహాయం చేస్తుంది?

14 మనగురించి మనం సరైన ఆలోచన కలిగివుండడానికి బైబిలు సహాయం చేస్తుంది. మనల్ని మనం కొంతమేరకు ప్రేమించుకోవడం సరైనదే అని బైబిలు చెప్తుంది. “నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి” అని యేసు చెప్పిన మాటను బట్టి, మన విషయంలో మనం కాస్త శ్రద్ధ తీసుకోవాలని అర్థమౌతుంది. (మత్త. 19:19) అయితే, మనమే అందరికన్నా ప్రాముఖ్యమని ఎన్నడూ అనుకోకూడదని బైబిలు బోధిస్తుంది. బదులుగా అదిలా చెప్తుంది, “గొడవలకు దిగే మనస్తత్వాన్ని, అహాన్ని చూపించకండి. వినయంతో ఇతరులు మీకన్నా గొప్పవాళ్లని ఎంచండి.”—ఫిలి. 2:3; రోమీయులు 12:3 చదవండి.

15. మనగురించి మనం సరైన ఆలోచన కలిగివుండే విషయంలో బైబిలు ఇస్తున్న సలహా తెలివైనదని మీకెందుకు అనిపిస్తుంది?

15 నేడు మేధావులుగా భావించబడే చాలామంది, ఆ బైబిలు సలహా పనికిరాదని చెప్తారు. ఇతరుల్ని మనకన్నా గొప్పగా ఎంచితే, వాళ్లు మనల్ని మోసం చేసి, స్వార్థానికి వాడుకుంటారని వాళ్లు చెప్తారు. కానీ సాతాను లోకం ప్రోత్సహించే అలాంటి ఆలోచనా విధానం వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి? మీరేం గమనించారు? స్వార్థపరులు సంతోషంగా ఉన్నారా? వాళ్ల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయా? వాళ్లకు నిజమైన స్నేహితులు ఉన్నారా? వాళ్లకు దేవునితో దగ్గరి సంబంధం ఉందా? మీరు చూసినదాన్ని బట్టి ఏది ప్రయోజనకరం: ఈ లోకపు తెలివి ప్రకారం జీవించడమా? లేదా దేవుని వాక్యంలోని తెలివి ప్రకారం జీవించడమా?

16-17. మనం ఏ విషయంలో దేవునికి కృతజ్ఞులం? ఎందుకు?

16 ఈ లోకం దృష్టిలో మేధావులుగా ఉన్నవాళ్లను సలహా అడగడం, దారితప్పిపోయిన ఒకవ్యక్తిని దారి అడగడం లాంటిది. తన కాలంలోని తెలివైనవాళ్ల గురించి యేసు ఇలా చెప్పాడు, “వాళ్లే గుడ్డివాళ్లు, కానీ వేరేవాళ్లకు దారి చూపిస్తారు. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపిస్తే, వాళ్లిద్దరూ గుంటలో పడతారు.” (మత్త. 15:14) నిజంగా ఈ లోకపు తెలివి దేవుని దృష్టిలో మూర్ఖత్వమే.

యెహోవా సేవలో గడిపిన మధుర క్షణాల్ని గుర్తుచేసుకుంటూ ఆయన సేవకులు సంతోషిస్తారు (17వ పేరా చూడండి) *

17 బైబిల్లోని తెలివైన సలహాలు ఎల్లప్పుడూ “బోధించడానికి, గద్దించడానికి, సరిదిద్దడానికి, దేవుని నీతి ప్రమాణాల ప్రకారం క్రమశిక్షణ ఇవ్వడానికి ప్రయోజనకరంగా” ఉంటాయి. (2 తిమో. 3:16) యెహోవా తన సంస్థ ద్వారా ఈ లోకపు తెలివి నుండి మనల్ని కాపాడుతున్నందుకు ఆయనకు ఎంతో కృతజ్ఞులం! (ఎఫె. 4:14) ఆయనిచ్చే ఆధ్యాత్మిక ఆహారం ద్వారా బైబిలు ప్రమాణాల ప్రకారం జీవించడానికి కావాల్సిన బలం పొందుతాం. బైబిలు ద్వారా యెహోవా మనకు నమ్మదగిన తెలివిని, నిర్దేశాన్ని ఇవ్వడం ఎంత గొప్ప విషయమో కదా!

పాట 54 ఇదే త్రోవ

^ పేరా 5 యెహోవా మాత్రమే నమ్మదగిన నిర్దేశం ఇస్తాడనే మన విశ్వాసాన్ని ఈ ఆర్టికల్‌ బలపరుస్తుంది. అంతేకాదు, ఈ లోకపు తెలివి ప్రకారం జీవిస్తే ఘోరమైన పర్యవసానాలు వస్తాయనీ, దానికి భిన్నంగా దేవుని వాక్యంలో ఉన్న తెలివి ప్రకారం జీవించడం మనకు ప్రయోజనకరమనీ తెలుసుకుంటాం.

^ పేరా 9 ఉదాహరణకు, యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మక సమాధానాలు (ఇంగ్లీషు) 1వ సంపుటిలో 24,26 అధ్యాయాలు, అలాగే 2వ సంపుటిలో 4,5 అధ్యాయాలు చూడండి.

^ పేరా 50 చిత్రాల వివరణ: ఒక జంట జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు. ఆ సహోదరుడు, సహోదరి 1960ల చివరి భాగంలో ప్రీచింగ్‌ చేస్తున్నారు.

^ పేరా 52 చిత్రాల వివరణ: 1980లలో తన భార్యకు ఒంట్లో బాలేనప్పుడు ఆమెను శ్రద్ధగా చూసుకుంటున్న ఆ సహోదరుడు, అది గమనిస్తున్న వాళ్ల పాప.

^ పేరా 54 చిత్రాల వివరణ: నేడు, ఆ జంట యెహోవా సేవలో గడిపిన మధుర క్షణాల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆ పాప పెద్దయి తన కుటుంబంతో కలిసి వాళ్ల అమ్మానాన్నలతో సంతోషిస్తుంది.