కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 18

తడబడకుండా యేసును అనుసరించండి

తడబడకుండా యేసును అనుసరించండి

“ఏ సందేహం లేకుండా నా మీద నమ్మకం ఉంచే వ్యక్తి సంతోషంగా ఉంటాడు.”—మత్త. 11:6.

పాట 54 ఇదే త్రోవ

ఈ ఆర్టికల్‌లో . . . *

1. బైబిలు సందేశాన్ని మీరు మొదటిసారిగా ఇతరులకు చెప్పినప్పుడు ఏం జరిగింది?

ఇదే సత్యం అని మీరు మొదటిసారి గ్రహించిన సమయం మీకు గుర్తుందా? బైబిలు బోధలన్నీ చాలా స్పష్టంగా ఉన్నట్లు మీకు అనిపించాయి! అందరూ మీలాగే వాటిని నమ్ముతారని మీరు అనుకున్నారు. ఇప్పుడు సంతోషంగా ఉండడానికి, భవిష్యత్తు విషయంలో ఒక ఆశతో ఉండడానికి బైబిలు సందేశం వాళ్లకు సహాయం చేస్తుందని మీరు బలంగా నమ్మారు. (కీర్త. 119:105) కాబట్టి మీరు నేర్చుకున్న సత్యాల్ని మీ బంధువులకు, స్నేహితులకు, అందరికీ ఉత్సాహంగా చెప్పారు. కానీ ఏమైంది? మీరు చెప్పినవాటిని చాలామంది నమ్మకపోవడం చూసి మీరు ఆశ్చర్యపోయారు.

2-3. యేసు కాలంలోని చాలామంది ఆయన్ని నమ్మారా? వివరించండి.

2 మనం ప్రకటించే సందేశాన్ని ఇతరులు నమ్మకపోతే ఆశ్చర్యపోకూడదు. యేసు అద్భుతాలు చేసి దేవుని మద్దతు తనకు ఉందని చూపించినా, ఆయన కాలంలోని చాలామంది ఆయన్ని నమ్మలేదు. ఉదాహరణకు, యేసు లాజరును తిరిగి బ్రతికించాడు. యేసును వ్యతిరేకించినవాళ్లు కూడా ఆ అద్భుతాన్ని కాదనలేకపోయారు. అయినా యూదా నాయకులు యేసును మెస్సీయ అని నమ్మలేదు. పైగా వాళ్లు యేసును, లాజరును ఇద్దర్నీ చంపాలని చూశారు!—యోహా. 11:47, 48, 53; 12:9-11.

3 చాలామంది తనను మెస్సీయగా అంగీకరించరని యేసుకు తెలుసు. (యోహా. 5:39-44) ఒక సందర్భంలో యేసు, బాప్తిస్మమిచ్చే యోహాను శిష్యులతో ఇలా అన్నాడు: “ఏ సందేహం లేకుండా నా మీద నమ్మకం ఉంచే వ్యక్తి [లేదా, తడబడకుండా ఉండే వ్యక్తి] సంతోషంగా ఉంటాడు.” (మత్త. 11:2, 3, 6) చాలామంది యేసును ఎందుకు నమ్మలేదు?

4. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

4 యేసు కాలంలోని చాలామంది ఆయన్ని ఎందుకు నమ్మలేదో ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం. అలాగే, నేడు చాలామంది మన సందేశాన్ని ఎందుకు నమ్మట్లేదో కూడా చూస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా, మనం తడబడకుండా యేసు మీద బలమైన విశ్వాసం ఎందుకు ఉంచవచ్చో నేర్చుకుంటాం.

(1) యేసు నేపథ్యం

చాలామంది యేసు నేపథ్యం బట్టి తడబడ్డారు. అవే కారణాల్ని బట్టి నేడు కొంతమంది ఎలా తడబడే అవకాశం ఉంది? (5వ పేరా చూడండి) *

5. యేసు మెస్సీయ కాకపోవచ్చని కొంతమంది ఎందుకు అనుకొనివుంటారు?

5 చాలామంది యేసు నేపథ్యాన్ని బట్టి ఆయన్ని నమ్మలేదు. యేసు చాలా చక్కగా బోధిస్తున్నాడని, అద్భుతాలు చేస్తున్నాడని వాళ్లు ఒప్పుకున్నారు. కానీ వాళ్ల కంటికి, ఆయన కేవలం ఒక పేద వడ్రంగి కొడుకులా కనిపించాడు. అంతేకాదు, ఆయన నజరేతుకు చెందినవాడు. అది అంత పెద్ద పేరున్న నగరం ఏమీ కాకపోవచ్చు. యేసు శిష్యుడైన నతనయేలు కూడా మొదట్లో ఇలా అన్నాడు: “నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా?” (యోహా. 1:46) యేసు నివసిస్తున్న నజరేతు నగరాన్ని నతనయేలు చిన్నచూపు చూసివుంటాడు. లేదా, మెస్సీయ నజరేతులో కాదుగానీ బేత్లెహేములో పుడతాడని చెప్పిన మీకా 5:2 లోని ప్రవచనం అతని మనసులో ఉండివుంటుంది.

6. యేసే మెస్సీయ అని నమ్మడానికి ఆ కాలంనాటి ప్రజలకు ఏ వివరాలు సహాయం చేసి ఉండేవి?

6 లేఖనాలు ఏం చెప్తున్నాయి? యేసు శత్రువులు ‘[మెస్సీయ] తరానికి సంబంధించిన వివరాల్ని’ పట్టించుకోరని యెషయా ప్రవక్త ముందే చెప్పాడు. (యెష. 53:8) అలాంటి ఎన్నో వివరాల్ని లేఖనాలు ముందే చెప్పాయి. ఒకవేళ యేసు కాలంలోని ప్రజలు సమయం తీసుకుని వాస్తవాలన్నీ పరిశీలించి ఉంటే, ఆయన బేత్లెహేములో పుట్టాడని, ఆయన రాజైన దావీదు వంశస్థుడని తెలుసుకుని ఉండేవాళ్లు. (లూకా 2:4-7) నిజానికి, మీకా 5:2 లోని ప్రవచనం చెప్పినట్టు యేసు బేత్లెహేములోనే పుట్టాడు. మరి ఇక సమస్య ఏంటి? ప్రజలు పూర్తి వివరాలు పరిశీలించకుండా, వెంటనే ఒక ముగింపుకు వచ్చేశారు. అందుకే వాళ్లు యేసును నమ్మలేదు.

7. నేడు చాలామంది యెహోవా ప్రజల్ని ఏ కారణాల వల్ల నమ్మట్లేదు?

7 ఇప్పుడు కూడా అలాంటి సమస్యే ఉందా? ఉంది. యెహోవా ప్రజల్లో ఎక్కువశాతం మంది డబ్బు, పలుకుబడి ఉన్నవాళ్లు కాదు; వాళ్లను ‘చదువుకోని సామాన్యుల్లా’ చాలామంది చూస్తున్నారు. (అపొ. 4:13) యెహోవా ప్రజలు, మతానికి సంబంధించిన పెద్దపెద్ద పాఠశాలల్లో చదువుకోలేదు కాబట్టి, బైబిలు గురించి బోధించే అర్హత వాళ్లకు లేదని కొందరు అనుకుంటారు. మరికొందరేమో, యెహోవాసాక్షులది “అమెరికా మతం” అంటారు. నిజం చెప్పాలంటే, యెహోవాసాక్షుల్లో సుమారు 14 శాతం మంది మాత్రమే అమెరికాలో ఉన్నారు. ఇంకొందరేమో, యెహోవాసాక్షులు యేసును నమ్మరని అనుకుంటారు. గడిచిన సంవత్సరాల్లో వాళ్లపై “కమ్యూనిస్టులు,” “అమెరికా గూఢచారులు,” “తీవ్రవాదులు” అనే ముద్ర వేశారు. ఈ కట్టుకథలు విన్న చాలామంది, యెహోవా ప్రజల గురించి పూర్తి వివరాలు తెలీక తడబడుతున్నారు.

8. అపొస్తలుల కార్యాలు 17:11 ప్రకారం, నేడు దేవుని ప్రజలు ఎవరో తెలుసుకోవాలంటే ప్రజలు ఏం చేయాలి?

8 ఒక వ్యక్తి తడబడకుండా ఎలా ఉండవచ్చు? వాస్తవాల్ని పరిశీలించడం ద్వారా తడబడకుండా ఉండవచ్చు. సువార్త రచయిత అయిన లూకా అదే చేశాడు. ఆయన ‘విషయాలన్నిటినీ పరిశీలించి,’ అవి మొదటినుండి ఎలా జరిగాయో తెలుసుకోవడానికి కృషి చేశాడు. తన సువార్తను చదివేవాళ్లు, యేసు గురించి విన్న విషయాలు “ఎంత నమ్మదగినవో” తెలుసుకోవాలని ఆయన కోరుకున్నాడు. (లూకా 1:1-4) బెరయ నగరంలోని యూదులు కూడా లూకా చేసినట్టే చేశారు. వాళ్లు యేసు గురించిన మంచివార్తను మొదటిసారి విన్నప్పుడు, తాము విన్న విషయాలు నిజమో కాదో తెలుసుకోవడానికి హీబ్రూ లేఖనాల్ని పరిశోధించారు. (అపొస్తలుల కార్యాలు 17:11 చదవండి.) అదేవిధంగా నేడున్న ప్రజలు కూడా వాస్తవాల్ని పరిశీలించాలి. వాళ్లు, దేవుని ప్రజలు బోధించేవాటిని లేఖనాలతో పోల్చి చూసుకోవాలి. అంతేకాదు, యెహోవా ప్రజల ఆధునిక చరిత్రను అధ్యయనం చేయాలి. అలా వాళ్లు పూర్తి వివరాల్ని పరిశీలిస్తే దేవుని ప్రజల్ని చిన్నచూపు చూడరు, వాళ్ల గురించి చెప్పే కట్టుకథల్ని నమ్మరు.

(2) తాను మెస్సీయ అని చూపించుకోవడానికి యేసు సూచనలు ఇవ్వలేదు

చాలామంది ఆయన సూచనలు ఇవ్వకపోవడం బట్టి తడబడ్డారు. అవే కారణాల్ని బట్టి నేడు కొంతమంది ఎలా తడబడే అవకాశం ఉంది? (9-10 పేరాలు చూడండి) *

9. యేసు ఆకాశం నుండి ఒక సూచనను ఇవ్వనందుకు ఏం జరిగింది?

9 యేసు బోధలు విన్నాక కూడా, ఆయన కాలంలోని కొంతమంది ఆయన్ని మెస్సీయగా ఒప్పుకోలేదు. వాళ్లు ఇంకా ఎక్కువ ఆశించారు. ‘ఆకాశం నుండి ఒక సూచన చూపించి,’ మెస్సీయగా నిరూపించుకోమని పట్టుబట్టారు. (మత్త. 16:1) బహుశా వాళ్లు దానియేలు 7:13, 14 లోని మాటల్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల అలా అడిగి ఉంటారు. అయితే, ఆ ప్రవచనం నెరవేరడానికి యెహోవా నిర్ణయించిన సమయం అది కాదు. యేసే మెస్సీయ అని వాళ్లు నమ్మడానికి ఆయన చెప్పే బోధలే సరిపోయేవి. కానీ, వాళ్లు ఒక సూచన ఇవ్వమని అడిగారు. యేసు అందుకు ఒప్పుకోకపోవడంతో వాళ్లు ఆయన్ని నమ్మలేదు.—మత్త. 16:4.

10. మెస్సీయ గురించి యెషయా రాసిన మాటల్ని యేసు ఎలా నెరవేర్చాడు?

10 లేఖనాలు ఏం చెప్తున్నాయి? మెస్సీయ గురించి యెషయా ప్రవక్త ఇలా రాశాడు: “ఆయన కేకలు వేయడు, అరవడు, వీధుల్లో తన స్వరం వినబడనివ్వడు.” (యెష. 42:1, 2) యేసు తన పరిచర్యను ఎలాంటి హడావిడి, ఆర్భాటం లేకుండా చేశాడు. ఆయన పెద్దపెద్ద ఆలయాలు కట్టలేదు, ప్రజల్లో ప్రత్యేకంగా కనిపించడానికి మతగురువులు వేసుకునేలాంటి బట్టలు వేసుకోలేదు, తనను మతసంబంధ బిరుదులతో పిలవాలని కోరుకోలేదు. హేరోదు రాజు తనను విచారణ చేస్తున్నప్పుడు, తన ప్రాణం ప్రమాదంలో ఉన్నా అతన్ని మెప్పించడానికి యేసు అద్భుతం చేయలేదు. (లూకా 23:8-11) నిజమే, యేసు కొన్ని అద్భుతాలు చేశాడు, కానీ ఆయన మంచివార్త ప్రకటించడం మీదే మనసుపెట్టాడు. తన శిష్యులతో, “అందుకే కదా నేను వచ్చాను” అని కూడా అన్నాడు.—మార్కు 1:38.

11. నేడు కొంతమంది ఎలాంటి వాటిని కోరుకుంటున్నారు?

11 ఇప్పుడు కూడా అలాంటి సమస్యే ఉందా? ఉంది. ఎంతో డబ్బుపెట్టి అలంకరించిన పెద్దపెద్ద ఆలయాలు, మతనాయకులకు ఉన్న గొప్పగొప్ప బిరుదులు నేడు చాలామందికి నచ్చుతున్నాయి. అంతేకాదు, వాళ్లు రకరకాల మత సంబంధ కార్యక్రమాల్ని ఇష్టపడుతూ అవి ఎక్కడినుండి వచ్చాయో తెలుసుకోవట్లేదు. మరి అలాంటి వాటికి హాజరయ్యేవాళ్లు దేవుని గురించి, ఆయన ఉద్దేశాల గురించి ఏమైనా నేర్చుకుంటున్నారా? లేదు. అయితే, మన మీటింగ్స్‌కి వచ్చేవాళ్లు యెహోవా ఇష్టం ఏంటో తెలుసుకుని, దానికి తగ్గట్టు జీవించడం నేర్చుకుంటున్నారు. మన రాజ్యమందిరాలు శుభ్రంగా, మంచి స్థితిలో ఉంటాయి కానీ ఎక్కువ హడావిడిగా ఉండవు. సంఘంలో నాయకత్వం వహించేవాళ్లు ప్రత్యేకమైన బట్టలు వేసుకోరు, గొప్పగొప్ప బిరుదులతో పిలిపించుకోరు. బైబిలే మన బోధలకు, నమ్మకాలకు ఆధారం. అయినప్పటికీ మన ఆరాధనా విధానం సాదాసీదాగా ఉంటుందని నేడు చాలామంది మన సందేశాన్ని నమ్మట్లేదు. పైగా ప్రజలు వినాలనుకునే వాటిని మనం బోధించం.

12. హెబ్రీయులు 11:1, 6 చెప్తున్నట్టు, మన విశ్వాసం దేనిమీద ఆధారపడి ఉండాలి?

12 మనం తడబడకుండా ఎలా ఉండవచ్చు? రోములో నివసిస్తున్న క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “దేని గురించైనా విన్నప్పుడే విశ్వాసం కలుగుతుంది. ఎవరైనా క్రీస్తు గురించి మాట్లాడినప్పుడే ఆ సందేశాన్ని వినడం జరుగుతుంది.” (రోమా. 10:17) కాబట్టి లేఖనాల్ని అధ్యయనం చేయడం వల్లే మన విశ్వాసం బలపడుతుంది గానీ, లేఖన విరుద్ధమైన మత సంబంధ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కాదు. అవి ఎంత ఆకర్షణీయంగా ఉన్నా మనం వాటిలో పాల్గొనం. ఖచ్చితమైన జ్ఞానంపై ఆధారపడిన బలమైన విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే, “విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం.” (హెబ్రీయులు 11:1, 6 చదవండి.) కాబట్టి, ఇదే సత్యం అని నమ్మడానికి మనకు ఆకాశం నుండి ఏ సూచనా కనిపించాల్సిన అవసరం లేదు. బదులుగా, విశ్వాసాన్ని బలపర్చే బైబిలు బోధల్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే సరిపోతుంది. అలా చేస్తే, ఇదే సత్యమని మనకు నమ్మకం కుదురుతుంది, అలాగే సందేహాల్ని తీసేసుకుంటాం.

(3) యూదుల చాలా ఆచారాల్ని యేసు పాటించలేదు

చాలామంది ఆయన తమ ఆచారాల్లో కొన్నిటిని చేయకపోవడం బట్టి తడబడ్డారు. అవే కారణాల్ని బట్టి నేడు కొంతమంది ఎలా తడబడే అవకాశం ఉంది? (13వ పేరా చూడండి) *

13. చాలామంది యేసును ఎందుకు నమ్మలేదు?

13 యేసు కాలంలో ఆయన శిష్యులు ఉపవాసం ఉండలేదు, అది చూసి బాప్తిస్మమిచ్చే యోహాను శిష్యులు ఆశ్చర్యపోయారు. తాను బ్రతికుండగా తన శిష్యులు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదని యేసు వివరించాడు. (మత్త. 9:14-17) అయినప్పటికీ తమ ఆచారాల్ని, కట్టుబాట్లను పాటించలేదని పరిసయ్యులు, ఇతరులు యేసును తప్పుబట్టారు. యేసు విశ్రాంతి రోజున రోగుల్ని బాగు చేసినందుకు వాళ్లకు కోపం వచ్చింది. (మార్కు 3:1-6; యోహా. 9:16) వాళ్లు విశ్రాంతి రోజు గురించిన నియమాన్ని పాటిస్తున్నామని గొప్పగా చెప్పుకున్నారు, కానీ ఆలయంలో వ్యాపారం చేస్తుంటే మాత్రం పట్టించుకోలేదు. ఆ విషయంలో యేసు తమను ఖండించినందుకు వాళ్లకు చాలా కోపం వచ్చింది. (మత్త. 21:12, 13, 15) అంతేకాదు యేసు నజరేతులోని సమాజమందిరంలో బోధించినప్పుడు, ఇశ్రాయేలు చరిత్రలోని కొన్ని ఉదాహరణలు చెప్తూ అక్కడున్నవాళ్ల స్వార్థాన్ని, అవిశ్వాసాన్ని బయటపెట్టాడు. దానికి వాళ్లు కోపంతో రగిలిపోయారు. (లూకా 4:16, 25-30) వాళ్లు అనుకున్నట్టుగా యేసు ప్రవర్తించలేదు కాబట్టి చాలామంది ఆయన్ని నమ్మలేదు.—మత్త. 11:16-19.

14. లేఖనాలకు విరుద్ధంగా ఉన్న ఆచారాల్ని యేసు ఎందుకు ఖండించాడు?

14 లేఖనాలు ఏం చెప్తున్నాయి? యెహోవా తన ప్రవక్త అయిన యెషయా ద్వారా ఇలా చెప్పాడు: “ఈ ప్రజలు నా దగ్గరికి వస్తామని నోటితో చెప్తున్నారు, పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, కానీ వీళ్ల హృదయం నాకు చాలా దూరంగా ఉంది; వీళ్లు కేవలం తాము నేర్చుకున్న మనుషుల ఆజ్ఞల్ని బట్టి నాకు భయపడుతున్నారు.” (యెష. 29:13) లేఖనాలకు విరుద్ధంగా ఉన్న ఆచారాల్ని యేసు ఖండించడం సరైనదే. లేఖనాల కన్నా మనుషులు కల్పించిన ఆచారాలకు, నియమాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినవాళ్లు యెహోవాను, ఆయన పంపిన మెస్సీయను తిరస్కరించారు.

15. నేడు చాలామంది యెహోవాసాక్షుల్ని ఎందుకు ఇష్టపడరు?

15 ఇప్పుడు కూడా అలాంటి సమస్యే ఉందా? ఉంది. పుట్టినరోజులు, క్రిస్మస్‌ వంటి లేఖన విరుద్ధమైన వేడుకల్ని యెహోవాసాక్షులు చేయరు కాబట్టి చాలామంది వాళ్లను ఇష్టపడరు. జాతీయ పండుగల్ని, లేఖన విరుద్ధమైన అంత్యక్రియల ఆచారాల్ని చేయనందుకు ఇంకొంతమందికి యెహోవాసాక్షుల మీద కోపం వస్తుంది. ఈ కారణాల్ని బట్టి యెహోవాసాక్షుల్ని ఇష్టపడనివాళ్లు, దేవుణ్ణి సరైన విధంగానే ఆరాధిస్తున్నామని అనుకోవచ్చు. కానీ బైబిల్లో ఉన్న స్పష్టమైన బోధల్ని పట్టించుకోకుండా, లోకంలో ఉన్న ఆచారాల్నే ఎక్కువ ఇష్టపడేవాళ్లు దేవుణ్ణి సంతోషపెట్టలేరు.—మార్కు 7:7-9.

16. కీర్తన 119:97, 113, 163-165 ప్రకారం మనం ఏం చేయాలి? ఏం చేయకూడదు?

16 మనం తడబడకుండా ఎలా ఉండవచ్చు? యెహోవా నియమాల మీద, సూత్రాల మీద మనం ఎంతో ప్రేమ పెంచుకోవాలి. (కీర్తన 119:97, 113, 163-165 చదవండి.) మనం యెహోవాను ప్రేమించినప్పుడు, ఆయనకు ఇష్టంలేని ఆచారాలన్నిటికీ దూరంగా ఉంటాం. మనం యెహోవా కన్నా వేరేదేన్నీ ఎక్కువగా ప్రేమించం.

(4) యేసు రాజకీయ సమస్యల్ని పరిష్కరించలేదు

చాలామంది ఆయన రాజకీయ సమస్యల్ని పరిష్కరించకపోవడం బట్టి తడబడ్డారు. అవే కారణాల్ని బట్టి నేడు కొంతమంది ఎలా తడబడే అవకాశం ఉంది? (17వ పేరా చూడండి) *

17. యేసు ఏం చేస్తాడని ఆయన కాలంలోని చాలామంది అనుకున్నారు?

17 యేసు రాజకీయ సమస్యల్ని అప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయన కాలంలోని కొంతమంది కోరుకున్నారు. తమను బాగా ఇబ్బందిపెడుతున్న రోమన్ల నుండి మెస్సీయ విడిపిస్తాడని వాళ్లు అనుకున్నారు. కానీ వాళ్లు యేసును రాజుగా చేయాలనుకున్నప్పుడు ఆయన దానికి ఒప్పుకోలేదు. (యోహా. 6:14, 15) యేసు ప్రభుత్వాన్ని మార్చేస్తాడేమో అని, ఒకవేళ అలా జరిగితే రోమన్లు తమకు ఇచ్చిన అధికారాన్ని లాగేసుకుంటారేమో అని యాజకులు, ఇంకొందరు భయపడ్డారు. అలాంటి రాజకీయపరమైన కారణాల వల్ల చాలామంది యేసును నమ్మలేదు.

18. మెస్సీయ గురించిన ఏ బైబిలు ప్రవచనాల్ని చాలామంది పట్టించుకోలేదు?

18 లేఖనాలు ఏం చెప్తున్నాయి? నిజమే, మెస్సీయ విజయం సాధించే యోధుడు అవుతాడని చాలా ప్రవచనాలు చెప్పాయి. అయితే దానికంటే ముందు ఆయన చనిపోవాలని ఇతర ప్రవచనాలు చెప్పాయి. (యెష. 53:9, 12) మరి యూదులు మెస్సీయ మీద ఎందుకు అంత ఆశ పెట్టుకున్నారు? ఎందుకంటే, ఆ యూదులు తమ కాలంలోని సమస్యలకు వెంటనే పరిష్కారం చూపని ప్రవచనాల్ని పట్టించుకోలేదు.—యోహా. 6:26, 27.

19. నేడు చాలామంది మన నుండి ఏం ఆశిస్తున్నారు?

19 ఇప్పుడు కూడా అలాంటి సమస్యే ఉందా? ఉంది. మనం రాజకీయాల్లో పాల్గొనం కాబట్టి నేడు చాలామంది మనల్ని ఇష్టపడరు. మనం ఎన్నికల్లో ఓటు వేయాలని వాళ్లు కోరుకుంటారు. కానీ మనం మానవ పరిపాలకుణ్ణి ఎంచుకుంటే, యెహోవాను తిరస్కరించినట్టే. (1 సమూ. 8:4-7) అంతేకాదు మనం స్కూళ్లు-హాస్పిటళ్లు కట్టాలని, సమాజ సేవ చేయాలని ప్రజలు అనుకోవచ్చు. ప్రపంచంలో ఇప్పుడున్న సమస్యల్ని పరిష్కరించడం మీద కాకుండా, మనం ప్రకటించడం మీదే దృష్టి పెడతాం. అందుకే వాళ్లు మనల్ని ఇష్టపడరు.

20. మత్తయి 7:21-23 లో యేసు చెప్పినట్టు, మనం దేనిమీద దృష్టి పెట్టాలి?

20 మనం తడబడకుండా ఎలా ఉండవచ్చు? (మత్తయి 7:21-23 చదవండి.) మనం యేసు అప్పగించిన పని మీదే దృష్టి పెట్టాలి. (మత్త. 28:19, 20) లోకంలోని రాజకీయ, సామాజిక విషయాల వల్ల మన దృష్టి ఎన్నడూ పక్కకు మళ్లకూడదు. మనం ప్రజల్ని ప్రేమిస్తాం, వాళ్ల సమస్యల్ని పట్టించుకుంటాం, వాళ్లకు సహాయం చేయాలనుకుంటాం. కానీ అందుకు చక్కని మార్గం, దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ యెహోవాకు స్నేహితులయ్యేలా వాళ్లకు సహాయం చేయడమే అని గుర్తుంచుకుంటాం.

21. మనం ఏమని నిశ్చయించుకోవాలి?

21 యేసు కాలంలో ప్రజలు ఆయన్ని ఎందుకు నమ్మలేదో, నేడు కొంతమంది ఆయన అనుచరుల్ని ఎందుకు నమ్మట్లేదో తెలిపే నాలుగు కారణాల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలించాం. మరి మనల్ని తడబడేలా చేసేవి ఈ నాలుగు విషయాలేనా? కాదు. మరో నాలుగు విషయాల్ని తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం. మనం తడబడకుండా ఉండాలని, బలమైన విశ్వాసం కలిగి ఉండాలని నిశ్చయించుకుందాం.

పాట 56 సత్య మార్గంలో నడవండి

^ పేరా 5 భూమ్మీద జీవించిన వాళ్లందరిలో అత్యంత గొప్ప బోధకుడు యేసే, అయినప్పటికీ ఆయన కాలంలోని చాలామంది ఆయన మీద నమ్మకం ఉంచలేదు. ఎందుకు? దానికి సంబంధించిన నాలుగు కారణాల్ని ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. అంతేకాదు, నిజక్రైస్తవులు చెప్పేవాటిని బట్టి, చేసేవాటిని బట్టి నేడు చాలామంది ఎందుకు తడబడుతున్నారో చూస్తాం. అంతకన్నా ముఖ్యంగా, మనం తడబడకుండా యేసు మీద బలమైన విశ్వాసం ఎందుకు ఉంచవచ్చో నేర్చుకుంటాం.

^ పేరా 60 చిత్రాల వివరణ: యేసును కలవమని ఫిలిప్పు నతనయేలుకు చెప్తున్నాడు.

^ పేరా 62 చిత్రాల వివరణ: యేసు మంచివార్త ప్రకటిస్తున్నాడు.

^ పేరా 64 చిత్రాల వివరణ: వ్యతిరేకులు చూస్తుండగా, చెయ్యి ఎండిపోయిన వ్యక్తిని యేసు బాగు చేస్తున్నాడు.

^ పేరా 66 చిత్రాల వివరణ: యేసు ప్రజలకు దూరంగా, ఒంటరిగా ఒక కొండ మీదికి వెళ్తున్నాడు.