కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 19

నీతిమంతుల్ని ఏదీ తడబడేలా చేయలేదు

నీతిమంతుల్ని ఏదీ తడబడేలా చేయలేదు

“నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాళ్లకు అపారమైన శాంతి ఉంటుంది; వాళ్లను ఏదీ తడబడేలా చేయలేదు.”—కీర్త. 119:165.

పాట 122 స్థిరంగా, నిలకడగా ఉందాం!

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. ఒక రచయిత ఏమన్నాడు? మనం ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

నేడు లక్షలమంది తాము యేసును నమ్ముతున్నామని చెప్పుకుంటారు, కానీ ఆయన చెప్పినవాటిని పాటించరు. (2 తిమో. 4:3, 4) నిజానికి, ఒక రచయిత ఇలా రాశాడు: ‘నేడు యేసులాంటి ఒక వ్యక్తి మన మధ్య ఉండి, అచ్చం యేసులాగే బోధిస్తే, 2,000 సంవత్సరాల క్రితం చేసినట్టే ప్రజలు ఇప్పుడు కూడా ఆయన్ని తిరస్కరిస్తారా? అవును, తిరస్కరిస్తారు.’

2 యేసు కాలంలోని చాలామంది ఆయన బోధల్ని విన్నారు, ఆయన చేసిన అద్భుతాల్ని చూశారు. అయినా, ఆయన మీద విశ్వాసం ఉంచలేదు. ఎందుకు? యేసు చెప్పినవాటిని బట్టి, చేసినవాటిని బట్టి ప్రజలు తడబడడానికి గల నాలుగు కారణాల్ని ముందటి ఆర్టికల్‌లో చూశాం. ఈ ఆర్టికల్‌లో, మరో నాలుగు కారణాల్ని పరిశీలిస్తాం. అంతేకాదు, నేడు ప్రజలు యేసు అనుచరుల్ని బట్టి ఎందుకు తడబడుతున్నారో, మనం తడబడకుండా ఎలా ఉండవచ్చో కూడా తెలుసుకుంటాం.

(1) యేసు అందర్నీ ఒకేలా చూశాడు

చాలామంది యేసు అన్నిరకాల ప్రజలతో సమయం గడపడం వల్ల తడబడ్డారు. ఇవే కారణాల్ని బట్టి నేడు కొంతమంది ఎలా తడబడే అవకాశం ఉంది? (3వ పేరా చూడండి) *

3. యేసు చేసిన ఏ పని వల్ల కొంతమంది తడబడ్డారు?

3 యేసు భూమ్మీద ఉన్నప్పుడు డబ్బున్న వాళ్లతో, పేదవాళ్లతో, అధికారం ఉన్నవాళ్లతో, అణచివేయబడిన వాళ్లతో, అందరితో సమయం గడిపాడు. ఆయన కాలంలో ప్రజలు కొంతమందిని ‘పాపుల్లా’ చూసేవాళ్లు, కానీ అలాంటివాళ్ల మీద కూడా ఆయన కనికరం చూపించాడు. కొంతమంది గర్విష్ఠులకు యేసు చేసింది నచ్చలేదు. వాళ్లు ఆయన శిష్యుల్ని ఇలా అడిగారు: “మీరు ఎందుకు పన్ను వసూలుచేసే వాళ్లతో, పాపులతో కలిసి భోంచేస్తున్నారు?” దానికి యేసు ఇలా జవాబిచ్చాడు: “ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు వైద్యుడు అవసరంలేదు, రోగులకే అవసరం. నేను నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు కానీ పశ్చాత్తాపపడమని పాపుల్ని పిలవడానికే వచ్చాను.”—లూకా 5:29-32.

4. యెషయా చెప్పినట్టు, మెస్సీయ గురించి యూదులు ఏ విషయాన్ని గ్రహించి ఉండాల్సింది?

4 లేఖనాలు ఏం చెప్తున్నాయి? మెస్సీయ రావడానికి చాలాకాలం ముందే, లోకం ఆయన్ని అంగీకరించదు అని యెషయా ప్రవక్త చెప్పాడు. ఆయన ఇలా ప్రవచించాడు: “ప్రజలు ఆయన్ని చీదరించుకున్నారు, దూరం పెట్టారు . . . ఆయన ముఖం మనకు దాచబడినట్టే ఉంది. ప్రజలు ఆయన్ని నీచంగా చూశారు, మనం ఆయన్ని లెక్కచేయలేదు.” (యెష. 53:3) “ప్రజలు” మెస్సీయను దూరం పెడతారు అని ప్రవచనం చెప్పింది. కాబట్టి, ప్రజలు ఆయన్ని తిరస్కరిస్తారని యేసు కాలంలోని యూదులు గ్రహించి ఉండాల్సింది.

5. నేడు చాలామంది యేసు అనుచరుల్ని ఎలా చూస్తున్నారు?

5 ఇప్పుడు కూడా అదే సమస్య ఉందా? ఉంది. నేడు చాలామంది మతనాయకులు పేరున్న వాళ్లను, డబ్బున్న వాళ్లను, మేధావులను తమ చర్చీల్లోకి చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. అలా కొత్తగా వచ్చేవాళ్లు దేవునికి ఇష్టంలేని పనులు చేస్తున్నా, మతనాయకులు వాళ్లను చేర్చుకుంటున్నారు. కానీ ఉత్సాహంగా పనిచేస్తూ దేవుని ప్రమాణాల్ని పాటించే యెహోవా ప్రజలు లోకం దృష్టిలో ప్రాముఖ్యమైన వాళ్లు కాదు కాబట్టి, మతనాయకులు వాళ్లను చిన్నచూపు చూస్తున్నారు. పౌలు చెప్పినట్టు, ప్రజలు ఎవర్ని “చిన్నచూపు” చూస్తారో వాళ్లనే దేవుడు ఎంచుకున్నాడు. (1 కొరిం. 1:26-29) లోకం చిన్నచూపు చూసినా, యెహోవాను నమ్మకంగా సేవించే వాళ్లందరూ ఆయన దృష్టిలో విలువైనవాళ్లే.

6. మత్తయి 11:25, 26 లో యేసు ఏం చెప్పాడు? మనం ఆయన్ని ఎలా అనుకరించవచ్చు?

6 మనం తడబడకుండా ఎలా ఉండవచ్చు? (మత్తయి 11:25, 26 చదవండి.) దేవుని ప్రజల్ని లోకంలోని ప్రజలు చూస్తున్నట్టు చూడకండి. యెహోవా తన ఇష్టం చేయడానికి వినయస్థుల్ని మాత్రమే ఉపయోగించుకుంటాడని గుర్తించండి. (కీర్త. 138:6) దేవుని ప్రజలు లోకం దృష్టిలో తెలివిగలవాళ్లు కాదు, మేధావులు కాదు. అయినా వాళ్లను ఉపయోగించుకుని యెహోవా ఎన్ని పనులు చేస్తున్నాడో ఆలోచించండి.

(2) యేసు తప్పుడు బోధల్ని ఖండించాడు

7. యేసు పరిసయ్యుల్ని వేషధారులు అని ఎందుకు పిలిచాడు? దానికి వాళ్లు ఎలా స్పందించారు?

7 యేసు తన కాలంలోని మతనాయకుల్ని ధైర్యంగా ఖండించాడు. ఎందుకంటే, యెహోవాను ఎలా ఆరాధించాలో వాళ్లు ప్రజలకు సరిగ్గా బోధించలేదు. ఉదాహరణకు, పరిసయ్యుల వేషధారణను ఆయన బయటపెట్టాడు. వాళ్లు చేతులు కడుక్కోవడం గురించి ఆలోచించినంతగా తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం గురించి ఆలోచించలేదు. (మత్త. 15:1-11) యేసు మాటలు విని ఆయన శిష్యులు ఆశ్చర్యపోయి ఉంటారు. అందుకే, వాళ్లు ఆయన్ని ఇలా అడిగారు: “నీ మాటలు పరిసయ్యులకు కోపం తెప్పించాయని నీకు తెలుసా?” అప్పుడు యేసు ఇలా అన్నాడు: “పరలోకంలో ఉన్న నా తండ్రి నాటని ప్రతీ మొక్క పెరికేయబడుతుంది. వాళ్లను పట్టించుకోకండి. వాళ్లే గుడ్డివాళ్లు, అలాంటిది వాళ్లు ఇతరులకు దారి చూపిస్తారు. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపిస్తే, వాళ్లిద్దరూ గుంటలో పడతారు.” (మత్త. 15:12-14) తన మాటల వల్ల మతనాయకులకు కోపం వచ్చినా, ఆయన సత్యం చెప్పడం మాత్రం ఆపలేదు.

8. అన్నిమతాల నమ్మకాల్ని దేవుడు ఇష్టపడడని యేసు ఎలా చూపించాడు?

8 యేసు మతనాయకుల తప్పుడు బోధల్ని కూడా బయటపెట్టాడు. అన్నిమతాల నమ్మకాల్ని దేవుడు ఇష్టపడతాడని యేసు చెప్పలేదు. బదులుగా, నాశనానికి నడిపించే విశాలమైన దారిలో ఎక్కువమంది ఉంటారని, జీవానికి నడిపించే ఇరుకు దారిలో తక్కువమంది ఉంటారని ఆయన వివరించాడు. (మత్త. 7:13, 14) కొంతమంది పైకి దేవుణ్ణి సేవిస్తున్నట్లు కనిపించినా, నిజానికి వాళ్లు ఆయన్ని సేవించట్లేదని యేసు స్పష్టం చేశాడు. ఆయన ఇలా హెచ్చరించాడు: “గొర్రె తోలు కప్పుకొని మీ దగ్గరికి వచ్చే అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి, లోలోపల వాళ్లు క్రూరమైన తోడేళ్లు. వాళ్ల పనుల్ని బట్టి మీరు వాళ్లను గుర్తుపడతారు.”—మత్త. 7:15-20.

చాలామంది యేసు తప్పుడు బోధల్ని, ఆచారాల్ని ఖండించడం వల్ల తడబడ్డారు. ఇవే కారణాల్ని బట్టి నేడు కొంతమంది ఎలా తడబడే అవకాశం ఉంది? (9వ పేరా చూడండి) *

9. యేసు బయటపెట్టిన కొన్ని తప్పుడు బోధలు ఏంటి?

9 లేఖనాలు ఏం చెప్తున్నాయి? యెహోవా మందిరం విషయంలో మెస్సీయకున్న ఆసక్తి, మండుతున్న అగ్నిలా ఉంటుందని బైబిలు ముందే చెప్పింది. (కీర్త. 69:9; యోహా. 2:14-17) ఆ ఆసక్తి వల్లే యేసు తప్పుడు బోధల్ని, ఆచారాల్ని బయటపెట్టాడు. ఉదాహరణకు, పరిసయ్యులు ఆత్మకు చావు లేదని నమ్మేవాళ్లు. కానీ యేసు, చనిపోయినవాళ్లు నిద్రపోతున్నారని బోధించాడు. (యోహా. 11:11) సద్దూకయ్యులు పునరుత్థానం లేదని చెప్పేవాళ్లు. కానీ యేసు, తన స్నేహితుడైన లాజరును తిరిగి బ్రతికించి పునరుత్థానం ఉందని నిరూపించాడు. (యోహా. 11:43, 44; అపొ. 23:8) ఏది జరిగినా తలరాత వల్లే, దేవుని వల్లే అని పరిసయ్యులు చెప్పేవాళ్లు. కానీ, దేవుణ్ణి సేవించాలో లేదో నిర్ణయించుకునే స్వేచ్ఛ మనుషులకు ఉందని యేసు బోధించాడు.—మత్త. 11:28.

10. చాలామంది మన బోధల్ని బట్టి మనల్ని ఎందుకు ఇష్టపడట్లేదు?

10 ఇప్పుడు కూడా అదే సమస్య ఉందా? ఉంది. మనం బైబిలు ఉపయోగించి తప్పుడు బోధల్ని బయటపెడతాం కాబట్టి, చాలామంది మనల్ని ఇష్టపడట్లేదు. దేవుడు చెడ్డవాళ్లను నరకంలో శిక్షిస్తాడని మతనాయకులు బోధిస్తున్నారు. ప్రజల్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి వాళ్లు ఈ తప్పుడు బోధను ఉపయోగిస్తున్నారు. ప్రేమగల దేవుడైన యెహోవాను ఆరాధించేవాళ్లంగా అది తప్పుడు బోధని ప్రజలు అర్థం చేసుకునేలా మనం సహాయం చేస్తున్నాం. ఆత్మకు చావు లేదని కూడా మతనాయకులు బోధిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే పునరుత్థానం అవసరం లేదు. కాబట్టి, ఆ బోధ బైబిలు నుండి వచ్చింది కాదని మనం నిరూపిస్తున్నాం. అంతేకాదు, దేవుడు మన తలరాతను ముందే రాసేశాడని చాలా మతాలు బోధిస్తున్నాయి. కానీ, దేవుణ్ణి సేవించాలో లేదో నిర్ణయించుకునే స్వేచ్ఛ మనుషులకు ఉందని మనం బోధిస్తాం. మనం ఇలాంటి తప్పుడు బోధల్ని బయటపెట్టినప్పుడు మతనాయకులు ఎలా స్పందిస్తారు? తరచూ వాళ్లకు చాలా కోపం వస్తుంది!

11. యోహాను 8:45-47 లో ఉన్న యేసు మాటల ప్రకారం, దేవుడు తన ప్రజల నుండి ఏం కోరుతున్నాడు?

11 మనం తడబడకుండా ఎలా ఉండవచ్చు? మనం సత్యాన్ని ప్రేమిస్తే దేవుని మాటల్ని అంగీకరించాలి. (యోహాను 8:45-47 చదవండి.) అపవాది అయిన సాతాను సత్యంలో స్థిరంగా నిలబడలేదు. కానీ, మనం మాత్రం మన నమ్మకాల విషయంలో ఎన్నడూ రాజీపడకుండా సత్యంలో స్థిరంగా నిలబడతాం. (యోహా. 8:44) తన ప్రజలు యేసులాగే ‘చెడ్డదాన్ని అసహ్యించుకొని, మంచిదాన్ని అంటిపెట్టుకొని ఉండాలని’ దేవుడు కోరుతున్నాడు.—రోమా. 12:9; హెబ్రీ. 1:9.

(3) యేసు హింసాకొయ్య మీద చనిపోయాడు

చాలామంది యేసు హింసాకొయ్య మీద చనిపోవడం వల్ల తడబడ్డారు. ఇవే కారణాల్ని బట్టి నేడు కొంతమంది ఎలా తడబడే అవకాశం ఉంది? (12వ పేరా చూడండి) *

12. యేసు చనిపోయిన విధానం చాలామంది యూదులకు ఎందుకు అడ్డురాయిగా ఉంది?

12 యేసు కాలంలోని కొంతమంది యూదులు ఆయన్ని నమ్మకపోవడానికి మరో కారణం ఏంటి? పౌలు ఇలా అన్నాడు: “మనమైతే కొయ్య మీద శిక్షకు గురై చనిపోయిన క్రీస్తు గురించి ప్రకటిస్తాం. అది యూదులకు అడ్డురాయిగా . . . ఉంది.” (1 కొరిం. 1:23) యేసు చనిపోయిన విధానం చాలామంది యూదులకు ఎందుకు అడ్డురాయిగా ఉంది? యేసు కొయ్యమీద చనిపోవడం వల్ల యూదులు ఆయన్ని నేరస్తునిలా, పాపం చేసినవానిలా చూశారే గానీ మెస్సీయలా చూడలేకపోయారు.—ద్వితీ. 21:22, 23.

13. యేసును నమ్మని యూదులు ఏం గుర్తించలేకపోయారు?

13 యేసును నమ్మని యూదులు ఆయన నిర్దోషని, ఆయన మీద అబద్ధ ఆరోపణలు వేయబడ్డాయని, ఆయనతో అన్యాయంగా ప్రవర్తించారని గుర్తించలేకపోయారు. యేసును విచారణ చేసినవాళ్లు న్యాయాన్ని పక్కన పెట్టేశారు. యూదుల మహాసభ సభ్యులు రాత్రికిరాత్రే సమావేశమై, చట్ట వ్యతిరేకంగా ఆయన్ని విచారణ చేశారు. (లూకా 22:54; యోహా. 18:24) వాళ్లు యేసు మీదున్న ఆరోపణల్ని, సాక్ష్యాధారాల్ని పక్షపాతం లేకుండా పరిశీలించే బదులు, “యేసును చంపించడానికి అబద్ధ సాక్ష్యాల కోసం” వెదికారు. అది కుదరకపోయేసరికి, ప్రధానయాజకుడు యేసు మాటల్లో తప్పులుపట్టి ఆయన్ని దోషి అని తీర్పుతీర్చడానికి ప్రయత్నించాడు. ఇదంతా అప్పటి చట్టానికి పూర్తి వ్యతిరేకం. (మత్త. 26:59; మార్కు 14:55-64) యేసు పునరుత్థానం తర్వాత కూడా ఆ మహాసభ సభ్యులు అన్యాయంగా ప్రవర్తించారు. వాళ్లు ఆయన సమాధికి కాపలా కాస్తున్న రోమా సైనికులకు “పెద్ద మొత్తంలో వెండి నాణేలు ఇచ్చి,” సమాధి ఎందుకు ఖాళీగా ఉందని ఎవరైనా అడిగితే ఒక కట్టుకథ చెప్పమని అన్నారు.—మత్త. 28:11-15.

14. మెస్సీయ మరణం గురించి లేఖనాలు ముందే ఏం చెప్పాయి?

14 లేఖనాలు ఏం చెప్తున్నాయి? మెస్సీయ చనిపోవాల్సి వస్తుందని చాలామంది యూదులు అనుకోలేదు. కానీ లేఖనాలు ముందే ఏం చెప్పాయో గమనించండి, “ఆయన తన ప్రాణాన్ని ధారపోసి, చివరికి చనిపోయాడు, దోషుల్లో ఒకడిగా లెక్కించబడ్డాడు; ఆయన అనేకమంది పాపాల్ని మోశాడు, దోషుల తరఫున వేడుకున్నాడు.” (యెష. 53:12) కాబట్టి, యేసు పెద్ద తప్పు చేసినవానిలా చనిపోవడం చూసి యూదులు తడబడాల్సిన అవసరం లేదు.

15. ఎలాంటి అబద్ధ ఆరోపణల వల్ల కొంతమంది యెహోవాసాక్షుల్ని నమ్మట్లేదు?

15 ఇప్పుడు కూడా అదే సమస్య ఉందా? ఖచ్చితంగా ఉంది! యేసు మీద అబద్ధ ఆరోపణలు వేసి దోషిగా తీర్పుతీర్చినట్టే, నేడు యెహోవాసాక్షుల్ని కూడా అన్యాయానికి గురిచేస్తున్నారు. కొన్ని ఉదాహరణలు పరిశీలించండి. 1930 నుండి 1950 మధ్య కాలంలో, అమెరికాలో మన మత స్వేచ్ఛను కాపాడుకోవడానికి చాలాసార్లు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. కొంతమంది జడ్జీలు మన విషయంలో చూపించిన భేదం అందరికీ స్పష్టంగా కనిపించింది. కెనడాలోని క్విబెక్‌లో చర్చీలు, ప్రభుత్వం కుమ్మక్కై మన పనిని ఆపడానికి ప్రయత్నించాయి. కేవలం తమ పొరుగువాళ్లతో దేవుని రాజ్యం గురించి మాట్లాడినందుకు చాలామంది ప్రచారకుల్ని జైల్లో వేశారు. జర్మనీలో నాజీ ప్రభుత్వం, దేవునికి నమ్మకంగా ఉన్న చాలామంది యువ సహోదరుల్ని చంపేసింది. ఈ మధ్య కాలంలో రష్యా ప్రభుత్వం, బైబిలు గురించి మాట్లాడినందుకు చాలామంది సహోదరుల్ని దోషులుగా తీర్పుతీర్చి జైల్లో వేసింది. వాళ్లు చేసిన పనిని “తీవ్రవాద చర్య” అని అంది. చివరికి, రష్యా భాషలోని కొత్త లోక అనువాదం బైబిల్లో యెహోవా పేరు ఉపయోగించినందుకు దాన్ని నిషేధించి, “తీవ్రవాద సమాచారం” అని ముద్రవేసింది.

16. మొదటి యోహాను 4:1 చెప్తున్నట్టు, యెహోవా ప్రజల గురించి చెప్పే అబద్ధాల వల్ల మనం ఎందుకు మోసపోకూడదు?

16 మనం తడబడకుండా ఎలా ఉండవచ్చు? వాస్తవాల్ని పరిశీలించండి. కొండమీద ప్రసంగంలో యేసు తన మాటల్ని వింటున్నవాళ్లను ఇలా హెచ్చరించాడు: ‘ప్రజలు మీ గురించి అబద్ధంగా అన్నిరకాల చెడ్డమాటలు మాట్లాడతారు.’ (మత్త. 5:11) ఈ అబద్ధాలకు మూలం సాతానే. అతను వ్యతిరేకుల్ని ఉపయోగించి, సత్యాన్ని ప్రేమించేవాళ్ల మీద హానికరమైన పుకార్లను వ్యాప్తి చేస్తాడు. (ప్రక. 12:9, 10) వ్యతిరేకులు చెప్పే అబద్ధాల్ని మనం నమ్మకూడదు. ఆ అబద్ధాల వల్ల భయపడిపోయే, విశ్వాసం తగ్గిపోయే ప్రమాదం ఉంది. కానీ, ఎప్పుడూ అలా జరగకుండా మనం జాగ్రత్తపడాలి.—1 యోహాను 4:1 చదవండి.

(4) యేసుకు నమ్మకద్రోహం జరిగింది, శిష్యులు ఆయన్ని విడిచిపెట్టారు

చాలామంది యేసుకు యూదా నమ్మకద్రోహం చేయడం వల్ల తడబడ్డారు. ఇవే కారణాల్ని బట్టి నేడు కొంతమంది ఎలా తడబడే అవకాశం ఉంది? (17-18 పేరాలు చూడండి) *

17. యేసు చనిపోవడానికి ముందు జరిగిన ఏ సంఘటనల్ని చూసి కొంతమంది తడబడి ఉండవచ్చు?

17 యేసు చనిపోవడానికి ముందు, ఆయన 12 మంది అపొస్తలుల్లో ఒకరు ఆయనకు నమ్మకద్రోహం చేశారు. ఇంకో అపొస్తలుడు యేసు ఎవరో తెలీదని మూడుసార్లు అన్నాడు. అంతేకాదు, యేసు చనిపోవడానికి ముందు రాత్రి అపొస్తలులందరూ ఆయన్ని విడిచి వెళ్లిపోయారు. (మత్త. 26:14-16, 47, 56, 75) దానికి యేసు ఆశ్చర్యపోలేదు. నిజానికి, అలా జరుగుతుందని ఆయన ముందే చెప్పాడు. (యోహా. 6:64; 13:21, 26, 38; 16:32) కొంతమంది ఇదంతా చూసి తడబడి, ‘యేసు అపొస్తలులే అలా ప్రవర్తిస్తే, నేను ఎందుకు వాళ్లలో చేరాలి!’ అని అనుకొని ఉండవచ్చు.

18. యేసు చనిపోవడానికి కాస్త ముందు ఏ ప్రవచనాలు నెరవేరాయి?

18 లేఖనాలు ఏం చెప్తున్నాయి? మెస్సీయ 30 వెండి నాణేల కోసం అప్పగించబడతాడని వందల సంవత్సరాల క్రితమే యెహోవా తన వాక్యంలో రాయించాడు. (జెక. 11:12, 13) యేసు దగ్గరి స్నేహితుడే అలా చేస్తాడని కూడా దేవుని వాక్యం చెప్పింది. (కీర్త. 41:9) యెహోవా జెకర్యా ప్రవక్తతో ఇంకా ఇలా రాయించాడు: “కాపరిని కొట్టు, మందను చెదిరిపోనివ్వు.” (జెక. 13:7) యథార్థ హృదయంగల ప్రజలు ఈ సంఘటనలు జరగడం చూసి తడబడే బదులు, యేసు విషయంలో ఈ ప్రవచనాలు నెరవేరినందుకు ఆయన మీద విశ్వాసం పెంచుకుంటారు.

19. యథార్థ హృదయంగల ప్రజలు ఏం గుర్తిస్తారు?

19 ఇప్పుడు కూడా అదే సమస్య ఉందా? ఉంది. మన కాలంలో, పేరున్న కొంతమంది సాక్షులు సత్యాన్ని విడిచిపెట్టి మతభ్రష్టులుగా మారి, వేరేవాళ్లను కూడా తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించారు. వాళ్లు మీడియా ద్వారా, ఇంటర్నెట్‌ ద్వారా మన గురించి తప్పుడు నివేదికల్ని, కట్టుకథల్ని, పచ్చి అబద్ధాల్ని వ్యాప్తి చేశారు. కానీ, యథార్థ హృదయంగల ప్రజలు వాటి వల్ల మోసపోలేదు. బదులుగా, ఇలాంటివి జరుగుతాయని బైబిలు ముందే చెప్పిందని వాళ్లు గుర్తించారు.—మత్త. 24:24; 2 పేతు. 2:18-22.

20. సత్యాన్ని విడిచిపెట్టిన వాళ్లను బట్టి మనం తడబడకుండా ఎలా ఉండవచ్చు? (2 తిమోతి 4:4, 5)

20 మనం తడబడకుండా ఎలా ఉండవచ్చు? బైబిల్ని క్రమంగా అధ్యయనం చేయడం ద్వారా, పట్టుదలగా ప్రార్థించడం ద్వారా, యెహోవా మనకు అప్పగించిన పనిలో కష్టపడి పనిచేయడం ద్వారా మన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవాలి. (2 తిమోతి 4:4, 5 చదవండి.) మనకు విశ్వాసం ఉంటే, యెహోవాసాక్షుల గురించిన తప్పుడు వార్తలు విన్నప్పుడు భయపడం. (యెష. 28:16) యెహోవా మీద, ఆయన వాక్యం మీద, సహోదరుల మీద ప్రేమ ఉంటే సత్యాన్ని విడిచిపెట్టిన వాళ్లను బట్టి మనం తడబడం.

21. నేడు చాలామంది మన సందేశాన్ని ఇష్టపడకపోయినా, మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?

21 యేసు కాలంలో చాలామంది ఆయన్ని నమ్మలేదు. కానీ, కొంతమంది ఆయన్ని నమ్మారు. అలా నమ్మినవాళ్లలో కనీసం ఒక మహాసభ సభ్యుడు, ‘చాలామంది యాజకులు’ ఉన్నారు. (అపొ. 6:7; మత్త. 27:57-60; మార్కు 15:43) వాళ్లలాగే నేడు లక్షలమంది యేసును అనుసరించాలని నిర్ణయించుకున్నారు. ఎందుకు? ఎందుకంటే, వాళ్లు లేఖనాల్లో ఉన్న సత్యాల్ని తెలుసుకొని, వాటిని ప్రేమించారు. దేవుని వాక్యం ఇలా చెప్తుంది: “నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాళ్లకు అపారమైన శాంతి ఉంటుంది; వాళ్లను ఏదీ తడబడేలా చేయలేదు.”—కీర్త. 119:165.

పాట 124 ఎల్లప్పుడు యథార్థంగా ఉందాం

^ పేరా 5 గతంలో ప్రజలు యేసును ఎందుకు నమ్మలేదో, నేడు కొంతమంది ఆయన అనుచరుల్ని ఎందుకు నమ్మట్లేదో తెలిపే నాలుగు కారణాల్ని ముందటి ఆర్టికల్‌లో పరిశీలించాం. ఈ ఆర్టికల్‌లో మరో నాలుగు కారణాల్ని పరిశీలిస్తాం. యెహోవాను ప్రేమించే ప్రజలు ఎందుకు తడబడకుండా ఉంటారో కూడా తెలుసుకుంటాం.

^ పేరా 60 చిత్రాల వివరణ: యేసు మత్తయితో, పన్ను వసూలు చేసేవాళ్లతో కలిసి భోజనం చేస్తున్నాడు.

^ పేరా 62 చిత్రాల వివరణ: ఆలయంలో వ్యాపారం చేసేవాళ్లను యేసు వెళ్లగొడుతున్నాడు.

^ పేరా 64 చిత్రాల వివరణ: సైనికులు యేసుతో హింసాకొయ్యను మోయిస్తున్నారు.

^ పేరా 66 చిత్రాల వివరణ: యూదా ముద్దుపెట్టి యేసును అప్పగిస్తున్నాడు.