కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 21

యెహోవా మీకు శక్తిని ఇస్తాడు

యెహోవా మీకు శక్తిని ఇస్తాడు

“నేను ఎప్పుడు బలహీనుణ్ణో అప్పుడే బలవంతుణ్ణి.”—2 కొరిం. 12:10.

పాట 73 మాకు ధైర్యాన్నివ్వు

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. చాలామంది సాక్షులు ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు?

అపొస్తలుడైన పౌలు, పరిచర్యను పూర్తిగా నెరవేర్చమని తిమోతిని అలాగే క్రైస్తవులందరినీ ప్రోత్సహించాడు. (2 తిమో. 4:5) పౌలు ఇచ్చిన ఆ సలహాను పాటిస్తూ దేవుని సేవలో చేయగలిగినదంతా చేస్తాం. కానీ, కొన్నిసార్లు అది కష్టంగా ఉంటుంది. మన సహోదరసహోదరీల్లో చాలామందికి పరిచర్య చేసే విషయంలో ధైర్యం అవసరమౌతుంది. (2 తిమో. 4:2) ఉదాహరణకు, ప్రకటనా పని మీద ఆంక్షలు లేదా నిషేధం ఉన్న దేశాల్లో నివసిస్తున్న మన సహోదరసహోదరీల గురించి ఒక్కసారి ఆలోచించండి. జైల్లో వేసే అవకాశం ఉందని తెలిసినా వాళ్లు ప్రకటిస్తున్నారు.

2 యెహోవా ప్రజలు ఎన్నో రకాల సమస్యలను అనుభవిస్తున్నారు. అవి వాళ్లను నిరాశపర్చగలవు. ఉదాహరణకు, తమ కుటుంబాల రోజువారీ అవసరాలను తీర్చడానికే చాలామంది ఎన్నో గంటలు పని చేయాల్సి వస్తుంది. పరిచర్య ఎక్కువ చేయాలనే కోరిక ఉన్నా వారం చివరికల్లా వాళ్లకు అంత శక్తి ఉండదు. ఇంకొంతమంది తీవ్ర అనారోగ్యం వల్ల, వయసుపైబడడం వల్ల లేదా ఇళ్లకే పరిమితమైపోవడం వల్ల దేవుని సేవను అంతగా చేయలేకపోతుండవచ్చు. మరికొంతమంది యెహోవా దృష్టిలో పనికిరానివాళ్లమనే భావంతో ఎప్పుడూ సతమతమౌతూ ఉండవచ్చు. మేరీ * అనే సహోదరి ఇలా అంటోంది, “నాలో కలిగే ప్రతికూల భావాలతో పోరాడడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. దానివల్ల నేను మానసికంగా అలసిపోతాను. అంతేకాదు పరిచర్య కోసం వెచ్చించే సమయాన్ని, శక్తిని అది హరించి వేస్తుంది. దాంతో నేను బాధ పడతాను.”

3. ఈ ఆర్టికల్‌లో మనమేం పరిశీలిస్తాం?

3 మనకు ఎలాంటి సమస్యలున్నా వాటిని తట్టుకుని, మన పరిస్థితులు అనుకూలించినంత మేరకు తన సేవలో కొనసాగడానికి కావలసిన శక్తిని యెహోవా మనకు ఇవ్వగలడు. ఆయన మనకు ఎలా సహాయం చేయగలడో తెలుసుకునే ముందు, ఎన్ని కష్టాలు ఎదురైనా తమ పరిచర్యను పూర్తిగా నెరవేర్చేలా పౌలు తిమోతిలను ఆయన ఎలా బలపర్చాడో ఇప్పుడు పరిశీలిద్దాం.

పరిచర్య చేస్తూ ఉండడానికి యెహోవా శక్తిని ఇస్తాడు

4. పౌలు ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొన్నాడు?

4 పౌలు అనేక సమస్యల్ని ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా శత్రువులు తనను కొట్టినప్పుడు, జైల్లో వేసినప్పుడు, చివరికి చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆయనకు యెహోవా సహాయం అవసరమైంది. (2 కొరిం. 11:23-25) కొన్నిసార్లు నిరుత్సాహంతో పోరాడాల్సి వచ్చిందని పౌలు ఒప్పుకున్నాడు. (రోమా. 7:18, 19, 24) “శరీరంలో ఒక ముల్లు” లాంటి అనారోగ్య సమస్యను కూడా ఆయన ఎదుర్కొన్నాడు. దాన్ని తీసేయమని దేవుణ్ణి ఎంతగానో వేడుకున్నాడు.—2 కొరిం. 12:7, 8.

పరిచర్యలో కొనసాగేలా పౌలుకు ఏది సహాయం చేసింది? (5-6 పేరాలు చూడండి) *

5. సమస్యలు ఎదురైనప్పటికీ పౌలు ఏమేం చేయగలిగాడు?

5 పౌలుకు ఎన్ని సమస్యలు ఎదురైనా పరిచర్యలో కొనసాగడానికి కావాల్సిన శక్తిని యెహోవా ఇచ్చాడు. పౌలు ఏమేమి చేయగలిగాడో గమనించండి. ఉదాహరణకు ఆయన రోములో గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు, యూదా నాయకులతో పాటు బహుశా అక్కడున్న ప్రభుత్వ అధికారులకు ఉత్సాహంగా ప్రకటించాడు. (అపొ. 28:17; ఫిలి. 4:21, 22) ప్రేతోర్య సైనికుల్లో చాలామందికి అలాగే ఆయన్ని చూడడానికి వచ్చిన వాళ్లందరికీ ప్రకటించాడు. (అపొ. 28:30, 31; ఫిలి. 1:13) అదే సమయంలో తొలి క్రైస్తవులకు సహాయపడేలా దేవుడు పౌలును ఉపయోగించుకుని ఉత్తరాలు రాయించాడు. అవి నేడు మనకు కూడా ప్రయోజనకరంగా ఉన్నాయి. అంతేకాదు పౌలు ఆదర్శం రోములోని సంఘాన్ని బలపర్చింది. దానివల్ల అక్కడి సహోదరులు “ధైర్యంగా ఏమాత్రం భయపడకుండా దేవుని వాక్యాన్ని” ప్రకటించగలిగారు. (ఫిలి. 1:14) కొన్నిసార్లు తాను కోరుకున్నంత సేవ చేయలేకపోయినా, పౌలు చేయగలిగినదంతా చేశాడు. దానివల్ల ఆయనున్న ‘పరిస్థితి మంచివార్త వ్యాప్తి చేయడానికి తోడ్పడింది.’—ఫిలి. 1:12.

6. రెండో కొరింథీయులు 12:9, 10 ప్రకారం, పరిచర్యను పూర్తిగా నెరవేర్చేలా పౌలుకు ఏది సహాయం చేసింది?

6 యెహోవా సేవలో తాను చేసిందంతా దేవుని సహాయంతోనే గానీ తన సొంత శక్తితో కాదని పౌలు గ్రహించాడు. తాను ‘బలహీనంగా ఉన్నప్పుడే దేవుని శక్తి ఇంకా బలంగా పని చేసిందని’ ఆయన ఒప్పుకున్నాడు. (2 కొరింథీయులు 12:9, 10 చదవండి.) పౌలు హింసించబడినా, చెరసాలలో వేయబడినా అలాగే ఇతర సవాళ్లు ఎదుర్కొన్నా తన పరిచర్యను పూర్తిగా నెరవేర్చడానికి యెహోవాయే తన పవిత్రశక్తి ద్వారా కావల్సిన బలాన్ని ఆయనకు ఇచ్చాడు.

పరిచర్యలో కొనసాగేలా తిమోతికి ఏది సహాయం చేసింది? (7వ పేరా చూడండి) *

7. తన పరిచర్యను పూర్తిగా నెరవేర్చడానికి తిమోతి ఏ సవాళ్లను అధిగమించాల్సి వచ్చింది?

7 పౌలుతో పాటు పనిచేసిన తిమోతి కూడా పరిచర్య చేయడానికి దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. తిమోతి పౌలుతో పాటు మిషనరీ యాత్రలో ప్రయాణించాడు. కొన్ని సంఘాలను సందర్శించి వాళ్లను ప్రోత్సహించడానికి కూడా పౌలు తిమోతిని పంపించాడు. (1 కొరిం. 4:17) ఆ పని చేసే సామర్థ్యం తనకు లేదని తిమోతి అనుకొనివుంటాడు. బహుశా అందుకే పౌలు తిమోతితో, “నీ యౌవనాన్ని బట్టి నిన్ను ఎవ్వరూ, ఎప్పుడూ చిన్నచూపు చూడకుండా జాగ్రత్తపడు” అని చెప్పాడు. (1 తిమో. 4:12) అదే సమయంలో, తిమోతి తన శరీరంలోని ముల్లుతో అంటే ‘తరచూ వచ్చే జబ్బుతో’ బాధపడుతున్నాడు. (1 తిమో. 5:23) అయితే, పవిత్రశక్తి మంచివార్త ప్రకటించడానికి అలాగే తన సహోదరులకు సేవ చేయడానికి కావాల్సిన బలాన్నిస్తుందని తిమోతికి తెలుసు.—2 తిమో. 1:7.

సమస్యలు ఎదురైనా నమ్మకంగా ఉండడానికి యెహోవా శక్తినిస్తాడు

8. నేడు యెహోవా తన ప్రజలకు శక్తినివ్వడానికి వేటిని ఏర్పాటు చేశాడు?

8 నేడు తన సేవలో నమ్మకంగా కొనసాగేలా యెహోవా తన ప్రజలకు “అసాధారణ శక్తి” ఇస్తున్నాడు. (2 కొరిం. 4:7) మనకు శక్తిని ఇవ్వడానికి, తనకు నమ్మకంగా ఉండేలా సహాయం చేయడానికి యెహోవా ఏర్పాటు చేసిన నాలుగు విషయాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం. అవేంటంటే: ప్రార్థన, బైబిలు, సహోదరసహోదరీలతో సహవాసం, పరిచర్య.

ప్రార్థన ద్వారా యెహోవా మనకు శక్తినిస్తాడు (9వ పేరా చూడండి)

9. ప్రార్థన మనకు ఎలా సహాయం చేస్తుంది?

9 ప్రార్థన ద్వారా శక్తి పొందడం. “ప్రతీ సందర్భంలో” ప్రార్థించమని పౌలు ఎఫెసీయులు 6:18 లో ప్రోత్సహిస్తున్నాడు. అలా ప్రార్థించినప్పుడు యెహోవా మనకు శక్తినిస్తాడు. బొలీవియాలో నివసిస్తున్న జానీ, సమస్యల్ని ఒకదాని తర్వాత ఒకటి ఎదుర్కొన్నప్పుడు యెహోవా తనకు శక్తినిచ్చాడని చెప్పాడు. అతని భార్య, తల్లిదండ్రులు ఒకే సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వాళ్ల ముగ్గురి బాగోగులు చూసుకోవడం అతనికి కష్టమైంది. జానీ వాళ్ల అమ్మ చనిపోయింది. అలాగే అతని భార్య, తండ్రి పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అ కష్ట సమయాన్ని గుర్తుచేసుకుంటూ అతను, “నేను తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు, నాకు ఎలా అనిపిస్తుందో యెహోవాకు ప్రార్థనలో వివరంగా చెప్పేవాడిని. అది నాకు ఎంతో సహాయం చేసింది” అని అంటున్నాడు. ఆ పరిస్థితిని తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని జానీకి యెహోవా ఇచ్చాడు. బొలీవియాలో సంఘపెద్దగా సేవ చేస్తున్న రానల్డ్‌ అనే సహోదరుని తల్లికి క్యాన్సర్‌ వచ్చింది. ఆమె ఒక నెల తర్వాత చనిపోయింది. దాన్ని తట్టుకోవడానికి అతనికి ఏది సహాయం చేసింది? “యెహోవాకు ప్రార్థన చేస్తున్నప్పుడు నా హృదయంలో ఉన్నదంతా చెప్పేవాణ్ణి. నా గురించి నా కన్నా, వేరే ఎవరి కన్నా యెహోవాకే ఎక్కువ తెలుసని, నన్ను ఆయనే ఎక్కువ అర్థం చేసుకుంటాడని నాకు తెలుసు” అని రానల్డ్‌ అన్నాడు. కొన్నిసార్లు మనం సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవ్వొచ్చు. దేని గురించి ప్రార్థించాలో కూడా అర్థంకాకపోవచ్చు. అయితే మన ఆలోచనల్ని, భావాల్ని చెప్పడం కష్టంగా అనిపించినా యెహోవా మనల్ని ప్రార్థించమని ఆహ్వానిస్తున్నాడు.—రోమా. 8:26, 27.

బైబిలు ద్వారా యెహోవా మనకు శక్తినిస్తాడు (10వ పేరా చూడండి)

10. హెబ్రీయులు 4:12 చెప్తున్నట్టు, బైబిలు చదివి ధ్యానించడం ఎందుకు చాలా ప్రాముఖ్యం?

10 బైబిలు ద్వారా శక్తి పొందడం. పౌలు శక్తిని, ఓదార్పును పొందడం కోసం లేఖనాల్ని చదివాడు. మనం కూడా అలాగే చేయాలి. (రోమా. 15:4) దేవుని వాక్యాన్ని చదివి, ధ్యానించినప్పుడు లేఖనాలు మనకు ఎలా ఉపయోగపడతాయో అర్థంచేసుకునేలా తన పవిత్రశక్తి ద్వారా యెహోవా సహాయం చేస్తాడు. (హెబ్రీయులు 4:12 చదవండి.) పైన ప్రస్తావించబడిన రానల్డ్‌ ఇలా అంటున్నాడు, “ప్రతిరోజు రాత్రి బైబిల్లోని కొంత భాగాన్ని చదివే అలవాటు నాకు ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. నేను ఎక్కువగా యెహోవా లక్షణాల గురించి, ఆయన తన ప్రజలతో ప్రేమగా వ్యవహరించిన తీరు గురించి ధ్యానిస్తాను. అలా చేయడం నాకు శక్తినిస్తుంది.”

11. భర్తను మరణంలో కోల్పోయి బాధపడుతున్న సహోదరికి బైబిలు ఎలా శక్తినిచ్చింది?

11 దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు మన సమస్యల గురించి సరైన ఆలోచన కలిగి ఉండడానికి అది సహాయం చేస్తుంది. భర్తను మరణంలో కోల్పోయి బాధపడుతున్న ఒక సహోదరికి బైబిలు ఎలా సహాయం చేసిందో పరిశీలించండి. ఒక సంఘపెద్ద ఆమెను యోబు పుస్తకం చదవమని ప్రోత్సహించాడు. అందులో ఆమెకు ఉపయోగపడే విషయాలు ఉన్నాయని చెప్పాడు. దాన్ని చదవగానే ఆమె ముందుగా యోబు ఆలోచనా విధానాన్ని తప్పుబట్టింది. ఆమె యోబుతో మాట్లాడుతున్నట్టు ఊహించుకుని: “యోబు, నీ సమస్యల గురించే ఆలోచించకు” అని అంది. కానీ, ఆమె ఆలోచనా విధానం కూడా యోబులానే ఉందని గ్రహించింది. దాంతో తన ఆలోచనా విధానాన్ని మార్చుకొని, భర్తను కోల్పోయిన బాధను తట్టుకునే శక్తిని పొందింది.

సహోదరసహోదరీలతో సహవాసం ద్వారా యెహోవా మనకు శక్తినిస్తాడు (12వ పేరా చూడండి)

12. యెహోవా మనకు శక్తిని ఇవ్వడానికి తోటి ఆరాధకులను ఎలా ఉపయోగించుకుంటాడు?

12 సహోదరసహోదరీల సహవాసం ద్వారా శక్తి పొందడం. యెహోవా తన ప్రజలకు తోటి ఆరాధకులు ద్వారా కూడా శక్తినిస్తాడు. పౌలు తోటి సహోదరసహోదరీల నుండి ‘ప్రోత్సాహం పొందాలని’ కోరుకున్నాడు. (రోమా. 1:11, 12) పై పేరాల్లో ప్రస్తావించబడిన మేరీ, సహోదరసహోదరీలతో సహవాసాన్ని ఆనందిస్తుంది. ఆమె ఇలా అంటుంది: “నా సమస్యల గురించి అస్సలు తెలియని సహోదరసహోదరీలను ఉపయోగించి యెహోవా నాకు సహాయం చేశాడు. వాళ్లు నన్ను ప్రోత్సహించేలా మాట్లాడేవాళ్లు లేదా ఒక కార్డు రాసి పంపేవాళ్లు. అవి సరిగ్గా నాకు అవసరమైన విధంగా ఉండేవి. దానివల్ల నాలాంటి సమస్యల్నే ఎదుర్కొన్న సహోదరీలతో మాట్లాడి, వాళ్ల నుండి నేర్చుకోగలిగాను. దానికితోడు సంఘపెద్దలు, నేను సంఘంలో విలువైనదాన్ని అని నాకెప్పుడూ అనిపించేలా చేసేవాళ్లు.”

13. సంఘకూటాల్లో మనం ఒకరినొకరం ఎలా బలపర్చుకోవచ్చు?

13 ఒకరినొకరం ప్రోత్సహించుకోవడానికి మంచి అవకాశం సంఘ కూటాల్లో దొరుకుతుంది. మీరు సంఘ కూటాలకు హాజరైనప్పుడు చొరవ తీసుకొని ఇతరులతో ప్రేమగా మాట్లాడడం ద్వారా, మెచ్చుకోవడం ద్వారా వాళ్లను బలపర్చవచ్చు. ఉదాహరణకు, ఒక రోజు కూటానికి ముందు పీటర్‌ అనే సంఘపెద్ద, అవిశ్వాసి భర్త ఉన్న ఒక సహోదరితో మాట్లాడుతూ, “మిమ్మల్ని ఇక్కడ చూడడం ఎంతో ప్రోత్సాహంగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడూ మీ ఆరుగురు పిల్లల్ని చక్కగా రెడీ చేసి, కామెంట్స్‌ ప్రిపేర్‌ చేయించి తీసుకొస్తారు” అని చెప్పాడు. ఆ మాటలకు సంతోషంతో ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. దానికి ఆమె ఇలా అంది, “ఈ రోజు నాకు ఈ మాటలు ఎంత అవసరమో మీరు ఊహించలేరు!”

పరిచర్య ద్వారా యెహోవా మనకు శక్తినిస్తాడు (14వ పేరా చూడండి)

14. పరిచర్య మనకు ఎలా సహాయం చేస్తుంది?

14 పరిచర్య ద్వారా శక్తి పొందడం. మనం బైబిలు సత్యాల్ని ఇతరులతో పంచుకున్నప్పుడు వాళ్లు విన్నా వినకపోయినా మనకు సేదదీర్పుగా, బలం పొందినట్టుగా అనిపిస్తుంది. (సామె. 11:25) స్టేసీ అనే సహోదరి పరిచర్య ఎంత బలాన్ని ఇవ్వగలదో అనుభవపూర్వకంగా తెలుసుకుంది. తన కుటుంబ సభ్యుల్లో ఒకరు బహిష్కరించబడినప్పుడు ఆమె చాలా బాధపడింది. ‘నేనింకా ఎక్కువ సహాయం చేసుంటే బాగుండేదేమో’ అని అనుకుంటూ ఉండేది. స్టేసీ ఆ సమస్య గురించి ఆలోచించకుండా ఉండలేకపోయింది. ఆ బాధను తట్టుకోవడానికి ఆమెకు ఏది సహాయం చేసింది? పరిచర్యే! తాను పరిచర్యకు వెళ్తుండగా తన సహాయం అవసరమైన ప్రజల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఆమె ఇలా చెప్పింది, “ఆ సమయంలో యెహోవా నాకు మంచి బైబిలు స్టడీ ఇచ్చాడు. ఆ విద్యార్థి త్వరగా ప్రగతి సాధించింది. అది నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చింది. నా జీవితంలో పరిచర్య ఎంతో సహాయం చేసింది.”

15. మేరీ అనుభవం నుండి ఏం నేర్చుకోవచ్చు?

15 కొంతమంది వాళ్ల పరిస్థితిని బట్టి ఎక్కువ పరిచర్య చేయలేకపోతున్నామని అనుకోవచ్చు. మీకూ అలా అనిపిస్తుంటే, మీరు చేయగలిగినదంతా చేసినప్పుడు యెహోవా సంతోషిస్తాడని గుర్తుంచుకోండి. మేరీ అనుభవాన్ని మళ్లీ పరిశీలిద్దాం. ఆమె వేరే భాషా సంఘానికి మారినప్పుడు అక్కడ తాను అంతగా ఉపయోగపడట్లేదని అనుకుంది. ఆమె ఇలా అంటుంది, “నేను కొంతకాలం పాటు కేవలం ఒక కామెంట్‌ చెప్పడమో, ఒక లేఖనం చదవడమో, పరిచర్యలో ఒక కరపత్రం ఇవ్వడమో చేసేదాన్ని.” ఆ భాష బాగా మాట్లాడే వాళ్లతో పోలిస్తే, తాను అంతగా మాట్లాడలేనని మేరీ అనుకుంది. కానీ ఆమె తన ఆలోచనా విధానాన్ని మార్చుకుంది. ఆ భాష పూర్తిగా రాకపోయినా యెహోవా తనను ఉపయోగించుకుంటాడని ఆమె అర్థం చేసుకుంది. ఆమె ఇలా అంటుంది, “ప్రజల ప్రాణాల్ని కాపాడే బైబిలు సత్యాలు తేలిగ్గా అర్థమయ్యేలా ఉంటాయి. అవి వాళ్ల జీవితాల్ని మార్చగలవు.”

16. అనారోగ్యం వల్ల ఇంటికే పరిమితమైన వాళ్లకు ఏది శక్తినిస్తుంది?

16 మనలో కొంతమంది అనారోగ్యం వల్ల ఇంటికే పరిమితమైనప్పటికీ, పరిచర్య చేయాలనే మన కోరికను యెహోవా చూస్తాడు. మన బాగోగులు చూసుకునే వాళ్లకు లేదా డాక్టర్లకు, నర్సులకు ప్రకటించే అవకాశాన్ని యెహోవా మనకిస్తాడు. ఇప్పుడు మనం చేస్తున్న సేవను గతంలో చేసిన దానితో పోలిస్తే నిరుత్సాహపడొచ్చు. కానీ యెహోవా ఇప్పుడు మనకు ఎలా సహాయం చేస్తున్నాడో గుర్తిస్తే ఎలాంటి సమస్యనైనా సంతోషంగా ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని పొందుతాం.

17. ప్రసంగి 11:6 ప్రకారం, మన పరిచర్యకు ప్రజలు వెంటనే స్పందించకపోయినా ఎందుకు ప్రకటిస్తూనే ఉండాలి?

17 మనం విత్తిన సత్యపు విత్తనాల్లో ఏవి మొలకెత్తి, ఎదుగుతాయో మనకు తెలీదు. (ప్రసంగి 11:6 చదవండి.) ఉదాహరణకు 80 ఏళ్లు పైబడిన బార్బరా అనే సహోదరి తరచూ ఫోన్‌ ద్వారా, ఉత్తరాల ద్వారా సాక్ష్యం ఇస్తుంది. ఆమె రాసిన ఒక ఉత్తరానికి ‘దేవుడు మీ కోసం ఎంతో చేశాడు’ అనే ఆర్టికల్‌ ఉన్న 2014 మార్చి 1, కావలికోటను జతచేసి పంపించింది. (ఆ పత్రిక తెలుగులో అందుబాటులో లేదు.) తాను రాసిన ఉత్తరం సంఘం నుండి బహిష్కరించబడిన ఒక జంటకు చేరిందని ఆమెకు తెలీదు. వాళ్లు ఆ పత్రికను పదేపదే చదివారు. ఆ భర్తకు, స్వయంగా యెహోవాయే అతనితో మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఆ జంట సంఘ కూటాలకు హాజరవ్వడం మొదలుపెట్టారు. మళ్లీ 27 కన్నా ఎక్కువ సంవత్సరాల తర్వాత వాళ్లు చురుగ్గా సేవచేసే సాక్షులయ్యారు. తాను రాసిన ఆ ఉత్తరం ద్వారా మంచి ఫలితం రావడం చూసి బార్బరా ఎంతో ప్రోత్సాహాన్ని, బలాన్ని పొందింది.

(1) ప్రార్థన, (2) బైబిలు, (3) సహోదరసహోదరీలతో సహవాసం, (4) పరిచర్య ద్వారా యెహోవా మనకు శక్తినిస్తాడు (9-10, 12, 14 పేరాలు చూడండి)

18. దేవుడు ఇచ్చే శక్తి నుండి ప్రయోజనం పొందడానికి మనమేమి చేయవచ్చు?

18 మనం తన అపార శక్తిని పొందేలా యెహోవా ఎన్నో అవకాశాల్ని ఇస్తున్నాడు. ప్రార్థన, బైబిలు, తోటి సహోదరసహోదరీలతో సహవాసం, పరిచర్య వంటివాటి ద్వారా యెహోవా మనకు శక్తిని ఇస్తున్నాడు. మనం వాటిని ఉపయోగించుకున్నప్పుడు యెహోవాకు సహాయం చేసే సామర్థ్యం, కోరిక ఉన్నాయని నమ్ముతున్నట్లు చూపిస్తాం. “ఎవరి హృదయమైతే తన పట్ల సంపూర్ణంగా ఉంటుందో వాళ్ల తరఫున తన బలం చూపించడానికి” సంతోషించే మన పరలోక తండ్రి మీద ఎప్పుడూ ఆధారపడదాం.—2 దిన. 16:9.

పాట 61 సాక్షుల్లారా, ముందుకు సాగండి!

^ పేరా 5 మనం కష్టమైన కాలాల్లో జీవిస్తున్నా వాటిని తట్టుకోవడానికి యెహోవా సహాయం చేస్తాడు. కష్టాలు ఎదురైనా తన సేవలో కొనసాగడానికి అపొస్తలుడైన పౌలుకి, తిమోతికి యెహోవా ఎలా సహాయం చేశాడో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. మనం కూడా యెహోవా సేవలో కొనసాగేలా ఆయన ఏర్పాటు చేసిన నాలుగు విషయాల్ని చర్చిస్తాం.

^ పేరా 2 అసలు పేరు కాదు.

^ పేరా 53 చిత్రాల వివరణ: పౌలు రోములో గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు చాలా సంఘాలకు ఉత్తరాలు రాశాడు. అలాగే తనను చూడడానికి వచ్చిన వాళ్లకు మంచివార్తను ప్రకటిస్తున్నాడు.

^ పేరా 55 చిత్రాల వివరణ: తిమోతి సంఘాల్ని సందర్శిస్తున్నప్పుడు సహోదరులను ప్రోత్సహిస్తున్నాడు.