కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 23

తల్లిదండ్రులారా, యెహోవాను ప్రేమించేలా మీ పిల్లలకు సహాయం చేయండి

తల్లిదండ్రులారా, యెహోవాను ప్రేమించేలా మీ పిల్లలకు సహాయం చేయండి

“నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ నిండు మనసుతో ప్రేమించాలి.”మత్త. 22:37.

పాట 134 పిల్లలు యెహోవా ఇచ్చిన బాధ్యత

ఈ ఆర్టికల్‌లో. . . *

1-2. పరిస్థితులు మారినప్పుడు కొన్ని బైబిలు లేఖనాలు మనకెందుకు మరింత ప్రాముఖ్యంగా అనిపిస్తాయో వివరించండి.

 పెళ్లిరోజు ఎంతో అందంగా తయారైన పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఒక పెద్ద ఇచ్చే పెళ్లి ప్రసంగాన్ని శ్రద్ధగా వింటారు. బహుశా ఆ ప్రసంగంలో చెప్పిన విషయాలు వాళ్లకు ఇంతకుముందే తెలిసుండొచ్చు. కానీ ఆ సమయం నుండి భార్యాభర్తలుగా ఆ విషయాల్ని కలిసి పాటించాలి కాబట్టి వాటిమీద ఇంకా శ్రద్ధ పెడతారు.

2 ఒక క్రైస్తవ జంట తల్లిదండ్రులు అయినప్పుడు కూడా అంతే. వాళ్లు చాలా సంవత్సరాలుగా పిల్లల్ని పెంచడం గురించి ఎన్నో ప్రసంగాలు వినివుంటారు. కానీ అందులో విన్న సలహాలు ఇప్పుడు వాళ్లకు చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్లకు ఇప్పుడు పిల్లల్ని పెంచే పెద్ద బాధ్యత ఉంది. మన పరిస్థితులు మారినప్పుడు బాగా తెలిసిన లేఖనాలైనా మరింత ఉపయోగపడేలా అనిపిస్తాయి. అందుకే ఇశ్రాయేలీయుల రాజుల్లాగే యెహోవా ఆరాధకులు కూడా “జీవించినన్ని రోజులు” లేఖనాల్ని చదివి, వాటి గురించి లోతుగా ఆలోచిస్తారు.—ద్వితీ. 17:19.

3. ఈ ఆర్టికల్‌లో మనమేం చర్చిస్తాం?

3 తమ పిల్లలకు యెహోవా గురించి నేర్పించడం, క్రైస్తవులకు ఉన్న ఒక గొప్ప బాధ్యత. తల్లిదండ్రులారా, మీకు ఆ బాధ్యత ఉంది కాబట్టి పిల్లలకు కేవలం యెహోవా గురించి వాస్తవాలు చెప్పడమే కాదు, వాళ్లు ఆయన్ని ప్రేమించేలా కూడా సహాయం చేయాలి. దాన్ని మీరెలా చేయొచ్చు? మీకు సహాయం చేసే నాలుగు బైబిలు సూత్రాల్ని ఈ ఆర్టికల్‌లో చూస్తాం. (2 తిమో. 3:16) అలాగే వాటిని పాటించి కొంతమంది తల్లిదండ్రులు ఎలా ప్రయోజనం పొందారో కూడా తెలుసుకుంటాం.

తల్లిదండ్రులకు సహాయం చేసే నాలుగు సూత్రాలు

మీరు యెహోవా నిర్దేశం కోసం ఎప్పుడూ వెతుకుతూ మీ పిల్లలకు చక్కని ఆదర్శం ఉంచితే, అది వాళ్లపై ఎలాంటి మంచి ప్రభావం చూపిస్తుంది? (4, 8 పేరాలు చూడండి)

4. పిల్లల్లో యెహోవామీద ప్రేమ పెంచేలా తల్లిదండ్రులకు సహాయం చేసే ఒక సూత్రం ఏంటి? (యాకోబు 1:5)

4 మొదటి సూత్రం: యెహోవా నిర్దేశం కోసం వెతకండి. ఆయనమీద మీ పిల్లల్లో ప్రేమ పెంచేలా సహాయం చేయడానికి మీకు తెలివి ఇవ్వమని యెహోవాను అడగండి. (యాకోబు 1:5 చదవండి.) ఈ విషయంలో అందరికన్నా ఆయనే బాగా సలహా ఇవ్వగలడు. దానికెన్నో కారణాలున్నా, వాటిలో రెండు కారణాల్ని చూద్దాం. మొదటిగా, యెహోవాకు ఒక తండ్రిగా అందరికన్నా ఎక్కువ అనుభవముంది. (కీర్త. 36:9) రెండోదిగా, ఆయన ఇచ్చే తెలివైన సలహాలు ఎప్పుడూ ప్రయోజనాల్నే తెస్తాయి.—యెష. 48:17.

5. (ఎ) తల్లిదండ్రులకు సహాయం చేయడానికి యెహోవా సంస్థ వేటిని అందుబాటులో ఉంచింది? (బి) వీడియోలో చూసినట్టు పిల్లల్ని పెంచే విషయంలో ఆమొరీమ్‌​ దంపతుల నుండి మీరేం నేర్చుకున్నారు?

5 పిల్లలు తనను ప్రేమించేలా పెంచడానికి తల్లిదండ్రులకు సహాయం చేసే ఎంతో సమాచారాన్ని తన వాక్యం ద్వారా, తన సంస్థ ద్వారా యెహోవా ఇస్తున్నాడు. (మత్త. 24:45) ఉదాహరణకు, తేజరిల్లు! పత్రికలో ఇంతకుముందు వచ్చిన “కుటుంబం కోసం” అనే ఆర్టికల్‌ సిరీస్‌​లో, ఉపయోగపడే ఎన్నో సలహాల్ని చూడొచ్చు. అవే ఇప్పుడు వెబ్‌​సైట్‌​లో అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు jw.orgలో ఎన్నో వీడియోలు ఉన్నాయి. యెహోవా ఇచ్చిన సలహాల్ని పాటిస్తూ తమ పిల్లల్ని పెంచడానికి ఇవి తల్లిదండ్రులకు సహాయం చేస్తాయి. *సామె. 2:4-6.

6. యెహోవా సంస్థ నుండి తాను, తన భార్య పొందిన నిర్దేశం గురించి జో ఏమంటున్నాడు?

6 పిల్లల్ని పెంచే విషయంలో యెహోవా తన సంస్థ ద్వారా ఎంతో సహాయం చేస్తున్నాడని చాలామంది తల్లిదండ్రులు అంటున్నారు. జో అనే తండ్రి ఇలా చెప్తున్నాడు: “ముగ్గురు పిల్లల్ని సత్యంలో పెంచడం అంత తేలికేమీ కాదు. అలా పెంచడానికి సహాయం చేయమని నేను, నా భార్య యెహోవాకు ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాం. అప్పుడు మా పరిస్థితికి సరిగ్గా సరిపోయే ఒక ఆర్టికల్‌ లేదా వీడియో సరైన సమయంలో వచ్చిందని మాకు చాలాసార్లు అనిపించింది. అందుకే మేం అన్ని సమయాల్లో యెహోవా నిర్దేశం మీదే ఆధారపడతాం.” ఈ ఏర్పాట్లవల్ల తమ పిల్లలు యెహోవాకు దగ్గరయ్యారని జో, అతని భార్య అర్థంచేసుకున్నారు.

7. పిల్లలకు మంచి ఆదర్శం ఉంచడానికి తల్లిదండ్రులు శాయశక్తులా కృషిచేయడం ఎందుకు ప్రాముఖ్యం? (రోమీయులు 2:21)

7 రెండో సూత్రం: మీ పిల్లలకు మంచి ఆదర్శాన్ని ఉంచండి. పిల్లలు తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా గమనిస్తారు, వాళ్లేం చేస్తే అదే చేయడానికి ప్రయత్నిస్తారు. నిజమే తల్లిదండ్రులు ఎవ్వరూ పరిపూర్ణులు కారు. (రోమా. 3:23) అయినా తమ పిల్లలకు మంచి ఆదర్శం ఉంచడానికి వాళ్లు శాయశక్తులా ప్రయత్నిస్తారు. (రోమీయులు 2:21 చదవండి.) పిల్లల గురించి ఒక తండ్రి ఇలా చెప్తున్నాడు: “వాళ్లు స్పాంజీలాగా ఉంటారు. స్పాంజీ అన్నిటినీ పీల్చుకున్నట్టే, పిల్లలు కూడా అన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తారు. వాళ్లని చేయమని చెప్పే విషయాలు మనమే చేయకపోతే, వాళ్లు వెంటనే పసిగట్టి మనకు చెప్తారు.” కాబట్టి, పిల్లలు యెహోవాను ప్రేమించాలని మనం కోరుకుంటే, ముందు మనకు ఆయనమీద ప్రేమ బలంగా ఉండాలి. అలాగే ఆ ప్రేమ వాళ్లకు స్పష్టంగా కనబడాలి.

8-9. ఆండ్రూ, ఎమ్మా మాటల నుండి మీరేం నేర్చుకున్నారు?

8 తమ పిల్లలు యెహోవాను ప్రేమించేలా తల్లిదండ్రులు ఎన్నో విధాలుగా నేర్పించవచ్చు. ఒకసారి 17 ఏళ్ల ఆండ్రూ అనే సహోదరుడు ఏం చెప్తున్నాడో గమనించండి: “ప్రార్థించడం చాలా ప్రాముఖ్యమని నా తల్లిదండ్రులు నాకు ఎప్పుడూ నేర్పించారు. ప్రతీరోజు రాత్రి నేను ప్రార్థించాక కూడా, మా నాన్న నాతో కలిసి ప్రార్థించేవాడు. అలాగే ‘యెహోవాతో ఎన్నిసార్లు అయినా మాట్లాడవచ్చని’ మా తల్లిదండ్రులు నాకు, మా చెల్లికి ఎప్పుడూ గుర్తుచేసేవాళ్లు. అలా చేయడంవల్ల ప్రార్థించడం ఎంత ముఖ్యమో నేను అర్థంచేసుకుని, ఇప్పుడు చాలా తేలిగ్గా ప్రార్థన చేస్తున్నాను. అలాగే నన్ను ప్రేమించే ఒక తండ్రిగా యెహోవాను చూడగలుగుతున్నాను.” కాబట్టి తల్లిదండ్రులారా యెహోవామీద మీకున్న ప్రేమను చూసి, మీ పిల్లలు కూడా ఆయన్ని ప్రేమించగలరని ఎప్పుడూ గుర్తుంచుకోండి.

9 ఎమ్మా అనే సహోదరి అనుభవాన్ని చూడండి. తమ కుటుంబాన్ని వాళ్ల నాన్న వదిలేసి వెళ్లిపోయినప్పుడు అతను చేసిన ఎన్నో అప్పుల్ని వాళ్ల అమ్మే తీర్చాల్సి వచ్చింది. ఎమ్మా ఇలా అంటోంది: “చాలాసార్లు మా అమ్మ దగ్గర సరిపడా డబ్బులుండేవి కావు. అయినా యెహోవా తన సేవకుల్ని ఎలా చూసుకుంటాడో ఆమె ఎప్పుడూ మాకు చెప్తుండేది. మా అమ్మ మాటల ద్వారానే కాదు, పనుల ద్వారా కూడా యెహోవాను ఎంత నమ్ముతుందో చూపించేది. నన్ను చేయమని చెప్పే విషయాల్ని ముందు ఆమె కూడా చేయడం ద్వారా మంచి ఆదర్శాన్ని ఉంచింది.” కష్టమైన పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి ఆదర్శం ఉంచవచ్చని ఈ అనుభవం నుండి నేర్చుకోవచ్చు.—గల. 6:9.

10. ఇశ్రాయేలు తల్లిదండ్రులు, తమ పిల్లలతో ఎప్పుడెప్పుడు మాట్లాడి ఉంటారు? (ద్వితీయోపదేశకాండం 6:6, 7)

10 మూడో సూత్రం: మీ పిల్లలతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండండి. తమ పిల్లలకు తన గురించి బోధిస్తూ ఉండాలని యెహోవా ఇశ్రాయేలీయులకు చెప్పాడు. (ద్వితీయోపదేశకాండం 6:6, 7 చదవండి.) యెహోవా గురించి తమ పిల్లలతో మాట్లాడి, ఆయనమీద ప్రేమను పెంచడానికి వాళ్లకు ప్రతీరోజు ఎన్నో అవకాశాలు ఉండేవి. ఉదాహరణకు, ఒక ఇశ్రాయేలు అబ్బాయి తన తండ్రితో కలిసి పొలం పనిలో లేదా పంటకోసే పనిలో సహాయం చేస్తూ సమయం గడపొచ్చు. ఇశ్రాయేలు అమ్మాయి అయితే వాళ్ల అమ్మతో కలిసి కుట్టుపనిలో, నేత నేసేపనిలో లేదా ఇతర ఇంటిపనుల్లో సహాయం చేస్తూ సమయం గడపొచ్చు. అలా తల్లిదండ్రులు, పిల్లలు కలిసి పనిచేస్తున్నప్పుడు యెహోవా గురించి మాట్లాడుకోవడానికి ఎన్నో అవకాశాలు దొరికేవి. బహుశా వాళ్లప్పుడు యెహోవా మంచితనం గురించి, ఆయన వాళ్ల కుటుంబానికి ఎలా సహాయం చేస్తున్నాడనే దానిగురించి మాట్లాడుకుని ఉంటారు.

11. క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలతో మాట్లాడడానికి ఒక అవకాశం ఏంటి?

11 అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. చాలా దేశాల్లో తల్లిదండ్రులు, పిల్లలు రోజంతా సమయం గడపడం కష్టమౌతుంది. తల్లిదండ్రులు పనిస్థలంలో ఉంటే, పిల్లలేమో స్కూల్లో ఉంటున్నారు. కాబట్టి, బిజీగా ఉన్నాసరే తల్లిదండ్రులు తమ పిల్లలతో మాట్లాడడానికి సమయం తీసుకోవాలి. (ఎఫె. 5:15, 16; ఫిలి. 1:10) అయితే అలా మాట్లాడుకోవడానికి కుటుంబ ఆరాధన ఒక మంచి అవకాశం. అలెగ్జాండర్‌ అనే యౌవన సహోదరుడు ఇలా చెప్తున్నాడు: “మా నాన్న ప్రతీవారం కుటుంబ ఆరాధన ఖచ్చితంగా జరిగేలా చూసుకుంటాడు. ఆ సమయంలో ఆయన ఏ పనీ పెట్టుకోడు. కుటుంబ ఆరాధన తర్వాత కూడా మేమంతా ఏదోక విషయం గురించి మాట్లాడుకుంటాం.”

12. కుటుంబ ఆరాధన చేస్తున్నప్పుడు కుటుంబ పెద్ద ఏ విషయాన్ని మనసులో ఉంచుకోవాలి?

12 మీరు ఒక కుటుంబ పెద్ద అయితే మీ పిల్లలు కుటుంబ ఆరాధనను ఆనందించేలా ఏం చేయొచ్చు? ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే కొత్త పుస్తకాన్ని మీ పిల్లలతో కలిసి అధ్యయనం చేయొచ్చు. తేలిగ్గా మాట్లాడడానికి ఈ పుస్తకం సహాయం చేస్తుంది కాబట్టి ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. మీ పిల్లలు ఏం ఆలోచిస్తున్నారో, ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారో మనసువిప్పి చెప్పాలని మీరు కోరుకుంటారు. అందుకే కుటుంబ ఆరాధన చేస్తున్నప్పుడు వాళ్లను తప్పుపట్టడం గానీ, తిట్టడం గానీ చేయకండి. అలాగే బైబిలు సూత్రాలకు తగ్గట్టుగా లేని ఏదైనా విషయాన్ని మీకు చెప్తే వాళ్లను కోప్పడకండి. నిజానికి, పిల్లలకు ఎలా అనిపిస్తుందో మీకు తెలిస్తేనే వాళ్లకు సహాయం చేయగల్గుతారు. కాబట్టి వాళ్ల అభిప్రాయాల్ని నిజాయితీగా చెప్తున్నందుకు సంతోషించి అలానే చెప్తూ ఉండమని వాళ్లని ప్రోత్సహించండి.

సృష్టిని ఉపయోగించి తల్లిదండ్రులు తమ పిల్లలకు యెహోవా లక్షణాల గురించి ఎలా నేర్పించవచ్చు? (13వ పేరా చూడండి)

13. యెహోవాకు దగ్గరయ్యేలా పిల్లలకు సహాయం చేయడానికి తల్లిదండ్రులకు వేరే ఏ సందర్భాలు దొరుకుతాయి?

13 తల్లిదండ్రులారా, మన ప్రేమగల దేవునికి దగ్గరయ్యేలా మీ పిల్లలకు సహాయం చేయడానికి ప్రతీరోజు అవకాశాల కోసం వెతకండి. అలా మాట్లాడడానికి బైబిలు స్టడీ చేసే సమయం కోసమే ఆగాల్సిన అవసరం లేదు. లీసా అనే తల్లి ఇలా అంటోంది: “పిల్లలకు యెహోవా గురించి నేర్పించడానికి మా చుట్టూ ఉన్నవాటన్నిటినీ ఉపయోగించేవాళ్లం. ఉదాహరణకు, మా కుక్క చేసే కొన్ని పనులకు మా పిల్లలు నవ్వినప్పుడు యెహోవా సంతోషంగల దేవుడని, మనం కూడా సంతోషంగా ఉంటూ చిన్నచిన్న వాటినుండి ఆనందం పొందడం సాధ్యమేనని వాళ్లకు నేర్పించేవాళ్లం.”

తల్లిదండ్రులారా, మీ పిల్లల స్నేహితుల గురించి మీకు తెలుసా? (14వ పేరా చూడండి) *

14. పిల్లలు మంచి స్నేహితుల్ని ఎంచుకునేలా తల్లిదండ్రులు సహాయం చేయడం ఎందుకు ప్రాముఖ్యం? (సామెతలు 13:20)

14 నాలుగో సూత్రం: మంచి స్నేహితుల్ని ఎంచుకునేలా మీ పిల్లలకు సహాయం చేయండి. మన స్నేహితులవల్ల మనపై మంచి ప్రభావమైనా, చెడు ప్రభావమైనా పడుతుందని బైబిలు స్పష్టంగా చెప్తుంది. (సామెతలు 13:20 చదవండి.) తల్లిదండ్రులారా మీ పిల్లల స్నేహితులు ఎవరో మీకు తెలుసా? మీరెప్పుడైనా వాళ్లను కలిసి, వాళ్లతో సమయం గడిపారా? మీ పిల్లలు యెహోవాను ప్రేమించేవాళ్లనే స్నేహితులుగా చేసుకోవడానికి మీరెలా సహాయం చేయవచ్చు? (1 కొరిం. 15:33) ఆధ్యాత్మికంగా బలంగా ఉన్న సహోదర సహోదరీల్ని మీ ఇంటికి పిలిచి, వాళ్లతో సమయం గడపడం ద్వారా మంచి స్నేహితుల్ని చేసుకునేలా మీ పిల్లలకు సహాయం చేయొచ్చు.—కీర్త. 119:63.

15. పిల్లలు మంచి స్నేహితుల్ని సంపాదించుకునేలా తల్లిదండ్రులు ఎలా సహాయం చేయవచ్చు?

15 టోని అనే తండ్రి అనుభవాన్ని చూడండి. తమ పిల్లలు మంచి స్నేహితుల్ని సంపాదించుకునేలా అతను, అతని భార్య ఏం చేశారో వివరిస్తూ ఇలా అంటున్నాడు: “గడిచిన సంవత్సరాల్లో నేను, నా భార్య వేర్వేరు వయసుల, వేర్వేరు నేపథ్యాల సహోదర సహోదరీలను మా ఇంటికి పిలిచేవాళ్లం. వాళ్లతో కలిసి భోంచేసి, కుటుంబ ఆరాధన చేసుకునేవాళ్లం. అలా చేయడంవల్ల యెహోవాను ప్రేమిస్తూ, సంతోషంగా ఆయన్ని సేవిస్తున్న వాళ్ల గురించి ఎక్కువ తెలుసుకోగలిగాం. మా ఇంట్లో ప్రాంతీయ పర్యవేక్షకులు, మిషనరీలు అలాగే వేరే సహోదర సహోదరీలు ఉండేవాళ్లు. వాళ్ల అనుభవాల నుండి, ఉత్సాహం నుండి, స్వయంత్యాగ స్ఫూర్తి నుండి మా పిల్లలు ఎంతో నేర్చుకుని, యెహోవాకు దగ్గరవ్వగలిగారు.” కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లలు మంచి స్నేహితుల్ని సంపాదించుకునేలా సహాయం చేయాలని నిశ్చయించుకోండి.

ఆశ వదులుకోకండి

16. మీ పిల్లల్లో ఎవరైనా యెహోవాను సేవించకూడదని నిర్ణయించుకుంటే అప్పుడేంటి?

16 తల్లిదండ్రులారా, మీరు ఎంత ప్రయత్నించినా మీ పిల్లల్లో ఎవరైనా యెహోవాను సేవించనని చెప్తే అప్పుడేంటి? మీరు తల్లిదండ్రులుగా వాళ్లను సరిగ్గా పెంచలేదని అనుకోకండి. యెహోవా మనందరితో పాటు మీ పిల్లలకు కూడా స్వేచ్ఛాచిత్తం అనే బహుమానాన్ని ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకుని ఆయన్ని సేవించాలా వద్దా అని ఎవరికివాళ్లు నిర్ణయించుకోవాలి. మీ పిల్లల్లో ఎవరైనా యెహోవాను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటే, ఏదోక రోజు వాళ్లు ఆయన దగ్గరికి తిరిగి వస్తారని ఆశతో ఉండండి. తప్పిపోయిన కుమారుడి ఉదాహరణను ఒకసారి గుర్తుచేసుకోండి. (లూకా 15:11-19, 22- 24) ఆ ఉదాహరణలోని యౌవనస్థుడు ఎన్నో చెడ్డ పనులు చేసి చివరికి తన తండ్రి దగ్గరికి తిరిగివచ్చాడు. అయితే “అది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే; నిజ జీవితంలో అలా జరుగుతుందా?” అని కొంతమంది అంటారు. అలా జరుగుతుందని చెప్పడానికి ఈలీ అనే యౌవన సహోదరుడి ఉదాహరణను పరిశీలిద్దాం.

17. ఈలీ అనుభవం నుండి మీరెలా ప్రయోజనం పొందారు?

17 ఈలీ తన తల్లిదండ్రుల గురించి ఇలా అంటున్నాడు: “యెహోవాపట్ల, ఆయన వాక్యమైన బైబిలుపట్ల నాలో ప్రేమను నాటడానికి వాళ్లు శాయశక్తులా కృషిచేశారు. కానీ టీనేజ్‌కు వచ్చేసరికి నేను వాళ్లకు ఎదురుతిరగడం మొదలుపెట్టాను.” ఈలీ ఎవ్వరికీ తెలియకుండా తప్పులు చేయడం మొదలుపెట్టాడు. యెహోవాకు దగ్గరయ్యేలా అతని తల్లిదండ్రులు సహాయం చేయడానికి ప్రయత్నించినా వాళ్ల మాటవినలేదు. చివరికి ఇంట్లో నుండి బయటికి వచ్చేసి, ఇంకా ఘోరమైన తప్పులు చేయడం మొదలుపెట్టాడు. ఆ పరిస్థితిలో కూడా అతను కొన్నిసార్లు తన స్నేహితునితో బైబిలు విషయాలు మాట్లాడేవాడు. ఈలీ ఇంకా ఇలా అంటున్నాడు: “యెహోవా గురించి అతనితో ఎక్కువగా మాట్లాడేకొద్దీ, నేను ఆయన గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టాను. మా అమ్మానాన్నలు ఎంతో కష్టపడి నాలో నాటిన సత్యపు విత్తనాలు క్రమక్రమంగా మొలకెత్తడం ప్రారంభించాయి.” కొంతకాలం తర్వాత ఈలీ యెహోవా దగ్గరకు తిరిగివచ్చాడు. * చిన్నప్పటినుండే యెహోవాను ప్రేమించడం ఈలీకి నేర్పించినందుకు అతని తల్లిదండ్రులు ఎంత సంతోషించి ఉంటారో ఊహించండి!—2 తిమో. 3:14, 15.

18. పిల్లలు యెహోవాను ప్రేమించేలా కష్టపడి సహాయం చేస్తున్న తల్లిదండ్రుల్ని చూసినప్పుడు మీకెలా అనిపిస్తుంది?

18 తల్లిదండ్రులారా, యెహోవా ఆరాధకుల కొత్త తరాన్ని పెంచే గొప్ప అవకాశం మీకు ఇవ్వబడింది. (కీర్త. 78:4-6) అలా పెంచడం తేలికేమీ కాదు. అందుకే అలుపెరగకుండా మీ పిల్లలకు సహాయం చేస్తున్నందుకు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం. మీ పిల్లలకు యెహోవాను ప్రేమించడం, ఆయనకు లోబడడం నేర్పించడానికి చేయగలిగినదంతా చేస్తూ ఉండండి. అలా చేస్తే మీ ప్రేమగల పరలోక తండ్రి మిమ్మల్ని చూసి సంతోషిస్తాడనే నమ్మకంతో ఉండొచ్చు.—ఎఫె. 6:4.

పాట 135 యెహోవా ప్రేమతో అడుగుతున్నాడు: ‘నా కుమారుడా, జ్ఞానాన్ని సంపాదించు’

^ క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతో ప్రేమిస్తారు. వాళ్ల అవసరాలు తీర్చడానికి, వాళ్లను సంతోషంగా ఉంచడానికి కష్టపడి పనిచేస్తారు. ఇంకా ప్రాముఖ్యంగా, యెహోవాను ప్రేమించేలా వాళ్ల పిల్లలకు సహాయం చేస్తారు. ఈ విషయంలో తల్లిదండ్రులకు ఉపయోగపడే నాలుగు బైబిలు సూత్రాల్ని ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం.

^ 2012, జూలై-సెప్టెంబరు కావలికోటలోని “బైబిలు జీవితాలను మారుస్తుంది” అనే ఆర్టికల్‌ చూడండి.

^ చిత్రాల వివరణ: వాళ్ల అబ్బాయి ఫ్రెండ్స్‌ గురించి తెలుసుకోవడానికి ఒక తండ్రి వాళ్ల అబ్బాయి, అతని స్నేహితునితో కలిసి బాస్కెట్‌బాల్‌ ఆడుతున్నాడు.