కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 20

ప్రకటన పుస్తకం దేవుని శత్రువులకు ఏమౌతుందని చెప్తుంది?

ప్రకటన పుస్తకం దేవుని శత్రువులకు ఏమౌతుందని చెప్తుంది?

“అవి ఆ రాజుల్ని ఒక చోటికి పోగుచేశాయి. హీబ్రూ భాషలో దాని పేరు హార్‌మెగిద్దోన్‌.”ప్రక. 16:16.

పాట 150 మీ విడుదల కోసం దేవుణ్ణి వెదకండి

ఈ ఆర్టికల్‌లో. . . *

1. దేవుని ప్రజలు ఏం ఎదుర్కొంటారని ప్రకటన పుస్తకం చెప్తుంది?

 దేవుని రాజ్యం పరలోకంలో స్థాపించబడిందని, సాతాను అక్కడ నుండి పడేయబడ్డాడని ప్రకటన పుస్తకం చెప్తుంది. (ప్రక. 12:1-9) దానివల్ల పరలోకమంతా ప్రశాంతంగా ఉంది కానీ మనకు మాత్రం కష్టాలు మొదలయ్యాయి. ఎందుకంటే సాతాను అప్పటినుండి భూమ్మీద యెహోవాను నమ్మకంగా సేవిస్తున్న వాళ్లపై కోపంతో ఎక్కువగా దాడి చేస్తున్నాడు.—ప్రక. 12:12, 15, 17.

2. యెహోవాకు నమ్మకంగా ఉండడానికి మనకేది సహాయం చేస్తుంది?

2 సాతాను దాడి చేస్తున్నా యెహోవాకు నమ్మకంగా ఉండడానికి మనకేది సహాయం చేస్తుంది? (ప్రక. 13:10) భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవడం మనకు సహాయం చేస్తుంది. ఉదాహరణకు, ప్రకటన పుస్తకంలో అపొస్తలుడైన యోహాను మనం త్వరలో పొందబోయే కొన్ని ఆశీర్వాదాల గురించి చెప్పాడు. వాటిలో ఒకటేంటంటే, దేవుని శత్రువులు నాశనమవ్వడం. అయితే ఆ శత్రువుల గురించి, వాళ్లకు ఏం జరుగుతుందనే దానిగురించి ప్రకటన పుస్తకం చెప్తున్న విషయాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

దేవుని శత్రువుల్ని గుర్తించడానికి “సూచనలు”

3. ప్రకటన పుస్తకంలో ఉన్న కొన్ని సూచనలు ఏంటి?

3 ప్రకటన పుస్తకంలో మనం చదవబోయే విషయాలు, “సూచనల ద్వారా” ఇవ్వబడ్డాయని మొదటి వచనంలోనే చూస్తాం. (ప్రక. 1:1) అందుకే దేవుని శత్రువుల్ని సూచించే ఎన్నో క్రూరమృగాల గురించి చదువుతాం. ఉదాహరణకు, ‘ఒక క్రూరమృగం సముద్రంలో నుండి పైకి వస్తుంది. దానికి పది కొమ్ములు, ఏడు తలలు ఉన్నాయి.’ (ప్రక. 13:1) ఆ తర్వాత ‘ఇంకో క్రూరమృగం భూమిలో నుండి పైకి వస్తుంది.’ అది ఒక మహాసర్పంలా మాట్లాడుతూ, ‘ఆకాశం నుండి అగ్ని దిగివచ్చేలా చేస్తోంది.’ (ప్రక. 13:11-13) అలాగే మరో “ఎర్రని క్రూరమృగం” గురించి కూడా చదువుతాం. దానిమీద ఒక వేశ్య కూర్చుని ఉంది. ఈ మూడు క్రూరమృగాలు చాలాకాలంగా యెహోవా దేవునికి, ఆయన రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న శత్రువుల్ని సూచిస్తున్నాయి. అందుకే మనం ఈ శత్రువులు ఎవరో తెలుసుకోవడం ప్రాముఖ్యం.—ప్రక. 17:1, 3.

నాలుగు పెద్ద మృగాలు

అవి “సముద్రంలో నుండి బయటికి వచ్చాయి.” (దాని. 7:1-8, 15-17) దానియేలు సమయం నుండి దేవుని ప్రజల మీద చాలా ప్రభావం చూపించిన ప్రపంచ శక్తుల్ని అవి సూచిస్తున్నాయి. (4, 7 పేరాలు చూడండి)

4-5. దానియేలు 7:15-17 ప్రకారం, ప్రకటన పుస్తకంలో ఉన్న క్రూరమృగాలు దేన్ని సూచిస్తున్నాయి?

4 ఈ శత్రువులు ఎవరో తెలుసుకునే ముందు అసలు క్రూరమృగాలు, వేశ్య దేన్ని సూచిస్తున్నాయో మనం అర్థంచేసుకోవాలి. దానికి బైబిలు మనకు సహాయం చేస్తుంది. ఎందుకంటే ప్రకటన పుస్తకంలో ఉన్న చాలా సూచనలు బైబిల్లోని వేరే పుస్తకాల్లో కూడా ఉన్నాయి. ఉదాహరణకు, “నాలుగు పెద్ద మృగాలు సముద్రంలో నుండి బయటికి” రావడాన్ని ప్రవక్త అయిన దానియేలు ఒక కలలో చూశాడు. (దాని. 7:1-3) ఆ పెద్ద మృగాలు నలుగురు ‘రాజుల్ని’ లేదా ప్రభుత్వాల్ని సూచిస్తున్నాయని అతను చెప్పాడు. (దానియేలు 7:15-17 చదవండి.) దీన్నిబట్టి, ప్రకటన పుస్తకంలో ఉన్న మృగాలు కూడా ప్రభుత్వాల్ని సూచిస్తున్నాయని మనం అర్థంచేసుకోవచ్చు.

5 ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని ప్రకటన పుస్తకంలో ఉన్న కొన్ని సూచనల్ని ఇప్పుడు చూద్దాం. వాటిని అర్థంచేసుకోవడానికి బైబిల్లో ఉన్న వేర్వేరు వచనాల్ని పరిశీలిద్దాం. మనం ఒక్కో క్రూరమృగం గురించి చదువుతూ, అవి ఎవర్ని సూచిస్తున్నాయో ముందుగా తెలుసుకుందాం. తర్వాత వాటికి ఏం జరుగుతుందో చూద్దాం. చివరిగా, ఈ విషయాల గురించి తెలుసుకుని మనమేం చేయాలో నేర్చుకుందాం.

దేవుని శత్రువులు ఎవరు?

ఏడు తలలున్న క్రూరమృగం

అది “సముద్రంలో నుండి పైకి” వస్తుంది. దానికి ఏడు తలలు, పది కొమ్ములు, పది కిరీటాలు ఉన్నాయి. (ప్రక. 13:1-4) అది ఇప్పటివరకు మనుషుల్ని పరిపాలించిన ప్రభుత్వాలన్నిటినీ సూచిస్తుంది. ఏడు తలలు దేవుని ప్రజల మీద చాలా ప్రభావం చూపించిన ఏడు ప్రపంచ శక్తుల్ని సూచిస్తున్నాయి. (6-8 పేరాలు చూడండి)

6. ప్రకటన 13:1-4 లో చెప్పిన ఏడు తలల క్రూరమృగం దేన్ని సూచిస్తుంది?

6 ఈ ఏడు తలల క్రూరమృగం దేన్ని సూచిస్తుంది? (ప్రకటన 13:1-4 చదవండి.) ఈ క్రూరమృగం చూడడానికి చిరుతపులిలా ఉంది. కానీ దాని పాదాలు ఎలుగుబంటి పాదాల్లా, నోరు సింహం నోరులా ఉంది. అలాగే దానికి పది కొమ్ములు ఉన్నాయి. దానియేలు 7వ అధ్యాయంలో ఉన్న నాలుగు మృగాలకు కూడా ఇవే పోలికలున్నాయి. అయితే ప్రకటన పుస్తకం, ఈ పోలికలన్నీ నాలుగు వేర్వేరు మృగాలకు కాకుండా ఒకే మృగానికి ఉన్నట్టు చెప్తుంది. ఈ క్రూరమృగం కేవలం ఒక ప్రభుత్వాన్ని లేదా ప్రపంచ సామ్రాజ్యాన్ని సూచించడం లేదు. అది ‘ప్రతీ తెగ, జాతి, భాష, దేశం మీద అధికారం చెలాయిస్తుంది’ అని యోహాను చెప్పాడు. కాబట్టి అది వేరే ఏ ప్రభుత్వం కన్నా గొప్పదై ఉండాలి. (ప్రక. 13:7) దీన్నంతటినిబట్టి, ఈ ఏడు తలల క్రూరమృగం ఇప్పటివరకు మనుషుల్ని పరిపాలించిన ప్రభుత్వాలన్నిటినీ సూచిస్తుందని చెప్పొచ్చు. *ప్రసం. 8:9.

7. క్రూరమృగానికి ఉన్న ఏడు తలల్లో ఒక్కొక్కటి దేన్ని సూచిస్తుంది?

7 ఈ ఏడు తలల్లో ఒక్కో తల దేన్ని సూచిస్తుంది? ప్రకటన 13వ అధ్యాయంలో చెప్పబడిన క్రూర మృగపు ప్రతిమ గురించి అర్థంచేసుకోవడానికి ప్రకటన 17వ అధ్యాయం మనకు సహాయం చేస్తుంది. అక్కడిలా చదువుతాం: “ఏడుగురు రాజులు ఉన్నారు. వాళ్లలో ఐదుగురు పడిపోయారు, ఒక రాజు ఇప్పుడు ఉన్నాడు, ఇంకొక రాజు ఇంకా రాలేదు. అయితే అతను వచ్చినప్పుడు కొంతకాలంపాటు ఉండాలి.” (ప్రక. 17:10) సాతాను ఉపయోగించిన ప్రభుత్వాలన్నిటిలో, ముఖ్యంగా ఏడు ప్రభుత్వాల్ని ‘తలలతో’ పోల్చారు. ఎందుకంటే అవి చాలా శక్తివంతంగా పరిపాలించాయి. అంతేకాదు ఈ ప్రభుత్వాలన్నీ, దేవుని ప్రజల మీద కూడా చాలా ప్రభావం చూపించాయి. అపొస్తలుడైన యోహాను బ్రతికున్న సమయానికి వీటిలో ఐదు ప్రభుత్వాలు అప్పటికే పరిపాలించడం ముగించాయి. అవేంటంటే: ఐగుప్తు, అష్షూరు, బబులోను, మాదీయ-పారసీక అలాగే గ్రీసు. యోహాను ఈ దర్శనాన్ని చూసే సమయానికి ఆరో ప్రపంచ శక్తి అయిన రోము ఇంకా పరిపాలిస్తుంది. మరైతే ఏడో తలైన చివరి ప్రపంచ శక్తి ఏ ప్రభుత్వం అయ్యుంటుంది?

8. క్రూరమృగానికి ఉన్న ఏడో తల దేన్ని సూచిస్తుంది?

8 క్రూరమృగానికి ఉన్న ఏడో తల దేన్ని సూచిస్తుందో తెలుసుకోవడానికి దానియేలు పుస్తకంలోని ప్రవచనాలు మనకు సహాయం చేస్తాయి. అయితే ఈ చివరి రోజుల్లో లేదా “ప్రభువు రోజున” ఏ ప్రపంచ శక్తి పరిపాలిస్తుంది? (ప్రక. 1:10) ఇంగ్లాండ్‌, అమెరికా ప్రభుత్వాలు ఒకరికొకరు సహకరించుకోవడంవల్ల ఏర్పడిన ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచ శక్తి పరిపాలిస్తుంది. కాబట్టి ప్రకటన 13:1-4 లో చెప్పబడిన క్రూరమృగానికి ఉన్న ఏడో తల ఆంగ్లో-అమెరికా అని చెప్పొచ్చు.

గొర్రెపిల్ల కొమ్ముల్లాంటి రెండు కొమ్ములు ఉన్న క్రూరమృగం

అది “భూమిలో నుండి పైకి” వచ్చి “మహాసర్పంలా” మాట్లాడుతుంది. అది ‘ఆకాశం నుండి అగ్ని దిగివచ్చేలా చేస్తోంది.’ అలాగే ‘అబద్ధ ప్రవక్తలా’ సూచనలు చేస్తుంది. (ప్రక. 13:11-15; 16:13; 19:20) రెండు కొమ్ములున్న క్రూరమృగంగా, అబద్ధ ప్రవక్తగా ఉన్న ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచ శక్తి, భూమ్మీద ఉన్నవాళ్లను మోసం చేస్తూ ఏడు తలలు, పది కొమ్ములు ఉన్న “క్రూరమృగపు ప్రతిమను చేయమని” వాళ్లకు చెప్తుంది. (9వ పేరా చూడండి)

9. “గొర్రెపిల్ల కొమ్ముల లాంటి రెండు కొమ్ములు” ఉన్న క్రూరమృగం దేన్ని సూచిస్తుంది?

9 ప్రకటన 13వ అధ్యాయం ఆ ఏడో తల అయిన ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచ శక్తిని ఇంకో క్రూరమృగంతో పోలుస్తుంది. ‘దానికి గొర్రెపిల్ల కొమ్ముల లాంటి రెండు కొమ్ములు ఉన్నాయని, అది ఒక మహాసర్పంలా మాట్లాడడం మొదలుపెడుతుందని’ చూస్తాం. అలాగే ఆ మృగం “గొప్ప ఆశ్చర్యకార్యాలు చేస్తోంది. మనుషులు చూస్తుండగా, ఆకాశం నుండి భూమ్మీదికి అగ్ని దిగివచ్చేలా కూడా చేస్తోంది.” (ప్రక. 13:11-15) ప్రకటన 16, 19 అధ్యాయాల్లో ఈ క్రూరమృగం, “అబద్ధ ప్రవక్త” అని కూడా పిలవబడుతుంది. (ప్రక. 16:13; 19:20) దానియేలు కూడా ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచ శక్తి ‘ఘోరంగా నాశనం తెస్తుందని’ రాశాడు. (దాని. 8:19, 23, 24) రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అది నిజమైంది. ఆ యుద్ధాన్ని ముగించడానికి కారణమైన రెండు ​అణు బాంబుల్ని బ్రిటన్‌, అమెరికాకు చెందిన సైంటిస్టులే తయారుచేశారు. ఆ విధంగా ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచ శక్తి, ‘ఆకాశం నుండి భూమ్మీదికి అగ్ని దిగివచ్చేలా చేసిందని’ చెప్పవచ్చు.

ఎర్రని క్రూరమృగం

దాని మీద మహాబబులోను అనే వేశ్య కూర్చొని ఉంది. ఆ క్రూరమృగం ఎనిమిదో రాజు అని కూడా పిలవబడుతుంది. (ప్రక. 17:3-6, 8, 11) మొదట్లో క్రూరమృగాన్ని వేశ్య అదుపు చేస్తుంది. కానీ తర్వాత, అదే ఆ వేశ్యను నాశనం చేస్తుంది. ఆమె ప్రపంచవ్యాప్తంగా ఉన్న అబద్ధ మతాలన్నిటినీ సూచిస్తుంది. ఆ క్రూరమృగం ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిని సూచిస్తుంది. అది ప్రపంచవ్యాప్త ప్రభుత్వాల ఇష్టానికి తగ్గట్టు నడుచుకుంటుంది. (10, 14-17 పేరాలు చూడండి)

10. “క్రూరమృగపు ప్రతిమ” దేన్ని సూచిస్తుంది? (ప్రకటన 13:14, 15; 17:3, 8, 11)

10 ఇప్పుడు మనం ఇంకో క్రూరమృగం గురించి చూద్దాం. అది చూడడానికి దాదాపు ఏడు తలల క్రూరమృగంలానే ఉంది. కానీ ఒక తేడా ఏంటంటే అది ఎరుపు రంగులో ఉంది. దీన్ని “క్రూరమృగపు ప్రతిమ” అలాగే “ఎనిమిదో రాజు” అని పిలవడం కూడా చూస్తాం. * (ప్రకటన 13:14, 15; 17:3, 8, 11 చదవండి.) ఆ “రాజు” వస్తాడని, తర్వాత కొంతకాలం లేకుండా పోతాడని, చివరికి మళ్లీ కనిపిస్తాడని యోహాను రాశాడు. ఈ మాటలు ప్రపంచవ్యాప్త ప్రభుత్వాలు కోరినట్టు నడుచుకునే ఐక్యరాజ్య సమితికి సరిగ్గా సరిపోతాయి. ముందు దీన్ని నానాజాతి సమితి అని పిలిచేవాళ్లు. కానీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అది లేకుండా పోయింది. అయితే ఆ తర్వాత అది మళ్లీ కనిపించి, ఐక్యరాజ్య సమితిగా పని చేయడం మొదలుపెట్టింది.

11. క్రూరమృగాలు ఏం చేస్తాయి? కానీ మనం ఎందుకు భయపడాల్సిన అవసరంలేదు?

11 ఆ క్రూరమృగాలు లేదా ప్రభుత్వాలు యెహోవాను, ఆయన సేవకుల్ని వ్యతిరేకించేలా ప్రజల్ని రెచ్చగొడతాయి. అవి సర్వశక్తిమంతుడైన దేవుని మహారోజున జరిగే యుద్ధం కోసం అంటే హార్‌మెగిద్దోన్‌ కోసం భూమంతటా ఉన్న రాజుల్ని పోగుచేస్తాయని యోహాను రాశాడు. (ప్రక. 16:13, 14, 16) కానీ మనం మాత్రం అస్సలు భయపడాల్సిన అవసరంలేదు. ఎందుకంటే అప్పుడు మన గొప్ప దేవుడైన యెహోవా వెంటనే చర్య తీసుకుని, తన పరిపాలనకు మద్దతిచ్చే వాళ్లందర్నీ కాపాడతాడు.—యెహె. 38:21-23.

12. ఈ క్రూరమృగాలు అన్నిటికీ ఏం జరుగుతుంది?

12 ఈ క్రూరమృగాలు అన్నిటికీ ఏం జరుగుతుంది? దానికి ప్రకటన 19:20 ఇలా జవాబిస్తుంది: “గుర్రం మీద కూర్చున్న వ్యక్తి ఆ క్రూరమృగాన్ని, అబద్ధ ప్రవక్తను పట్టుకున్నాడు. క్రూరమృగం ముందు ఆశ్చర్యకార్యాలు చేసి, క్రూరమృగం గుర్తును వేయించుకున్నవాళ్లనూ దాని ప్రతిమను పూజించేవాళ్లనూ మోసం చేసింది ఈ అబద్ధ ప్రవక్తే. ఆ క్రూరమృగం, అబద్ధ ప్రవక్త ఇంకా బ్రతికుండగానే అగ్నిగంధకాలతో మండుతున్న సరస్సులో పడేయబడ్డారు.” కాబట్టి, దేవుని శత్రువులైన ఈ ప్రభుత్వాలు ఇంకా పరిపాలిస్తుండగానే శాశ్వతంగా నాశనం చేయబడతాయి.

13. కొన్ని ప్రభుత్వాలవల్ల నిజక్రైస్తవులు ఏ సమస్యను ఎదుర్కొంటారు?

13 దీనిగురించి తెలుసుకుని మనమేం చేయాలి? నిజక్రైస్తవులుగా మనం దేవునికి, ఆయన రాజ్యానికి నమ్మకంగా ఉండాలి. (యోహా. 18:36) అలా ఉండాలంటే ఈ లోక రాజకీయ విషయాల్లో మనం అస్సలు తలదూర్చకూడదు. కానీ అలా ఉండడం చాలా కష్టం. ఎందుకంటే లోక ప్రభుత్వాలు మన మాటల ద్వారా, పనుల ద్వారా వాటికి మద్దతివ్వమని కోరతాయి. అవి పెట్టే ఒత్తిడికి లొంగిపోయేవాళ్లు, ఆ క్రూరమృగపు గుర్తును వేయించుకున్నట్టే. (ప్రక. 13:16, 17) అయితే ఆ గుర్తును వేయించుకున్న వాళ్లెవ్వర్నీ యెహోవా అంగీకరించడు. అంతేకాదు, వాళ్లు శాశ్వత జీవితాన్ని కోల్పోతారు. (ప్రక. 14:9, 10; 20:4) కాబట్టి ఈ ప్రభుత్వాలు వాటికి మద్దతివ్వమని మనల్ని ఎంత ఒత్తిడి చేసినా లొంగిపోకుండా ఉండడం చాలా ప్రాముఖ్యం.

గొప్ప వేశ్య అవమానకరంగా నాశనమౌతుంది

14. ప్రకటన 17:3-5 లో, అపొస్తలుడైన యోహాను ఏ విషయాన్ని చూసి ఆశ్చర్యపోయాడు?

14 అపొస్తలుడైన యోహాను ఒక విషయాన్ని దర్శనంలో చూసినప్పుడు, ‘చాలా ఆశ్చర్యపోయానని’ చెప్పాడు. ఆయన ఏం చూశాడు? ఆ క్రూరమృగాల్లో ఒక దానిమీద ఒక స్త్రీ కూర్చొనివుంది. (ప్రక. 17:1, 2, 6) ఆమె ఒక “గొప్ప వేశ్య”; ఆమె పేరు “మహాబబులోను.” ఆ స్త్రీ భూమ్మీది రాజులతో లైంగిక పాపం చేస్తుంది.ప్రకటన 17:3-5 చదవండి.

15-16. “మహాబబులోను” ఎవరు? అలాగని ఎందుకు చెప్పవచ్చు?

15 “మహాబబులోను” ఎవరు? ఈ స్త్రీ ఏదోక ప్రభుత్వాన్ని సూచించట్లేదు. ఎందుకంటే ఆమె రాజకీయ నాయకులతోనే లైంగిక పాపం చేస్తుందని ప్రకటన పుస్తకంలో ఉంది. (ప్రక. 18:9) నిజానికి ఆమె క్రూరమృగం మీద కూర్చుని ఉందంటే, ఆ నాయకుల్ని అదుపులో పెట్టుకోవాలని అనుకుంటుందని తెలుస్తుంది. అంతేకాదు, ఆమె సాతాను లోకంలో ఉన్న అత్యాశపరులైన వ్యాపారవేత్తలను కూడా సూచించట్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్లను ప్రకటన పుస్తకం “భూమ్మీది వర్తకులు” అని పిలుస్తుంది.—ప్రక. 18:11, 15, 16.

16 బైబిలు వేశ్య లేదా వ్యభిచారం చేసేవాళ్లు అనే మాటల్ని ఉపయోగించినప్పుడు, దేవుణ్ణి సేవిస్తున్నామని చెప్పుకుంటూ విగ్రహారాధన చేసేవాళ్లను లేదా ఏదో విధంగా లోకంతో స్నేహం చేసేవాళ్లను సూచిస్తుంది. (1 దిన. 5:25 అధస్సూచి; యాకో. 4:4) దానికి భిన్నంగా, దేవున్ని నమ్మకంగా సేవిస్తున్నవాళ్లను సూచించడానికి “పవిత్రులు” లేదా ‘కన్యలు’ అనే మాటలు ఉపయోగించబడ్డాయి. (2 కొరిం. 11:2; ప్రక. 14:4) పూర్వకాలంలో బబులోను నగరం అబద్ధ ఆరాధనకు కేంద్రంగా ఉండేది. కాబట్టి, మహాబబులోను అన్నిరకాల అబద్ధ ఆరాధనను సూచిస్తుందని చెప్పొచ్చు. నిజానికి ఆమె ప్రపంచవ్యాప్తంగా ఉన్న అబద్ధ మతాలన్నిటినీ సూచిస్తుంది.—ప్రక. 17:5, 18; jw.orgలో “మహాబబులోను అంటే ఏంటి?” అనే ఆర్టికల్‌ చూడండి.

17. మహాబబులోనుకు ఏం జరుగుతుంది?

17 మహాబబులోనుకు ఏం జరుగుతుంది? దానికి ప్రకటన 17:16, 17 ఇలా జవాబిస్తుంది: “నువ్వు చూసిన ఆ పది కొమ్ములు, అలాగే ఆ క్రూరమృగం ఈ వేశ్యను ద్వేషించి, ఆమెను కొల్లగొట్టి, ఆమె బట్టలు తీసేసి, ఆమె మాంసాన్ని తిని, అగ్నితో ఆమెను పూర్తిగా కాల్చివేస్తాయి. ఎందుకంటే తాను అనుకున్నట్టు జరగాలని దేవుడే తన ఆలోచనను వాళ్లలో పెట్టాడు.” అవును, యెహోవా ఈ ఎర్రని క్రూరమృగాన్ని అంటే ఐక్యరాజ్య సమితిని ఉపయోగించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అబద్ధ మతాలన్నిటినీ పూర్తిగా నాశనం చేసేలా దేశాల్ని ప్రేరేపిస్తాడు.—ప్రక. 18:21-24.

18. మహాబబులోనుకు ఏ రకంగానైనా మద్దతివ్వట్లేదని మనమెలా చూపించవచ్చు?

18 దీనిగురించి తెలుసుకుని మనమేం చేయాలి? మనం ‘దేవుని దృష్టిలో పవిత్రమైన, కళంకంలేని ఆరాధనని’ చేస్తూ ఉండాలి. (యాకో. 1:27) మహాబబులోనుకు సంబంధించిన అబద్ధ బోధలు, ఆచారాలు, దిగజారిన నైతిక ప్రమాణాలు, మంత్రతంత్ర పనులు ఏవైనా మనమీద ఎప్పుడూ ప్రభావం చూపించకుండా జాగ్రత్తపడాలి. అంతేకాదు, మహాబబులోను చేసే పాపాల్లో భాగమై దేవుని ముందు దోషులవ్వకుండా, ‘అక్కడి నుండి బయటికి రమ్మని’ ప్రజల్ని హెచ్చరిస్తూనే ఉంటాం.—ప్రక. 18:4.

దేవుని బద్ధశత్రువు నాశనమవ్వడం

ఎర్రని మహాసర్పం

సాతాను ఈ క్రూరమృగానికి అధికారం ఇస్తాడు. (ప్రక. 12:3, 9, 13; 13:4; 20:2, 10) యెహోవా గొప్ప శత్రువైన సాతాను 1,000 సంవత్సరాల పాటు అగాధంలో ఉంటాడు. ఆ తర్వాత అతను “అగ్నిగంధకాల సరస్సులో” పడేయబడతాడు. (19-20 పేరాలు చూడండి)

19. “ఎర్రని మహాసర్పం” ఎవరు?

19 ప్రకటన పుస్తకం “ఎర్రని మహాసర్పం” గురించి కూడా వివరిస్తుంది. (ప్రక. 12:3) ఈ మహాసర్పం యేసుతో, ఆయన దూతలతో యుద్ధం చేస్తుంది. (ప్రక. 12:7-9) అది దేవుని ప్రజల మీద దాడి చేస్తుంది. అలాగే, క్రూరమృగాలకు అంటే మానవ ప్రభుత్వాలకు అధికారం ఇస్తుంది. (ప్రక. 12:17; 13:4) ఇంతకీ ఆ మహాసర్పం ఎవరు? అది “అపవాది, సాతాను” అనే పేర్లు ఉన్న “మొదటి సర్పం.” (ప్రక. 12:9; 20:2) అతనే వెనకుండి యెహోవా శత్రువులందర్నీ నడిపిస్తున్నాడు.

20. మహాసర్పానికి ఏం జరుగుతుంది?

20 ఆ మహాసర్పానికి ఏం జరుగుతుంది? ప్రకటన 20:1-3 వివరిస్తున్నట్లు, ఒక దేవదూత సాతానును అగాధంలో పడేస్తాడు. అది సాతానుకు జైలులా ఉంటుంది. అతను అక్కడ ఉన్నంతకాలం అంటే ‘1,000 సంవత్సరాలు ముగిసేవరకు దేశాల్ని ఇక మోసం చేయడు.’ చివరికి సాతాను, అతని చెడ్డ దూతలు “అగ్నిగంధకాల సరస్సులో” పడేయబడతారు. దానర్థం, వాళ్లిక శాశ్వతంగా నాశనం చేయబడతారు. (ప్రక. 20:10) సాతాను, అతని చెడ్డ దూతలు లేకుండా ఉండే లోకం ఎంత బాగుంటుందో ఒక్కసారి ఊహించండి!

21. ప్రకటన పుస్తకంలో మనం చదివినవాటిని బట్టి ఎందుకు సంతోషంగా ఉండొచ్చు?

21 ప్రకటన పుస్తకంలో ఉన్న సూచనల్ని అర్థంచేసుకుని మనం ఎంతో ప్రోత్సాహాన్ని పొందాం. దేవుని శత్రువులు ఎవరో గుర్తించాం. అలాగే వాళ్లకు ఏం జరుగుతుందో కూడా తెలుసుకున్నాం. అందుకే, “ఈ ప్రవచనంలోని మాటల్ని చదివి వినిపించేవాళ్లు, వాటిని వినేవాళ్లు . . . సంతోషంగా ఉంటారు.” (ప్రక. 1:3) మరైతే దేవుని శత్రువులు నాశనమయ్యాక, నమ్మకంగా ఉన్నవాళ్లు ఎలాంటి ఆశీర్వాదాల్ని ఆనందిస్తారు? దానిగురించి తర్వాతి ఆర్టికల్‌లో చర్చిస్తాం.

పాట 23 యెహోవా పరిపాలన ఆరంభమైంది

^ దేవుని శత్రువుల్ని గుర్తించడానికి ప్రకటన పుస్తకంలో సూచనలు ఇవ్వబడ్డాయి. ఆ సూచనల్ని అర్థంచేసుకోవడానికి దానియేలు పుస్తకం సహాయం చేస్తుంది. దానియేలులో ఉన్న కొన్ని ప్రవచనాలకు, ప్రకటన పుస్తకంలో ఉన్న ప్రవచనాలకు పోలికలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆర్టికల్‌లో వాటిని పోల్చి చూస్తూ, దేవుని శత్రువులు ఎవరో అలాగే వాళ్లకు ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

^ ఏడు తలల క్రూరమృగం ప్రభుత్వాలన్నిటినీ సూచిస్తుందని చెప్పడానికి ఇంకొక రుజువు ఏంటంటే దానికి “పది కొమ్ములు” ఉన్నాయి. సంపూర్ణతను సూచించడానికి బైబిల్లో పది అనే సంఖ్యను చాలాసార్లు ఉపయోగించారు.

^ మొదటి క్రూరమృగంలా కాకుండా ఈ ప్రతిమ కొమ్ముల మీద “కిరీటాలు” లేవు. (ప్రక. 13:1) ఎందుకంటే ఇది మిగతా “ఏడుగురు రాజుల్లో నుండి వస్తుంది.” అది అధికారం కోసం వాళ్లమీదే ఆధారపడుతుంది.—“ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలోని ఎర్రని క్రూరమృగం ఎవరు?” అనే ఆర్టికల్‌ని jw.orgలో చూడండి.