కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 19

ప్రకటన పుస్తకం నుండి మీరేం నేర్చుకోవచ్చు?

ప్రకటన పుస్తకం నుండి మీరేం నేర్చుకోవచ్చు?

“ఈ ప్రవచనంలోని మాటల్ని చదివి వినిపించేవాళ్లు . . . సంతోషంగా ఉంటారు.”ప్రక. 1:3.

పాట 15 యెహోవా మొదటి కుమారుణ్ణి కీర్తించండి!

ఈ ఆర్టికల్‌లో. . . *

1-2. ప్రకటన పుస్తకాన్ని చదవడానికి ఒక కారణమేంటి?

 మీకు తెలిసినవాళ్లు ఎవరైనా, వాళ్ల ఆల్బమ్‌ ఇచ్చి చూడమన్నారా? అలా చూస్తున్నప్పుడు ఆ ఫోటోల్లో ఉన్న చాలామంది మీకు తెలీకపోవచ్చు. కానీ మీరొక ఫోటో దగ్గర ఆగి దాన్ని అదేపనిగా చూస్తున్నారు. ఎందుకంటే మీరు అందులో ఉన్నారు. మీరు ఆ ఫోటోని చూస్తూ దాన్ని ఎప్పుడు, ఎక్కడ తీశారో ఆలోచిస్తారు. దానిలో ఇంకా ఎవరెవరు ఉన్నారా అని కూడా చూస్తారు. ఆ ఫోటోని మీరెప్పుడూ మర్చిపోరు.

2 ప్రకటన పుస్తకం కూడా ఆ ఫోటో లాంటిదేనని కనీసం రెండు కారణాల వల్ల చెప్పొచ్చు. మొదటిగా, ఆ పుస్తకం మనకోసం రాయబడింది. దానిలోని మొట్టమొదటి వచనంలో మనమిలా చదువుతాం: “ఇవి యేసుక్రీస్తు బయల్పర్చిన విషయాలు. దేవుడు త్వరలో జరగబోయేవాటిని తన దాసులకు చూపించడానికి వాటిని యేసుకు ఇచ్చాడు.” (ప్రక. 1:1) ఈ మాటల్నిబట్టి ఆ పుస్తకాన్ని ప్రజలందరి కోసం రాయలేదు కానీ దేవుణ్ణి సేవించే మనకోసం రాశారని అర్థమౌతుంది. కాబట్టి ఆ ప్రవచనాల నెరవేర్పులో ఆయన ప్రజలుగా మనం కూడా భాగమని తెలుసుకుని ఆశ్చర్యపోం. అందుకే ప్రకటన పుస్తకాన్ని చదువుతుంటే, మన గురించి మనం చదువుతున్నట్టే ఉంటుంది.

3-4. ప్రకటన పుస్తకంలో ఉన్న ప్రవచనాలు ఎప్పుడు నెరవేరతాయి? ఆ విషయం తెలుసుకుని మనలో ప్రతీఒక్కరం ఇప్పుడేం చేయడం ప్రాముఖ్యం?

3 రెండోదిగా, మనం జీవిస్తున్న కాలంలోనే ఈ ప్రవచనాలు నెరవేరుతున్నాయి కాబట్టి ప్రకటన పుస్తకంలోని ప్రవచనాల మీద ఆసక్తి చూపిస్తాం. అలాగని ఎందుకు చెప్పొచ్చు? అపొస్తలుడైన యోహాను ఇలా అన్నాడు: “నేను పవిత్రశక్తితో నిండిపోయి ప్రభువు రోజున జరిగే విషయాల్ని చూశాను.” (ప్రక. 1:10) యోహాను ఈ మాటల్ని క్రీ.శ. 96 లో రాశాడు. అయితే అప్పటికింకా “ప్రభువు రోజు” మొదలవ్వలేదు. (మత్త. 25:14, 19; లూకా 19:12) కానీ బైబిలు ప్రవచనం ప్రకారం, యేసు 1914 లో పరలోకంలో రాజైనప్పుడు ఆ రోజు మొదలైంది. అప్పటినుండి ప్రకటన పుస్తకంలో దేవుని ప్రజలకు సంబంధించిన ప్రవచనాలు నెరవేరడం మొదలయ్యాయి. అందుకే మనం ‘ప్రభువు రోజులో’ జీవిస్తున్నామని చెప్పొచ్చు.

4 అందుకే ఎంతో ప్రేమగా ప్రకటన 1:3 లో ఇచ్చిన సలహాను మనం శ్రద్ధగా పాటించడం చాలా అవసరం. అక్కడిలా ఉంది: “ఈ ప్రవచనంలోని మాటల్ని చదివి వినిపించేవాళ్లు, వాటిని వినేవాళ్లు, అందులో రాసివున్న వాటిని పాటించేవాళ్లు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే, నిర్ణయించిన సమయం దగ్గరపడింది.” అందుకే, ఈ ప్రవచనంలోని మాటల్ని మనం చదివి వినిపించేవాళ్లుగా, వినేవాళ్లుగా, పాటించేవాళ్లుగా ఉండాలి. అయితే అందులో ఉన్న ఏ మాటల్ని మనం పాటించాలి?

యెహోవాకు నచ్చినట్టు మీ ఆరాధన ఉండేలా చూసుకోండి

5. యెహోవాకు నచ్చే విధంగా ఆరాధించడం ప్రాముఖ్యమని ప్రకటన పుస్తకం మనకెలా గుర్తుచేస్తుంది?

5 సంఘాల్లో ఏం జరుగుతుందో యేసుకు పూర్తిగా తెలుసని ప్రకటన పుస్తకాన్ని మొదటి నుండి చదివితే అర్థమౌతుంది. (ప్రక. 1:12-16, 20; 2:1) ఆసియా మైనరులోని ఏడు సంఘాలకు యేసు పంపించిన సందేశాల్ని బట్టి మనమలా చెప్పొచ్చు. ఆ సందేశాల్లో, యెహోవాకు నచ్చే విధంగా ఎలా ఆరాధించాలో స్పష్టమైన నిర్దేశాల్ని మొదటి శతాబ్దపు క్రైస్తవులకు ఆయనిచ్చాడు. అంతేకాదు ఆ సందేశాల్లో చెప్పిన విషయాలు ఇప్పుడు దేవుని ప్రజలకు కూడా వర్తిస్తాయి. దీన్నుండి మనమేం నేర్చుకోవచ్చు? మన నాయకుడైన యేసుక్రీస్తు మనల్ని నడిపిస్తూ, కాపాడుతున్నాడు. అలాగే ఆయన కంటికి కనిపించందంటూ ఏదీ లేదు. కాబట్టి మనకు యెహోవాతో మంచి సంబంధం ఉందో లేదో ఆయనకు బాగా తెలుసు. అంతేకాదు, మనం యెహోవా ఆమోదం పొందాలంటే ఏం చేస్తూ ఉండాలో కూడా ఆయనకు తెలుసు. అయితే ఈ రోజుల్లో మనం పాటించాల్సిన ఏ నిర్దేశాన్ని యేసు ఇచ్చాడు?

6. (ఎ) ప్రకటన 2:3, 4 లో ఉన్న యేసు మాటల్నిబట్టి ఎఫెసులోని క్రైస్తవులకు ఏ సమస్య ఉంది? (బి) దీన్నుండి మనకు ఏ పాఠం ఉంది?

6 ప్రకటన 2:3, 4 చదవండి. యెహోవామీద మొదట్లో మనకున్న ప్రేమను కాపాడుకోవాలి. ఎఫెసు సంఘానికి యేసు పంపిన సందేశాన్ని బట్టి వాళ్లు సహిస్తూ ఉన్నారని, ఎన్ని కష్టాలు వచ్చినా యెహోవా సేవను మానకుండా చేస్తున్నారని తెలుస్తుంది. అయినా మొదట్లో వాళ్లకున్న ప్రేమ చల్లారిపోయింది. ఒకవేళ వాళ్లు మళ్లీ ఆ ప్రేమను పెంచుకోకపోతే, వాళ్ల ఆరాధన యెహోవాకు ఇష్టమైన విధంగా ఉండదు. ఇప్పుడు కూడా కేవలం సహిస్తే సరిపోదు, కానీ దాని వెనక మనకున్న ఉద్దేశాలు కూడా సరైనవిగా ఉండాలి. ఎందుకంటే, మనం ఏం చేస్తామనేదే కాదు ఎందుకు చేస్తామనేది కూడా దేవుడు పట్టించుకుంటాడు. మనం ప్రేమతో, కృతజ్ఞతతో ఆరాధించాలని యెహోవా కోరుకుంటాడు కాబట్టి మనం ఏ ఉద్దేశంతో సేవిస్తున్నామో ఆయన ప్రాముఖ్యంగా చూస్తాడు.—సామె. 16:2; మార్కు 12:29, 30.

7. (ఎ) ప్రకటన 3:1-3 లో చెప్పినట్టు, సార్దీస్‌​లోని సహోదర సహోదరీలకు ఏ సమస్య ఉంది? (బి) వాళ్లనుండి మనమేం నేర్చుకోవచ్చు?

7 ప్రకటన 3:1-3 చదవండి. మనమెప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. సార్దీస్‌​లోని సహోదర సహోదరీలకు వేరే సమస్య ఉంది. వాళ్లు గతంలో దేవుని సేవ బాగా చేసినప్పటికీ, తర్వాత్తర్వాత అలా చేయలేకపోయారు. అందుకే యేసు వాళ్లను మేలుకోమని చెప్పాడు. దీన్నుండి మనకెలాంటి హెచ్చరిక ఉంది? నిజమే, మనం చేసిన సేవను యెహోవా మర్చిపోడని మనకు తెలుసు. (హెబ్రీ. 6:10) అయినా గతంలో యెహోవా సేవ బాగా చేశాం కాబట్టి, ఇప్పుడు అంతగా చేయాల్సిన అవసరంలేదని మనం అనుకోకూడదు. మన పరిస్థితులు ఇంతకుముందులా లేకపోయినా, “ప్రభువు సేవలో” చేయగలిగిందంతా చేస్తూ చివరిదాకా అప్రమత్తంగా ఉండాలి.—1 కొరిం. 15:58; మత్త. 24:13; మార్కు 13:33.

8. లవొదికయలోని సహోదర సహోదరీలకు యేసు చెప్పిన మాటల నుండి మనమేం నేర్చుకోవచ్చు? (ప్రకటన 3:15-17)

8 ప్రకటన 3:15-17 చదవండి. మనం ఉత్సాహంగా, మనస్ఫూర్తిగా యెహోవాను ఆరాధించాలి. యేసు లవొదికయలోని సహోదర సహోదరీలకు పంపిన సందేశంలో ఇంకో సమస్య గురించి మాట్లాడాడు. ఆ సంఘంలోనివాళ్లు ఆరాధన విషయంలో గోరువెచ్చగా ఉన్నారు. ఉత్సాహం తగ్గిపోవడం వల్ల వాళ్లు దుర్భరమైన, దయనీయమైన స్థితిలో ఉన్నారని యేసు చెప్పాడు. వాళ్లు యెహోవా పట్ల, ఆయన ఆరాధన పట్ల ఎక్కువ ఉత్సాహం చూపించాలి. (ప్రక. 3:19) దీన్నుండి మనకే పాఠం ఉంది? మన ఉత్సాహం తగ్గిందనిపిస్తే యెహోవా, ఆయన సంస్థ మనకోసం చేసినవాటన్నిటి పట్ల మరింత కృతజ్ఞత పెంచుకోవాలి. (ప్రక. 3:18) అంతేకానీ, మనం యెహోవా సేవను పక్కనపెట్టేసి మరీ, ఆస్తిపాస్తుల్ని సంపాదించడానికి ప్రయత్నించకూడదు.

9. పెర్గము, తుయతైర సంఘాల్లోని క్రైస్తవులకు యేసు ఇచ్చిన సందేశాల్ని బట్టి మనం దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి?

9 మనం మతభ్రష్టుల బోధలకు దూరంగా ఉండాలి. పెర్గము​లోని కొంతమంది సహోదరులు మనుషుల ఆలోచన ప్రకారం నడుచుకుంటూ, సంఘంలో విభజనలు సృష్టించినందుకు యేసు వాళ్లను గద్దించాడు. (ప్రక. 2:14-16) తుయతైర సంఘంలోనివాళ్లు, “సాతాను అబద్ధ బోధల్ని” అనుసరించకుండా ఉన్నందుకు ఆయన మెచ్చుకున్నాడు అలాగే, సత్యాన్ని “గట్టిగా పట్టుకొని” ఉండమని ప్రోత్సహించాడు. (ప్రక. 2:24-26) ఈ రెండు సంఘాల్లో ఉన్న కొంతమంది సత్యాన్ని అంటిపెట్టుకోకుండా అబద్ధ బోధలకు పడిపోయారు. అయితే వాళ్లు తిరిగి పశ్చాత్తాపపడాల్సిన అవసరముంది. మరి మన విషయమేంటి? యెహోవా ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్న ఎలాంటి బోధకైనా మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే, మతభ్రష్టులు బహుశా ‘పైకి దైవభక్తి ఉన్నట్టు కనిపించవచ్చు కానీ దానికి తగ్గట్టు జీవించరు.’ (2 తిమో. 3:5) అందుకే మనం దేవుని వాక్యాన్ని చదివి, లోతుగా అధ్యయనం చేస్తే అబద్ధ బోధల్ని తేలిగ్గా గుర్తుపడతాం, వాటికి దూరంగా ఉంటాం. —2 తిమో. 3:14-17; యూదా 3, 4.

10. పెర్గము, తుయతైర సంఘాలకు యేసు చెప్పిన మాటల నుండి మనమింకా ఏం నేర్చుకోవచ్చు?

10 మనం అన్నిరకాల అనైతిక ప్రవర్తనకు దూరంగా ఉండాలి. పెర్గము, తుయతైర సంఘాల్లో మరో సమస్య కూడా ఉంది. ఆ సంఘాల్లో ఉన్న కొంతమంది, అనైతిక పనుల్ని చేస్తున్నారని యేసు వాళ్లను గద్దించాడు. (ప్రక. 2:14, 20) అయితే మనకెలాంటి పాఠం ఉంది? మనం యెహోవా సేవను చాలా సంవత్సరాలుగా చేస్తుండొచ్చు లేదా ప్రస్తుతం మనకెన్నో సేవావకాశాలు కూడా ఉండొచ్చు. అంతమాత్రాన అనైతిక పనులు చేస్తూ, యెహోవా మనల్ని క్షమించేస్తాడని అస్సలు అనుకోకూడదు. (1 సమూ. 15:22; 1 పేతు. 2:16) కాబట్టి లోకంలోని ప్రజల నైతిక ప్రమాణాలు ఎంత దిగజారిపోయినా, మనం మాత్రం ఆయన ఉన్నత ప్రమాణాలకు అంటిపెట్టుకుని ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు.—ఎఫె. 6:11-13.

11. మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం? (“ మనమేం నేర్చుకోవచ్చు . . .” అనే బాక్సు చూడండి.)

11 మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం? మన ఆరాధన యెహోవాకు నచ్చినట్టు ఉండేలా చూసుకోవడం ప్రాముఖ్యం. ఒకవేళ అలా లేకపోతే, ఆయన ఆమోదం పొందేలా మనం వెంటనే మార్పులు చేసుకోవాలి. (ప్రక. 2:5, 16; 3:3, 16) అయితే ఆ సంఘాలకు పంపించిన సందేశాల్లో యేసు ఇంకొన్ని విషయాల్ని చెప్పాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

హింసను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి

సాతాను పరలోకం నుండి పడేయబడ్డాక, దేవుని ప్రజలమీద ఎలా దాడి చేశాడు? (12-16 పేరాలు చూడండి)

12. స్ముర్న, ఫిలదెల్ఫియ సంఘాలకు యేసు చెప్పిన మాటల నుండి మనమేం నేర్చుకోవచ్చు? (ప్రకటన 2:10)

12 ఇప్పుడు మనం స్ముర్న, ఫిలదెల్ఫియలో ఉన్న సంఘాలకు యేసు పంపించిన సందేశాల్ని పరిశీలిద్దాం. హింసలు ఎదురైతే భయపడొద్దని, వాటిని నమ్మకంగా సహిస్తే యెహోవా ప్రతిఫలం ఇస్తాడని అక్కడున్న క్రైస్తవులకు యేసు చెప్పాడు. (ప్రకటన 2:10 చదవండి; 3:10) దాన్నుండి మనకే పాఠం ఉంది? హింసలు వస్తాయని మనం గుర్తుంచుకుని, వాటిని సహించడానికి సిద్ధంగా ఉండాలి. (మత్త. 24:9, 13; 2 కొరిం. 12:10) ఈ మాటలు ఎందుకు ప్రాముఖ్యమైనవి?

13-14. ప్రకటన 12వ అధ్యాయంలో చెప్పబడిన సంఘటనలవల్ల దేవుని ప్రజలకు ఏం జరిగింది?

13 దేవుని ప్రజలు “ప్రభువు రోజున” అంటే మనం జీవిస్తున్న ఈ కాలంలో హింసించబడతారని ప్రకటన పుస్తకం చెప్తుంది. యేసు పరలోకంలో రాజైన వెంటనే అక్కడ యుద్ధం మొదలౌతుందని ప్రకటన 12వ అధ్యాయంలో మనం చూస్తాం. మిఖాయేలు అని పిలవబడిన యేసు తన సైన్యంతో పాటు సాతాను, అతని చెడ్డ దూతలతో యుద్ధం చేశాడు. (ప్రక. 12:7, 8) ఆ యుద్ధంలో సాతాను, అతని చెడ్డ దూతలు ఓడిపోయి, భూమ్మీదికి పడేయబడ్డారు. దానివల్ల భూమ్మీద మనుషులకు ఎన్నో కష్టాలు మొదలయ్యాయి. (ప్రక. 12:9, 12) అయితే ఆ సంఘటనవల్ల దేవుని ప్రజలకు ఏం జరిగింది?

14 భూమ్మీదికి పడేయబడిన తర్వాత సాతాను ఇంకా ఏం చేస్తాడో ప్రకటన పుస్తకం చెప్తుంది. అతను ఇక పరలోకానికి వెళ్లలేడు కాబట్టి భూమ్మీద మిగిలున్న అభిషిక్త క్రైస్తవుల మీద దాడిచేస్తాడు. ఈ అభిషిక్తులు దేవుని రాజ్యానికి ప్రతినిధులుగా అలాగే “యేసు గురించి సాక్ష్యమివ్వడానికి నియమించబడిన” వాళ్లుగా ఉన్నారు. (ప్రక. 12:17; 2 కొరిం. 5:20; ఎఫె. 6:19, 20) మరి ఈ ప్రవచనం ఎలా నెరవేరింది?

15. ప్రకటన 11వ అధ్యాయంలో చెప్పబడిన “ఇద్దరు సాక్షులు” ఎవర్ని సూచిస్తున్నారు? వాళ్లకేం జరిగింది?

15 ప్రకటనా పనిని ముందుండి నడిపిస్తున్న అభిషిక్త సహోదరుల మీద దాడి జరిగేలా సాతాను వ్యతిరేకుల్ని రెచ్చగొట్టాడు. ఆ అభిషిక్తుల్ని ప్రకటన 11వ అధ్యాయం, “ఇద్దరు సాక్షులు” అని పిలుస్తుంది. అలాగే వాళ్లు చంపబడతారని కూడా చెప్తుంది. * (ప్రక. 11:3, 7-11) 1918 లో సంస్థను నడిపిస్తున్న 8 మంది సహోదరుల మీద తప్పుడు ఆరోపణలు చేసి, దోషులని తీర్పు తీర్చి, వాళ్లకు చాలా సంవత్సరాలు జైలుశిక్ష వేశారు. అది చూసిన చాలామంది, అభిషిక్తులు చేసేపని ఇక ఆగిపోయిందని అనుకున్నారు.

16. 1919 లో ఆశ్చర్యకరంగా ఏం జరిగింది? అయినా సాతాను అప్పటినుండి ఏం చేస్తూనే ఉన్నాడు?

16 ప్రకటన 11వ అధ్యాయంలో ఉన్న ప్రవచనంలో, ఆ “ఇద్దరు సాక్షులు” కొద్ది సమయం తర్వాత తిరిగి బ్రతికించబడతారని ఉంది. సంస్థను నడిపిస్తున్న ఆ సహోదరులు జైల్లో వేయబడిన ఒక సంవత్సరంలోపే ఆ ప్రవచనం ఆశ్చర్యకరంగా నెరవేరింది. 1919 మార్చిలో, వాళ్లను జైలు నుండి విడుదల చేసి వాళ్లమీద ఉన్న ఆరోపణలన్నిటినీ కొట్టేశారు. ఆ తర్వాత, సహోదరులు వెంటనే ప్రకటనా పనిని, బోధనా పనిని మళ్లీ మొదలుపెట్టారు. అయినా సాతాను దేవుని ప్రజలమీద దాడిని ఆపలేదు. అప్పటినుండి అతను దేవుని ప్రజలందరి మీద హింసను “నదిలా” తీసుకొస్తున్నాడు. (ప్రక. 12:15) అందుకే మనలో ప్రతీఒక్కరికి “సహనం, విశ్వాసం అవసరం.”—ప్రక. 13:10.

యెహోవా ఇచ్చిన పనిని శాయశక్తులా చేయండి

17. సాతాను దాడి చేస్తున్నా, దేవుని ప్రజలు అనుకోని విధంగా ఎలా సహాయం పొందారు?

17 దేవుని ప్రజలకు అనుకోని విధంగా కొంచెం సహాయం దొరుకుతుందని ప్రకటన 12వ అధ్యాయం చెప్తుంది. అక్కడ భూమి నదిలాంటి హింసను మింగేసిందని చదువుతాం. (ప్రక. 12:16) ఆ ప్రవచనం ఉన్నదున్నట్టుగా నెరవేరింది. కొన్నిసార్లు సాతాను లోకంలోని న్యాయవ్యవస్థలు, పక్షపాతం చూపించకుండా తీర్పులు ఇవ్వడంవల్ల దేవుని ప్రజల్ని కాపాడాయి. అలా దేవుని ప్రజలు చాలాసార్లు కోర్టు కేసులు గెలవడం వల్ల కాస్త స్వేచ్ఛ పొందారు. వాళ్లు ఆ స్వేచ్ఛను పూర్తిగా ఉపయోగించుకుంటూ యెహోవా తమకిచ్చిన పనిని చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. (1 కొరిం. 16:9) ఇంతకీ ఆ పనిలో ఏమేం ఉన్నాయి?

యెహోవాసాక్షులు ఏ రెండు సందేశాల్ని ప్రకటిస్తారు? (18-19 పేరాలు చూడండి)

18. అంతం వచ్చేముందు మనం ముఖ్యంగా ఏ పని చేయాలి?

18 తన ప్రజలు అంతం రాకముందే, “[దేవుని] రాజ్య సువార్త” భూమంతటా ప్రకటిస్తారని యేసు ముందే చెప్పాడు. (మత్త. 24:14) అలా ప్రకటిస్తున్నప్పుడు వాళ్లకు దేవదూతల మద్దతు ఉంటుంది. అందుకే వాళ్ల గురించి ప్రకటన పుస్తకం ఇలా చెప్తుంది: ఆ దేవదూతలు ‘భూమ్మీద నివసించేవాళ్లకు అంటే ప్రతీ దేశానికి, తెగకు, భాషకు, జాతికి చెందిన ప్రజలకు నిత్యసువార్త ప్రకటిస్తున్నారు.’—ప్రక. 14:6.

19. యెహోవాసాక్షులు ఇంకా ఏ సందేశాన్ని కూడా ప్రకటిస్తారు?

19 దేవుని ప్రజలు రాజ్యం గురించిన మంచివార్తను మాత్రమే ప్రకటించరు. దానితోపాటు, ప్రకటన 8 నుండి 10 అధ్యాయాల్లో చెప్పిన దేవదూతల పనికి వాళ్లు మద్దతివ్వాలి. దేవుని రాజ్యాన్ని వద్దనుకునే వాళ్లకు పెద్దపెద్ద కష్టాలు వస్తాయని ఈ దేవదూతలు ప్రకటిస్తారు. కాబట్టి యెహోవాసాక్షులు ‘వడగండ్లు, అగ్నిలాంటి’ సందేశాన్ని ప్రకటిస్తున్నారు. సాతాను లోకంలోని వేర్వేరు వాటిమీద దేవుడు తీసుకొచ్చే తీర్పులను ఆ సందేశం తెలియజేస్తుంది. (ప్రక. 8:7, 13) అంతం దగ్గర్లో ఉంది కాబట్టి యెహోవా ఉగ్రత రోజుని తప్పించుకోవాలంటే తమ జీవితాల్లో పెద్దపెద్ద మార్పులు చేసుకోవాలని ప్రజలు తెలుసుకోవాలి. (జెఫ. 2:2, 3) మనం ప్రకటిస్తున్న సందేశం అందరికీ నచ్చదు, అలాగే మహాశ్రమ సమయంలో మనం ప్రకటించే చివరి తీర్పు సందేశం ప్రజలకు ఇంకా కోపం తెప్పిస్తుంది. కాబట్టి దాన్ని చెప్పాలంటే ఇప్పుడు, భవిష్యత్తులో మనకు ధైర్యం అవసరం.—ప్రక. 16:21.

ప్రవచనంలోని మాటల్ని పాటించండి

20. మనం తర్వాతి రెండు ఆర్టికల్స్‌లో ఏ విషయాల్ని పరిశీలిస్తాం?

20 మనం ఈ “ప్రవచనంలోని మాటల్ని” పాటించడం చాలా అవసరం. ఎందుకంటే ప్రకటన పుస్తకంలో ఉన్న ప్రవచనాల నెరవేర్పులో మనం కూడా భాగంగా ఉన్నాం. (ప్రక. 1:3) అయితే హింసను నమ్మకంగా సహించడానికి, ఈ సందేశాల్ని ధైర్యంగా ప్రకటిస్తూ ఉండడానికి మనకేది సహాయం చేస్తుంది? మొదటిగా, దేవుని శత్రువులకు ఏం జరుగుతుందని ప్రకటన పుస్తకం చెప్తుందో, దాని గురించి తెలుసుకోవాలి. రెండోదిగా, మనం నమ్మకంగా ఉండడంవల్ల భవిష్యత్తులో పొందే ఆశీర్వాదాల గురించి ఆలోచించాలి. ఈ విషయాల గురించే తర్వాతి రెండు ఆర్టికల్స్‌లో పరిశీలిస్తాం.

పాట 32 యెహోవా పక్షాన ఉండండి!

^ మనం ఎంతో ఉత్తేజకరమైన కాలంలో జీవిస్తున్నాం. ఎందుకంటే ప్రకటన పుస్తకంలోని ప్రవచనాలు ఇప్పుడు నెరవేరుతున్నాయి. ఆ ప్రవచనాలు మనమీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఈ ఆర్టికల్‌ అలాగే తర్వాతి రెండు ఆర్టికల్స్‌, ప్రకటన పుస్తకంలోని కొన్ని విషయాల్ని మనకు నేర్పిస్తాయి. ఆ పుస్తకంలో రాసిన విషయాల్ని పాటించడం ద్వారా యెహోవాకు ఇష్టమైన విధంగా ఎలా ఆరాధించవచ్చో ఈ ఆర్టికల్స్‌ చెప్తాయి.

^ 2014 నవంబరు 15, కావలికోటలోని 30వ పేజీలో ఉన్న “పాఠకుల ప్రశ్నలు” చూడండి.