కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 21

ప్రకటన పుస్తకం మీ భవిష్యత్తు గురించి ఏం చెప్తుంది?

ప్రకటన పుస్తకం మీ భవిష్యత్తు గురించి ఏం చెప్తుంది?

“ఆమేన్‌! ప్రభువైన యేసూ, రా.”ప్రక. 22:20.

పాట 142 మన నిరీక్షణను గట్టిగా పట్టుకుందాం

ఈ ఆర్టికల్‌లో. . . *

1. మనుష్యులందరూ ఏ ప్రాముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాలి?

 ఇప్పుడు ప్రజలందరూ ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. వాళ్లు యెహోవాకు మద్దతిస్తూ ఆయనే విశ్వానికి సరైన పరిపాలకుడని నమ్ముతారా? లేదా క్రూరుడైన ఆయన బద్ధశత్రువు సాతాను వైపు ఉంటారా? వాళ్లు శాశ్వతంగా జీవిస్తారో లేదో ఆ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్లు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే. (మత్త. 25:31-33, 46) అప్పుడు వాళ్లు “మహాశ్రమ” సమయంలో జీవించడానికైనా, నాశనం అవ్వడానికైనా గుర్తువేయబడతారు.—ప్రక. 7:14; 14:9-11; యెహె. 9:4, 6.

2. (ఎ) హెబ్రీయులు 10:35-39 ఏం చేయమని మనల్ని ప్రోత్సహిస్తుంది? (బి) ప్రకటన పుస్తకం మనకెలా సహాయం చేస్తుంది?

2 హెబ్రీయులు 10:35-39 చదవండి. యెహోవా పరిపాలనకు మద్దతివ్వాలని అనుకుంటే మీరు తెలివైన నిర్ణయం తీసుకున్నట్టే. మీలాగే ఇతరులు కూడా సరైన నిర్ణయం తీసుకునేలా వాళ్లకు సహాయం చేయాలని మీరు కోరుకుంటారు. దానికోసం ప్రకటన పుస్తకంలో ఉన్న సమాచారాన్ని మీరు ఉపయోగించవచ్చు. ఆ పుస్తకం యెహోవాను వ్యతిరేకించేవాళ్లకు ఏం జరుగుతుందో, ఆయన పరిపాలనకు నమ్మకంగా మద్దతిచ్చేవాళ్లకు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో చెప్తుంది. ఆ ముఖ్యమైన సత్యాల్ని అధ్యయనం చేసినప్పుడు, యెహోవాను సేవిస్తూ ఉండాలనే మన నిర్ణయాన్ని బలపర్చుకుంటాం. అంతేకాదు మనం నేర్చుకున్న వాటినిబట్టి ఇతరులు కూడా యెహోవాను సేవించేలా నిర్ణయించుకోవడానికి, దానిలో కొనసాగడానికి సహాయం చేస్తాం.

3. ఈ ఆర్టికల్‌లో మనం ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

3 ఈ ఆర్టికల్‌లో రెండు ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం. అవేంటంటే, (1) దేవుని పరిపాలనకు మద్దతిచ్చేవాళ్లకు ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది? (2) ప్రకటన పుస్తకం వర్ణించిన ఎర్రని క్రూరమృగానికి మద్దతిచ్చేవాళ్లకు ఏం జరుగుతుంది?

యెహోవాకు నమ్మకంగా ఉండేవాళ్లకు ఏం జరుగుతుంది?

4. యేసుతోపాటు పరలోకంలో ఏ గుంపుని అపొస్తలుడైన యోహాను చూశాడు?

4 యెహోవా పరిపాలనకు మద్దతిచ్చి, శాశ్వత జీవితాన్ని ఆశీర్వాదంగా పొందిన రెండు గుంపుల్ని అపొస్తలుడైన యోహాను ఒక దర్శనంలో చూశాడు. మొదటి గుంపులో 1,44,000 మంది ఉంటారు. (ప్రక. 7:4) వాళ్లు యేసుతోపాటు పరలోకంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భూమ్మీద నుండి తీసుకోబడతారు. వాళ్లు ఆయనతో కలిసి భూమిని పరిపాలిస్తారు. (ప్రక. 5:9, 10; 14:3, 4) అంతేకాదు, వాళ్లు యేసుతోపాటు పరలోకంలో సీయోను పర్వతం మీద నిలబడి ఉండడాన్ని యోహాను చూశాడు.—ప్రక. 14:1.

5. రాబోయే రోజుల్లో ఈ భూమ్మీద మిగిలివున్న 1,44,000 మందికి ఏం జరగబోతుంది?

5 అపొస్తలుల కాలం నుండి ఇప్పటివరకు 1,44,000 మందిలో భాగంగా ఉండడానికి వేలమంది ఎంచుకోబడ్డారు. (లూకా 12:32; రోమా. 8:17) కానీ చివరిరోజుల్లో ఆ అభిషిక్తుల్లో కొద్దిమంది మాత్రమే భూమ్మీద బతికి ఉంటారని యోహానుకు చెప్పబడింది. ఈ ‘మిగిలినవాళ్లు’ మహాశ్రమకు కాస్త ముందు యెహోవా ఆమోదం తమకుందని చూపించే చివరి ‘ముద్రను’ పొందుతారు. (ప్రక. 7:2, 3; 12:17) తర్వాత, మహాశ్రమ మొదలయ్యాక ఏదోక సమయంలో ఈ 1,44,000 మందిలో మిగిలినవాళ్లు పరలోకానికి సమకూర్చబడతారు. వాళ్లక్కడ యేసుతో కలిసి పరిపాలిస్తారు.—మత్త. 24:31; ప్రక. 5:9, 10.

6-7. (ఎ) యోహాను తర్వాత ఏ గుంపును చూశాడు? వాళ్ల గురించి అతనికి ఏం చెప్పబడింది? (బి) మనం పరలోకానికి వెళ్లేవాళ్లమైనా, భూమ్మీద జీవించేవాళ్లమైనా ప్రకటన 7వ అధ్యాయంలో ఉన్న విషయాల గురించి ఎందుకు ఆసక్తి చూపించాలి?

6 యోహాను ఆ తర్వాత ఒక ‘గొప్పసమూహాన్ని’ చూశాడు. వాళ్లు లెక్కపెట్టలేనంత మంది ఉన్నారని బైబిలు చెప్తుంది. (ప్రక. 7:9, 10) వాళ్ల గురించి యోహానుకు ఇలా చెప్పబడింది: “వీళ్లు మహాశ్రమను దాటి వచ్చేవాళ్లు. వీళ్లు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కొని వాటిని తెల్లగా చేసుకున్నారు.” (ప్రక. 7:14) ఈ గొప్పసమూహంలోని వాళ్లు మహాశ్రమను దాటాక, ఇదే భూమ్మీద జీవిస్తూ ఎన్నో అద్భుతమైన ఆశీర్వాదాల్ని అనుభవిస్తారు.—కీర్త. 37:9-11, 27-29; సామె. 2:21, 22; ప్రక. 7:16, 17.

7 ఒకసారి ఆలోచించండి, ప్రకటన 7వ అధ్యాయంలోని విషయాలు నెరవేరినప్పుడు మనకెలా అనిపిస్తుంది? మనం పరలోకానికి వెళ్లే వాళ్లమైనా, భూమ్మీద జీవించే వాళ్లమైనా అదెంతో సంతోషకరమైన సమయం. ఎందుకంటే మనం యెహోవా పరిపాలనకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నాం. అయితే మహాశ్రమ సమయంలో దేవుని శత్రువులకు ఏమౌతుందో ఇప్పుడు చూద్దాం.—మత్త. 24:21.

యెహోవాను వ్యతిరేకించేవాళ్లకు ఏం జరుగుతుంది?

8. మహాశ్రమ ఎప్పుడు మొదలౌతుంది? ఆ సమయంలో చాలామంది ప్రజలు ఎలా స్పందిస్తారు?

8 ముందటి ఆర్టికల్‌లో చూసినట్టు, లోకంలోని రాజకీయ శక్తులు ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోను మీద త్వరలోనే దాడిచేస్తాయి. (ప్రక. 17:16, 17) ఆ దాడితో మహాశ్రమ మొదలౌతుంది. మరప్పుడు చాలామంది యెహోవాను సేవించడం మొదలుపెడతారా? లేదు. దానికి బదులు ఆ కష్టమైన సమయంలో, యెహోవాను సేవించని ప్రజలు రక్షణ కోసం పర్వతాలతో పోల్చబడిన రాజకీయ, వాణిజ్య సంస్థల వైపు తిరుగుతారని ప్రకటన 6వ అధ్యాయం చెప్తుంది. వాళ్లు దేవుని రాజ్యానికి మద్దతివ్వరు కాబట్టి యెహోవా వాళ్లను వ్యతిరేకులుగా చూస్తాడు.—లూకా 11:23; ప్రక. 6:15-17.

9. మహాశ్రమ సమయంలో యెహోవా ప్రజలు ఎలా వేరుగా ఉంటారు? దానివల్ల ఏం జరుగుతుంది?

9 కష్టమైన మహాశ్రమ కాలంలో దేవుని నమ్మకమైన సేవకులు మాత్రమే వేరుగా ఉంటారు. ఈ భూమ్మీద వాళ్లొక్కరే ‘క్రూరమృగానికి’ మద్దతివ్వకుండా యెహోవాను సేవిస్తూ ఉంటారు. (ప్రక. 13:14-17) వాళ్లు స్థిరంగా ఉండడాన్ని చూసినప్పుడు యెహోవా శత్రువులు కోపంతో రగిలిపోతారు. అప్పుడు, దేశాల గుంపు భూమ్మీదున్న దేవుని ప్రజలందరిపై దాడిచేస్తుంది. ఆ దాడినే బైబిలు మాగోగువాడైన గోగు చేసే దాడి అని పిలుస్తుంది.—యెహె. 38:14-16.

10. ప్రకటన 19:19-21 లో ఉన్నట్టు, తన ప్రజలమీద దాడి జరిగినప్పుడు యెహోవా ఏం చేస్తాడు?

10 తన ప్రజల మీద దాడి జరిగినప్పుడు యెహోవాకు ఎలా అనిపిస్తుంది? “నా గొప్ప ఉగ్రత రగులుకుంటుంది” అని ఆయన అంటున్నాడు. (యెహె. 38:18, 21-23) ఆ తర్వాత ఏమౌతుందో ప్రకటన 19వ అధ్యాయం చెప్తుంది. యెహోవా తన ప్రజల్ని కాపాడడం కోసం, తన శత్రువుల్ని ఓడించడం కోసం యేసుని పంపిస్తాడు. అప్పుడు యేసు, ‘పరలోక సైన్యాలతో’ అంటే నమ్మకమైన దూతలతో అలాగే 1,44,000 మందితో వచ్చి మాగోగువాడైన గోగు మీద యుద్ధం చేస్తాడు. (ప్రక. 17:14; 19:11-15) యెహోవాకు వ్యతిరేకంగా ఉన్న ప్రజలు అలాగే సంస్థలు పూర్తిగా నాశనమవ్వడంతో ఈ యుద్ధం ముగుస్తుంది.—ప్రకటన 19:19-21 చదవండి.

యుద్ధం తర్వాత, ఒక పెళ్లి

11. ప్రకటన పుస్తకం చివర్లో ఏ ప్రాముఖ్యమైన సంఘటన గురించి ఉంది?

11 దేవుని శత్రువులందరు పూర్తిగా నాశనమైనప్పుడు భూమ్మీదున్న నమ్మకమైనవాళ్లకు ఎంత ఆనందంగా అనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు, పరలోకంలో ఉన్నవాళ్లు మహాబబులోను నాశనమైనప్పుడు ఎంతో సంతోషాన్ని పొందుతారు. అయితే మరో కారణం వల్ల కూడా పరలోకంలో ఉన్నవాళ్లు సంతోషిస్తారు. (ప్రక. 19:1-3) ప్రకటన పుస్తకం చివర్లో ఎంతో ప్రాముఖ్యమైన ఒక సంఘటన గురించి చూస్తాం. అదే “గొర్రెపిల్ల పెళ్లి.”—ప్రక. 19:6-9.

12. ప్రకటన 21:1, 2 చెప్పినట్టు, గొర్రెపిల్ల పెళ్లి ఎప్పుడు జరుగుతుంది?

12 గొర్రెపిల్ల పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? హార్‌మెగిద్దోన్‌ యుద్ధం జరగడానికి కాస్త ముందు 1,44,000 మందిలో అందరూ పరలోకంలోనే ఉంటారు. కానీ ఆ సమయంలో ఆ పెళ్లి జరగదు. (ప్రకటన 21:1, 2 చదవండి.) అయితే హార్‌మెగిద్దోన్‌ యుద్ధం పూర్తై, దేవుని శత్రువులందరూ లేకుండా పోయిన తర్వాతే ఆ పెళ్లి జరుగుతుంది.—కీర్త. 45:3, 4, 13-17.

13. గొర్రెపిల్ల పెళ్లి అంటే ఏంటి?

13 గొర్రెపిల్ల పెళ్లి అంటే ఏంటి? పెళ్లి చేసుకున్నప్పుడు ఎలాగైతే పురుషుడు, స్త్రీ ఒక్కటౌతారో అలాగే గొర్రెపిల్ల పెళ్లప్పుడు కూడా రాజైన యేసుక్రీస్తు తన ‘పెళ్లి కూతురైన’ 1,44,000 మందితో ఒక్కటౌతాడు. ఆ తర్వాత 1,44,000 మందితో కలిసి యేసుక్రీస్తు వెయ్యి సంవత్సరాలు భూమిని పరిపాలించడం మొదలుపెడతాడు.—ప్రక. 20:6.

ఎంతో అందమైన నగరం అలాగే మీరు పొందబోయే ఆశీర్వాదాలు

కొత్త యెరూషలేము అనే సూచనార్థక నగరం ‘పరలోకంలోని దేవుని దగ్గర నుండి దిగివస్తునట్టు’ ప్రకటన 21వ అధ్యాయం వర్ణిస్తుంది. అది వెయ్యి సంవత్సరాల పరిపాలనలో దేవునికి లోబడే మనుషులకు లెక్కలేనన్ని ఆశీర్వాదాల్ని తీసుకొస్తుంది (14-16 పేరాలు చూడండి)

14-15. ప్రకటన 21వ అధ్యాయం 1,44,000 మందిని దేనితో పోల్చింది? (కవర్‌ పేజీ మీదున్న చిత్రాన్ని చూడండి.)

14 ప్రకటన 21వ అధ్యాయం 1,44,000 మందిని ఎంతో అందంగా ఉన్న “కొత్త యెరూషలేము” అనే నగరంతో పోల్చింది. (ప్రక. 21:2, 9) ఆ నగరం 12 పునాది రాళ్లమీద కట్టబడింది, వాటిమీద “గొర్రెపిల్ల 12 మంది అపొస్తలుల 12 పేర్లు” రాయబడ్డాయి. ఆ దర్శనం యోహానుకు ఎందుకంత ఆసక్తిగా అనిపించింది? ఎందుకంటే వాటిలో ఒక రాయిమీద తన పేరు ఉండడాన్ని అతను చూశాడు. అది ఎంత గొప్ప గౌరవమో కదా!—ప్రక. 21:10-14; ఎఫె. 2:20.

15 ఈ నగరం ఏదో మామూలు నగరంలాంటిది కాదు. దాని ముఖ్య వీధి స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది. దాని 12 గుమ్మాలు 12 ముత్యాలతో అంటే ఒక్కో గుమ్మం ఒక్కో ముత్యంతో చేయబడింది. అలాగే గోడలు, పునాదులు అమూల్యమైన రాళ్లతో అలంకరించబడ్డాయి. దాని వెడల్పు, పొడవు, ఎత్తు అన్నీ సమానంగా ఉన్నాయి. (ప్రక. 21:15-21) కానీ అక్కడ ఒకటి కనిపించలేదని యోహాను గమనించి ఇలా చెప్పాడు: “ఆ నగరంలో నాకు ఆలయం కనిపించలేదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుడే దాని ఆలయం, అలాగే గొర్రెపిల్ల కూడా. ఆ నగరం మీద సూర్యుడు గానీ చంద్రుడు గానీ ప్రకాశించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని మహిమ దాన్ని ప్రకాశింపజేసింది. గొర్రెపిల్లే దానికి దీపం.” (ప్రక. 21:22, 23) ఎవరైతే ఆ కొత్త యెరూషలేములో భాగంగా ఉంటారో వాళ్లు యెహోవా దగ్గర ఉంటారు. (హెబ్రీ. 7:27; ప్రక. 22:3, 4) కాబట్టి యెహోవా, యేసే ఆ నగరానికి ఆలయం.

“నది” అలాగే “వృక్షాలు” సూచనగా ఉన్న ఏర్పాట్ల నుండి ఎవరు ప్రయోజనం పొందుతారు? (16-17 పేరాలు చూడండి)

16. వెయ్యి సంవత్సరాల పరిపాలనలో మనుషులు ఏ ఆశీర్వాదాల్ని పొందుతారు?

16 ఈ నగరం గురించి ఆలోచించడం అభిషిక్త క్రైస్తవులకు ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది. అయితే, భూనిరీక్షణ ఉన్నవాళ్లు కూడా ఈ నగరం గురించి ఆసక్తి చూపించడానికి కారణం ఉంది. దేవుని రాజ్యం వెయ్యి సంవత్సరాలు పరిపాలించినప్పుడు, కొత్త యెరూషలేము ఈ భూమికి లెక్కలేనన్ని ఆశీర్వాదాల్ని తెస్తుంది. యోహాను ఈ ఆశీర్వాదాల గురించి చెప్తూ అవి ‘జీవజలాల నదిలా’ ప్రవహిస్తున్నాయని, నదికి రెండువైపులా ‘జీవవృక్షాలు ఉన్నాయని’ రాశాడు. ఆ వృక్షాల ఆకులు ‘దేశాల్ని స్వస్థపరుస్తాయి.’ (ప్రక. 22:1, 2) ఈ ఏర్పాట్ల నుండి మనుషులందరూ ప్రయోజనం పొందుతారు. ఎవరైతే యెహోవాకు లోబడతారో, వాళ్లందరూ మెల్లమెల్లగా పరిపూర్ణులౌతారు. అప్పుడిక ఏ అనారోగ్యం, నొప్పి, కన్నీళ్లు ఉండవు.—ప్రక. 21:3-5.

17. ప్రకటన 20:11-13 చెప్తున్నట్లు, వెయ్యి సంవత్సరాల పరిపాలన ద్వారా ఎవరెవరు ప్రయోజనం పొందుతారు?

17 ఈ అద్భుతమైన ఏర్పాట్ల నుండి ఎవరెవరు ప్రయోజనం పొందుతారు? మొదటిగా, హార్‌మెగిద్దోన్‌ తప్పించుకున్న గొప్ప సమూహం అలాగే కొత్తలోకంలో పుట్టబోయే పిల్లలు ప్రయోజనం పొందుతారు. అయితే ప్రకటన 20వ అధ్యాయం చనిపోయినవాళ్లు కూడా తిరిగి బ్రతికించబడతారని మాటిస్తోంది. (ప్రకటన 20:11-13 చదవండి.) గతంలో చనిపోయిన నమ్మకమైన నీతిమంతులతో సహా, యెహోవా గురించి తెలుసుకునే అవకాశం దొరకని అనీతిమంతులు కూడా ఇదే భూమ్మీద తిరిగి బ్రతికించబడతారు. (అపొ. 24:15; యోహా. 5:28, 29) అంటే దానర్థం వెయ్యి సంవత్సరాల పరిపాలనలో అందరూ తిరిగి బ్రతికించబడతారనా? కాదు. చనిపోకముందు యెహోవాను సేవించే అవకాశం దొరికినా, ఎవరైతే కావాలని దాన్ని ఉపయోగించుకోలేదో, వాళ్లు పరదైసు భూమ్మీద జీవించడానికి అర్హులు కారని చూపించారు. కాబట్టి వాళ్లు తిరిగి బ్రతికించబడరు. —మత్త. 25:46; 2 థెస్స. 1:9; ప్రక. 17:8; 20:15.

చివరి పరీక్ష

18. వెయ్యి సంవత్సరాల చివరికల్లా ఈ భూమ్మీద పరిస్థితి ఎలా ఉంటుంది?

18 వెయ్యి సంవత్సరాల పరిపాలన చివరికల్లా భూమ్మీదున్న వాళ్లందరూ పరిపూర్ణులౌతారు. అప్పుడు జీవించే వాళ్లెవ్వరిలో ఆదాము నుండి వచ్చిన పాపం ఉండదు. (రోమా. 5:12) అలాగే ఆ పాపంవల్ల వచ్చిన పర్యవసానాలు కూడా పూర్తిగా తీసేయబడతాయి. అలా వెయ్యి సంవత్సరాల చివరికల్లా, ఈ భూమ్మీద మనుషులందరూ పరిపూర్ణులుగా ‘బ్రతికించబడతారు.’—ప్రక. 20:5.

19. చివరి పరీక్ష ఎందుకు అవసరం?

19 సాతాను యేసుని పరీక్షించినప్పుడు ఆయన యెహోవాకు నమ్మకంగా ఉన్నాడని మనకు తెలుసు. అయితే, పరిపూర్ణులైన మనుషుల్ని మళ్లీ పరీక్షించే అవకాశం సాతానుకు దొరికినప్పుడు వాళ్లు యేసులాగే నమ్మకంగా ఉంటారా? వెయ్యి సంవత్సరాల చివర్లో సాతాను అగాధం నుండి విడుదలైనప్పుడు, ఈ ప్రశ్నకు జవాబిచ్చే అవకాశం ప్రతీఒక్కరికి దొరుకుతుంది. (ప్రక. 20:7) ఈ చివరి పరీక్షలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్లు శాశ్వత జీవితాన్ని పొందుతారు, నిజమైన స్వేచ్ఛను ఆనందిస్తారు. (రోమా. 8:21) మరోవైపు తిరుగుబాటు చేసేవాళ్లు అపవాది, అతని చెడ్డ దూతలతోపాటు శాశ్వతంగా నాశనం చేయబడతారు.—ప్రక. 20:8-10.

20. ప్రకటన పుస్తకంలో ఉన్న అద్భుతమైన ప్రవచనాల గురించి ఆలోచించినప్పుడు మీకెలా అనిపిస్తుంది?

20 ప్రకటన పుస్తకంలో ఉన్న కొన్ని విషయాల్ని పరిశీలించాక మీకెలా అనిపిస్తుంది? ఈ ప్రవచనాల నెరవేర్పులో మిమ్మల్ని మీరు ఊహించుకుంటుంటే ఖచ్చితంగా ఉత్సాహంగా అనిపిస్తుంది. అలాగే యెహోవాకు స్వచ్ఛమైన ఆరాధన చేసేలా, ఇతరుల్ని కూడా ఆహ్వానించాలని మీరు కదిలించబడతారు. (ప్రక. 22:17) కాబట్టి భవిష్యత్తులో జరగబోయే ఈ గొప్ప సంఘటనల గురించి ఆలోచించినప్పుడు, మనం కూడా అపొస్తలుడైన యోహానులాగే ఉత్సాహంగా ఇలా అంటాం: “ఆమేన్‌! ప్రభువైన యేసూ, రా.”—ప్రక. 22:20.

పాట 27 దేవుని పిల్లల మహిమ వెల్లడయ్యే సమయం

^ ప్రకటన పుస్తకం గురించి మనం చూస్తున్న ఆర్టికల్స్‌లో ఇది చివరిది. యెహోవాకు నమ్మకంగా ఉండేవాళ్లకు సంతోషకరమైన భవిష్యత్తు ఉంటుందని, ఆయన్ని వ్యతిరేకించేవాళ్లు నాశనమౌతారని ఈ ఆర్టికల్‌లో చూస్తాం.