అధ్యయన ఆర్టికల్ 22
మన జీవితంలో ఉపయోగపడే తెలివైన సలహాలు
“తెలివిని ఇచ్చేది యెహోవాయే”—సామె. 2:6.
పాట 89 వినండి, లోబడండి, దీవెనలు పొందండి
ఈ ఆర్టికల్‌లో. . . a
1. మనందరికీ దేవుని తెలివి ఎందుకు అవసరం? (సామెతలు 4:7)
ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా తెలివి కోసం ప్రార్థించి ఉంటారు. ఎందుకంటే అది చాలా అవసరమని మీకు తెలుసు. (యాకో. 1:5) అందుకే రాజైన సొలొమోను ఇలా రాశాడు: “తెలివి అన్నిటికన్నా ముఖ్యమైనది.” (సామెతలు 4:7 చదవండి.) అయితే, అతను లోకపు తెలివి గురించి మాట్లాడట్లేదు కానీ యెహోవా ఇచ్చే తెలివి గురించి మాట్లాడుతున్నాడు. (సామె. 2:6) కానీ ప్రశ్నేంటంటే, మనకొచ్చే రోజువారీ సమస్యల్ని దేవుని తెలివితో ఎదుర్కోగలమా? ఖచ్చితంగా ఎదుర్కోగలమని ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.
2. మనం నిజమైన తెలివిని సంపాదించడానికి ఒక మార్గం ఏంటి?
2 మనం నిజమైన తెలివిని సంపాదించడానికి ఒక మార్గం ఏంటి? ఎంతో తెలివిగలవాళ్లని పేరున్న ఇద్దరు వ్యక్తుల బోధల్ని అధ్యయనం చేసి, పాటించడం ద్వారా దాన్ని సంపాదించవచ్చు. ముందుగా మనం సొలొమోను గురించి చూద్దాం. అతని గురించి బైబిలు ఇలా చెప్తుంది: ‘దేవుడు సొలొమోనుకు ఎంతో ఎక్కువగా తెలివిని, వివేచనను ఇచ్చాడు.’ (1 రాజు. 4:29) ఆ తర్వాత, జీవించినవారిలో అందరికన్నా ఎంతో తెలివిగలవాడైన యేసు గురించి చూద్దాం. (మత్త. 12:42) ఆయన గురించి బైబిలు ముందే ఇలా చెప్పింది: “యెహోవా పవిత్రశక్తి ఆయన మీద నిలిచివుంటుంది, అది ఆయనకు తెలివిని, అవగాహనను ఇస్తుంది.”—యెష. 11:2.
3. ఈ ఆర్టికల్‌లో మనమేం చూస్తాం?
3 తమకు దేవుడిచ్చిన తెలివి వల్ల సొలొమోను, యేసు మనందరికీ అవసరమయ్యే మంచి సలహాలు ఇచ్చారు. కాబట్టి మనందరం డబ్బు విషయంలో, పని విషయంలో, మన గురించి మనం ఆలోచించుకునే విషయంలో సరైన అభిప్రాయం ఎలా కలిగివుండాలో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.
డబ్బు విషయంలో సరైన అభిప్రాయం కలిగివుండడం
4. సొలొమోను పరిస్థితికి, యేసు పరిస్థితికి తేడా ఏంటి?
4 సొలొమోను ఎంతో డబ్బున్నవాడు. అతను చాలా అందమైన, సౌకర్యవంతమైన ఇంట్లో ఉండేవాడు. (1 రాజు. 10:7, 14, 15) మరోవైపు యేసు దగ్గర ఎక్కువ వస్తువులు ఉండేవికావు. అలాగే ఆయనకంటూ ఒక ఇల్లు కూడా లేదు. (మత్త. 8:20) అయినా యెహోవా ఇచ్చిన తెలివివల్ల వాళ్లిద్దరూ వస్తుసంపదల విషయంలో సరైన అభిప్రాయం కలిగివున్నారు.
5. సొలొమోనుకు డబ్బు విషయంలో సరైన అభిప్రాయం ఉందని ఎలా చెప్పవచ్చు?
5 డబ్బు ఒక “రక్షణగా ఉంటుంది” అని సొలొమోను ఒప్పుకున్నాడు. (ప్రసం. 7:12) డబ్బుంటే మన అవసరాల్ని తీర్చుకోవడంతో పాటు కావాలనుకున్నవి కొనుక్కోవచ్చు. అయితే సొలొమోను ఎంతో ధనవంతుడైనా, డబ్బు కన్నా ప్రాముఖ్యమైనవి ఉన్నాయని అర్థంచేసుకున్నాడు. ఉదాహరణకు అతనిలా రాశాడు: ‘గొప్ప సంపదల కన్నా మంచిపేరును ఎంచుకోవడం మంచిది.’ (సామె. 22:1) అలాగే, డబ్బును ప్రేమించేవాళ్లు తమకున్న వాటితో సంతోషంగా ఉండలేరని అతను చెప్పాడు. (ప్రసం. 5:10, 12) అంతేకాదు, డబ్బే అన్నిటికన్నా ప్రాముఖ్యమనే అభిప్రాయం ఎవరికైనా ఉంటే అది ప్రమాదకరం. ఎందుకంటే అది ఎప్పుడైనా పోవచ్చని అతను హెచ్చరించాడు.—సామె. 23:4, 5.
6. యేసుకు డబ్బు విషయంలో, వస్తువుల విషయంలో సరైన అభిప్రాయం ఉందని ఎలా చెప్పవచ్చు? (మత్తయి 6:31-33)
6 యేసుకు డబ్బు విషయంలో, వస్తువుల విషయంలో సరైన అభిప్రాయం ఉంది. ఆయన మంచి ఆహారాన్ని, ద్రాక్షారసాన్ని తీసుకునేవాడు. (లూకా 19:2, 6, 7) ఒక సందర్భంలో ఆయన మంచి ద్రాక్షారసాన్ని తయారుచేశాడు. అది ఆయన చేసిన అద్భుతాల్లో మొదటిది. (యోహా. 2:10, 11) అలాగే ఆయన చనిపోయే రోజు ఖరీదైన బట్టలు వేసుకున్నాడు. (యోహా. 19:23, 24) కానీ యేసు డబ్బుని, వస్తువుల్ని తన జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనవిగా చూడలేదు. దానిగురించి ఆయన తన అనుచరులకు ఇలా చెప్పాడు: ‘ఏ వ్యక్తీ ఇద్దరు యజమానులకు దాసునిగా ఉండలేడు. మీరు దేవునికీ సంపదలకూ దాసులుగా ఉండలేరు.’ (మత్త. 6:24) కాబట్టి మనం దేవుని రాజ్యానికి మొదటిస్థానం ఇస్తే, మనకు అవసరమైనవి ఉండేలా యెహోవా చూసుకుంటాడని యేసు బోధించాడు.—మత్తయి 6:31-33 చదవండి.
7. డబ్బు విషయంలో సరైన అభిప్రాయం ఉండడంవల్ల ఒక సహోదరుడు ఎలా ప్రయోజనం పొందాడు?
7 డబ్బు విషయంలో యెహోవా ఇచ్చిన సలహాను పాటించడం ద్వారా చాలామంది సహోదర సహోదరీలు ప్రయోజనం పొందారు. డానియేల్ అనే ఒంటరి సహోదరుడి అనుభవాన్ని చూడండి. అతను తన జీవితాన్ని సరళంగా ఉంచుకున్నాడు. అలా ఉండడంవల్ల తన సమయాన్ని, నైపుణ్యాల్ని సంస్థకు సంబంధించిన వేర్వేరు ప్రాజెక్ట్‌లలో ఉపయోగించగలిగాడు. అతనిలా చెప్తున్నాడు: “నేను టీనేజ్‌లో ఉన్నప్పుడే యెహోవా సేవను అన్నిటికన్నా ప్రాముఖ్యంగా చూడాలని నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయం వల్ల నేను అస్సలు బాధపడట్లేదు. బహుశా నేను వస్తుసంపదల్ని ప్రాముఖ్యంగా చూసుంటే, ఎక్కువ డబ్బు సంపాదించేవాడ్ని. కానీ నేను సంపాదించుకున్న స్నేహితుల్ని, రాజ్యానికి మొదటిస్థానం ఇవ్వడంవల్ల వచ్చిన సంతృప్తిని డబ్బు ఎప్పటికీ ఇవ్వలేదు. అలాగే యెహోవా ఇచ్చిన ఆశీర్వాదాలతో పోలిస్తే డబ్బు ఏమాత్రం సాటిరాదు.” కాబట్టి మనం డబ్బు మీద కాకుండా యెహోవా సేవ మీద మనసుపెడితే ప్రయోజనం పొందుతాం.
పని విషయంలో సరైన అభిప్రాయం కలిగివుండడం
8. సొలొమోనుకు పని విషయంలో సరైన అభిప్రాయం ఉందని మనమెలా చెప్పవచ్చు? (ప్రసంగి 5:18, 19)
8 ఒకవ్యక్తి కష్టపడి పనిచేసినప్పుడు చాలా సంతోషాన్ని పొందుతాడని సొలొమోను చెప్పాడు. అతను దాన్ని “దేవుడు ఇచ్చే బహుమతి” అన్నాడు. (ప్రసంగి 5:18, 19 చదవండి.) అలాగే అతనిలా రాశాడు: “ఏ కష్టం చేసినా ప్రయోజనం ఉంటుంది.” (సామె. 14:23) సొలొమోను కష్టపడి పనిచేసేవాడు కాబట్టి ఆ మాటలు నిజమని అతనికి తెలుసు. అతను ఇళ్లు కట్టించాడు, ద్రాక్షతోటలు, ఉద్యానవనాలు నాటించాడు, చెరువుల్ని తవ్వించాడు. అంతేకాదు, నగరాల్ని కూడా కట్టించాడు. (1 రాజు. 9:19; ప్రసం. 2:4-6) అవన్నీ చేయడం కష్టమే అయినా సొలొమోను ఆ పనుల్లో సంతృప్తి పొందుంటాడు. కానీ అతను నిజమైన సంతోషం పొందడానికి కేవలం వాటిమీదే ఆధారపడలేదు. బదులుగా, దేవుని సేవలో కూడా ఎన్నో పనులు చేశాడు. ఉదాహరణకు, యెహోవా ఆరాధన కోసం అతను ఒక గొప్ప ఆలయాన్ని ఏడు సంవత్సరాలపాటు కట్టించాడు. (1 రాజు. 6:38; 9:1) సొలొమోను ఎన్నో పనులు చేశాక, సొంత పనులకన్నా యెహోవా కోసం చేసిన పనులే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనవని అర్థంచేసుకున్నాడు. అందుకే ఇలా రాశాడు: “అంతా విన్న తర్వాత చివరికి చెప్పేది ఏమిటంటే: సత్యదేవునికి భయపడి, ఆయన ఆజ్ఞల్ని పాటించాలి.”—ప్రసం. 12:13.
9. యేసు వడ్రంగి పనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదని మనకెలా తెలుసు?
9 యేసు కష్టపడి పనిచేసేవాడు. ఆయన యువకునిగా ఉన్నప్పుడు వడ్రంగి పనిచేశాడు. (మార్కు 6:3) వాళ్లది పెద్ద కుటుంబం అవ్వడంవల్ల, వాళ్ల అవసరాలు తీర్చడానికి యేసు కష్టపడి పనిచేయడం చూసి ఆయన తల్లిదండ్రులు సంతోషించి ఉంటారు. యేసు పరిపూర్ణుడు కాబట్టి ఆ పనిలో ఆయనకు ఉన్నంత నైపుణ్యం ఇంకెవరికీ ఉండివుండదు. అందుకే ఆయనతో పని చేయించుకోవడానికి చాలామంది ఇష్టపడివుంటారు. యేసు ఖచ్చితంగా తన పనిలో సంతోషించి ఉంటాడు. అయినా యెహోవా సేవ చేయడానికి కూడా ఆయన సమయం పెట్టాడు. (యోహా. 7:15) ఆ తర్వాత, పరిచర్య మొదలుపెట్టినప్పుడు తన బోధ వినేవాళ్లకు యేసు ఈ సలహా ఇచ్చాడు: “పాడైపోయే ఆహారం కోసం కాకుండా, శాశ్వత జీవితాన్ని ఇచ్చే పాడవ్వని ఆహారం కోసం కష్టపడండి.” (యోహా. 6:27) అలాగే ఆయన కొండమీద ప్రసంగంలో ఇలా చెప్పాడు: “పరలోకంలో మీ కోసం సంపదలు కూడబెట్టుకోండి.”—మత్త. 6:20.
10. కష్టపడి పనిచేసే కొంతమందికి ఎలాంటి సమస్య ఎదురవ్వొచ్చు?
10 యెహోవా ఇచ్చే తెలివైన సలహాను పాటించడంవల్ల పని విషయంలో మనకు సరైన అభిప్రాయం ఉంటుంది. అందుకే క్రైస్తవులుగా మనం ‘కష్టపడి, నిజాయితీగా పని చేయాలని’ నేర్చుకుంటాం. (ఎఫె. 4:28) సాధారణంగా మనం చేసే పనిని, మన నిజాయితీని చూసి యజమానులు మెచ్చుకోవచ్చు. దాంతో యెహోవాసాక్షుల మీద వాళ్లకు మంచి అభిప్రాయం కలగాలని, మనం ఓవర్‌టైమ్ చేయడం మొదలుపెట్టొచ్చు. ఒకవేళ అలా చేస్తే కుటుంబంతో సమయం గడపడానికి, యెహోవా సేవచేయడానికి కావాల్సినంత సమయం ఉండకపోవచ్చు. అందుకే అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయాలకు ఎక్కువ సమయం ఉండేలా మనం మార్పులు చేసుకోవాలి.
11. పని గురించి సరైన అభిప్రాయం కలిగివుండాలని విలియమ్ ఎలా నేర్చుకున్నాడు?
11 విలియమ్ అనే ఒక యౌవన సహోదరుడి అనుభవం చూడండి. అతను సంఘపెద్ద అయిన ఇంకో సహోదరుడి దగ్గర పనిచేసేవాడు. ఆ సహోదరుడి నుండి పని విషయంలో సరైన అభిప్రాయాన్ని ఎలా కలిగివుండాలో విలియమ్ నేర్చుకున్నాడు. అతని గురించి విలియమ్ ఇలా అంటున్నాడు: ‘పని విషయంలో ఆ సహోదరుడికి సరైన అభిప్రాయం ఉండేది. అతను కష్టపడి పనిచేసేవాడు. అలా చక్కగా పని చేయడంవల్ల, అతనికి కస్టమర్లతో మంచి సంబంధం ఉండేది. కానీ ఒక్కసారి పని అయిపోయాక, అతను ఇక దానిగురించి ఆలోచించకుండా కుటుంబంతో సమయం గడపడానికి, యెహోవా సేవచేయడానికి సమయాన్ని ఉపయోగించేవాడు. దానివల్ల ఎంతో సంతోషంగా ఉండేవాడు.’ b
మన గురించి మనం ఆలోచించుకునే విషయంలో సరైన అభిప్రాయం కలిగివుండడం
12. తన గురించి తనకు సరైన అభిప్రాయం ఉందని సొలొమోను ఎలా చూపించాడు? కానీ ఆ తర్వాత ఏం జరిగింది?
12 సొలొమోను యెహోవాను నమ్మకంగా సేవించినంత వరకు తన గురించి తనకు సరైన అభిప్రాయం ఉంది. అతను యువకునిగా ఉన్నప్పుడు, తనకు అన్ని విషయాలు తెలీదని వినయంగా ఒప్పుకుని, నిర్దేశం కోసం యెహోవాను అడిగాడు. (1 రాజు. 3:7-9) తాను పరిపాలించడం మొదలుపెట్టిన కొత్తలో, గర్వం చూపిస్తే ఎలాంటి ప్రమాదాలు వస్తాయో సొలొమోనుకు తెలుసని చెప్పొచ్చు. అందుకే అతనిలా రాశాడు: “నాశనానికి ముందు గర్వం ఉంటుంది, పడిపోవడానికి ముందు అహంకార స్వభావం ఉంటుంది.” (సామె. 16:18) అయితే విచారకరంగా తాను చెప్పిన మాటల్ని సొలొమోనే పాటించలేదు. కొంతకాలానికి అతను గర్విష్ఠుడై దేవుని ఆజ్ఞలను పక్కనపెట్టేశాడు. ఉదాహరణకు, “హృదయం పక్కదారి పట్టకుండా ఉండేలా . . . ఎక్కువమంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు” అని ధర్మశాస్త్రంలో రాజులకు ఆజ్ఞ ఇవ్వబడింది. (ద్వితీ. 17:17) కానీ సొలొమోను ఆ ఆజ్ఞకు లోబడకుండా 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్నులను పెళ్లి చేసుకున్నాడు. వాళ్లలో చాలామంది అబద్ధ దేవుళ్లను ఆరాధించేవాళ్లు. (1 రాజు. 11:1-3) సొలొమోను బహుశా “నాకు ఏం కాదులే” అని అనుకుని ఉంటాడు. ఏదేమైనా సమయం గడుస్తున్న కొద్దీ యెహోవాకు లోబడకపోవడం వల్ల సొలొమోను చెడు పర్యవసానాల్ని అనుభవించాడు.—1 రాజు. 11:9-13.
13. యేసు చూపించిన వినయం గురించి లోతుగా ఆలోచించడం ద్వారా మనమేం నేర్చుకోవచ్చు?
13 యేసు తన గురించి తాను సరైన అభిప్రాయం కలిగివున్నాడు అలాగే వినయం చూపించాడు. ఆయన భూమ్మీదికి రాకముందు యెహోవాతోపాటు ఎన్నో గొప్ప పనులు చేశాడు. ఆయన ద్వారానే ‘అటు పరలోకంలో ఇటు భూమ్మీద అన్నీ సృష్టించబడ్డాయి.’ (కొలొ. 1:16) ఆయన బాప్తిస్మం తీసుకున్నప్పుడు తన తండ్రితో కలిసి చేసిన పనులన్నీ ఆయనకు గుర్తొచ్చి ఉంటాయి. (మత్త. 3:16; యోహా. 17:5) కానీ దాన్నిబట్టి యేసు గర్వం చూపించలేదు, అందరికన్నా తానే గొప్ప అన్నట్టు కూడా ప్రవర్తించలేదు. బదులుగా, తాను ‘ఇతరులతో సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ ఇతరులకు సేవచేయడానికి, ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చానని’ శిష్యులకు చెప్పాడు. (మత్త. 20:28) అంతేకాదు తనంతట తానే ఏ పనీ చేయలేనని ఆయన వినయంగా ఒప్పుకున్నాడు. (యోహా. 5:19) యేసు చూపించిన వినయం మనందరికీ గొప్ప ఆదర్శంగా ఉంది.
14. మన గురించి మనం సరిగ్గా ఆలోచించడానికి యేసు చెప్పిన మాటల నుండి ఏం నేర్చుకోవచ్చు?
14 తన అనుచరులు తమ గురించి తాము సరిగ్గా ఆలోచించాలని యేసు నేర్పించాడు. అందుకే ఒక సందర్భంలో వాళ్లకు భరోసా ఇస్తూ ఇలా అన్నాడు: “మీ తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా ఆయనకు తెలుసు.” (మత్త. 10:30) ఒకవేళ మనం దేనికీ పనికిరామని అనుకుంటుంటే, ఈ మాటలు మనకు ఎంతో ఓదార్పునిస్తాయి. ఈ లేఖనాన్ని బట్టి మన పరలోక తండ్రి మనల్ని పట్టించుకుంటున్నాడని, ఆయనకు మనం విలువైనవాళ్లమని అర్థమౌతుంది. ఒకసారి ఆలోచించండి, తనను ఆరాధించేలా యెహోవా మనల్ని అనుమతిస్తున్నాడు. అలాగే, కొత్తలోకంలో శాశ్వతకాలం జీవించడానికి మనకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాడు. అలాంటప్పుడు మన గురించి మనం తక్కువగా అనుకుంటే, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టినట్టు అవుతుంది. అందుకే మనమెప్పుడూ అలా ఆలోచించకూడదు.
15. (ఎ) మన గురించి మనం ఎలా ఆలోచించాలని ఒక కావలికోట ప్రోత్సహించింది? (బి) 24వ పేజీలోవున్న చిత్రాల్ని బట్టి మన గురించి మనం మరీ ఎక్కువగా ఆలోచించుకుంటే, ఎలాంటి ఆశీర్వాదాల్ని కోల్పోతాం?
15 మన గురించి మనం సరైన అభిప్రాయం కలిగివుండాలని, దాదాపు 15 సంవత్సరాల క్రితం ఒక కావలికోట ప్రోత్సహించింది. అందులో ఇలా ఉంది: “మనం గర్విష్ఠులు అయ్యేంతగా మన గురించి మనం ఎక్కువగా ఆలోచించుకోకూడదు. అలాగని మనం దేనికి పనికిరామని కూడా అనుకోకూడదు. బదులుగా మన గురించి సరైన అభిప్రాయం కలిగివుండడానికి మనం ప్రయత్నించాలి. దానర్థం మన బలాలు ఏంటో, బలహీనతలు ఏంటో మనకు తెలిసుండాలి. దీనిగురించి ఒక క్రైస్తవురాలు ఇలా అంటుంది: ‘నేను మరీ చెడ్డదాన్ని కాదు. అలాగని అందరికన్నా మంచిదాన్ని కాదు. అందరిలాగే నాలో కూడా బలాలు, బలహీనతలున్నాయి.’” c కాబట్టి, మన గురించి మనం సరిగ్గా ఆలోచించడం నేర్చుకుంటే మనకే మంచిదని అర్థంచేసుకోవచ్చు.
16. యెహోవా మనకు తెలివైన సలహాలు ఎందుకు ఇస్తున్నాడు?
16 యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే తన వాక్యం ద్వారా ఆయన మనకు తెలివైన సలహాలు ఇస్తున్నాడు. (యెష. 48:17, 18) మన జీవితంలో యెహోవాకు మొదటిస్థానం ఇవ్వడం ద్వారా గొప్ప సంతోషాన్ని పొందవచ్చు. అలా చేయడమే తెలివైనపని. కొంతమంది డబ్బు విషయంలో, పని విషయంలో లేదా తమ గురించి తాము ఆలోచించుకునే విషయంలో సరైన అభిప్రాయం కలిగి ఉండకపోవడం వల్ల ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. కానీ మనం యెహోవాకు మొదటిస్థానం ఇస్తే అలాంటి సమస్యల్ని తప్పించుకుంటాం. కాబట్టి మనలో ప్రతీఒక్కరం తెలివిగా నడుచుకుంటూ యెహోవా హృదయాన్ని సంతోషపెట్టాలని నిశ్చయించుకుందాం.—సామె. 23:15.
పాట 94 దేవుని వాక్యం పట్ల కృతజ్ఞత
a సొలొమోను, యేసు ఎంతో తెలివైనవాళ్లు. వాళ్లకు ఆ తెలివి యెహోవా నుండి వచ్చింది. అందుకే వాళ్లిద్దరూ డబ్బు విషయంలో, పని విషయంలో, మన గురించి మనం ఆలోచించుకునే విషయంలో ఎన్నో తెలివైన సలహాలు ఇచ్చారు. మనందరం ఈ విషయాల్లో సరైన అభిప్రాయం కలిగివుండడానికి ఆ సలహాల నుండి ఏం నేర్చుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అలాగే ఈ మూడు విషయాల్లో బైబిలు ఇచ్చిన తెలివైన సలహాల్ని పాటించడం వల్ల, మన తోటి సహోదర సహోదరీలు ఎలా ప్రయోజనం పొందారో కూడా తెలుసుకుంటాం.
b 2015 ఫిబ్రవరి 1, కావలికోటలోని (ఇంగ్లీషు) “కష్టపడి పనిచేయడాన్ని ఎలా ఆనందించవచ్చు?” అనే ఆర్టికల్ చూడండి.
c 2005 ఆగస్టు 1, కావలికోటలో “ఆనందాన్ని పొందడానికి బైబిలు మీకు సహాయం చేయగలదు” అనే ఆర్టికల్ చూడండి.
d చిత్రాల వివరణ: ఒకే సంఘంలో జాన్, టామ్ అనే ఇద్దరు యౌవన సహోదరులు ఉన్నారు. జాన్ ఎక్కువ సమయం తన కారును జాగ్రత్తగా చూసుకోవడానికి ఉపయోగిస్తున్నాడు. మరోవైపు టామ్ ఇతరుల్ని ప్రీచింగ్‌కు, మీటింగ్‌కు తీసుకెళ్లడానికి తన కారును ఉపయోగిస్తున్నాడు.
e చిత్రాల వివరణ: జాన్ తన బాస్‌ను మెప్పించాలని అనుకుంటున్నాడు. కాబట్టి ఓవర్ టైమ్ చేయమని ఎప్పుడు అడిగినా దానికి ఒప్పుకుని పనిచేస్తున్నాడు. సంఘ పరిచారకుడైన టామ్ మాత్రం, అదేరోజు సాయంత్రం ఒక పెద్దతో కలిసి కాపరి సందర్శనానికి వెళ్లాడు. యెహోవా ఆరాధనకు సంబంధించిన పనుల్ని చేయడానికి కొన్ని సాయంత్రాల్ని పక్కనపెడతానని టామ్ తన బాస్‌కు ముందే వివరించాడు.
f చిత్రాల వివరణ: జాన్ తన గురించే ఎక్కువ ఆలోచించుకుంటున్నాడు. మరోవైపు టామ్, తన జీవితంలో యెహోవాకే మొదటిస్థానం ఇస్తున్నాడు. దానివల్ల సమావేశ హాలుని మరమ్మతు చేసే పనిలో సహాయం చేస్తున్నప్పుడు కొత్త ఫ్రెండ్స్‌ని సంపాదించుకుంటున్నాడు.