కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 22

“పవిత్ర మార్గం”లో మన ప్రయాణం

“పవిత్ర మార్గం”లో మన ప్రయాణం

“ఒక రాజమార్గం, . . . పవిత్ర మార్గం అనే దారి ఉంటుంది.”యెష. 35:8.

పాట 31 దేవునితో నడవండి!

ఈ ఆర్టికల్‌లో … a

1-2. బబులోనులో ఉంటున్న యూదులు ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి? (ఎజ్రా 1:2-4)

 దాదాపు 70 ఏళ్లుగా బబులోనులో బందీలుగా ఉన్న యూదులు, తమ స్వదేశమైన ఇశ్రాయేలుకు తిరిగెళ్లొచ్చు అనే ఆజ్ఞను రాజు జారీచేశాడు. (ఎజ్రా 1:2-4 చదవండి.) దీనికి కారణం యెహోవా మాత్రమే. ఎందుకలా చెప్పవచ్చు? ఎందుకంటే, బందీలను విడుదల చేసినట్టు బబులోను చరిత్రలోనే లేదు. (యెష. 14:4, 17) కానీ కొత్త రాజు బబులోనును చేజిక్కిచ్చుకున్న తర్వాత, యూదులు తమ స్వదేశానికి తిరిగెళ్లొచ్చని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు యూదులు ముఖ్యంగా, కుటుంబ పెద్దలు బబులోనును విడిచివెళ్లాలా లేదా అక్కడే ఉండాలా అని నిర్ణయించుకోవాల్సి ఉంది. ఆ నిర్ణయం తీసుకోవడం అంత తేలికేమీ కాదు. ఎందుకో ఇప్పుడు చూద్దాం.

2 ముసలివాళ్లు అంత దూరం ప్రయాణించడానికి ఓపిక, శక్తి లేక ఆగిపోయి ఉంటారు. కొంతమంది యూదులేమో, అక్కడే పుట్టిపెరిగారు కాబట్టి అదే వాళ్ల సొంత దేశం అయిపోయింది. వాళ్ల దృష్టిలో ఇశ్రాయేలు అంటే వాళ్ల తాతముత్తాతలది. ఇంకొంతమంది యూదులకు, వ్యాపారంలో బాగా చేయి తిరగడంతో ఆస్తిపాస్తుల్ని వెనకేసుకుని ఉంటారు, సౌకర్యవంతమైన ఇళ్లు కట్టుకుని ఉంటారు. కాబట్టి వాటన్నిటిని వదిలేసి తెలియని దేశానికి వెళ్లాలంటే వాళ్లకు మనసు రాలేదు.

3. నమ్మకమైన యూదుల కోసం ఏ దీవెన వేచి ఉంది?

3 కానీ నమ్మకమైన యూదుల మనసు వేరేవాటి మీద ఉంది. వాళ్లు ఇశ్రాయేలు దేశంలో పొందబోయే దీవెనలతో పోలిస్తే వాళ్లు చేసే త్యాగాలు రవ్వంతలా కనిపించాయి. వాళ్లు పొందే గొప్ప దీవెన ఏంటంటే, వాళ్లు చేసే ఆరాధనే. ఎందుకంటే, బబులోను దేశంలో అన్య దేవతలకు 50 కన్నా ఎక్కువ దేవాలయాలు ఉంటే యెహోవాకు మాత్రం ఒకటి కూడా లేదు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇశ్రాయేలీయులు బలులు అర్పించడానికి బలిపీఠం గానీ, యాజక ఏర్పాటు గానీ లేదు. దానికితోడు యెహోవాను గానీ, ఆయన ప్రమాణాల్ని గానీ లెక్కచేయని ప్రజల మధ్య, యెహోవా ప్రజల్ని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. కాబట్టి వేలల్లో ఉన్న దైవభక్తిగల యూదులు తమ స్వదేశానికి తిరిగెళ్లి, సత్యారాధనను మళ్లీ మొదలుపెట్టాలని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

4. ఇశ్రాయేలుకు తిరిగొస్తున్న యూదులకు యెహోవా ఏమని మాటిచ్చాడు?

4 బబులోను నుండి ఇశ్రాయేలుకు ప్రయాణం అంత తేలికైందేమి కాదు. దానికి దాదాపు నాలుగు నెలలు పడుతుంది. కానీ అలా తిరిగివచ్చే వాళ్ల దారిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చేస్తానని యెహోవా మాటిచ్చాడు. యెషయా ఇలా చెప్పాడు: “యెహోవా మార్గాన్ని సిద్ధం చేయండి! మన దేవుని కోసం ఎడారి గుండా తిన్నని రాజమార్గాన్ని ఏర్పాటు చేయండి. . . . గరుకైన నేల చదును చేయబడాలి, ఎత్తుపల్లాలు ఉన్న నేల లోయ మైదానంగా చేయబడాలి.” (యెష. 40:3, 4) అలాంటి దారిలో మీరే ప్రయాణిస్తునట్టు ఊహించుకోండి. ఎడారిగుండా తిన్నని రాజమార్గం లేదా రహదారి. పర్వతాల మధ్య చదును చేయబడిన నేల. అలాంటి దారిలో ప్రయాణించడం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో కదా! ఎత్తుపల్లాలు లేకుండా, కొండలు లోయలు లేకుండా తిన్నగా ఉండే రహదారిలో ప్రయాణించడం చాలా సుఖంగా ఉంటుంది. అలాగే తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకోవచ్చు.

5. బబులోనుకు, ఇశ్రాయేలుకు మధ్య ఉన్న సూచనార్థక రహదారి పేరేంటి?

5 ఈరోజుల్లో చాలా రహదారులకు పేర్లు గానీ, నంబర్లు గానీ ఉంటాయి. యెహోవా యెషయా ద్వారా చెప్పిన రహదారికి కూడా ఒక పేరుంది. దానిగురించి మనం ఇలా చదువుతాం: “ఒక రాజమార్గం ఉంటుంది, అవును, పవిత్ర మార్గం అనే దారి ఉంటుంది. అపవిత్రులు దానిలో ప్రయాణించరు.” (యెష. 35:8) ఈ మాటలు అప్పుడున్న ఇశ్రాయేలీయులకు ఎలా వర్తించాయి? నేడు మనకు ఎలా వర్తిస్తాయి?

“పవిత్ర మార్గం”—అప్పుడు, ఇప్పుడు

6. ఈ రహదారిని పవిత్ర మార్గం అని ఎందుకు పిలిచారు?

6 “పవిత్ర మార్గం.” ఒక రహదారికి ఇంతకుమించి మంచిపేరు పెట్టగలమా? ఇంతకీ ఆ మార్గాన్ని పవిత్రం అని ఎందుకు అన్నారు? ఇశ్రాయేలుకు తిరిగొస్తున్న వాళ్లల్లో ‘అపవిత్రమైనవాళ్లు’ ఎవ్వరూ ఉండరు. అంటే అనైతికత, విగ్రహారాధన లేదా ఇంకేమైనా ఘోరమైన పాపాలు చేసేవాళ్లకు ఆ రహదారిలో అడుగుపెట్టే అర్హత లేదు. తిరిగి వస్తున్న యూదులు, దేవునికి ‘పవిత్రమైన ప్రజలుగా’ ఉంటారు. (ద్వితీ. 7:6) అంటే దానర్థం వాళ్లు పవిత్రులని, యెహోవాను సంతోషపెట్టడానికి వాళ్లు ఇంకే మార్పులు చేసుకోవాల్సిన అవసరంలేదని కాదు.

7. యూదులు ఏమేం మార్పులు చేసుకోవాలి? ఒక ఉదాహరణతో చెప్పండి.

7 ముందే చెప్పినట్టు, చాలామంది యూదులు బబులోనులోనే పుట్టిపెరిగారు కాబట్టి అక్కడి పద్ధతులు, అలవాట్లు వాళ్లల్లో నాటుకుపోయి ఉండవచ్చు. యూదుల్లోని మొదటి గుంపు ఇశ్రాయేలుకు తిరిగొచ్చిన దశాబ్దాల తర్వాత, కొంతమంది యూదులు అన్యుల్ని పెళ్లి చేసుకున్నారని ఎజ్రా తెలుసుకున్నాడు. (నిర్గ. 34:15, 16; ఎజ్రా 9:1, 2) ఆ తర్వాత, ఇశ్రాయేలులో పుట్టిన పిల్లలకు యూదుల భాష కూడా రాదని అధిపతైన నెహెమ్యా తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. (ద్వితీ. 6:6, 7; నెహె. 13:23, 24) అప్పట్లో దేవుని వాక్యం హీబ్రూ భాషలోనే రాయబడింది. కాబట్టి అక్కడ పుట్టిన పిల్లలకు ఆ భాషే రాకపోతే వాళ్లు యెహోవాను ప్రేమించడం, ఆయన్ని ఆరాధించడం ఎలా నేర్చుకుంటారు? (ఎజ్రా 10:3, 44) అందుకే, యూదులు పెద్దపెద్ద మార్పులే చేసుకోవాల్సి వచ్చింది. అయితే, వాళ్లు ఇశ్రాయేలులోనే ఉన్నారు కాబట్టి ఆ మార్పులు చేసుకోవడం తేలికైంది. ఎందుకంటే మెల్లమెల్లగా సత్యారాధన మళ్లీ గాడిలో పడుతుంది.—నెహె. 8:8, 9.

1919 నుండి లక్షలమంది స్త్రీలు, పురుషులు, పిల్లలు అబద్ధమత సామ్రాజ్యమైన మహా బబులోనును విడిచిపెట్టి “పవిత్ర మార్గం”లో ప్రయాణించడం మొదలుపెట్టారు (8వ పేరా చూడండి)

8. అప్పుడెప్పుడో జరిగిన సంఘటనలకు ఇప్పుడు మనకేంటి సంబంధం? (కవర్‌ పేజీ మీదున్న చిత్రం చూడండి.)

8 ‘అది వినడానికి బాగానే ఉన్నా, అప్పుడు యూదులకు జరిగినదానికి, ఇప్పుడు మనకు ఏంటి సంబంధం?’ అని కొంతమంది అనుకోవచ్చు. అయితే సంబంధం ఉంది. ఎందుకంటే మనం కూడా ‘పవిత్ర మార్గంలో’ ప్రయాణిస్తున్నాం. మనం అభిషిక్తులమైనా లేదా వేరే గొర్రెలమైనా ఆ ‘పవిత్ర మార్గంలోనే’ ఉండాలి. ఎందుకంటే అది మనల్ని ఆధ్యాత్మిక పరదైసు గుండా కొత్తలోకంలో పొందే ఆశీర్వాదాలవైపు నడిపిస్తుంది. b (యోహా. 10:16) 1919 నుండి లక్షలమంది స్త్రీలు, పురుషులు, పిల్లలు అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోనును విడిచిపెట్టి, ఆ దారిలో ప్రయాణించడం మొదలుపెట్టారు. వాళ్లల్లో మీరు కూడా ఒకరై ఉంటారు. అయితే ఆ దారి 100 సంవత్సరాల క్రితమే తెరుచుకున్నా, ఆ రహదారిని సిద్ధం చేసే పని చాలా సంవత్సరాల క్రితమే మొదలైంది.

దారిని సిద్ధం చేయడం

9. యెషయా 57:14 లో ఉన్న ‘పవిత్ర మార్గానికి’ దారి సిద్ధమైందని ఎలా చెప్పవచ్చు?

9 బబులోనును విడిచి వచ్చిన యూదుల దారిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా యెహోవా చూసుకున్నాడు. (యెషయా 57:14 చదవండి.) మరి ఈరోజుల్లో “పవిత్ర మార్గం” సంగతేంటి? 1919 కన్నా చాలా సంవత్సరాల ముందే, మహాబబులోను నుండి బయటికి వచ్చే దారిని చదును చేయడానికి యెహోవా దైవభక్తిగల పురుషుల్ని ఉపయోగించుకున్నాడు. (యెషయా 40:3 తో పోల్చండి.) వాళ్లు ఆ దారిని చదును చేయడానికి అవసరమైన పనులు అంటే సత్యం వైపుకు వెళ్లే దారిని సిద్ధం చేశారు. దానివల్ల సరైన హృదయస్థితి గలవాళ్లు మహాబబులోనును విడిచిపెట్టి, ఆధ్యాత్మిక పరదైసులో అడుగుపెట్టగలిగారు. అలా గాడిలోపడిన సత్యారాధనవల్ల వాళ్లు యెహోవాను ఆరాధించగలిగారు. మరి “దారిని” సిద్ధం చేయడానికి ఏమేం చేశారు? వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.

వందల సంవత్సరాలుగా, దైవభక్తిగల పురుషులు అబద్ధమతాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చే దారిని సిద్ధం చేశారు (10-11 పేరాలు చూడండి)

10-11. ఎక్కువమంది బైబిలు జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ముద్రించే, అనువదించే పని ఎలా సహాయపడ్డాయి? (చిత్రం కూడా చూడండి.)

10 ముద్రించడం. దాదాపు 1450 వరకు బైబిళ్లను చేత్తో రాసి, కాపీలుగా తయారుచేసేవాళ్లు. చేత్తో రాయడం వల్ల ఆ పనికి చాలా టైం పట్టేది. అలాగే ఆ కాపీలు చాలా తక్కువగా దొరికేవి. ఒకవేళ దొరికినా చాలా ఖరీదు ఉండేవి. కానీ ప్రింటింగ్‌ మిషన్‌ వచ్చిన తర్వాత బైబిల్ని ముద్రించడం, పంచిపెట్టడం మరింత తేలికైంది.

11 అనువదించడం. శతాబ్దాలుగా బైబిలు లాటిన్‌ భాషలోనే ఉండేది. బాగా చదువుకున్నవాళ్లే ఆ భాషను అర్థం చేసుకోగలిగేవాళ్లు. అయితే, ముద్రించే పని బాగా ప్రాచుర్యం చెందినప్పుడు దైవభక్తిగల కొంతమంది, మామూలు ప్రజలు మాట్లాడే భాషలోకి బైబిల్ని అనువదించడాన్ని ముమ్మరం చేశారు. దానివల్ల పాస్టర్లు చెప్పేవి నిజంగా బైబిల్లో ఉన్నాయో లేవో ప్రజలు పోల్చి చూసుకోగలిగారు.

దైవభక్తిగల పురుషులు అబద్ధమతాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చే దారిని సిద్ధం చేశారు (12-14 పేరాలు చూడండి) c

12-13. చర్చీ అబద్ధ బోధల్ని 1835 మధ్యకాలంలో బైబిల్ని అధ్యయనం చేసిన కొంతమంది ఎలా బట్టబయలు చేశారో ఒక ఉదాహరణ చెప్పండి.

12 బైబిలు అధ్యయనం కోసం పనిముట్లు. బైబిల్ని శ్రద్ధగా అధ్యయనం చేసే కొంతమంది బైబిలు నుండి ఎంతో నేర్చుకున్నారు. అలా వాళ్లు నేర్చుకోవడమే కాదు నేర్చుకున్నవాటిని ఇతరులకు కూడా చెప్పారు. అప్పుడు పాస్టర్లకు అది మింగుడుపడలేదు. ఉదాహరణకు, దాదాపు 1835 మధ్యకాలంలో చర్చీ అబద్ధ బోధల్ని బట్టబయలు చేయడానికి కొన్ని కరపత్రాల్ని బైబిలు విద్యార్థులు పంచిపెట్టారు.

13 అదే సంవత్సరంలో, దైవభక్తి ఉన్న హెన్రీ గ్రూ అనే వ్యక్తి, చనిపోయినవాళ్ల పరిస్థితి గురించి ఒక కరపత్రాన్ని తయారుచేశాడు. అందులో ఆయన అమర్త్యత అనేది దేవుడిచ్చిన బహుమానం అని, చాలా చర్చీలు బోధిస్తున్నట్లు అది పుట్టుకతో వచ్చేది కాదని లేఖనాల ద్వారా నిరూపించాడు. 1837 లో జార్జ్‌ స్టొర్స్‌ అనే పరిచారకుడికి ఆ కరపత్రం ట్రైన్‌లో దొరికింది. ఆయన దాన్ని చదివిన తర్వాత, బైబిల్లోని ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని తెలుసుకున్నాడని బలంగా నమ్మాడు. ఆ తర్వాత దానిగురించి వేరేవాళ్లకు కూడా చెప్పాలనుకున్నాడు. 1842​లో ఆయన “ఒక అన్వేషణ—దుష్టులు అమర్త్యులా?” అనే అంశంతో వేర్వేరు చోట్ల ప్రసంగాలు ఇచ్చాడు. జార్జ్‌ స్టొర్స్‌ రాసిన చాలా పుస్తకాలు ఛార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌ అనే యువకుడి మీద చెరగని ముద్ర వేశాయి.

14. ముందు తరంవాళ్లు చేసిన పని నుండి బ్రదర్‌ రస్సెల్‌ అలాగే ఆయన్ని అంటిపెట్టుకున్నవాళ్లు ఎలా ప్రయోజనం పొందారు? (చిత్రం కూడా చూడండి.)

14 గతంలో అబద్ధమతాన్ని విడిచిపెట్టి, సత్యంలోకి వచ్చే దారిని సిద్ధం చేసిన పని నుండి బ్రదర్‌ రస్సెల్‌ అలాగే ఆయన్ని అంటిపెట్టుకున్నవాళ్లు ఎలా ప్రయోజనం పొందారు? వాళ్లు ఒక్కో లేఖనాన్ని పరిశీలిస్తున్నప్పుడు, వాళ్ల ముందు తరంవాళ్లు తయారుచేసిన డిక్షనరీల్ని, పదకోశాన్ని, వేర్వేరు బైబిలు అనువాదాల్ని చూడగలిగారు. అలాగే హెన్రీ గ్రూ, జార్జ్‌ స్టొర్స్‌, మరితరులు చేసిన బైబిలు పరిశోధన నుండి వీళ్లు ప్రయోజనం పొందారు. అలా బ్రదర్‌ రస్సెల్‌ అలాగే ఆయన్ని అంటిపెట్టుకున్నవాళ్లు బైబిలు బోధలకు సంబంధించిన ఎన్నో పుస్తకాల్ని, కరపత్రాల్ని తయారుచేసి, సత్యంవైపుకు వెళ్లే దారిని ఇంకా చదును చేశారు.

15. 1919 నుండి ఏ సంఘటనలు మొదలయ్యాయి?

15 1919 లో మహాబబులోను, దేవుని ప్రజల మీద తనకున్న పట్టు కోల్పోయింది. అదే సంవత్సరం “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” తెరమీదికి వచ్చాడు. వచ్చీరాగానే కొత్తగా తెరుచుకున్న ‘పవిత్ర మార్గంలోకి’ సరైన హృదయ స్థితిగలవాళ్లకు స్వాగతం పలికాడు. (మత్త. 24:45-47) అయితే, గతంలో ఆ “దారిని” సిద్ధం చేసిన నమ్మకమైన పురుషుల వల్ల, ఆ రహదారిపై బుడిబుడి అడుగులు వేస్తున్న చాలామంది యెహోవా సంకల్పాల గురించి ఇంకా ఎక్కువ నేర్చుకోగలిగారు. (సామె. 4:18) అంతేకాదు, యెహోవా కోరుకున్నట్టు వాళ్ల జీవితాల్ని మార్చుకోగలిగారు. అయితే వాళ్లు ఉన్నపళంగా మార్పులు చేసుకోవాలని యెహోవా కోరుకోలేదు గానీ, మెల్లమెల్లగా ఆయన తన ప్రజల్ని మెరుగుదిద్దాడు. (“ యెహోవా మెల్లమెల్లగా తన ప్రజల్ని మెరుగుదిద్దుతూ వచ్చాడు” అనే బాక్సు చూడండి.) మనం చేసే ప్రతీ పని యెహోవా మనసును తాకినప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటామో కదా!—కొలొ. 1:10.

“పవిత్ర మార్గం” ఇంకా తెరిచే ఉంది

16. ‘పవిత్ర మార్గంలో’ 1919 నుండి ఏ మరమ్మతులు జరిగాయి? (యెషయా 48:17; 60:17)

16 ఏ రహదారికైనా అప్పుడప్పుడు మరమ్మతులు చేయాల్సి వస్తుంది. అలాగే ‘పవిత్ర మార్గానికి’ కూడా మరమ్మతులు అవసరమయ్యాయి. సాధ్యమైనంత ఎక్కువమంది మహాబబులోనును విడిచి వచ్చేలా, 1919 నుండి కొత్తగా స్థాపించిన నమ్మకమైన బుద్ధిగల దాసుడు బరిలోకి దిగాడు. దానికోసం 1921 లో కొత్తవాళ్లు బైబిలు సత్యాన్ని తెలుసుకునేలా, బైబిలు అధ్యయనం కోసం ఒక పనిముట్టును వాళ్లు తయారుచేశారు. అదే దేవుని వీణ. అది దాదాపు 36 భాషల్లో, అరవై లక్షల కాపీలు పంచిపెట్టబడ్డాయి. దానివల్ల చాలామంది సత్యం తెలుసుకున్నారు. అలాగే మొన్నటికిమొన్న కూడా, బైబిలు అధ్యయనం చేయడానికి ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే కొత్త పుస్తకం వచ్చింది. మనందరం ‘పవిత్రమైన మార్గంలో’ నడుస్తూ ఉండేలా, యెహోవా తన సంస్థను ఉపయోగించుకుని ఈ చివరి రోజుల్లో నిర్విరామంగా ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇస్తూనే ఉన్నాడు.—యెషయా 48:17; 60:17 చదవండి.

17-18. “పవిత్ర మార్గం” అనే రహదారి ఎక్కడికి తీసుకెళ్తుంది?

17 ఒక వ్యక్తి బైబిలు అధ్యయనం తీసుకోవడానికి ఒప్పుకుంటే, ‘పవిత్ర మార్గంలోకి’ అడుగుపెట్టే అవకాశం ఆయన తలుపు తట్టినట్టే అని చెప్పవచ్చు. కొంతమంది ఆ రహదారిలో కొంతదూరం వరకు ప్రయాణించి ఆగిపోతారు. కానీ ఇంకొంతమంది గమ్యం చేరేవరకు ప్రయాణిస్తూనే ఉండాలని అనుకుంటారు. ఇంతకీ ఆ గమ్యం ఏంటి?

18 పరలోక నిరీక్షణ ఉన్నవాళ్లను ఈ “పవిత్ర మార్గం” అనే రహదారి, పరలోకంలో ఉన్న ‘దేవుని పరదైసు’ అనే గమ్యానికి చేరుస్తుంది. (ప్రక. 2:7) భూనిరీక్షణ ఉన్నవాళ్లనైతే, వెయ్యేండ్ల తర్వాత వచ్చే పరిపూర్ణత అనే గమ్యానికి చేరుస్తుంది. ప్రస్తుతం మీరు ఆ రహదారిపై ఉంటే వెనక్కి తిరిగి చూడకండి. మీ గమ్యాన్ని చేరుకునేంతవరకు ప్రయాణిస్తూనే ఉండండి. మీరు “సురక్షితంగా” మీ గమ్యానికి చేరుకోవాలనేదే మా కోరిక.

పాట 24 యెహోవా పర్వతానికి రండి

a బబులోను నుండి ఇశ్రాయేలుకు వెళ్లే దారిని, యెహోవా “పవిత్రం మార్గం” అని అన్నాడు. అయితే, మన కాలంలో యెహోవా అలాంటి దారిని ఏదైనా సిద్ధం చేశాడా? అవును, చేశాడు. అలాగని ఎందుకు చెప్పవచ్చంటే, 1919 నుండి లక్షలమంది మహాబబులోనును వదిలేసి ‘పవిత్ర మార్గంలో’ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మన గమ్యాన్ని చేరేవరకు ఆగకుండా ఆ దారిలోనే ప్రయాణించాలి.

c చిత్రాల వివరణ: బ్రదర్‌ రస్సెల్‌ అలాగే ఆయన్ని అంటిపెట్టుకుని ఉన్నవాళ్లు, బైబిలు అధ్యయనం కోసం వాళ్ల ముందు తరంవాళ్లు తయారుచేసిన పనిముట్లను ఉపయోగించుకున్నారు.