కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 24

మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలరు!

మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలరు!

“మనం మానకుండా మంచిపనులు చేద్దాం; ఎందుకంటే, మనం అలసిపోకుండా ఉంటే సరైన సమయంలో పంట కోస్తాం.”గల. 6:9.

పాట 84 ముందుండి సేవచేద్దాం

ఈ ఆర్టికల్‌లో … a

1. చాలామందికి లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు ఏం అనిపిస్తుంది?

 యెహోవా సేవలో లక్ష్యాలు అంటే యెహోవాను ఇంకా బాగా ఆరాధించడానికి, ఆయన్ని సంతోషపెట్టడానికి మనం చేసే పనులు లేదా ప్రయత్నాలు. ఉదాహరణకు, పవిత్రశక్తి పుట్టించే ఒక లక్షణాన్ని మీరు పెంచుకోవాలని అనుకోవచ్చు. లేదా ఆరాధనలో భాగంగా ఉన్న బైబిలు చదవడం, వ్యక్తిగత అధ్యయనం, ప్రీచింగ్‌ చేయడం వంటివి కూడా ఇంకా బాగా చేయాలనే లక్ష్యం మీరు పెట్టుకోవచ్చు. మీరు ఆ లక్ష్యాల్ని పెట్టుకుని, వాటిని చేరుకోవడానికి ప్రయత్నించి-ప్రయత్నించి అలసిపోయారా? అయితే బాధపడకండి. అలా అనిపించేది మీ ఒక్కరికే కాదు. ఉదాహరణకు, ఫిలిప్‌ అనే బ్రదర్‌ ప్రార్థన ఇంకా బాగా చేయాలని, ఎక్కువసార్లు చేయాలని లక్ష్యం పెట్టుకున్నాడు. కానీ ఆయనకు ప్రార్థన చేయడానికి సమయమే దొరికేదికాదు. యెరికా అనే సిస్టర్‌ క్షేత్రసేవ కూటాలకు టైంకి వెళ్లాలనే లక్ష్యం పెట్టుకుంది. కానీ ఆమె లేటుగానే వెళ్లేది. థామస్‌ అనే బ్రదర్‌ చాలాసార్లు, బైబిలంతా చదవాలని అనుకున్నాడు. కానీ ఆయన ఇలా చెప్తున్నాడు: “బైబిలు చదవడం అంటే నాకు బోర్‌ కొడుతుంది. మూడుసార్లు దాన్ని ప్రయత్నించాను గానీ ప్రతీసారి, లేవీయకాండం వరకు వచ్చి ఆగిపోయేవాణ్ణి.”

2. ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, దాన్ని సాధించాలని ప్రయత్నించి విఫలం కావడం నేరం కాదని ఎలా చెప్పవచ్చు?

2 ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, దాన్ని సాధించాలని ప్రయత్నించి విఫలం కావడం నేరం కాదు. చిన్న లక్ష్యాల్ని చేరుకోవడానికి కూడా సమయం, కృషి అవసరం. నిజానికి, లక్ష్యాన్ని చేరుకోవడానికి అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటే యెహోవాతో మీకున్న బంధాన్ని విలువైనదిగా చూస్తున్నారని, ఆయన కోసం మీరు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారని అది చూపిస్తుంది. మీరు చేసే ప్రతీ ప్రయత్నాన్ని యెహోవా విలువైనదిగా ఎంచుతున్నాడు. అయితే, మీ శక్తికి మించి లక్ష్యాలు పెట్టుకోవాలని యెహోవా ఆశించట్లేదు. (కీర్త. 103:14; మీకా 6:8) కాబట్టి మీ పరిస్థితుల మేరకు, అసాధ్యమైన వాటిని సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నామా అని ఆలోచించుకోవాలి. అయితే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, దాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు కొన్ని సలహాలు చూద్దాం.

లక్ష్యం చేరుకోవాలనే తపన

ఇంకా ఎక్కువ తపన కోసం ప్రార్థన చేయండి (3-4 పేరాలు చూడండి)

3. లక్ష్యం చేరుకోవాలంటే తపన ఎందుకు ప్రాముఖ్యం?

3 లక్ష్యాలు చేరుకోవాలంటే తపన ఉండడం చాలా ప్రాముఖ్యం. తపన ఉంటే ఒక వ్యక్తి గమ్యం వైపు అడుగులు వేస్తాడు. ఈ తపనను, ఒక పడవ ముందుకెళ్లడానికి సహాయం చేసే గాలితో పోల్చవచ్చు. ఆ గాలి వల్ల పడవ నడిపే వ్యక్తి సులువుగా గమ్యాన్ని చేరుకోగలుగుతాడు. అదే గాలి బలంగా వీస్తే, ఇంకా త్వరగా చేరుకోగలుగుతాడు. అదేవిధంగా, మీలో ఎంతెక్కువ తపన ఉంటే, మీ లక్ష్యాన్ని చేరుకోవడం అంతెక్కువ సులువౌతుంది. ఎల్‌ సెల్విడార్‌లో ఉంటున్న డేవిడ్‌ అనే ఒక బ్రదర్‌ ఇలా అంటున్నాడు: “లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన మీలో ఉంటే దానికోసం మీరు బాగా కష్టపడతారు. కాబట్టి మనం సాధించాలనుకునే దానికోసం గట్టిగా ప్రయత్నిస్తే మీ విజయాన్ని ఈ ప్రపంచంలో ఏదీ ఆపలేదు.” ఇంతకీ మీలో ఆ తపన పెరగాలంటే ఏమేం చేయాలి?

4. మనం దేనికోసం ప్రార్థించవచ్చు? (ఫిలిప్పీయులు 2:13) (చిత్రం కూడా చూడండి.)

4 తపన కోసం ప్రార్థన చేయండి. అలా చేస్తే, గమ్యం చేరుకోవాలనే తపన మీలో కలిగేలా యెహోవా తన పవిత్రశక్తి ద్వారా చేయగలడు. (ఫిలిప్పీయులు 2:13 చదవండి.) కొన్నిసార్లు, ఏదోక లక్ష్యం పెట్టుకోవాలి కదా అని మనం పెట్టుకుంటాం. ఒకవిధంగా అది మంచిదే, కానీ దాన్ని చేరుకోవాలనే తపన మనలో ఉండకపోవచ్చు. ఉగాండాలో ఉంటున్న నోరిన అనే ఒక సిస్టర్‌ విషయంలో కూడా అదే జరిగింది. బైబిలు స్టడీ చేయాలనే లక్ష్యం ఆమె పెట్టుకుంది. కానీ ఆమె సరిగ్గా బోధించలేను అని అనుకోవడంవల్ల ఆమెలో తపన లేదు. మరి ఆమెకు ఏం సహాయం చేసింది? ఆమె ఇలా అంటుంది: “బైబిలు స్టడీ చేయాలనే తపన నాలో పెట్టమని యెహోవాను ప్రతీరోజు అడిగేదాన్ని. దాంతోపాటు నా బోధనా నైపుణ్యాల్ని పెంచుకున్నాను. అలా చేసిన కొద్ది నెలలకే నాలో తపన పెరగడం గమనించాను. అదే సంవత్సరంలో రెండు బైబిలు స్టడీల్ని కూడా మొదలుపెట్టగలిగాను.”

5. మనలో తపన పెరగాలంటే దేనిగురించి ఆలోచించాలి?

5 యెహోవా మీకోసం చేసిన వాటిగురించి ఆలోచించండి. (కీర్త. 143:5) అపొస్తలుడైన పౌలు యెహోవా ఆయనపట్ల చూపించిన అపారదయ గురించి ఆలోచించాడు. దానివల్ల యెహోవా సేవ కోసం ఇంకా ఎక్కువ కష్టపడాలని తపించాడు. (1 కొరిం. 15:9, 10; 1 తిమో. 1:12-14) అదేవిధంగా, యెహోవా మీకోసం చేసిన వాటిగురించి ఎంతెక్కువ ఆలోచిస్తే, లక్ష్యం చేరుకోవాలనే తపన మీలో అంతెక్కువ పెరుగుతుంది. (కీర్త. 116:12) హోండురస్‌లో ఉంటున్న ఒక సిస్టర్‌ క్రమపయినీరు అవ్వాలనే లక్ష్యం పెట్టుకున్నప్పుడు, ఆమెకు ఏం సహాయం చేసిందో చెప్తూ ఇలా అంటుంది: “నేనంటే యెహోవాకు ఎంత ఇష్టమో ఆలోచించాను. ఆయన తన కుటుంబాన్ని నాకు పరిచయం చేశాడు. ఆయన నా గురించి పట్టించుకున్నాడు, నన్ను కాపాడాడు. అలా ఆలోచించడంవల్ల నాకు ఆయన మీదున్న ప్రేమ, పయినీరు అవ్వాలనే నా తపన రెండూ పెరిగాయి.”

6. మీలో లక్ష్యం చేరుకోవాలనే తపన పెరగడానికి ఇంకా ఏం చేయవచ్చు?

6 లక్ష్యం చేరుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాల మీద మనసుపెట్టండి. మొదట్లో చెప్పిన యెరికా అనే సిస్టర్‌, క్షేత్రసేవ కూటాలకు టైంకు వెళ్లడానికి తనకు ఏం సహాయం చేసిందో చెప్తూ ఇలా అంటుంది: “క్షేత్రసేవ కూటాలకు లేటుగా వెళ్లడంవల్ల నేను ఏం కోల్పోయానో ఆలోచించాను. త్వరగా వెళ్తే బ్రదర్స్‌, సిస్టర్స్‌ని పలకరించవచ్చు. వాళ్లతో సమయం గడపవచ్చు. అలాగే ప్రీచింగ్‌ని ఇంకా బాగా చేయడానికి, ఆనందించడానికి ఉపయోగపడే కొన్ని సలహాలు తెలుసుకోవచ్చు.” యెరికా టైంకి వెళ్లడంవల్ల వచ్చిన ప్రయోజనాలు మీద మనసుపెట్టింది. దానివల్ల ఆమె తన లక్ష్యాన్ని చేరుకోగలిగింది. మరి మీరు ఏయే విషయాల మీద మనసుపెట్టవచ్చు? ఒకవేళ మీ లక్ష్యం బైబిలు చదవడం, ప్రార్థన చేయడమైతే దానివల్ల యెహోవాతో మీ బంధం ఎలా బలపడుతుందో ఆలోచించండి. (కీర్త. 145:18, 19) ఒకవేళ మీ లక్ష్యం, ఒక క్రైస్తవ లక్షణం పెంచుకోవడమైతే దానివల్ల ఇతరులతో మీ స్నేహం ఎలా పెరుగుతుందో ఆలోచించండి. (కొలొ. 3:14) వీలైతే మీ లక్ష్యం చేరుకోవడానికిగల కారణాలన్నీ రాసిపెట్టుకోండి. వాటిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి. మొదట్లో చెప్పిన థామస్‌ అనే బ్రదర్‌ ఇలా అంటున్నాడు: “లక్ష్యం చేరుకోవడానికి నా దగ్గర ఎన్ని కారణాలు ఉంటే, వాటిని చేరుకోవాలనే కసి నాలో అంత పెరుగుతుంది.”

7. జూలియో, ఆయన భార్యకు వాళ్ల లక్ష్యం చేరుకోవడానికి ఏం సహాయం చేసింది?

7 మీ లక్ష్యం చేరుకోమని భుజం తట్టేవాళ్లతో సమయం గడపండి. (సామె. 13:20) జూలియో, ఆయన భార్య అవసరం ఎక్కువున్న చోటుకు వెళ్లి సేవచేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. దానికి వాళ్లకు ఏం సహాయం చేసిందో చెప్తూ జూలియో ఇలా అంటున్నాడు: “మాలాంటి లక్ష్యాలు చేరుకున్నవాళ్లతో స్నేహం చేశాం. మా లక్ష్యాలు ఏంటో వాళ్లకు చెప్పిన తర్వాత మాకు అవసరమైన సలహాలు వాళ్లిచ్చారు. దాంతో మా లక్ష్యం వైపు అడుగులు వేయగలిగాం. అంతేకాదు, మా లక్ష్యం చేరుకోవడానికి మేము చేసే పనులు ఎక్కడి వరకు వచ్చాయో కూడా అడిగి తెలుసుకునేవాళ్లు. అవసరమైతే మా వెన్ను తట్టి ప్రోత్సహించేవాళ్లు.”

లక్ష్యం చేరుకోవాలనే తపన మీలో తగ్గిపోతే

లక్ష్యం వైపు అడుగులు వేయండి (8వ పేరా చూడండి)

8. తపన ఉంటేనే లక్ష్యం చేరుకుంటామా? వివరించండి. (చిత్రం కూడా చూడండి.)

8 నిజం చెప్పాలంటే, కొన్నిసార్లు మనలో తపన ఉండకపోవచ్చు. అంటే మన లక్ష్యం వైపు ఇక అడుగులు వేయలేమని దానర్థమా? కాదు. ఉదాహరణకు, గాలి బలంగా వీస్తే పడవ గమ్యానికి త్వరగా చేరుకోగలుగుతుంది. కొన్నిసార్లు గాలి బలంగా రావచ్చు, రాకపోవచ్చు. అంటే దానర్థం పడవ నడిపే వ్యక్తి ఇక గమ్యాన్ని చేరుకోలేడనా? కానేకాదు. కొన్ని పడవలకి మోటర్‌ లేదా చేత్తో నడిపే తెడ్లు ఉంటాయి. వాటితో పడవ నడిపే వ్యక్తి గమ్యాన్ని చేరుకోగలుగుతాడు. మనలో ఉండే తపన కూడా ఆ గాలి లాంటిదే. కొన్నిసార్లు మనలో ఆ తపన ఉండవచ్చు, ఉండకపోవచ్చు. తపన ఉంటేనే లక్ష్యాన్ని చేరుకుంటామని అనుకోకూడదు. బదులుగా, పడవ నడిపే వ్యక్తి వేర్వేరు మార్గాల్ని చూసుకున్నట్టే, మనం కూడా మన లక్ష్యాన్ని చేరుకోవడానికి వేర్వేరు మార్గాల్ని ఎంచుకోవాలి. అయితే అలా చేయడం అన్నిసార్లు అంత తేలికేం కాదు. దానికోసం మనకై మనం కొంత శిక్షణ ఇచ్చుకోవాలి. అలా చేస్తే మన లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అయితే, అదెలా చేయవచ్చో చూసే ముందు మనందరికి వచ్చే ఒక ప్రశ్న చూద్దాం.

9. లక్ష్యం చేసుకోవాలనే తపన లేకపోయినా దానివైపు అడుగులు వేయడం తప్పా? వివరించండి.

9 మనం ఆనందంగా, ఇష్టంగా తన సేవ చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు. (కీర్త. 100:2; 2 కొరిం. 9:7) అయితే, మనలో ఆ తపన లేకపోయినా మన లక్ష్యం వైపు అడుగులు వేయగలమా? పౌలు ఉదాహరణను గమనించండి. ఆయన ఇలా అంటున్నాడు: “నా శరీరాన్ని అదుపులో పెట్టుకుంటున్నాను, దాన్ని బానిసగా చేసుకుంటున్నాను.” (1 కొరిం. 9:25-27) యెహోవా కోరుకునేది చేయాలనే తపన కొన్నిసార్లు పౌలులో లేకపోయినా, దాన్ని చేయడానికి ఆయన పోరాడాడు. మరి ఆయన చేసినదాన్ని యెహోవా అంగీకరించాడా? సందేహమేలేదు. పౌలు చేసిన ప్రతీ ప్రయత్నాన్ని యెహోవా దీవించాడు.—2 తిమో. 4:7, 8.

10. లక్ష్యం చేరుకోవాలనే తపన మనలో లేకపోయినా, దానివైపు అడుగులు వేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి?

10 మనకు లక్ష్యం చేరుకోవాలనే తపన లేకపోయినా, దానివైపు అడుగులు వేసినప్పుడు యెహోవా సంతోషిస్తాడు. మనం చేసే పని కొన్నిసార్లు మనకు నచ్చకపోయినా, ఆయన మీద ప్రేమతో చేస్తున్నామని యెహోవాకు తెలుసు కాబట్టి సంతోషిస్తాడు. పౌలును దీవించినట్టే, మనం చేసే ప్రయత్నాన్ని కూడా యెహోవా దీవిస్తాడు. (కీర్త. 126:5) యెహోవా ఇచ్చే దీవెనల్ని రుచి చూశాక మనలో తపన మొదలవ్వవచ్చు. పోలండ్‌లో ఉంటున్న లూసియాన అనే ఒక సిస్టర్‌ ఇలా చెప్తుంది: “నేను బాగా అలసిపోయినప్పుడు నాకు ప్రీచింగ్‌కి వెళ్లాలనిపించదు. కానీ వెళ్లొచ్చాక ఆ ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేను.” అయితే, మనలో తపన తగ్గిపోతే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

11. ఆత్మనిగ్రహాన్ని పెంచుకోవడానికి యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడు?

11 ఆత్మనిగ్రహం కోసం ప్రార్థించండి. ఆత్మనిగ్రహం ఉంటే ఒక వ్యక్తి తన ఆలోచనల్ని, పనుల్ని అదుపులో ఉంచుకోగలుగుతాడు. సాధారణంగా ఈ ఆత్మనిగ్రహం అనే పదం, మనల్ని మనం చెడు చేయకుండా అదుపులో పెట్టుకోవడానికి వాడుతుంటారు. అయితే, దానికే కాదు మంచి చేయడానికి కూడా ఈ లక్షణం సహాయం చేస్తుంది. అంటే, ఒక పని బాగా కష్టంగా ఉన్నప్పుడు లేదా ఆ పని చేయాలనే తపన మనలో లేనప్పుడు ఈ లక్షణం మనల్ని ముందుకు నెడుతుంది. ఆత్మనిగ్రహం, పవిత్రశక్తి పుట్టించే ఒక లక్షణం కాబట్టి ఆ లక్షణం పెంచుకోవడానికి సహాయం చేయమని యెహోవాను అడుగుతూ ఉండాలి. (లూకా 11:13; గల. 5:22, 23) మొదట్లో చూసిన డేవిడ్‌ అనే బ్రదర్‌కి క్రమంగా వ్యక్తిగత అధ్యయనం చేయాలనే లక్ష్యం ఉండేది. దాన్ని చేరుకోవడానికి ప్రార్థన ఎలా సహాయం చేసిందో చెప్తూ ఆయన ఇలా అంటున్నాడు: “ఆత్మనిగ్రహం కోసం యెహోవాను అడుగుతూ వచ్చాను. ఆయన సహాయంతో నేను ఇప్పుడు ఒక మంచి వ్యక్తిగత అధ్యయనం చేస్తూ, దాన్ని కొనసాగిస్తున్నాను.”

12. ప్రసంగి 11:4 లో ఉన్న సలహా మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలా సహాయం చేస్తుంది?

12 పరిస్థితులన్నీ చక్కబడేంత వరకు వేచి చూడకండి. ఈ లోకంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో మనకు తెలీదు. ఒకవేళ పరిస్థితులు చక్కబడేంత వరకు మనం ఎదురుచూస్తే మన లక్ష్యాన్ని చేరుకోలేం. (ప్రసంగి 11:4 చదవండి.) డానియేల్‌ అనే ఒక బ్రదర్‌ ఇలా అంటున్నాడు: “ఈ లోకంలో చక్కని పరిస్థితులంటూ ఏవీలేవు. మనమే దాన్ని చక్కదిద్దుకుంటూ చిన్నచిన్న అడుగులేస్తూ ముందుకు సాగిపోవాలి.” ఉగాండాలో ఉంటున్న పాల్‌ అనే బ్రదర్‌ పనుల్ని ఎందుకు వాయిదా వేయకూడదో చెప్తూ ఇలా అంటున్నాడు: “మన లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టమైన పరిస్థితులు ఉన్నా, ముందుకు సాగుతుంటే మనల్ని దీవించడానికి యెహోవాకు ఒక కారణం ఇచ్చినవాళ్లమౌతాం.”—మలా. 3:10.

13. చిన్నచిన్న లక్ష్యాలు పెట్టుకోవడంవల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి?

13 చిన్నచిన్న లక్ష్యాలతో మొదలుపెట్టండి. బహుశా మీ లక్ష్యం పెద్దదవ్వడం వల్ల, మీలో తపన తగ్గిపోయి ఉండవచ్చు. ఒకవేళ మీ విషయంలో అదే నిజమైతే, చిన్నచిన్న లక్ష్యాలు పెట్టుకుంటూ పెద్ద లక్ష్యం చేరుకోండి. ఉదాహరణకు, ఒక లక్షణం పెంచుకోవడం మీ లక్ష్యమైతే, చిన్నచిన్న విషయాల్లో దాన్ని ఎలా చూపించవచ్చో ఆలోచించండి. లేదా బైబిలంతా చదవాలనేది మీ లక్ష్యమైతే, కొంచెంకొంచెంగా చదవడానికి ప్రయత్నించండి. మొదట్లో చూసిన థామస్‌ అనే బ్రదర్‌, ఒక్క సంవత్సరంలో బైబిల్ని పూర్తిగా చదివేలా లక్ష్యం పెట్టుకుని, దాన్ని చేరుకోవడానికి ఇబ్బందిపడ్డాడు. ఆయన ఇలా అంటున్నాడు: “ఎక్కువ అధ్యాయాలు గబగబ చదివేయాలని అనుకున్నాను. కానీ ఆ తర్వాత మొదట్నుంచి మొదలుపెట్టి ఒక అధ్యాయంలో కొంత భాగాన్ని ప్రతీరోజు చదివి, ధ్యానించాలని నిర్ణయించుకున్నాను. దానివల్ల ఇప్పుడు బైబిలు చదవడం నేను ఆనందిస్తున్నాను.” అలా థామస్‌కి బైబిలు చదవడం మీద ఇష్టం పెరిగేకొద్దీ, దాన్ని చదివే సమయం కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో మొత్తం బైబిల్ని పూర్తి చేయగలిగాడు. b

వెనకడుగు వేయాల్సి వస్తే డీలా పడిపోకండి

14. ఎలాంటి పరిస్థితులవల్ల వెనకడుగు వేయాల్సి రావచ్చు?

14 లక్ష్యం చేరుకోవాలనే తపన మనలో ఉన్నా లేదా దానికోసం మనకై మనం శిక్షణను ఇచ్చుకున్నా కొన్నిసార్లు వెనకడుగు వేయాల్సిరావచ్చు. ఉదాహరణకు “అనుకోని” పరిస్థితులవల్ల చేరుకోవాల్సిన లక్ష్యాలకు కాస్త సమయం పట్టవచ్చు. (ప్రసం. 9:11) కష్టమైన పరిస్థితులవల్ల డీలా పడిపోయి, మనలో శక్తి తగ్గిపోయినట్టు అనిపించవచ్చు. (సామె. 24:10) అపరిపూర్ణతవల్ల చిన్నచిన్న తప్పులు చేయడంతో చేరుకోవాల్సిన లక్ష్యం ఇంకాస్త దూరమై ఉండవచ్చు. (రోమా. 7:23) లేదా ప్రయత్నించి-ప్రయత్నించి అలసిపోయామని అనిపించవచ్చు. (మత్త. 26:43) అయితే వెనకడుగు వేసినా, వెనుదిరగకుండా ఎలా ఉండవచ్చు?

15. వెనకడుగు వేసినంత మాత్రాన ఓడిపోయినట్టా? వివరించండి. (కీర్తన 145:14)

15 వెనకడుగు వేసినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదని గుర్తుంచుకోండి. కష్టాలు, ఒడిదుడుకులు వస్తాయి కానీ యెహోవా సహాయంతో ముందుకు అడుగేయవచ్చని బైబిలు చెప్తుంది. (కీర్తన 145:14 చదవండి.) ముందు చూసిన ఫిలిప్‌ అనే బ్రదర్‌, గెలుపు-ఓటమిల్ని ఎలా అంచనా వేస్తాడో చెప్తూ ఇలా అంటున్నాడు: “నా విజయం, ఎన్నిసార్లు పడిపోయాను అనే దానిమీద కాదుగానీ, పడిపోయినా ఎన్నిసార్లు తిరిగి లేచాను అనే దానిమీద ఆధారపడి ఉంది.” ముందు పేరాలో చూసిన డేవిడ్‌ అనే బ్రదర్‌ కూడా ఇలా అంటున్నాడు: “వెనకడుగుల్ని అడ్డంకులుగా కాదు, యెహోవా మీద నాకు ఎంత ప్రేమ ఉందో నిరూపించుకునే అవకాశాలుగా చూస్తున్నాను.” కాబట్టి వెనకడుగు వేసినా, వెనుదిరగకుండా ముందుకు వెళ్తూ ఉంటే, యెహోవా మీద మనకు ఎంత ప్రేముందో నిరూపించుకుంటాం. ఎన్ని కష్టాలున్నా, మనం లక్ష్యం చేరుకోవడం వైపు అడుగులు వేయడం చూసి యెహోవా ఎంత సంతోషిస్తాడో కదా!

16. వెనకడుగు వేసే పరిస్థితులు మనకు ఏం నేర్పిస్తాయి?

16 వెనకడుగు వేసిన పరిస్థితుల నుండి నేర్చుకోండి. వెనకడుగు వేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయో, మరోసారి అలా వేయకుండా ఉండడానికి ఏమేం మార్పులు చేసుకోవాలో ఆలోచించండి. (సామె. 27:12) అలా చేశాక కొన్నిసార్లు మీ శక్తికి మించి లక్ష్యం పెట్టుకున్నారని అనిపించవచ్చు. ఒకవేళ మీకు అలా అనిపిస్తే, మీ లక్ష్యం గురించి మరోసారి ఆలోచించి, దాన్ని మీరు చేరుకోగలరా లేదా అని అంచనా వేసుకోండి. c మీ వల్ల కాని లక్ష్యాన్ని చేరుకోనంత మాత్రాన యెహోవా దృష్టిలో ఓడిపోయినట్టు కాదు.—2 కొరిం. 8:12.

17. ఇప్పటికే సాధించిన వాటిగురించి ఎందుకు ఆలోచించాలి?

17 ఇప్పటికే సాధించిన వాటిగురించి ఆలోచించండి. బైబిలు ఇలా చెప్తుంది: ‘మీరు చేసిన పనిని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్థుడు కాడు.’ (హెబ్రీ. 6:10) కాబట్టి మీరు చేసిన పనుల్ని మీరు కూడా మర్చిపోవద్దు. ఇప్పటికే చేరుకున్న లక్ష్యాల గురించి ఆలోచించండి. బహుశా అది యెహోవాతో ఉన్న స్నేహం కావచ్చు, ఆయన గురించి ఇతరులతో చెప్పడం కావచ్చు లేదా బాప్తిస్మం తీసుకోవడం కావచ్చు. గతంలో మీరు పెట్టుకున్న లక్ష్యాలు చేరుకోగలిగారు అంటే, ఇప్పుడు కూడా మీరు పెట్టుకున్న లక్ష్యాల వైపు అడుగులు వేస్తే, దానిని చేరుకోగలుగుతారు.—ఫిలి. 3:16.

మీ ప్రయాణాన్ని ఆస్వాదించండి (18వ పేరా చూడండి)

18. లక్ష్యం వైపు అడుగులేస్తుండగా ఏం చేయడం మర్చిపోకూడదు? (చిత్రం కూడా చూడండి.)

18 పడవ నడిపే వ్యక్తి సంతోషంగా తన గమ్యాన్ని చేరుకున్నట్టే, యెహోవా సహాయంతో మీరూ మీ లక్ష్యాన్ని చేరుకోగలరు. అయితే, పడవ నడిపే చాలామంది తమ ప్రయాణాన్ని కూడా ఆస్వాదిస్తారని మర్చిపోకండి. అలాగే మీరు మీ లక్ష్యం వైపు అడుగులేస్తున్నప్పుడు, ఆ ప్రయాణమంతటిలో యెహోవా మీ చేయి పట్టుకుని ఎలా నడిపించాడో, ఎలా దీవించాడో చూడడం మర్చిపోకండి. (2 కొరిం. 4:7) మీరు అలుపెరగకుండా మీ లక్ష్యం వైపు అడుగులేస్తున్నప్పుడు యెహోవా పట్టలేనన్ని దీవెనలు కుమ్మరిస్తాడు.—గల. 6:9.

పాట 126 మెలకువగా, విశ్వాసంలో స్థిరంగా ఉండండి

a యెహోవా సేవలో లక్ష్యాలు పెట్టుకోమని మన సంస్థ ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది. అయితే, ఇప్పటికే మనం వాటిని పెట్టుకున్నా, వాటిని చేరుకోవడానికి ఇబ్బందిపడుతుంటే అప్పుడేంటి? మన లక్ష్యాల్ని చేరుకోవడానికి ఉపయోగపడే సలహాలు ఈ ఆర్టికల్‌ ఇస్తుంది.

b దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి అనే పుస్తకంలో 10-11 పేజీల్లోని 4వ పేరా చూడండి.

c దీనిగురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి 2008, జూలై 15 కావలికోట పత్రికలో “సాధించగలిగే లక్ష్యాలను పెట్టుకుని సంతోషాన్ని పొందండి” అనే ఆర్టికల్‌ చూడండి.