అధ్యయన ఆర్టికల్ 23
“యెహోవా పుట్టించే జ్వాలను” ఆరిపోనివ్వకండి
“[ప్రేమ] జ్వాలలు అగ్ని జ్వాలలు, అది యెహోవా పుట్టించే జ్వాల.”—పరమ. 8:6.
పాట 131 “దేవుడు ఒకటి చేసినవాళ్లు”
ఈ ఆర్టికల్‌లో … a
1. నిజమైన ప్రేమ గురించి బైబిలు ఏం చెప్తుంది?
ప్రేమ “జ్వాలలు అగ్ని జ్వాలలు, అది యెహోవా పుట్టించే జ్వాల. ఉప్పొంగే జలాలు ప్రేమను ఆర్పలేవు, నదీ ప్రవాహాలు దాన్ని ముంచేయలేవు.” b (పరమ. 8:6, 7) నిజమైన ప్రేమను ఎంత రమణీయంగా వర్ణించారో కదా! భార్యాభర్తలు ఒకరిమీద ఒకరు చూపించుకునే ప్రేమ ఎప్పటికీ కరిగిపోకుండా ఉండడం సాధ్యమే అని ఆ మాటలు పెళ్లయిన వాళ్లలో ఆశను పుట్టిస్తున్నాయి.
2. తమ మధ్యున్న ప్రేమ చల్లారిపోకుండా ఉండడానికి భార్యాభర్తలు ఏం చేయవచ్చు?
2 భార్యాభర్తల మధ్య ప్రేమ ఎప్పటికీ ఉంటుందా లేదా అనేది వాళ్ల చేతుల్లోనే ఉంది. ఉదాహరణకు, ఒక చలిమంటకు ఎప్పటికీ వెలిగే సామర్థ్యం ఉంది. కానీ అది ఎప్పటికీ వెలుగుతూ ఉండాలంటే కట్టెలు వేస్తూ ఉండాలి. దాన్ని పట్టించుకోకుండా ఉంటే ఆ మంట ఆరిపోయే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్యున్న ప్రేమ కూడా ఎప్పటికీ ఉండొచ్చు. కానీ ఆ ప్రేమ ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్లదే. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, పిల్లల్ని పెంచడం వంటివాటిలో తలమునకలవ్వడం వల్ల తమ మధ్యున్న ప్రేమ చల్లారిపోతుందని భార్యాభర్తలకు అనిపించవచ్చు. ఒకవేళ మీకు పెళ్లయి ఉంటే, “యెహోవా పుట్టించే జ్వాలను” ఆరిపోకుండా చూసుకోవడానికి మీరేం చేయవచ్చు? దానికోసం మీరు చేయాల్సిన మూడు పనులు ఏంటో, అవి చేయడంవల్ల మీ సంతోషం కలకాలం ఎలా ఉంటుందో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. c
యెహోవాతో మీకున్న బంధాన్ని బలపర్చుకుంటూ ఉండండి
3. యెహోవాతో ఉన్న బంధానికి, పెళ్లికి సంబంధం ఏంటి? (ప్రసంగి 4:12) (చిత్రం కూడా చూడండి.)
3 “యెహోవా పుట్టించే జ్వాల” ఆరిపోకుండా ఉండడానికి భార్యాభర్తలు యెహోవాతో తమకున్న బంధాన్ని బలపర్చుకుంటూ ఉండాలి. యెహోవాతో ఉన్న బంధానికి, పెళ్లికి సంబంధం ఏంటి? యెహోవాతో ఉన్న స్నేహానికి విలువిచ్చే భార్యాభర్తలు ఆయనిచ్చే సలహాలకు కూడా విలువిస్తారు. దానివల్ల వాటిని వెంటనే పాటిస్తారు, సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు, సమస్యలు రాకుండా కూడా చూసుకోగలుగుతారు. అలా వాళ్లమధ్య ఉన్న ప్రేమ కూడా చల్లారిపోకుండా చూసుకోగలుగుతారు. (ప్రసంగి 4:12 చదవండి.) యెహోవా అంటే భయం-భక్తి ఉన్న ప్రజలు దయ, ఓర్పు, క్షమించడం లాంటి లక్షణాల్ని చూపిస్తూ ఆయన్ని అనుకరించడానికి ప్రయత్నిస్తారు. (ఎఫె. 4:32–5:1) అలాంటి లక్షణాల్ని చూపించే భార్యాభర్తల మధ్యున్న ప్రేమ అంచెలంచెలుగా పెరుగుతుంది. పెళ్లయి 25 ఏళ్లు దాటిన సిస్టర్ లీనా ఇలా చెప్తుంది: “దేవుడంటే భయం-భక్తి ఉన్న వ్యక్తిని ప్రేమించడం, గౌరవించడం చాలా తేలిక.”
4. రాబోయే మెస్సీయకు తల్లిదండ్రులుగా ఉండడానికి యెహోవా యోసేపు, మరియల్నే ఎందుకు ఎంచుకున్నాడు?
4 దావీదు వంశస్థులు చాలామంది ఉన్నా, రాబోయే మెస్సీయకు తల్లిదండ్రులుగా ఉండడానికి యెహోవా యోసేపు, మరియల్నే ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకంటే వాళ్లిద్దరికి యెహోవాతో దగ్గరి స్నేహం ఉంది. అలాగే వాళ్ల పెళ్లి జీవితం తన మీదున్న ప్రేమతో పెనవేసుకుని ఉంటుందని యెహోవాకు తెలుసు. పెళ్లయిన భార్యాభర్తలారా, యోసేపు నుండి, మరియ నుండి మీరేం నేర్చుకోవచ్చు?
5. యోసేపులాంటి భర్తగా ఉండడానికి భర్తలు ఏం చేయవచ్చు?
5 యోసేపు యెహోవా ఇచ్చిన నిర్దేశాన్ని వెంటనే పాటించాడు కాబట్టి భార్య మెచ్చే భర్తగా అయ్యాడు. మూడు సందర్భాల్లో అతని కుటుంబానికి సంబంధించి యెహోవా నిర్దేశాన్ని ఇచ్చాడు. ప్రతీసారి అతను వాటిని వెంటనే పాటించాడు. కొన్నిసార్లు అతని జీవితంలో పెద్దపెద్ద మార్పులు చేసుకోవాల్సి వచ్చినా వాటిని పాటించాడు. (మత్త. 1:20, 24; 2:13-15, 19-21) అతను అలా పాటించడంవల్ల మరియను కాపాడగలిగాడు, ఆమె వెన్నంటే ఉండగలిగాడు, ఆమె బాగోగులు చూసుకోగలిగాడు. యోసేపు చేసిన పనులవల్ల మరియకు అతని మీద ప్రేమ, గౌరవం ఎంత పెరిగుంటాయో కదా! భర్తలారా, మీరు కూడా మీ కుటుంబాన్ని చూసుకునే విషయంలో బైబిలిచ్చే నిర్దేశాన్ని వెదకడం ద్వారా యోసేపును అనుకరించవచ్చు. d మీ జీవితంలో పెద్దపెద్ద మార్పులు చేసుకోవాల్సి వచ్చినా, ఆ సలహాల్ని పాటించడంవల్ల మీ భార్య మీద ప్రేమ చూపించినట్టు అవుతుంది, మీ మధ్యున్న అనుబంధం కూడా బలపడుతుంది. వనౌటులో ఉంటున్న ఒక సిస్టర్‌కి పెళ్లయి 20 సంవత్సరాలు దాటింది. ఆమె ఇలా చెప్తుంది: “నా భర్త యెహోవా నిర్దేశం కోసం వెదికి, దాన్ని పాటించినప్పుడు ఆయన మీద నాకున్న గౌరవం ఇంకా పెరిగేది. ఆయన నా పక్కనుంటే కొండంత అండగా అనిపించేది. ఆయన నిర్ణయాలకు తిరుగులేదని అనిపించేది.”
6. మరియలాంటి భార్యగా ఉండడానికి భార్యలు ఏం చేయవచ్చు?
6 మరియ సొంతగా యెహోవాతో ఒక సన్నిహిత స్నేహాన్ని కలిగి ఉంది. యోసేపు విశ్వాసం చూపిస్తే చాలు అని ఆమె అనుకోలేదు గానీ, స్వయంగా ఆమె కూడా విశ్వాసం చూపించింది. మరియకు లేఖనాల మీద కూడా బాగా పట్టు ఉంది. అంతేకాదు ధ్యానించడానికి సమయం కూడా తీసుకునేది. (లూకా 2:19, 51) అలా మరియ భర్త మెచ్చే ఒక మంచి భార్యగా అయ్యింది. నేడు చాలామంది భార్యలు కూడా మరియ చేసిందే చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఉదాహరణకు, యెమికో అనే సిస్టర్ అనుభవాన్ని చూడండి. ఆమె ఇలా చెప్తుంది: “నాకు పెళ్లి కాకముందు సొంతగా బైబిలు చదవడానికి, ప్రార్థన చేయడానికి ఒక పట్టిక ఉండేది. కానీ పెళ్లి తర్వాత మా కుటుంబం అందరి తరఫున నా భర్త ప్రార్థన చేసేవాడు, కుటుంబ ఆరాధన చేసేవాడు. కాబట్టి ఈ విషయాలన్నిటిలో నేను ఆయన పైనే ఎక్కువ ఆధారపడుతున్నాను అని గమనించాను. కానీ నేనే సొంతగా యెహోవాతో నాకున్న స్నేహాన్ని బలపర్చుకోవాలని గుర్తించాను. అందుకే యెహోవాతో ఒంటరిగా సమయం గడపడానికి అంటే ప్రార్థన చేయడానికి, బైబిలు చదవడానికి, ధ్యానించడానికి కొంత సమయం పక్కనపెట్టాలని అనుకున్నాను.” (గల. 6:5) భార్యలారా, యెహోవాతో మీకున్న స్నేహాన్ని బలపర్చుకుంటూ ఉంటే మీ భర్తలు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా మెచ్చుకోగలుగుతారు, ప్రేమించగలుగుతారు.—సామె. 31:30.
7. యోసేపు, మరియల నుండి భార్యాభర్తలు ఏం నేర్చుకోవచ్చు?
7 యెహోవాతో తమ స్నేహాన్ని బలపర్చుకోవడానికి యోసేపు, మరియలు కలిసి కూడా కృషిచేశారు. కుటుంబంగా యెహోవాను ఆరాధించడం చాలా ప్రాముఖ్యమని వాళ్లు అర్థంచేసుకున్నారు. (లూకా 2:22-24, 41; 4:16) ముఖ్యంగా పిల్లలు పుట్టేకొద్దీ అలాచేయడం కష్టమవ్వవచ్చు. కానీ వాళ్లు దాన్ని చేయగలిగారు. భార్యాభర్తలకి వాళ్లు ఎంత చక్కని ఆదర్శమో కదా! యోసేపు మరియల్లాగే మీకు పిల్లలుంటే, వాళ్లతో మీటింగ్స్‌కి వెళ్లడం, కుటుంబ ఆరాధన కోసం టైం పెట్టడం అంత ఈజీ కాకపోవచ్చు. అంతేకాదు, మీరిద్దరు కలిసి అధ్యయనం చేసుకోవడానికి లేదా ప్రార్థన చేసుకోవడానికి కూడా సమయం దొరకకపోవచ్చు. కానీ కలిసి యెహోవాను ఆరాధిస్తే, మీరు ఆయనకు అలాగే ఒకరికొకరు ఇంకా దగ్గరౌతారు. కాబట్టి యెహోవా ఆరాధనకే అన్నిటికన్నా మొదటిస్థానం ఇవ్వండి.
8. మీ బంధం బీటలువారడం వల్ల కుటుంబ ఆరాధన చేసుకోవడం నచ్చకపోతే మీరు దేనితో మొదలుపెట్టవచ్చు?
8 ఒకవేళ మీ వివాహబంధం బీటలువారితే అప్పుడేంటి? కలిసి కుటుంబ ఆరాధన చేసుకోవడం మీకు అంతగా నచ్చకపోవచ్చు. అలాగైతే మీ ఇద్దరికి నచ్చేవాటిని కాసేపు చర్చించుకోవడంతో మొదలుపెట్టవచ్చు. అలా చేస్తే, మీ ఇద్దరి మధ్య బంధం, యెహోవాను కలిసి ఆరాధించాలనే కోరిక రెండూ బలపడతాయి.
కలిసి సమయం గడపండి
9. భార్యాభర్తలు ఒకరితోఒకరు ఎందుకు సమయం గడపాలి?
9 భార్యాభర్తలారా, మీమధ్య ఉన్న ప్రేమ చల్లారిపోకుండా ఉండాలంటే మీరు కలిసి సమయం గడపాలి. అలా చేస్తే మీ ఆలోచనలు, మనసులు దూరమవ్వకుండా ఉంటాయి. (ఆది. 2:24) లిలియా, రూస్లన్ అనే దంపతులకు పెళ్లయి 15 సంవత్సరాలు దాటింది. పెళ్లయిన కొంతకాలానికే వాళ్లకు ఏం అర్థమైందో చెప్తూ లిలియా ఇలా అంటుంది: “మేము కలిసి సమయం గడపడానికి అనుకున్నంత సమయం ఉండకపోవచ్చని మాకు అర్థమైంది. కాలమంతా ఉద్యోగానికి, ఇంటి పనులకు, పిల్లల్ని చూసుకోవడానికే వెళ్లిపోతుందని గుర్తించాం. ఒకవేళ మేము భార్యాభర్తలుగా కలిసి సమయం గడపకపోతే, మామధ్య కూడా దూరం పెరిగే అవకాశం ఉందని గమనించాం.”
10. ఎఫెసీయులు 5:15, 16 లో ఉన్న సూత్రాన్ని భార్యాభర్తలు ఎలా పాటించవచ్చు?
10 భార్యాభర్తలు ఒకరితోఒకరు సమయం గడపడానికి, కబుర్లు చెప్పుకోవడానికి రోజులో కొంత సమయాన్ని పక్కన పెట్టాల్సి రావచ్చు. (ఎఫెసీయులు 5:15, 16 చదవండి.) నైజీరియాలో ఉంటున్న ఉగొండు అనే బ్రదర్ ఇలా చెప్తున్నాడు: “ఒక రోజులో నేను చేయాల్సిన పనులన్నిటినీ షెడ్యూల్ వేసుకుంటున్నప్పుడు, ఆరోజు నేను నా భార్యతో గడిపే సమయాన్ని కూడా షెడ్యూల్ వేసుకుంటాను. ఆ టైంలో ఇంక వేరే ఏ పనులు పెట్టుకోను.” (ఫిలి. 1:10) మాల్డోవాలో ప్రాంతీయ పర్యవేక్షకుని భార్య అయిన సిస్టర్ అనస్తిషియా తన సమయాన్ని ఎలా చక్కగా ఉపయోగించుకుంటుందో గమనించండి. ఆమె ఇలా అంటుంది: “నా భర్త తన బాధ్యతలతో బిజీగా ఉన్న టైంలోనే నా పనులన్నీ పూర్తి చేసేసుకుంటాను. అలా ఆయన ఫ్రీ అయ్యే టైంకి నేనూ ఫ్రీగా ఉంటాను. అప్పుడు కలిసి సమయాన్ని గడపగలుగుతాం.” ఒకవేళ మీరు కలిసి సమయం గడపలేనంత బిజీగా ఉంటే అప్పుడేంటి?
11. అకుల, ప్రిస్కిల్ల కలిసి ఏయే పనులు చేశారు?
11 మొదటి శతాబ్దంలో చాలామంది ఇష్టపడిన దంపతులు అకుల, ప్రిస్కిల్ల నుండి భార్యాభర్తలు చాలా నేర్చుకోవచ్చు. (రోమా. 16:3, 4) వాళ్ల పెళ్లి జీవితం గురించి బైబిలు ఎక్కువ వివరాలు చెప్పట్లేదు గానీ, వాళ్లు కలిసి పని చేశారని, ప్రీచింగ్ చేశారని, వేరేవాళ్లకు సహాయం చేశారని చెప్తుంది. (అపొ. 18:2, 3, 24-26) నిజానికి బైబిలు అకుల, ప్రిస్కిల్ల గురించి ప్రస్తావించిన ప్రతీసారి వాళ్లను కలిపే ప్రస్తావించింది.
12. భార్యాభర్తలు ఒకరితోఒకరు సమయం గడపడానికి వాళ్లు కలిసి ఏమేం పనులు చేయవచ్చు? (చిత్రం కూడా చూడండి.)
12 అకుల, ప్రిస్కిల్లలాగే భార్యాభర్తలు ఏం చేయవచ్చు? బహుశా మీరు, మీ భాగస్వామి కలిసి ఏయే పనులు చేయవచ్చో ఆలోచించండి. ఏదైనా ఒక పనిని మీరు ఒక్కరే చేసే బదులు, మీ భాగస్వామితో కలిసి చేయగలరా? ఉదాహరణకు అకుల, ప్రిస్కిల్ల కలిసి ప్రీచింగ్ చేశారు. మీరూ అలాగే చేయగలరా? అకుల, ప్రిస్కిల్ల కలిసి పనిచేశారు. బహుశా మీరు, మీ భాగస్వామి వేర్వేరు ఉద్యోగాలు చేస్తుండవచ్చు. కానీ ఇంట్లో పనులు కలిసి చేసుకోగలరా? (ప్రసం. 4:9) మీరు కలిసి ఏదైనా పని చేసినప్పుడు, మీరు ఒకే టీమ్ అన్నట్టు మీకు అనిపిస్తుంది. ఒకరితోఒకరు మనసువిప్పి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. రోబర్ట్, లిండా అనే దంపతులకు పెళ్లయి 50 సంవత్సరాలు దాటింది. రోబర్ట్ ఇలా అంటున్నాడు: “నిజం చెప్పాలంటే సినిమాలకు, షికార్లకు వెళ్లేంత టైం మాకు ఉండదు. కానీ నేను గిన్నెలు కడుగుతున్నప్పుడు నా భార్య వాటిని తుడిచేది. నేను బయట తోట పని చేసినప్పుడు ఆమె నాతోపాటు వచ్చి పనిచేసేది. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించేది. మేము కలిసి పనిచేసినప్పుడు మా మనసులు బాగా కలిశాయి. మా మధ్య ఉన్న ప్రేమ కూడా పెరుగుతూ వచ్చింది.”
13. ఒకరికొకరు నిజంగా దగ్గరవ్వాలంటే భార్యాభర్తలు ఏం చేయాలి?
13 అయితే, భార్యాభర్తలు ఒకే ఇంట్లో కలిసి ఉన్నంతమాత్రాన ఒకరికొకరు దగ్గరైపోరని గుర్తుంచుకోండి. బ్రెజిల్‌లో ఉంటున్న ఒక భార్య ఇలా చెప్తుంది: “ఈరోజుల్లో మనం ఎంత బిజీ అయిపోయామంటే, నాలుగు గోడలమధ్యే కలిసి ఉంటున్నాం కాబట్టి ఒకరితో ఒకరం సమయం గడుపుతున్నాం అనే భ్రమలో ఉండే అవకాశం ఉంది. కానీ అది మాత్రమే సరిపోదు. నేను నా భర్త అవసరాలేమిటో కూడా పట్టించుకోవాలని గమనించాను.” బ్రునో, ఆయన భార్య తేస్ ఒకరితోఒకరు సమయం గడిపే విషయం గురించి ఏం అంటున్నారో గమనించండి. బ్రునో ఇలా చెప్తున్నాడు: “మేము కలిసి సమయం గడుపుతున్నప్పుడు మా ఫోన్లను పక్కన పెట్టేస్తాం.”
14. మీరు, మీ భాగస్వామి కలిసి సమయం గడపడం మీకు నచ్చకపోతే ఏం చేయాలి?
14 అయితే మీరు, మీ భాగస్వామి కలిసి సమయం గడపడం మీకు నచ్చకపోతే అప్పుడేంటి? బహుశా మీ ఇద్దరికి వేర్వేరు ఇష్టాలు ఉండొచ్చు, లేదా ఒకరు చేసేపని ఇంకొకరికి చిరాకుగా అనిపించవచ్చు. అప్పుడు మీరేం చేయవచ్చు? ఈ ఆర్టికల్ మొదట్లో చర్చించుకున్న చలిమంట గురించి ఆలోచించండి. ఆ చలిమంట ఒక్కసారిగా పెద్దగా రాదు. అలా పెద్ద మంట రావాలంటే, ముందు చిన్నచిన్న పుల్లలు వేస్తూ ఆ తర్వాత పెద్దపెద్ద కర్రలు వేస్తూ ఉండాలి. అలాగే ప్రతీరోజు కనీసం కొద్దిక్షణాలైనా మీ భాగస్వామితో కలిసి గడపడంతో మొదలుపెట్టండి. మీ ఇద్దరికి కోపం తెప్పించే పనులు కాకుండా, ఇద్దరికి నచ్చే పనులు చేయండి. (యాకో. 3:18) అలా చిన్నచిన్న పనులు చేస్తూ ఉండడంవల్ల మీమధ్య ఉన్న ప్రేమ మళ్లీ చిగురించే అవకాశం ఉంది.
గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకోండి
15. భార్యాభర్తల మధ్య ప్రేమ వెలుగుతూనే ఉండాలంటే ఏది చాలా ప్రాముఖ్యం?
15 వివాహబంధం పటిష్ఠంగా ఉండాలంటే గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం చాలా ప్రాముఖ్యం. దాన్ని, చలిమంట బాగా వెలగడానికి ఉపయోగపడే గాలితో (ఆక్సిజన్) పోల్చవచ్చు. గాలి లేకపోతే మంట వెంటనే ఆరిపోతుంది. అలాగే భార్యాభర్తల మధ్య గౌరవమర్యాదలు లేకపోతే వాళ్లమధ్య ఉన్న ప్రేమ కూడా వెంటనే ఆవిరైపోతుంది. మరోవైపు, భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడానికి కృషిచేసినప్పుడు వాళ్లమధ్య ఉన్న ప్రేమ వెలుగుతూనే ఉంటుంది. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ భాగస్వామిని గౌరవిస్తున్నారని మీకు అనిపించడం కాదు, తనను గౌరవిస్తున్నారని మీ భాగస్వామికి అనిపించాలి. పెన్నీ, ఆరెట్ అనే దంపతులకు పెళ్లయి 25 సంవత్సరాలు దాటింది. పెన్నీ ఇలా చెప్తుంది: “మేము గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడంవల్ల, మా ఇల్లు ప్రేమాప్యాయతలకు నెలవుగా ఉంది. మేము ఒకరి అభిప్రాయాలు ఒకరం గౌరవించుకుంటాం కాబట్టి అరమరికలు లేకుండా మాట్లాడుకోగలుగుతాం.” అయితే, తనని గౌరవిస్తున్నారని మీ భాగస్వామికి అనిపించేలా మీరేం చేయవచ్చు? దానికోసం అబ్రాహాము, శారా ఉదాహరణల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.
16. అబ్రాహాము నుండి భర్తలు ఏం నేర్చుకోవచ్చు? (1 పేతురు 3:7) (చిత్రం కూడా చూడండి.)
16 అబ్రాహాము శారాను చాలా గౌరవించేవాడు. శారా అభిప్రాయాల్ని లెక్కలోకి తీసుకునేవాడు. ఆమె మనసును అర్థం చేసుకునేవాడు. అయితే ఒక సందర్భంలో, శారా చాలా బాధలో ఉన్నప్పుడు తన బాధంతా అబ్రాహాముకు వెల్లబుచ్చుకుంది. తన బాధకు కారణం అబ్రాహాము అని కూడా నిందించింది. మరి అబ్రాహాము ఆమె మీద మండిపడ్డాడా? లేదు. శారా తన నిర్ణయాలకు మద్దతిస్తూ తనకు లోబడే భార్య అని అబ్రాహాముకు తెలుసు. కాబట్టి, అబ్రాహాము ఆమె చెప్పేదంతా ఓపిగ్గా విని, సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాడు. (ఆది. 16:5, 6) దీన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? భర్తలారా, కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం మీకుంది. (1 కొరిం. 11:3) కానీ నిర్ణయాలు తీసుకునే ముందు మీ భార్య అభిప్రాయం ఏంటో తెలుసుకోండి. ముఖ్యంగా, ఆ నిర్ణయం ఆమె మీద కూడా ప్రభావం చూపించేదైతే ఆమె అభిప్రాయం తెలుసుకోవడం మరీ మంచిది. (1 కొరిం. 13:4, 5) ఇంకొన్నిసార్లు, బహుశా మీ భార్య చాలా ఒత్తిడిలో ఉండి, తన గోడు మీకు వెల్లబుచ్చుకోవచ్చు. అప్పుడు ఆమె మనసును అర్థంచేసుకుని ఆమె చెప్పేది ఓపిగ్గా వింటారా? (1 పేతురు 3:7 చదవండి.) ఏంజెలా, దిమిత్రికీ పెళ్లయి 30 సంవత్సరాలు కావస్తోంది. ఆమె భర్త తన మనసును ఎలా అర్థం చేసుకుంటాడో చెప్తూ ఆమె ఇలా అంది: “నాకు చిరాకుగా అనిపించినప్పుడు లేదా మాట్లాడాలని అనిపించినప్పుడు దిమిత్రి ఎప్పుడూ వినడానికి ఇష్టపడేవాడు. కొన్నిసార్లు నేను కోపంగా మాట్లాడినా సరే ఆయన ఓపిగ్గా వింటాడు.”
17. శారా నుండి భార్యలు ఏం నేర్చుకోవచ్చు? (1 పేతురు 3:5, 6)
17 అబ్రాహాము తీసుకున్న నిర్ణయాలన్నిటికీ మద్దతివ్వడం ద్వారా శారా ఆయన్ని గౌరవించింది. (ఆది. 12:5) ఒక సందర్భంలో అనుకోని అతిథులు వచ్చినప్పుడు అబ్రాహాము వాళ్లని ఇంటికి ఆహ్వానించాడు. వాళ్లకోసం భోజనం సిద్ధం చేయమని శారాకు చెప్పాడు. (ఆది. 18:6) శారా తను చేసే పనులన్నీ పక్కనపెట్టి అబ్రాహాము తీసుకున్న నిర్ణయానికి మద్దతిచ్చి, ఆయన చెప్పింది చేసింది. భార్యలారా, మీరు శారాలాగే చేయగలరా? మీ భర్త తీసుకున్న నిర్ణయాలకు మీరు మద్దతిచ్చినప్పుడు, మీ వివాహబంధం ఇంకా పటిష్ఠం అవుతుంది. (1 పేతురు 3:5, 6 చదవండి.) ముందటి పేరాలో ప్రస్తావించబడిన దిమిత్రి, తన భార్య ఆయన్ని ఎలా గౌరవిస్తుందో చెప్తూ ఇలా అన్నాడు: “మా అభిప్రాయాలు అప్పుడప్పుడు కలవకపోయినా, నా భార్య నా నిర్ణయాలకు ఇచ్చే మద్దతు చూసినప్పుడు చాలా ముచ్చటేస్తుంది. కొన్నిసార్లు నా నిర్ణయాల్లో అవకతవకలు జరిగినా ఆమె నన్ను వేలెత్తి చూపించదు.” మనల్ని గౌరవించేవాళ్లను ప్రేమించడం ఎంత తేలికౌతుందో కదా!
18. భార్యాభర్తల మధ్యున్న ప్రేమ ఎప్పటికీ వెలిగిపోతూ ఉండేలా చూసుకోవడం వల్ల ఏంటి ప్రయోజనం?
18 నేడు, యెహోవాసాక్షుల దంపతుల మధ్య ఉన్న ప్రేమను ఆర్పేయడానికి సాతాను శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గేకొద్దీ, యెహోవాతో ఉన్న దూరం పెరుగుతూ ఉంటుందని సాతానుకు బాగా తెలుసు. కానీ నిజమైన ప్రేమను ఎవ్వరూ ఆర్పేయలేరు. కాబట్టి మీ వివాహ జీవితంలో ఉన్న ప్రేమ, పరమగీతం పుస్తకంలో వర్ణించిన ప్రేమలా ఉండడానికి కృషిచేయండి. మీ వివాహ జీవితాన్ని యెహోవా చుట్టూ తిరిగేలా చూసుకోండి. ఒకరితోఒకరు సమయం గడపండి. ఒకరికొకరు గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకోండి. మీ భాగస్వామి మనసును, అవసరాల్ని పట్టించుకోండి. ఇవన్నీ చేసినప్పుడు, నిజమైన ప్రేమకు మూలమైన యెహోవాకు ఘనతను తీసుకొచ్చిన వాళ్లౌతారు. అప్పుడు, మీ ప్రేమ జ్వాల ఎన్నడూ ఆరిపోదు!
పాట 132 మనమిప్పుడు ఒక్కరం
a పెళ్లి, మనుషులకు యెహోవా ఇచ్చిన ఒక వరం. దానివల్ల భార్యాభర్తల మధ్య మాత్రమే ఉండే చెరగని ప్రేమ చిగురిస్తుంది. అయితే, కొన్నిసార్లు వాళ్లమధ్య ఉన్న ప్రేమ కాలంతోపాటు కరిగిపోవచ్చు. ఒకవేళ మీకు పెళ్లయితే, మీ మధ్యున్న ప్రేమ ఆరిపోకుండా ఎప్పటికీ వెలిగిపోతూ ఉండడానికి, మీ దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోవడానికి ఏం చేయాలో ఈ ఆర్టికల్ చెప్తుంది.
b నిజమైన ప్రేమ పరిస్థితుల్నిబట్టి మారిపోదు, కాలంతోపాటు కరిగిపోదు. అలాంటి ప్రేమకు మూలం యెహోవాయే కాబట్టి “అది యెహోవా పుట్టించే జ్వాల” అని బైబిలు చెప్తుంది.
c మీ భర్త లేదా భార్య యెహోవాసాక్షి కాకపోయినా, మీ బంధం విడవని ముడిలా ఉండడానికి ఈ ఆర్టికల్‌లో ఉన్న సలహాలు సహాయం చేస్తాయి.—1 కొరిం. 7:12-14; 1 పేతు. 3:1, 2.
d ఉదాహరణకు, కొన్ని ఉపయోగపడే సలహాల కోసం jw.orgలో అలాగే JW లైబ్రరీలో ఉన్న “కుటుంబం కోసం” అనే ఆర్టికల్ సిరీస్‌ని చూడండి.