కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధికారుల ముందు సువార్తను సమర్థించండి

అధికారుల ముందు సువార్తను సమర్థించండి

“అన్యజనుల యెదుటను రాజుల యెదుటను . . . నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమైయున్నాడు.” (అపొ. 9:15) కొత్తగా క్రైస్తవునిగా మారిన ఓ యూదుని గురించి యేసు ఈ మాటలు చెప్పాడు. ఆ తర్వాత అతను అపొస్తలుడైన పౌలుగా ప్రసిద్ధి చెందాడు.

ఆ ‘రాజులలో’ ఒకరు ఎవరంటే రోమా చక్రవర్తి అయిన నీరో. అలాంటి పరిపాలకుని ముందు మీ విశ్వాసాన్ని సమర్థిస్తూ మాట్లాడాల్సి వస్తే మీకెలా అనిపిస్తుంది? అయినా, క్రైస్తవులందరూ పౌలును అనుకరించాలని ప్రోత్సహించబడుతున్నారు. (1 కొరిం. 11:1) అలా అనుకరించాలంటే, ఆ కాలంలోని చట్టాల నుండి అతనికి ఎదురైన అనుభవాలను మనం పరిశీలించాలి.

ఇశ్రాయేలు దేశంలో మోషే ధర్మశాస్త్రం చట్టంగా ఉండేది. మంచి చెడ్డల విషయాల్లో ఆ ధర్మశాస్త్రంలోని సూత్రాలనే యూదులందరూ పాటించేవాళ్లు. సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత సత్యారాధకులు ఇక మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేకుండాపోయింది. (అపొ. 15:28, 29; గల. 4:9-11) అయినప్పటికీ, పౌలు ఇతర క్రైస్తవులు దాని గురించి అగౌరవంగా మాట్లాడలేదు. వాళ్లు యూదులు ఉండే ప్రాంతాల్లో ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా సాక్ష్యమివ్వగలిగారు. (1 కొరిం. 9:20) నిజానికి పౌలు చాలాసార్లు సమాజమందిరాలకు వెళ్లి, అక్కడ అబ్రాహాము ఆరాధించిన దేవుని గురించి తెలిసినవాళ్లకు సాక్ష్యమిచ్చాడు, అంతేకాదు హీబ్రూ లేఖనాల ఆధారంగా వాళ్లతో తర్కబద్ధంగా మాట్లాడాడు.—అపొ. 9:19, 20; 13:5, 14-16; 14:1; 17:1-3.

ప్రకటనాపనిని నడిపించడానికి అపొస్తలులు యెరూషలేమును కేంద్రంగా ఎంచుకున్నారు. వాళ్లు రోజూ దేవాలయం దగ్గర బోధించేవాళ్లు. (అపొ. 1:4; 2:46; 5:20) ఒకసారి పౌలు యెరూషలేముకు వెళ్లినప్పుడు, అక్కడ అతన్ని బంధించారు. అప్పుడు సైనికులు చివరికి అతన్ని చట్టప్రకారం రోముకు తీసుకెళ్లారు.

పౌలు రోమా చట్టాన్ని ఉపయోగించడం

పౌలు ప్రకటిస్తున్న నమ్మకాల గురించి రోమా అధికారులు ఎలా భావించి ఉండేవాళ్లు? ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలంటే, రోమన్లు సాధారణంగా మతాలను ఎలా చూసేవాళ్లో తెలుసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. తమ సామ్రాజ్యంలో ఉండే వేర్వేరు జాతులవాళ్లను మతాన్ని విడిచిపెట్టమని రోమన్లు బలవంతపెట్టేవాళ్లు కాదు. కానీ రాష్ట్రానికి లేదా సమాజానికి వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపించినప్పుడు ఏదైనా చర్య తీసుకునేవాళ్లు.

రోమన్లు తమ సామ్రాజ్యంలోని యూదులకు చాలా హక్కుల్ని కల్పించారు. బ్యాక్‌గ్రౌండ్స్‌ ఆఫ్‌ అర్లీ క్రిస్టియానిటీ అనే పుస్తకం ఇలా చెప్తుంది, “రోమా సామ్రాజ్యంలో యూదా మతానికి గౌరవపూర్వకమైన స్థానం ఉండేది. . . . యూదులకు తమ మతాన్ని పాటించే స్వేచ్ఛ ఉండేది. అంతేకాదు రోమా రాష్ట్ర ప్రజలు ఆరాధించే దేవతలను కూడా వాళ్లు ఆరాధించాల్సిన అవసరం ఉండేది కాదు. యూదులు తమ ప్రాంతాల్లో సొంత చట్టాన్నిబట్టి జీవించవచ్చు.” వాళ్లు సైనిక దళంలో చేరాల్సిన అవసరం కూడా లేదు. a పౌలు రోమా అధికారుల ముందు క్రైస్తవత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నప్పుడు, యూదుల నమ్మకాల్ని సంరక్షించడం కోసం వాళ్లు ఏర్పాటు చేసిన రోమా చట్టాన్ని ఉపయోగించుకున్నాడు.

సామాన్య ప్రజలను, అధికారులను పౌలు మీదకు ఉసిగొల్పాలని వ్యతిరేకులు ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. (అపొ. 13:49-50; 14:2, 19; 18:12, 13) ఒక సందర్భంలో ఏమి జరిగిందో గమనించండి. ‘మోషే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టమని’ పౌలు ప్రకటిస్తున్నాడనే పుకారు యూదుల మధ్య వ్యాప్తి చెందిందని యెరూషలేము సంఘ పెద్దలు విన్నారు. కొత్తగా క్రైస్తవులుగా మారినవాళ్లు అలాంటి పుకార్లు వింటే, పౌలు దేవుని ఏర్పాట్లను గౌరవించడం లేదని అనుకునే అవకాశం ఉంది. అంతేకాదు, యూదా మతంలో పుట్టిన మతభ్రష్టత్వం నుండి క్రైస్తవత్వం వచ్చిందని యూదుల మహాసభ ప్రకటన చేయవచ్చు. ఒకవేళ అలా ప్రకటిస్తే, క్రైస్తవులతో సహవసించిన యూదులను శిక్షించే అవకాశం ఉంటుంది. వాళ్లను సమాజం నుండి వెలివేసి, దేవాలయంలో లేదా సమాజమందిరాల్లో ప్రకటించనివ్వకుండా చేయవచ్చు. కాబట్టి, ఆ పుకార్లన్నీ తప్పని నిరూపించమని సంఘపెద్దలు పౌలుకు సలహా ఇచ్చారు. దానికోసం అతన్ని దేవాలయానికి వెళ్లి ఒక పని చేయమని చెప్పారు. అలా చేయమని దేవుడు చెప్పకపోయినా అది చేయకూడని పనేమీ కాదు.—అపొ. 21:18-27.

ఆ పని చేయడంవల్ల ‘సువార్త పక్షాన వాదించడానికి, దానిని స్థిరపరచడానికి’ పౌలుకు అవకాశాలు దొరికాయి. (ఫిలి. 1:7) దేవాలయం దగ్గర, యూదులు పౌలు మీద తిరగబడి అతన్ని చంపాలనుకున్నారు. అప్పుడు రోమా సైనికాధికారి పౌలును బంధించాడు. తనను కొరడాతో కొట్టబోతుండగా, తాను రోమా పౌరుడినని పౌలు చెప్పాడు. అప్పుడు అతన్ని కైసరయకు తీసుకెళ్లారు, ఆ ప్రాంతం నుండే రోమన్లు యూదయను పరిపాలించేవాళ్లు. అక్కడ అధికారుల ముందు ధైర్యంగా సాక్ష్యమివ్వడానికి పౌలుకు మంచి అవకాశాలు దొరికాయి. దానివల్ల క్రైస్తవత్వం గురించి అంతగా తెలియని చాలామందికి మరింత బాగా సాక్ష్యమివ్వడం వీలైవుండవచ్చు.

అపొస్తలుల కార్యములు 24వ అధ్యాయంలో, యూదయను పరిపాలిస్తున్న రోమా అధిపతియైన ఫేలిక్సు ముందు పౌలును విచారణ చేయడం గురించి ఉంటుంది. ఫేలిక్సుకు క్రైస్తవుల నమ్మకాల గురించి అప్పటికే కొంతవరకు తెలుసు. పౌలు రోమా చట్టాన్ని కనీసం మూడు విధాలుగా మీరినట్టు యూదులు నింద మోపారు. అతను రోమాలో ఉన్న యూదుల మధ్య విభేదాలు తీసుకొస్తున్నాడనీ, ఒక ప్రమాదకరమైన తెగకి నాయకత్వం వహిస్తున్నాడనీ, రోమా సంరక్షణ కిందున్న దేవాలయాన్ని అపవిత్రపర్చడానికి ప్రయత్నిస్తున్నాడనీ చెప్పారు. (అపొ. 24:5-8) ఆ నిందలవల్ల అతనికి మరణ శిక్షపడొచ్చు.

ఆ సమయంలో పౌలు ఎలా వ్యవహరించాడో నేడున్న క్రైస్తవులు తెలుసుకోవడం ప్రాముఖ్యం. అతను ప్రశాంతంగా ఉంటూ, మర్యాదగా ప్రవర్తించాడు. ధర్మశాస్త్రంలో ఉన్నవాటిని, ప్రవక్తల మాటల్ని చెప్తూ “పితరుల దేవునిని” ఆరాధించే హక్కు తనకుందని అన్నాడు. రోమా చట్టం కిందున్న ఇతర యూదులకు కూడా ఆ హక్కు ఉంది. (అపొ. 24:14, 15) కొంతకాలానికి, తర్వాతి అధికారియైన పోర్కియు ఫేస్తు ముందు, రాజైన హేరోదు అగ్రిప్ప ముందు తన విశ్వాసాన్ని సమర్థిస్తూ పౌలు ధైర్యంగా మాట్లాడగలిగాడు.

చివరికి, తనకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో, ‘కైసరు ఎదుటనే చెప్పుకొంటాను’ అని పౌలు అన్నాడు. కైసరు అప్పట్లో అత్యంత శక్తివంతమైన పరిపాలకుడు.—అపొ. 25:11.

కైసరు కోర్టులో పౌలును విచారించడం

ఆ తర్వాత ఒక దేవదూత, “నీవు కైసరు ఎదుట నిలువవలసియున్నది” అని పౌలుకు చెప్పాడు. (అపొ. 27:24) రోమా చక్రవర్తి అయిన నీరో అన్ని కేసులను తానే విచారించనని తన పరిపాలన మొదట్లో చెప్పాడు. మొదటి ఎనిమిది సంవత్సరాల్లో, అతను సాధారణంగా కేసులను వేరేవాళ్లకు అప్పజెప్పాడు. ద లైఫ్‌ అండ్‌ ఇపిసల్స్‌ ఆఫ్‌ సెయింట్‌ పాల్‌ అనే పుస్తకం చెప్తున్నట్లు, నీరో ఏదైనా కేసును విచారించడానికి ఒప్పుకున్నప్పుడు, వాదోపవాదాలను తన రాజభవనంలోనే ఎంతో అనుభవం, పలుకుబడి ఉన్న సలహాదారుల సమక్షంలో వినేవాడు.

పౌలు కేసును స్వయంగా నీరోనే విని తీర్పుతీర్చాడో లేదా వేరేవాళ్లను నియమించి వాళ్ల ద్వారా పౌలు గురించి తెలుసుకున్నాడో బైబిలు చెప్పట్లేదు. విచారణ ఎలా జరిగినప్పటికీ, తాను యూదుల దేవున్ని ఆరాధించాననీ, ప్రభుత్వాన్ని గౌరవించమని ప్రజల్ని ప్రోత్సహించాననీ పౌలు వివరించివుంటాడు. (రోమా. 13:1-7; తీతు 3:1, 2) పౌలు ఉన్నతాధికారుల ముందు సువార్తను సమర్థించి కేసు గెలిచివుండొచ్చు, అందుకే కైసరు కోర్టు అతన్ని విడుదలచేసింది.—ఫిలి. 2:24; ఫిలే. 22.

సువార్తను సమర్థించడం మన బాధ్యత

యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు, “వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నానిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు.” (మత్త. 10:18) ఆ విధంగా యేసు తరఫున మాట్లాడడం మనకు దొరికిన ఓ గొప్ప అవకాశం. సువార్తను సమర్థించడానికి మనం చేసే ప్రయత్నాలవల్ల చట్టపరంగా విజయాలు సాధించవచ్చు. అయితే అపరిపూర్ణ మనుషులు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ, సువార్తను చెప్పే హక్కు మనకు యెహోవా దగ్గర నుండే వస్తుంది. అణచివేత, అన్యాయం నుండి శాశ్వత ఉపశమనాన్ని దేవుని రాజ్యం మాత్రమే ఇస్తుంది.—ప్రసం. 8:9; యిర్మీ. 10:23.

నేడు కూడా క్రైస్తవులు తమ విశ్వాసాన్ని సమర్థిస్తూ మాట్లాడినప్పుడు యెహోవా పేరుకు మహిమ తీసుకురాగలరు. పౌలులాగే మనం ప్రశాంతంగా, నిజాయితీగా ఉంటూ, ఇతరులను ఒప్పించే విధంగా మాట్లాడడానికి ప్రయత్నించాలి. యేసు తన అనుచరులతో, ‘ఎలా జవాబివ్వాలో ముందే ఆలోచించి పెట్టుకోకూడదని మీ మనసులో నిశ్చయించుకోండి. మీ వ్యతిరేకులందరు కలిసినా ఎదిరించలేని, తిప్పికొట్టలేని జ్ఞానాన్ని, మాటల్ని నేను మీకు ఇస్తాను’ అని చెప్పాడు.—లూకా 21:14-15, NW; 2 తిమో. 3:12; 1 పేతు. 3:15-16.

క్రైస్తవులు తమ విశ్వాసాన్ని సమర్థిస్తూ రాజులు, అధిపతులు, ఇతర అధికారుల ముందు మాట్లాడినప్పుడు వాళ్లకు సాక్ష్యమిస్తారు. నిజానికి అలాంటి వాళ్లకు వేరేవిధంగా సువార్త చేరడం కష్టం కావచ్చు. కోర్టు మనకు అనుకూలంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలవల్ల కొన్ని చట్టాలను సవరించారు. దానివల్ల స్వేచ్ఛగా మాట్లాడే, ఆరాధించే హక్కులను కాపాడుకునే వీలు మనకు దొరికింది. అలాంటి కేసుల్లో ఫలితం ఎలా ఉన్నా, విచారణ సమయంలో తన సేవకులు చూపించే ధైర్యాన్ని చూసి యెహోవా సంతోషిస్తాడు.

మన విశ్వాసాన్ని సమర్థిస్తూ మాట్లాడినప్పుడు యెహోవా పేరుకు ఘనత తీసుకొస్తాం

a జేమ్స్‌ పాక్స్‌ అనే రచయిత ఇలా రాశాడు, “యూదులకు . . . సొంత ఆచారాలను పాటించే హక్కు ఉండేది. అలాంటి అవకాశాలు కల్పించడం ప్రత్యేకమైన విషయమేమీ కాదు. ఎందుకంటే, తమ సామ్రాజ్యంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉండేవాళ్లకు సాధ్యమైనంత ఎక్కువ స్వేచ్ఛను ఇవ్వడం రోమన్ల ఆచారం. ఆ ఆచారాన్నే వాళ్లు పాటించారు.”