కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తల్లిదండ్రులారా, విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి మీ పిల్లలకు సహాయం చేయండి

తల్లిదండ్రులారా, విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి మీ పిల్లలకు సహాయం చేయండి

“యౌవనులు కన్యలు . . . యెహోవా నామమును స్తుతించుదురు గాక.”కీర్త. 148:12, 13.

పాటలు: 41, 48

1, 2. (ఎ) యెహోవాపై విశ్వాసం ఉంచమని తమ పిల్లలకు నేర్పించడం తల్లిదండ్రులకు ఎందుకు అంత తేలిక కాదు? అలా నేర్పించడానికి ఏకైక మార్గం ఏమిటి? (బి) ఈ ఆర్టికల్‌లో ఏ నాలుగు విషయాల గురించి చర్చిస్తాం?

 ఫ్రాన్స్‌లో ఉంటున్న ఓ జంట ఇలా అంటోంది, “మేము యెహోవాను నమ్ముతాం. అలాగని మా పిల్లలు కూడా నమ్ముతారని చెప్పలేం. విశ్వాసం వారసత్వంగా వచ్చేది కాదు. దాన్ని మన పిల్లలే మెల్లమెల్లగా సంపాదించుకోవాలి.” ఆస్ట్రేలియాలో ఉంటున్న ఓ సహోదరుడు ఇలా రాశాడు, “మీ పిల్లల హృదయంలో విశ్వాసం పెంపొందించడమే మీరు ఎదుర్కొనే అతి పెద్ద సవాలు కావచ్చు. మీ పిల్లవాడు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పి వాడి సందేహం తీర్చామని మీరు అనుకోవచ్చు. కానీ వాడు అదే ప్రశ్నను మళ్లీ కొన్నిరోజుల తర్వాత అడుగవచ్చు. మీ పిల్లవాని కూతూహలం తీర్చడానికి ఈరోజు మీరు చెప్పిన జవాబు రేపు సరిపోకపోవచ్చు.” పిల్లలు పెద్దవాళ్లయ్యే కొద్దీ, ఒకప్పుడు వాళ్లకు చెప్పిన విషయాల్నే మరింత వివరంగా మళ్లీ చెప్పాల్సిన అవసరం ఉందని చాలామంది తల్లిదండ్రులు భావిస్తారు. అంతేకాదు వాళ్లకు యెహోవాను ప్రేమించడం నేర్పించాలంటే వేర్వేరు పద్ధతులు ఉపయోగించాలని కూడా అర్థంచేసుకుంటారు.

2 మీరు తల్లిదండ్రులు అయ్యుంటే, మీ పిల్లలకు యెహోవాను ప్రేమించడం, పెద్దయ్యాక కూడా ఆయన్ను సేవిస్తూ ఉండడం నేర్పించగలమా అని ఎప్పుడైనా అనుకున్నారా? నిజానికి మనలో ఎవ్వరం సొంత శక్తితో అలా నేర్పించలేం. (యిర్మీ. 10:23) కాబట్టి సహాయం కోసం యెహోవాపై ఆధారపడడమే ఏకైక మార్గం. ఈ విషయంలో ఆయన తల్లిదండ్రులకు మంచి నడిపింపును ఇచ్చాడు. మరి మీరు మీ పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు? (1) మీ పిల్లల మనసులో ఏముందో తెలుసుకోండి. (2) యెహోవా గురించి మీరు నేర్చుకున్న విషయాలు వాళ్లకు చెప్పండి. (3) ఉదాహరణలు ఉపయోగించండి. (4) ఓపిగ్గా ఉంటూ, పవిత్రశక్తి కోసం ప్రార్థించండి.

మీ పిల్లల మనసులో ఏముందో తెలుసుకోండి

3. తల్లిదండ్రులు ఏవిధంగా యేసును ఆదర్శంగా తీసుకోవచ్చు?

3 తన శిష్యులు ఏమి నమ్ముతున్నారో యేసు తరచూ అడిగేవాడు. (మత్త. 16:13-15) మీరు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవచ్చు. మీరు మీ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు లేదా వాళ్లతో కలిసి ఏదైనా పని చేస్తున్నప్పుడు వాళ్ల మనసులో ఏముందో అడగండి. ఒకవేళ వాళ్లకు ఏవైనా సందేహాలు ఉన్నాయేమో తెలుసుకోండి. ఆస్ట్రేలియాలో ఉంటున్న 15 ఏళ్ల ఓ సహోదరుడు ఇలా చెప్పాడు, “మా డాడీ నా నమ్మకాల గురించి తరచుగా నాతో మాట్లాడతాడు. నేను నమ్ముతున్నవి నిజమో కాదో ఆలోచించుకోవడానికి సహాయం చేస్తాడు. డాడీ నన్ను, ‘బైబిలు ఏం చెప్తోంది?’ ‘దాన్ని నువ్వు నమ్ముతున్నవా?’ ‘ఎందుకు నమ్ముతున్నావు?’ అని అడుగుతాడు. అప్పుడు, డాడీ లేదా మమ్మీ చెప్పిన మాటల్నే నేను మళ్లీ చెప్పకుండా వాటికి నా సొంత మాటల్లో జవాబులు చెప్పాలని డాడీ ఎదురుచూసేవాడు. నేను పెద్దవాడినయ్యే కొద్దీ జవాబుల్ని మరింత వివరంగా చెప్పాల్సి వచ్చేది.”

4. మీ పిల్లలు అడిగే ప్రశ్నలకు మీరు ఓపిగ్గా జవాబు ఇవ్వడం ఎందుకు ముఖ్యం? ఓ ఉదాహరణ చెప్పండి.

4 బైబిలు చెప్తున్నవాటిని మీ పిల్లలు వెంటనే నమ్మకపోతే కోప్పడకండి లేదా మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ప్రయత్నించకండి. బదులుగా ఓపిగ్గా ఉంటూ తమ సందేహాలకు జవాబులు తెలుసుకునేలా వాళ్లకు సహాయం చేయండి. ఓ తండ్రి ఇలా చెప్పాడు, “మీ పిల్లలు ఏవైనా ప్రశ్నలు అడిగితే చిన్న విషయమేనని కొట్టిపారేయకండి. లేదా మీకు ఆ ప్రశ్నకు జవాబు చెప్పడం ఇబ్బందిగా అనిపించి టాపిక్‌ మార్చేయకండి.” నిజానికి పిల్లలు మిమ్మల్ని ప్రశ్నలు అడగడం మంచిదే, ఎందుకంటే వాళ్లు అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని దానర్థం. యేసు కూడా చిన్నతనంలో ప్రశ్నలు అడిగాడు. (లూకా 2:46 చదవండి.) డెన్‌మార్క్‌లో ఉంటున్న ఓ టీనేజీ పిల్లవాడు ఇలా చెప్పాడు, “మనం నమ్ముతున్న మతం నిజమైనదేనా అని నేను అడిగినప్పుడు మా అమ్మానాన్నలు మనసులో ఆందోళనపడ్డారు, కానీ పైకి ప్రశాంతంగా ఉన్నారు. వాళ్లు లేఖనాలు చూపించి నా ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పారు.”

5. పిల్లలు ప్రీచింగ్‌కి, మీటింగ్స్‌కు వస్తున్నప్పటికీ తల్లిదండ్రులు ఏమి చేయాలి?

5 మీ పిల్లల మనసులో ఏముందో తెలుసుకోండి. పిల్లలు ప్రీచింగ్‌కి, మీటింగ్స్‌కు వస్తున్నారు కాబట్టి వాళ్లకు యెహోవాపై విశ్వాసం ఉందనే అభిప్రాయానికి వచ్చేయకండి. అసలు వాళ్లకు యెహోవాపై, బైబిలుపై ఎలాంటి అభిప్రాయం ఉంది? ఏదైనా కారణంవల్ల యెహోవాకు నమ్మకంగా ఉండడం వాళ్లకు కష్టంగా అనిపిస్తోందేమో తెలుసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించండి. ప్రతీరోజు మీ పిల్లలతో కలిసి ఏదైనా పని చేస్తున్నప్పుడు యెహోవా గురించి మాట్లాడండి. మీరు వాళ్లతో కలిసి ప్రార్థిస్తున్నప్పుడు, అలాగే ఒంటరిగా ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ల కోసం ప్రార్థించండి.

యెహోవా గురించి మీరు నేర్చుకున్న విషయాలు వాళ్లకు చెప్పండి

6. తల్లిదండ్రులు యెహోవా గురించి, బైబిలు గురించి తెలుసుకుంటూ ఉండడం వల్ల పిల్లలకు చక్కగా ఎలా నేర్పించగలుగుతారు?

6 యేసుకు యెహోవాపై ప్రేమ, లేఖనాలపై పట్టు ఉన్నాయి కాబట్టి ఆయన చెప్పేవి వినడానికి ప్రజలు ఇష్టపడ్డారు. అంతేకాదు ఆయన తమను ప్రేమిస్తున్నాడని ప్రజలకు అర్థమైంది కాబట్టి ఆయన చెప్పే విషయాల్ని శ్రద్ధగా విన్నారు. (లూకా 24:32; యోహా. 7:46) అదేవిధంగా మీకు యెహోవాపై ప్రేమ ఉందని మీ పిల్లలు చూసినప్పుడు వాళ్లు కూడా ఆయన్ను ప్రేమిస్తారు. (ద్వితీయోపదేశకాండము 6:5-8; లూకా 6:45 చదవండి.) కాబట్టి తల్లిదండ్రులారా, బైబిల్ని శ్రద్ధగా అధ్యయనం చేస్తూ ఉండండి, మన ప్రచురణల్ని క్రమంగా చదవండి. యెహోవా చేసిన సృష్టి గురించి ఎక్కువ తెలుసుకుంటూ ఉండండి. (మత్త. 6:26, 28) మీరు యెహోవా గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే, ఆయన గురించి మీ పిల్లలకు అంత ఎక్కువ నేర్పించగలుగుతారు.—లూకా 6:40.

7, 8. మీరు యెహోవా గురించి ఏదైనా నేర్చుకున్న ప్రతీసారి ఏమి చేయవచ్చు? కొంతమంది తల్లిదండ్రులు ఏమి చేశారు?

7 మీరు యెహోవా గురించి ఏదైనా నేర్చుకున్న ప్రతీసారి దాన్ని మీ పిల్లలకు చెప్పండి. కేవలం మీటింగ్స్‌కు సిద్ధపడుతున్నప్పుడో లేదా కుటుంబ ఆరాధన సమయంలోనో మాత్రమే కాదు ఏ సమయంలోనైనా యెహోవా గురించి చెప్పండి. అమెరికాలో ఉంటున్న ఓ జంట అలానే చేస్తోంది. వాళ్లకు ప్రకృతిలో ఏదైనా అందంగా కనిపించినప్పుడు లేదా నోరూరించే భోజనం తింటున్నప్పుడు తమ పిల్లలతో యెహోవా గురించి మాట్లాడతారు. వాళ్లిలా చెప్పారు, “యెహోవా మనకోసం చేసిన ప్రతీదానిలో ఆయనకున్న ప్రేమ, ముందుచూపు ఎలా కనిపిస్తాయో మా పిల్లలకు గుర్తుచేస్తుంటాం.” దక్షిణ ఆఫ్రికాలో ఉంటున్న ఓ జంట, తమ ఇద్దరు కూతుళ్లతో కలిసి తోటలో పనిచేస్తున్నప్పుడు సృష్టి గురించి వాళ్లతో మాట్లాడడానికి ఇష్టపడతారు. ఉదాహరణకు ఓ విత్తనం నుండి మొక్క రావడం ఎంత అద్భుతమైన విషయమో వాళ్లకు చెప్తుంటారు. ఆ జంట ఇలా చెప్పింది, “జీవం పట్ల, దాని సంశ్లిష్టత పట్ల మా కూతుళ్లలో అపారమైన గౌరవాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తుంటాం.”

8 ఆస్ట్రేలియాలో ఉంటున్న ఓ వ్యక్తి పదేళ్ల తన కొడుకును మ్యూజియంకు తీసుకెళ్లాడు. ఆ తండ్రి ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని తన కొడుకు విశ్వాసాన్ని బలపర్చాలని, యెహోవాయే సృష్టికర్త అని నమ్మడానికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతనిలా చెప్పాడు, “మేము పురాతన సముద్ర శిలాజాలను చూశాం. అంతరించిపోయిన ఈ జంతువులు అందంగా, సంశ్లిష్టంగా, సంపూర్ణంగా ఉండడం చూసి మేం ఆశ్చర్యపోయాం. ఈరోజుల్లో ఉన్న జంతువులకు అవి ఎందులోనూ తీసిపోవు. ఒకవేళ జీవం సామాన్యమైన వాటితో ఉద్భవించి క్రమ క్రమంగా సంశ్లిష్టంగా మారి ఉంటే, పురాతనమైన ఆ జీవులు అప్పుడే ఎందుకు అంత సంశ్లిష్టంగా ఉన్నాయి? వాటిని చూసి నేను నేర్చుకున్న ఆ పాఠాన్ని వెంటనే నా కొడుకుకు కూడా చెప్పాను.”

ఉదాహరణలు ఉపయోగించండి

9. ఉదాహరణలు ఉపయోగించడం ఎందుకు మంచిది? ఓ సహోదరి ఏ ఉదాహరణ ఉపయోగించింది?

9 యేసు ఉదాహరణలు ఎక్కువగా ఉపయోగించాడు. ఆయన ప్రాముఖ్యమైన పాఠాలను ఉదాహరణలతో బోధించాడు. (మత్త. 13:34, 35) అదేవిధంగా మీరు ఉదాహరణలు ఉపయోగించి నేర్పించినప్పుడు మీ పిల్లలు తమ ఊహాశక్తిని ఉపయోగించి ఆలోచిస్తారు. దానివల్ల మీరు వాళ్లకు నేర్పిస్తున్న పాఠమేమిటో ఆలోచిస్తారు, స్పష్టంగా అర్థంచేసుకుంటారు, గుర్తుంచుకుంటారు. పైగా అలా ఉదాహరణలు చెప్తే పిల్లలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు కూడా. ఉదాహరణకు జపాన్‌లో ఉంటున్న ఓ సహోదరి అనుభవాన్ని పరిశీలించండి. ఆమెకు ఇద్దరు కొడుకులు, వాళ్లలో ఒకరికి పదేళ్లు మరొకరికి ఎనిమిదేళ్లు. యెహోవా భూవాతావరణాన్ని చేసిన విధానాన్ని బట్టి ఆయనకు మన మీద ఎంత శ్రద్ధ ఉందో తన ఇద్దరి కొడుకులు తెలుసుకోవాలని అనుకుంది. కాబట్టి వాళ్ల వయసుకు సరిపోయే ఓ ఉదాహరణ ఆమె ఉపయోగించింది. ఆమె తన ఇద్దరి పిల్లలకు పాలు, చక్కెర, కాఫీ పొడి ఇచ్చి తనకోసం కాఫీ చేయమని అడిగింది. “వాళ్లు చాలా శ్రద్ధగా చేశారు” అని ఆమె చెప్తోంది. అంతేకాదు, “ఎందుకు అంత శ్రద్ధగా చేశారని నేను వాళ్లను అడిగినప్పుడు, నాకు నచ్చేలా చేద్దామనుకున్నామని వాళ్లు చెప్పారు. అప్పుడు నేను, దేవుడు కూడా మన మీద శ్రద్ధతో వాతావరణంలోని అన్ని వాయువులను సరిగ్గా మనకు కావాల్సినంత మోతాదులో ఉంచాడని వాళ్లకు వివరించాను” అని ఆమె చెప్పింది. అలా ఉదాహరణ సహాయంతో నేర్చుకోవడం వాళ్లకు బాగా నచ్చింది, నేర్చుకున్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు కూడా.

సృష్టికర్త ఉన్నాడని మీ పిల్లలకు నేర్పించడానికి చిన్నచిన్న ఉదాహరణలు ఉపయోగించవచ్చు (10వ పేరా చూడండి)

10, 11. (ఎ) సృష్టికర్త ఉన్నాడని మీ పిల్లలకు చెప్పడానికి మీరు ఏ ఉదాహరణ ఉపయోగించవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) మీరు ఉపయోగించిన ఏవైనా ఉదాహరణలు చెప్పండి.

10 సృష్టికర్త ఉన్నాడని మీ పిల్లలకు నేర్పించడానికి మీరు ఏ ఉదాహరణ ఉపయోగించవచ్చు? బహుశా మీరు, మీ పిల్లలతో కలిసి ఓ కేక్‌ను తయారుచేయవచ్చు. ఆ కేక్‌ను తయారుచేసేందుకు ఓ పద్ధతిని పాటించడం ఎందుకు ముఖ్యమో వివరించండి. ఆ తర్వాత మీ పిల్లలకు యాపిల్‌ను లేదా వేరే ఏదైనా పండును ఇచ్చి, “ఈ పండు కూడా ఓ పద్ధతి ప్రకారం చేయబడిందని మీకు తెలుసా?” అని అడగండి. తర్వాత ఆ పండును రెండు ముక్కలు చేసి విత్తనాన్ని చూపించండి. పండును తయారుచేసేందుకు కావాల్సిన పద్ధతి విత్తనంలో ఉంటుందని వివరించండి. అయితే ఆ పద్ధతి కేక్‌ తయారుచేయడం కన్నా చాలా సంశ్లిష్టమైనదని చెప్పండి. అంతేకాదు మీరిలా అడగవచ్చు, “కేక్‌ తయారుచేసే పద్ధతిని ఎవరో ఒకరు కనిపెట్టారు. మరి యాపిల్‌ను తయారుచేసే పద్ధతిని ఎవరు కనిపెట్టారు?” ఒకవేళ మీ పిల్లలు పెద్దవాళ్లైతే, చెట్టును లేదా పండ్లను తయారుచేసే పద్ధతి ఆ పండ్ల DNAలో ఉంటుందని వివరించవచ్చు. వీలైతే ద ఆరిజన్‌ ఆఫ్‌ లైఫ్‌—ఫైవ్‌ క్వశ్చన్స్‌ వర్త్‌ ఆస్కింగ్‌ (ఇంగ్లీషు) అనే బ్రోషురులోని 10 నుండి 20 పేజీల్లో ఉన్న బొమ్మల్ని, ఉదాహరణల్ని చూపించండి.

11 చాలామంది తల్లిదండ్రులు తేజరిల్లు! పత్రికలో “సృష్టిలోని అద్భుతాలు” అనే శీర్షికతో వస్తున్న ఆర్టికల్స్‌ను తమ పిల్లలతో కలిసి చదువుతారు. ఒకవేళ పిల్లలు మరీ చిన్నవాళ్లయితే అందులోని సమాచారాన్ని వాళ్లకు తేలిగ్గా అర్థమయ్యేలా వివరించవచ్చు. ఉదాహరణకు డెన్‌మార్క్‌లోని ఓ జంట, విమానాలను పక్షులతో పోల్చారు. వాళ్లిలా చెప్పారు, “విమానాలు అచ్చం పక్షుల్లానే కనిపిస్తాయి. కానీ అవి గుడ్లు పెట్టి చిన్నచిన్న విమానాలను పొదగగలవా? నేల మీద వాలేందుకు పక్షులకు ఏవైనా ప్రత్యేకమైన గుర్తులు అవసరమా? విమానాల మోతకు, పక్షుల కిలకిలరావాలకు ఎంత తేడా! మరి ఇప్పుడు ఎవరు ఎక్కువ తెలివైనవాళ్లు? విమానాలను తయారుచేసిన వాళ్లా లేక పక్షులను చేసిన సృష్టికర్తా?” ఈ విధంగా మీరు మీ పిల్లలతో ఆలోచింపజేసేలా మాట్లాడుతూ ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్లు “వివేచన” ఉపయోగించడానికి, యెహోవాపై విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి సహాయం చేసినవాళ్లౌతారు.—సామె. 2:10-12.

12. బైబిల్లో ఉన్న ప్రతీ విషయం నిజమైనదని మీ పిల్లలకు నేర్పించడానికి ఉదాహరణల్ని ఏవిధంగా ఉపయోగించవచ్చు?

12 బైబిలు చెప్పే ప్రతీ విషయం నిజమని నేర్పించడానికి కూడా మీరు ఉదాహరణలు ఉపయోగించవచ్చు. ఒకవేళ మీరు యోబు 26:7 వ వచనం గురించి మీ పిల్లలతో మాట్లాడుతుంటే, ఈ వచనంలోని సమాచారం యెహోవా నుండి వచ్చి ఉంటుందని చెప్పడం మాత్రమే సరిపోదు. (చదవండి.) బదులుగా వాళ్లు తమ ఊహాశక్తిని ఉపయోగించడానికి సహాయం చేయండి. యోబు కాలంలోని ప్రజలు భూమి శూన్యంలో వేలాడుతోందనే విషయాన్ని నమ్మి ఉండకపోవచ్చని మీ పిల్లవానితో చెప్పవచ్చు. అంతేకాదు బంతి, రాయి వంటి వస్తువులు గాల్లో తేలుతూ ఉండలేవని వాళ్లకు తెలుసు. పైగా ఆ కాలంలో టెలిస్కోప్‌లు లేదా స్పేస్‌షిప్‌లు ఉండేవి కావు కాబట్టి భూమి శూన్యంలో వేలాడుతోందని అప్పటికి ఎవ్వరూ నిరూపించలేదు. ఇప్పుడు పాఠమేమిటంటే, బైబిలు ఎంతోకాలం కిందట రాయబడినప్పటికీ దాన్ని రాయించింది యెహోవా కాబట్టి అందులోని సమాచారం ఎప్పుడూ నిజమైనదే.—నెహె. 9:6.

బైబిలు చెప్తున్నట్లు చేయడం ఎందుకు మంచిదో వాళ్లకు నేర్పించండి

13, 14. బైబిలు చెప్తున్నట్లు చేయమని తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలా నేర్పించవచ్చు?

13 బైబిలు చెప్తున్నట్లు చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంటామని మీ పిల్లలకు నేర్పించడం కూడా ముఖ్యమే. (కీర్తన 1:1-3 చదవండి.) ఉదాహరణకు, ఓ దీవిలో జీవించడానికి వెళ్తున్నట్లు ఊహించుకోమని మీ పిల్లలకు చెప్పవచ్చు. ఇప్పుడు వాళ్లు తమతోపాటు అక్కడ ఉండడానికి కొంతమందిని ఎంపిక చేసుకోవాలి. మీరు వాళ్లను ఇలా అడగవచ్చు, “మీరు అక్కడ ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలనుకుంటే ఎలాంటి వాళ్లను ఎంపిక చేసుకుంటారు?” ఆ తర్వాత మీరు గలతీయులు 5:19-24 వచనాల్ని చదివి, కొత్తలోకంలో ఎలాంటివాళ్లు ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడో మీరు వాళ్లకు చెప్పవచ్చు.

14 ఈ విధంగా మీరు మీ పిల్లలకు రెండు ముఖ్యమైన పాఠాల్ని నేర్పించవచ్చు. మొదటిది, మనం ఇప్పుడు సంతోషంగా ఎలా జీవించవచ్చో, ఇతరులతో ఎలా సమాధానంగా ఉండవచ్చో యెహోవా మనకు నేర్పిస్తున్నాడు. రెండవది, కొత్తలోకంలో ఎలా జీవించాలో ఆయన మనకు ఇప్పుడే నేర్పిస్తున్నాడు. (యెష. 54:13; యోహా. 17:3) అయితే బైబిలు మన సహోదరులకు ఏవిధంగా సహాయం చేసిందో కూడా మీరు మీ పిల్లలకు చూపించండి. ఉదాహరణకు, మన ప్రచురణల్లో వచ్చిన ఏదైనా ఒక జీవిత కథను వాళ్లకు చూపించవచ్చు. బహుశా కావలికోటలో “బైబిలు జీవితాల్ని మారుస్తుంది” అనే శీర్షికతో వచ్చే ఆర్టికల్స్‌ని చూపించవచ్చు. లేదా యెహోవాను సంతోషపెట్టేలా పెద్దపెద్ద మార్పులు చేసుకోవడానికి బైబిలు ఎలా సహాయం చేసిందో మీకూ, మీ పిల్లలకూ చెప్పమని మీ సంఘంలో ఎవరినైనా అడగండి.—హెబ్రీ. 4:12.

15. పిల్లలకు నేర్పించడానికి మీకేమి సహాయం చేస్తుంది?

15 మీ ఊహాశక్తిని ఉపయోగించి పిల్లలకు ఆసక్తికరంగా, ఉత్సాహంగా అనిపించేలా వాళ్లకు నేర్పించండి. వాళ్లు యెహోవా గురించి నేర్చుకోవడాన్ని, ఆయనకు దగ్గరవ్వడాన్ని ఇష్టపడేలా వేర్వేరు పద్ధతులు ఉపయోగించండి. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నప్పటికీ అలానే నేర్పిస్తూ ఉండండి. “పాత విషయాలను కొత్త పద్ధతుల్లో నేర్పించడం ఎప్పుడూ ఆపకండి” అని ఓ తండ్రి చెప్పాడు.

ఓపిగ్గా ఉంటూ, పవిత్రశక్తి కోసం ప్రార్థించండి

16. పిల్లలకు నేర్పిస్తున్నప్పుడు ఓపిగ్గా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం? కొంతమంది తల్లిదండ్రులు ఏవిధంగా ఓపిగ్గా ఉన్నారు?

16 పవిత్రశక్తి సహాయంతో మీ పిల్లలు బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకోగలరు. (గల. 5:22-24) కానీ అందుకు సమయం పడుతుంది. కాబట్టి ఓపిగ్గా ఉంటూ వాళ్లకు నేర్పిస్తూ ఉండండి. ఇద్దరు పిల్లలున్న జపాన్‌లోని ఓ వ్యక్తి ఇలా చెప్పాడు, “నేనూ, నా భార్య మా పిల్లల విషయంలో చాలా శ్రద్ధ చూపించాం. మీటింగ్స్‌ ఉన్న రోజులు తప్పితే, వాళ్లు చిన్నగా ఉన్నప్పటి నుండి ప్రతీరోజు 15 నిమిషాలపాటు వాళ్లతో కలిసి అధ్యయనం చేసేవాడిని. 15 నిమిషాలు కేటాయించడం మాకు గానీ, మా పిల్లలకు గానీ కష్టంగా అనిపించలేదు.” ఓ ప్రాంతీయ పర్యవేక్షకుడు ఇలా రాశాడు, “నేను టీనేజీలో ఉన్నప్పుడు నా మనసులో ఎన్నో ప్రశ్నలు, సందేహాలు ఉండేవి. కానీ ఎన్నడూ వాటిని బయటికి చెప్పలేదు. అయితే కాలం గడుస్తుండగా, వాటిలో చాలావాటికి జవాబులు మీటింగ్స్‌లో, కుటుంబ ఆరాధన లేదా వ్యక్తిగత అధ్యయనంలో దొరికాయి. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తూ ఉండడం ప్రాముఖ్యం.”

మీ పిల్లలకు చక్కగా నేర్పించగలగాలంటే మీకు బైబిలు మీద ప్రేమ ఉండాలి (17వ పేరా చూడండి)

17. తల్లిదండ్రులు తమ విశ్వాసాన్ని బలపర్చుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? బెర్ముడాలోని ఓ జంట తమ కూతుళ్ల విశ్వాసాన్ని బలపర్చడానికి ఏం చేసింది?

17 నిజమే, మీకు యెహోవాపై బలమైన విశ్వాసం ఉందని మీ పిల్లలు చూసినప్పుడు వాళ్లు మీ నుండి ఎంతో నేర్చుకుంటారు. మీరు చేస్తున్న పనులను వాళ్లు గమనిస్తుంటారు కాబట్టి మీ విశ్వాసాన్ని బలపర్చుకుంటూ ఉండండి. మీరు యెహోవాను ఓ నిజమైన వ్యక్తిలా చూస్తున్నారని మీ పిల్లలకు తెలిసేలా చేయండి. ఉదాహరణకు, బెర్ముడాలోని ఓ జంట, తమకు ఏదైనా ఓ విషయం ఆందోళన కలిగిస్తుంటే తమ కూతుళ్లతో కలిసి యెహోవాకు ప్రార్థిస్తూ నడిపింపు కోసం అడుగుతారు. తమ పిల్లల్ని సొంతగా ప్రార్థించమని కూడా ప్రోత్సహిస్తారు. “మేము మా పెద్ద కూతురికి ‘యెహోవాపై పూర్తి నమ్మకం ఉంచు, దేవుని సేవ చేస్తూ బిజీగా ఉండు, ఎక్కువ దిగులుపడకు’ అని చెప్తుంటాం. అలా చేయడం వల్ల వచ్చిన ఫలితాలను చూసినప్పుడు యెహోవా మాకు సాయం చేస్తున్నాడని ఆమె గ్రహిస్తుంది. మా అమ్మాయి దేవుని మీద, బైబిలు మీద విశ్వాసం పెంచుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడింది.”

18. తల్లిదండ్రులు ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి?

18 తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లల్లో బలవంతంగా విశ్వాసాన్ని కలిగించలేరని గుర్తుంచుకోండి. మీరు కేవలం నాటి, నీళ్లు పోయగలరు. కానీ దాన్ని ఎదిగేలా చేయగలిగేది మాత్రం యెహోవాయే. (1 కొరిం. 3:6) కాబట్టి ఆయన గురించి మీ పిల్లలకు నేర్పించడానికి బాగా కృషి చేయండి, వాళ్లలో విశ్వాసం కలుగజేయడానికి పవిత్రశక్తిని సహాయంగా ఇవ్వమని ప్రార్థించండి. యెహోవా మీ కష్టానంతటినీ తప్పకుండా ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ఉండండి.—ఎఫె. 6:4.