కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నీ చేతులు దించకు”

“నీ చేతులు దించకు”

“నీ చేతులు దించకు!”జెఫ. 3:16, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

పాటలు: 54, 32

1, 2. (ఎ) నేడు చాలామంది ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారు? దానివల్ల వాళ్లు దేనికి గురౌతున్నారు? (బి) యెషయా 41:9-10, 13 వచనాలు ఏ అభయాన్ని ఇస్తున్నాయి?

 క్రమ పయినీరుగా సేవ చేస్తున్న ఓ సంఘపెద్ద భార్య ఇలా చెప్తోంది, “నేను ఆధ్యాత్మికంగా బలంగా ఉండడానికి కృషి చేసినప్పటికీ, చాలా ఏళ్లపాటు ఆందోళనతో సతమతమయ్యాను. దానివల్ల సరిగ్గా నిద్రపట్టేది కాదు, ఆరోగ్యం పాడైంది. అంతేకాదు వేరేవాళ్లతో సరిగ్గా ప్రవర్తించలేకపోయేదాన్ని. కొన్నిసార్లయితే, ఇక నా వల్ల కాదనిపించేది.”

2 ఆ సహోదరి భావాల్ని మీరు అర్థం చేసుకోగలరా? మనం సాతాను చేతుల్లో ఉన్న దుష్టలోకంలో జీవిస్తున్నాం కాబట్టి తీవ్రమైన ఒత్తిడికి గురౌతుంటాం. లంగరు ఎలాగైతే పడవను ముందుకు వెళ్లనివ్వదో, అలాగే ఆందోళన మనసును భారంగా లేదా నిరుత్సాహంగా ఉండేలా చేసి మనల్ని ముందుకు కొనసాగనివ్వకపోవచ్చు. (సామె. 12:25) ఇంతకీ ఏ కారణాలవల్ల మీకు ఆందోళన కలగవచ్చు? బహుశా మీకు ఇష్టమైనవాళ్లు చనిపోయినందుకు మీరు బాధపడుతుండవచ్చు, లేదా మీరు తీవ్రమైన అనారోగ్యాన్నో, వ్యతిరేకతనో ఎదుర్కొంటుండవచ్చు. లేదా చాలీచాలని డబ్బుతో కుటుంబాన్ని పోషించడానికి కష్టపడుతుండవచ్చు. కాలం గడిచేకొద్దీ, మానసిక ఆందోళన మీలోని బలాన్ని నీరుగార్చి, చివరికి మీ ఆనందాన్ని కూడా కోల్పోయేలా చేయగలదు. ఏదేమైనా దేవుడు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడనే నమ్మకంతో ఉండండి.—యెషయా 41:9-10, 13 చదవండి.

3, 4. (ఎ) బైబిల్లో ‘చెయ్యి’ అనే మాట దేన్ని సూచిస్తుంది? (బి) ఎలాంటి పరిస్థితులవల్ల మీకు నిరుత్సాహం కలగవచ్చు?

3 బైబిలు చాలాసార్లు, వేర్వేరు లక్షణాల్ని లేదా పనుల్ని వర్ణించడానికి మనిషి అవయవాల్ని ఉపయోగించింది. ఉదాహరణకు చెయ్యి గురించిన ప్రస్తావన బైబిల్లో కొన్ని వందలసార్లు కనిపిస్తుంది. ఫలానా వ్యక్తి చేతులు బలపర్చబడ్డాయని బైబిలు అన్నప్పుడు, ఆ వ్యక్తి ప్రోత్సహించబడి బలం పొందాడని, చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని దానర్థం. (1 సమూ. 23:16, 17; ఎజ్రా 6:22) అంతేకాదు ఆ వ్యక్తి నిరుత్సాహంతో కాకుండా భవిష్యత్తు విషయంలో ఆశతో ఉన్నాడని కూడా దానర్థం.

4 అయితే కొన్ని సందర్భాల్లో, ఒకరు తమ చేతులను కిందికి దించడం అనేది నిరుత్సాహపడడాన్ని, లేదా ఆశను వదులుకోవడాన్ని సూచిస్తుంది. (2 దిన. 15:7; హెబ్రీ. 12:12) మీరు ఒత్తిడికి లోనైనప్పుడో, జీవితంలో బాగా అలసిపోయినప్పుడో లేదా యెహోవాతో మీ సంబంధం బలహీనపడుతోందని అనిపించినప్పుడో, ఇక మీ వల్ల కాదని మీరు అనుకోవచ్చు. అలాంటి సందర్భాల్లో మీకు ప్రోత్సాహం ఎక్కడ దొరుకుతుంది? సమస్యల్ని సహిస్తూ ఆనందంగా ఉండడానికి కావాల్సిన బలాన్ని, ఉత్సాహాన్ని ఎక్కడ పొందగలరు?

“రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు”

5. (ఎ) సమస్యలు వచ్చినప్పుడు మనకెలా అనిపించవచ్చు? కానీ మనం ఏ విషయం గుర్తుంచుకోవాలి? (బి) ఈ ఆర్టికల్‌లో ఏమి చర్చిస్తాం?

5 జెఫన్యా 3:16, 17 చదవండి. సమస్యలు వచ్చినప్పుడు మనం భయపడకూడదు, నిరుత్సాహపడకూడదు. మరో మాటలో చెప్పాలంటే మన చేతుల్ని కిందకు దించకూడదు. ఎందుకంటే మన ఆందోళనంతా తన మీద వేయమని ప్రేమగల తండ్రైన యెహోవా చెప్తున్నాడు. (1 పేతు. 5:7) ఆయన ఇశ్రాయేలు జనాంగాన్ని శ్రద్ధగా చూసుకున్నట్లే మనల్ని కూడా చూసుకుంటాడు. ఆయన ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు, “రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు.” అవును, తన నమ్మకమైన సేవకుల్ని రక్షించడానికి ఆయనెప్పుడూ సిద్ధంగా ఉంటాడు. (యెష. 59:1) తన సేవకులకు తీవ్రమైన కష్టాలు వచ్చినప్పటికీ తన చిత్తం చేసేందుకు కావాల్సిన బలాన్ని యెహోవా ఇస్తాడు. అలా ఇవ్వాలనే కోరిక, ఇచ్చే సామర్థ్యం యెహోవాకు ఉన్నాయని నిరూపించే మూడు అసాధారణమైన ఉదాహరణల్ని ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. ఈ ఉదాహరణలు మిమ్మల్ని ఏవిధంగా బలపర్చగలవో గమనిద్దాం.

6, 7. అమాలేకీయులపై ఇశ్రాయేలీయులు ఎలా విజయం సాధించారు? దాన్నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

6 ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదలైన కొంతకాలానికే అమాలేకీయులు వాళ్లపై దాడి చేశారు. అయితే యుద్ధ సమయంలో ఇశ్రాయేలీయుల్ని నడిపించమని మోషే ధైర్యవంతుడైన యెహోషువకు చెప్పాడు. ఆ తర్వాత మోషే అహరోను, హూరులను తీసుకొని దగ్గర్లోని కొండ మీదకు వెళ్లాడు, అక్కడనుండి యుద్ధం జరిగే స్థలం వాళ్లకు కనిపిస్తుంది. ఇంతకీ వాళ్లు ముగ్గురు యుద్ధం చేయడానికి భయపడి పారిపోయారా? లేదు.

7 మోషే చేసిన ఓ పని, అమాలేకీయులతో యుద్ధం చేసి గెలవడానికి ఇశ్రాయేలీయులకు సహాయం చేసింది. అతను సత్యదేవుని కర్రను తీసుకుని, దాన్ని ఆకాశంవైపు ఎత్తి పట్టుకున్నాడు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులకు, అమాలేకీయులతో పోరాడే శక్తిని ఇచ్చాడు. కానీ మోషేకు చేతులు నొప్పి పుట్టి తన కర్రను కిందకు దించడం మొదలుపెట్టినప్పుడు అమాలేకీయులు గెలవడం ప్రారంభించారు. వెంటనే అహరోను, హూరులు మోషేకు సహాయం చేశారు. వాళ్లు “ఒక రాయి తీసికొని వచ్చి అతడు దానిమీద కూర్చుండుటకై దానివేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించువరకు నిలుకడగా ఉండెను.” అలా, దేవుని బలమైన చేతి సహాయంతో ఇశ్రాయేలీయులు యుద్ధంలో గెలిచారు.—నిర్గ. 17:8-13.

8. (ఎ) కూషీయులు యూదా మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు ఆసా ఏమి చేశాడు? (బి) ఆసా నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

8 రాజైన ఆసా కాలంలో కూడా, యెహోవా తన శక్తివంతమైన చేతితో తన ప్రజల్ని రక్షించాడు. బైబిల్లో చాలా సైన్యాల గురించిన ప్రస్తావన ఉంది, వాటిలో అన్నిటికన్నా కూషీయుడైన జెరహు సైన్యమే పెద్దది. అతని దగ్గర 10 లక్షల మంది శిక్షణ పొందిన సైనికులు ఉండేవాళ్లు. అంటే ఆసా సైన్యం కన్నా దాదాపు రెండింతలు పెద్దది. మరి, వాళ్లను చూసిన ఆసా తన చేతుల్ని కిందకు దించేశాడా, అంటే కంగారుపడి ఇక ఓడిపోవడం ఖాయమని ఆశలు వదిలేసుకున్నాడా? లేదు. బదులుగా వెంటనే యెహోవాను సహాయం అడిగాడు. సైనిక బలగాన్ని బట్టి చూస్తే కూషీయులతో యుద్ధం చేసి గెలవడం అసాధ్యమని అనిపించివుండవచ్చు. కానీ ‘దేవునికి సమస్తము సాధ్యం.’ (మత్త. 19:26) యెహోవా తన గొప్ప శక్తితో ‘కూషీయులను ఆసా ఎదుట మొత్తాడు.’ ‘ఆసా తన దినములన్నీ హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించాడు.’—2 దిన. 14:8-13; 1 రాజు. 15:14.

9. (ఎ) యెరూషలేము గోడల్ని చూసిన నెహెమ్యా నిరుత్సాహపడ్డాడా? వివరించండి. (బి) నెహెమ్యా చేసిన ప్రార్థనకు యెహోవా ఎలా జవాబిచ్చాడు?

9 నెహెమ్యా గురించి ఆలోచించండి. అతను యెరూషలేముకు వెళ్లినప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితి కనిపించింది? శత్రువుల బెదిరింపులవల్ల యెరూషలేము గోడల్ని కట్టే పని కుంటుపడింది, దాంతో పట్టణానికి రక్షణ లేదు. యూదులేమో నిరుత్సాహంతో ఉన్నారు. అప్పుడు నెహెమ్యాకు ఎలా అనిపించి ఉంటుంది? అతను కూడా నిరుత్సాహపడ్డాడా? లేదు. మోషే, ఆసా వంటి ఇతర నమ్మకమైన సేవకుల్లాగే నెహెమ్యా ప్రతీసారి యెహోవాపై ఆధారపడ్డాడు. ఈ సందర్భంలో కూడా అతను సహాయం కోసం యెహోవాకు ప్రార్థించాడు, యెహోవా అతనికి జవాబిచ్చాడు. ఆయన తన గొప్ప శక్తితో, బలమైన చేతితో యూదుల్ని బలపర్చాడు. (నెహెమ్యా 1:10; 2:17-20; 6:9 చదవండి.) నేడు కూడా యెహోవా తన గొప్ప శక్తితో, బలమైన చేతితో తన సేవకుల్ని బలపరుస్తాడని మీరు నమ్ముతున్నారా?

మీ చేతుల్ని యెహోవా బలపరుస్తాడు

10, 11. (ఎ) మనల్ని నిరుత్సాహపర్చడానికి సాతాను ఏమి చేస్తాడు? (బి) యెహోవా వేటి ద్వారా మనల్ని బలపర్చి శక్తినిస్తాడు? (సి) యెహోవా బోధించే విషయాల నుండి మీరెలా ప్రయోజనం పొందారు?

10 సాతాను మాత్రం ఎప్పటికీ తన చేతుల్ని కిందకు దించడు. అతను మనపై దాడిచేస్తూ మన క్రైస్తవ కార్యకలాపాలను ఆపడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. అందుకోసం అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నాడు, ప్రభుత్వాల్ని, మతనాయకుల్ని, మతభ్రష్టుల్ని ఉపయోగించి బెదిరిస్తున్నాడు. ఇంతకీ సాతాను లక్ష్యం ఏమిటి? మనం రాజ్యసువార్తను ప్రకటించడం ఆపేయడమే అతనికి కావాల్సింది. కానీ మనకు సహాయం చేసే సామర్థ్యం, కోరిక యెహోవాకు ఉన్నాయి. అంతేకాదు ఆయన తన పవిత్రశక్తిని ఇచ్చి మనల్ని బలపరుస్తాడు. (1 దిన. 29:12) అయితే మనం సాతానును, అతని దుష్టలోకాన్ని ఎదిరించేలా తన పవిత్రశక్తిని ఇవ్వమని అడగడం చాలా ప్రాముఖ్యం. (కీర్త. 18:39; 1 కొరిం. 10:13) దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నందుకు మనమెంతో కృతజ్ఞులం. ప్రతీనెల మన సంస్థ అందించే ప్రచురణల నుండి మనమెంత ప్రయోజనం పొందుతున్నామో ఒకసారి ఆలోచించండి. జెకర్యా 8:9, 13 వచనాల్లోని మాటలు యెరూషలేములోని దేవాలయాన్ని మళ్లీ కడుతున్న సమయంలో చెప్పినప్పటికీ, అవి నేడు కూడా మనకు సహాయం చేస్తాయి. (చదవండి.)

11 మీటింగ్స్‌లో, సమావేశాల్లో, సంస్థ ఏర్పాటు చేసే పాఠశాలల్లో మనం వినే విషయాల ద్వారా కూడా యెహోవా మనల్ని బలపరుస్తాడు. ఆయన్ను సరైన ఉద్దేశంతో ఆరాధించడానికి, లక్ష్యాలు పెట్టుకోవడానికి, క్రైస్తవులుగా మనకున్న బాధ్యతలన్నిటినీ నిర్వర్తించడానికి ఆ విషయాలు మనకు సహాయం చేస్తాయి. (కీర్త. 119:32) మరి యెహోవా బోధించే విషయాల నుండి బలం పొందాలని మీరు ఎదురుచూస్తున్నారా?

12. ఆధ్యాత్మికంగా బలంగా ఉండడానికి మనమేమి చేయాలి?

12 ఇశ్రాయేలీయులు అమాలేకీయులతో, కూషీయులతో పోరాడి గెలవడానికి యెహోవా సహాయం చేశాడు. అలాగే నెహెమ్యాకు, యూదులకు యెరూషలేము గోడల్ని కట్టడానికి కావాల్సిన శక్తినిచ్చాడు. అదేవిధంగా మనకు ఎన్ని ఆందోళనలు ఉన్నా, ఎంత వ్యతిరేకత ఎదురైనా, ప్రజలు మనం చెప్పే సువార్త వినకపోయినా ప్రకటనా పనిని కొనసాగించడానికి కావాల్సిన బలాన్ని యెహోవా మనకిస్తాడు. (1 పేతు. 5:10) అయితే దానర్థం మన సమస్యలన్నిటినీ యెహోవా అద్భుతరీతిలో మాయం చేస్తాడని కాదు. బదులుగా మన వంతు కృషి మనం చేయాలి. ఎలా? ప్రతీరోజు బైబిలు చదవాలి, ప్రతీవారం మీటింగ్స్‌కు సిద్ధపడాలి-వెళ్లాలి, క్రమం తప్పకుండా వ్యక్తిగత అధ్యయనం-కుటుంబ ఆరాధన చేయాలి, ప్రార్థన చేస్తూ యెహోవాపై ఆధారపడాలి. మనల్ని బలపర్చి, ప్రోత్సహించడానికి యెహోవా చేసిన ఏర్పాట్ల నుండి ప్రయోజనం పొందకుండా చేసే వేటికైనా దూరంగా ఉండాలి. ఒకవేళ వీటిలో దేన్నైనా చేయడంలో మీరు వెనకబడినట్లు అనిపిస్తుంటే యెహోవాను సహాయం అడగండి. అప్పుడు ఆయన పవిత్రశక్తి ద్వారా ‘తనకు ఇష్టమైనవి చేయాలనే కోరికను మీలో కలిగించి, దాని ప్రకారం ప్రవర్తించే శక్తిని ఇచ్చి మిమ్మల్ని ఎలా బలపరుస్తాడో’ మీరే చూడండి. (ఫిలి. 2:13, NW) మరి మీరు వేరేవాళ్ల చేతుల్ని బలపర్చగలరా?

బలహీనుల చేతుల్ని బలపర్చండి

13, 14. (ఎ) భార్యను కోల్పోయిన ఓ సహోదరుడు ఎలా ఓదార్పు పొందాడు? (బి) వేరేవాళ్లను మనమెలా బలపర్చవచ్చు?

13 మనపై శ్రద్ధ చూపిస్తూ మనల్ని ప్రోత్సహించేలా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సహోదరసహోదరీల్ని యెహోవా మనకిచ్చాడు. అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు, ‘బలహీనమైన చేతుల్ని, బలంలేని మోకాళ్లను బలపర్చండి. మీ పాదాల కిందవున్న దారుల్ని చదును చేసుకుంటూ ఉండండి.’ (హెబ్రీ. 12:12-13, NW) మొదటి శతాబ్దంలోని ఎంతోమంది క్రైస్తవులు తమ తోటి సహోదరసహోదరీల నుండి అలాంటి సహాయాన్నే పొందారు. మన కాలంలో కూడా చాలామంది పొందుతున్నారు. ఓ సహోదరుని అనుభవాన్ని పరిశీలించండి. అతని భార్య చనిపోయింది, ఇంకా వేరే సమస్యల వల్ల అతను ఎంతో బాధపడ్డాడు. అతనిలా చెప్తున్నాడు, ‘మనకెలాంటి సమస్యలు రావాలి, ఎప్పుడు రావాలి, ఎంత ఎక్కువగా ఉండాలి వంటివి మన చేతుల్లో ఉండవని నేను తెలుసుకున్నాను. నీటిలో మునిగిపోకుండా ఉండడానికి లైఫ్‌ జాకెట్‌ సహాయం చేసినట్లు, కష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో ప్రార్థన, వ్యక్తిగత అధ్యయనం నాకు సహాయం చేశాయి. తోటి సహోదరసహోదరీలు ఇచ్చిన మద్దతు నాకు చాలా ఓదార్పునిచ్చింది. కష్టాలు రాకముందే యెహోవాతో మంచి సంబంధం కలిగివుండడం ఎంత ముఖ్యమో నాకు అర్థమైంది.’

సంఘంలోని ప్రతీఒక్కరు వేరేవాళ్లను ప్రోత్సహించవచ్చు (14వ పేరా చూడండి)

14 అమాలేకీయులతో యుద్ధం జరుగుతున్న సమయంలో అహరోను, హూరులు మోషే చేతులకు ఊతమిచ్చి ఆయనకు సహాయం చేశారు. నేడు మనం కూడా వేరేవాళ్లకు మద్దతిచ్చి సహాయం చేసే అవకాశాల కోసం వెతకాలి. మన సహోదరుల్లో కొంతమంది వయసు పైబడడంవల్ల, అనారోగ్యంవల్ల, కుటుంబం నుండి వ్యతిరేకతవల్ల, ఒంటరితనంవల్ల, ఇష్టమైనవాళ్లు చనిపోవడంవల్ల బాధపడుతున్నారు. అంతేకాదు తప్పు చేయాలనే లేదా ఈ లోకంలో మంచి పేరును సంపాదించుకోవాలనే ఒత్తిడిని ఎదుర్కొంటున్న మన యౌవనుల్ని కూడా మనం బలపర్చవచ్చు. (1 థెస్స. 3:1-4; 5:11, 14) రాజ్యమందిరంలో, పరిచర్యలో, కలిసి భోజనం చేస్తున్న సమయంలో, ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో ఇతరులపట్ల నిజమైన శ్రద్ధ చూపించే అవకాశాల కోసం వెదకండి.

15. ప్రోత్సాహకరమైన మాటలు మన తోటి సహోదరసహోదరీలపై ఎలాంటి ప్రభావం చూపించగలవు?

15 కూషీయుల అతిపెద్ద సైన్యం మీద ఘన విజయం సాధించిన ఆసాను, అతని ప్రజల్ని ప్రవక్త అయిన అజర్యా ఇలా ప్రోత్సహించాడు, “మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును.” (2 దిన. 15:7) ఆ మాటలు, సత్యారాధనను మళ్లీ ప్రారంభించేందుకు ఎన్నో మార్పులు చేసేలా ఆసాను ప్రోత్సహించాయి. అదేవిధంగా మీ ప్రోత్సాహకరమైన మాటలు కూడా ఇతరుల్ని బలపర్చి, యెహోవా సేవలో కొనసాగేలా వాళ్లకు సహాయం చేయవచ్చు. (సామె. 15:23) అంతేకాదు మీటింగ్స్‌లో మీరిచ్చే ప్రోత్సాహకరమైన వ్యాఖ్యానాలు తోటి సహోదరసహోదరీల్ని ఎంతో బలపర్చగలవని ఎన్నడూ మర్చిపోకండి.

16. సంఘపెద్దలు నెహెమ్యాను ఎలా అనుకరించవచ్చు? తోటి సహోదరసహోదరీలు మీకు సహాయం చేసిన అనుభవాల్ని చెప్పండి.

16 యెహోవా సహాయంతో నెహెమ్యా, యూదులు ప్రోత్సాహం పొందారు. దాంతో యెరూషలేము గోడల్ని 52 రోజుల్లోనే కట్టేశారు. (నెహె. 2:18; 6:15, 16) అయితే నెహెమ్యా కేవలం ఇతరులతో పని చేయించడమే కాదు, అతను కూడా ఆ పనిలో సహాయం చేశాడు. (నెహె. 5:16) అదేవిధంగా నెహెమ్యాను అనుకరిస్తూ ఎంతోమంది సంఘపెద్దలు రాజ్యమందిరాల్ని నిర్మించే పనుల్లో లేదా వాటిని శుభ్రంగా ఉంచే పనుల్లో సహాయం చేస్తున్నారు. అంతేకాదు ఆందోళనతో ఉన్న సహోదరసహోదరీల్ని కలవడం ద్వారా, వాళ్లతో కలిసి పరిచర్య చేయడం ద్వారా ఈ ప్రేమగల కాపరులు వాళ్లను బలపరుస్తున్నారు.—యెషయా 35:3, 4 చదవండి.

‘మీ చేతులు దించకండి’

17, 18. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, ఆందోళన పడుతున్నప్పుడు ఏ నమ్మకంతో ఉండవచ్చు?

17 తోటి సహోదరసహోదరీలతో కలిసి పని చేసినప్పుడు మన మధ్య ఉన్న ఐక్యత బలపడుతుంది. అంతేకాదు చిరకాల స్నేహితులు దొరుకుతారు, అలాగే త్వరలో రానున్న దేవుని రాజ్యం తీసుకొచ్చే దీవెనలపై మన నమ్మకం మరింత బలపడుతుంది. మనం ఇతరుల్ని బలపర్చినప్పుడు, కష్టాల్ని సహిస్తూ భవిష్యత్తు గురించి ఆశతో ఎదురుచూసేందుకు వాళ్లకు సహాయం చేస్తాం. అలా చేస్తే మనం కూడా బలం పొందుతాం, భవిష్యత్తు మీద మనసుపెట్టగలుగుతాం.

18 యెహోవా తన నమ్మకమైన సేవకులకు గతంలో ఎలా సహాయం చేశాడో, ఎలా కాపాడాడో ఆలోచించినప్పుడు ఆయనపై మన విశ్వాసం, నమ్మకం మరింత బలపడతాయి. కాబట్టి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, ఆందోళన పడుతున్నప్పుడు నిరుత్సాహంతో ‘మీ చేతులు దించకండి.’ సహాయం కోసం ప్రార్థిస్తే యెహోవా తన శక్తివంతమైన చేతితో మిమ్మల్ని ఖచ్చితంగా బలపరుస్తాడనే నమ్మకంతో ఉండండి. అంతేకాదు రానున్న కొత్తలోకంలో దేవుని రాజ్యం తీసుకొచ్చే ఆశీర్వాదాలను ఆనందించేలా మిమ్మల్ని నడిపిస్తాడు.—కీర్త. 73:23, 24.