యౌవనులారా మీ విశ్వాసాన్ని బలపర్చుకోండి
‘కంటికి కనిపించకపోయినా అవి నిజంగా ఉన్నాయనడానికి రుజువే విశ్వాసం.’—హెబ్రీ. 11:1, NW.
1, 2. యెహోవాను సేవిస్తున్న యువతీయువకులు కొన్నిసార్లు దేనిగురించి ఆలోచిస్తుండవచ్చు? వాళ్లకు బైబిలు ఎలా సహాయం చేస్తుంది?
బ్రిటన్‌లో ఉంటున్న ఓ యువ సహోదరితో తన క్లాస్‌మేట్ ఇలా అంది, ‘నువ్వు చాలా తెలివైనదానివి అనుకున్నా, కానీ నువ్వు దేవున్ని నమ్ముతున్నావా?’ జర్మనీలో ఉంటున్న ఒక సహోదరుడు ఇలా రాశాడు, “సృష్టి గురించి బైబిల్లో ఉన్నదంతా ఓ కట్టుకథ అనీ, విద్యార్థులు పరిణామ సిద్ధాంతాన్ని నమ్మడం సరైనదనీ మా టీచర్లు అనుకుంటారు.” ఫ్రాన్స్‌లో ఉంటున్న మరో యువ సహోదరి ఇలా చెప్తుంది, “బైబిల్ని నమ్మే విద్యార్థులు ఇప్పటికీ ఉన్నారని తెలుసుకుని మా స్కూల్ టీచర్లు ఆశ్చర్యపోయారు.”
2 దేవుడు మనల్ని సృష్టించాడని ఈ కాలంలోని చాలామంది నమ్మరు. ఒకవేళ మీరు యెహోవాను సేవిస్తున్న యౌవనులైతే లేదా ఆయన గురించి నేర్చుకుంటున్న వాళ్లయితే, ఆయనే మన సృష్టికర్త అని ఎలా నిరూపించాలోనని కొన్నిసార్లు మీరు ఆలోచిస్తుండవచ్చు. మనం వింటున్న లేదా చదువుతున్న విషయాల గురించి జాగ్రత్తగా ఆలోచించడానికి, అవి నిజమో కాదో తెలుసుకోవడానికి బైబిలు సహాయం చేస్తుంది. బైబిలు ఇలా చెప్తుంది, “వివేచన నీకు కావలికాయును.” ఏవిధంగా? తప్పుడు సిద్ధాంతాలను తిరస్కరించి యెహోవా మీద మీకున్న విశ్వాసాన్ని బలపర్చుకునేలా అది సహాయం చేస్తుంది.—సామెతలు 2:10-12 చదవండి.
3. ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?
3 మనకు యెహోవా మీద బలమైన విశ్వాసం ఉండాలంటే ఆయన గురించి బాగా తెలుసుకోవాలి. (1 తిమో. 2:4) అలా తెలుసుకోవాలంటే మీరు బైబిల్ని, మన ప్రచురణల్ని చదువుతున్నప్పుడు కాస్త ఆగి చదివిన వాటిగురించి ఆలోచించడం చాలా ప్రాముఖ్యం. మీరు చదువుతున్న విషయాల్ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నించండి. (మత్త. 13:23) ఈ విధంగా చేసినప్పుడు యెహోవా మన సృష్టికర్త అనీ, బైబిల్లోని ఆలోచనలు ఆయనవే అనీ నమ్మడానికి రుజువులు చూడగలుగుతారు. వాటిని ఉపయోగించి మీ విశ్వాసం ఎలా బలపర్చుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిద్దాం.—హెబ్రీ. 11:1.
మీ విశ్వాసాన్ని ఎలా బలపర్చుకోవచ్చు?
4. పరిణామ సిద్ధాంతాన్ని నమ్మడం, సృష్టికర్త ఉన్నాడని నమ్మడం లాంటిదేనని ఎలా చెప్పవచ్చు? మనందరం ఏమి చేయాలి?
4 “పరిణామ సిద్ధాంతం నిజమని శాస్త్రవేత్తలు చెప్పారు కాబట్టి నేను దాన్ని నమ్ముతాను. కానీ దేవున్ని ఎవ్వరూ చూడనప్పుడు ఆయన ఉన్నాడని నువ్వు ఎలా నమ్ముతావు?” అని ఎవరైనా మీతో అనవచ్చు. చాలామంది అలానే ఆలోచిస్తున్నారు. నిజమే దేవున్ని గానీ ఆయన సృష్టిని చేయడం గానీ మనలో ఎవ్వరం చూడలేదు. (యోహా. 1:18) మరి పరిణామ సిద్ధాంతాన్ని నమ్ముతున్నవాళ్ల సంగతేంటి? వాళ్లు కూడా తాము చూడనిదాన్ని నమ్ముతున్నారు. ఒక జీవి మరో జీవిగా పరిణామం చెందడాన్ని ఏ శాస్త్రవేత్తగానీ, వేరే ఎవ్వరుగానీ చూడలేదు. ఉదాహరణకు, కోతి నుండి మనిషి రావడాన్ని ఎవ్వరూ చూడలేదు. (యోబు 38:1, 4) కాబట్టి మనందరం వాస్తవాలను చూడాలి, వాటిగురించి జాగ్రత్తగా ఆలోచించాలి, అవి ఏమి నిరూపిస్తున్నాయో నిర్ణయించుకోవాలి. చాలామంది సృష్టిలో ఉన్నవాటిని చూసి దేవుడు ఉన్నాడని గ్రహించారు. దేవుడే వాటిని చేశాడనీ, ఆయన శక్తివంతుడనీ, ఆయనకు ఎన్నో అద్భుతమైన లక్షణాలు ఉన్నాయనీ ‘స్పష్టంగా’ గ్రహించారు.—రోమా. 1:20, NW.
5. సృష్టి గురించి మరింత ఎక్కువ తెలుసుకోవడానికి ఏ పరిశోధనా ఉపకరణాలు సహాయం చేస్తాయి?
5 సృష్టిని చూసి, దానిగురించి లోతుగా ఆలోచించినప్పుడు ప్రతీది ఎంత అద్భుతంగా చేయబడిందో మనకు అర్థమౌతుంది. సృష్టికర్త కనిపించకపోయినా ఆయన ఉన్నాడని మనం ‘విశ్వాసం వల్ల గ్రహిస్తున్నాం.’ ఆయనకు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, గొప్ప జ్ఞానం ఉన్నాయని అర్థంచేసుకోగలుగుతున్నాం. (హెబ్రీ. 11:3, 27, NW) శాస్త్రవేత్తలు కనిపెట్టిన వాటిగురించి చదివినప్పుడు ఆయన సృష్టించిన వాటిగురించి మరిన్ని ఎక్కువ విషయాలు తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవడానికి ఉపయోగపడే పరిశోధనా ఉపకరణాల్లో కొన్ని ఏవంటే: ద వండర్స్ ఆఫ్ క్రియేషన్ రివీల్ గాడ్స్ గ్లోరీ (ఇంగ్లీషు) వీడియో, వజ్ లైఫ్ క్రియేటడ్? (ఇంగ్లీషు), ద ఆరిజన్ ఆఫ్ లైఫ్—ఫైవ్ క్వశ్చన్స్ వర్త్ ఆస్కింగ్ (ఇంగ్లీషు) అనే బ్రోషుర్లు, ఈజ్ దేర్ ఎ క్రియేటర్ హు కేర్స్ ఎబౌట్ యు? (ఇంగ్లీషు) అనే పుస్తకం. కొంతమంది శాస్త్రవేత్తలు, అలాగే ఇతరులు ఒకప్పుడు దేవున్ని నమ్మకపోయినా ఇప్పుడు ఎందుకు నమ్ముతున్నారో వివరిస్తూ ఇచ్చిన ఇంటర్వ్యూలు అప్పుడప్పుడు తేజరిల్లు! పత్రికలో వస్తుంటాయి. అలాగే “సృష్టిలో అద్భుతాలు” అనే శీర్షికతో వచ్చే ఆర్టికల్స్‌లో జంతువులు, సృష్టిలోని ఇతర విషయాల గురించిన వివరాలు ఉంటాయి. సృష్టిలోని ప్రాణుల పనితీరును అనుకరించడానికి శాస్త్రవేత్తలు ఎలా ప్రయత్నించారో కూడా అందులో ఉంటుంది.
6. పరిశోధనా ఉపకరణాలు మీకెలా సహాయం చేస్తాయి?
6 అమెరికాలో ఉంటున్న 19 ఏళ్ల ఓ సహోదరుడు, పై పేరాలో ప్రస్తావించబడిన రెండు బ్రోషుర్ల గురించి ఇలా అన్నాడు, “నా దృష్టిలో అవి వెలకట్టలేనివి. వాటిని నేను చాలాసార్లు చదివాను.” ఫ్రాన్స్‌లో ఉంటున్న ఓ సహోదరి ఇలా రాసింది, “‘సృష్టిలోని అద్భుతాలు’ శీర్షికతో వచ్చే ఆర్టికల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. గొప్పగొప్ప ఇంజనీర్లు సృష్టిలో ఉన్నలాంటి వాటిని చేయగలరేమోగాని, ప్రకృతిలోని సంశ్లిష్ట రూపకల్పనకు సమానమైనదాన్ని మాత్రం వాళ్లు తయారు చేయలేరని ఆ ఆర్టికల్స్‌ని బట్టి అర్థమౌతుంది.” దక్షిణ ఆఫ్రికాకు చెందిన 15 ఏళ్ల ఓ అమ్మాయి తల్లిదండ్రులు ఇలా చెప్తున్నారు, “మా అమ్మాయి తేజరిల్లు! పత్రిక తీసుకోగానే అన్నింటికన్నా ముందు ‘ఇంటర్వ్యూ’ ఆర్టికల్‌నే చదువుతుంది.” అవును సృష్టికర్త ఉన్నాడని నిరూపించే రుజువుల్ని తెలుసుకోవడానికి ఈ ప్రచురణలు మీకు సహాయం చేస్తాయి. అంతేకాదు మీరు అబద్ధ బోధల్ని గుర్తించి వాటిని తిరస్కరించగలుగుతారు. అప్పుడు భూమి లోపలికి వేర్లు నాటుకుపోయిన చెట్టు ఎలాగైతే బలమైన గాలులను తట్టుకుని దృఢంగా నిలబడుతుందో అలాగే మీ విశ్వాసం కూడా బలంగా ఉంటుంది.—యిర్మీ. 17:5-8.
బైబిలు మీద మీకున్న విశ్వాసం
7. మీరు “సమస్తమును పరీక్షించి” తెలుసుకోవాలని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు?
7 ‘బైబిలు చెప్పేవి నేనెందుకు నమ్ముతున్నాను’ అని ప్రశ్నించుకోవడం తప్పా? ఎంతమాత్రం కాదు. కేవలం వేరేవాళ్లు నమ్ముతున్నారు కాబట్టే మీరు కూడా బైబిల్ని నమ్మాలని యెహోవా కోరుకోవట్లేదు. మీరు “సమస్తమును పరీక్షించి” బైబిలు గురించి తెలుసుకుని, దేవుడే దాన్ని రాయించాడనడానికి రుజువుల్ని తెలుసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. బైబిలు చెప్తున్న వాటిని మీరెంత ఎక్కువ తెలుసుకుంటే, బైబిలు మీద మీ విశ్వాసం అంత బలపడుతుంది. (1 థెస్సలొనీకయులు 5:19-21; 1 తిమోతి 2:4 చదవండి.) మీకు ఎక్కువగా నేర్చుకోవాలనిపించే అంశాల గురించి అధ్యయనం చేయడమే బైబిలు గురించి తెలుసుకోవడానికి ఓ మార్గం.
8, 9. (ఎ) కొంతమంది ఎలాంటి అంశాలు అధ్యయనం చేయడానికి ఇష్టపడతారు? (బి) చదివిన వాటిగురించి లోతుగా ఆలోచించడం వల్ల కొందరు ఎలా ప్రయోజనం పొందారు?
8 కొంతమంది బైబిల్లోని ప్రవచనాల్ని అధ్యయనం చేయడానికి ఇష్టపడతారు. లేదా బైబిలు వృత్తాంతాల్ని చరిత్రకారులూ, శాస్త్రవేత్తలూ, పురావస్తుశాస్త్రజ్ఞులూ చెప్పేవాటితో పోల్చి చూడడానికి ఇష్టపడతారు. ఉదాహరణకు ఆదికాండము 3:15 వ వచనాన్నే తీసుకోండి. ఆదాముహవ్వలు యెహోవాకు, ఆయన పరిపాలనకు తిరుగుబాటు చేసిన తర్వాత ఆయన ఆ ప్రాముఖ్యమైన ప్రవచనాన్ని చెప్పాడు. బైబిలు ప్రవచనాలన్నిటిలో అదే మొట్టమొదటిది. దేవుని పరిపాలనే సరైనదని దేవుని రాజ్యం ఎలా నిరూపిస్తుందో, ఆ రాజ్యం మనుషుల బాధలన్నిటినీ ఎలా తీసేస్తుందో అర్థంచేసుకోవడానికి ఆ ప్రవచనం సహాయం చేస్తుంది. మీరు ఆదికాండము 3:15 వ వచనాన్ని ఎలా అధ్యయనం చేయవచ్చు? ఆ ప్రవచన నెరవేర్పుకు సంబంధించి మరిన్ని వివరాలు ఇచ్చే బైబిలు వచనాల లిస్టును మీరు తయారు చేసుకోవచ్చు. తర్వాత ఆ వచనాలు ఎప్పుడు రాయబడ్డాయో, అవి రాయబడిన క్రమంలో వాటిని ఓ పేపరు మీద రాసుకోవచ్చు. అలా చేయడంవల్ల, బైబిలు రచయితలు వేర్వేరు కాలాల్లో జీవించినప్పటికీ వాళ్లలో ప్రతీఒక్కరు ఆ ప్రవచనాన్ని మరింత స్పష్టం చేస్తూ వచ్చారని మీరు అర్థంచేసుకుంటారు. వాళ్లందరూ యెహోవా పవిత్రశక్తితోనే వాటిని రాశారని గ్రహించడానికి అది మీకు సహాయం చేస్తుంది.—2 పేతు. 1:21.
9 జర్మనీలో ఉంటున్న ఓ సహోదరుడు ఇలా చెప్పాడు, ‘బైబిల్ని దాదాపు 40 మంది రాసినప్పటికీ ప్రతీ పుస్తకంలో దేవుని రాజ్యం గురించిన వివరాలు ఉన్నాయి. పైగా వాళ్లందరూ వేర్వేరు కాలాల్లో జీవించారు, వాళ్లకు ఒకరితోఒకరికి పరిచయం కూడా లేదు.’ ఆస్ట్రేలియాలో ఉంటున్న ఓ సహోదరి 2013, డిసెంబరు 15 కావలికోట అధ్యయన ప్రతిలోని ఒక ఆర్టికల్ చదివినప్పుడు పస్కా పండుగకు, ఆదికాండము 3:15 వ వచనంలోని మాటలకు అలాగే మెస్సీయకు చాలా దగ్గరి సంబంధం ఉందని ఆమె తెలుసుకోగలిగింది. ఆమె ఇలా రాసింది, “యెహోవా ఎంత అద్భుతమైన దేవుడో తెలుసుకోగలిగేలా ఆ ఆర్టికల్ నాకు సహాయం చేసింది. పస్కా ఏర్పాటు ఇశ్రాయేలీయుల కోసమే అనుకున్నాను కానీ అది యేసు విషయంలో నెరవేరడం చూసి ఆశ్చర్యపోయాను. నేను ఆర్టికల్ చదువుతూ కాసేపు ఆగి, పస్కా గురించిన ప్రవచనం ఎంత అసాధారణమైందో ఆలోచించాను.” ఆ సహోదరి ఎందుకు అలా భావించింది? ఆమె చదువుతున్న విషయాల్ని లోతుగా ఆలోచించి, వాటిని అర్థంచేసుకుంది. దానివల్ల ఆమె తన విశ్వాసాన్ని బలపర్చుకుని, యెహోవాకు మరింత సన్నిహితమైంది.—మత్త. 13:23.
10. బైబిలు రచయితల నిజాయితీ బైబిలు మీద మనకున్న విశ్వాసాన్ని ఎలా బలపరుస్తుంది?
10 బైబిలు రచయితల నిజాయితీ గురించి కూడా ఆలోచించండి. వాళ్లు ఎప్పుడూ నిజాలే రాశారు, వాళ్లు అలా రాయడానికి భయపడలేదు. ఆ కాలంలోని కొంతమంది రచయితలు తమ దేశం గురించి, నాయకుల గురించి కేవలం మంచి విషయాలే రాశారు. కానీ యెహోవా ప్రవక్తలు కేవలం మంచి విషయాలే కాదు ఇశ్రాయేలు జనాంగం అలాగే వాళ్ల రాజులు చేసిన చెడ్డ పనుల గురించి కూడా రాశారు. (2 దిన. 16:9, 10; 24:18-22) వాళ్లు తమ సొంత పొరపాట్ల గురించి, దేవుని సేవకులైన ఇతరులు చేసిన పొరపాట్ల గురించి కూడా ప్రస్తావించారు. (2 సమూ. 12:1-15; మార్కు 14:50) “అలాంటి నిజాయితీ అరుదుగా కనిపిస్తుంది. దానివల్ల బైబిల్ని యెహోవాయే రాయించాడనే మన నమ్మకం మరింత బలపడుతుంది” అని బ్రిటన్‌లో ఉంటున్న ఓ యౌవన సహోదరుడు చెప్తున్నాడు.
11. బైబిల్ని దేవుడే రాయించాడని అందులోని నిర్దేశాలనుబట్టి ఎలా చెప్పవచ్చు?
11 ప్రజలు తమ జీవితంలో బైబిలు నిర్దేశాన్ని పాటించినప్పుడు అది వాళ్లపై మంచి ప్రభావం చూపిస్తుంది. దానివల్ల బైబిల్ని దేవుడు రాయించాడనే నమ్మకం వాళ్లకు కుదురుతుంది. (కీర్తన 19:7-11 చదవండి.) జపాన్‌లో ఉంటున్న ఓ యువ సహోదరి ఇలా రాసింది, “మా కుటుంబంలోని వాళ్లందరూ బైబిలు బోధల్ని పాటించినప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాం. మేమందరం శాంతిని, ఐక్యతను, ప్రేమను రుచిచూశాం.” చాలామందికి, తాము నమ్మే కొన్ని విషయాలు నిజం కాదని తెలుసుకోవడానికి బైబిలు సహాయం చేసింది. (కీర్త. 115:3-8) ప్రజలు సర్వశక్తిమంతుడైన యెహోవా మీద ఆధారపడేలా బైబిలు నడిపిస్తుంది. అంతేకాదు ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందనే భరోసా ఇస్తుంది. మరోవైపు దేవుడు లేడని చెప్పే కొంతమంది, సృష్టినే దేవునిగా చేసుకుంటారు. ఇంకొంతమందేమో మనుషులే మంచి భవిష్యత్తు ఇవ్వగలరని చెప్తారు, కానీ మనుషులు ఇప్పటివరకు చేసిన వాటిని చూస్తే వాళ్లు లోకంలోని సమస్యల్ని తీసేయలేకపోయారని తెలుస్తుంది.—కీర్త. 146:3, 4.
ఇతరుల్ని ఒప్పించేలా ఎలా మాట్లాడవచ్చు?
12, 13. సృష్టి లేదా బైబిలు గురించి ఇతరులతో ఎలా మాట్లాడవచ్చు?
12 మీరు వేరేవాళ్లతో సృష్టి గురించి లేదా బైబిలు గురించి మాట్లాడడానికి ముందు, వాటి విషయంలో వాళ్ల నమ్మకాలేమిటో అడగండి. పరిణామ సిద్ధాంతాన్ని నమ్మే కొంతమంది దేవుడు ఉన్నాడని కూడా నమ్ముతారని గుర్తుంచుకోండి. ఒక జీవ పదార్థం నుండి జీవరాశి పుట్టుకొచ్చేలా దేవుడే చేశాడని వాళ్లు చెప్తారు. ఇంకొందరు, స్కూల్లో పరిణామ సిద్ధాంతం గురించి బోధిస్తారు కాబట్టి అదే నిజమైవుంటుందని నమ్ముతారు. మరికొంతమంది మతం మీద విసుకు వచ్చి దేవున్ని నమ్మడం మానేస్తారు. కాబట్టి ముందు ఆ వ్యక్తి ఏమి నమ్ముతున్నాడో, ఎందుకలా నమ్ముతున్నాడో అడగండి. ఆ తర్వాత అతను చెప్పేది జాగ్రత్తగా వినండి. అలా చేస్తే, మీరు చెప్పేది వినడానికి ఆ వ్యక్తి మరింత ఇష్టపడవచ్చు.—తీతు 3:1, 2.
13 సృష్టికర్త ఉన్నాడని నమ్ముతున్నందుకు మీరు తెలివితక్కువ వాళ్లని ఎవరైనా అంటే, మీరెలా జవాబివ్వవచ్చు? జీవం ఎలా వచ్చిందని వాళ్లనుకుంటున్నారో వివరించమని గౌరవపూర్వకంగా అడగండి. ఒకవేళ పరిణామ సిద్ధాంతం నిజమైతే, మొట్టమొదటి జీవి తనలాంటి జీవినే పుట్టించగలగాలని మీరు చెప్పవచ్చు. నిజానికి ఓ రసాయనశాస్త్రం ప్రొఫెసర్ ఏం చెప్తున్నాడంటే, మిగతా జీవుల్లాగే ఆ మొట్టమొదటి జీవికి కూడా (1) తనను తాను కాపాడుకోవడానికి చర్మం కావాలి, (2) శక్తిని పొందగలిగే, దాన్ని ఉపయోగించుకోగలిగే సామర్థ్యం ఉండాలి, (3) తన రూపాన్ని, ఎదుగుదలను నియంత్రించుకునేందుకు సమాచారం కావాలి, (4) ఆ సమాచారం ఆధారంగా దానిలాంటి జీవాన్నే తయారుచేసుకోగలిగే సామర్థ్యం ఉండాలి. అతను ఇంకా ఇలా చెప్తున్నాడు, “అతి చిన్న జీవంలో కూడా ఉండే సంశ్లిష్టతను చూసి ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే.”
14. సృష్టి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ చిన్న ఉదాహరణను ఉపయోగించవచ్చు?
14 సృష్టి గురించి మాట్లాడుతున్నప్పుడు అపొస్తలుడైన పౌలు ఉపయోగించిన చిన్న ఉదాహరణను మీరు ఉపయోగించవచ్చు. అతనిలా రాశాడు, “ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే.” (హెబ్రీ. 3:3-4) అవును ఎవరైనా ఒక వ్యక్తి ప్లాన్ వేసి కడితేనే ఓ ఇల్లు తయారౌతుంది. మరి ప్రాణులు ఇల్లు కన్నా చాలా సంశ్లిష్టమైనవి కాబట్టి ఖచ్చితంగా వాటిని ఎవరో ఒకరు డిజైన్‌చేసి, తయారు చేసివుండాలి. సృష్టి గురించి మాట్లాడుతున్నప్పుడు మన ప్రచురణల్ని కూడా ఉపయోగించవచ్చు. ఒక సహోదరి, దేవుడు లేడని నమ్ముతున్న ఓ యువకునితో మాట్లాడి పై పేరాల్లో ప్రస్తావించిన రెండు బ్రోషుర్లు అతనికి ఇచ్చింది. దాదాపు ఒక వారం తర్వాత అతనిలా చెప్పాడు, “దేవుడు ఉన్నాడని నేను ఇప్పుడు నమ్ముతున్నాను.” ఆ యువకుడు బైబిలు స్టడీ తీసుకుని, కొంతకాలానికే బాప్తిస్మం కూడా తీసుకున్నాడు.
15, 16. బైబిల్ని దేవుడే రాయించాడని ఇతరులకు వివరించే ముందు మనమేమి చేయాలి? మనం ఏ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి?
15 ఎవరికైనా బైబిలు గురించి సందేహాలు ఉంటే, వాళ్లతో ఎలా మాట్లాడవచ్చు? ముందుగా బైబిలు గురించి వాళ్ల నమ్మకాలేంటో అడగండి. అలాగే వాళ్లకు వేటిగురించి ఆసక్తి ఉందో తెలుసుకోండి. (సామె. 18:13) ఒకవేళ వాళ్లకు సైన్స్ గురించి ఆసక్తి ఉంటే, సైన్స్ గురించి బైబిలు చెప్పే విషయాలు ఎప్పుడూ సరైనవేనని చెప్పడానికి అందులో ఉన్న కొన్ని ఉదాహరణల్ని చూపించండి. వాళ్లకు చరిత్ర గురించి ఆసక్తి ఉంటే చరిత్ర పుస్తకాల్లో ఉన్న ఒక సంఘటన గురించి చెప్పి, అది జరగడానికి ఎన్నో సంవత్సరాల ముందే బైబిలు దానిగురించి ప్రస్తావించిందని చూపించండి. ఇంకొంతమంది, తమ జీవితాల్ని మెరుగుపర్చే విషయాలు బైబిల్లో నుండి చూపిస్తే మీరు చెప్పేది వినడానికి ఇష్టపడవచ్చు. ఉదాహరణకు, కొండమీద ప్రసంగంలో ఉన్న సలహాల గురించి మీరు వాళ్లతో మాట్లాడవచ్చు.
16 అయితే ప్రజలతో వాదించడం మన ఉద్దేశం కాదని గుర్తుంచుకోండి. వాళ్లు మన సంభాషణను ఆనందించాలని, బైబిలు గురించి నేర్చుకోవాలని కోరుకుంటాం. కాబట్టి ప్రశ్నల్ని గౌరవపూర్వకంగా అడగండి, తర్వాత వాళ్లు చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ నమ్మకాల గురించి చెప్తున్నప్పుడు గౌరవపూర్వకంగా మాట్లాడండి, ముఖ్యంగా మీకన్నా పెద్దవాళ్లతో మాట్లాడుతున్నప్పుడు అలా చేయండి. మీరు ఇతరుల్ని గౌరవిస్తే, వాళ్లు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. అప్పుడు మీరు చిన్నవాళ్లయినా మీ నమ్మకాల గురించి లోతుగా ఆలోచించారని చూసి వాళ్లు ముగ్ధులౌతారు. అయితే మీతో వాదించాలని లేదా ఎగతాళి చేయాలని చూసేవాళ్లకు మీరు జవాబు ఇవ్వాల్సిన అవసరంలేదు.—సామె. 26:4.
బైబిలు సత్యాల్ని తెలుసుకుని మీ విశ్వాసాన్ని బలపర్చుకోండి
17, 18. (ఎ) బైబిలు మీద మీ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి ఏది సహాయం చేస్తుంది? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?
17 బైబిల్లోని ప్రాథమిక బోధలు మనకు తెలిసివుండవచ్చు. కానీ మన విశ్వాసం బలంగా ఉండాలంటే వాటికన్నా ఎక్కువే తెలుసుకోవాలి. దాచబడిన ధనాన్ని వెదికినట్లు బైబిల్లో ఉన్న లోతైన సత్యాల్ని పరిశోధించి తెలుసుకోవాలి. (సామె. 2:3-6) మీ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి ఓ మంచి మార్గమేమిటంటే పూర్తి బైబిల్ని చదవడం. మీరు ఒక సంవత్సరంలోనే పూర్తి బైబిల్ని చదవడానికి ప్రయత్నించవచ్చు. ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవచేస్తున్న ఓ సహోదరుడు తన చిన్నతనంలోనే అలా చేయడంవల్ల అతను యెహోవాకు మరింత దగ్గరయ్యాడు. అతనిలా చెప్పాడు, “బైబిల్ని పూర్తిగా చదవడం వల్ల దేవుడే దాన్ని రాయించాడని నేను గుర్తించగలిగాను. చిన్నప్పటి నుండి నేను నేర్చుకున్న బైబిలు కథలు ఇప్పుడు నాకు అర్థమౌతున్నాయి.” మీరు చదువుతున్న విషయాలు అర్థంచేసుకునేందుకు మీ భాషలో అందుబాటులో ఉన్న పరిశోధనా ఉపకరణాల్ని ఉపయోగించండి. ఉదాహరణకు, డీవీడీ రూపంలో ఉన్న వాచ్‌టవర్ లైబ్రరీ, కావలికోట ఆన్‌లైన్ లైబ్రరీ, వాచ్‌టవర్ పబ్లికేషన్ ఇండెక్స్, లేదా యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకం వంటివి ఉపయోగించవచ్చు.
18 వేరే ఎవ్వరికన్నా ఎక్కువగా తల్లిదండ్రులే తమ పిల్లలకు యెహోవా గురించి నేర్పించగలుగుతారు. కాబట్టి ఆయనపై బలమైన విశ్వాసం కలిగివుండేలా మీ పిల్లలకు మీరెలా సహాయం చేయవచ్చు? దీని గురించి తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.