కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘దేవుని వాక్యము సజీవమైనది’

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

హెబ్రీయులు 4:12 వ వచనం చెప్తున్న, ‘సజీవమై బలముగలదైన దేవుని వాక్యము’ ఏమిటి?

ఆ లేఖన సందర్భాన్నిబట్టి అపొస్తలుడైన పౌలు బైబిల్లో ఉన్న దేవుని సందేశం లేదా సంకల్పం గురించి మాట్లాడుతున్నాడని అర్థమౌతుంది.

జీవితాల్ని మార్చే శక్తి బైబిలుకు ఉందని చెప్పడానికి హెబ్రీయులు 4:12 వ వచనాన్ని మన ప్రచురణల్లో చాలాసార్లు ఉపయోగించాం. అలా చెప్పడం సరైనది కూడా. అయితే హెబ్రీయులు 4:12 వ వచనం సందర్భాన్ని కాస్త లోతుగా పరిశీలించడం ఉపయోగకరంగా ఉంటుంది. ఆ సందర్భంలో పౌలు, దేవుని సంకల్పాలకు మద్దతివ్వాలని హెబ్రీ క్రైస్తవుల్ని ప్రోత్సహిస్తున్నాడు. అలాంటి ఎన్నో సంకల్పాల గురించి పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నాయి. అయితే ఐగుప్తు నుండి విడుదలైన ఇశ్రాయేలీయుల్ని పౌలు ఓ ఉదాహరణగా చెప్తున్నాడు. “పాలు తేనెలు ప్రవహించు” వాగ్దాన దేశంలోకి ప్రవేశించి నిజమైన విశ్రాంతిని పొందే అవకాశం వాళ్లకు ఉండేది.—నిర్గ. 3:8; ద్వితీ. 12:9, 10.

అది దేవుని సంకల్పం. కానీ ఆ తర్వాత ఇశ్రాయేలీయులు తమ హృదయాల్ని కఠినం చేసుకుని, విశ్వాసం చూపించలేదు. ఫలితంగా వాళ్లలో చాలామంది ఆ విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. (సంఖ్యా. 14:30; యెహో. 14:6-10) అయితే, ‘దేవుని విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానం ఇంకా నిలిచియున్నది’ అని కూడా పౌలు చెప్పాడు. (హెబ్రీ. 3:16-19; 4:1) ఆ “వాగ్దానము” దేవుని సంకల్పంలో భాగమే. కాబట్టి మనం కూడా హెబ్రీ క్రైస్తవులు చేసినట్లే ఆ సంకల్పం గురించి చదివి, దానికి మద్దతివ్వవచ్చు. ఈ వాగ్దానం లేఖనాధారమని నొక్కి చెప్పడానికి ఆదికాండము 2:2, కీర్తన 95:11 వచనాల్లోని కొన్ని మాటల్ని పౌలు ఎత్తి చెప్పాడు.

నిజమే, ‘దేవుని విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానం ఇంకా నిలిచియున్నది’ అనే మాటల నుండి మనం ప్రోత్సాహాన్ని పొందాలి. బైబిలు చెప్తున్న దేవుని విశ్రాంతిలో ప్రవేశించడం నిజంగా సాధ్యమేనని మనం నమ్ముతాం. అలా ప్రవేశించడానికి కావాల్సిన చర్యలు కూడా మనం తీసుకున్నాం. అయితే మనం తీసుకున్న చర్యలు, మోషే ధర్మశాస్త్రంలో ఉన్నవి పాటించడమో లేదా యెహోవా ఆమోదం పొందడానికి మరితర పనులు చేయడమో కాదు. బదులుగా, దేవుడు తెలియజేసిన సంకల్పానికి విశ్వాసంతో సంతోషంగా మద్దతిచ్చాం, ఎప్పటికీ మద్దతిస్తూనే ఉంటాం. అంతేకాదు పైన ప్రస్తావించినట్లు, ‘దేవుని వాక్యం’ బైబిలును కూడా సూచిస్తుంది. భూవ్యాప్తంగా ఉన్న వేలమంది ప్రజలు బైబిల్ని అధ్యయనం చేసి, దేవుని సంకల్పం గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. వాళ్లలో చాలామంది తమ జీవన విధానాన్ని మార్చుకుని, విశ్వాసాన్ని చూపించి, బాప్తిస్మం తీసుకున్నారు. వాళ్లు జీవితంలో చేసుకుంటున్న మార్పుల్ని బట్టి, ‘దేవుని వాక్యము సజీవమై బలముగలది’ అని చెప్పవచ్చు. బైబిల్లో ఉన్న దేవుని సంకల్పం ఇప్పటికే మన జీవితాల మీద ప్రభావం చూపించింది, ఇకపై కూడా చూపిస్తూనే ఉంటుంది.