కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆత్మనిగ్రహాన్ని అలవర్చుకోండి

ఆత్మనిగ్రహాన్ని అలవర్చుకోండి

“పవిత్రశక్తి మనుషుల్లో పుట్టించే లక్షణాలు ఏమిటంటే . . . ఆత్మనిగ్రహం.”—గల. 5:22, 23.

పాటలు: 121, 36

1, 2. (ఎ) ఆత్మనిగ్రహం లేకపోవడంవల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? (బి) ఈ లక్షణం గురించి మనమెందుకు చర్చించుకోవాలి?

 ఆత్మనిగ్రహం అనే లక్షణాన్ని అలవర్చుకోవడానికి యెహోవా దేవుడు మనకు సహాయం చేయగలడు. (గల. 5:22, 23) ఆ లక్షణాన్ని యెహోవా పూర్తిస్థాయిలో చూపించగలడు. కానీ మనం అపరిపూర్ణులం కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆత్మనిగ్రహాన్ని చూపించడం కష్టంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రజలకున్న సమస్యల్లో చాలావాటికి కారణం ఆత్మనిగ్రహం లేకపోవడమే. ఆ లక్షణం లేకపోవడం వల్ల ముఖ్యమైన పనులను వాయిదా వేయడం, స్కూల్లో లేదా ఉద్యోగంలో రాణించలేకపోవడం వంటివి జరుగుతుంటాయి. అంతేకాదు బూతులు మాట్లాడడం, అతిగా తాగడం, హింసకు పాల్పడడం, విడాకులు తీసుకోవడం, అనవసరమైన అప్పులు చేయడం, చెడు అలవాట్లకు బానిసలవ్వడం, జైలు పాలవ్వడం, మానసిక వేదన, సుఖవ్యాధులు, అవాంఛిత గర్భధారణ వంటివాటికి కూడా కారణం ఆత్మనిగ్రహం లేకపోవడమే.—కీర్త. 34:11-14.

2 ఆత్మనిగ్రహం లేనివాళ్లు తమకు తామే సమస్యల్ని కొనితెచ్చుకుంటారు, ఇతరులకు కూడా సమస్యలు తెచ్చిపెడతారు. రోజులు గడిచేకొద్దీ ప్రజల్లో ఆత్మనిగ్రహం పూర్తిగా కనుమరుగైపోతోంది. దానికి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే మనం “చివరి రోజుల్లో” జీవిస్తున్నామనడానికి అలాంటి ప్రజలే ఒక రుజువని దేవుని వాక్యం ముందుగానే చెప్పింది.—2 తిమో. 3:1-3.

3. ఆత్మనిగ్రహం ఎందుకు అవసరం?

3 ఇంతకీ ఆత్మనిగ్రహం ఎందుకు అవసరం? దానికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటిది తమ భావాల్ని, భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోగలిగేవాళ్లకు సాధారణంగా తక్కువ సమస్యలు ఉంటాయి. అంతేకాదు అలాంటివాళ్లకు ఇతరులతో మంచి సంబంధాలు ఉంటాయి; కోపం, ఆందోళన, కృంగుదల వంటివాటిని తేలిగ్గా అధిగమించగలుగుతారు. రెండవది, దేవునికి స్నేహితులుగా ఉండాలంటే చెడు చేయాలనే ఒత్తిడికి, తప్పుడు కోరికలకు మనం లొంగిపోకూడదు. ఆ విషయంలోనే ఆదాముహవ్వలు విఫలమయ్యారు. (ఆది. 3:6) ఆత్మనిగ్రహం లేకపోవడం వల్ల వాళ్లలాగే నేడు చాలామంది ఘోరమైన సమస్యల్లో చిక్కుకుపోయారు.

4. ఆత్మనిగ్రహాన్ని చూపించడం కష్టంగా ఉన్నవాళ్లకు ఎలాంటి ప్రోత్సాహం ఉంది?

4 మనం అపరిపూర్ణులమనీ, ఆత్మనిగ్రహాన్ని చూపించడం మనకు కష్టమనీ యెహోవాకు తెలుసు. తప్పుడు కోరికల్ని అధిగమించే విషయంలో ఆయన మనకు సహాయం చేయాలనుకుంటున్నాడు. (1 రాజు. 8:46-50) తమ భావాల్ని, కోరికల్ని అదుపులో ఉంచుకోవడం కష్టంగా అనిపించేవాళ్లను ఆయన ఒక ప్రేమగల స్నేహితునిలా ప్రోత్సహిస్తున్నాడు. అయితే ఆత్మనిగ్రహాన్ని చూపించే విషయంలో యెహోవా ఉంచిన ఆదర్శం గురించి ఈరోజు ఆర్టికల్‌లో నేర్చుకుంటాం. అంతేకాదు ఈ లక్షణం చూపించిన కొంతమంది గురించి, అలాగే చూపించడంలో విఫలమైన కొంతమంది గురించి చర్చిస్తాం. ఆత్మనిగ్రహాన్ని చూపించే విషయంలో మనకు సహాయపడగల కొన్ని సలహాల్ని కూడా నేర్చుకుంటాం.

యెహోవా ఉంచిన ఆదర్శం

5, 6. ఆత్మనిగ్రహం చూపించే విషయంలో యెహోవా ఎలాంటి ఆదర్శం ఉంచాడు?

5 యెహోవా అన్నివిషయాల్లో పరిపూర్ణుడు కాబట్టి ఆయన ఆత్మనిగ్రహాన్ని పూర్తిస్థాయిలో చూపిస్తాడు. (ద్వితీ. 32:4) మనం మాత్రం అపరిపూర్ణులం. అయినప్పటికీ ఆత్మనిగ్రహం చూపించే విషయంలో యెహోవా ఉంచిన ఆదర్శాన్ని పరిశీలించడం వల్ల, సాధ్యమైనంత ఎక్కువగా ఆయన్ను అనుకరించగలుగుతాం. అంతేకాదు, మనల్ని బాధపెట్టే సంఘటనలు ఏవైనా జరిగినప్పుడు సరైన విధంగా ప్రవర్తించగలుగుతాం. యెహోవా ఆ లక్షణాన్ని చూపించిన కొన్ని సందర్భాలు ఏమిటో ఇప్పుడు పరిశీలిద్దాం.

6 ఏదెను తోటలో సాతాను తిరుగుబాటు చేసినప్పుడు యెహోవా ఎలా ప్రతిస్పందించాడో ఒకసారి ఆలోచించండి. సాతాను వేసిన నింద గురించి విన్నప్పుడు పరలోకంలోని దేవుని నమ్మకమైన సేవకులందరూ అవాక్కయ్యారు, అంతేకాదు సాతాను పట్ల వాళ్లకు కోపం, అసహ్యం కూడా కలిగాయి. సాతాను వల్ల కలిగిన బాధలన్నిటి గురించి ఆలోచించినప్పుడు మీలో కూడా అలాంటి భావాలే కలగవచ్చు. కానీ యెహోవా ఆవేశపడలేదు, ఆయన కేవలం సరైన జవాబు మాత్రమే ఇచ్చాడు. సాతాను చేసిన తిరుగుబాటుతో వ్యవహరించే విషయంలో యెహోవా కోపంగా కాదుగానీ న్యాయంగా ప్రవర్తించాడు. (నిర్గ. 34:6; యోబు 2:2-6) ఆయన కొంతకాలం గడిచేవరకు ఆగుతున్నాడు. ఎందుకంటే ఏ ఒక్కరూ నాశనం అవ్వడం యెహోవాకు ఇష్టంలేదు. బదులుగా, “అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని ఆయన కోరుకుంటున్నాడు.”—2 పేతు. 3:9.

7. యెహోవా నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

7 ఏదైనా మాట్లాడేముందు జాగ్రత్తగా ఆలోచించాలని, ఆవేశంతో ఏదీ చేయకూడదని యెహోవా నుండి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు సమయం తీసుకుని ఆలోచించాలి. సరైన విధంగా మాట్లాడేందుకు లేదా సరైనది చేసేందుకు కావాల్సిన జ్ఞానం ఇవ్వమని ప్రార్థించాలి. (కీర్త. 141:3) సాధారణంగా కోపంలోగానీ, బాధలోగానీ ఉన్నప్పుడు ఆవేశపడి ఏదోకటి అనేస్తాం లేదా చేసేస్తాం. అందుకే చాలామంది తమ మాటల విషయంలో లేదా పనుల విషయంలో బాధపడుతుంటారు.—సామె. 14:29; 15:28; 19:2.

ఆత్మనిగ్రహం చూపించినవాళ్ల, చూపించనివాళ్ల ఉదాహరణలు

8. (ఎ) ఆత్మనిగ్రహాన్ని చూపించినవాళ్ల చక్కని ఉదాహరణలు ఎక్కడ ఉన్నాయి? (బి) పోతీఫరు భార్యకు లొంగిపోకుండా యోసేపుకు ఏది సహాయం చేసింది? (ప్రారంభ చిత్రం చూడండి.)

8 బైబిల్లో ఉన్న ఎవరి ఉదాహరణలు ఆత్మనిగ్రహానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి? ఒక ఉదాహరణ ఎవరంటే, యాకోబు కొడుకైన యోసేపు. అతను ఫరో దగ్గర సైనికాధికారిగా ఉన్న పోతీఫరు ఇంట్లో పనిచేసేవాడు. ఆ సమయంలో తనపై వచ్చిన ఒత్తిడికి యోసేపు లొంగిపోలేదు. ‘మంచి శరీర దారుఢ్యం, అందం’ ఉన్న యోసేపు పోతీఫరు భార్యకు నచ్చాడు. దాంతో అతన్ని లొంగదీసుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించింది. మరి ఆమెకు లొంగిపోకుండా యోసేపుకు ఏమి సహాయం చేసింది? ఒకవేళ ఆమెకు లొంగిపోతే ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో బహుశా యోసేపు ముందుగానే ఆలోచించి ఉంటాడు. అందుకే, పోతీఫరు భార్య యోసేపు వస్త్రాన్ని లాగినప్పుడు అతను ఆమె నుండి పారిపోయాడు. ఆ సందర్భంలో యోసేపు ఆమెతో ఇలా అన్నాడు, ‘నేను ఇంత చెడ్డ పని చేసి దేవునికి వ్యతిరేకంగా ఎలా పాపం చేయగలను?’—ఆది. 39:6, 9, NW; సామెతలు 1:10 చదవండి.

9. తప్పుడు కోరికల్ని ఎదిరించడానికి మీరెలా సిద్ధపడవచ్చు?

9 యోసేపు ఉదాహరణ నుండి మనమేమి నేర్చుకోవచ్చు? దేవుని నియమాల్లో దేన్నైనా మీరాలనే ఒత్తిడి ఎదురైతే మనం దానికి అస్సలు లొంగిపోకూడదు. యెహోవాసాక్షులుగా అవ్వకముందు, కొంతమంది తిండిబోతులుగా, తాగుబోతులుగా, సిగరెట్లకు-మత్తు పదార్థాలకు బానిసలుగా, తప్పుడు పనులు చేసేవాళ్లుగా ఉండేవాళ్లు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా, ఒకప్పటిలా జీవించాలనే ఒత్తిడి వాళ్లకు అప్పుడప్పుడు ఎదురై ఉండవచ్చు. మీకు అలాంటి ఒత్తిడి ఎదురైనప్పుడు, దానికి లొంగిపోతే యెహోవాతో మీకున్న సంబంధం ఎలా దెబ్బతింటుందో కాస్త ఆలోచించండి. అంతేకాదు, తప్పు చేయాలనే ఒత్తిడిని కలిగించే సందర్భాలు ఏమిటో గుర్తించి, వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకోండి. (కీర్త. 26:4, 5; సామె. 22:3) తప్పుడు కోరికలకు లొంగిపోవాలనే ఒత్తిడి ఎదురైనప్పుడల్లా, దాన్ని ఎదిరించడానికి కావాల్సిన జ్ఞానం, ఆత్మనిగ్రహం ఇవ్వమని యెహోవాను అడగండి.

10, 11. (ఎ) చాలామంది యౌవనస్థులు స్కూల్లో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు? (బి) దేవుని నియమాల్ని మీరకుండా ఉండడానికి యౌవనస్థులకు ఏమి సహాయం చేస్తుంది?

10 యోసేపు లాంటి పరిస్థితిని నేడున్న చాలామంది యౌవనస్థులు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు కిమ్‌ అనే అమ్మాయి అనుభవాన్ని పరిశీలించండి. కిమ్‌తోపాటు చదివే పిల్లలు, వారాంతంలో తాము సెక్స్‌లో పాల్గొన్నామని తరచూ గొప్పగా చెప్పుకునేవాళ్లు. కానీ కిమ్‌ అలాంటి పనులు చేయలేదు కాబట్టి చెప్పడానికి ఏమీ ఉండేది కాదు. అయితే వాళ్లలాగా ప్రవర్తించకపోవడం వల్ల కొన్నిసార్లు ‘వెలేసినట్లుగా, ఒంటరిగా’ అనిపించేదని కిమ్‌ ఒప్పుకుంటోంది. ఎవ్వరితో డేటింగ్‌ చేయని కిమ్‌ తెలివితక్కువదని ఆమె తోటి విద్యార్థులు అనుకునేవాళ్లు. నిజానికి కిమ్‌ తెలివిగా ప్రవర్తించింది. యౌవనంలో ఉన్నప్పుడు సెక్స్‌లో పాల్గొనాలనే కోరిక బలంగా ఉంటుందని ఆమెకు తెలుసు. (2 తిమో. 2:22) తోటి విద్యార్థులు కిమ్‌ దగ్గరకు వచ్చి, ఆమె ఇంకా కన్యగానే ఉందానని తరచూ అడిగేవాళ్లు. అలాంటి సందర్భాల్లో, సెక్స్‌లో పాల్గొనకూడదని ఆమె ఎందుకు నిర్ణయించుకుందో వాళ్లకు వివరించేది. నైతిక విషయాల్లో పవిత్రంగా ఉండాలని నిర్ణయించుకున్న యౌవనస్థుల్ని చూసి మనం గర్వపడుతున్నాం. యెహోవా కూడా వాళ్లను చూసి గర్వపడుతున్నాడు.

11 తప్పుడు పనులు చేయాలనే కోరికకు లొంగిపోయిన వ్యక్తుల ఉదాహరణలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఆత్మనిగ్రహం చూపించకపోవడం వల్ల ఎలాంటి చెడు పర్యవసానాలు ఎదురౌతాయో ఆ ఉదాహరణలు చూపిస్తాయి. కిమ్‌ లాంటి పరిస్థితి మీకు ఎదురైతే సామెతలు 7వ అధ్యాయంలో వర్ణించబడిన తెలివితక్కువ యౌవనస్థుడిని గుర్తుతెచ్చుకోండి. అమ్నోను చేసిన పని, దానివల్ల వచ్చిన ఘోరమైన పర్యవసానాల్ని కూడా గుర్తుతెచ్చుకోండి. (2 సమూ. 13:1, 2, 10-15, 28-32) వాళ్ల ఉదాహరణల్ని కుటుంబ ఆరాధనలో చర్చించడం ద్వారా ఆత్మనిగ్రహాన్ని, తెలివిని అలవర్చుకునేలా తల్లిదండ్రులు పిల్లలకు సహాయం చేయవచ్చు.

12. (ఎ) యోసేపు తన అన్నల దగ్గర తన భావోద్వేగాల్ని ఎలా అదుపు చేసుకున్నాడు? (బి) ఎలాంటి సందర్భాల్లో మన భావోద్వేగాల్ని అదుపు చేసుకోవాల్సిరావచ్చు?

12 ఆత్మనిగ్రహం చూపించే విషయంలో యోసేపు మరో సందర్భంలో కూడా చక్కని ఆదర్శాన్ని ఉంచాడు. ఆహారాన్ని కొనుక్కోవడానికి అతని అన్నలు ఐగుప్తుకు వచ్చినప్పుడు, తాను వాళ్ల తమ్ముడిననే విషయాన్ని యోసేపు వెంటనే చెప్పలేదు. బదులుగా వాళ్ల మనసుల్లో నిజంగా ఏముందో తెలుసుకోవాలని అనుకున్నాడు. తనలోని భావోద్వేగాల్ని అదుపు చేసుకోలేనప్పుడు మాత్రం, యోసేపు ఏకాంత ప్రదేశానికి వెళ్లి ఏడ్చాడు. (ఆది. 43:30, 31; 45:1) అదేవిధంగా మిమ్మల్ని తోటి సహోదరుడు లేదా సహోదరి బాధపెడితే, యోసేపులా ఆత్మనిగ్రహం చూపించండి. అలాచేస్తే, ఏదోకటి అనేసి లేదా చేసేసి తర్వాత బాధపడాల్సిన పరిస్థితి రాదు. (సామె. 16:32; 17:27) ఒకవేళ మీ బంధువుల్లో ఎవరైనా సంఘం నుండి బహిష్కరించబడి ఉండవచ్చు. అలాంటి పరిస్థితి వస్తే, వాళ్లతో అనవసరంగా మాట్లాడకుండా మీ భావోద్వేగాల్ని అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. అది కాస్త కష్టమైన పనే. కానీ మీరు యెహోవాను అనుకరిస్తున్నారని, ఆయన చెప్పిన పని చేస్తున్నారని గుర్తుంచుకున్నప్పుడు మీ భావోద్వేగాల్ని తేలిగ్గా అదుపు చేసుకోగలుగుతారు.

13. రాజైన దావీదు జీవితంలో జరిగిన సంఘటనల నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

13 రాజైన దావీదు నుండి కూడా మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. సౌలు, షిమీ రెచ్చగొట్టినప్పుడు దావీదు కోపం తెచ్చుకోలేదు, తన అధికారాన్ని వాళ్లపై పగ తీర్చుకోవడానికి ఉపయోగించలేదు. (1 సమూ. 26:9-11; 2 సమూ. 16:5-10) అయితే దావీదు బత్షెబతో వ్యభిచారం చేయడం గురించి, స్వార్థపరుడైన నాబాలు మీద చర్య తీసుకోవాలని అనుకోవడం గురించి చదివినప్పుడు దావీదు ప్రతీ సందర్భంలో ఆత్మనిగ్రహాన్ని చూపించలేదని తెలుస్తోంది. (1 సమూ. 25:10-13; 2 సమూ. 11:2-4) దావీదు నుండి మనం విలువైన పాఠాల్ని నేర్చుకోవచ్చు. మొదటిది, దేవుని ప్రజలపై ఉన్న పర్యవేక్షకులు తమ అధికారాన్ని దుర్వినియోగపర్చకుండా ఉండేలా ఆత్మనిగ్రహాన్ని చూపించాలి. రెండవది, తప్పుడు కోరికలకు లొంగిపోము అనే మితిమీరిన ఆత్మవిశ్వాసం మనలో ఎవ్వరికీ ఉండకూడదు.—1 కొరిం. 10:12.

ఆత్మనిగ్రహాన్ని అలవర్చుకోవడానికి మీరు చేయాల్సినవి

14. ఒక సహోదరునికి ఎలాంటి అనుభవం ఎదురైంది? అలాంటి పరిస్థితి మనకు ఎదురైనప్పుడు మనమెలా ప్రవర్తిస్తామనేది ఎందుకు ముఖ్యం?

14 ఆత్మనిగ్రహాన్ని అలవర్చుకోవడానికి మీరేమి చేయవచ్చు? లూయీజీ అనే సహోదరుని జీవితంలో జరిగిన ఈ సంఘటనను పరిశీలించండి. ఒక వ్యక్తి లూయీజీ కారును గుద్దాడు. తప్పు అవతలి వ్యక్తిదే అయినప్పటికీ, తిరిగి అతనే లూయీజీపై అరుస్తూ గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు లూయీజీ, తాను అరవకుండా ఉండేలా సహాయం చేయమని యెహోవాకు ప్రార్థన చేసుకుని అవతలి వ్యక్తిని కూడా శాంతపర్చడానికి ప్రయత్నించాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం అరవడం ఆపలేదు. దాంతో చేసేది ఏమీలేక, లూయీజీ అవతలి వ్యక్తి కారు నంబరు రాసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు. అది జరిగి వారం గడిచిపోయింది. లూయీజీ ఒకామె దగ్గరకు పునర్దర్శనం చేయడానికి వెళ్లాడు. ఆమె భర్త ఎవరో కాదు, తన మీద అరిచిన వ్యక్తే! ఆరోజు ప్రవర్తించిన తీరుకు సిగ్గుగా అనిపించి, ఆ వ్యక్తి లూయీజీకి క్షమాపణ చెప్పాడు. అంతేకాదు లూయీజీకి కారు త్వరగా బాగుచేయించి ఇచ్చేలా ఇన్సూరెన్సు కంపెనీతో మాట్లాడతానని చెప్పాడు. లూయీజీ చెప్పిన బైబిలు విషయాలు కూర్చొని విన్నాడు, అవి అతనికి నచ్చాయి కూడా. దాంతో, యాక్సిడెంట్‌ జరిగిన తర్వాత ఆవేశపడి గొడవపడకుండా ఉండడం ఎంత మంచిదైందో లూయీజీ గ్రహించాడు. ఒకవేళ ఆరోజు తొందరపడి తను కూడా అరిచి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అతను అర్థంచేసుకున్నాడు.—2 కొరింథీయులు 6:3, 4 చదవండి.

మన ప్రవర్తన ప్రీచింగ్‌పై ప్రభావం చూపించగలదు (14వ పేరా చూడండి)

15, 16. ఆత్మనిగ్రహాన్ని అలవర్చుకోవడానికి బైబిలు అధ్యయనం మీకూ, మీ కుటుంబానికీ ఎలా సహాయం చేస్తుంది?

15 క్రమంగా, అర్థవంతంగా చేసే బైబిలు అధ్యయనం ఆత్మనిగ్రహాన్ని అలవర్చుకునేలా క్రైస్తవులకు సహాయం చేస్తుంది. దేవుడు యెహోషువకు చెప్పిన ఈ మాటల్ని గుర్తుంచుకోండి: “ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.” (యెహో. 1:8) మరి, ఆత్మనిగ్రహం అలవర్చుకోవడానికి బైబిలు అధ్యయనం ఎలా సహాయం చేస్తుంది?

16 ఆత్మనిగ్రహం చూపిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో, చూపించకపోతే ఎలాంటి బాధలుపడాల్సి వస్తుందో తెలియజేసే ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయని మనం తెలుసుకున్నాం. యెహోవా వాటిని ఓ కారణంతోనే బైబిల్లో రాయించాడు. (రోమా. 15:4) కాబట్టి వాటిని చదవడం, అధ్యయనం చేయడం, జాగ్రత్తగా ఆలోచించడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఆ ఉదాహరణలు మీకూ, మీ కుటుంబానికీ ఎలా ఉపయోగపడతాయో అర్థంచేసుకోవడానికి ప్రయత్నించండి. తన వాక్యంలోని సలహాల్ని పాటించేలా సహాయం చేయమని యెహోవాను అడగండి. ఏదైనా విషయంలో మీకు ఆత్మనిగ్రహం లేదని గుర్తిస్తే, ఆ విషయాన్ని అంగీకరించండి. దానిగురించి ప్రార్థించండి, మెరుగవ్వడానికి తీవ్రంగా ప్రయత్నించండి. (యాకో. 1:5) మన ప్రచురణల్లో మీకు ఉపయోగపడే సలహాలు ఏమైనా ఉన్నాయేమో పరిశోధన చేయండి.

17. ఆత్మనిగ్రహాన్ని అలవర్చుకోవడానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏయే విధాలుగా సహాయం చేయవచ్చు?

17 ఆత్మనిగ్రహాన్ని అలవర్చుకునేలా మీ పిల్లలకు మీరెలా సహాయం చేయవచ్చు? పిల్లలకు పుట్టుకతోనే ఈ లక్షణం రాదని తల్లిదండ్రులకు తెలుసు. కాబట్టి వాళ్లే స్వయంగా చక్కని ఆదర్శాన్ని ఉంచుతూ తమ పిల్లలకు మంచి లక్షణాల్ని నేర్పించాలి. (ఎఫె. 6:4) ఒకవేళ మీ పిల్లల్లో ఆత్మనిగ్రహం లేదని మీరు గుర్తిస్తే, మీరు వాళ్లకు ఎలాంటి ఆదర్శాన్ని ఉంచుతున్నారో ఒకసారి పరిశీలించుకోండి. ప్రీచింగ్‌కూ మీటింగ్స్‌కూ క్రమంగా వెళ్లడం ద్వారా, క్రమంగా కుటుంబ ఆరాధన చేయడం ద్వారా మీరు పిల్లలకు ఆదర్శంగా ఉండవచ్చు. అవసరమైనప్పుడు పిల్లల్ని ఖండించడానికి భయపడకండి. యెహోవా ఆదాముహవ్వలకు కొన్ని హద్దుల్ని పెట్టాడు. ఒకవేళ వాటిని మీరకుండా ఉంటే యెహోవా అధికారాన్ని గౌరవించడం వాళ్లు నేర్చుకునేవాళ్లు. అదేవిధంగా, తల్లిదండ్రులు తమ పిల్లలకు క్రమశిక్షణ ఇస్తూ, వాళ్లకు ఆదర్శంగా ఉంటే పిల్లలు ఆత్మనిగ్రహాన్ని అలవర్చుకుంటారు. మీరు మీ పిల్లలకు నేర్పించాల్సిన ఎంతో విలువైన విషయాల్లో దేవుని అధికారాన్ని ప్రేమించడం, ఆయన పెట్టిన ప్రమాణాల్ని గౌరవించడం వంటివి ఉన్నాయి.—సామెతలు 1:5, 7, 8 చదవండి.

18. మనందరం మన స్నేహితుల్ని ఎందుకు తెలివిగా ఎంచుకోవాలి?

18 మనం తల్లిదండ్రులమైనా కాకపోయినా అందరం మన స్నేహితుల్ని జ్ఞానయుక్తంగా ఎంచుకోవాలి. యెహోవాను ప్రేమించే స్నేహితులు మిమ్మల్ని చక్కని లక్ష్యాలు పెట్టుకోమని ప్రోత్సహిస్తారు, సమస్యల్లో చిక్కుకోకుండా సహాయం చేస్తారు. (సామె. 13:20) ఆత్మనిగ్రహం చూపించే విషయంలో వాళ్లు మంచి ఆదర్శాన్ని ఉంచితే, వాళ్లను అనుకరించాలనే ప్రోత్సాహం మీలో కలుగుతుంది. మీ మంచి ఆదర్శం వాళ్లను కూడా ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది. దేవుని అనుగ్రహం పొందడానికి, జీవితాన్ని ఆనందించడానికి, మనం ప్రేమించేవాళ్లతో మంచి సంబంధం కలిగివుండడానికి ఆత్మనిగ్రహం సహాయం చేస్తుంది.