కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

ఆధ్యాత్మిక వ్యక్తులతో పనిచేసే గొప్ప అవకాశం దొరికింది

ఆధ్యాత్మిక వ్యక్తులతో పనిచేసే గొప్ప అవకాశం దొరికింది

మా నాన్న పేరు జేమ్స్‌ సింక్లెర్‌, అమ్మ పేరు జెస్సీ సింక్లెర్‌. 1930లలో వాళ్లు న్యూయార్క్‌లోని బ్రాంక్స్‌ అనే ప్రాంతంలో స్థిరపడ్డారు. విల్లీ స్నెడన్‌ అనే ఆవిడ మా ఇంటి పక్కనే ఉండేది. అమ్మానాన్నల్లాగే ఆమె కూడా స్కాట్లాండ్‌ నుండి వచ్చింది. మా అమ్మానాన్నలు ఆమెను కలిసిన కొన్ని నిమిషాల్లోనే ఒకరి కుటుంబం గురించి ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇదంతా నేను పుట్టడానికి కొన్ని సంవత్సరాల ముందు జరిగిన సంగతి.

మా అమ్మ, విల్లీతో మాట్లాడుతూ మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి కొంతకాలం ముందే మా తాతయ్య, పెద్ద మామయ్య సముద్రంలో మునిగి చనిపోయారని చెప్పింది. వాళ్లు ఉత్తర సముద్రంలో చేపలు పట్టడానికి పడవలో వెళ్తున్నప్పుడు, ఆ సముద్రంలో పెట్టిన ఒక బాంబును వాళ్ల పడవ ఢీకొట్టడంతో ఆ ప్రమాదం జరిగిందని చెప్పింది. అప్పుడు విల్లీ, “అంటే మీ నాన్న నరకంలో a ఉన్నాడన్నమాట” అని అంది. అది విని మా అమ్మ అవాక్కయ్యింది. యెహోవాసాక్షియైన విల్లీ అలా మా అమ్మకు బైబిలు సత్యాన్ని పరిచయం చేసింది.

లిజ్‌ స్నెడన్‌, విల్లీ స్నెడన్‌

ఆమె మాటలు మా అమ్మకు బాధకలిగించాయి. ఎందుకంటే మా తాతయ్య మంచివాడని అమ్మకు తెలుసు. తర్వాత విల్లీ ఇలా అడిగింది, “యేసు కూడా నరకానికి వెళ్లాడని మీకు తెలుసా?” అప్పుడు చర్చీలో నేర్చుకున్న ఒక ప్రార్థన అమ్మకు గుర్తుకొచ్చింది. యేసు చనిపోయినప్పుడు నరకానికి వెళ్లి, మూడవ రోజున మళ్లీ బ్రతికాడని ఆ ప్రార్థనలో నేర్చుకుంది. అమ్మ ఇలా ఆలోచించింది, ‘ఒకవేళ నరకం చెడ్డవాళ్లను హింసించే మండుతున్న స్థలమైతే, మరి యేసు ఎందుకు అక్కడికి వెళ్లాడు?’ అలా అమ్మకు సత్యం మీద ఆసక్తి మొదలైంది. బ్రాంక్స్‌ సంఘంలో జరుగుతున్న మీటింగ్స్‌కు వెళ్లడం మొదలుపెట్టింది, 1940⁠లో బాప్తిస్మం తీసుకుంది.

అమ్మతో, తర్వాత నాన్నతో నేను

అప్పట్లో, పిల్లలకు బైబిలు గురించి నేర్పించమని తల్లిదండ్రుల్ని ప్రత్యేకంగా ప్రోత్సహించేవాళ్లు కాదు. నేను ఇంకా స్కూల్లో చేరకముందు అమ్మ మీటింగ్స్‌కు, వారాంతాల్లో ప్రీచింగ్‌కు వెళ్లినప్పుడు నాన్న నన్ను చూసుకునేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత నాన్న, నేనూ అమ్మతోపాటు మీటింగ్స్‌కు వెళ్లడం మొదలుపెట్టాం. అమ్మ చాలా ఉత్సాహంగా మంచివార్త ప్రకటించేది, ఆసక్తిగల ఎంతోమందికి బైబిలు స్టడీలు చేసింది. ఒకానొక సమయంలో, స్టడీ తీసుకుంటున్న కొంతమంది ఇళ్లు పక్కపక్కనే ఉండడంతో వాళ్లందరికీ ఒక గుంపుగా స్టడీ చేసింది. మా స్కూల్‌కి సెలవులు ఇచ్చినప్పుడు అమ్మతో ప్రీచింగ్‌కి వెళ్లేవాణ్ణి. ఆ విధంగా బైబిలు గురించి ఎక్కువ విషయాలు నేర్చుకున్నాను, ఆ విషయాలు ఇతరులకు ఎలా చెప్పాలో కూడా నేర్చుకున్నాను.

నా చిన్నతనంలో బైబిలు సత్యాల్ని అంతగా పట్టించుకునేవాణ్ణి కాదు. కానీ, 12 ఏళ్ల వయసులో రాజ్య ప్రచారకుణ్ణి అయ్యాను. అప్పటినుండి క్రమంగా ప్రీచింగ్‌కి వెళ్లడం మొదలుపెట్టాను. నా 16వ ఏట యెహోవాకు సమర్పించుకొని, 1954 జూలై 24న కెనడాలోని టోరెంటోలో జరిగిన ఒక సమావేశంలో బాప్తిస్మం తీసుకున్నాను.

బెతెల్‌ సేవ

మా సంఘంలో బెతెల్‌లో సేవ చేసినవాళ్లు, ఇంకా సేవ చేస్తున్నవాళ్లు ఉండేవాళ్లు. వాళ్ల నుండి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. బైబిలు సత్యాల గురించి మాట్లాడడంలో, వివరించడంలో వాళ్లకున్న సామర్థ్యాలు నాకు చాలా నచ్చాయి. మా టీచర్లు నన్ను పైచదువులకు వెళ్లమని ప్రోత్సహించినప్పటికీ, నేను బెతెల్‌లో సేవ చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాను. అందుకే, టోరెంటోలో జరిగిన సమావేశంలో బెతెల్‌కి అప్లికేషన్‌ పెట్టుకున్నాను. కానీ ఆహ్వానం రాలేదు. 1955⁠లో న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియంలో జరిగిన సమావేశంలో రెండోసారి అప్లికేషన్‌ పెట్టుకున్నాను. ఎంతోకాలం గడవకముందే 1955, సెప్టెంబరు 19న అంటే నాకు 17 ఏళ్లు ఉన్నప్పుడు బ్రూక్లిన్‌ బెతెల్‌కి రమ్మనే ఆహ్వానం వచ్చింది. నేను బెతెల్‌కు వెళ్లిన రెండవ రోజు నుండి, 117 ఆడమ్స్‌ స్ట్రీట్‌లో బైండింగ్‌ విభాగంలో పనిచేయడం మొదలుపెట్టాను. అక్కడ నేను, పుస్తకాల్ని కుట్టే మెషీన్‌ కోసం 32 పేజీల పుస్తకాలను సమకూర్చే పని చేసేవాణ్ణి.

నాకు 17 ఏళ్లు ఉన్నప్పుడు బ్రూక్లిన్‌ బెతెల్‌ సేవ మొదలుపెట్టాను

బైండింగ్‌ విభాగంలో దాదాపు నెల పని చేశాక, నాకు టైపింగ్‌ వచ్చు కాబట్టి మ్యాగజీన్‌ విభాగానికి పంపించారు. అప్పట్లో కావలికోట, తేజరిల్లు! పత్రికల కోసం చందాలు కట్టే వాళ్ల పేర్లను స్టెన్సిల్స్‌ (చిన్న లోహపు ప్లేట్లు) మీద టైప్‌ చేసేవాళ్లు. కొన్ని నెలల తర్వాత, నేను షిప్పింగ్‌ విభాగంలో పనిచేయడం మొదలుపెట్టాను. ఆ విభాగానికి సహోదరుడు క్లావుస్‌ జెన్‌సన్‌ పర్యవేక్షకుడిగా ఉండేవాడు. ప్రచురణలున్న బాక్సులను ఓడరేవుకు తీసుకెళ్లే ట్రక్కు డ్రైవరుతోపాటు వెళ్లగలనేమోనని ఆ సహోదరుడు నన్ను అడిగాడు. అంతేకాదు పత్రికలున్న బ్యాగులను పోస్టు ఆఫీసుకు తీసుకెళ్లి అమెరికాలో ఉన్న సంఘాలన్నిటికీ పోస్టు ద్వారా పంపించాలి. శారీరక పని నా ఆరోగ్యానికి మంచిదని సహోదరుడు జెన్‌సన్‌కి అనిపించినట్లు నాతో చెప్పాడు. ఎందుకంటే నేను చాలా సన్నగా కేవలం 57 కిలోల బరువు ఉండేవాణ్ణి. అలా ఓడరేవుకు, పోస్టు ఆఫీసుకు తిరగడం వల్ల నా శరీరం కొంచెం బలంగా తయారైంది. నాకు ఏది మంచిదో సహోదరుడు జెన్‌సన్‌కు ఖచ్చితంగా తెలుసు.

పత్రికల కోసం సంఘాలు చేసే రిక్వెస్టులను మ్యాగజీన్‌ విభాగం చూసుకునేది. కాబట్టి బ్రూక్లిన్‌లో పత్రికల్ని ఎన్ని భాషల్లో ప్రింట్‌ చేసి, వేరే దేశాలకు పంపించేవాళ్లో నేను తెలుసుకున్నాను. వాటిలో చాలా భాషల గురించి అంతకుముందెప్పుడూ వినలేదు. కానీ సుదూర ప్రాంతాలకు లక్షల సంఖ్యలో ప్రచురణలు వెళ్తున్నాయని తెలుసుకొని సంతోషించాను. ఆ తర్వాతి సంవత్సరాల్లో, వాటిలో చాలా ప్రాంతాలకు వెళ్లే గొప్ప అవకాశం నాకు దొరుకుతుందని అప్పటికింకా తెలీదు.

రాబర్ట్‌ వాలన్‌, ఛార్లెస్‌ మాలహ్యాన్‌, నేను, డాన్‌ ఆడమ్స్‌

1961⁠లో, ట్రెజరీ కార్యాలయ పర్యవేక్షకుడైన సహోదరుడు గ్రాంట్‌స్యూటర్‌ కింద పని చేయడానికి నన్ను నియమించారు. కొన్ని సంవత్సరాల తర్వాత, అప్పట్లో ప్రపంచవ్యాప్త పనికి నాయకత్వం వహిస్తున్న సహోదరుడు నేథన్‌ నార్‌ నన్ను తన ఆఫీసుకు రమ్మని పిలిచాడు. అక్కడికి వెళ్లాక, తన ఆఫీసులో పనిచేసే ఒక సహోదరుడు నెల రోజులపాటు రాజ్య పరిచర్య పాఠశాలకు వెళ్తున్నాడని, ఆ పాఠశాల తర్వాత అతను సేవావిభాగంలో పనిచేస్తాడని వివరించాడు. కాబట్టి ఆ సహోదరుని స్థానంలో నన్ను నియమించారు, నేను సహోదరుడు డాన్‌ ఆడమ్స్‌తో కలిసి పనిచేశాను. ఆసక్తికరంగా, 1955 సమావేశంలో నా బెతెల్‌ అప్లికేషన్‌ను తీసుకున్నది డాన్‌ అనే ఈ సహోదరుడే. రాబర్ట్‌ వాలన్‌ అలాగే ఛార్లెస్‌ మాలహ్యాన్‌ అనే ఇద్దరు సహోదరులు కూడా అదే ఆఫీసులో పనిచేసేవాళ్లు. మేం నలుగురం 50 కన్నా ఎక్కువ సంవత్సరాలు కలిసి పనిచేశాం. అలాంటి నమ్మకమైన ఆధ్యాత్మిక వ్యక్తులతో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.—కీర్త. 133:1.

1970⁠లో వెనిజ్యూలాలో నేను మొదటిసారి జోన్‌ సందర్శనానికి వెళ్లినప్పుడు

1970 మొదలుకొని, ప్రతీ సంవత్సరం లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి కొన్ని వారాలపాటు వాచ్‌టవర్‌ సొసైటీ బ్రాంచి కార్యాలయాల్ని సందర్శించే పనిని నాకు అప్పగించారు. వాటినే అప్పట్లో జోన్‌ సందర్శనాలని పిలిచేవాళ్లు. అలా వెళ్లినప్పుడు బెతెల్‌ కుటుంబ సభ్యులను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిషనరీలను కలిసేవాణ్ణి, ఆధ్యాత్మికంగా వాళ్లను ప్రోత్సహించేవాణ్ణి, బ్రాంచి కార్యాలయ రికార్డులను చూసేవాణ్ణి. ఎన్నో ఏళ్ల క్రితం గిలియడ్‌ పాఠశాలను పూర్తిచేసుకొని వేరే దేశాల్లో ఇప్పటికీ నమ్మకంగా సేవచేస్తున్న వాళ్లను కలవడం చాలా సంతోషంగా ఉండేది. అలాంటి సందర్శనాల్లో భాగంగా 90 కన్నా ఎక్కువ దేశాలకు వెళ్లే గొప్ప అవకాశం నాకు దొరికింది. దాన్నిబట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను.

90 దేశాల్లోని మన సహోదరులను కలవడం చాలా సంతోషంగా ఉంది

నమ్మకమైన జీవిత భాగస్వామి నాకు దొరికింది

బ్రూక్లిన్‌ బెతెల్‌ కుటుంబసభ్యులందర్నీ న్యూయార్క్‌ నగరంలోని సంఘాలకు నియమించారు. నన్ను బ్రాంక్స్‌లోని సంఘానికి నియమించారు. అక్కడున్న ఒక్క సంఘం అభివృద్ధి చెంది, ఎన్నో సంఘాలు ఏర్పడ్డాయి. మొదటి సంఘాన్ని అప్పర్‌ బ్రాంక్స్‌ సంఘం అని పిలిచేవాళ్లు, ఆ సంఘానికే నేను వెళ్లేవాణ్ణి.

1960లలో, దక్షిణ బ్రాంక్స్‌లో సత్యం తెలుసుకున్న ఒక లాట్వియన్‌ కుటుంబం మా సంఘానికి మారింది. వాళ్ల పెద్ద కూతురు పేరు లివ్యా, ఆమె తన హైస్కూల్‌ చదువు పూర్తి చేసుకున్న వెంటనే క్రమ పయినీరు సేవ మొదలుపెట్టింది. కొన్నినెలల తర్వాత, అవసరం ఎక్కువ ఉన్న ప్రాంతమైన మసాచుసెట్స్‌లో సేవచేయడానికి వెళ్లింది. సంఘంలో జరుగుతున్న విషయాల గురించి ఆమెకు ఉత్తరాలు రాయడం మొదలుపెట్టాను. ఆమె కూడా బోస్టన్‌లో జరుగుతున్న పరిచర్యకు వస్తున్న మంచి ఫలితాల గురించి నాకు రాసేది.

లివ్యాతో

కొన్ని సంవత్సరాల తర్వాత, ఆమెను ప్రత్యేక పయినీరుగా నియమించారు. వీలైనంత ఎక్కువ సేవ చేయాలనే కోరిక ఆమెకు ఉండేది. అందుకే ఆమె బెతెల్‌ సేవ కోసం అప్లికేషన్‌ పెట్టుకుంది, 1971⁠లో ఆమెకు ఆహ్వానం వచ్చింది. అది యెహోవా నాకు ఇచ్చిన ఒక సూచనగా అనిపించింది! 1973 అక్టోబరు 27న మేం పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లికి సహోదరుడు నార్‌ ప్రసంగం ఇవ్వడం మాకు దొరికిన గొప్ప అవకాశం. సామెతలు 18:22⁠లో ఇలా ఉంది, “[మంచి, NW] భార్య దొరికినవానికి మేలు దొరికెను అట్టివాడు యెహోవావలన అనుగ్రహము పొందిన వాడు.” నేనూ, లివ్యా కలిసి 40 కన్నా ఎక్కువ సంవత్సరాలు బెతెల్‌లో సేవచేసే దీవెన పొందాం. ఇప్పుడు బ్రాంక్స్‌ ప్రాంతంలోనే ఒక సంఘానికి మద్దతిస్తున్నాం.

క్రీస్తు సహోదరులతో చాలా సన్నిహితంగా పనిచేశాను

సహోదరుడు నార్‌తో కలిసి పనిచేయడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. అతను సత్యం కోసం అలుపెరగకుండా పనిచేసేవాడు. ప్రపంచవ్యాప్తంగా సేవచేస్తున్న మిషనరీల పట్ల అతనికి ఎంతో గౌరవం ఉండేది. మిషనరీలుగా సేవ చేయడానికి వెళ్లిన చాలా ప్రాంతాల్లో యెహోవాసాక్షులు ఎవ్వరూ ఉండేవాళ్లు కాదు. ఆ మిషనరీలే అక్కడి మొట్టమొదటి యెహోవాసాక్షులు. 1976⁠లో సహోదరుడు నార్‌ క్యాన్సర్‌తో బాధపడడం చూసి నా గుండె తరుక్కుపోయింది. అతను మంచం నుండి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు, ప్రింటింగ్‌కు సిద్ధమైన కొంత సమాచారాన్ని చదివి వినిపించమని నన్ను అడిగాడు. అలా చదివేటప్పుడు ఫ్రెడ్రిక్‌ ఫ్రాంజ్‌ కూడా దాన్ని వింటాడనే ఉద్దేశంతో అతన్ని పిలవమన్నాడు. ఆ తర్వాత తెలిసింది ఏమిటంటే, సహోదరుడు ఫ్రాంజ్‌కు చూపు తగ్గిపోవడంతో, సహోదరుడు నార్‌ సమయం తీసుకొని సమాచారాన్ని అతనికి చదివి వినిపించేవాడట.

1977⁠లో డానియెల్‌, మారీన సిడ్లిక్‌లతో జోన్‌ సందర్శనానికి వెళ్లినప్పుడు

సహోదరుడు నార్‌ 1977⁠లో చనిపోయాడు. కానీ అతనితో పరిచయం ఉండి, అతన్ని ప్రేమించినవాళ్లు అతను భూజీవితాన్ని నమ్మకంగా పూర్తి చేసుకున్నాడనే కారణాన్ని బట్టి ఓదార్పు పొందారు. (ప్రక. 2:10) తర్వాత, సహోదరుడు నార్‌ స్థానంలో సహోదరుడు ఫ్రాంజ్‌ ప్రపంచవ్యాప్త పనికి నాయకత్వం వహించాడు.

ఇది జరిగే సమయానికి, సహోదరుడు నార్‌ దగ్గర దశాబ్దాలపాటు పనిచేసిన సహోదరుడు మిల్టన్‌ హెన్షల్‌ కింద నేను కార్యదర్శిగా పనిచేస్తున్నాను. బెతెల్‌లో నాకున్న ముఖ్యమైన బాధ్యత సహోదరుడు ఫ్రాంజ్‌కు కావాల్సిన ఏ సహాయాన్నైనా చేయడమేనని సహోదరుడు హెన్షల్‌ చెప్పాడు. ప్రింటింగ్‌కు పంపించబోయే సమాచారాన్ని అతనికి క్రమంగా చదివి వినిపించేవాణ్ణి. చదువుతున్నదాన్ని పూర్తి అవధానంతో వినే, గుర్తుపెట్టుకోగలిగే అద్భుతమైన సామర్థ్యం సహోదరుడు ఫ్రాంజ్‌కు ఉండేది. సహోదరుడు ఫ్రాంజ్‌ 1992 డిసెంబరులో తన భూజీవితాన్ని పూర్తి చేసుకునే వరకు అతనికి సహాయం చేయగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది.

124 కొలంబియా హైట్స్‌, ఇక్కడ నేను దశాబ్దాలపాటు సేవచేశాను

బెతెల్‌లో నేను సేవచేసిన 61 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. మా అమ్మానాన్నలు యెహోవా నమ్మకమైన సేవకులుగా చనిపోయారు. కొత్తలోకంలో వాళ్లను మళ్లీ కలుసుకునే సమయం కోసం ఎదురుచూస్తున్నాను. (యోహా. 5:28, 29) ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని ప్రజల్లోని కొంతమంది నమ్మకమైన స్త్రీపురుషులతో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అవకాశం. ఈ లోకంలో ఉన్నవేవీ దానికి సాటిరావు. మేము పూర్తికాల సేవ చేసిన సంవత్సరాలన్నిటిలో ‘యెహోవా ఇచ్చే సంతోషం [మాకు] ఆశ్రయదుర్గంగా’ ఉందని నేనూ, లివ్యా మనస్ఫూర్తిగా చెప్పగలం.—నెహె. 8:10, NW.

యెహోవా సంస్థలో ఎవరు ఉన్నా లేకపోయినా, రాజ్య సత్యాలు వ్యాప్తి చేసే పని ఆగదు. స్థిరంగా, నమ్మకంగా ఉన్న ఎంతోమంది సహోదరసహోదరీలతో ఇన్ని సంవత్సరాలు కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. అది నాకు దొరికిన దీవెన. నేను కలిసి పనిచేసిన అభిషిక్త క్రైస్తవుల్లో చాలామంది ఇప్పుడు భూమ్మీద లేరు. కానీ అలాంటి నమ్మకమైన ఆధ్యాత్మిక వ్యక్తులతో కలిసి యెహోవా సేవచేసే అవకాశం దొరికినందుకు నేను ఎంతో కృతజ్ఞుణ్ణి.

a బైబిల్లో కనిపించే మూల భాషా పదాలైన షియోల్‌, హేడిస్‌ మనుషుల సామాన్య సమాధిని సూచిస్తున్నాయి. అయితే కొన్ని బైబిలు అనువాదాలు మాత్రం వాటి స్థానంలో “నరకం” అనే పదాన్ని ఉపయోగించాయి.