కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒకరినొకరు ప్రేమతో బలపర్చుకుంటూ ఉండండి

ఒకరినొకరు ప్రేమతో బలపర్చుకుంటూ ఉండండి

“ప్రేమ బలపరుస్తుంది.”1 కొరిం. 8:1.

పాటలు: 109, 121

1. యేసుక్రీస్తు చనిపోవడానికి ముందురోజు రాత్రి తన శిష్యులతో దేనిగురించి మాట్లాడాడు?

యేసుక్రీస్తు చనిపోవడానికి ముందురోజు రాత్రి, తన శిష్యులతో మాట్లాడుతూ ప్రేమ గురించి దాదాపు 30 సార్లు ప్రస్తావించాడు. “మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి” అని యేసు తన శిష్యులకు చెప్పాడు. (యోహా. 15:12, 17) వాళ్ల ప్రేమ చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుందనీ, దాన్నిబట్టే వాళ్లు క్రీస్తు నిజ అనుచరులుగా గుర్తించబడతారనీ యేసు చెప్పాడు. (యోహా. 13:34, 35) యేసు చెప్పిన ప్రేమ కేవలం ఒక భావన కాదు; అది చాలా శక్తివంతమైన, నిస్వార్థమైన లక్షణం. అందుకే ఆయనిలా అన్నాడు, “స్నేహితుల కోసం ప్రాణం పెట్టడం కన్నా గొప్ప ప్రేమ లేదు. నేను మీకు ఆజ్ఞాపిస్తున్న వాటిని చేస్తే మీరు నా స్నేహితులుగా ఉంటారు.”—యోహా. 15:13, 14.

2. (ఎ) యెహోవా సేవకులు దేనికి పెట్టింది పేరు? (బి) ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

2 నేడు యెహోవా సేవకులు నిజమైన, నిస్వార్థమైన ప్రేమకు, ఐక్యతకు పెట్టింది పేరు. (1 యోహా. 3:10, 11) దేశం, జాతి, భాష, నేపథ్యం వంటివాటితో సంబంధం లేకుండా యెహోవా సేవకులందరూ ఒకరిపట్ల ఒకరు నిజమైన ప్రేమ చూపించుకుంటారు. ఈరోజుల్లో ప్రేమ ఎందుకు చాలా అవసరం? యెహోవా, యేసు ప్రేమతో మనల్ని ఎలా బలపరుస్తున్నారు? ఇతరుల్ని మనమెలా ప్రేమతో బలపర్చవచ్చు? వంటి ప్రశ్నలకు ఈ ఆర్టికల్‌లో జవాబులు తెలుసుకుంటాం.—1 కొరిం. 8:1.

ఈరోజుల్లో ప్రేమ ఎందుకు చాలా అవసరం?

3. “ప్రమాదకరమైన” కాలాల్లో జీవితం ఎలా ఉంటుంది?

3 మనం “ప్రమాదకరమైన” కాలాల్లో జీవిస్తున్నాం కాబట్టి జీవితం కష్టాలతో, కన్నీళ్లతో నిండిపోయింది. (2 తిమో. 3:1-5; కీర్త. 90:10) చాలామంది ఎంత బాధపడుతున్నారంటే, ఇక బ్రతకడం అనవసరం అనుకుంటున్నారు. అందుకే, ప్రతీ సంవత్సరం ఎనిమిది లక్షల కన్నా ఎక్కువమంది, అంటే ప్రతీ 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. విచారకరంగా, మన సహోదరుల్లో కూడా కొంతమంది అలాంటి ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నారు.

4. బైబిలు కాలాల్లో ఎవరు చనిపోవాలని కోరుకున్నారు?

4 బైబిలు కాలాల్లో కొంతమంది నమ్మకమైన సేవకులు సమస్యలతో ఎంతగా బాధపడ్డారంటే, ఆఖరికి చనిపోవాలని కూడా కోరుకున్నారు. ఉదాహరణకు, యోబు కష్టాల పాలైనప్పుడు ‘నా జీవితం మీద నాకు విరక్తి కలిగింది; ఇక బ్రతకాలని లేదు’ అన్నాడు. (యోబు 7:16, NW; 14:13) యోనా ఒక సందర్భంలో ఎంత నిరుత్సాహపడ్డాడంటే, “నేనిక బ్రదుకుటకంటె చచ్చుట మేలు; యెహోవా, నన్నిక బ్రదుకనియ్యక చంపుము” అని అన్నాడు. (యోనా 4:3) ఏలీయా ప్రవక్త కూడా తన జీవితం మీద ఆశ కోల్పోయి ఇలా అన్నాడు, “యెహోవా . . . ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము.” (1 రాజు. 19:4) కానీ ఈ నమ్మకమైన సేవకుల్ని యెహోవా ప్రేమించాడు, వాళ్లు ప్రాణాలతో ఉండాలని కోరుకున్నాడు. చనిపోవాలని అనుకున్నందుకు వాళ్లను తప్పుబట్టలేదు. బదులుగా, అలాంటి భావాల్ని అధిగమించి చివరివరకు నమ్మకంగా సేవచేసేలా వాళ్లను బలపర్చాడు.

5. ఈరోజుల్లో సహోదరసహోదరీలకు మన ప్రేమ ఎందుకు అవసరం?

5 ఈరోజుల్లో, చాలామంది సహోదరసహోదరీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్లకు మన ప్రేమ అవసరం. కొంతమంది ఎగతాళికి, హింసకు గురౌతున్నారు. ఇంకొంతమంది ఉద్యోగస్థలాల్లో విమర్శలు లేదా పుకార్లు ఎదుర్కొంటున్నారు. మరికొంతమంది ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల, లేదా ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలు చేయడం వల్ల బాగా అలసిపోతున్నారు. కొందరేమో కుటుంబ సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బహుశా వాళ్లు యెహోవాసాక్షికాని భర్త లేదా భార్య నుండి తరచూ ఎగతాళిని ఎదుర్కొంటుండవచ్చు. వీటివల్ల అలాగే ఇతర ఒత్తిళ్లవల్ల చాలామంది శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నారు. మరి వాళ్లకు ఎవరు సహాయం చేయగలరు?

యెహోవా ప్రేమతో మనల్ని బలపరుస్తున్నాడు

6. యెహోవా ప్రేమ తన సేవకుల్ని ఎలా బలపరుస్తుంది?

6 యెహోవా తన సేవకుల్ని ఎప్పటికీ ప్రేమిస్తానని అభయం ఇచ్చాడు. “నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను . . . భయపడకుము, నేను నీకు తోడైయున్నాను” అని యెహోవా ఇశ్రాయేలీయులతో అన్నప్పుడు, వాళ్లకు ఎలా అనిపించివుంటుందో ఊహించండి. (యెష. 43:4, 5) మనలో ప్రతీఒక్కరిని యెహోవా విలువైనవాళ్లుగా చూస్తాడు. * “ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును” అని బైబిలు మాటిస్తుంది.—జెఫ. 3:16, 17.

7. యెహోవా ప్రేమను తల్లి ప్రేమతో ఎందుకు పోల్చవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

7 తన సేవకులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా, వాళ్లను బలపరుస్తానని, ఊరటనిస్తానని యెహోవా మాటిస్తున్నాడు. “మీరు చంకను ఎత్తికొనబడెదరు మోకాళ్లమీద ఆడింపబడెదరు. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను” అని ఆయన చెప్పాడు. (యెష. 66: 12, 13) చంటిబిడ్డను తల్లి ఎత్తుకున్నప్పుడు లేదా ఆడిస్తున్నప్పుడు ఆ బిడ్డ ఎంత సురక్షితంగా ఉన్నట్లు భావిస్తుందో ఆలోచించండి! అదేవిధంగా యెహోవా మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, మీరు సురక్షితంగా ఉన్నట్లు భావించాలని కోరుకుంటున్నాడు. అంతేకాదు, ఆయన మిమ్మల్ని విలువైనవాళ్లుగా చూస్తున్నాడు.—యిర్మీ. 31:3.

8, 9. క్రీస్తు ప్రేమ మనల్ని ఎలా బలపరుస్తుంది?

8 “దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే వాళ్లకోసం తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయన మీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని అలా చేశాడు.” ఈ కారణాన్ని బట్టి కూడా యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని చెప్పవచ్చు. (యోహా. 3:16) యేసు విమోచనా క్రయధనంగా తన ప్రాణం ఇచ్చాడంటే, ఆయన కూడా మనల్ని ప్రేమిస్తున్నాడని అర్థమౌతుంది. ఆ ప్రేమ మనల్ని బలపరుస్తుంది. “శ్రమలైనా, కష్టాలైనా” ‘క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరుచేయలేవని’ బైబిలు చెప్తుంది.—రోమా. 8:35, 38, 39.

9 కొన్నిసార్లు మనకున్న సమస్యల వల్ల శారీరకంగా, మానసికంగా కృంగిపోతాం లేదా యెహోవా సేవలో ఆనందాన్ని కోల్పోతాం. కానీ క్రీస్తు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో గుర్తుచేసుకున్నప్పుడు, కష్టాల్ని సహించడానికి కావాల్సిన బలాన్ని పొందుతాం. (2 కొరింథీయులు 5:14, 15 చదవండి.) క్రీస్తు ప్రేమ మనలో బ్రతకాలనే కోరికను, యెహోవా సేవలో కొనసాగాలనే కోరికను కలిగిస్తుంది. ప్రకృతి విపత్తులు, హింసలు, నిరుత్సాహం, లేదా ఆందోళన వంటివాటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి కూడా క్రీస్తు ప్రేమ మనకు సహాయం చేస్తుంది.

మన సహోదరులకు ప్రేమ అవసరం

యేసు గురించి అధ్యయనం చేసినప్పుడు ఇతరుల్ని ప్రోత్సహించాలనే కోరిక మీకు కలుగుతుంది (10, 11 పేరాలు చూడండి)

10, 11. నిరుత్సాహంలో ఉన్న సహోదరసహోదరీల్ని బలపర్చే బాధ్యత ఎవరిది? దాన్నెలా చేయవచ్చు?

10 యెహోవా ప్రేమతో మనల్ని బలపర్చడానికి సంఘాన్ని కూడా ఉపయోగించుకుంటాడు. తోటి సహోదరసహోదరీల్ని ప్రేమించినప్పుడు, మనం యెహోవాను ప్రేమిస్తున్నామని చూపిస్తాం. వాళ్లు యెహోవా దృష్టిలో విలువైనవాళ్లని, ఆయన వాళ్లను ప్రేమిస్తున్నాడని అర్థంచేసుకునేలా మనం సహాయం చేయాలి. (1 యోహా. 4:19-21) అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు, “మీరు ఇప్పుడు చేస్తున్నట్టే, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు బలపర్చుకుంటూ ఉండండి.” (1 థెస్స. 5:11) కేవలం సంఘపెద్దలే కాదు, మనలో ప్రతీఒక్కరం తోటి సహోదరసహోదరీల్ని బలపర్చవచ్చు. అలాచేస్తే మనం యెహోవాను, యేసును అనుకరించిన వాళ్లమౌతాం.—రోమీయులు 15:1, 2 చదవండి.

11 తీవ్రమైన కృంగుదలతో లేదా ఆందోళనతో బాధపడే కొంతమంది సహోదరసహోదరీలు డాక్టరును సంప్రదించి, మందులు వాడాల్సి రావచ్చు. (లూకా 5:31) పెద్దలు, సంఘంలోని ఇతరులు డాక్టర్లు కాకపోయినా వాళ్లు ఇచ్చే సహాయం, ఊరట చాలా ప్రాముఖ్యమైనవి. “కృంగినవాళ్లతో ప్రోత్సాహకరంగా మాట్లాడమని, బలహీనులకు మద్దతివ్వమని, అందరితో ఓర్పుగా వ్యవహరించమని” సంఘంలోని ప్రతీఒక్కర్నీ బైబిలు ప్రోత్సహిస్తుంది. (1 థెస్స. 5:14) మన సహోదరుల భావాల్ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నించాలి, వాళ్లతో ఓర్పుగా వ్యవహరించాలి, నిరుత్సాహంలో ఉన్నప్పుడు బలపర్చేలా మాట్లాడాలి. మీరలా చేస్తున్నారా? ఇతరులకు ఇంకా ఎక్కువగా ఊరటను, ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి మీరు ఏం చేయవచ్చు?

12. సంఘం నుండి ప్రోత్సాహం పొందిన ఒక సహోదరి అనుభవం చెప్పండి.

12 యూరప్‌లో ఉంటున్న ఒక సహోదరి ఇలా చెప్తుంది, “కొన్నిసార్లు నాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తుంటాయి, కానీ ఆ ఆలోచనల నుండి బయటపడడానికి మా సంఘం చక్కగా సహాయం చేసింది. సహోదరసహోదరీలు నన్ను ప్రోత్సహిస్తూ, ప్రేమ చూపిస్తారు. నేను కృంగుదలతో బాధపడుతున్నానని కొంతమందికే తెలిసినా, మా సంఘంలోనివాళ్లు నాకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. ఒక జంట నాకు ఆధ్యాత్మిక తల్లిదండ్రులు అయ్యారు. వాళ్లు నన్ను బాగా చూసుకుంటారు, నాకు 24 గంటలూ అందుబాటులో ఉంటారు.” నిజమే, అందరూ ఆ జంటలా సహాయం చేయలేకపోవచ్చు. కానీ మనలో ప్రతీఒక్కరం తోటి సహోదరసహోదరీలకు మద్దతివ్వడానికి కృషిచేయవచ్చు. *

ప్రేమతో ఇతరుల్ని ఎలా బలపర్చవచ్చు?

13. ఇతరుల్ని బలపర్చాలంటే మనమేమి చేయాలి?

13 ఓపిగ్గా వినండి. (యాకో. 1:19) నిరుత్సాహంలో ఉన్న సహోదరుడు చెప్పేది సహానుభూతితో వినడం ద్వారా మనకు ప్రేమ ఉందని చూపిస్తాం. అతని భావాల్ని అర్థంచేసుకోవడానికి దయగా కొన్ని ప్రశ్నలు అడగండి. మీ ముఖకవళికల్ని బట్టి కూడా మీకు నిజమైన శ్రద్ధ ఉందని అతను గుర్తిస్తాడు. అతను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డు చెప్పకుండా ఓపిగ్గా వినండి. మీరు అలా వింటే, అతన్ని అర్థంచేసుకుంటారు, అతని నమ్మకాన్ని చూరగొంటారు. అప్పుడు మీరు చెప్పేది వినడం, మీ సహాయాన్ని తీసుకోవడం అతనికి తేలికౌతుంది. మీరు ఇతరులమీద నిజమైన శ్రద్ధ చూపిస్తే, వాళ్లు ఎంతో ఊరట పొందుతారు.

14. మనం ఇతరుల్ని ఎందుకు విమర్శించకూడదు?

14 విమర్శించకండి. కృంగిపోయిన వ్యక్తిని మనం విమర్శిస్తున్నట్టు అతనికి అనిపిస్తే ఇంకా కృంగిపోతాడు. అప్పుడు మనం సహాయం చేయడం మరింత కష్టమౌతుంది. “కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము” అని బైబిలు చెప్తుంది. (సామె. 12:18) కృంగిపోయిన వ్యక్తిని మన మాటలతో కావాలని గాయపర్చకపోవచ్చు, కానీ అనాలోచితంగా మాట్లాడితే అతని బాధ ఇంకా ఎక్కువౌతుంది. అతన్ని బలపర్చాలంటే, మనం అతని పరిస్థితిని అర్థంచేసుకోవడానికి నిజంగా ప్రయత్నిస్తున్నామని అతనికి నమ్మకం కుదరాలి.—మత్త. 7:12.

15. ఇతరులకు ఊరటను ఇవ్వడానికి ఎలాంటి ఉపకరణాలు ఉన్నాయి?

15 బైబిలు సహాయంతో ఇతరులకు ఊరటను ఇవ్వండి. (రోమీయులు 15:4, 5 చదవండి.) “సహనాన్ని, ఊరటను ఇచ్చే దేవుడు” మనకు బైబిల్ని ఇచ్చాడు. కాబట్టి అందులోని మాటల్ని చదివితే ఖచ్చితంగా ఊరటను పొందుతాం. అంతేకాదు వాచ్‌ టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌ (ఇంగ్లీషు), యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకం వంటి ఉపకరణాలు మనకు అందుబాటులో ఉన్నాయి. మన సహోదరసహోదరీలకు ఊరటను, ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ఉపయోగపడే లేఖనాలు, ప్రచురణలు వాటిలో దొరుకుతాయి.

16. కృంగిపోయినవాళ్లను ప్రోత్సహించడానికి ఏ లక్షణాలు సహాయం చేస్తాయి?

16 ఆప్యాయంగా, మృదువుగా వ్యవహరించండి. యెహోవా “ఎంతో కరుణగల తండ్రి, ఎలాంటి పరిస్థితిలోనైనా ఓదార్పును ఇచ్చే దేవుడు.” అంతేకాదు, తన సేవకులపట్ల “గొప్ప కనికరం” చూపిస్తాడు. (2 కొరింథీయులు 1:3-6 చదవండి; లూకా 1:78; రోమా. 15:13) ఈ విషయంలో పౌలు యెహోవాను అనుకరిస్తూ మనకు చక్కని ఆదర్శం ఉంచాడు. ఆయనిలా రాశాడు, “పాలిచ్చే తల్లి తన పిల్లల్ని అపురూపంగా చూసుకున్నట్టు, మేము మీతో మృదువుగా వ్యవహరించాం. మీ మీద ఎంతో ఆప్యాయతతో, మీకు దేవుని గురించిన మంచివార్తను చెప్పాలని మాత్రమే కాదు, మీకోసం మా ప్రాణాల్ని కూడా ఇవ్వాలని నిశ్చయించుకున్నాం, మీరంటే మాకు చాలా ఇష్టం.” (1 థెస్స. 2:7, 8) యెహోవాలా మనం ఇతరులతో ఆప్యాయంగా వ్యవహరించినప్పుడు, మన సహోదరులు ఏ ఊరట కోసమైతే ప్రార్థిస్తున్నారో ఆ ఊరటను వాళ్లకు ఇవ్వగలుగుతాం!

17. మన సహోదరుల్ని ప్రోత్సహించాలంటే ఏం చేయాలి?

17 సహోదరుల నుండి పరిపూర్ణతను ఆశించకండి. సహోదరులు పరిపూర్ణులుగా ఉండాలని ఆశిస్తే, మీరు నిరాశ చెందుతారు. కాబట్టి సహేతుకంగా ఉండండి. (ప్రసం. 7:21, 22) మనం చేయలేనివాటిని చేయాలని యెహోవా ఆశించడు. కాబట్టి మనం ఒకరిపట్ల ఒకరం ఓర్పు చూపించుకోవాలి. (ఎఫె. 4:2, 32) మన సహోదరులు, యెహోవా సేవలో ఎక్కువ చేయలేకపోతున్నారని భావించేలా మనం ఎన్నడూ మాట్లాడం లేదా వాళ్లను ఇతరులతో పోల్చం. బదులుగా వాళ్లను ప్రోత్సహిస్తాం, వాళ్లు చేసే మంచి పనుల్ని మెచ్చుకుంటాం. దానివల్ల వాళ్లు యెహోవా సేవలో సంతోషంగా కొనసాగగలుగుతారు.—గల. 6:4.

18. ఒకరినొకరం ప్రేమతో ఎందుకు బలపర్చుకుంటూ ఉండాలి?

18 సంఘంలో ఉన్న ప్రతీఒక్కర్నీ యెహోవా, యేసు చాలా విలువైనవాళ్లుగా చూస్తారు. (గల. 2:20) మనం సహోదరసహోదరీల్ని ఎంతో ప్రేమిస్తాం కాబట్టి వాళ్లతో ఆప్యాయంగా వ్యవహరించాలి. మనం “ఇతరులతో శాంతిగా ఉండడానికి, ఒకరినొకరు బలపర్చుకోవడానికి” చేయగలిగినదంతా చేస్తాం. (రోమా. 14:19) నిరుత్సాహపడడానికి ఏ కారణం ఉండని పరదైసు కోసం మనందరం ఎంతగానో ఎదురుచూస్తాం! అక్కడ అనారోగ్య సమస్యలు, యుద్ధాలు, పాపంవల్ల వచ్చిన మరణం, హింస, కుటుంబ సమస్యలు, నిరాశానిస్పృహలు ఉండవు. వెయ్యేళ్ల పరిపాలన చివర్లో, మనుషులందరూ పరిపూర్ణులు అవుతారు. చివరి పరీక్షలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్లను తన భూసంబంధ కుమారులుగా యెహోవా దత్తత తీసుకుంటాడు, “దేవుని పిల్లలు ఆస్వాదించే మహిమగల స్వాతంత్ర్యాన్ని” వాళ్లు ఆనందిస్తారు. (రోమా. 8:21) కాబట్టి, దేవుడు తీసుకొచ్చే అద్భుతమైన కొత్త లోకంలోకి ప్రవేశించేలా ఒకరినొకరం ప్రేమతో బలపర్చుకుంటూ, సహాయం చేసుకుంటూ ఉందాం.

^ పేరా 12 ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన నుండి బయటపడడానికి, 1994, ఏప్రిల్‌ 8 తేజరిల్లు! సంచికలో ఉన్న “ఆత్మహత్యే పరిష్కారమా?” అనే ఆర్టికల్‌ సహాయం చేస్తుంది.