కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“వీటిని చేస్తే మీరు సంతోషంగా ఉంటారు”

“వీటిని చేస్తే మీరు సంతోషంగా ఉంటారు”

“నన్ను పంపించిన వ్యక్తి ఇష్టాన్ని చేయడం, ఆయనిచ్చిన పనిని పూర్తిచేయడమే నా ఆహారం.”యోహా. 4:34.

పాటలు: 80, 35

1. మనం లోకంలోని ప్రజల్లా స్వార్థంగా ఆలోచిస్తే ఏం జరగవచ్చు?

బైబిల్లో నేర్చుకున్నవాటిని పాటించడం ఎందుకు కష్టంగా ఉంటుంది? ఒక కారణమేమిటంటే, సరైనది చేయడానికి మనకు వినయం అవసరం. కానీ ‘ఈ చివరి రోజుల్లో స్వార్థపరులు, డబ్బును ప్రేమించేవాళ్లు, గొప్పలు చెప్పుకునేవాళ్లు, గర్విష్ఠులు, ఆత్మనిగ్రహం లేనివాళ్లు’ మన చుట్టూ ఉన్నారు, కాబట్టి వినయంగా ఉండడం కష్టమైపోతోంది. (2 తిమో. 3:1-3) దేవుని సేవకులమైన మనకు అలాంటి ప్రవర్తన తప్పని తెలుసు. అయినా వాళ్లే సంతోషంగా ఉంటున్నట్లు, విజయం సాధిస్తున్నట్లు మనకు అనిపించవచ్చు. (కీర్త. 37:1; 73:3) ‘నిస్వార్థంగా ఉండడంవల్ల అసలు ఏమైనా ప్రయోజనం ఉందా? వినయంగా ఉంటే ప్రజలు నన్ను గౌరవిస్తారా?’ అని కూడా మనకు అనిపించవచ్చు. (లూకా 9:48) మనం లోకంలోని ప్రజల్లా స్వార్థంగా ఆలోచిస్తే, తోటి సహోదరులతో ఉన్న మంచి సంబంధం పాడవ్వవచ్చు, మనం క్రైస్తవులమని ఇతరులు గుర్తించడం కష్టంగా మారవచ్చు. బదులుగా, మనం వినయస్థులైన దేవుని సేవకుల గురించి అధ్యయనం చేసి వాళ్లను అనుకరిస్తే, మంచి ఫలితాలు వస్తాయి.

2. ప్రాచీనకాలంలోని నమ్మకమైన దేవుని సేవకుల నుండి ఏం నేర్చుకోవచ్చు?

2 ప్రాచీనకాలంలోని నమ్మకమైన సేవకులు ఎలా దేవునికి స్నేహితులుగా ఉండగలిగారు? వాళ్లు ఎలా దేవున్ని సంతోషపెట్టారు? సరైనది చేయడానికి కావాల్సిన బలం వాళ్లకు ఎక్కడినుండి వచ్చింది? వాళ్ల గురించి బైబిల్లో చదివి, లోతుగా ఆలోచించినప్పుడు, మన విశ్వాసం బలపడుతుంది.

విశ్వాసాన్ని బలంగా ఉంచుకోండి

3, 4. (ఎ) యెహోవా మనకు ఏయే విధాలుగా ఉపదేశాన్ని ఇస్తున్నాడు? (బి) విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవాలంటే జ్ఞానం సంపాదించడంతో పాటు ఇంకా ఏం చేయాలి?

3 మన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి కావాల్సిన ప్రతీది యెహోవా ఇస్తున్నాడు. బైబిలు, ప్రచురణలు, jw.org వెబ్‌సైట్‌, JW బ్రాడ్‌కాస్టింగ్‌, మీటింగ్స్‌, సమావేశాలు వంటివాటి ద్వారా మనం చక్కని ఉపదేశాన్ని, శిక్షణను పొందుతున్నాం. అయితే, ఆ జ్ఞానం సంపాదించడంతో పాటు మనం చేయాల్సింది ఇంకొకటి ఉందని యేసు చెప్పాడు. ఆయనిలా అన్నాడు, “నన్ను పంపించిన వ్యక్తి ఇష్టాన్ని చేయడం, ఆయనిచ్చిన పనిని పూర్తిచేయడమే నా ఆహారం.”—యోహా. 4:34.

4 దేవుని ఇష్టాన్ని చేయడం తనకు ఆహారం లాంటిదని యేసు చెప్పాడు. పౌష్టిక ఆహారం తిన్నప్పుడు, మనసుకు ఉల్లాసంగా ఉంటుంది, శరీరానికి మంచి పోషణ లభిస్తుంది. అదేవిధంగా, దేవుని ఇష్టాన్ని చేసినప్పుడు మనసుకు ఉల్లాసంగా ఉంటుంది, మన విశ్వాసానికి మంచి పోషణ లభిస్తుంది. ఉదాహరణకు, మీరు ఎప్పుడైనా బాగా అలసటతో ప్రీచింగ్‌కి వెళ్లి సంతోషంగా, సేదదీర్పుగా తిరిగొచ్చారా?

5. తెలివిగలవాళ్లకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

5 మనం యెహోవా చెప్పింది చేస్తే, తెలివి గలవాళ్లమని చూపిస్తాం. (కీర్త. 107:43) తెలివి గలవాళ్లకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. తెలివి గురించి బైబిలు ఇలా చెప్తుంది, “ఇష్టవస్తువులన్నియు దానితో సమానములు కావు. . . . దాని నవలంబించువారికి అది జీవవృక్షము దాని పట్టుకొనువారందరు ధన్యులు.” (సామె. 3:13-18) యేసు ఇలా అన్నాడు, “మీకు ఈ విషయాలు తెలుసు కాబట్టి, వీటిని చేస్తే మీరు సంతోషంగా ఉంటారు.” (యోహా. 13:17) అవును, యేసు చెప్పింది చేసినంత కాలం శిష్యులు సంతోషంగా ఉన్నారు. నిజానికి వాళ్లు ఆయన బోధల్ని, ఆదర్శాన్ని జీవితాంతం పాటించారు.

6. మనం నేర్చుకున్నవాటిని ఎందుకు పాటిస్తూ ఉండాలి?

6 నేడు, మనం కూడా నేర్చుకున్నవాటిని పాటిస్తూ ఉండాలి. ఉదాహరణకు, ఒక మెకానిక్‌ గురించి ఆలోచించండి. అతని దగ్గర పనిముట్లు, సామాగ్రి, జ్ఞానం ఉన్నాయి. అయితే వాటన్నిటిని ఉపయోగించినప్పుడు మాత్రమే అతను మంచి మెకానిక్‌ అవ్వగలడు. ఆ పనిలో అతనికి ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నప్పటికీ, నేర్చుకున్నవి పాటిస్తూ ఉంటేనే అతను మంచి మెకానిక్‌గా ఉండగలడు. అదేవిధంగా, సత్యం తెలుసుకున్న కొత్తలో మనం బైబిల్లో చదివినవాటిని పాటించడం వల్ల సంతోషంగా ఉండగలిగాం. అయితే ఆ సంతోషం చిరకాలం ఉండాలంటే, యెహోవా నేర్పించేవాటిని ప్రతీరోజు పాటిస్తూ ఉండాలి.

7. ప్రాచీనకాల నమ్మకమైన సేవకుల నుండి నేర్చుకోవాలంటే మనమేమి చేయాలి?

7 వినయంగా ఉండడం కష్టమనిపించే కొన్ని పరిస్థితుల గురించి ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. ప్రాచీనకాల నమ్మకమైన సేవకులు ఎలా వినయంగా ఉండగలిగారో తెలుసుకుంటాం. అయితే మనం కేవలం సమాచారాన్ని చదవడమే కాదు, దానిగురించి ఆలోచించాలి, దాన్ని పాటించాలి.

ఇతరుల్ని చిన్నచూపు చూడకండి

8, 9. అపొస్తలుల కార్యాలు 14:8-15⁠లో పౌలు చూపించిన వినయం నుండి ఏం నేర్చుకోవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

8 “అన్నిరకాల ప్రజలు సత్యం గురించిన సరైన జ్ఞానాన్ని సంపాదించుకొని రక్షించబడాలని” యెహోవా కోరుకుంటున్నాడు. (1 తిమో. 2:4) మరి, సత్యం తెలియనివాళ్లను మీరెలా చూస్తున్నారు? అపొస్తలుడైన పౌలు, యెహోవా గురించి ఎంతోకొంత తెలిసిన యూదులకు, అలాగే అబద్ధ దేవుళ్లను ఆరాధించే అన్యులకు ప్రకటించాడు. అన్యులకు ప్రకటించడానికి పౌలుకు వినయం అవసరమైంది. ఎందుకు?

9 పౌలు తన మొదటి మిషనరీ యాత్రలో భాగంగా, బర్నబాతో కలిసి లుస్త్ర అనే పట్టణానికి వెళ్లాడు. అక్కడ నివసిస్తున్న లుకయొనియ ప్రజలు పౌలును, బర్నబాను దేవుళ్లలా చూశారు. అంతేకాదు బర్నబాను ద్యుపతి అని, పౌలును హెర్మే అని తమ అబద్ధ దేవుళ్ల పేర్లతో పిలిచారు. దాన్నిబట్టి తామే గొప్పవాళ్లమని పౌలు, బర్నబాలు అనుకున్నారా? అంతకుముందు వెళ్లిన రెండు పట్టణాల్లో ఎదురైన వ్యతిరేకతతో పోలిస్తే ఇక్కడ ప్రశాంతంగా ఉందని అనుకున్నారా? ప్రజలు తమను అతిగా గౌరవిస్తున్నారు కాబట్టి మంచివార్త ప్రకటించడం తేలికౌతుందని అనుకున్నారా? లేదు! వాళ్లు బట్టలు చింపుకుని, “మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మనుషులమే, మీకున్నలాంటి బలహీనతలే మాకూ ఉన్నాయి” అని అరిచారు.—అపొ. 14:8-15.

10. లుకయొనియ ప్రజలకన్నా తామే గొప్పవాళ్లమని పౌలు, బర్నబాలు ఎందుకు అనుకోలేదు?

10 “మేము కూడా మనుషులమే” అని పౌలు, బర్నబాలు చెప్పినప్పుడు తామూ అపరిపూర్ణులమేనని వాళ్ల ఉద్దేశం. అంతేగానీ లుకయొనియ ప్రజలు చేసే ఆరాధన, తాము చేసే ఆరాధన ఒక్కటే అని కాదు. నిజానికి పౌలు, బర్నబాలు యెహోవా నియమించిన మిషనరీలు. (అపొ. 13:2) వాళ్లు పవిత్రశక్తితో అభిషేకించబడ్డారు, ఒక అద్భుతమైన నిరీక్షణ పొందారు. అంతమాత్రాన ఆ ప్రజలకన్నా తామే గొప్పవాళ్లమని వాళ్లు అనుకోలేదు. మంచివార్తను అంగీకరిస్తే లుకయొనియ ప్రజలు కూడా పరలోక నిరీక్షణను పొందవచ్చని పౌలు, బర్నబాలు గుర్తించారు.

11. ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు పౌలులాగే మనమెలా వినయంగా ఉండవచ్చు?

11 వినయంగా ఉన్నామని చూపించే ఒక మార్గమేమిటి? పౌలులాగే మనం కూడా ప్రకటించే నియామకాన్ని బట్టి, లేదా యెహోవా సహాయంతో సాధించిన ఫలితాల్ని బట్టి గొప్పవాళ్లమని భావించకపోవడం. మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘క్షేత్రంలో ఉన్న ప్రజల్ని నేనెలా చూస్తున్నాను? కొన్ని రకాల ప్రజల్ని చిన్నచూపు చూస్తున్నానా?’ ప్రపంచవ్యాప్తంగా, యెహోవాసాక్షులందరూ మంచివార్త వినే ప్రజల కోసం వెదుకుతారు. కొంతమందైతే, ఇతరులు చిన్నచూపు చూసే ప్రజల భాషను, సంప్రదాయాల్ని నేర్చుకోవడానికి కూడా కృషిచేస్తున్నారు. అయితే ఆ ప్రజల కన్నా తామే గొప్పవాళ్లమని వాళ్లు ఎప్పుడూ అనుకోరు. బదులుగా, వీలైనంత ఎక్కువమంది రాజ్య సందేశాన్ని అంగీకరించేలా సహాయం చేస్తూ, వాళ్లను అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

ఇతరుల గురించి పేరుపేరున ప్రార్థించండి

12. ఎపఫ్రా ఇతరులపట్ల ఎలా నిజమైన శ్రద్ధ చూపించాడు?

12 వినయంగా ఉన్నామని చూపించే మరో మార్గమేమిటంటే, మనలాగే “అమూల్యమైన విశ్వాసాన్ని” పొందిన తోటి సహోదరసహోదరీల కోసం ప్రార్థించడం. (2 పేతు. 1:1) ఎపఫ్రా అదే చేశాడు. ఆయన గురించి బైబిల్లో కేవలం మూడుసార్లే ప్రస్తావించబడింది. పౌలు రోములో గృహనిర్బంధంలో ఉన్నప్పుడు, కొలొస్సయిలోని క్రైస్తవులకు ఉత్తరం రాస్తూ ఎపఫ్రా గురించి ఇలా అన్నాడు, “మీ కోసం అతను ఎప్పుడూ పట్టుదలతో ప్రార్థిస్తున్నాడు.” (కొలొ. 4:12) ఎపఫ్రాకు సహోదరుల గురించి బాగా తెలుసు, ఆయన వాళ్లపట్ల ఎంతో శ్రద్ధ చూపించాడు. పౌలు ఆయన్ని “తోటి ఖైదీ” అని పిలిచాడంటే, ఎపఫ్రాకు కూడా కష్టాలు ఉన్నాయని అర్థమౌతుంది. (ఫిలే. 23) అయినప్పటికీ ఆయన ఇతరుల అవసరాల్ని పట్టించుకున్నాడు, వాళ్లకు తన వంతు సహాయం చేశాడు. ఆయన సహోదరసహోదరీల గురించి పేరుపేరున ప్రార్థించాడు. మనం కూడా అలానే చేయవచ్చు. అలాంటి ప్రార్థనలు చాలా శక్తివంతమైనవి.—2 కొరిం. 1:11; యాకో. 5:16.

13. మీరు ఎపఫ్రాను అనుకరిస్తూ ఎలా ప్రార్థించవచ్చు?

13 మీరు ఎవరి గురించి పేరుపేరున ప్రార్థించవచ్చో ఆలోచించండి. మీ సంఘంలో కష్టాలు ఎదుర్కొంటున్న స్నేహితుల గురించి, లేదా కుటుంబాల గురించి మీరు ప్రార్థించవచ్చు. వాళ్లు పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకుంటుండవచ్చు లేదా శోధనలు ఎదుర్కొంటుండవచ్చు. అంతేకాదు మన వెబ్‌సైట్‌లో ఉన్న సహోదరుల పేర్లను ప్రస్తావిస్తూ మీరు ప్రార్థించవచ్చు. * దాంతోపాటు, ప్రియమైనవాళ్లను మరణంలో కోల్పోయిన వాళ్లకోసం, ఈ మధ్యకాలంలో జరిగిన విపత్తులు లేదా యుద్ధాల నుండి బయటపడిన వాళ్లకోసం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లకోసం మీరు ప్రార్థించవచ్చు. మన ప్రార్థనలు ఎంతోమంది సహోదరసహోదరీలకు సహాయం చేస్తాయి! వాళ్లకోసం ప్రార్థిస్తే, కేవలం మన గురించే కాకుండా ఇతరుల గురించి కూడా ఆలోచించిన వాళ్లమౌతాం. (ఫిలి. 2:4) యెహోవా అలాంటి ప్రార్థనల్ని తప్పకుండా వింటాడు.

‘వినడానికి సిద్ధంగా ఉండండి’

14. శ్రద్ధగా వినే విషయంలో యెహోవాయే అత్యుత్తమ ఆదర్శమని ఎందుకు చెప్పవచ్చు?

14 వినయంగా ఉన్నామని చూపించే ఇంకో మార్గమేమిటంటే, ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినడం. ‘వినడానికి సిద్ధంగా ఉండమని’ యాకోబు 1:19 చెప్తుంది. ఈ విషయంలో యెహోవాయే అత్యుత్తమ ఆదర్శం. (ఆది. 18:32; యెహో. 10:14) ఉదాహరణకు, నిర్గమకాండము 32:11-14⁠లో ఉన్న సంభాషణను పరిశీలించండి. (చదవండి.) మోషే తన అభిప్రాయాన్ని చెప్తున్నప్పుడు, వినాల్సిన అవసరం లేకపోయినా యెహోవా శ్రద్ధగా విన్నాడు. గతంలో పొరపాటు చేసిన ఒకవ్యక్తి ఏదైనా చెప్తే మీరు ఓపిగ్గా వింటారా? అతని సలహాను పాటిస్తారా? కానీ యెహోవా మాత్రం, విశ్వాసంతో చేసేవాళ్ల ప్రార్థనలన్నిటినీ ఓపిగ్గా వింటున్నాడు.

15. యెహోవాను అనుకరిస్తూ మనం ఇతరుల్ని ఎలా గౌరవించవచ్చు?

15 మిమ్మల్ని ఇలా ప్రశ్నించుకోండి: ‘అబ్రాహాము, రాహేలు, మోషే, యెహోషువ, మానోహ, ఏలీయా, హిజ్కియా చేసిన ప్రార్థనల్ని విన్నట్లే, యెహోవా మన ప్రార్థనల్ని కూడా వినయంగా వింటున్నాడు. మరి అలాంటి వినయాన్ని నేనెలా చూపించవచ్చు? తోటి సహోదరులు చెప్పేవాటిని వినడం ద్వారా, వీలైనప్పుడు వాటిని పాటించడం ద్వారా వాళ్లందర్నీ మరింత గౌరవించగలనా? సంఘంలో లేదా కుటుంబంలో నేను ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన వాళ్లు ఎవరైనా ఉన్నారా? వాళ్లకోసం నేను ఇంకా ఏం చేయవచ్చు?’—ఆది. 30:6; న్యాయా. 13:9; 1 రాజు. 17:22; 2 దిన. 30:20.

“యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో”

షిమీని వదిలేయమని దావీదు చెప్పాడు, మీరైతే ఏం చేసి ఉండేవాళ్లు? (16, 17 పేరాలు చూడండి)

16. షిమీ అవమానించినప్పుడు దావీదు రాజు ఎలా స్పందించాడు?

16 వినయం ఉంటే ఇతరులు మనల్ని అవమానించినప్పుడు ఆత్మనిగ్రహం చూపిస్తాం. (ఎఫె. 4:2) దానికి చక్కని ఉదాహరణ 2 సమూయేలు 16:5-13⁠లో చూస్తాం. (చదవండి.) షిమీ అనే వ్యక్తి రాజైన సౌలుకు బంధువు. అతను దావీదును, ఆయన సేవకుల్ని అవమానించి, వాళ్లమీద దాడిచేశాడు. దావీదు కావాలనుకుంటే అతనికి బుద్ధిచెప్పి ఉండేవాడే, కానీ ఆ అవమానాన్ని ఓపిగ్గా భరించాడు. మరి అలాంటి ఆత్మనిగ్రహం చూపించడానికి దావీదుకు ఏది సహాయం చేసింది? 3వ కీర్తన చదివితే ఆ విషయం తెలుసుకోవచ్చు.

17. ఆత్మనిగ్రహం చూపించడానికి దావీదుకు ఏది సహాయం చేసింది? ఆయన్ని మనమెలా అనుకరించవచ్చు?

17 దావీదు తన కొడుకైన అబ్షాలోము నుండి పారిపోతున్న సందర్భంలో 3వ కీర్తన రాశాడు. ఆ సమయంలోనే షిమీ దావీదుపై దాడిచేశాడు. అయినా దావీదు ఎంతో ఆత్మనిగ్రహం చూపించాడు. అలా ఉండడానికి ఆయనకు ఏది సహాయం చేసింది? కీర్తన 3:4⁠లో దావీదు ఇలా రాశాడు, “ఎలుగెత్తి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతమునుండి నాకుత్తరమిచ్చును.” ఎవరైనా మనల్ని అవమానిస్తే దావీదులాగే మనం కూడా ప్రార్థించాలి. అప్పుడు సహించడానికి కావాల్సిన బలాన్ని యెహోవా తన పవిత్రశక్తి ద్వారా ఇస్తాడు. ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే, మీరు మరింత ఆత్మనిగ్రహాన్ని లేదా క్షమాగుణాన్ని చూపించగలరా? యెహోవా మీ బాధను చూస్తాడని, సహాయం చేస్తాడని, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని నమ్ముతారా?

‘తెలివి అన్నిటికన్నా ముఖ్యమైనది’

18. యెహోవా ఉపదేశాన్ని పాటించడం ద్వారా మనమెలాంటి ప్రయోజనం పొందుతాం?

18 మనం సరైనది చేసినప్పుడు తెలివిగలవాళ్లమని చూపిస్తాం, యెహోవా కూడా ఆశీర్వదిస్తాడు. ‘తెలివి అన్నిటికన్నా ముఖ్యమైనది’ అని బైబిలు చెప్తుంది. (సామె. 4:7, NW) తెలివి జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. కానీ తెలివి అంటే వాస్తవాలను అర్థంచేసుకోవడం మాత్రమే కాదు, తగిన చర్యలు కూడా తీసుకోవాలి. ఉదాహరణకు, చలికాలం కోసం ముందే ఆహారాన్ని నిల్వ చేసుకోవడం ద్వారా చీమలు కూడా తెలివిని చూపిస్తున్నాయి. (సామె. 30:24, 25) “దేవుని తెలివి” అని పిలవబడిన క్రీస్తు, ఎప్పుడూ తన తండ్రికి ఇష్టమైన పనులే చేశాడు. (1 కొరిం. 1:24; యోహా. 8:29) మనం కూడా సరైనది చేయడం ద్వారా తెలివిని చూపించినప్పుడు, వినయంగా ఉన్నప్పుడు యెహోవా ప్రతిఫలం ఇస్తాడు. (మత్తయి 7:21-23 చదవండి.) కాబట్టి సంఘం నిజమైన వినయానికి నిలయంగా ఉండేలా కృషిచేస్తూ ఉందాం. సరైనది చేయడానికి కొంత సమయం పడుతుంది. అంతేకాదు దానికి ఓపిక, వినయం కూడా అవసరం. వినయంగా ఉంటే ఇప్పుడూ, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం.

[అధస్సూచి]

^ పేరా 13 jw.orgలో న్యూస్‌రూమ్‌ > లీగల్‌ డెవలప్‌మెంట్స్‌ కింద “తమ విశ్వాసం కారణంగా జైలు పాలైన యెహోవాసాక్షులు—ప్రాంతాన్నిబట్టి” అనే ఆర్టికల్‌ చూడండి. (ప్రస్తుతం తెలుగులో లేదు.)